Tuesday 31 January 2012

నటనకి కులం ఉందా.. !?



టీవీలో  పాండురంగ మహత్యం  సినిమా  చూస్తున్నాను. ఘంటసాల  పాడిన 'అమ్మా  అని  అరచిన  ఆలకించవేమమ్మా.. ' పాట  వస్తుంది. ఘంటసాల  అద్భుత గానం. రామారావు  హృదయ విదారక  నటన. చూడ్డానికి  రెండు కళ్ళు  చాలవు. ఆనందంతో.. తన్మయత్వంతో.. మైమరచి  చూస్తుండగా..

"రవణ మామా! కాఫీ. అర్జంట్." అంటూ  సుడిగాలిలా  సుబ్బు  అడుగెట్టాడు.

"నీ  కాఫీదేముంది గానీ.. ఈ  పాట  చూడు  సుబ్బు. నీ  జన్మ  ధన్యమౌతుంది." అన్నాను.

సుబ్బూ  కూడా  సినిమా  చూస్తూ  కూర్చున్నాడు. పాట  అయిపోయింది.

"రామారావు  తెలుగువాడిగా  పుట్టటం  మన  అదృష్టం. ఆయన  దురదృష్టం." ఎప్పుడో, ఎక్కడో  ఎవరి గూర్చో  ఎవరో  అనంగా  చదివాను. ఈ  భారీ డైలాగ్  నాకు  బాగా  నచ్చింది. అందుకే.. ఇదిగో  ఇప్పుడు  రామారావు  కోసం  వాడి పడేశాను!

"తెలుగులో  అక్షరాలు  ఎక్కువ. వాచాలత్వం, వాగాడంబరం  కూడా  ఎక్కువే. రామారావు  తెలుగువాడవడం  మనకి  అదృష్టం  అనేది  అర్ధమైంది. కానీ ఆయనకి  దురదృష్టం ఎందుకో  అర్ధం  కాలేదు."

అమ్మయ్య! ఇన్నాళ్ళకి  సుబ్బుకి  క్లాస్  పీకే  అవకాశం  వచ్చింది.

"ఒరే నాయనా! నీకు  అరటిపండు  ఒలిచి  చేతిలో  పెడితే గానీ  అర్ధమయ్యి  చావదు. మళ్ళీ  అన్నిట్లో  నోరేస్తావ్. రామారావు  ఏ  అమెరికాలోనో  పుడితే  అంతర్జాతీయ  స్థాయి  నటుడయ్యేవాడు. గ్రెగరి పెక్, మార్లన్ బ్రాండో, రాబర్ట్ డి నీరో  పంక్తిలో  ఉండేవాడు. కేవలం  తెలుగువాడవటం  చేత  ఆయన  కీర్తి  తెలుగు దేశానికే  పరిమితమయ్యింది."

మా  సుబ్బు  ఒక  క్షణం  ఆలోచించాడు.

"రవణ మావా! ఈ  ప్రపంచం  ఒక  ఏక్సిడెంట్ల  కూపం. అందులో మనిషి జన్మ  ఒక  పెద్ద ఏక్సిడెంట్. ఈ  ఏక్సిడెంట్లు  కొందరికి  లాభం. కొంతమందికి  నష్టం. చాలామందికి  శాపం. ఏ  అంబాని  కుటుంబంలోనో, గాంధీ  వంశంలోనో  పుట్టటం  జాక్ పాట్. మన  దేశంలో  మనం  పుట్టిన  ప్రదేశం, కులం, జెండర్  మనిషి  భవిష్యత్తుని  చాలామటుకు  నిర్ణయించేస్తాయి. ఉదాహరణగా  నువ్విప్పుడు  ఆకాశానికెత్తేస్తున్న  ఎన్టీరామారావునే  తీసుకుందాం. తెలుగు  సినీ పరిశ్రమ  ఆ  రోజుల్లో  కేవలం  రెండు జిల్లాలకే  పరిమితమై.. ఒక కులం  ఆధిపత్యంలో  నడుస్తుండేది. ఆ రోజుల్లో  తెలుగు సినిమా  అగ్ర హీరోలందరూ  ఆ  ప్రాంతానికి, ఆ  కులానికి  చెందినవారై  ఉండటం  కాకతాళీయం  కాదు. చాలా  పద్ధతిగా  అమలు  పరచబడ్డ  మాస్టర్ ప్లాన్. ఆ  రోజుల్లో, ఆ  ప్రాంతంలో, ఆ కులంలో  హీరోకి  కావలసిన  అన్ని  అర్హతలతో   రెడీగా.. ఎవైలబుల్ గా  ఉండటం  ఎన్టీఆర్ కి  కలిసొచ్చింది. ఎ  సింపుల్  కేస్  ఆఫ్  రైట్  ప్లేస్  ఎట్  రైట్  టైం! మరప్పుడు  ఎన్టీఆర్  అదృష్టవంతుడు  అవుతాడు గానీ  దురదృష్టవంతుడు  ఎలా  అవుతాడు?"

ఇంతలో  పొగలు గక్కుతూ  కాఫీ  వచ్చింది.

"రామారావు  ఒక  అద్భుత నటుడు. ఆ  విషయాన్ని  నేను  అస్సలు  కంటెస్ట్  చెయ్యట్లేదు. ఒక  ప్రతిభాశాలి  పాపులర్  నటుడవడానికి  సహకరించిన  సామాజిక, ఆర్ధిక, రాజకీయ  కోణం  గూర్చి  మాత్రమే  మాట్లాడుతున్నాను. రామారావు  ఆ  ప్రాంతంలో, ఆ  కులంలో  పుట్టకపోయినట్లయితే.. ఇంతకి  వంద రెట్లు  ప్రతిభావంతుడైనప్పటికీ.. మనం  ఎప్పటికీ  ఎన్టీరామారావు  పేరు  వినేవాళ్ళం  కాదు. ఇంత  చిన్న  లెక్క  తేలకుండా.. రామారావుని  ఇంగ్లీషోడిగా, ఫ్రెంచోడిగా ఊహించుకుని  ఎట్లా  మాట్లాడగలవ్?"

"ఓరే  సుబ్బు! నీ  బుర్ర  రోజురోజుకీ  ఇరుగ్గా  తయారవుతున్నట్లుంది!" చికాగ్గా  అన్నాను.

"రవణ మావా! నేను  చెప్పేది  నీకర్ధమవుతున్నట్లు లేదు. ఇప్పుడు  నేను  నీకు  అరటి పండు  వలిచి  నోట్లో  పెడతాను. రామారావు  తను  పుట్టిన  నిమ్మకూరు  గ్రామంలోనే  ఒక  పుజారి గారింట్లో  పుడితే  అర్చకత్వం  చేసుకునేవాడు. లేదా  ఓ  చిన్న ప్రభుత్వ ఉద్యోగం  చేసుకుంటూ  ప్రశాంత జీవనం  కొనసాగించేవాడు. పక్కనున్న కుమ్మరి బజారులో  పుడితే  కుండలు  చేసుకుంటూ  రెక్కలు  ముక్కలు  చేసుకునేవాడు. ఏ  శివరాత్రికో, శ్రీరామనవమికో నాలుగు  నాటకాలు  వేసుకుని  కళాతృష్ణ  తీర్చుకునేవాడు. ఈ  రామారావునే  ఊరి  బయట  పల్లెలోకి  పంపిద్దాం. జీవితమంతా  చెప్పులు  కుట్టుకుంటూ  బ్రతికేసేవాడు. కనీసం  తిరనాళ్ళప్పుడు  కూడా  వేషం  దొరికేది  కాదు. ఇప్పుడు  చెప్పు. రామారావు  దురదృష్టమేంటో!"

"సుబ్బు! చాలా  దారుణంగా  మాట్లాడుతున్నావ్."

"ఇందులో  దారుణం  ఏముంది? మన  సమాజం  అనేక  సామాజిక వర్గాల  కలయికతో  ఏర్పడ్డ  ఒక  పటిష్ట వ్యవస్థ. ఈ  వ్యవస్థ  నాగార్జునా  సిమెంట్  కన్నా  దృఢమైనది! ఒక్కో  సామాజిక వర్గం  ఒక్కో  రంగంలో  పట్టు  సాధిస్తుంది. ఏ  రంగంలోనూ  'అందరికీ  సమానావకాశాలు'  అనేది  బూతద్దంతో  గాలించినా  కనబడదు. కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు  ఒకే  కులానికి  చెందినవాళ్ళై  ఉండటం.. చిన్న వ్యాపారస్తులంతా  ఇంకో కులానికి  చెందినవాళ్ళై  ఉండటం  కాకతాళీయం  కాదు. మనం  అయా  సామాజిక వర్గాలలో  పుట్టటం  మాత్రం  ఏక్సిడెంట్."

"సుబ్బు! నువ్వు  ఒక  గొప్ప నటుణ్ణి  కించపరుస్తున్నావ్."

"రామారావు  అంటే  నీకు  ఇష్టం  మాత్రమే. నాకు  వెర్రి అభిమానం. ఆ  మహానుభావుణ్ణి  కించ పరిచేంతటి  అధముణ్ణి  కాదు. నా  పాయింటల్లా  మన  సమాజ పరిమితుల  వల్ల  ఇంకో  పది మంది  రామారావుల్ని  మిస్  అయిపొయ్యామని. అంతే! 'మనుషులంతా ఒక్కటే. కులరహిత సమాజం.' లాంటి  టీవీ  నైన్  రవిప్రకాష్  బ్రాండ్  స్లోగన్స్  వినటానికి  బాగానే  ఉంటాయి. అదే  నిజమయినట్లయితే  ఒక  గిరిజనుడు  రాసిన  కథకి, బిసీ  కులస్థుడు  పాటలు  రాస్తే, దళితుడు  హీరోగా, బ్రాహ్మణుడు  నిర్మాతగా  కొన్ని  సినిమాలు  రావాలి. అలా ఏదైనా  సినిమా  వచ్చిందా? నాకైతే  తెలీదు. నీకు  తెలిస్తే  చెప్పు." అంటూ  ఖాళీ  కప్పు  టేబుల్  మీద  పెడుతూ   టైం  చూసుకున్నాడు.

"నాకు  బ్యాంక్  పనుంది. వెళ్ళాలి." అంటూ  హడావుడిగా  నిష్క్రమించాడు  సుబ్బు.

హమ్మయ్య! వర్షం  వెలిసినట్లయింది.

టీవీలో 'జయకృష్ణా ముకుందా మురారి.. ' అంటూ  ఘంటసాల  ఆలాపన  మొదలైంది. తన్మయత్వంతో  కళ్ళు  మూసుకున్నాను.

Monday 23 January 2012

అప్పారావు అసలు రహస్యం

అప్పారావు ఎర్రగా వుంటాడు, పొడుగ్గా వుంటాడు. స్వభావం మృదువుగానూ, మనస్తత్వం సుతిమెత్తగానూ వుంటుంది. మంచితనానికి బట్టలేస్తే అది అచ్చు అప్పారావులానే వుంటుంది. అప్పారావు మంచి సంగీతం కోసం చెవి కోసుకుంటాడు. మంచి పుస్తకం కోసం ముక్కూచెవులు కూడా కోసేసుకుంటాడు.

