Saturday, 21 January 2012

జగన్.. జైలు.. 'చెక్'.. !


ఆంధ్రజ్యోతి  న్యూస్ పేపర్  తాపీగా  తిరగేస్తున్నాను. చలికాలం  కావున  ఉదయం  పేషంట్ల  తాకిడి  ఉండదు. పేపర్  అంతా  జగన్మోహనరెడ్డి  వార్తలే! నాకు  ఆంధ్రజ్యోతి వారి క్రియేటివిటీ  నచ్చుతుంది. రోజూ ఒకే  వ్యక్తి  గూర్చి  వ్యతిరేక వార్తలు  వండి వార్చాలంటే  ఎంత  కష్టం! తెలుగు జాతి  తరఫున.. అవినీతికి  వ్యతిరేకంగా  అహోరాత్రులు  శ్రమిస్తూ.. ఉత్తమ  జర్నలిస్టిక్ విలువల్ని  తన  వలువల  కన్నా  ప్రాణప్రదంగా   కాపాడుకుంటున్న ఆంధ్రజ్యోతి వారిని  చూస్తే  నాకు  ఆనందభాష్పాలు  ఆగవు!

"రవణ మావా! కాఫీ. అర్జంట్." సుడిగాలిలా  లోపలకొచ్చాడు  సుబ్బు.

"సుబ్బు! జగన్  జైలుకెళతాడా? లేదా? సమాధానం  తెలిసి  కూడా  చెప్పలేకపొయ్యావో.. నీ  తల  వెయ్యి చెక్కలగు గాక!" నవ్వుతూ  అన్నాను.

ఒక్క  క్షణం  ఆలోచించాడు  సుబ్బు. "నా  లెక్క  కరక్టయితే  జగన్  జైలు కెళ్ళడు."

"పేపర్లంతా  కోడై  కూస్తుంటే  నువ్వు  కాదంటావేమిటి!"




"కోడై  కూసినా, కుక్కై  కరిచినా  అంతే. అలనాడు  చంద్రబాబు  దెబ్బకి  గింగరాలు  తిరుగుతున్న కాంగ్రెస్  గతి  లేని  పరిస్థితుల్లో  రాజశేఖరునికి  ఫ్రీ హ్యాండ్  ఇచ్చింది. దాని  ఫలితం  వాళ్ళకి  త్వరలోనే  తెలిసిపోయింది. ఈ  లోపు  ఢిల్లీలో  కాంగ్రెస్ వారి  ఇల్లు  చక్కబడింది. ఇప్పుడు  కడప యువరాజుకి  పట్టాభిషేకం  చెయ్యాల్సిన  దుస్థితి  కాంగ్రెసుకి  లేదు. జగన్  ముఖ్యమంత్రి  పీఠం  కావాలన్నాడు. ఢిల్లీ బాసులు  'ఆ  ఒక్కటి అడక్కు!' అన్నారు. అప్పట్నుండి  ఎవరిది  పైచెయ్యో  తేల్చుకోటానికి  వీరిద్దరి  మధ్య  ఒక  ఆట  మొదలైంది. చదరంగం  ఆట  నీకు  తెలుసుగా. గెలిచిన వాడికి  ఒక  పాయింట్. డ్రా  అయితే  చెరో  హాఫ్ పాయింట్. మనం  గమనించాల్సింది  ఇక్కడ  ఇరు పక్షాలు  డ్రా  కోసం  ఆడుతున్నాయ్."

ఇంతలో  పొగలు గక్కుతూ  కాఫీ  వచ్చింది. కాఫీ  సిప్  చేస్తూ  చెప్పసాగాడు  సుబ్బు.



