Sunday 31 January 2016

రోహిత్ మరణం.. కొన్ని ఆలోచనలు


పుట్టినవాడు గిట్టక మానడు, చావు పుట్టుకలు ప్రకృతి సహజం అంటారు. అయితే - కొన్ని మరణాలు చరిత్ర సృస్టిస్తాయి, మనలోని మనిషిని కొరడాతో చెళ్ళుమని కొట్టి ఉలిక్కిపడేలా చేస్తాయి. రోహిత్ మరణం అనేక ప్రశ్నల్ని మనముందుంచింది. ఒక విద్యార్ధి మరణం దేశవ్యాప్తంగా ఇంత సంచనలం సృష్టించడం ఈ మధ్య కాలంలో జరగలేదు (ఎమర్జెన్సీ సమయంలో రాజన్ అనే కేరళ విద్యార్ధి encounter కూడా ఇలాంటి తుఫానునే సృష్టించింది).

రోహిత్ మరణం గూర్చి జరుగుతున్న ఆందోళనలు కొన్నాళ్ళకి సద్దుమణగొచ్చు. అయితే - రోహిత్ మరణం భవిష్యత్తులో ఒక మంచి కేస్ స్టడీగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. రోహిత్ కేవలం ఒక SC కులానికి చెందినవాడైతే ఇంత చర్చ జరిగేది కాదు. అప్పుడది కారంచేడు, చుండూరు మాదిరిగా దళిత vs అగ్రకుల పోరాటంగా మిగిలిపోయ్యేదేమో.

ఒక SC పసిపిల్లని BC కుటుంబం పెంచి పెద్ద చెయ్యడం, తదుపరి తమ BC కులంలో వ్యక్తికి పెళ్లి చెయ్యడం అరుదుగా జరుగుతుంది. ముగ్గురు పిల్లల్ని కన్నాక భార్య SC అన్న 'నిజం' తెలుసుకుని భర్త గృహహింసకి పాల్పడటం, ఆపై విడాకులు తీసుకోవడం కూడా ఆసక్తికరమే. వీళ్ళకి పుట్టిన పిల్లాడు అనేక కష్టాలు ఎదుర్కుని యూనివర్సిటీ స్థాయికి ఎదగడమూ అసాధారణమే. ఈ కుర్రాడు అంబేద్కర్ ఆలోచనలకి ప్రభావితుడై యూనివర్సిటీ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించడం.. ఇదంతా ఓ సినిమా కథలా వుంది కదూ! అవును - రోహిత్ కేసు అనేక విధాలుగా చాలా అరుదైనది. సామాజిక శాస్త్రం చదువుకున్నవారికి ఇవన్నీ చాలా ఆసక్తికరమైన అంశాలు.

రోహిత్ తల్లి చట్టపరంగా భర్త నుండి విడాకులు తీసుకుని విడిపొయ్యింది. అందువల్ల ఆయా కుటుంబాల్లో సహజంగానే కొన్ని రాగద్వేషాలు వుండొచ్చు. అయితే రోహిత్ తండ్రి వైపు వారి కోపాన్ని పదేపదే చూపించి హైలైట్ చెయ్యడంలో మీడియా కుట్ర వుందని భావిస్తున్నాను. భర్త నుండి విడిపోయిన భార్య character assassination చెయ్యడం - మీడియాకున్న 'అధికారానికి కొమ్ము కాయడం' అనే పవిత్రమైన ఎజెండాలో భాగం. Women empowerment గూర్చి ఆలోచించాల్సిన ఈ రోజుల్లో - బూజు పట్టిన భావాలకి ఎంత ప్రచారం! 

పిల్లల్ని పెంచడం అన్నది చాలా సీరియస్ వ్యవహారం. Disturbed family environment లో పెరిగే పిల్లల మనస్తత్వం చాలా delicate గా వుంటుంది. తాగుబోతు తండ్రి తమ తల్లిని అవమానించడం, హింసించడం పసివాళ్ళ మససు మీద తీవ్రమైన ప్రభావం చూపుతుంది. పేదరికానికి అవమానం, అభద్రత తోడైతే అది చాలా deadly combination. ఈ అమానవీయ నేపధ్యంలో రోహిత్ JRF సాధించగలిగాడంటే అది ఎంతైనా అభినందనీయం.