అప్పారావు అమాయకుడు కూడా. ఆందుకే - భార్య అంటే జీవిత భాగస్వామి అనీ, మంచిచెడ్డలు పంచుకునే అర్ధభాగమని నమ్మాడు. పాపం! ఇలా ఎన్నో ఆశలతో, ఆశయాలతో ఉత్సాహంగా పెళ్లి చేసుకున్నాడు. భార్య కొద్దిగా బొద్దుగా వుంటుంది, తన అభిమాన నటి సావిత్రిలా ఉందని మురిసిపొయ్యాడు.

తన దగ్గరున్న అరుదైన పుస్తకాలు, పాటల సీడీల కలెక్షన్ అపురూపంగా భార్యకి చూపించాడు. ఒక వ్యక్తి జీవితాన్ని సంగీత సాహిత్యాలు ఎలా ప్రభావితం చేస్తాయఓ వివరించాడు. మొదట్లో అప్పారావు భార్యకి అప్పారావు ధోరణి కొత్తగా, విచిత్రంగా అనిపించింది.

అప్పారావు భార్య తన పుట్టింట్లో ఎప్పుడూ పుస్తకాలు, సీడీలు చూసి ఉండలేదు. తండ్రి రెవిన్యూ ఉద్యోగి, డబ్బు సంపాదనే ధ్యేయంగా పన్జేస్తాడు. తల్లీతండ్రీ పొద్దస్తమానం నగలేం చేయించాలి? పొలాలు, స్థలాలు ఎక్కడ ఎంత కొనాలి? అని చర్చించుకుంటారు మనిషులు దొరికిన అన్ని అవకాశాలని వాడుకుంటూ ఎలాగైనా డబ్బు సంపాదించాలని, మన జీవితాలల్ని డబ్బు తప్ప ఇంకేదీ శాసించలేదనీ ఆవిద పుట్టింటివారి నమ్మకం. ఆ ఫిలాసఫీని పూర్తిగా నమ్మిన అప్పారావు భార్యకి అప్పారావు ధోరణి అర్ధం కాలేదు.

క్రమేణా కొంతకాలానికి అప్పారావు భార్యకి అప్పారావు మనస్తత్వం అర్ధమైంది. ఈ అప్పారావుకి డబ్బు సంపాదన పట్ల ఆసక్తి లేదు. మనిషి బ్రతకడానికి మాత్రమే డబ్బు కావాలి గానీ, దాచుకోడానికి డబ్బు అవసరం లేదని అప్పారావు అభిప్రాయం. అంచేత అతనికి జీతానికి మించి ఒక్క పైసా కూడా రాదు.

కాఫీ తాగుతూ అప్పారావు చెప్పే సంగీత సాహిత్య సంగతులు ఆమెకి చిరాగ్గా అనిపించసాగాయి. మొహం చిట్లించడంతో మొదలైన అసంతృప్తి ప్రకటన - విసుక్కోడంలోకి మారి ఆ తరవాత తిట్లలోకి మారిపోయింది. అప్పారావు ఒట్టి వాజమ్మనీ, బ్రతకటం చేతకాని దద్దమ్మనీ భార్య గట్టిగా నమ్మింది.

అప్పారావు నిరాశగా, నిర్లిప్తంగా మారిపోయ్యాడు. సావిత్రిలా కనబడే భార్య అసలు రూపం సూర్యకాంతమని గ్రహించిన అప్పారావు కృంగిపోయాడు, నిద్ర కరువైంది, ఆకలి మర్చిపోయ్యాడు. సహజంగానే బరువు తగ్గిపోయ్యాడు. శూన్యదృక్కులతో ఏదో ఆలోచిస్తూ కూర్చుండిపొయ్యేవాడు. రోజురోజుకీ అప్పారావుకి భార్య వేధింపులు ఎక్కువైపొయ్యాయి. అప్పారావు బాధ పడుతున్న కొద్దీ భార్యకి హాయిగా అనిపించసాగింది.

అప్పారావుకి ఏం చెయ్యాలో బోధపడలేదు. ఇంక తన భార్యతో కలిసి బ్రతకడం అసంభవమని తెలిసిపోయింది. కాఫీ తాగుతూ తీవ్రంగా ఆలోంచాడు. లాభం లేదు, నేను ఆత్మహత్య చేసుకుని చావడమే ఈ సమస్యకి పరిష్కారం! అని నిర్ణయించేసుకున్నాడు.

అత్మహత్య ఎలా చేసుకోవాలి? పుణ్యస్థలంలో పోతే పుణ్యానికి పుణ్యం, చావుకి చావు అని ఆలోచించి ఆత్మహత్య కోసం శ్రీశైలం యెంచుకున్నాడు. మల్లిఖార్జున స్వామిని దర్శనం చేసుకున్నాడు. దూకడానికి అనువుగానున్న ఒక ఎత్తైన కొండనెక్కాడు. మనసంతా దిగులుగా వుంది. అడవిప్రాంతం కావున ఎవ్వరూ వినే అవకాశం లేదు. మన్సులో మాట ప్రార్ధన రూపంగా బయటకనేశాడు.

'దేవుడా! నువ్వు నాకీ జన్మలో అన్యాయం చేశావ్! ఐ డోంట్ మైండ్. అయిపోయ్యేదేదో అయిపోయింది, ఇంక నువ్వూ నేనూ చేసేదేం లేదు. కనీసం వచ్చే జన్మలోనైనా సావిత్రిలాంటి భార్య వచ్చేట్లు చెయ్యి, లేదా అసలు పెళ్ళే కాకుండా చెయ్యి. ధన్యవాద్, అయాం లీవింగ్ దిస్ వాళ్!' అని ప్రార్ధించి గుండెల్నిండా గాలిపీల్చి దూకబోతుండగా -

"ఆత్మహత్య మహాపాపం నాయనా!" అని మత్తుగా, మెత్తగా ఒకగొంతు వినబడింది.

ఆశ్చర్యపొయ్యాడు అప్పారావు. వెనక్కి తిరిగి చూస్తే గంజాయి తాగుతూ ఒక కులాసా సాధువు! అప్పారావు ఏదో చెప్పబోతుండగా సాధువు వారించాడు.

"దివ్యశక్తితో సర్వం గ్రహించాను నాయనా! నువ్విప్పుడు చచ్చినా ప్రయోజనం లేదు, యెందుకంటే వచ్చే జన్మలో కూడా నీకు ఈ జన్మ భార్యే రిజర్వ్ అయ్యుంది కాబట్టి!"

"నహీ, ఐసా కభీ న హో సక్తా!" అంటూ అరిచాడు అప్పారావు.

"నువ్వే భాషలో అరిచినా రిజల్ట్ మాత్రం అదే. నీక్కావల్సింది సమస్యకి పరిష్కార, అంతే కదా? కమ్ నియర్." అని అప్పారావుని దగ్గరకి రమ్మని చెవిలో యేదో చెప్ప్పాడు.

"యువార్ గ్రేట్ స్వామీ! పాదపూజకి లక్షలు వసూలు చేస్తున్న స్వామీజీల కాలంలో మీరు ఫ్రీ ఎడ్వైజ్ ఇవ్వడం రియల్లీ గ్రేట్!" అంటూ మెచ్చుకున్నాడు అప్పారావు.

"నాది ఫ్రీ ఎడ్వైజ్ కాదు నాయనా! గంజాయి రేటు రోజురోజుకీ పెరిగిపోతుంది, గిమ్మీ సమ్ మనీ!" అన్నాడు సాధువు.

"ష్యూర్! ఇట్స్ మై ప్లెజర్!" అని సాధుపుంగవులకి ఫీజు సమర్పించుకుని, కాళ్ళకి మొక్కి సెలవు తీసుకున్నాడు అప్పారావు.

ఆరోజు నుండి అప్పారావు జీవితం మారిపోయింది. భార్య తిట్లకి చిరునవ్వే సమాధానం. అతని మొహంలో ఒక దివ్యతేజస్సు! హాయిగా సంగీతం వింటున్నాడు, ప్రశాంతంగా పుస్తకాలు చదువుకుంటున్నాడు. అప్పారావులోని ఈ అనూహ్య మార్పుకి భార్య ఆశ్చర్యపోయింది, తదుపరి అసంతృప్తితో రగిలిపోయింది. తన తిట్లు వృధా అయిపోవడం ఆమె తట్టుకోలేకపోయింది.

అయితే - అప్పారావు అరగంటకోసారి బాత్రూంలోకి దూరి తలుపులేసుకుంటున్నాడు, ఐదునిమిషాల తరవాత బయటకొస్తున్నాడు. భార్య ఆశ్చర్యపొయ్యింది. కొద్దిసేపు ఆలోచించి - 'పోన్లే! అతిగా పుస్తకాలు చదివాడు, అతిమూత్రవ్యాధి పట్టుకున్నట్లుంది.' అనుకుంది. కానీ - బాత్రూం లోపలకెళ్ళేప్పుడు అశాంతిగా, బయటకి వచ్చేప్పుడు ప్రశాంతంగా ఉండటం గమనించింది. ఏం చేస్తున్నాడు లోపల? ఇందులో ఏదో రహస్యం ఉంది. ఏమై వుంటుందబ్బా! జీవితంలో మొదటిసారి ఆమె తీవ్రంగా ఆలోచించింది. ఇక సస్పెన్స్ తట్టుకోలేకపోయింది. ఒకరోజు నిచ్చెనేసుకుని వెంటిలేటర్ లోంచి బాత్రూంలోకి తొంగి చూసింది.

అప్పారావు అప్పుడే హడావుడిగా బాత్రూం లోపలకొచ్చి బోల్ట్ పెట్టుకున్నాడు. గుండెలనిండా గాలి పీల్చుకున్నాడు. రెండుచేతులు జోడించి దణ్ణం పెట్టుకుని కళ్ళు మూసుకున్నాడు. మంత్రాలు జపిస్తున్నట్లు మాట్లాడ్డం ప్రారంభించాడు.

"నాకింకా పెళ్ళి కాలేదు, కానే కాలేదు. నేనింకా బ్రహ్మచారినే. బ్ర.. హ్మ.. చా.. రి.. ని! నాక్కనపడేదంతా భ్రాంతి! మాయ! పీడకల! ఇప్పుడు భార్య రూపంలో నాకు కనిపిస్తున్నవ్యక్తి మనిషి కాదు, మనిషే కాదు. ఒక పిశాచి! శాకిని! ఢాకిని! ఇదినిజం, ఇదినిజం, ఇదినిజం. శ్రీశ్రీశ్రీ గంజాయిస్వామీ మహారాజ్‌కి జై!"

ఇదీ - అప్పారావు అసలు రహస్యం!            

Saturday 21 January 2012

జగన్.. జైలు.. 'చెక్'.. !


