Tuesday, 17 January 2012

కథల్ని వండడం ఎలా?

"నాన్నోయ్! ఆకలి, నూడిల్స్, అర్జంట్." మా అబ్బాయి బుడుగు ఆర్తనాదం! న్యూస్‌పేపర్ చదువుతూ ప్రపంచ రాజకీయాల్ని తీవ్రంగా ఆలోచిస్తున్న నేను ఉలిక్కిపడ్డా. 

మావాడికి గుండెపోటులాగా 'ఆకలిపోటు' అనే రోగం వుంది, హఠాత్తుగా ఆకలి కేకలు వినిపిస్తాడు. నా భార్య ఇంట్లో లేదు, వంటావిడ ఇంకా రాలేదు. 'ఖర్మరా బాబు' అని సణుక్కుంటూ నూడిల్స్‌గా పిలవబడుతున్న వానపాముల్ని పోలిన పదార్ధ తయారీ కార్యక్రమం మొదలెట్టాను.

నాకు రెండే రకాల వంటకాలు వచ్చు. ఒకటి నూడిల్స్, రెండు ఆమ్లెట్. 'క్రీస్తుపూర్వం నుండి వంటకాలు రుచి చూస్తున్నాను, మరి ఇంతకాలం వంటెందుకు నేర్చుకోలేకపొయ్యానబ్బా!' ఆలోచనలో పడ్డా. వెంటనే అనుబంధ ప్రశ్న. 'అనేకరకాల రచనలు చదుతున్నాను గదా, మరి నేను రచయితని ఎందుకు కాలేకపోయ్యాను?' ఇదేదో తీవ్రంగా యోచించవలసియున్నది. 

కథలు రాయాలంటే, ముందుగా మంచికథలు పుంజీలకొద్దీ చదివి, ఒక లోతైన అవగాహనతో రాయాలని పెద్దలు వాకృచ్చారు, ఒప్పుకుంటున్నా. మరి వంట బాగా చెయ్యాలంటే అనేక రుచులు తెలిసుండాలా? 

మంచి కథకుడు కావాలంటే ప్రపంచ సాహిత్యాన్ని మధించాలని చెప్పాడు శ్రీశ్రీ. ఆ మధించే ప్రోగ్రాంలో మనం ముసిలాళ్ళయిపోవచ్చు. మంచి తెలుగు రాయాలంటే మంచి ఇంగ్లీషు చదవమని రావిశాస్త్రికి సలహా ఇచ్చాడు శ్రీశ్రీ! హాయిగా గుప్పిడి బిగించి గుప్పుగుప్పుమంటూ దమ్ము కొడుతూ ఎన్నయినా సలహాలిస్తాడు శ్రీశ్రీ. చదవలేక చచ్చేది మనమే కదా! ఒకవేళ చచ్చీచెడీ చదివినా, చివరాకరికి మన బ్రతుకు 'చదవేస్తే ఉన్న మతి కాస్తా పోయింది లాగా అయిపోవచ్చు!

నాకు వంటవాళ్ళు రచయితలు ఒకానొకప్పుడు అన్నదమ్ములనీ, మన్‌మోహన్ దేశాయ్ సినిమాలోలా యాక్సిడెంటల్‌గా తప్పిపొయ్యారనీ అనిపిస్తుంది. మంచి పాఠకుడు మంచి కథకుడు అవగలడా? మంచి కథకుడు మంచి పాఠకుడు అవుతాడా? తిండియావ గలవాడు మంచి వంటవాడు అవుతాడా? గొప్ప వంటవాళ్ళు మంచి తిండిపోతులా? అసలీ వంటకీ, రచనలకి గల సంబంధం యేమి? 

విషయం కాంప్లికేట్ అయిపోతున్నందున - నా మేధావిత్వాన్ని తగ్గించుకుని, సింపుల్‌గా చెప్పటానికి ప్రయత్నిస్తాను. అందుకొరకు ఒక ఈక్వేషన్ -

వంట = కథ
మంచి వంట = మంచి కథ
చెత్త వంట = చెత్త కథ
వంటవాడు = రచయిత
భోంచేయువాడు = పాఠకుడు
తిండిపుష్టి గలవాడు = విపరీతంగా చదివే అలవాటున్నవాడు
తిండిపోతు = యేదిబడితే అది చదివి బుర్ర పాడుచేసుకునేవాడు

ప్రస్తుతానికి కథలు, రచనలు పక్కనబెట్టి వంటగూర్చి మాట్లాడుకుందాం. మీకు వంటంటే ఆసక్తి ఉందా? వంట చెయ్యడం మొదలెడాదామని అనుకుంటున్నారా? అయితే మీక్కొన్ని రుచులు తెలుసుండాలి. ఉదాహరణకి గుత్తివంకాయ కూర (ఇది నాకు అత్యంత ఇష్టమైనది కాబట్టి, ఇవ్వాల్టికిదే ఉదాహరణ). 

