Monday, 23 January 2012

అప్పారావు అసలు రహస్యం

అప్పారావు ఎర్రగా వుంటాడు, పొడుగ్గా వుంటాడు. స్వభావం మృదువుగానూ, మనస్తత్వం సుతిమెత్తగానూ వుంటుంది. మంచితనానికి బట్టలేస్తే అది అచ్చు అప్పారావులానే వుంటుంది. అప్పారావు మంచి సంగీతం కోసం చెవి కోసుకుంటాడు. మంచి పుస్తకం కోసం ముక్కూచెవులు కూడా కోసేసుకుంటాడు.

అప్పారావు అమాయకుడు కూడా. ఆందుకే - భార్య అంటే జీవిత భాగస్వామి అనీ, మంచిచెడ్డలు పంచుకునే అర్ధభాగమని నమ్మాడు. పాపం! ఇలా ఎన్నో ఆశలతో, ఆశయాలతో ఉత్సాహంగా పెళ్లి చేసుకున్నాడు. భార్య కొద్దిగా బొద్దుగా వుంటుంది, తన అభిమాన నటి సావిత్రిలా ఉందని మురిసిపొయ్యాడు.

తన దగ్గరున్న అరుదైన పుస్తకాలు, పాటల సీడీల కలెక్షన్ అపురూపంగా భార్యకి చూపించాడు. ఒక వ్యక్తి జీవితాన్ని సంగీత సాహిత్యాలు ఎలా ప్రభావితం చేస్తాయఓ వివరించాడు. మొదట్లో అప్పారావు భార్యకి అప్పారావు ధోరణి కొత్తగా, విచిత్రంగా అనిపించింది.

అప్పారావు భార్య తన పుట్టింట్లో ఎప్పుడూ పుస్తకాలు, సీడీలు చూసి ఉండలేదు. తండ్రి రెవిన్యూ ఉద్యోగి, డబ్బు సంపాదనే ధ్యేయంగా పన్జేస్తాడు. తల్లీతండ్రీ పొద్దస్తమానం నగలేం చేయించాలి? పొలాలు, స్థలాలు ఎక్కడ ఎంత కొనాలి? అని చర్చించుకుంటారు మనిషులు దొరికిన అన్ని అవకాశాలని వాడుకుంటూ ఎలాగైనా డబ్బు సంపాదించాలని, మన జీవితాలల్ని డబ్బు తప్ప ఇంకేదీ శాసించలేదనీ ఆవిద పుట్టింటివారి నమ్మకం. ఆ ఫిలాసఫీని పూర్తిగా నమ్మిన అప్పారావు భార్యకి అప్పారావు ధోరణి అర్ధం కాలేదు.

క్రమేణా కొంతకాలానికి అప్పారావు భార్యకి అప్పారావు మనస్తత్వం అర్ధమైంది. ఈ అప్పారావుకి డబ్బు సంపాదన పట్ల ఆసక్తి లేదు. మనిషి బ్రతకడానికి మాత్రమే డబ్బు కావాలి గానీ, దాచుకోడానికి డబ్బు అవసరం లేదని అప్పారావు అభిప్రాయం. అంచేత అతనికి జీతానికి మించి ఒక్క పైసా కూడా రాదు.

కాఫీ తాగుతూ అప్పారావు చెప్పే సంగీత సాహిత్య సంగతులు ఆమెకి చిరాగ్గా అనిపించసాగాయి. మొహం చిట్లించడంతో మొదలైన అసంతృప్తి ప్రకటన - విసుక్కోడంలోకి మారి ఆ తరవాత తిట్లలోకి మారిపోయింది. అప్పారావు ఒట్టి వాజమ్మనీ, బ్రతకటం చేతకాని దద్దమ్మనీ భార్య గట్టిగా నమ్మింది.