ఆంధ్రజ్యోతి  న్యూస్ పేపర్  తాపీగా  తిరగేస్తున్నాను. చలికాలం  కావున  ఉదయం  పేషంట్ల  తాకిడి  ఉండదు. పేపర్  అంతా  జగన్మోహనరెడ్డి  వార్తలే! నాకు  ఆంధ్రజ్యోతి వారి క్రియేటివిటీ  నచ్చుతుంది. రోజూ ఒకే  వ్యక్తి  గూర్చి  వ్యతిరేక వార్తలు  వండి వార్చాలంటే  ఎంత  కష్టం! తెలుగు జాతి  తరఫున.. అవినీతికి  వ్యతిరేకంగా  అహోరాత్రులు  శ్రమిస్తూ.. ఉత్తమ  జర్నలిస్టిక్ విలువల్ని  తన  వలువల  కన్నా  ప్రాణప్రదంగా   కాపాడుకుంటున్న ఆంధ్రజ్యోతి వారిని  చూస్తే  నాకు  ఆనందభాష్పాలు  ఆగవు!

"రవణ మావా! కాఫీ. అర్జంట్." సుడిగాలిలా  లోపలకొచ్చాడు  సుబ్బు.

"సుబ్బు! జగన్  జైలుకెళతాడా? లేదా? సమాధానం  తెలిసి  కూడా  చెప్పలేకపొయ్యావో.. నీ  తల  వెయ్యి చెక్కలగు గాక!" నవ్వుతూ  అన్నాను.

ఒక్క  క్షణం  ఆలోచించాడు  సుబ్బు. "నా  లెక్క  కరక్టయితే  జగన్  జైలు కెళ్ళడు."

"పేపర్లంతా  కోడై  కూస్తుంటే  నువ్వు  కాదంటావేమిటి!"




"కోడై  కూసినా, కుక్కై  కరిచినా  అంతే. అలనాడు  చంద్రబాబు  దెబ్బకి  గింగరాలు  తిరుగుతున్న కాంగ్రెస్  గతి  లేని  పరిస్థితుల్లో  రాజశేఖరునికి  ఫ్రీ హ్యాండ్  ఇచ్చింది. దాని  ఫలితం  వాళ్ళకి  త్వరలోనే  తెలిసిపోయింది. ఈ  లోపు  ఢిల్లీలో  కాంగ్రెస్ వారి  ఇల్లు  చక్కబడింది. ఇప్పుడు  కడప యువరాజుకి  పట్టాభిషేకం  చెయ్యాల్సిన  దుస్థితి  కాంగ్రెసుకి  లేదు. జగన్  ముఖ్యమంత్రి  పీఠం  కావాలన్నాడు. ఢిల్లీ బాసులు  'ఆ  ఒక్కటి అడక్కు!' అన్నారు. అప్పట్నుండి  ఎవరిది  పైచెయ్యో  తేల్చుకోటానికి  వీరిద్దరి  మధ్య  ఒక  ఆట  మొదలైంది. చదరంగం  ఆట  నీకు  తెలుసుగా. గెలిచిన వాడికి  ఒక  పాయింట్. డ్రా  అయితే  చెరో  హాఫ్ పాయింట్. మనం  గమనించాల్సింది  ఇక్కడ  ఇరు పక్షాలు  డ్రా  కోసం  ఆడుతున్నాయ్."

ఇంతలో  పొగలు గక్కుతూ  కాఫీ  వచ్చింది. కాఫీ  సిప్  చేస్తూ  చెప్పసాగాడు  సుబ్బు.



"జగన్ కి  'చెక్'  చెప్పేసి  జైలుకి  పంపడం  కాంగ్రెస్ పార్టీకి  క్షణంలో  పని. కానీ  రాజకీయాల్లో  'ప్లే ఫర్ ద ఫినిష్'  అస్సలు  పనికిరాదు. జగన్ని  జైలుకి  పంపితే  రాబోయే  ఎలక్షన్లలో  ముక్కోణపు  పోటీ  తప్పదు. అప్పుడు  కాంగ్రెస్  చావుదెబ్బ తింటుంది. అందుకని  జగన్ తో  ఆట  ఆడుతూనే  ఉంటుంది. గెలిచే  అవకాశం  ఉన్నా  గెలవదు. ప్రస్తుత  పరిస్థితుల్లో  ఓడిపోకుండా  చెస్  ఆడుతూ, నిలబడడం  జగన్ కి  చాలా  ముఖ్యం. ఆటలో  లాభనష్టాల  బేరీజు  ఇరుపక్షాలా  జరుగుతుంటుంది. అది  మనకి  కనపడని  సైడ్ షో! ఎవరికెన్ని  బలగాలు  చచ్చాయి? ఎంత  బలం  మిగిలింది? అనే  లెక్కల  మీద  ఆధారపడి  ఆట  కంటిన్యూ  అవుతుంటుంది."

"కానీ  ఈ  గెలుపోటములు  లేని  ఆట వల్ల  ప్రయోజనం?"




"రాజకీయాల్లో  పైచేయి  సాధించడమే  గెలుపు. ఏదీ  వెండిపళ్ళెంలో  సర్వ్  చెయ్యరు  నాయనా! నీ  దమ్ము, అర్హత  నిరూపించుకోవాలి. అప్పుడే  నువ్వు  రాజకీయంగా  బేరసారాలు  చెయ్యగల  డ్రైవర్  సీట్లో  కూర్చోగలవు. అప్పుడే  నువ్వు  చెప్పిన  మాటకి  విలువ. రాహుల్ గాంధీ  యూపీలో  తిప్పలు  పడేది  అందుకేగా!"

"అవుననుకో! కానీ  జగన్  దారులు  మూసుకుపోతున్నాయి గదా!"




"దారులదేముంది  బ్రదర్. టెన్ జన్ పథ్  దారి  తెరుచుకుంటే  మళ్ళీ  అన్ని  దారులు  అవే  తెరుచుకుంటయ్. రాజకీయుల  చెస్  ఆటలో 'డ్రా' చర్చలు రహస్యంగా  జరుగుతాయ్. ఆపై  ప్రజల్ని  మభ్య పెట్టటానికి  ఉత్తుత్తి  ఆట  కొంతకాలం  ఆడతారు. మనం  గుర్తుంచుకోవలసింది.. కాంగ్రెస్ గానీ, బీజేపీ గానీ  అవినీతిపరులకి  వ్యతిరేకం  కాదు. కాకపోతే  ఈ  సామంతరాజులు  ఢిల్లీకి  లొంగి  ఉండాలి. రావిశాస్త్రి  'మూడు కథల బంగారం'లో  సూర్రావెడ్డు  చెప్పేది  ఇదే గదా! దొంగలు  దొంగతనాలు  చెయ్యాలి. కానీ  పొలీస్  డిపార్ట్ మెంట్ కి  లొంగి  ఉండాలి. డిపార్ట్ మెంట్ కి  ఎదురు  తిరిగితే  పోలీస్  పవర్  రుచి  చూడాల్సి ఉంటుంది."

"మరి  గాలిని  లోపలేశారెందుకు?"




"ఇనప ఖనిజాన్ని  అక్రమంగా తవ్వీ  తవ్వీ  గాలి  బుర్రకి  తుప్పు  పట్టింది. జాతీయ పార్టీలకి  గాలి  లాంటివాడు  ఫండ్స్  కోసం  చాలా  అవసరం. బుద్ధిగా  ఖనిజాన్ని  తవ్వుకునో, భూములు  కబ్జా  చేసో  బాగా  డబ్బు  చెయ్యి. ఫెయిర్ షేర్  హై కమాండ్ కి  పంపు. హాయిగా  రాజకీయ భోగాన్ని  కూడా  అనుభవించు. అట్లా  అనుభవించమనే గదా  జాతీయ పార్టీలు  కూడా  చెబుతుంట! ఇంత  సింపుల్  విషయం  అర్ధం  చేసుకొలేని  గాలి, సుడిగాలిగా  మారదామని  ప్రయత్నించి.. పిల్లగాలయిపొయ్యాడు. అర్ధం  చేసుకున్న  మన  కెవిపి  సైలెంట్  అయిపొయ్యాడు. చెస్ లో  నువ్వొక  ఎత్తు  వేసి  ఎదుటివాడి  మూవ్  గూర్చి  ఆలోచించాలి. ఎదుటి  ఆటగాడి  ఆట  కట్టించటం  కోసం  వల  పన్నాలి. ఆ  పన్నాగం  పారకపోతే.. ప్లాన్  బి, ప్లాన్  సి.. ఆల్టర్నేట్  వ్యూహాలుండాలి. చాలా  మెటిక్యులస్  ప్లానింగ్  ఉండాలి. గాలికి  ఆట  ఆడటం  తెలీదు. తొందర  పడ్డాడు. బీజెపిని  పూర్తిగా  ఓడించి  ఒక  పాయింట్  సొంతం  చేసుకుందామనుకున్నాడు. పాపం  బీజేపికి  కూడా  ఆట  ముగించడం  తప్ప  వేరే  మార్గం  లేకుండా  అన్ని  మార్గాలు  మూసేశాడు. అందుకనే  బిజెపి  గాలిని  ఓడించింది."

"అంటే  జగన్  గాలి లాగా  బుర్ర  తక్కువ  ఆట  ఆడడంటావ్?"




"అనే  అనుకుంటున్నాను. గాలి  లాంటి  ఆట  ఆడితే  జగన్  కూడా  ఫలితం  అనుభవించాల్సిందే. తప్పదు. ఆట  ఓడిపోయే  పరిస్థితే  వస్తే  ఎప్పటికయినా డ్రా  ప్రపోజ్  చేసే  ఆప్షన్  జగన్ ఉంచుకోవాలి. కానీ  ఓపిగ్గా  గేమ్  కంటిన్యూ  చేస్తుండాలి. రాబందుకున్నంత  సహనం  ముఖ్యం. గద్ద లాగా  అవకాశాల్ని  తన్నుకుపోవాలి. పక్షులకున్నంత  బుర్ర  కూడా  లేని  చిరంజీవి  ఆట  మధ్యలో  లేచి  వెళ్ళి  పోయాడు. ఇప్పుడు  జగన్  చూపించే  మెళకువలు  కాంగ్రెస్  నిశితంగా  పరిశీలిస్తుంటుంది. జగన్  మగధీరలో  హీరోలా  యుద్ద్హనీతిలో  వీరోచితుడయినట్లయితే  కాంగ్రెస్  వెంటనే  డ్రా  ప్రపోజ్  చేస్తుంది. రాబోయే  ఎన్నికల్లో  జగన్  కాంగ్రెస్ కి  అవసరం. జగన్ కి  కాంగ్రెస్  అవసరం."

"ఆశ్చర్యంగా  ఉంది  సుబ్బు!"

"నువ్వు  కె.వి.రెడ్డి  తీసిన  కృష్ణార్జున యుద్ధం  సినిమా  చూశావు గదా. అందులో  కృష్ణుడు  అర్జునుడితో  యుద్ధం  చేస్తాడు. అర్జునుడి  పౌరుషాన్ని, ప్రతాపాన్ని  పరీక్షిస్తాడు. రాబోయే  కురుక్షేత్ర సంగ్రామంలో  అర్జునుడి  కేలిబర్  ఏంటో  టెస్ట్  చేస్తాడు. అర్జునుడు  ఏమాత్రం  తగ్గడు. శ్రీకృష్ణుడు  సంతోషించి.. 'వెరీ గుడ్'  అంటూ  కౌగిలించుకుంటాడు."

