Wednesday 13 July 2016

మిస్టర్ గోస్వామి! ద నేషన్ లాఫ్స్ ఎట్ యు!!


"ప్రధాన మంత్రిని అర్నబ్ గోస్వామి చేసిన ఇంటర్‌వ్యూ చూశావా?" అడిగాడు నా స్నేహితుడు.

"చూళ్ళేదు." అన్నాను.

"అదృష్టవంతుడివి. నాకా ఇంటర్‌వ్యూ ఉప్మా లేని పెసరట్టులా చప్పగా అనిపించింది. అర్నబ్ గోస్వామికి బుద్ధిమంతుడి వేషం నప్పలేదు. థాంక్స్ టు మోడీ, అర్నబ్ నోర్మూసుకుంటే యెలా వుంటాడో మొదటిసారి చూశాను." అంటూ నవ్వాడు నా స్నేహితుడు.

గత కొన్నేళ్లుగా టీవీ మీడియంలో అర్నబ్ గోస్వామి పేరు మోగిపోతుంది. మోడెస్టీ కోసం తానో జర్నలిస్టునని చెప్పుకుంటాడు కానీ, అర్నబ్ జర్నలిస్టు స్థాయి ఎప్పుడో దాటిపొయ్యాడు! అతను ఒక షోమేన్, ఒక పెర్ఫామర్! సినిమా నటులు పాత్రోచితంగా అనేక రసాలు పండిస్తారు. అర్నబ్ 'చర్చో'చితంగా కోపావేశాల్ని పండిస్తాడు. సినిమావాళ్ళది బాక్సాఫీస్ దృష్టైతే, అర్నబ్‌ది టీఆర్పీ దృష్టి!

అర్నబ్ గోస్వామి పాపులారిటీకి కారణం యేమిటి? యే దేశంలోనైనా సుఖమయ జీవనం సాగిస్తూ కులాసాగా ఆలోచించే వర్గం ఒకటి వుంటుంది. వీళ్లు రాజకీయంగా కలర్ బ్లైండెడ్‌. అంటే - ప్రతి సమస్యనీ బ్లాక్ వైట్‌లోనే ఆలోచిస్తారు, అధికారిక (ప్రభుత్వ) వెర్షన్‌ని సమర్ధించేందుకు రెడీగా వుంటారు, ప్రభుత్వ అభివృద్ధి నమూనాల పట్ల విశ్వాసం కలిగుంటారు (తమకీ ఓ రవ్వంత వాటా దొరక్కపోదా అన్న ఆశ కూడా వుంటుందనుకోండి). వీరిలో ఎక్కువమంది వేతనశర్మలు (చూడుము - రావిశాస్త్రి 'వేతనశర్మ కథ').

ఈ అర్నబ్ గోస్వామి వీక్షక వర్గం సోషల్ మీడియాని ప్రతిభావంతంగా వాడుతుంది. ఆపరేషన్ గ్రీన్ హంట్ గూర్చి కేంద్ర హోమ్ శాఖ చెప్పింది కరెక్ట్. వ్యతిరేకించావా? - నువ్వు 'మావోయిస్టు టెర్రరిస్టువి'.  కల్బుర్గి హంతకుల కోసం ప్రభుత్వం ఇంకా వెదుకుతూనే వుంది. ప్రశ్నించావా? - నువ్వు 'సూడో సెక్యులరిస్టువి'. రోహిత్ వేముల ఆత్మహత్య కేంద్రాన్ని కలచివేసింది! సందేహించావా? - నువ్వు 'దేశద్రోహివి'.