మధ్యతరగతి భావజాలంలో దేశభక్తి అత్యంత పవిత్రమైనది. మరణశిక్షని రద్దు చెయ్యాలని బలమైన వాదన నడుస్తూనే వుంది. ఈ నేపధ్యంలో మెమెన్ ఉరిశిక్షని వ్యతిరేకించడం అన్నది నేరం ఎలా అవుతుంది!? కానీ - సంఘపరివార్ దృష్టిలో ఇదో జాతి వ్యతిరేక, దేశ వ్యతిరేకమైన తీవ్రమైన నేరం. అందుకే ఈ విషయాన్ని పదేపదే ప్రస్తావిస్తూ రోహిత్ మరణం justified అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంలో వీరు ఎంతమేరకు విజయం సాధించారో కొన్నాళ్ళు ఆగితే గానీ తెలీదు.

మన్దేశంలో యూనివర్సిటీ ప్రొఫెసర్లైనా కులాలకీ, మతాలకీ అతీతంగా ఆలోచించలేరని అర్ధమైపోయింది. ఇందుకు ప్రధాన కారణం - వీరిలో ఎక్కువమంది (అందరూ కాదు) ప్రభుత్వాలకి సాగిలపడి కులాన్ని అడ్డుపెట్టుకుని, పైరవీలు చేసి ప్రమోషన్లు సంపాదించుకున్న బాపతు. ఇంక వీరు నిస్పాక్షికంగా వ్యవహరిస్తారని ఎలా ఆశించగలం! ఈ రేటున ఈ దేశానికి కులం నుండి ఇప్పడప్పుడే విముక్తి లేనట్లుగా అర్ధమౌతుంది.

రోహిత్ మరణం పట్ల స్పందనల్ని స్థూలంగా మూడు విభాగాలుగా విభజించవచ్చు. మొదటి రకం - బిజెపి అనుకూల హిందూమత రాజకీయుల వాదన. వీళ్ళు రిజర్వేషన్ వ్యతిరేకులు, అంబేద్కర్ వాదనకి వ్యతిరేకులు. కాబట్టి వీరికి (సహజంగానే) రోహిత్ దేశద్రోహిలా కనబడతాడు. చదువుకోవాల్సిన చోట రాజకీయాలు (తమకి నచ్చనివి) చెయ్యడం వల్ల  చనిపొయ్యాడు. అయితే ముసుగు తొలగిపొయ్యి తమ దళిత వ్యతిరేకత నగ్నంగా ప్రదర్శించబడటం సంఘపరివార్‌కి రాజకీయంగా నష్టం. అంచేత తమ escape plan లో భాగంగా 'రోహిత్ దళితుడు కాదు' అనే ప్రచారం మొదలెట్టింది. ABVP రాజకీయాలు సూటిగా, స్పష్టంగా వుంటాయి.   

రెండోరకం స్పందన - దళితవాదుల ప్రకటనలు. మనవాడు, మన ఇంట్లోవాడు అన్యాయంగా చనిపోతే దుఃఖం, కోపం కలుగుతాయి. వీరి ప్రకటనలు ఇదే స్థితిని తెలుపుతున్నాయి. తమవాడి మరణం వీరిని రోడ్ల మీదకి వచ్చేలా చేసింది. వీరి వాదనా స్పష్టంగా అర్ధమవుతుంది. 

ఇంక మూడోరకం - మధ్యతరగతి మేధావుల స్పందన. వీరు 'మంచివారు'. పాతకాలం ప్రజానాట్య మండలి నాటకాల్లా - పేదరికాన్ని, బలహీనుణ్నీ romanticize చేస్తారు. వీరిది - ధనికుడు vs పేదవాడిలో పేదవాడే కరెక్ట్, ఆడ vs మగ సమస్యల్లో ఆడవారే కరెక్ట్, కుల సంఘర్షణలో తక్కువ కులమే కరెక్ట్ అనే stereotype అవగాహన. సామాజిక విషయాల్ని over simplify చేసుకుని అర్ధం చేసుకోడానికి అలవాటు పడిపోయినందున - రోహిత్ కేసులో కన్ఫ్యూజ్ అవుతున్నారు. కారణం - కేసులో నిందితుడైన ABVP కుర్రాడు BC అయిపొయ్యాడు! ఇటువంటి సమయాల్లో ఈ తాత్విక గందరగోళాన్ని తగ్గిస్తూ (ఎడ్యుకేట్ చేస్తూ) బాలగోపాల్ అనేక వ్యాసాలు రాశాడు. నాకివ్వాళ బాలగోపాల్ లేని లోటు స్పష్టంగా కనబడుతుంది.        