"ఇంతకీ  జగన్  జైలుకెళ్ళడంటావు?"

"జగన్  గాలి లాంటి  ఫూల్  అనుకోను. ఆ  పరిస్థితే  వస్తే  ఢిల్లీ  కాంగ్రెస్ తో  సంధి  చేసుకుంటాడు. చేసుకోవాలి. కాంగ్రెస్  కూడా  సిబీఐ  అనే  పేరు గల  మంత్రిని  చెస్  బోర్డ్  మీద  విచ్చలవిడిగా, భీతి  గొలిపేలా  ఎక్రాస్  ద  బోర్డ్  మూవ్  చేస్తూ  రాజగోపాల్, శ్రీలక్ష్మి, విజయసాయిరెడ్డి  అనే  ఏనుగుల్నీ, శకటుల్నీ  చంపేస్తుంటుంది. జగన్  కాజిల్ని ధ్వంసం  చేసేస్తుంది. చూశావా! ఏ  క్షణాన్నయినా  నీకు  'చెక్'  చెప్పి  ఆట  కట్టించేయగలమనే  బెదిరింపు  సంకేతాల్ని  ఇస్తుంటుంది. ఇదొక  సైకలాజికల్  వార్. ప్రస్తుతం  ఇరు వైపులా  ఆటగాళ్ళు  తమ  తరవాత   స్టెప్  గూర్చి  ఆలోచించుకుంటు్న్నారు. ఇది  అధికారం  కోసం  ఆడే  రాజకీయ  చదరంగం." అంటూ  ఖాళీ  కప్పు  టేబుల్  మీద  పెట్టాడు.

"మరి  మనం?"




"ఏదో  ఆట  జరిగిపోతుందని  ఫలితం  కోసం  ఆసక్తిగా ఎదురు  చూసే  వెర్రిబాగుల  జనాలం. సరదాగా  జరిగే  కుస్తీ పోటీలని  నిజమని  భ్రమింపజేసే  రన్నింగ్  కామెంటరీ  ఆంధ్రజ్యోతి  రాధాక్రిష్ణ లాంటి వాళ్ళు  ఇస్తుంటారు. ఈ  కామెంటరీ.. జరుగుతున్న  ప్రాక్సీ వార్ కి  శోభనిస్తుంది. అందుకోసం  రోజువారీ  వార్తలు  వండి  వడ్డిస్తుంటారు. ఇందులో  వారి  స్వప్రయోజనాలు  కూడా   ఇమిడి  ఉంటయ్." అంటూ  టైం  చూసుకున్నాడు  సుబ్బు.

"నేవెళ్ళాలి. అమ్మని  హోమియోపతి  డాక్టరు  దగ్గరకి  తీసికెళ్ళాలి" అంటూ  హడావుడిగా  నిష్క్రమించాడు  సుబ్బు. 

Tuesday 17 January 2012

కథల్ని వండడం ఎలా?

"నాన్నోయ్! ఆకలి, నూడిల్స్, అర్జంట్." మా అబ్బాయి బుడుగు ఆర్తనాదం! న్యూస్‌పేపర్ చదువుతూ ప్రపంచ రాజకీయాల్ని తీవ్రంగా ఆలోచిస్తున్న నేను ఉలిక్కిపడ్డా. 

మావాడికి గుండెపోటులాగా 'ఆకలిపోటు' అనే రోగం వుంది, హఠాత్తుగా ఆకలి కేకలు వినిపిస్తాడు. నా భార్య ఇంట్లో లేదు, వంటావిడ ఇంకా రాలేదు. 'ఖర్మరా బాబు' అని సణుక్కుంటూ నూడిల్స్‌గా పిలవబడుతున్న వానపాముల్ని పోలిన పదార్ధ తయారీ కార్యక్రమం మొదలెట్టాను.

నాకు రెండే రకాల వంటకాలు వచ్చు. ఒకటి నూడిల్స్, రెండు ఆమ్లెట్. 'క్రీస్తుపూర్వం నుండి వంటకాలు రుచి చూస్తున్నాను, మరి ఇంతకాలం వంటెందుకు నేర్చుకోలేకపొయ్యానబ్బా!' ఆలోచనలో పడ్డా. వెంటనే అనుబంధ ప్రశ్న. 'అనేకరకాల రచనలు చదుతున్నాను గదా, మరి నేను రచయితని ఎందుకు కాలేకపోయ్యాను?' ఇదేదో తీవ్రంగా యోచించవలసియున్నది. 

కథలు రాయాలంటే, ముందుగా మంచికథలు పుంజీలకొద్దీ చదివి, ఒక లోతైన అవగాహనతో రాయాలని పెద్దలు వాకృచ్చారు, ఒప్పుకుంటున్నా. మరి వంట బాగా చెయ్యాలంటే అనేక రుచులు తెలిసుండాలా? 

మంచి కథకుడు కావాలంటే ప్రపంచ సాహిత్యాన్ని మధించాలని చెప్పాడు శ్రీశ్రీ. ఆ మధించే ప్రోగ్రాంలో మనం ముసిలాళ్ళయిపోవచ్చు. మంచి తెలుగు రాయాలంటే మంచి ఇంగ్లీషు చదవమని రావిశాస్త్రికి సలహా ఇచ్చాడు శ్రీశ్రీ! హాయిగా గుప్పిడి బిగించి గుప్పుగుప్పుమంటూ దమ్ము కొడుతూ ఎన్నయినా సలహాలిస్తాడు శ్రీశ్రీ. చదవలేక చచ్చేది మనమే కదా! ఒకవేళ చచ్చీచెడీ చదివినా, చివరాకరికి మన బ్రతుకు 'చదవేస్తే ఉన్న మతి కాస్తా పోయింది లాగా అయిపోవచ్చు!

నాకు వంటవాళ్ళు రచయితలు ఒకానొకప్పుడు అన్నదమ్ములనీ, మన్‌మోహన్ దేశాయ్ సినిమాలోలా యాక్సిడెంటల్‌గా తప్పిపొయ్యారనీ అనిపిస్తుంది. మంచి పాఠకుడు మంచి కథకుడు అవగలడా? మంచి కథకుడు మంచి పాఠకుడు అవుతాడా? తిండియావ గలవాడు మంచి వంటవాడు అవుతాడా? గొప్ప వంటవాళ్ళు మంచి తిండిపోతులా? అసలీ వంటకీ, రచనలకి గల సంబంధం యేమి? 

విషయం కాంప్లికేట్ అయిపోతున్నందున - నా మేధావిత్వాన్ని తగ్గించుకుని, సింపుల్‌గా చెప్పటానికి ప్రయత్నిస్తాను. అందుకొరకు ఒక ఈక్వేషన్ -

వంట = కథ
మంచి వంట = మంచి కథ
చెత్త వంట = చెత్త కథ
వంటవాడు = రచయిత
భోంచేయువాడు = పాఠకుడు
తిండిపుష్టి గలవాడు = విపరీతంగా చదివే అలవాటున్నవాడు
తిండిపోతు = యేదిబడితే అది చదివి బుర్ర పాడుచేసుకునేవాడు

ప్రస్తుతానికి కథలు, రచనలు పక్కనబెట్టి వంటగూర్చి మాట్లాడుకుందాం. మీకు వంటంటే ఆసక్తి ఉందా? వంట చెయ్యడం మొదలెడాదామని అనుకుంటున్నారా? అయితే మీక్కొన్ని రుచులు తెలుసుండాలి. ఉదాహరణకి గుత్తివంకాయ కూర (ఇది నాకు అత్యంత ఇష్టమైనది కాబట్టి, ఇవ్వాల్టికిదే ఉదాహరణ). 

అసలు గుత్తొంకాయ కూర రుచి తెలీకుండా గుత్తొంకాయ ఎలా చేస్తారు? చెయ్యలేరు. కాబట్టి ఆ గుత్తొంకాయని ఎప్పుడోకప్పుడు తినుండాలి. తిన్నారా? రుచి తెలుసుకున్నారా? ఇహనేం! ఆలశ్యం చెయ్యకుండా వెంటనే గుత్తొంకాయ వంట మొదలుపెట్టెయ్యండి.

ఇప్పుడు మీక్కావలసింది - నవనవలాడే పొట్టివంకాయలు, సెనగపొడీ, పచ్చిమిర్చి, ఉప్పూకారం వగైరా. ముందుగా వంకాయలకి నిలువుగా నిక్ ఇచ్చి, సెనగపొడి కూరండి. స్టవ్ వెలిగించండి, బాండీలో నూనె వేసి మరిగించండి. ఇప్పుడు వంకాయల్ని నూనెలో వేసి దోరగా వేయించండి, తరవాత ఉప్పూకారం చల్లండి. అంతే - గుత్తొంకాయకూర రెడీ! ఇప్పుడు కూరని పొయ్యి మీద నుండి దించండి. కొత్తిమీర, కరివేపాకు వెయ్యండి. రుచి చూడండి. రుచిగా లేదా? ఆయుర్వేద మందులా ఉందా? డోంట్ వర్రీ! గొప్పగొప్పోళ్ళ వంట మొదట్లో ఇలాగే తగలడుతుంది!

వండటంతో పని పని పూర్తవదు. ఇప్పుడు మీరు మీ కూరని రుచి చూడమని చుట్టపక్కాలు, దారినపోయే దానయ్యలు.. ఇలా కనిపించిన వారందర్నీ రిక్వెస్ట్ చెయ్యండి. అవసరమైతే బ్రతిమాలండి, వీలయితే బలవంతం చెయ్యండి, కుదిరితే బెదిరించండి. తప్పులేదు. వాళ్ళు మీ హింస భరించలేక చచ్చినట్లు ఫీడ్‌బ్యాక్ ఇస్తారు. 

'గుత్తొంకాయ రుచి కుదిరింది గానీ కొంచెం గట్టిగా ఉంటే ఇంకా బాగుండేది.' అనే మొహమాటపు కామెంట్లనీ, 'నీబొంద. ఈ ఫెవికాల్ పేస్టుని గుత్తొంకాయ అనికూడా ఈమధ్య అంటున్నారా?' అనే శాపనార్ధాల కామెంట్లని చిరునవ్వుతో స్వీకరించండి. 

తప్పులు, పొరబాట్లు నోట్ చేసుకోండి. ఈసారి వండినప్పుడు మాత్రం గుత్తొంకాయ కూర ఇంతకన్నా బెటర్‌గా ఉండాలని గుర్తుంచుకోండి. ఇట్లా వచ్చీరాని వంట మొదలెట్టడం వల్ల మనకో గొప్ప మేలు చేకూరుతుంది. ఈరోజు నుండి మీపేరు కూడా వంటవాళ్ళ లిస్టులో నమోదయిపోతుంది. 