ఈ వర్గంవారి అభిప్రాయాల పట్ల ఎవరూ ఆశ్చర్యపడనక్కర్లేదు. ఆసక్తికర అంశం యేమంటే - 'రాజకీయాలు చెత్త, అవి మాట్లాడ్డం టైమ్ వేస్ట్' అన్న లైన్ తీసుకున్న 'న్యూట్రల్' వ్యక్తులు కొన్నాళ్లుగా ఘాటైన రాజకీయ అభిప్రాయాలు వెలిబుచ్చడం! అవి అచ్చు అర్నబ్ గోస్వామి అభిప్రాయాలే! ప్రతి అంశాన్నీ సింప్లిఫై చేసి బ్లాక్ ఎండ్ వైట్‌లో ప్రెజెంట్ చేసే అర్నబ్ గోస్వామి స్టైల్ వీళ్ళకి బాగా నచ్చింది.

మర్నాడు న్యూస్‌పేపర్లలో పదోపేజీలో కూడా రిపోర్ట్ కాని అంశాన్ని కొంపలు మునిగిపొయ్యే సమస్యలా చిత్రించ గలగడం అర్నబ్ గోస్వామి ప్రతిభ. అతని డిబేట్లు WWE కుస్తీ పోటీల్లా స్క్రిప్టెడ్ కేకలు, అరుపుల్తో గందరగోళంగా వుంటాయి. చూసేవాళ్ళకి 'ఈ వీధిపోరాటంలో ఎవరు గెలుస్తారు' లాంటి ఆసక్తి కలుగుతుంది. ఇట్లాంటి చౌకబారు ఆసక్తిని రేకెత్తించి వ్యూయర్‌షిప్ పెంచుకోవటమే టైమ్స్ నౌ చానెల్ వారి ఎజెండా. ప్రతిభావంతులైన నటుల్ని అభినందించినట్లుగానే అర్నబ్ గోస్వామిని కూడా అభినందిద్దాం.

టీవీల్లో వార్తల్ని విశ్లేషించే చర్చా కార్యక్రమాలకి కొంత ప్రాముఖ్యత వుంటుంది. వీక్షకులకి ఎదుటివారి వాదన యేమిటనేది తెలుసుకోడానికీ, తమకంటూ ఒక అభిప్రాయం ఏర్పరుచుకోడానికి ఈ చర్చలు ఉపయోగకరంగా వుంటాయి. కానీ - అర్నబ్ గోస్వామి స్టూడియోలో కూర్చుని ప్రతి సబ్జక్టు పైనా ముందుగానే ఒక ఖచ్చితమైన అభిప్రాయం యేర్పరచుకుని వుంటాడు. ఆ అభిప్రాయంలో తీవ్రమైన దేశభక్తీ, భీభత్సమైన ధర్మాగ్రహం వుంటాయి. ఈ కారణాన - తన అభిప్రాయాన్ని వొప్పుకోనివారికి తిట్లు తినే సదుపాయం తప్ప, మాట్లాడే హక్కుండదు. ఈ సంగతి తెలుసుకోకుండా అర్నబ్ షోలో పాల్గొన్న JNU విద్యార్ధులకి యేమైందో మనకి తెలుసు.

"టీఆర్పీ రేటింగ్ కోసం చర్చా కార్యక్రమాన్ని వినోద స్థాయికి దించడం దుర్మార్గం." ఒక సందర్భంలో నా స్నేహితుడితో అన్నాను.

"నీకు మర్యాదస్తుల న్యూస్ డిబేట్ కావాలంటే బిబిసి చూసుకో! మజా కావాలంటే అర్నబ్‌ని చూడు. అది సరేగానీ, అర్నబ్ డిబేట్లలో స్క్రీన్ మీద మంటలు మండుతుంటాయి. ఎందుకో తెలుసా?" అడిగాడు నా స్నేహితుడు.

"తెలీదు." ఒప్పేసుకున్నాను.

"అరుంధతి రాయ్, తీస్తా సెటిల్వాడ్ లాంటి దేశద్రోహుల్ని అందులో పడేసి రోస్ట్ చేసెయ్యడానికి." కసిగా అన్నాడతను.