"జగన్ కి  'చెక్'  చెప్పేసి  జైలుకి  పంపడం  కాంగ్రెస్ పార్టీకి  క్షణంలో  పని. కానీ  రాజకీయాల్లో  'ప్లే ఫర్ ద ఫినిష్'  అస్సలు  పనికిరాదు. జగన్ని  జైలుకి  పంపితే  రాబోయే  ఎలక్షన్లలో  ముక్కోణపు  పోటీ  తప్పదు. అప్పుడు  కాంగ్రెస్  చావుదెబ్బ తింటుంది. అందుకని  జగన్ తో  ఆట  ఆడుతూనే  ఉంటుంది. గెలిచే  అవకాశం  ఉన్నా  గెలవదు. ప్రస్తుత  పరిస్థితుల్లో  ఓడిపోకుండా  చెస్  ఆడుతూ, నిలబడడం  జగన్ కి  చాలా  ముఖ్యం. ఆటలో  లాభనష్టాల  బేరీజు  ఇరుపక్షాలా  జరుగుతుంటుంది. అది  మనకి  కనపడని  సైడ్ షో! ఎవరికెన్ని  బలగాలు  చచ్చాయి? ఎంత  బలం  మిగిలింది? అనే  లెక్కల  మీద  ఆధారపడి  ఆట  కంటిన్యూ  అవుతుంటుంది."

"కానీ  ఈ  గెలుపోటములు  లేని  ఆట వల్ల  ప్రయోజనం?"




"రాజకీయాల్లో  పైచేయి  సాధించడమే  గెలుపు. ఏదీ  వెండిపళ్ళెంలో  సర్వ్  చెయ్యరు  నాయనా! నీ  దమ్ము, అర్హత  నిరూపించుకోవాలి. అప్పుడే  నువ్వు  రాజకీయంగా  బేరసారాలు  చెయ్యగల  డ్రైవర్  సీట్లో  కూర్చోగలవు. అప్పుడే  నువ్వు  చెప్పిన  మాటకి  విలువ. రాహుల్ గాంధీ  యూపీలో  తిప్పలు  పడేది  అందుకేగా!"

"అవుననుకో! కానీ  జగన్  దారులు  మూసుకుపోతున్నాయి గదా!"




"దారులదేముంది  బ్రదర్. టెన్ జన్ పథ్  దారి  తెరుచుకుంటే  మళ్ళీ  అన్ని  దారులు  అవే  తెరుచుకుంటయ్. రాజకీయుల  చెస్  ఆటలో 'డ్రా' చర్చలు రహస్యంగా  జరుగుతాయ్. ఆపై  ప్రజల్ని  మభ్య పెట్టటానికి  ఉత్తుత్తి  ఆట  కొంతకాలం  ఆడతారు. మనం  గుర్తుంచుకోవలసింది.. కాంగ్రెస్ గానీ, బీజేపీ గానీ  అవినీతిపరులకి  వ్యతిరేకం  కాదు. కాకపోతే  ఈ  సామంతరాజులు  ఢిల్లీకి  లొంగి  ఉండాలి. రావిశాస్త్రి  'మూడు కథల బంగారం'లో  సూర్రావెడ్డు  చెప్పేది  ఇదే గదా! దొంగలు  దొంగతనాలు  చెయ్యాలి. కానీ  పొలీస్  డిపార్ట్ మెంట్ కి  లొంగి  ఉండాలి. డిపార్ట్ మెంట్ కి  ఎదురు  తిరిగితే  పోలీస్  పవర్  రుచి  చూడాల్సి ఉంటుంది."

"మరి  గాలిని  లోపలేశారెందుకు?"




"ఇనప ఖనిజాన్ని  అక్రమంగా తవ్వీ  తవ్వీ  గాలి  బుర్రకి  తుప్పు  పట్టింది. జాతీయ పార్టీలకి  గాలి  లాంటివాడు  ఫండ్స్  కోసం  చాలా  అవసరం. బుద్ధిగా  ఖనిజాన్ని  తవ్వుకునో, భూములు  కబ్జా  చేసో  బాగా  డబ్బు  చెయ్యి. ఫెయిర్ షేర్  హై కమాండ్ కి  పంపు. హాయిగా  రాజకీయ భోగాన్ని  కూడా  అనుభవించు. అట్లా  అనుభవించమనే గదా  జాతీయ పార్టీలు  కూడా  చెబుతుంట! ఇంత  సింపుల్  విషయం  అర్ధం  చేసుకొలేని  గాలి, సుడిగాలిగా  మారదామని  ప్రయత్నించి.. పిల్లగాలయిపొయ్యాడు. అర్ధం  చేసుకున్న  మన  కెవిపి  సైలెంట్  అయిపొయ్యాడు. చెస్ లో  నువ్వొక  ఎత్తు  వేసి  ఎదుటివాడి  మూవ్  గూర్చి  ఆలోచించాలి. ఎదుటి  ఆటగాడి  ఆట  కట్టించటం  కోసం  వల  పన్నాలి. ఆ  పన్నాగం  పారకపోతే.. ప్లాన్  బి, ప్లాన్  సి.. ఆల్టర్నేట్  వ్యూహాలుండాలి. చాలా  మెటిక్యులస్  ప్లానింగ్  ఉండాలి. గాలికి  ఆట  ఆడటం  తెలీదు. తొందర  పడ్డాడు. బీజెపిని  పూర్తిగా  ఓడించి  ఒక  పాయింట్  సొంతం  చేసుకుందామనుకున్నాడు. పాపం  బీజేపికి  కూడా  ఆట  ముగించడం  తప్ప  వేరే  మార్గం  లేకుండా  అన్ని  మార్గాలు  మూసేశాడు. అందుకనే  బిజెపి  గాలిని  ఓడించింది."