వంటకం తినేవాడు, చేసేవాడు వేరువేరుగా ఆలోచిస్తారు. కాబట్టి ఇప్పుడు మీ దృష్టికోణం మారుతుంది. నిన్నటిదాకా ఇతరుల వంట తిని ఎంజాయ్ చేశారు. ఇప్పుడు మీ ఆలోచన 'ఈ వంకాయకూర నా కూర కన్నా బాగుంది. ఈ వంటవాడి కిటుకు ఏమై ఉంటుందబ్బా!' అంటూ సాటి వంటవాళ్ళ ఫార్ములా గూర్చి సీరియస్‌గా ఆలోచించటం మొదలెడతారు. ఈ జిజ్ఞాసే భవిష్యత్తులో మిమ్మల్ని మంచి వంటగాడిగా నిలబెడుతుందని గుర్తుంచుకోండి.

సో - మీ ప్రయాణం గుత్తొంకాయతో మొదలై - పులిహోర, ఉప్మాపెసరట్టు మీదుగా పెరుగావడలు దాటుకుంటూ 'ఎక్కడికో వెళ్ళిపోతుంది'. మీ విజయానికి కారణం? ఒక సాధారణ వంటకంతో మొదలెట్టి, ఏకాగ్రతగా దాన్నే ఇంప్రోవైజ్ చేస్తూ, తప్పులు రిపీట్ చెయ్యకుండా, అందరి వంటకాలని రుచి చూస్తూ, తద్వారా మీ వంటకాన్ని మెరుగు పరుచుకోవటం. ఇది చాలా సింపుల్ ప్రిన్సిపుల్! ఈ పద్ధతే ఫాలో అవుతూ ఇంకొన్ని వంటకాలు నేర్చుకోవటం ఇప్పుడు సులభం. ఇక్కడో ముఖ్యమైన పాయింట్ - బేసిక్స్ తెలుసుకుని త్వరగా మీ వంట మీరు ప్రారంభించాలి. బెస్టాఫ్ లక్.

ఇంకో సలహా. కొందరు దుష్టులకి దూరంగా ఉండండి. ఈ దుష్టులు మంచి రుచులు తెలిసిన తిండిపుష్టి గలవారు. మీచేత అనేకరకాల వంటకాలు తినిపిస్తారు. హైదరాబాద్ బిరియాని, మొఘలాయ్, తండూరి, చెట్టినాడ్, చైనీస్ - ఇట్లా అనేకరకాల, అత్యంత రుచికరమైన వంటలని, ది బెస్ట్ రెస్టారెంట్లలో తినిపిస్తారు. ది బెస్ట్ చెఫ్ లని పరిచయం చేస్తారు. ఆ వంటకాల గూర్చీ, ఆ వంటోళ్ళ గూర్చి మీకు కథలు కథలుగా చెబుతారు. వంట చెయ్యటం ఎంత పవిత్ర కార్యమో, ఎంత నైపుణ్యం కావాలో మీకు సోదాహరణంగా వర్ణిస్తారు.

తత్ఫలితంగా మీకు వంట పట్ల అపార భక్తిప్రవృత్తులు కలుగుతాయి. అందువల్ల మీరు కనీసం వంటిల్లు వైపు కన్నెత్తి చూడాలన్నా వణికిపోతారు. ఒకవేళ వెళ్ళినా, గ్యాస్ స్టవ్ వెలిగించటానికి కూడా భయం. ఇంకా మొండిగా గుత్తొంకాయకూర వండుదామని ఉపక్రమించినా - అప్పటికే మీమీద బలంగా పనిచేస్తున్న స్వదేశీ, విదేశీ వంటల ప్రభావం వల్ల మీ గుత్తొంకాయకూర కాస్తా 'వంకాయ తండూరి గుత్తి చౌచౌ కూర'గా రూపాంతరం చెందుతుంది. మీకు అన్ని రుచులు తెలుసు కాబట్టి, మీకూరకి మీరే సున్నా మార్కులు వేసేసుకుని, ఇంకెప్పుడూ వంట చెయ్యరాదని తీర్మానించేసుకుంటారు. ఇందుమూలంగా ఈ సమాజం ఒక వంటవాడిని కోల్పోతుంది.

ఇప్పుడు మనం ఈ వంటల చర్చని తెలుగు కథలు, రచయితల మీదకి మళ్ళిద్దాం. నాకు హైస్కూల్ రోజుల నుండి తెలుగు పత్రికలు చదివే అలవాటుంది.  థాంక్స్ టు చందమామ, ఆంధ్రపత్రిక అండ్ ఆంధ్రప్రభ. ఈ అనుభవంతో చిన్నప్పుడు స్నేహితులతో కలిసి ఒక వ్రాతపత్రిక నడిపాను. వెల ఐదు పైసలు.

నా స్నేహితుడు ఫణిగాడి తండ్రి వారణాసి సుబ్రహ్మణ్యంగారు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్టర్. ఆయన డబడబా టైపు కొడుతుండేవాడు. ఆయన వాడి పడేసిన కార్బన్ పేపర్లని డస్ట్ బిన్లోంచి సేకరించేవాళ్ళం. చేతులు నొప్పెట్టాలా (వెలిసిపోయిన కార్బన్లు కావున పెన్సిల్ని ఒత్తిపట్టి రాయాల్సొచ్చేది) ఠావుల నిండా కథలు రాసి, ఆ కాపీలని చుట్టుపక్కల ఇళ్ళల్లోవాళ్ళకి అమ్మేవాళ్ళం (అంటగట్టేవాళ్ళం). 

మా రచనా బాధితులు మమ్మల్ని 'ఒరే! ఇంత చిన్నవయసులోనే ఇంత జబ్బపుష్టితో కథలు రాస్తున్నారు. పెద్దయ్యాక చాలా గొప్పకథలు రాస్తారు.' అని దీవించేవాళ్ళు. ఐదు పైసల పత్రికపై వచ్చిన లాభాలతో పుల్లైస్, పీచు మిఠాయి కొనుక్కునేవాళ్ళం. ఆవిధంగా చిన్నతనంలొనే వంట ప్రారంభించాను, లాభాలు గడించాను!

పెద్దయ్యాక - గుంటూరు మెడికల్ కాలేజీ మ్యాగజైన్ కోసం 'ప్రేమ పిచ్చిది, గుడ్డిది, కుంటిది..!' అని ఒక కథ రాశాను. అయితే అప్పటికే తెలుగు కథ మీద నాకు గౌరవం పెరిగిపోయి, 'నేను ఏ కథా రాయక పోవటమే తెలుగు సాహిత్యానికి నేను చెయ్యగల సేవ' అనే నిర్ణయానికి వచ్చేశాను. కానీ, మ్యాగజైన్ కోసం కథ రాయక తప్పలేదు. ఈ కథాకమామిషు తరవాత వేరేగా రాస్తాను.

రాజును చూసిన కళ్ళతో మొగుణ్ణి చూళ్ళేం గనుక, నా కథ నాకు మొగుళ్ళా కనిపిస్తుందని ముందే తెలుసు గనుక, అచ్చులో పడ్డ నా కథని నేనింతవరకూ చదవలేదు - అసలు పట్టించుకోలేదు! కారణం - 'కథలని చదువుటలో వున్న హాయి, రాయుటలో లేదని, నిన్ననే నాకు తెలిసింది' అని 'బుద్ధిమంతుడు'లో నాగేశ్వర్రావులా పాడుకుంటున్న కారణాన!

మరి నాకళ్ళకి కనిపించిన రాజు ఎవరు? ఏమీ తెలీని రోజుల్లోనే కట్టల కొద్దీ కాగితాలు ఖరాబు చేసిన నన్ను, కాగితం మీద కలం పెట్టటానికి కూడా చలిజ్వరం వచ్చినవాళ్ళా వణికిపోయేట్లు చేసిన ఆ పెద్దమనిషి ఎవరు? ఇంకెవరు! రావిశాస్త్రిగా ప్రసిద్ధుడైన రాచకొండ విశ్వనాథశాస్త్రి! ఈ రావిశాస్త్రి నిర్దయుడు, స్వార్ధపరుడు. తెలుగు కథలని వెయ్యికిలోమీటర్ల ఎత్తుకి తీసికెళ్ళి, వేరెవ్వరూ దరిదాపులకి కూడా రాకుండా, చుట్టూతా పెద్ద కంచెని వేసుకున్నాడు. నావంటి అర్భకులు ఆ ఎత్తు, ఆ కంచె చూసి ఝడుసుకున్నారు!

మెడిసిన్ చదివేవాళ్ళకి సాహిత్యాభిలాష ఒక లక్జరి. ఎంట్రెన్స్లో చచ్చీచెడీ సీటు సంపాదించాం కనుక కొంచెం రిలాక్స్ అవుదాం అనుకునేలోపుగానే, ఎనాటమి అనే ఒక దుష్టదుర్మార్గ పరీక్ష వచ్చేస్తుంది. అటు తరవాత పెథాలజీ అనే ఒక రాక్షసి వస్తుంది. ఇట్లా రక్కసుల సంతతి మనమీద విడతలుగా దాడిచేసి, మనలో గుజ్జు లాగేసి టెంకని మిగులుస్తాయి. చాలాసార్లు 'ఎవరి కోసం? ఎవరి కోసం? ఈ పాపిష్టి బ్రతుకు! ఈ నికృష్ట జీవితం' అని పాడుకోవలసి వచ్చేది. ప్రేమనగర్ సినిమాలో నాగేశ్వర్రావు పాడంగాన్లే వాణిశ్రీ వచ్చింది, నాకు మాత్రం పిశాచ పరీక్షలొచ్చేవి!

నాకు డిగ్రీ చదివే స్నేహితులు కూడా వున్నారు. వారి పరీక్షల పీడన, బాదరాయణం వుండేదికాదు. ఎక్కువగా రాజకీయ సాహిత్య చర్చలు చేస్తుండేవాళ్ళు. వాళ్ళమధ్య 'మౌనమే నీ మూగభాష' అంటూ పాడుకోవటం నాకు ఇబ్బందిగా ఉండేది. వాళ్ళు చాలాసార్లు ఒకపేరు ప్రస్తావించేవాళ్ళు, ఆపేరు రావిశాస్త్రి! అసలీ శాస్త్రి సంగతేంటో తేల్చాలని నిర్ణయించుకున్నాను. వాళ్ళ దగ్గర రావిశాస్త్రి 'బాకీకథలు' బాకీగా తీసుకున్నాను.

'ఎవడు వీడు? ఎచటివాడు? ఇటువచ్చిన శాస్త్రివాడు' అనుకుంటూ రావిశాస్త్రి పుస్తకం తెరిచాను. ఒక కథ చదవంగాన్లే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోయింది. కథ అంటే ఇలాకూడా ఉంటుందా! తెలుగు ఇలాకూడా రాస్తారా! కొన్నిసంవత్సరాలుగా రుచీపచీ లేని మజ్జిగన్నం తిన్నవాడికి వున్నట్టుండి పులిహోర, గారెలు, దోసావకాయతో భోజనం రుచి తగిలితే ఎలా ఉంటుంది?! అప్పుడు సరీగ్గా నాకలాగే అనిపించింది. అన్ని కథలు చకచకా చదివిన తరవాత పుస్తకం మూసి ఆలోచనలో పడ్డాను.