సరే! వాదన కోసం రోహిత్ SC కాదు, OC అనుకుందాం. అసలు గొడవ ఎక్కడ ఎందుకు మొదలైంది? అంబేద్కర్ విద్యార్ధి సంఘానికి, ABVP మధ్య జరిగిన, జరుగుతున్న ఘర్షణ నేపధ్యాన్ని అర్ధం చేసుకోవాలి. ప్రపంచంలో ఏ రాజకీయాలకైనా భావజాలమే ప్రధానం. దళితుడైనా ABVP సభ్యుడైతే అతను బ్రాహ్మణీయ భావజాల ప్రతినిధిగానే చూడాలి. అలాగే అగ్రకులస్తుడైనా అంబేద్కర్ విద్యార్ధి సంఘ సభ్యుడైతే అంబేద్కరిస్టుగానే చూడాలి. కాబట్టి - ఇది రెండు రకాల పరస్పర వ్యతిరేక ఆలోచనలని ప్రాతినిధ్యం వహిస్తున్న విద్యార్ధి సంఘాల ఘర్షణ. అందుకే ABVP తరఫున కేంద్రమంత్రులు దిగారు. విషయం ఇంత స్పష్టంగా వుంటే - మధ్యతరగతి మేధావులకి రోహిత్ SC నా లేక BC నా అనేది ప్రధానమైపోయింది. రోహిత్ పట్ల గానీ, అతని తల్లి పట్ల గానీ కనీస మానవత్వంతో స్పందించాలన్న స్పృహ లేకుండా మాట్లాడుతున్నారు.

నిర్భయ చట్టం రాకముందు అనేక దుర్మార్గమైన రేపులు జరిగాయి. కానీ నిర్భయ కేసు సంచలనం సృష్టించడం వల్ల నిర్భయ చట్టం వచ్చింది. రోహిత్ కన్నా ముందు యూనివర్సిటీల్లో దళిత విద్యార్ధులు అనేకులు ఆత్మహత్య చేసుకున్నా.. దేశవ్యాప్తంగా ఈ విషయాన్ని చర్చిస్తున్నది ఇప్పుడే. నిర్భయ చట్టం లాగా, దళిత విద్యార్ధులకి రక్షణగా ఒక రోహిత్ చట్టం వస్తే ఈ మొత్తం ఆందోళనకి ఒక మంచి ముగింపు కాగలదు. అప్పుడైనా ఉన్నత విద్యాలయాల్లో కొంతలో కొంత వివక్ష తగ్గే అవకాశం వుంది. అయితే అటువంటి చట్టాలు ఇప్పుడు అధికారంలో వున్నవారి నుండి ఆశించడం అత్యాశేమో!

(picture courtesy : Google)

Tuesday 19 January 2016

దళిత ప్రజాప్రతినిథుల దివాళాకోరుతనం


అనగనగా ఒకానొకప్పుడు కాలేజీల్లో, యూనివర్సిటీల్లో విద్యార్ధి సంఘాలు వుండేవి. SFI, AISF, RSU, ABVP, NSUI అంటూ హడావుడి రాజకీయ వాతావరణం వుండేది. ఇప్పట్లా కులసంఘాలు వుండేవి కావు. విద్యార్ధి సంఘాలు ప్రధాన రాజకీయ పార్టీలకి అనుబంధ సంస్థలు కావున, తరచూ వీటిమధ్య గొడవలు జరుగుతుండేవి. వాతావరణం అప్పుడప్పుడు ఉద్రిక్తంగానూ వుంటుండేది. 