"అంటే  జగన్  గాలి లాగా  బుర్ర  తక్కువ  ఆట  ఆడడంటావ్?"




"అనే  అనుకుంటున్నాను. గాలి  లాంటి  ఆట  ఆడితే  జగన్  కూడా  ఫలితం  అనుభవించాల్సిందే. తప్పదు. ఆట  ఓడిపోయే  పరిస్థితే  వస్తే  ఎప్పటికయినా డ్రా  ప్రపోజ్  చేసే  ఆప్షన్  జగన్ ఉంచుకోవాలి. కానీ  ఓపిగ్గా  గేమ్  కంటిన్యూ  చేస్తుండాలి. రాబందుకున్నంత  సహనం  ముఖ్యం. గద్ద లాగా  అవకాశాల్ని  తన్నుకుపోవాలి. పక్షులకున్నంత  బుర్ర  కూడా  లేని  చిరంజీవి  ఆట  మధ్యలో  లేచి  వెళ్ళి  పోయాడు. ఇప్పుడు  జగన్  చూపించే  మెళకువలు  కాంగ్రెస్  నిశితంగా  పరిశీలిస్తుంటుంది. జగన్  మగధీరలో  హీరోలా  యుద్ద్హనీతిలో  వీరోచితుడయినట్లయితే  కాంగ్రెస్  వెంటనే  డ్రా  ప్రపోజ్  చేస్తుంది. రాబోయే  ఎన్నికల్లో  జగన్  కాంగ్రెస్ కి  అవసరం. జగన్ కి  కాంగ్రెస్  అవసరం."

"ఆశ్చర్యంగా  ఉంది  సుబ్బు!"

"నువ్వు  కె.వి.రెడ్డి  తీసిన  కృష్ణార్జున యుద్ధం  సినిమా  చూశావు గదా. అందులో  కృష్ణుడు  అర్జునుడితో  యుద్ధం  చేస్తాడు. అర్జునుడి  పౌరుషాన్ని, ప్రతాపాన్ని  పరీక్షిస్తాడు. రాబోయే  కురుక్షేత్ర సంగ్రామంలో  అర్జునుడి  కేలిబర్  ఏంటో  టెస్ట్  చేస్తాడు. అర్జునుడు  ఏమాత్రం  తగ్గడు. శ్రీకృష్ణుడు  సంతోషించి.. 'వెరీ గుడ్'  అంటూ  కౌగిలించుకుంటాడు."

"ఇంతకీ  జగన్  జైలుకెళ్ళడంటావు?"