ఇప్పటిదాకా తెలుగులో నేచదివింది అరటి, ఆవు కథలు. అవి అవడానికి కథలేమోగానీ గొప్పకథలు మాత్రం కాదు. రావిశాస్త్రి విస్కీ తాగుతాడు, మనకి తన 'రచనలు' అన్న విస్కీ పోస్తాడు. ఆల్కహాల్ ఎడిక్షన్ లాగానే రావిశాస్త్రి రచనలు కూడా ఒక ఎడిక్షనే! ఆల్కహాల్ని మానిపించటానికి సైకియాట్రిస్టులు ఉన్నారు. ఈ రావిశాస్త్రి ఎడిక్షన్‌కి డీ-ఎడిక్షన్ ఫెసిలిటీ లేదు!

తిరపతి లడ్డు తిన్నవాడికి ఇంకే లడ్డూ రుచిగా ఉండదు. బెజవాడ బాబాయ్ హోటల్లో ఇడ్లీ తిన్న తరవాత ఇంకెక్కడా ఇడ్లీ నచ్చదు. ఈ రుచులు ఎంత కమ్మగా ఉంటాయంటే, మనం వండటానికి ప్రయత్నం చెయ్యాలన్నాకూడా భయమేస్తుంది. వెరీ డిస్కరేజింగ్, కొండకచొ ఇంటిమిడేటింగ్. 

ఈ అల్టిమేట్ రుచులు టేస్ట్ చెయ్యనివాడు అదృష్టవంతుడు. తానేదో వంటగాడిని అనుకుంటూ ఏదోకటి వండుతూనే ఉంటాడు. అలా వండగా వండగా వాడే ఓ మంచి వంటోడు అవ్వచ్చేమో! తినగ తినగ వేము తియ్యగానుండు! ఏదో ఒకటి - కథలు రాసీరాసీ కొన్నాళ్ళకి వాడే గొప్పరచయిత అవ్వొచ్చేమో!

కాబట్టి - కథలు రాయడం మొదలెడదామనుకునే మిత్రోత్తములారా! అనుభవంతో చెబుతున్నాను - మీరు రావిశాస్త్రిని చదవద్దు, చాలా డేంజరస్ రచయిత. అట్లని అసలు చదవకుండా ఉండొద్దు. వార పత్రికల్లో కథలు ఫాలో అవ్వండి, చాలు. ఎందుకంతే - అసలేం చదవకపోయినా కొన్ని ప్రమాదాలు సంభవించవచ్చు. ఫిజిక్స్ కొంచెం కూడా తెలుసుకోకుండా ప్రయోగాలు చేస్తే - న్యూటన్ సూత్రాల్నే మళ్ళీ కనిపెట్టే డేంజరపాయం ఉంది! అట్లాగే సాహిత్యంలో నిరక్షరాస్యులమైతే, కన్యాశుల్కాన్ని (ఆల్రెడీ గురజాడ రాశాడని తెలీక) మళ్ళీ రాసే ప్రమాదం ఉంది, జాగ్రత్త!

"నాన్నోయ్! ఎంతసేపు? నాకు ఆకలేస్తుంది." బుడుగు గావుకేక. 

"బుడుగమ్మా! వచ్చెవచ్చె, ఇదిగో నీ నూడిల్స్." అంటూ నూడిల్స్ సర్వ్ చేశాను. 

ఉఫ్! అలవాటు లేని పని, పూర్తిగా అలసిపోయాను. మీకో రహస్యం చెబుతున్నాను, ప్రపంచంలో అన్నిపనుల్లోకల్లా కష్టమైనది నూడిల్స్ వంటకం!

ఇప్పుడు నాకో మంచి కాఫీ తాగాలనిపిస్తుంది. ఖర్మఖర్మ! ఈ వంటావిడ ఇంకా రాలేదు. అవున్లేండి, వంట నేర్చుకోవాల్సిన రోజుల్లో కడుపునిండా తినడం మించి ఏమీ చెయ్యలేదు. హాయిగా తిని పడుకోవాల్సిన రోజుల్లో వండుతున్నాను, ఆ మాత్రం కష్టంగా ఉండదూ మరి!

Saturday 14 January 2012

సంక్రాంతి శుభాకాంక్షలు


మిత్రులకి,  

మకర సంక్రాంతి                       
శుభాకాంక్షలు.                                             
రమణ

Wednesday 11 January 2012

రావిశాస్త్రి 'పిపీలికం'

"ఒరే పిపీలికాధమా! నేనవరిననా అడిగేవు? నేను సుఖభోగిని. నీ పాలిట మాత్రం కాలయముణ్ణి! ఇప్పుడు తెలిసిందా నేనెవరో? తెలిసింది కదా! మరి, నువ్వెవరో నీకు తెలుసునా? నీ ముఖం చూస్తే నీకింకా ఏమీ తెలియనట్టే ఉందిలే. నువ్వు ఈ లోకంలో ఒకానొక తుచ్ఛపు కష్టజీవివి. కష్టజీవులు కష్టపడాలి. సుఖభోగులు సుఖించాలి. అలా జరుగుతుందనేది ప్రకృతి ధర్మం. అలా జరగాలనేది భగవదాదేశం. అందుచేత, మీ చీమ వెధవలంతా కష్టపడవలసిందే! మీ కష్టమ్మీద మేం సుఖించవలసినదే! మాకు అదే న్యాయం. అదే ధర్మం! కాదన్నవాణ్ణి కాటేసి చంపుతాం. ఇది మీరు కష్టపడి కట్టుకున్న ఇల్లే. బాగానే ఉంది. మీ నిర్మాణ కౌశలానికి ముగ్ధుణ్ణయేను. మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను. చాలు నీకిది. పొండి. మరింక దీని సౌఖ్యం అనుభవించే భాగ్యం అంటారా? అది మాది. అది మా హక్కు. ఆ హక్కు మాకు వాడూ వీడూ ఇచ్చింది కాదు. భగవంతుడే ఇచ్చాడు. ఇది ఇప్పట్నించీ నా ఇల్లు. బోధపడిందిరా చిన్నోడా. నీకేదో చదువులు చదివి పాఠాలు నేర్చుకోవాలని కుతూహలంగా ఉన్నట్టుంది. ఈ దినానికి నీకీ పాఠం చాలు! మరో పాఠానికి మళ్ళీ రాకు. వచ్చేవంటే మిగతా పాఠాలన్నీ మరో లోకంలో నేర్చుకోవలసి ఉంటుంది. మరందుచేత వేగిరం నడువిక్కణ్నించి."

ఇది తనేవరో తెలుసుకోవాలని తపించిపోయిన చీమ(పిపీలికం)కి, దాని శత్రువయిన పాము చేసిన జ్ఞానోపదేశం. 'పిపీలికం'ని రావిశాస్త్రి 1969 లో రాశాడు. కథని జంతుపాత్రలతో, జానపదశైలిలో అద్భుతంగా నడిపిస్తాడు రావిశాస్త్రి. కథలో కష్టజీవిగా చీమనీ, శ్రమదోపిడీ చేసే వర్గశత్రువుగా పామునీ ప్రతీకలుగా ఎంచుకున్నాడు రావిశాస్త్రి.

కథాంశం 'బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదె సుమతి.' అన్న సుమతీ శతకం పద్యపాదం నుండి వచ్చింది. పురాతనమైన జంతుపాత్రల కథనం మనకి 'పంచతంత్రం' వల్ల బాగా పరిచయం. చందమామలో కూడా చాలా కథలు వచ్చాయి. అయితే ఆధునిక తెలుగు సాహిత్యంలో ఇంత ప్రసిద్ధమైన ఈ తరహా రచన (నాకు తెలిసి) మరొకటి లేదు.

పూర్వం కృతయుగంలో శ్యామవనంలో నివసించే ఒకానొక చీమకి "నేనెవర్ని?" అని తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగింది. తోటి చీమ సలహాపై గోపన్నపాలెం చేరుకుని నిగమశర్మ అనే బ్రాహ్మణుణ్ణి కలిసి "నేనెవర్ని?" అని అడుగుతుంది. బ్రాహ్మణులకి మాత్రమే చదువు చెప్పాలనుకుని పేదరికంలో మగ్గుతున్న నిగమశర్మ, చదువుకుంటే చీమ సందేహం తీరుతుందంటాడు. అందుకు రోజూ ఒక గిద్దెడు నూకలు ఫీజుగా అడుగుతాడు. ఆ క్షణం నుంచీ ఎద్దులా కష్టపడి గింజగింజ చొప్పున గిద్దెడు గింజలూ ప్రతిదినం గురువుకి సమర్పించి చదువు నేర్చుకుంటుంది. చదువయిపోయిన తరవాత "నువ్వు చీమవి" అని సెలవిస్తాడు నిగమశర్మ.

కొంతకాలానికి చీమకి "అసలు చీమంటే ఏమిటి?" అని మళ్ళీ సందేహం వస్తుంది. నిగమశర్మ సలహాపై జన్నాలపల్లెలో చతుర్వేది అని పిలవబడే వేదవేదాంగవేద్యుడు వద్దకి చేరుకుంటుంది. చతుర్వేదులువారు చీమకి శుద్ధి చేసి, బ్రాహ్మణ్యం ఇప్పించి, తను చేయదలచుకున్న యజ్ఞానికి బంగారం ఫీజుగా ఇమ్మంటాడు. నిగమశర్మ ఫీజు గిద్దెడు నూకలైతే, చతుర్వేదిగారి ఫీజు బంగారం. నిగమశర్మది వీధి చివరి ఇంగ్లీషు మీడియం స్కూలయితే, చతుర్వేదిది కార్పొరేట్ విద్యాసంస్థ! సంవత్సరాల పాటు శ్రమించి రేణువు రేణువు చొప్పున హిరణ్యం సమర్పించుకుంటూ వేదాలు నేర్చుకుంటుంది మన పిచ్చిచీమ. చివరికి వేదసారం 'సోహం' అన్న ఒక్కమాటలో ఉందని చెబుతాడు చతుర్వేది.

బ్రహ్మజ్ఞానం పొంది కూడా తృప్తి నొందని చీమ ఒక మహాఋషిని దర్శిస్తుంది. ఆయన "యోగసాధన చేసి తపస్సు చెయ్యి. జన్మరాహిత్యం సంపాదించి మోక్షం సంపాదించు." సలహా ఇస్తాడు.

"ఏ జీవికైనా జన్మరాహిత్యం ఎందుకు? మోక్షం ఎందుకు?" అని అడిగితే సమాధానం రాదు.

నిరాశతో శ్యామవనంలోని తన పుట్టకి తిరిగొస్తుంది. అక్కడ తమ ఇంటిని ఒక రాక్షసాకారం (పాము) ఆక్రమించుకుని తన సోదర చీమలని తరిమేయ్యటం చూస్తుంది.