ఈ విధంగా ప్రజలు ప్రశాంతంగా టీవీ చూసేస్తూ చాలా విషయాల పట్ల చక్కటి అవగాహన యేర్పరచుకుంటున్నారు! 'ముఖ్యమైన' సమాచారం ప్రజలకి చేరే విషయంలో ప్రభుత్వాలు అప్రమత్తంగా వుంటాయి. తమకి ఇబ్బందిగా ఉండే విషయాల్లో (రాజకీయాలకి బయటనున్న ప్రజల) ఒపీనియన్ మేకింగ్ అన్నది అధికారంలో వున్నవాళ్ళకి చాలా అవసరం. ఈ వ్యవహారం సాఫీగా సాగడానికి అనేకమంది స్టేక్‌హోల్డర్స్‌ పాటుపడుతుంటారు (చూడుము - Noam Chomsky 'Media Control').

ఇంతటితో నేను చెబ్దామనుకున్న విషయం అయిపోయింది. అయితే - చెప్పుల షాపులో పన్జేసే వ్యక్తి దృష్టి తనకి తెలీకుండానే ఎదుటివారి చెప్పుల వైపు పోతుంది. దీన్ని occupational weakness అనుకోవచ్చు. వృత్తిరీత్యా నేను సైకియాట్రిస్టుని కాబట్టి చాలా అంశాల్లో సైకలాజికల్ యాస్పెక్ట్స్ కూడా ఆలోచిస్తాను. అంచేత కొద్దిసేపు - సైకాలజీ బిహైండ్ అర్నబ్ గోస్వామి సక్సెస్.

ఒక వ్యక్తి 'చర్చా కార్యక్రమం' అంటూ గెస్టుల్ని పిలిచి మరీ చెడామడా తిట్టేస్తుంటే, చూసేవారికి ఎందుకంత ఆనందం? సైకాలజీలో Frustration-Aggression అని ఒక థియరీ వుంది. సగటు మనిషికి దైనందిన జీవితంలో నిరాశ, నిస్పృహ, అసంతృప్తి, చిరాకు.. ఇవన్నీ frustration కలిగిస్తాయి. ఈ frustration ఒక స్టీమ్ ఇంజన్ లాంటిదని సిగ్మండ్ ఫ్రాయిడ్ అంటాడు. ఇంజన్ స్టీమ్ వదలాలి, లేకపోతే పేలిపోతుంది. అంచేత frustration అనేది తప్పనిసరిగా aggression కి దారితీస్తుంది. సగటు మనిషిలో వున్న ఈ aggression కి అర్నబ్ గోస్వామి కార్యక్రమం ఒక విండోగా ఉపయోగపడుతుంది. అందుకే చూసేవారిలో అంత ఆనందం!

అన్ని వృత్తుల్లాగే - జర్నలిస్టులకీ వృత్తి ధర్మం వుంటుంది. వాళ్ళు అధికారంలో వున్నవాళ్ళని ప్రజల తరఫున ప్రశ్నలడిగి, సమాధానాలు రాబట్టాలి. మరప్పుడు అర్నబ్ గోస్వామి - "మిస్టర్ ప్రైమ్ మినిస్టర్! విదేశాల నుండి నల్లడబ్బు తెచ్చే విషయం ఎందాకా వచ్చింది? NSG కి చైనా అడ్డుపడకుండా ఎందుకు ఆపలేకపొయ్యారు? అదానీ వ్యాపారానికి అన్నేసి రాయితీలు ఎందుకిస్తున్నారు?" అని అడగాలి. అతనికి ప్రధాన మంత్రి ఆఫీసు నుండి ఫలానా ప్రశ్నల్ని అడక్కూడదనే ఆదేశాలు వొచ్చి వుండొచ్చు. అయితే చండప్రచండులైన గోస్వాములువారు ప్రధాన మంత్రి ఆఫీసు ఆదేశబద్దులై వుంటారా? వుండకూడదు కదా! స్టూడియోలో కూర్చుని కేకలేస్తూ గెస్టుల్ని తిట్టేసే అర్నబ్ గోస్వామి, ప్రధానమంత్రి దగ్గర వినయపూర్వకంగా ఎందుకు వొదిగిపొయ్యాడు?