"జగన్  గాలి లాంటి  ఫూల్  అనుకోను. ఆ  పరిస్థితే  వస్తే  ఢిల్లీ  కాంగ్రెస్ తో  సంధి  చేసుకుంటాడు. చేసుకోవాలి. కాంగ్రెస్  కూడా  సిబీఐ  అనే  పేరు గల  మంత్రిని  చెస్  బోర్డ్  మీద  విచ్చలవిడిగా, భీతి  గొలిపేలా  ఎక్రాస్  ద  బోర్డ్  మూవ్  చేస్తూ  రాజగోపాల్, శ్రీలక్ష్మి, విజయసాయిరెడ్డి  అనే  ఏనుగుల్నీ, శకటుల్నీ  చంపేస్తుంటుంది. జగన్  కాజిల్ని ధ్వంసం  చేసేస్తుంది. చూశావా! ఏ  క్షణాన్నయినా  నీకు  'చెక్'  చెప్పి  ఆట  కట్టించేయగలమనే  బెదిరింపు  సంకేతాల్ని  ఇస్తుంటుంది. ఇదొక  సైకలాజికల్  వార్. ప్రస్తుతం  ఇరు వైపులా  ఆటగాళ్ళు  తమ  తరవాత   స్టెప్  గూర్చి  ఆలోచించుకుంటు్న్నారు. ఇది  అధికారం  కోసం  ఆడే  రాజకీయ  చదరంగం." అంటూ  ఖాళీ  కప్పు  టేబుల్  మీద  పెట్టాడు.

"మరి  మనం?"




"ఏదో  ఆట  జరిగిపోతుందని  ఫలితం  కోసం  ఆసక్తిగా ఎదురు  చూసే  వెర్రిబాగుల  జనాలం. సరదాగా  జరిగే  కుస్తీ పోటీలని  నిజమని  భ్రమింపజేసే  రన్నింగ్  కామెంటరీ  ఆంధ్రజ్యోతి  రాధాక్రిష్ణ లాంటి వాళ్ళు  ఇస్తుంటారు. ఈ  కామెంటరీ.. జరుగుతున్న  ప్రాక్సీ వార్ కి  శోభనిస్తుంది. అందుకోసం  రోజువారీ  వార్తలు  వండి  వడ్డిస్తుంటారు. ఇందులో  వారి  స్వప్రయోజనాలు  కూడా   ఇమిడి  ఉంటయ్." అంటూ  టైం  చూసుకున్నాడు  సుబ్బు.

"నేవెళ్ళాలి. అమ్మని  హోమియోపతి  డాక్టరు  దగ్గరకి  తీసికెళ్ళాలి" అంటూ  హడావుడిగా  నిష్క్రమించాడు  సుబ్బు. 

27 comments:

  1. okka andhra jyothy ne mecchukovadam yemiti eenadu kuda ade pani chestondi kada vallanu mecchukorem

    ReplyDelete
  2. ee burra takkuva radha krishna,mind leni raamoji rao jagan ki baaga saanubhooti vachche vidhangaa raastunnaru...veellaki medadu mokaallo undi..asalu ee pachcha paper laki burralo paavuginja gujju kooda ledu

    ReplyDelete
  3. సూపర్ :) ఈ మధ్య కాలంలో నేను చదివిన అత్యుత్తమమైన పొలిటికల్ సెటైర్ ఇదే, కాదు కాదు నిజానికి దగ్గరగా సామాన్య పౌరుల కోణం నుంచి రాసిన అత్యుత్తమ రాజకీయ విశ్లేషణ ఇది.

    ఈ దెబ్బతో మీకు మేధావుల సంఘం లో సభ్యత్వం గ్యారంటీ. ఇంక శాలువా రెడీ చేసుకోండి డాక్టరు గారు :)))

    ReplyDelete
    Replies
    1. Weekend Politician గారు..

      ధన్యవాదాలండి.

      అమ్మయ్య! నన్ను మేధావుల సంఘంలో చేర్పిస్తున్నారన్నమాట. థాంక్యూ!
      శాలువా రెడీగానే ఉంది లేండి!

      Delete
  4. చాలా బాగుందండీ.

    ReplyDelete
  5. మీ వంటలో దినుసులు ప్రధానం కాదు..ఏది వండినా దానికో ప్రత్యేకమైన రుచి..

    ReplyDelete
    Replies
    1. వండీ, వండీ నా చెయ్యి తిరిగిపోయింది లేండి!

      అందుకే పుత్తూరు రాజులతో నాటు వైద్యం చేయిస్తున్నాను!

      Delete
  6. డాటేరు రమణ గారు,

    వచ్చే వచ్చే జిలేబీ కి తాకీదు డిల్లీ కి

    ఈ ఆటని ఇంకొంచం దినాలు లాగించడానికి !