"ఇది అన్యాయం. అక్రమం. ఇలా మా ఇంటిని ఆక్రమించటం నీకు న్యాయమేనా?" అని పాముని గౌరవపూర్వకంగానే అడుగుతుంది చీమ.

అప్పుడు పాము బుసబుస నవ్వి చెప్పే మాటలు ఈ కథకి హై లైట్. పాము మాటలతో చీమకి తనెవరో జ్ఞానోదయం కలుగుతుంది.

"నువ్వు తుచ్ఛపు కష్టజీవివి."

తనెవరో పాము ద్వారా గ్రహించిన చీమ.. తన తోటి చీమలకి హితబోధ చేసి, ధైర్యం చెప్పి, వారిని వీరులుగా మార్చి, "రాక్షసాకారపు భగన్న్యాయం" మీద తిరుగుబాటు చేసేందుకు అందర్నీ కూడగట్టుకుని రంగంలోకి దిగుతుంది.

తత్ఫలితంగా, శ్యామవనంలో ఓ రాక్షసాకారం విలవిల తన్నుకుని నెత్తురు కక్కుకుని చచ్చింది. భూభారం కొంత తగ్గింది.  

(ఇంతటితో కథ అయిపోతుంది)

శాస్త్రాలు చెప్పని సత్యం, పండితులు దాచిన అసలు విషయం దాని శ్రమని దోపిడీ చేసిన పాము చెబుతుంది. జ్ఞానకాంక్ష కన్నా ఆకలి ఎంత శక్తివంతమైనదో చీమకి తెలిసివస్తుంది. 

వల్లంపాటి వెంకటసుబ్బయ్య తన 'కథాశిల్పం'లో ఈ కథని విశ్లేషిస్తూ, 'శ్రమదోపిడీని చిత్రించటంతో పాటు భారతీయ వేదాంతం శ్రమదోపిడీకి ఎలా సహకరించిందో, దాన్ని ఎలా ప్రోత్సాహించి, ఒక వ్యవస్థగా తయారుచేసిందో కూడా ఈ కథ సూచిస్తుంది.' అని అభిప్రాయపడ్డారు.

రావిశాస్త్రి 'పిపీలికం' కథావస్తువుని ఈ శైలిలో ఎందుకు రాసి ఉంటాడు? 'మిత్రబేధం'లో కుట్రలకీ, కుతంత్రాలకి నక్కలని, రాజుగా సింహాన్ని ప్రతీకలుగా వాడుకున్నట్లు, తన కథకి అవసరార్ధం కష్టజీవికి ప్రతీకగా చీమనీ, దోపిడీదారుకి సంకేతంగా పామునీ ఎంచుకుని ఉండొచ్చు. 

పాములు చీమల పుట్టని సొంతం చేసుకుంటాయి. ప్రకృతిలో ఇదో సహజ ప్రక్రియ. కాబట్టి రావిశాస్త్రి చెప్పదలచుకున్న విషయానికి ఈ చీమ, పాము సారూప్యం అతికినట్లు సరిపోతుంది. ఇది చాలా తెలివైన ఎత్తుగడ. కాబట్టే ఈ కథ మన మనసుకి బలంగా హత్తుకుపోయింది.

అసలు రావిశాస్త్రి సరదాగా చందమామకి ఒకకథ రాసి పంపాడనీ.. దాన్ని కొడవటిగంటి కుటుంబరావు చదివి, 'ఇంత పెద్దకథని మా చందమామలో వేసుకోం.' అని పురాణం సుబ్రహ్మణ్యశర్మకి పంపి ఆంధ్రజ్యోతిలో అచ్చేయించాడనీ, మా సుబ్బు గాలివార్త చెబుతుంటాడు. నేను సుబ్బు మాటలు పట్టించుకోను. 

సుబ్బు మాత్రం 'మిత్రమా! యూ టూ బ్రూటస్! ఈ టెల్గు పీపుల్ ద్రౌపది మనసులో ఏముందో రాస్తే జ్ఞానపీఠమిస్తారు. నిన్నగాకమొన్నదాక మన్తో వున్న కుటుంబరావు మనసులో మాట చెబితే నమ్మరు!' అని చిరాకు పడతాడు.

సాహితీ విమర్శకులు, ప్రేమికులు ఈ కథని అనేక సందర్భాల్లో ప్రస్తావిస్తుంటారు. తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి వున్నవాళ్ళు ఈ కథని చదనట్లయితే, అర్జంటుగా చదివెయ్యండి, మరిన్ని కబుర్లు చెప్పుకుందాం. ఈ కథ చదవనివారిని చదివించే దిశగా మళ్ళించటమే ఈ పోస్ట్ లక్ష్యం.  

Thursday 5 January 2012

మా సుబ్బారెడ్డి మామ

"అల్లుడూ! అర్జంటుగా రా! నీతో చానా విషయాలు మాట్లాడాల." అని కబురంపాడు మా సుబ్బారెడ్డి మామ.

సుబ్బారెడ్డి మామ మాట నాకు శాసనం. ఆఫీసుకి సెలవు పడేసి హడావుడిగా మాఊరికి బయల్దేరాను. మా ఊరు గుంటూరు టౌనుకి దగ్గర్లో వుంటుంది. ఒకప్పుడు పల్లెటూరు, ఇప్పుడు పట్నంలో కలిసిపోయింది.

సుబ్బారెడ్డి మామ ఆజానుబాహుడు, నల్లటి శరీరం, తెల్లటి జుట్టు, బుర్రమీసాల్తో గంభీరంగా వుంటాడు. ముతక ఖద్దరు గుడ్డతో బనీను, దానికో పెద్దజేబు, జేబులో పొగాక్కాడలు. ఇద్దరు ఆడపిల్లలు. పెద్దమ్మాయిని బావమరిది కోటిరెడ్డికి ఇచ్చుకుని ఇంట్లోనే వుంచుకున్నాడు. రెండోఅమ్మాయి భర్త బెంగుళూర్లో ఇంజనీర్.

సుబ్బారెడ్డి నాకు మేనమామ. నేను చిన్నతనంలో మా నాయన్ని కోల్పోయాను. దిక్కుతోచని స్థితిలో వున్న మా కుటుంబాన్ని మా మామ అన్నివిధాలుగా ఆదుకున్నాడు, నన్ను చదివించాడు. ఇవ్వాళ నేను ఉద్యోగం చేస్తున్నానంటే అది మామ చలవే. మామ సాయం లేకపోతే నేను మాఊళ్ళో ఏ గొడ్లో కాసుకుంటూ వుండేవాణ్ని. నాకు సుబ్బారెడ్డి మామంటే అమితమైన గౌరవం, వల్లమాలిన అభిమానం.

ఒకప్పుడు మామ పొద్దున్నే సద్దిబువ్వ తిని పొలానికెళ్ళి రైతువారీ పనుల్లో బిజీగా వుండేవాడు. మా వూరు పట్నంలో కలిసిపొయ్యాక వ్యవసాయ భూములన్నీ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కోట్లరూపాయిల ధనరాసులుగా మారిపొయ్యాయి. మా సుబ్బారెడ్డి మామ తెలివిగా, అవసరానికి మేర భూముల్ని కొద్దికొద్దిగా అమ్ముతూ గుంటూర్లో ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టించాడు. పెద్దమనవడికి డొనేషన్ కట్టి డాక్టర్ కోర్స్ చదివిస్తున్నాడు. ఈమధ్య శ్మశానం అభివృద్ధికీ, గుడి నిర్మాణానికి చందాలిచ్చి పుణ్యాత్ముడని పేరూ సంపాదించాడు.

ఊరికి చేరుకునేప్పటికి సాయంత్రం ఏడయింది. "ఏవిఁరా! మీమామ పిలిస్తేగానీ మనూరు గుర్తుకు రాదా?" అంటూ అత్త నవ్వుతూ పలకరించింది. టీవీలో ఏదో రాజకీయ చర్చ చూస్తున్న సుబ్బారెడ్డి మామ అల్లుడు కోటిరెడ్డి నన్నుచూసి ముఖం అటుగా తిప్పుకున్నాడు, మనసు చివుక్కుమంది. యేదో పనుండి మామ బయటకి వెళ్ళాట్ట, అన్నం తినే వేళకి వచ్చాడు. నన్ను ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు కనుక్కున్నాడు.

భోజనాలకి నేను, మామ, కోటిరెడ్డి పీటల మీద కూర్చున్నాం. ఆ ఇంట్లో డైనింగ్ టేబుల్ లేదు, మామకి అట్లా కింద కూర్చుని తినడమే ఇష్టం. నాటుకోడి ఇగురు, గారెలు, చేపల పులుసు. అన్నీ నాకిష్టమైనవే! అందులో మా అత్త చేతివంట. అత్త కొసరికొసరి వడ్డిస్తూ తినిపించింది.

భోజనాలు అయ్యాక వరండాలో నవ్వారు మంచాల మీదకి చేరాం. మామ పొగక్కాడ సాపు చేసుకుంటూ అసలు విషయంలోకి వచ్చాడు. 

"రవణారెడ్డి! ఈమధ్యన మన కోటిరెడ్డి కొత్త ఆలోచనలు చెప్తా ఉండాడు. ఏది చేసినా నీతో ఆలోచన సెయ్యకుండా ఏదీ సెయ్యను. నువ్వూ, కోటిరెడ్డి ఒక మాటనుకుంటే నాకు దైర్నం." అంటూ చుట్ట కట్టటం మొదలెట్టాడు.

"అన్నా! ఏందా ఆలోచన?" ఆసక్తిగా కోటిరెడ్డిని అడిగాను.

కోటిరెడ్డి ఒకక్షణం ఆలోచించి మాట్లాడాడు. 

"తమ్ముడూ! మన్దగ్గర డబ్బుంది, ఊళ్ళో మంచిపేరుంది. ఈ రోజుల్లో ఇయ్యి మాత్రమే సరిపోతయ్యా? సరిపోవు. డబ్బున్నోడికి పలుకుబడి కూడా వుంటేనే అందం చందం. మరి పలుకుబడి యాడుంది? డబ్బులో వుందా? లేదు. మరెందులో వుంది? అధికారంలో ఉంది. మరా అధికారం యాడుంది? అధికారం రాజకీయ నాయకుల చేతిలో వుంది. ఆ అధికారం, వోదా ముందు మన్డబ్బు చిత్తుకాయితంతో సమానం! ఆ యవ్వారవే యేరు."

నాకు విషయం అర్ధమైంది. కోటిరెడ్డి రాజకీయాల్లో దిగాలనుకుంటున్నాడు. సుబ్బారెడ్డి మామకి నా సలహా కావాలి. నేనడ్డం కొడతానని కోటిరెడ్డి అనుమానం. ఆలోచిస్తూ మౌనంగా వుండిపొయ్యాను.

చుట్ట నోట్లో పెట్టుకుంటూ నావైపు చూస్తూ "ఏమిరా! ఉలుకూ పలుకూ లేకుండా అట్లా కూకున్నావ్?" అన్నాడు మామ.

"మామా! ఈ యవ్వారం మీరూమీరు మాట్లాడుకోండి. మధ్యన నేన్దేనికి?" పొడిగా అన్నా.