కాలక్రమేణా ఎర్రజెండా ప్రాభవం కోల్పోయింది. ఎర్రజెండా స్థానంలో దళిత సంఘాలు క్రియాశీలకంగా ముందుకొచ్చాయి. వీరికి రాజకీయంగా సహజ శత్రువు బ్రాహ్మణీయ ABVP కాబట్టి అనేకచోట్ల ఘర్షణాత్మకమైన వాతావరణం నెలకొనుంది. ఇదిలా వుండగా - కేంద్రంలో బీజేపి పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. మతవాద శక్తులకి అధికారం తోడైతే ఇంక ఎదురుండదు. కావున ఇవ్వాల్టి ABVP ఒకప్పటి ABVP కాదు, చాలా బలం సంతరించుకుంది. ఈ నేపధ్యంలో ఆలోచిస్తే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన పరిణామాలు పెద్దగా ఆశ్చర్యం కలిగించవు.

సంఘపరివారానికి ABVP కార్యకర్తలు, VHP నేతలు, కేంద్రమంత్రులు.. అందరూ బిడ్డలే. ఎవరు ఎంత స్థాయిలో వున్నా అన్నదమ్ములు ఒకరికొకరు సాయం చేసుకుంటారు. కాబట్టి యూనివర్సిటీలో జరిగిన ఒక చిన్న ఘర్షణ ఆధిపత్య పోరుగా మారింది. ఈ పోరులో సంఘపరివారానికి చెందిన కేంద్రమంత్రి స్థాయి వ్యక్తి చురుకైన పాత్ర వహించడం ఆశ్చర్యకరమైన పరిణామం కాదు. 

మతతత్వ విద్యార్ధి సంఘానికి కేంద్రమంత్రి స్థాయి వ్యక్తి సంపూర్ణ మద్దతు ఇచ్చినప్పుడు - వివక్షతకి గురవుతూ, తీవ్రమైన కష్టాల్లో వున్న దళిత విద్యార్ధులకి దళిత ప్రజాప్రతినిథులు ఎందుకు అండగా నిలవలేదు!? ఎందుకంటే - మనది నిచ్చెన మెట్ల మనువాది వ్యవస్థ. ఇది ఖరీదైన ముసుగు కప్పుకుని అమాయకంగా కనిపిస్తుంది. అధికారం అందరి చేతిలో వున్నట్లుగానే కనబడుతుంది గానీ - కొందరి చేతిలోనే వుంటుంది.

కాంగ్రెస్ పార్టీలో గాంధీ కుటుంబాన్ని కాదన్నవాడికి మంచినీళ్ళు పుట్టవు. బీజేపిలో RSS విధేయుడిగా లేనివారు వార్డు స్థాయి నాయకుడిగా కూడా ఎదగలేరు. కెరీర్ రాజకీయాల్లో పదవే పరమావిధి. అందుకు చట్ట సభల్లో ఎన్నిక కావడం కీలకం. అందుకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్టు అవసరం. అందుకు పార్టీకి విధేయుడిగా వుండటం అవసరం.

ఈ సీక్వెన్స్ అర్ధం అయితే, సెంట్రల్ యూనివర్సిటీ దళిత విద్యార్ధులకి దళిత ప్రజాప్రతినిథులు అండగా ఎందుకు నిలబడలేదో అర్ధమవుతుంది. దళిత రిజర్వేషన్ వాడుకుని ప్రజాప్రతినిథులుగా ఎన్నికైనవారు 'పైనుండి' ఆదేశాలు రాకపోతే తమవారి వైపు కన్నెత్తి చూడరు (అలా చూస్తే ఏమవుతుందో తెలిసిన బ్రతకనేర్చిన నేతలు కనుక). అధికారం, పదవులు, డబ్బుకున్న పవర్ అట్లాంటిది!

మనువాది పార్టీలు దళితులకి ఎలాగూ శత్రువులే. కనబడే శత్రువు కన్నా కనబడని శత్రువు ప్రమాదకారి. తమ పక్షాన నిలబడని (నిలబడలేని) దళిత ప్రజా ప్రతినిథులకి బుద్ధి చెప్పగలిగి, వారిని శాసించే స్థాయికి దళిత సంఘాలు చేరుకున్న రోజున - అవి శత్రువుని మరింత సమర్ధతతో ఎదుర్కొనగలవు. ఆ విధంగా దళిత చైతన్యం పురోగమించగలిగితే, రోహిత్ వంటి యువకులు మరింత ఉత్సాహంగా పోరాడగలరు. ఆ రోజు సమీప భవిష్యత్తులో వస్తుందని ఆశాభావంతో వుందాం (అంతకుమించి చేసేదేమీ లేదు కనుక).