సోషల్ సైకాలజీలో Obedience to Authority అని ఒక థియరీ వుంది. ఇది 'పైనుండి' వచ్చే అదేశాల్ని తుచ తప్పకుండా పాటించేవారి మనస్తత్వాన్ని చర్చిస్తుంది. లక్షలమంది యూదుల్ని హిట్లర్ వొక్కడే చంపలేదు, చంపలేడు. అతనికి తన ఆదేశాల్ని గుడ్డిగా అమలు చేసిన నాజీ అధికారులు తోడయ్యారు. మన సివిల్ పోలీసులు పై ఆధికారుల ఆదేశాలని పాటిస్తూ నిరసన చేస్తున్న వికలాంగులు, వృద్ధులు, స్త్రీలని చావ చితక్కొడతారు. ఈ పోలీసులే పోలీసు అధికారుల ఇళ్లల్లో ఆర్దర్లీలుగా మగ్గిపోతుంటారు (చూడుము - పతంజలి 'ఖాకీవనం', స్పార్టకస్ 'ఖాకీబ్రతుకులు').

అర్నబ్ గోస్వామి టీఆర్పీ కోసం aggression చూపిస్తాడు, తన కెరీర్ కోసం Obedience to Authority కూడా చూపిస్తాడు. స్టూడియోలో కూర్చుని చిన్నాచితకా నాయకుల్ని మందలిస్తూ, దేశభక్తిపై లెక్చర్లిచ్చే అర్నబ్ గోస్వామి బ్రతక నేర్చినవాడు. అందుకే ఎక్కడ ఎలా వుండాలో అర్ధం చేసుకుని సెలబ్రిటీ జర్నలిస్టయ్యాడు. ఇతగాడి విజయ యాత్ర యెందాకా సాగుతుందో తెలీదు గానీ, అది ఎంత తొందరగా ముగిసిపోతే దేశానికీ, ప్రజలకీ అంత మంచిదని నమ్ముతూ -

"మిస్టర్ గోస్వామి! ఐ హేవ్ ద ఇన్‌ఫర్మేషన్ విత్ మి! ద నేషన్ లాఫ్స్ ఎట్ యు!!"

(published in సారంగ web magazine on 7 - 7 - 2016)

Saturday 2 July 2016

పెహ్లాజ్ నిహలాని సాబ్! యువార్ గ్రేట్!


మన్ది పవిత్ర భారద్దేశం, ఈ దేశంలో పుట్టినందుకు మనం తీవ్రంగా గర్విద్దాం (ఇలా గర్వించడం ఇష్టం లేనివాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోవచ్చు). మన్దేశంలో ప్రజలే పాలకులు. ప్రజాసేవ పట్ల ఆసక్తి కలిగినవారెవరైనా సరే - ఎన్నికల్లో పోటీ చెయ్యొచ్చు, గెలవచ్చు. ప్రజలకి పజ్జెనిమిదేళ్ళు నిండగాన్లే ఓటుహక్కు వస్తుంది, ఈ హక్కుతో వారు ప్రజాప్రతినిథుల్ని ఎన్నుకుంటారు. ఇలా ఎన్నికైనవారు ప్రభుత్వాల్ని యేర్పాటు చేస్తారు. ఇంత పారదర్శకమైన ప్రజాస్వామ్యం ప్రపంచంలో ఇంకోటి వున్నట్లు నాకైతే తెలీదు.