మామ పెద్దగా నవ్వాడు. "ఏందిరో! అయిదరాబాదు నీళ్ళు బాగా వంటబట్టినయ్యే. పరాయోడిలా గుట్టుగా మాట్లాడతా వున్నావు. సదువుకున్నోడివి, తెలివైనోడివి, మనోడివనీ నిన్ను అర్జంటుగా పిలిపిస్తిని. నువ్వేంది ఎనకా ముందాడతా వున్నావు?" అంటూ అగ్గిపుల్ల వెలిగించి చుట్టకొనకి నిప్పంటించాడు.

మామ ఈమాట అనంగాన్లే నాకు చాలా సంతోషమేసింది. ఇంక నేను నా మనసులో మాట సూటిగా చెప్పొచ్చు, కోటిరెడ్డి ఏమనుకుంటాడోనని సందేహం అనవసరం.

"రాజకీయాలకి బయట వుంటూ చేసే విశ్లేషణ వేరు, రాజకీయాన్ని ఒక కెరీర్‌గా ఎంచుకునేప్పుడు చెయ్యాల్సిన ఆలోచన వేరు. మన రాజకీయ అవసరాలు, ఆయా పార్టీ భవిష్యత్తుల్ని అంచనా వేసుకోవాలి. ఒక పార్టీ ఫిలాసఫీ గొప్పగా ఉండొచ్చు, ఆపార్టీని నడిపించే నాయకుడూ మంచోడయ్యుండొచ్చు. కానీ మనకి అవకాశాలివ్వని పార్టీ ఎంత మంచిదైనా మనకి అనవసరం."

నా మాటల ధోరణికి కోటిరెడ్డి మొహం చిట్లించాడు.

"ఆపరా నాయనా, ఆపు నీసోది. బావా! ఈడు భయస్తుడు. అవకాశాలు చూసుకోటానికి ఇదేమన్నా ఉద్యోగమా! ఇదంతా నాకనవసరం. మనకి మన కులపోళ్ళ పార్టీ వుంది, ఇంకోపార్టీ గురించి ఆలోచిస్తే ఎంత నామర్దా!" అన్నాడు కోటిరెడ్డి.

"నువ్వు తగ్గు, ఆణ్ణి చెప్పనీ." అంటూ కొటిరెడ్డి వైపు చూస్తూ చుట్టపొగ గుప్పున వదిలాడు సుబ్బారెడ్డి మామ.

నేను మాట్లాడసాగాను. "మామా! ఒప్పుకుమంటున్నాను. రాజకీయాల్లో మనకి మనోళ్ళ పార్టీనే ఫస్ట్ చాయిస్. కానీ ఆలోచించు. సపోజ్ మనం రాజకీయంగా మన పార్టీలో దిగాం అనుకుందాం. అప్పుడేమవుద్దీ? ఎలక్షన్ల దాకా పార్టీకయ్యే ఖర్చు మన్చేతే పెట్టిస్తారు. పోనీ సీటు గ్యారంటీనా అంటే అదీ వుండదు. టిక్కెట్లిచ్చేప్పుడు కులాలు, మతాలు లెక్కేలేస్తారు. చివరాకరికి టిక్కెట్టు ఇంకెవరికో ఇవ్వొచ్చు."

మామామని ఎట్లాగైనా రాజకీయాల్లోకి దించాలని పట్టుదలగా వున్నాడు కోటిరెడ్డి.

"యేందిరా నువ్వు! మనోడి పార్టీలో చేరటానికి నువ్విట్టా లాభనష్టాలు లెక్కేస్తావేంది. బావా! నాకీలెక్కలు అనవసరం. నేను మనోడి పార్టీలో చేర్తన్నా, ఎలక్షన్ల గెల్చి ఎమ్మెల్యేనైతా. ఈ రవంణారెడ్డిగాడితో నాకు మాటలేంది?"

ఆరిపోయిన చుట్ట ముట్టించుకుంటూ నాకేసి చూశాడు మామ.

"మామా! నా దృష్టిలో రాజకీయాలు పేకాటతో సమానం. వందమంది ఆరిపోతే ఒక్కడు పైకొస్తాడు. వున్న వూళ్ళో దర్జాగా హాయిగా కాలుమీద కాలేసుకుని బతుకుతున్నాం. రాజకీయాల్లోకి దిగితే ఆ వొచ్చే పదవేందో గానీ, విమర్శలు మాత్రం దారుణంగా ఎదుర్కోవాలి. ఇయ్యన్నీ మనకి అవసరమా?" అన్నాను.

"థూ నీయవ్వ! నువ్వసలు మడిసివేనా! పిరికిముండాకొడుకులు ఎంత సదూకుంటే మాత్రం యేం లాభం, గుండెకాయలో ధైర్నం లేనప్పుడు." కయ్యిమన్నాడు కోటిరెడ్డి.

"అన్నా! ఎందుకు నామీద కోపం జేస్తావ్! మామ అడగబట్టే కదా నేజెబుతుండా! ఈ రాజకీయాలు రొచ్చుగుంటలాంటివి. పార్టీని నీ చేతిలో పెడుతున్నామంటారు, పార్టీకి నువ్వే దిక్కంటారు. నీచేత గాడిద చాకిరి చేయించుకుంటారు. తీరా ఎలక్షన్ల సమయానికి వాళ్ళేసే కూడికలు, తీసివేతల్లో నీకు టికెట్ రాకపోవచ్చు. ఇట్లా దెబ్బ తిన్నోళ్ళని ఎంతమందిని చూళ్ళేదు. ఎవరో ఎందుకు? మన కిష్టారెడ్డిని చూడు. పాపం! పొలమంతా అమ్ముకున్నాడు, అప్పులపాలయ్యాడు. ఈ రాజకీయాల్లో ఏదయినా జరగొచ్చు. ఏదీ జరక్కపోవచ్చును కూడా! ఏదైతే అదైంది, పోతేపోయింది వెదవ డబ్బేగదా అనుకుంటే ఇందులోకి దిగు." అంటూ చెప్పదం ముగించాను.

"శెబాస్ అల్లుడు! ఇషయం ఇడమర్చి సెప్పావ్!" మెచ్చుకోలుగా అన్నాడు సుబ్బారెడ్డి మామ.

ఆవేశంతో ఊగిపోయాడు కోటిరెడ్డి. "రే రవణారెడ్డిగా! నీలాంటి ఎదవనాకొడుకు మన కుటుంబంలో ఉంటం మా దరిద్రం రా! గుడిసేటి నాయాలా." అంటూ అరిచాడు.

"ఏందిరా పెద్దంతరం చిన్నంతరం లేకండా నాముందే నోరు లేస్తా ఉండాది. ఆడి ఆలోసెన ఆడు సెప్పాడు, ఇందులో నేకేంది నెప్పి." అంటూ ఆరిపోయిన చుట్టని పడేశాడు సుబ్బారెడ్డి మామ.

కోటిరెడ్డి పెద్దగా అరుస్తూ విసురుగా వెళ్ళిపోయాడు.

నాకు బాధేసింది. కోటిరెడ్డి నన్ను అంతేసి మాటలంటాడని ఊహించలేదు. రాత్రంతా కలతనిద్ర. మామాఅల్లుళ్ళ మధ్య అనవసరంగా ఇరుక్కున్నానేనోమోనన్న భావన నన్ను సరీగ్గా నిద్ర పోనీయలేదు. రకరకాల ఆలోచనలు.

'ఏదో ఒకరకంగా డబ్బు గడించి అధికారమే పరమావధిగా రాజకీయాల్లోకొస్తున్నారు. ఇప్పుడున్న నాయకులేమన్నా ఆకాశం నుండి వూడిపడ్డారా! నా మధ్యతరగతి నేపధ్యం, ఉద్యోగ మనస్తత్వంతో అనవసరంగా కోటిరెడ్డిని నిరుత్సాహపరిచానా? ఏమో!'

-----

గుంటూరు నుండి హైదరాబాదుకి పల్నాడు ఎక్స్‌ప్రెస్ ఉదయానే ఐదున్నరకుంది. ఇంక వుండాలనిపించట్లేదు. తెల్లారుఝాము నాలుగింటికి లేచి బట్టలు సర్దుకుంటుంటున్నాను. నెమ్మదిగా నా గదిలోకొచ్చాడు సుబ్బారెడ్డి మామ.

"ఏమిరా అల్లుడూ! ఇంకో నాలుగు దినాలు వుండి పోవచ్చుగదా! ఆడేమి కొంపలు మునిగిపోతున్నాయి."

"మామా! ఆఫీసులో అర్జంటు పని, రాత్రే ఫోనొచ్చింది. ఇప్పుడు బయల్దేరితే ఆఫీస్ టైంకి అందుకోవచ్చు."

నా కళ్ళల్లోకి చూశాడు సుబ్బారెడ్డి మామ.

"అల్లుడూ! అర్ధమయ్యింది, నీ మనసుకి కష్టం కలిగింది. ఈ రాజకీయాల్లోకి దిగితే ఉన్నది వూడుద్దని నాకూ తెలుసు. కానీ కోటిరెడ్డికి రాజకీయం పిచ్చ పట్టింది. మరీ బడాయికి పోతా ఉండాడు. ఎన్ని సుట్లు సెప్పినా బుర్రకెక్కట్లా. నన్నేమన్లేక పెళ్ళాన్ని తిడతా ఉండాడు. గట్టిగా సెబుదామంటే.. పిల్లనిచ్చుకున్నానాయే. కడుపు సించుకుంటే కాళ్ళమీద పడుద్ది. నీసేత ఆ నాలుగు ముక్కలు సెప్పిస్తే, అయ్యడ్డం పెట్టుకుని ఆణ్ణి కొన్నాళ్ళు ఆపొచ్చు. అందుకే నిన్ను అడావుడిగా పిలిపించా."

నేను ఆశ్చర్యపొయ్యాను. నేనేదో తెలివైనోణ్ణననుకుని రాత్రి రాజకీయాల గూర్చి క్లాస్ పీకా. మామ తను చెప్పదలిచింది నాతో చెప్పిచ్చాడు. తను మంచోడిగా మిగిలాడు. ఎటోచ్చి కోటిరెడ్డి దృష్టిలో సైంధవుణ్ణి నేనే! ఇంత తెలివైన సుబ్బారెడ్డి మామకి రాజకీయాలొద్దని తప్పు సలహా చెప్పానా!

"అల్లుడూ! నిన్న కోటిరెడ్డన్న మాటలు మనసులో పెట్టుకోమాక." అంటూ చటుక్కున నా రెండు చేతులు పట్టుకున్నాడు మామ.

నాకు కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి. "ఎంత మాటన్నావ్ మామా! నీ కోసం నేను చావటానిక్కూడా సిద్ధం! అట్లాంటిది నీకోసం మాట పడ్డం ఎంతపని? అవసరమైతే మళ్ళీ కబురంపు." అని మామ కాళ్ళకి నమస్కరించి రైల్వే స్టేషన్ కి బయలుదేరాను.