(picture courtesy : Google) 

Thursday 14 January 2016

శబరిమలై సంప్రదాయ గోడలు


మన ఇంటికి అతిథులు వస్తారు. అందరికీ కాఫీ ఇచ్చి, ఒకరికి మాత్రం మంచినీళ్ళే ఇస్తాం. ఆ మంచినీళ్ళ వ్యక్తి మొదట ఆశ్చర్యపోతాడు, తరవాత చిన్నబుచ్చుకుంటాడు, ఆ తరవాత కోపగించుకుంటాడు. కాఫీ ఆరోగ్యానికి హాని అనీ, అందుకే నీకు ఇవ్వలేదనీ మనం బుకాయించబోయినా అతడు ఒప్పుకోడు. వాస్తవానికి అతనికి కాఫీ తాగే అలవాటు లేదు. అయినా, అందరితో పాటు తనకి కాఫీ ఆఫర్ చెయ్యనందుకు కోపగిస్తాడు. తను కాఫీ త్రాగాలా వద్దా అనేది నిర్ణయించుకోవల్సింది అతడే గానీ మనం కాదు.

కేరళలో శబరిమలై అనేచోట అయ్యప్ప అనే దేవుడు వున్నాడు. నల్ల దుస్తుల్తో (సీనియర్లు కాషాయ దుస్తుల్తో) దీక్ష తీసుకుని దేవుణ్ణి దర్శించుకుంటారు. సంక్రాంతినాడు జ్యోతి కనబడుతుందిట గానీ - దాన్ని దేవస్థానం బోర్డు ఉద్యోగులే చాలా కష్టపడి వెలిగిస్తారని ప్రభుత్వమే వొప్పుకుంది. శబరిమల ఆలయంలోకి 10 నుండి 50 సంవత్సరాల ఆడవాళ్ళకి ప్రవేశం లేదుట. దీనిక్కారణం ఈ వయసు ఆడవాళ్ళు menstruate అవుతారు. 

ప్రజలు నమ్మకాల్నీ, భక్తినీ ప్రశ్నించడానికి సందేహిస్తారు. 'మనకెందుకులే' అనుకుని అలా ఫాలో అయిపోతూ వుంటారు. అయితే కాలం ఎల్లకాలం ఒకేలా వుండదు. ఏదోక రోజు నమ్మకాల్నీ, సాంప్రదాయతనీ ప్రశ్నించేవాళ్ళు బయల్దేరతారు. అంటు, మైల, ముట్టు - మొదలైన ముద్దుపేర్లతో menstrual bleed ని చీదరించుకునేవాళ్ళని చీదరించుకుంటూ కొందరు అమ్మాయిలు happy to bleed అనడం మొదలెట్టారు (పిదప కాలం, పిదప బుద్ధులు). 

'ఉరే భక్త స్వాములూ! మగ ఆడ sexual intercourse చేసుకున్న ఫలితంగా, గర్భాశయంలో తొమ్మిది నెలలు గడిపి, స్త్రీ జననాంగం ద్వారా మీరు బయటకొచ్చారు. మరప్పుడు మీ పుట్టుక అపవిత్రం కాదా?' అనడిగారు. అంతటితో వూరుకోకుండా - 'అయ్యప్పని దర్శించుకునే హక్కు menstruating women అయిన మాకూ వుంది' అంటూ ఎన్నాళ్ళనుండో వస్తున్న 'పవిత్రమైన' ఆనవాయితీని ప్రశ్నిస్తూ కోర్టుకెక్కారు (ఎంత అన్యాయం!).

కోర్టుక్కూడా న్యాయదేవత వుంది. కానీ ఆ దేవత చూడ్డానికి వీల్లేకుండా కళ్ళకి గుడ్డ కట్టేసి వుంటుంది. గౌరవనీయులైన కోర్టువారు చట్టాల దుమ్ము దులిపి నిశితంగా పరిశీలించారు. వాళ్లకి menstruating women కి వ్యతిరేకంగా యే ఆధారమూ కనబడక - 'bleeding women దేవుణ్ణి ఎందుకు చూడకూడదు?' అని తీవ్రంగా హాశ్చర్యపొయ్యారు. 'ట్రావన్కూరు దేవస్థానం వాళ్ళు రాజ్యాంగం కల్పించిన ప్రాధమిక హక్కుల ఉల్లంఘనకి పాల్పడుతున్నారా?' అంటూ కించిత్తు మధనపడుతూ సందేహాన్ని వ్యక్తం చేశారు. అంతిమ తీర్పు ఇంకా రావలసి వుంది. 