అప్పారావు నిరాశగా, నిర్లిప్తంగా మారిపోయ్యాడు. సావిత్రిలా కనబడే భార్య అసలు రూపం సూర్యకాంతమని గ్రహించిన అప్పారావు కృంగిపోయాడు, నిద్ర కరువైంది, ఆకలి మర్చిపోయ్యాడు. సహజంగానే బరువు తగ్గిపోయ్యాడు. శూన్యదృక్కులతో ఏదో ఆలోచిస్తూ కూర్చుండిపొయ్యేవాడు. రోజురోజుకీ అప్పారావుకి భార్య వేధింపులు ఎక్కువైపొయ్యాయి. అప్పారావు బాధ పడుతున్న కొద్దీ భార్యకి హాయిగా అనిపించసాగింది.

అప్పారావుకి ఏం చెయ్యాలో బోధపడలేదు. ఇంక తన భార్యతో కలిసి బ్రతకడం అసంభవమని తెలిసిపోయింది. కాఫీ తాగుతూ తీవ్రంగా ఆలోంచాడు. లాభం లేదు, నేను ఆత్మహత్య చేసుకుని చావడమే ఈ సమస్యకి పరిష్కారం! అని నిర్ణయించేసుకున్నాడు.

అత్మహత్య ఎలా చేసుకోవాలి? పుణ్యస్థలంలో పోతే పుణ్యానికి పుణ్యం, చావుకి చావు అని ఆలోచించి ఆత్మహత్య కోసం శ్రీశైలం యెంచుకున్నాడు. మల్లిఖార్జున స్వామిని దర్శనం చేసుకున్నాడు. దూకడానికి అనువుగానున్న ఒక ఎత్తైన కొండనెక్కాడు. మనసంతా దిగులుగా వుంది. అడవిప్రాంతం కావున ఎవ్వరూ వినే అవకాశం లేదు. మన్సులో మాట ప్రార్ధన రూపంగా బయటకనేశాడు.

'దేవుడా! నువ్వు నాకీ జన్మలో అన్యాయం చేశావ్! ఐ డోంట్ మైండ్. అయిపోయ్యేదేదో అయిపోయింది, ఇంక నువ్వూ నేనూ చేసేదేం లేదు. కనీసం వచ్చే జన్మలోనైనా సావిత్రిలాంటి భార్య వచ్చేట్లు చెయ్యి, లేదా అసలు పెళ్ళే కాకుండా చెయ్యి. ధన్యవాద్, అయాం లీవింగ్ దిస్ వాళ్!' అని ప్రార్ధించి గుండెల్నిండా గాలిపీల్చి దూకబోతుండగా -

"ఆత్మహత్య మహాపాపం నాయనా!" అని మత్తుగా, మెత్తగా ఒకగొంతు వినబడింది.

ఆశ్చర్యపొయ్యాడు అప్పారావు. వెనక్కి తిరిగి చూస్తే గంజాయి తాగుతూ ఒక కులాసా సాధువు! అప్పారావు ఏదో చెప్పబోతుండగా సాధువు వారించాడు.

"దివ్యశక్తితో సర్వం గ్రహించాను నాయనా! నువ్విప్పుడు చచ్చినా ప్రయోజనం లేదు, యెందుకంటే వచ్చే జన్మలో కూడా నీకు ఈ జన్మ భార్యే రిజర్వ్ అయ్యుంది కాబట్టి!"

"నహీ, ఐసా కభీ న హో సక్తా!" అంటూ అరిచాడు అప్పారావు.

"నువ్వే భాషలో అరిచినా రిజల్ట్ మాత్రం అదే. నీక్కావల్సింది సమస్యకి పరిష్కార, అంతే కదా? కమ్ నియర్." అని అప్పారావుని దగ్గరకి రమ్మని చెవిలో యేదో చెప్ప్పాడు.

"యువార్ గ్రేట్ స్వామీ! పాదపూజకి లక్షలు వసూలు చేస్తున్న స్వామీజీల కాలంలో మీరు ఫ్రీ ఎడ్వైజ్ ఇవ్వడం రియల్లీ గ్రేట్!" అంటూ మెచ్చుకున్నాడు అప్పారావు.

