ఉదయం తొమ్మిది గంటలు, హిందూ పేపర్ తిరగేస్తున్నాను. పఠాన్ కోట్ సంఘటనపై పాకిస్తాన్‌కి మరింత సాక్ష్యం కావాల్ట!
"మిత్రమా! కాఫీ, అర్జంట్!" అంటూ హడావుడిగా వచ్చాడు సుబ్బు.
"కూర్చో సుబ్బూ! ఈ పాకిస్తాన్ వెధవకి బుద్ధి లేదు, వొళ్ళు మండిపోతుంది!" అన్నాను.
"మనకి పాకిస్తాన్ వార్తలెప్పుడూ అంతేలే!" అంటూ నవ్వాడు సుబ్బు.
"అంటే పాకిస్తాన్ దేశం వొక శాంతికపోతం అంటావా?" చిరాగ్గా అన్నాను.
"అని నేనన్నానా? మనం పాకిస్తాన్ గూర్చి ఎలా అనుకుంటామో, పాకిస్తాన్ ప్రజలు కూడా ఇండియాని అలాగే అనుకుంటారు. ఇలా ఇరువైపులా దుష్ప్రచారం జరగడం రాజ్యానికి చాలా అవసరం." అన్నాడు సుబ్బు.
"కొంచెం వివరంగా చెప్పు." అన్నాను.
"రాజ్యానికి అభివృద్ధి అనేది లక్ష్యంగా వుండాలి. ఇక్కడ అభివృద్ధి అంటే బులెట్ ట్రైన్లు, బిల్డింగులు కాదు. పేదరికాన్ని తగ్గించడం. విద్యా, ఆరోగ్య సౌకర్యాలని పెంచడం. సామాన్య ప్రజల్ని ఆర్ధికంగా పరిపుష్టం చేస్తూ, బలహీన వర్గాల కోసం సంక్షేమ పథకాల్ని సమర్ధవంతంగా అమలు చేస్తూ.. " చెప్పసాగాడు సుబ్బు.
"సుబ్బూ! నువ్వు మరీ అరటిపండు వొలవనక్కర్లేదు." నవ్వుతూ కట్ చేశాను.
"ఈ రకమైన ప్రజాభివృద్ధి ఎజెండా రాజ్యానికి వున్నట్లైతే అభ్యుదయ శాస్త్రీయ సిద్ధాంతం సరిపోతుంది. కానీ దోపిడీ వ్యవస్థల రాజ్యానికి 'అందర్ కీ బాత్' వేరే వుంటుంది. అది - పెట్టుబడిదారులకి కొమ్ము కాయడం, సామాన్యులని దోచుకోవడం! అందుకే - నువ్వు వినేది నిజం కాదు, నువ్వు చూసేదీ నిజం కాదు!" అన్నాడు సుబ్బు.
"సుబ్బూ! కొంచెం అర్ధం అయ్యేట్లు చెప్పు." మొహం చిట్లించాను.
ఇంతలో పొగలు గక్కుతూ ఫిల్టర్ కాఫీ వచ్చింది.
"సరే! నీకు అర్ధం కావడం కోసం ఒక ఉదాహరణ చెబుతాను. స్వతంత్రం వచ్చిన కొన్నాళ్ళకే పాకిస్తాన్‌లో రాజ్యం సమాజ అభివృద్ధి, ప్రజా సంక్షేమం వంటి ప్రజోపకరమైన కార్యక్రమాల్ని వదిలేసి, పెట్టుబడిదారు అనుకూల దోపిడీ ఎజెండా ఎంచుకుంది. సామాన్య ప్రజలు ఈ దోపిడీ సహించరు. అంచేత రాజ్యానికి మార్మికత అవసరం. ప్రజల దృష్టి మళ్ళించడానికి అక్కడ రాజ్యం ఎంచుకున్న మార్మికత - భారత్ వ్యతిరేకత. ఇందుకోసం 'కాశ్మీర్' వుండనే వుంది. అంచేత రాజ్యం ప్రజల మొహాన 'ఇండియా వ్యతిరేకత' అనే దేశభక్తి భావజాలాన్ని ఈజీగా రుద్దగలిగింది!" కాఫీ సిప్ చేస్తూ ఆగాడు సుబ్బు.
"ఇంటరెస్టింగ్, గో ఆన్!" అన్నాను.
"ఇండియాతో యుద్ధం ఓడిపోయ్యి బంగ్లాదేశ్ ఏర్పడ్డాక పాకిస్తాన్ ప్రజలకి ఇండియా వ్యతిరేకతలోని మార్మికత అర్ధమైంది. అప్పుడు వెంటనే రాజ్యం మతం ఎత్తుగడ వేసి పాకిస్తాన్‌ని ఇస్లామిక్ మత రాజ్యంగా మార్చేసింది. ఈ పని చేసింది జమాతే ఇస్లాం కాదు, సైన్యం ఆధ్వర్యంలో వున్న ప్రభుత్వం. ఇలా రాజ్యం తన ఎత్తుగడల్లో భాగంగా దేశభక్తి, మతభావనల్ని సమయానుకూలంగా తెరపైకి తెస్తుంటుంది." అన్నాడు సుబ్బు.