సమాజం నిశ్చలంగా వుండదు, నిరంతర మార్పు దాని గుణం. 'ఎందుకు?' అన్న ప్రశ్నకి నిలబడనిదేదైనా కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. 'ఎందుకు?' అన్న ప్రశ్నకి తావు లేని సమాజం నిస్సారమైనది, అనాగరికమైనది. అందుకే - 'ఎందుకు?' అన్న ప్రశ్న చాలా ప్రమాదకరమైనది కూడా! ఈ ప్రశ్న వినపడ్డప్పుడల్లా కొందరు గుండెలు బాదుకుంటూనే వున్నారు. ఆ గుండెలు బాదుకునే వాళ్ళు గుండె పగిలి చచ్చేలా సమాజం ముందుకు పురోగమిస్తూనే వుంది. ఇవ్వాళ శబరిమలైలో అగ్గిపుల్ల రాజుకుంది. ఈ అగ్గి పుల్లతోనే ఆరిపోదనీ, ఇది ఇంకెన్నో మంటల్ని రాజేస్తుందనీ ఆశిస్తున్నాను. 

(picture courtesy : Google)

Wednesday 13 January 2016

రిజర్వేషన్ - ప్రతిభ


నేను పుట్టిన కులానికి రిజర్వేషన్ లేదు. మెడిసిన్ సీట్ వచ్చాక కూడా నాకు కులాలపై సరైన అవగాహన లేదు. కొన్నాళ్ళకి - రిజర్వేషన్లు ప్రతిభని దిగజారుస్తున్నయ్యనీ, OC పేదవారికి అన్యాయం జరిగిపోతుందనీ నమ్మడం మొదలెట్టాను. ఆ తరవాత కొన్నాళ్ళకి రిజర్వేషన్లపై నాకున్న అభిప్రాయం తప్పని తెలుసుకున్నాను.

ఇదంతా ఒక పరిణామ క్రమం. యే విషయాన్నైనా అవగాహన చేసుకోడంలో ఒక్కొక్కళ్ళు ఒక్కోదశలో స్థిరపడిపోతారు. రిజర్వేషన్ల గూర్చి ఒకప్పటి నా అవగాహన ఆనాడు నాకున్న పరిమితుల్ని సూచిస్తుంది. నాకు రిజర్వేషన్ లేకపోవడం, సైన్స్ విద్యార్ధిని కావడం, రిజర్వేషన్ వల్ల వచ్చిన మెడికల్ సీటుతో చదువుకుంటున్న వారితో పెద్దగా స్నేహం లేకపోవడం నాకున్న పరిమితులు.

రిజర్వేషన్ ప్రతిభని గండి కొడుతుందనే వాదనలో పస లేదు. ఉదాహరణకి మెడిసిన్ సీటుకి కావలసిన కనీస అర్హత ఇంటర్మీడియేట్ బయాలజీ సబ్జక్టుల్తో పాసవ్వడం. కానీ మెడిసిన్ సీట్లు తక్కువ, అర్హులైన విద్యార్ధులు ఎక్కువ అవడం మూలాన మళ్ళీ EMCET అని ఇంకో పరీక్ష పెడుతున్నారు. ఇందుకోసం విద్యార్ధులు ఇంటర్ సబ్జక్టుల్నే మళ్ళీమళ్ళీ చదువుతారు. ఇంటర్మీడియేట్ సబ్జక్టుల జ్ఞానం (దీన్నే 'మెరిట్' అని కూడా అంటారు) సీటు వొచ్చేదాకాననే విషయం గుర్తుంచుకోవాలి.

వొక్కసారి మెడిసిన్ సీటొచ్చాక పూర్తిగా కొత్త సబ్జక్టులు మొదలవుతాయి, కొత్త కోర్సూ మొదలవుతుంది. MBBS సబ్జక్టులు పాసవడానికి ఎవరికీ ఎటువంటి రిజర్వేషనూ వుండదు. అందరికీ ఒకే పరీక్ష, ఒకే కొలబద్ద. కాబట్టి - సామాజికంగా వెనకబడిన విద్యార్ధులకి మెడికల్ కాలేజిలోకి ప్రవేశానికి మాత్రమే రిజర్వేషన్ ఉంటుందని, ఇంకే విధమైన రాయితీలు ఉండవని అర్ధం చేసుకోవాలి.