"నాది ఫ్రీ ఎడ్వైజ్ కాదు నాయనా! గంజాయి రేటు రోజురోజుకీ పెరిగిపోతుంది, గిమ్మీ సమ్ మనీ!" అన్నాడు సాధువు.

"ష్యూర్! ఇట్స్ మై ప్లెజర్!" అని సాధుపుంగవులకి ఫీజు సమర్పించుకుని, కాళ్ళకి మొక్కి సెలవు తీసుకున్నాడు అప్పారావు.

ఆరోజు నుండి అప్పారావు జీవితం మారిపోయింది. భార్య తిట్లకి చిరునవ్వే సమాధానం. అతని మొహంలో ఒక దివ్యతేజస్సు! హాయిగా సంగీతం వింటున్నాడు, ప్రశాంతంగా పుస్తకాలు చదువుకుంటున్నాడు. అప్పారావులోని ఈ అనూహ్య మార్పుకి భార్య ఆశ్చర్యపోయింది, తదుపరి అసంతృప్తితో రగిలిపోయింది. తన తిట్లు వృధా అయిపోవడం ఆమె తట్టుకోలేకపోయింది.

అయితే - అప్పారావు అరగంటకోసారి బాత్రూంలోకి దూరి తలుపులేసుకుంటున్నాడు, ఐదునిమిషాల తరవాత బయటకొస్తున్నాడు. భార్య ఆశ్చర్యపొయ్యింది. కొద్దిసేపు ఆలోచించి - 'పోన్లే! అతిగా పుస్తకాలు చదివాడు, అతిమూత్రవ్యాధి పట్టుకున్నట్లుంది.' అనుకుంది. కానీ - బాత్రూం లోపలకెళ్ళేప్పుడు అశాంతిగా, బయటకి వచ్చేప్పుడు ప్రశాంతంగా ఉండటం గమనించింది. ఏం చేస్తున్నాడు లోపల? ఇందులో ఏదో రహస్యం ఉంది. ఏమై వుంటుందబ్బా! జీవితంలో మొదటిసారి ఆమె తీవ్రంగా ఆలోచించింది. ఇక సస్పెన్స్ తట్టుకోలేకపోయింది. ఒకరోజు నిచ్చెనేసుకుని వెంటిలేటర్ లోంచి బాత్రూంలోకి తొంగి చూసింది.

అప్పారావు అప్పుడే హడావుడిగా బాత్రూం లోపలకొచ్చి బోల్ట్ పెట్టుకున్నాడు. గుండెలనిండా గాలి పీల్చుకున్నాడు. రెండుచేతులు జోడించి దణ్ణం పెట్టుకుని కళ్ళు మూసుకున్నాడు. మంత్రాలు జపిస్తున్నట్లు మాట్లాడ్డం ప్రారంభించాడు.

"నాకింకా పెళ్ళి కాలేదు, కానే కాలేదు. నేనింకా బ్రహ్మచారినే. బ్ర.. హ్మ.. చా.. రి.. ని! నాక్కనపడేదంతా భ్రాంతి! మాయ! పీడకల! ఇప్పుడు భార్య రూపంలో నాకు కనిపిస్తున్నవ్యక్తి మనిషి కాదు, మనిషే కాదు. ఒక పిశాచి! శాకిని! ఢాకిని! ఇదినిజం, ఇదినిజం, ఇదినిజం. శ్రీశ్రీశ్రీ గంజాయిస్వామీ మహారాజ్‌కి జై!"

ఇదీ - అప్పారావు అసలు రహస్యం!            

29 comments:

  1. డాక్టర్ గారు,
    అప్పారావుకి అలాగయినా తుత్తి దొరికింది.