మన్దేశంలో రాజ్యం అనుక్షణం ప్రజల సంక్షేమం గూర్చే తపన పడుతుంటుంది. అందువల్ల ప్రజలు తమగూర్చి తాము ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం యేది తినాలో, యేది తినకూడదో పాలకులే నిర్ణయిస్తారు. ఇది కేవలం ప్రజారోగ్య పరిరక్షణ కోసం మాత్రమేనని మీరు అర్ధం చేసుకోవాలి. ఓటేసే హక్కుంది కదాని యేదిబడితే అదితింటే ఆరోగ్యం పాడైపోతుంది. పాలకులకి ప్రజలు బిడ్డల్లాంటివారు. మనం మన పిల్లల మంచికోసం జాగ్రత్తలు తీసుకోమా? ఇదీ అంతే!

ఇక సినిమాల సంగతికొద్దాం. ఈ దేశంలో సామాన్యుల వినోద సాధనం సినిమా. తినేతిండి విషయంలోనే సరైన అవగాహన లేని ప్రజలకి యేం చూడాలో యేం చూడకూడదో మాత్రం యెలా తెలుస్తుంది? తెలీదు. అందుకే ప్రజలకి మంచి సినిమాలు మాత్రమే చూపించేందుకు పాలకులు 'సెన్సార్ బోర్డ్' అని ఒక సంస్థ నెలకొల్పారు. ఇందుగ్గాను మనం ప్రభుత్వాలకి థాంక్స్ చెప్పాలి.

'సినిమా చూసే విషయంలో ఒకళ్ళు మనకి చెప్పేదేంటి?' అని ఈమధ్య కొందరు ప్రశ్నిస్తున్నారు, వాళ్ళు అనార్కిస్టులు. రోడ్డు మీద ట్రాఫిక్ రూల్స్ ఎందుకు పాటిస్తాం? మన మంచి కోసమేగా? ఇదీ అంతే! ఆ తెలుగు సినిమావాళ్ళని చూడండి.. బుద్ధిగా రూల్స్ పాటిస్తూ పాటలు, ఫైట్సు, పంచ్ డైలాగుల్తో మాత్రమే సినిమా తీసేస్తారు. ఒక్క తెలుగు సినిమానైనా సెన్సారువాళ్ళు అభ్యంతర పెట్టారా? లేదు కదా! అంటే ట్రాఫిక్ రూల్సు పాటించనివారి వాహనం సీజ్ చేసినట్లే.. సమాజం, సమస్యలు అంటూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే సినిమాల్ని మాత్రమే సెన్సారువాళ్ళు ఆపేస్తున్నారు.

అసలు సెన్సార్ బోర్డ్ అంటే యేంటి? అమాయకులైన ప్రజలు యేదిపడితే అది చూసి చెడిపోకుండా వుండేందుకు ప్రభుత్వంవారిచే నియమింపబడ్డ సంస్థ అని ఇందాకే చెప్పుకున్నాం. సెన్సారు బోర్డులో దేశం పట్ల, దాని బాగోగుల పట్లా అవగాహన కలిగినవారు మాత్రమే సభ్యులుగా వుంటారు. వారు మిక్కిలి నీతిపరులు, జ్ఞానులు, మేధావులు. కనుకనే రాముడి కోసం శబరి ఫలాల్ని ఎంగిలి చేసినట్లు, అన్ని సినిమాల్ని ముందుగా చూస్తారు. ఆపై మనం యేది చూడొచ్చో, యేది చూడకూడదో వడపోస్తారు (దుఃఖంతో గొంతు పూడుకుపోయింది, కొద్దిసేపు ఆగుతాను).