"అవును కదా!" అన్నాను.
"హిట్లర్ వోటు ద్వారానే అధికారంలోకి వచ్చాడు. ఆ తరవాతే గోబెల్స్ సహాయంతో యూదు వ్యతిరేకత, కమ్యూనిస్టు వ్యతిరేకత అంటూ జాతీయ భావాల్ని రెచ్చగొట్టి ప్రపంచాన్ని చిందర వందర చేశాడు. సద్దామ్ హుస్సేన్ బాత్ పార్టీ మొదట్లో సెక్యులర్ పార్టీ. ఆ తరవాత యుద్దాల్ని జనాల మీదకి రుద్దడానికి బాత్ పార్టీ ఇస్లామిక్ పార్టీగా మారిపొయింది." ఆలోచిస్తూ అన్నాడు సుబ్బు.
"మరి ఇండియా సంగతి?" అడిగాను.
"స్వతంత్రం వచ్చిన కొన్నేళ్ళదాకా రాజ్యం గాంధీయిజం, సోషలిజం సిద్ధాంతాల్ని వాడుకుంది. ఆ తరవాత అది సరిపోదని గ్రహించి - పాకిస్తాన్లో ఫలితం ఇచ్చిన మతవాదాన్ని తెరపైకి తెచ్చింది. టెస్ట్ డోసుగా అయోధ్య తలుపులు తెరిపించింది. ఎలాగూ మతవాదంతో రెడీమేడ్‌గా ఆరెస్సెస్ వుండనే వుంది. దాన్ని దుమ్ము దులిపి బయటకి లాగి - 'రామజన్మ భూమి' అంటూ అద్వానీ రథయాత్రతో ముందుకి నెట్టింది. అది గుజరాత్ హత్యాకాండతో మరింత స్థిరీకరించబడింది." అంటూ ఖాళీ కప్పు టేబుల్ మీద పెట్టాడు సుబ్బు.
"ఒప్పుకుంటున్నాను." అన్నాను.
"టీ కొట్టువాడు పాలు, డికాక్షన్లు దగ్గర ఉంచుకుని కస్టమర్ల టేస్టుకి తగ్గట్లు పాళ్ళు కలిపి ఇస్తుంటాడు. అలాగే రాజ్యం - దేశభక్తి, మతభావనలు అనే భావజాలాల డోసుని అవసరాన్ని బట్టి పెంచడం, తగ్గించడం చేస్తుంది. శ్రీలంకలో తమిళుల్ని ఊచకోత కొయ్యడానికి రాజ్యానికి దేశభక్తి డోసు పెంచాల్సి వచ్చింది. ఆ సమయంలో 'అహింసాయుత' బౌద్ధమతం తన మొహాన్ని ఇంకోవైపుకి తిప్పుకుంది." అన్నాడు సుబ్బు.
"ఈ మధ్య మతాన్ని రాష్ట్రప్రభుత్వాలు కూడా మోస్తున్నాయి కదా!" అన్నాను.
"అవును, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలనే ఉద్దేశం లేని రాజ్యం పుష్కరాలు, యాగాలు అంటూ భక్తిభావాల్ని ప్రమోట్ చేస్తుంది. వాస్తవానికి ఈ భక్తి కార్యక్రమాల్ని నిర్వహించడానికి మత ధార్మిక సంస్థలున్నాయ్. కానీ ప్రజల దృష్టి మరల్చడానికి పనికొచ్చే యే అంశాన్నీ వదులుకోడం రాజ్యానికి ఇష్టం వుండదు."
"కరెక్ట్." అన్నాను.
"రాజ్యం అసలు ఎజెండా - సామ్రాజ్యవాదానికి దేశంలో ఒక మార్కెట్ దళారీ వ్యవస్థని ఏర్పాటు చెయ్యడం. కానీ ఈ విషయాన్ని దాచి, ఇంకోటి చెబుతుంటుంది. పాకిస్తాన్లో మసీదు మెట్ల మీద అడుక్కునేవాడు, ఇండియాలో గుడిమెట్ల మీద అడుక్కునేవాడు - తాము పరస్పర శత్రువులుగా భావించేందుకు అవసరమైన భావజాల సరంజామాని రాజ్యం నిత్యం సరఫరా చేస్తూ వుంటుంది. అదీ సంగతి!" అంటూ హడావుడిగా నిష్క్రమించాడు మా సుబ్బు.
**(బాలగోపాల్ 'హిందూమత రాజ్యం' (1991) వ్యాసం ఆధారంగా)
(ప్రచురణ - సారంగ వెబ్ మేగజైన్ - 11 ఫిబ్రవరి, 2016)