    ReplyDelete
  2. రమణ గారు,

    నేనింకా రమణ గారి టపా చదవలేదు. !!!
    చదివిందంతా భ్రాంతి, కల, విష్ణుమాయ !
    ఇప్పుడు టపా రూపేణ కనిపిస్తున్నది.....




    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
    Replies
    1. ఈ మంత్రం అప్పారావుకి మాత్రమే పనిచేస్తుంది!

      జిలేబిలకి, బొబ్బట్లకి పని చెయ్యదు!

      Delete
    2. జిలేబీ లకీ, బొబ్బట్లకీ మంత్రాలు (అసలు జిలేబీ కి మంత్రాలు ఏవీ పనికి రావు అది వేరే విషయం అనుకొండీ) పనికి రాక పొతే పోయే గాని,
      మనవళ్ళ (మనవాళ్ళ) అలుక తీర్చే ఉపాయం ఉంటె చెబ్డురూ..
      ఈ మనవడే, మిమ్మల్ని 'పని లేక' నాకు పరిచయం చేసిన వాడు.
      ఆ పాటి సహాయం చేద్దురూ పోనీ !

      చీర్స్
      జిలేబి.

      Delete
    3. తప్పకుండా!

      మా అబ్బాయి బుడుగు గోలకి గింగరాలు తిరుగుతున్నాను.

      ముందు నాకు నేను సహాయం చేసుకుని..

      ఆపై మీకు తప్పక సహాయం చేయగలవాడను.

      Delete
  3. హహహ పొద్దున్నే హాయిగా నవ్వించేశారండీ ధన్యవాదాలు :-)

    ReplyDelete
    Replies
    1. మనకి నవ్వొస్తుంది లేండి.

      కానీ.. ఆడవాళ్ళకి!?

      Delete
    2. మీరేం దిగులు పడకండి.
      ఆడవాళ్ళం మాత్రం ఇలాంటి కథలు చెప్పుకోలేమేమిటి? :)

      Delete
  4. "జిలేబిలకి, బొబ్బట్లకి పని చెయ్యదు!" - priceless!
    This saadhuvu seems like the Telugu version of Colonel Julius Nagendranath Wilfred Singh!!
    Great little short story. Loved it.
    BSR

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ!

      పెద్దరికంగా.. గంభీరంగా.. వయసుకీ, వృత్తికీ తగ్గట్టుగా హుందాగా ఉందామని ఎంతగానో ప్రయత్నిస్తున్నా!

      కుదిరి చావట్లేదు!

      ఇట్లాంటి మర్కట టపాలు అనాలోచితంగా వచ్చేస్తున్నాయి.

      ఇక నుండి నా బ్లాగు విజ్ఞానదాయకంగా మాత్రమే ఉంటుందని భీషణప్రతిజ్ఞ చేయుచున్నాను.

      Delete
    2. రమణ గారు,

      ఇలాంటి భీషణ ప్రతిజ్ఞలు చేసి మా లాంటి వారికి దూరం అవరాదని విన్నపం.

      వినా జ్ఞానం లాంటివే రాయమని ఈ జిలేబీ విన్నపం. - విన్నపాలు వినవలెను వింత వింతలు.. పన్ నగవు రమణా, 'పని లేక' చదువు చున్న వారలమయ్యా పని బెట్ట నీ కీ 'దూరాలోచన' ఏల నయ్యా, కని బెట్టి కాపాడవయ్యా !!

      చీర్స్
      జిలేబి.

      Delete
    3. మీరు భలె నవ్విస్తారండి . అలాగే నవ్వించండి. అంతే కాని లేని పోని భీషణ ప్రతిజ్ఞలు చేయకండి :)

      Delete
    4. జిలేబి గారు..

      మీ అభిమానానికి కృతజ్ఞతలు.

      నాకు మాట్లాడే తెలుగు వరకు మాత్రమే వచ్చు.

      కాబట్టి మీకు సరితూగే భాషతో సమాధానం రాయలేను.