ఈ విధంగా దేశసేవలో పునీతమవుతూ ప్రశాంతంగా వున్న సెన్సార్ బోర్డుకి అనురాగ్ కాశ్యప్ అనే తుంటరివాడు తగిలాడు. ఆ అబ్బాయి వర్తమాన సాంఘిక సమస్యల ఆధారంగా వాస్తవిక సినిమాలు తీస్తాట్ట. దేశమన్నాక సమస్యలుండవా? వుంటాయి, వుంటే యేంటి? అవన్నీ చూపించేస్తావా? ఒకప్పుడు సత్యజిత్ రే అని ఓ దర్శకుడు వుండేవాడు, ఆయనా అంతే! భారద్దేశం పేదరికాన్ని ప్రపంచానికంతా టముకు వేసి మరీ చూపించాడు. ఆయనకి ఎవార్డులొచ్చాయి, మన్దేశానికి మాత్రం పరువు పోయింది! సమస్యలు ఎవరికి మాత్రం లేవు? మాంసం తింటామని బొమికలు మెళ్ళో వేసుకుని తిరుగుతామా!

ఆ అనురాగ్ కాశ్యపో, హిరణ్యకశ్యపో.. ఆ కుర్రాడి సినిమాకి సెన్సార్ బోర్డు బోల్డెన్ని కట్స్ చెప్పిందట, సినిమా పేరులో 'పంజాబ్' తీసెయ్యమందిట. ఇందులో అన్యాయం యేమిటో మనకి అర్ధం కాదు - సెన్సారు బోర్డు వుంది అందుకేగా! పైగా ఆ కుర్రాడు ఒక ఇంటర్వూలో - "పంజాబ్ రాష్ట్రంలో డ్రగ్స్ వాడకం వల్ల యువత చాలా నష్టపోతుంది. ఒక సమస్యని గుర్తించడంలో సమస్యేంటి?" అని ప్రశ్నించాడు. అంటే ఒక సమస్య వుంటే, దానిమీద యెడాపెడా సినిమాలు తీసేస్తావా? దేశం పరువు బజార్న పడేస్తావా? ఇప్పుడు నీలాంటివాళ్ళ ఆటలు సాగవ్, ప్రజల కోసం నిరంతరం శ్రమించే ప్రభుత్వం వచ్చేసింది.

మా పక్కింటాయనకి ముంజేతి మీద యేదో మచ్చ వుంది, ఆయన దాన్ని ఫుల్ హాండ్స్ చొక్కా వేసుకుని కవర్ చేసుకుంటాడు. మా ఎదురింటాయన తెల్లజుట్టుకి రంగేసుకుంటాడు! వాళ్ళ అందానికొచ్చిన ఇబ్బందుల్లాంటివే దేశానికీ వుంటాయి. నీ సినిమాలు యే సౌదీ అరేబియాలోనో తీసిచూడు, దూల తీరిపోతుంది. ఎంతైనా - మన్దేశంలో ఫ్రీడమాఫ్ ఎక్స్‌ప్రెషన్ మరీ ఎక్కువైపోయింది, అందుకే దేశాన్ని విమర్శించడం ఈమధ్య ప్రతివాడికి ఓ ఫేషనైపోయింది.

సెన్సార్ బోర్డుని విమర్శించేవాళ్ళు విదేశీ ఏజంట్లు. పవిత్రమైన సెన్సారు వ్యవస్థని కాపాడుకోకపోతే మన దేశభవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. హీనమైన పాశ్చాచ్య సంస్కృతిని వొంటబట్టించుకున్న కుహనా మేధావులు మన్దేశంలో చాలా సమస్యలున్నట్లు చూపించేస్తారు, అతంతా నిజమని అమాయక ప్రజలు నమ్మేస్తారు. చివరాకరికి ప్రజల వల్ల ఎన్నుకోబడి, ప్రజల బాగుకోసం నిరంతరం శ్రమిస్తున్న పాలక వర్గాలపైన నమ్మకం కోల్పోతారు. ఇలా జరగకుండా దేశభక్తులమైన మనం ప్రతిఘటించాలి.