మన దేశ ఆరోగ్య వ్యవస్థలో ప్రభుత్వాల పాత్ర చాలా ప్రధానమైనది. ఇప్పటికీ గ్రామీణ పేదల అవసరాలు ప్రభుత్వాసుపత్రులే తీరుస్తాయి. ఈరోజుకీ టైఫాయిడ్, కలరా, మలేరియా, డయేరియాలే మన ప్రధాన శత్రువులు. ఈ రోగాలకి వైద్యం అందేది ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లోనే. మనం గమనించవలసినది - ఇక్కడ పన్జేసే వైద్యుల్లో ఎక్కువమంది రిజర్వేషన్ వల్ల డాక్టర్లైనవాళ్ళే.

'ప్రతిభ' ఉండి, రిజర్వేషన్ లేని డాక్టర్లు (ఎక్కువమంది) ఏం చేస్తారు? మెరుగైన వసతుల కోసం అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లకి వలస వెళ్ళిపోతారు. లేదా ప్రైవేట్ హాస్పిటల్స్ నిర్మిస్తారు. కారణం - వీళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్స్ లో పన్జేసే అవసరం వుండదు (వనరుల సమస్య వుండదు కనుక).

కొందరు వైద్యవిద్యకి గొప్ప బుర్ర కావాలని అనుకుంటారు. నాకిది అర్ధం కాదు. నేననుకోవడం మంచి డాక్టర్ కావాలంటే కావలసింది commitment. గొప్ప తెలివితేటలున్న మెరిట్ విద్యార్ధి PG సీటు కోసం లైబ్రరీల్లో శ్రమిస్తాడు. రిజర్వేషన్ విద్యార్ధులు వార్డుల్లో పేషంట్ల మధ్యన శ్రమిస్తారు. కారణం - వారు MBBS తో గ్రామీణ ప్రాంతాల్లో పన్జేయ్యడానికి మానసికంగా సిద్ధపడిపోయి వుంటారు కాబట్టి. MBBS సబ్జక్టుల్ని టెన్త్ క్లాసులాగా, ఇంటర్మీడియేట్ లాగా లైబ్రరీలలో చదవడం సరైన వైద్యవిద్య కాదు. వైద్యవిద్యకి రోగాల్నీ, పేషంట్లనీ అర్ధం చేసుకోడం ఎంతో అవసరం.

ఇలా అనేకమైన లోపాలతో, priorities తలక్రిందులుగా వున్న వైద్యవిద్య వల్ల రిజర్వేషన్ వున్నా, లేకున్నా committed doctors వచ్చే అవకాశం తగ్గించేసుకున్నాం. ఇవన్నీ లోపలకెళ్తే గానీ కనపడని లోపాలు. కాబట్టి రిజర్వేషన్ల వల్ల ప్రతిభ తగ్గిపోతుందన్నది పసలేని వాదనే అవుతుంది.

నాకు తెలుసు, ఇవన్నీ చాలా ప్రాధమిక పాయింట్లని. కానీ ఈ మాత్రం చెప్పేందుకు నా స్నేహితులు నాకెప్పుడూ అవకాశం ఇవ్వలేదు. ఒకళ్ళిద్దరు ఎగతాళి కూడా చేశారు. ఇది నా బ్లాగ్ కాబట్టి ఈ చిన్ని పాయింటుని ప్రశాంతంగా రాసుకున్నాను (బ్లాగ్రాతల వల్ల కలిగే ప్రయోజనాల్లో ఇది ముఖ్యమైనది)

ముగింపు -

"నాన్నా! ఈ రిజర్వేషన్లు చాలా దారుణం. BC, SC ల వల్ల మనం చాలా నష్టపోతున్నాం." నా కూతురి స్టేట్మెంట్!

"ముందు రిజర్వేషన్లు ఎలా వోచ్చాయో తెలుసుకో. మనకి స్వతంత్రం రాక ముందు.. " అని చెప్పబోతుండగా -

మొహం చిట్లించుకుంటూ నా కూతురు తన బెడ్రూములోకి వెళ్ళిపోయింది!

(picture courtesy : Google)