      ఇట్లాంటి సరదా టపాలు ఆడవాళ్ళని ఇబ్బంది పెడతాయేమోననే భయం నాలో లేకపోలేదు.

      ఈ గిల్ట్ ఫీలింగ్ అప్పుడప్పుడు నా చేత ప్రతిజ్ఞ చేయిస్తుంటుంది లేండి!

      Delete
    5. హన్నా, ఎంత మాటన్నారు !

      జిలేబీ ది అరవ తెలుగు.

      నెనర్లు, మీ అభిమానానికి!

      చీర్స్
      జిలేబి.

      Delete
    6. మాలా కుమార్ గారు..

      నా పోస్ట్ మీకు అఫెండింగ్ గా అనిపించకపోతే బాగున్నట్లే లెక్క!

      ఇందుమూలముగా సకల బ్లాగ్మిత్రులకి సభాముఖమున తెలియజేయునదేమనగా..

      నా ప్రతిజ్ఞని వెనక్కి తీసుకుంటున్నాను.

      తూ.. ఛ్!

      Delete
  5. doctor garu bagundi sir, blogu lo kuda vydyam cheyuchunnaru.

    Ramesh Babu Gudivada

    ReplyDelete
    Replies
    1. ఏమంటున్నారు?

      బ్లాగులో కూడా వైద్యం చేస్తున్నానా?

      నేనీ విషయం గ్రహించలేదు సుమీ!

      దయచేసి ఫీజు పంపడం మర్చిపోకండేం!

      Delete
    2. Reminds me of an old joke. A doctor speaking to an attorney at a social gathering asks "Many people ask my professional advice at parties. What should I do?". The attorney promptly says "Send them a bill". The doctor finds a bill from the attorney in his mail the next day.

      నా ఫీజు jaigottimukkala.blogspot.com లో కట్టండి!

      Delete
    3. అయ్యో! అదేమంత భాగ్యం! తప్పకుండా!

      ముందు నా ఫీజు వసూలు చేసుకోనివ్వండి!

      Delete
    4. నేను మీకు చాలా సార్లు ఫీజు కట్టాను (i.e. posted comments), మీరే బాకీ :)

      Delete
  6. manchitanaani kipentu hokkatodigithe apparaolaguntadu --- ravisastrini talapinchavu ramana

    ReplyDelete
    Replies
    1. >>మంచితనానికి ప్యాంటు, చొక్కా తొడిగితే అది అచ్చు అప్పారావులానే ఉంటుంది.

      చంద్ర..

      రావిశాస్త్రి గుర్తొచ్చాడా!
      నిజంగానా?
      ధన్యవాద్!

      Delete
  7. Replies
    1. మీక్కూడా నచ్చిందా!!!

      Delete
  8. Ramana,

    Ee blog madam ki telusa.
    Neeku anta dairyam unda.

    ReplyDelete
  9. చాలా బాగున్నది. అక్కడక్కడ ఇలాంటి సంఘటనలు నా స్నేహితుల ద్వారా వినేవాడిని.
    అవి గుర్తుకు తెచ్చారు.
    చక్కగా వ్రాసారు.
    "గంజాయి" త్రాగే సాధువుని సంప్రదిచాడు కాబట్టి "పిశాచి, శాఖిని, ఢాకిని" లాంటి ఆలోచనలను ఇచ్చాడు. ప్రతి విపరీతానికి ఒక విపరీతమయిన ఆలోచనతో విరగ కొట్టవచ్చని మీ రచన తెలిపింది. ధన్యవాదములు రమణగారు.

    ReplyDelete
    Replies
    1. >>ప్రతి విపరీతానికి ఒక విపరీతమయిన ఆలోచనతో విరగ కొట్టవచ్చని మీ రచన తెలిపింది.

      టపాలో సెంటర్ పాయింట్ ఒక్క ముక్కలో తేల్చేశారు.

      Delete

comments will be moderated, will take sometime to appear.