    కాని మీరు ఎదురు చూడని మరో కోణం లో జిలేబీ దీనికి పరిష్కారం ఇవ్వ బోతోంది.
    వేచి చూడండీ. బహుశా ఒక ఆరు నెలలు పట్ట వచ్చు. అప్పటి దాకా సస్పెన్స్ !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
    Replies
    1. జిలేబి గారు..

      మీరు పరిష్కారం ఇవ్వటమేమిటండి?

      కొంపదీసి మీరు కూడా చెస్ ఆడుతున్నారా!

      Delete
  7. చాలా బాగా విశ్లేషించి చివర్లో హోమియోపతి డాక్టరు కొస మెరుపా?
    గౌతం

    ReplyDelete
    Replies
    1. సుబ్బుకి ఇంగ్లీషు డాక్టర్లంటే ఎలర్జీ.

      ఇంగ్లీషు వైద్యం ఒక అంతర్జాతీయ కుట్ర అంటుంటాడు.

      దీనిపై వివరంగా ఒక పోస్ట్ రాస్తాను.

      Delete
  8. ఈ ప్రజల్ని దోచే బెజినెస్ చాలా నైపుణ్యంతో నడిపించాలి. యడుగూరి సందింటి జగన్మోహన రెడ్డి చాలా నెర్చుకోవాలి సోనియా నుంచి. ఐతే, ఈ చదరంగంలో కింగ్ (అదే వోటర్) ఏమయిపోయాడు?
    బి ఎస్ ఆర్

    ReplyDelete
    Replies
    1. ఈ మధ్య పార్టీల్లో జగన్మోహనరెడ్డి జైలుకెళ్ళే విషయం మీద ఆసక్తికరమైన చర్చలు జరిగాయి.
      ఆ ఆలోచనల్లోంచి పుట్టింది ఈ పోస్ట్.

      అవును. ఈ బిజినెస్ చాలా నైపుణ్యంతో నడిపించాలి.

      Delete
  9. రాజకీయ చదరంగంలో పావులు ఎప్పుడూ ప్రజలే. వాళ్ళు ఎప్పుడూ గెలవరు.
    గెలిచేది, ఓడేది ఆట ఆడే నాయకులే.

    ReplyDelete
    Replies
    1. ప్రజలు కూడా తమని ఎవరు గెలుచుకుంటారా అని ఆసక్తితో ఈ చదరంగం ఆటని తిలకించటం ఒక విషాదం.

      Delete
  10. As someone said,you forgot the voter god.Voter will decide every politician's fate.We have to wait and watch.Truth will triumph.

    ReplyDelete
  11. నిజం,నిజం,నిజం!!!

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ, థాంక్యూ, థాంక్యూ!!!

      Delete
  12. doctor garu bagundi sir. aiyna naakokati ardham kadu congress jathiya pradhana karya darsiga avvadaniki rahul gandhiki vunna arhata emiti jaganmohan reddy ki cm kavadaaniki leni arhata emiti
    G Ramesh babu Gudivada

    ReplyDelete
  13. సుబ్బుని పొగటటానికి నాకు మాటలు దొరకట్లేదు సార్.

    అప్పిచ్చు వాడు వైధ్యుడన్నారు పెద్దలు. మీరప్పిస్తే పొగిడేస్తా :)

    ReplyDelete
    Replies
    1. ఆయ్యా! మీకు అప్పు కావాలి. అంతేగా?

      సుబ్బుని పొగడటానికి నేనెందుకు అప్పివ్వాలి?

      కానీ.. సుబ్బుతో జాగర్తగా ఉండండి.

      వాడో తలతిక్క మనిషి.

      Delete
  14. మీ బ్లాగ్ చూడటం ఇదే మొదటి సారి..
    ఆపకుండా మీ పోస్ట్స్ అన్నీ చదివేయలనిపించింది, ఈ పోస్ట్ చూడగానే... ఈవాళే చుసేస్తా...

    ReplyDelete
    Replies
    1. మీకు 'పని లేక.. '.. సారీ! మీరు 'పని లేక.. ' బ్లాగుని చదువుతున్నందుకు ధన్యవాదాలు.

      Delete
  15. Fantastic...what a satire! The best in recent times!

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.