భారత సెన్సార్ బోర్డుకి ప్రస్తుత హెడ్ శ్రీమాన్ పెహ్లాజ్ నిహలానిగారు. ఆయన భారతీయ సంస్కృతి పరిరక్షణకి కంకణం కట్టుకున్న వ్యక్తి, గొప్ప దేశభక్తుడు. సినిమా సెన్సార్ విషయాల్లో చంఢశాసనముండావాడు. అందుకే కాశ్యప్‌గాడికి జెల్ల కొట్టాడు. ఆ మేరకు ఒక సందేశం ఆల్రెడీ ఈ సోకాల్డ్ రియలిస్టిక్ సినిమాగాళ్ళకి చేరిపోయింది, ఇక ఇట్లాంటి జాతివ్యతిరేక సినిమాలు తియ్యాలంటే వాళ్ళు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. అసలు వీళ్ళెందుకు పాజిటివ్ సినిమాలు తియ్యరు? చాయ్ అమ్మిన ఒక మహానుభావుడు ప్రధాని అయ్యాడు. ఈ ఆలోచనే గొప్ప ఉత్తేజాన్నిస్తుంది! ఇట్లాంటి గొప్ప కథాంశంతో యే వెధవా సినిమా తియ్యడు, ఇది మన దురదృష్టం. 

సెన్సార్ బోర్డుని విమర్శించేవాళ్ళు దేశద్రోహులని కూడా నా అనుమానం. సెన్సారే లేకపోతే విపరీతంగా బూతు సినిమాలు వచ్చేస్తాయి, యువకులంతా రేపిస్టులుగా మారిపోతారు. ఆడవాళ్ళల్లో పతిభక్తి తగిపోతుంది, బరితెగించిపోతారు. సీతామహాసాధ్వి జన్మించిన ఈ పుణ్యభూమి విచ్చలవిడి భూమిగా మారిపోతుంది.

ఇంకో ముఖ్య విషయం - సెన్సార్ బోర్డు వల్లనే సాంఘిక సమతుల్యత రక్షించబడుతూ వస్తుంది. అదే లేకపోతే - దళితుల సమస్యని హైలైట్ చేస్తూ కారంచేడు, చుండూరు మారణకాండల మీద సినిమాలొస్తాయి. అభివృద్ధి పేరుతో జరుగుతున్న సహజ సంపదల లూటీకి అడ్డుగా వున్న ఆదివాసీల దారుణ అణచివేతపై సినిమాలొస్తయ్. ఇవన్నీ ప్రజలకి తెలిసిపోతే దేశానికి ఎంత ప్రమాదమో మీరే ఆలోచించండి.

సినిమాల్ని నలిపేసే భారత సినిమాటోగ్రాఫ్ చట్టం (1952) యెంతో పవిత్రమైనది. సెడిషన్ యాక్ట్ (1870) లాగే సినిమాటోగ్రాఫ్ చట్టం కూడా నిత్యనూతనమైనది! ఈ పురాతన చట్టాల్ని మార్చాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు, వీరిని పట్టించుకోరాదని ప్రభుత్వానికి సలహా ఇస్తున్నాను. మన కంట్లో మనమే ఎలా పొడుచుకుంటాం!

పోలీసులంటే దొంగలకి పడదు. కానీ - పోలీసులు చెడ్డవాళ్ళు కాదు, సమాజ రక్షకులు. సెన్సార్ బోర్డూ అంతే! అంచేత - తనకి అప్పజెప్పిన బాధ్యతల్ని అత్యంత సమర్ధవంతంగా నిర్వహిస్తున్న పూజ్య పెహ్లాజ్ నిహలానిగారిని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. పెహ్లాజ్ నిహలాని సాబ్! యువార్ గ్రేట్! గో ఎహెడ్, వుయార్ విత్ యు సర్! 

చివరి మాట -

ఈ రచనకి స్పూర్తి - "పేదలెవ్వరూ ఇది చదువరాదు. చదివినచో వారు శిక్షలకు పాత్రులగుదురు" అని డిక్లేర్ చేసి 'గోవులొస్తున్నాయి జాగ్రత్త!' కథ చెప్పిన కిరీటిరావు. 

(ప్రచురణ - సారంగ 16 June 2016)