అసలు గుత్తొంకాయ కూర రుచి తెలీకుండా గుత్తొంకాయ ఎలా చేస్తారు? చెయ్యలేరు. కాబట్టి ఆ గుత్తొంకాయని ఎప్పుడోకప్పుడు తినుండాలి. తిన్నారా? రుచి తెలుసుకున్నారా? ఇహనేం! ఆలశ్యం చెయ్యకుండా వెంటనే గుత్తొంకాయ వంట మొదలుపెట్టెయ్యండి.

ఇప్పుడు మీక్కావలసింది - నవనవలాడే పొట్టివంకాయలు, సెనగపొడీ, పచ్చిమిర్చి, ఉప్పూకారం వగైరా. ముందుగా వంకాయలకి నిలువుగా నిక్ ఇచ్చి, సెనగపొడి కూరండి. స్టవ్ వెలిగించండి, బాండీలో నూనె వేసి మరిగించండి. ఇప్పుడు వంకాయల్ని నూనెలో వేసి దోరగా వేయించండి, తరవాత ఉప్పూకారం చల్లండి. అంతే - గుత్తొంకాయకూర రెడీ! ఇప్పుడు కూరని పొయ్యి మీద నుండి దించండి. కొత్తిమీర, కరివేపాకు వెయ్యండి. రుచి చూడండి. రుచిగా లేదా? ఆయుర్వేద మందులా ఉందా? డోంట్ వర్రీ! గొప్పగొప్పోళ్ళ వంట మొదట్లో ఇలాగే తగలడుతుంది!

వండటంతో పని పని పూర్తవదు. ఇప్పుడు మీరు మీ కూరని రుచి చూడమని చుట్టపక్కాలు, దారినపోయే దానయ్యలు.. ఇలా కనిపించిన వారందర్నీ రిక్వెస్ట్ చెయ్యండి. అవసరమైతే బ్రతిమాలండి, వీలయితే బలవంతం చెయ్యండి, కుదిరితే బెదిరించండి. తప్పులేదు. వాళ్ళు మీ హింస భరించలేక చచ్చినట్లు ఫీడ్‌బ్యాక్ ఇస్తారు. 

'గుత్తొంకాయ రుచి కుదిరింది గానీ కొంచెం గట్టిగా ఉంటే ఇంకా బాగుండేది.' అనే మొహమాటపు కామెంట్లనీ, 'నీబొంద. ఈ ఫెవికాల్ పేస్టుని గుత్తొంకాయ అనికూడా ఈమధ్య అంటున్నారా?' అనే శాపనార్ధాల కామెంట్లని చిరునవ్వుతో స్వీకరించండి. 

తప్పులు, పొరబాట్లు నోట్ చేసుకోండి. ఈసారి వండినప్పుడు మాత్రం గుత్తొంకాయ కూర ఇంతకన్నా బెటర్‌గా ఉండాలని గుర్తుంచుకోండి. ఇట్లా వచ్చీరాని వంట మొదలెట్టడం వల్ల మనకో గొప్ప మేలు చేకూరుతుంది. ఈరోజు నుండి మీపేరు కూడా వంటవాళ్ళ లిస్టులో నమోదయిపోతుంది. 

వంటకం తినేవాడు, చేసేవాడు వేరువేరుగా ఆలోచిస్తారు. కాబట్టి ఇప్పుడు మీ దృష్టికోణం మారుతుంది. నిన్నటిదాకా ఇతరుల వంట తిని ఎంజాయ్ చేశారు. ఇప్పుడు మీ ఆలోచన 'ఈ వంకాయకూర నా కూర కన్నా బాగుంది. ఈ వంటవాడి కిటుకు ఏమై ఉంటుందబ్బా!' అంటూ సాటి వంటవాళ్ళ ఫార్ములా గూర్చి సీరియస్‌గా ఆలోచించటం మొదలెడతారు. ఈ జిజ్ఞాసే భవిష్యత్తులో మిమ్మల్ని మంచి వంటగాడిగా నిలబెడుతుందని గుర్తుంచుకోండి.

సో - మీ ప్రయాణం గుత్తొంకాయతో మొదలై - పులిహోర, ఉప్మాపెసరట్టు మీదుగా పెరుగావడలు దాటుకుంటూ 'ఎక్కడికో వెళ్ళిపోతుంది'. మీ విజయానికి కారణం? ఒక సాధారణ వంటకంతో మొదలెట్టి, ఏకాగ్రతగా దాన్నే ఇంప్రోవైజ్ చేస్తూ, తప్పులు రిపీట్ చెయ్యకుండా, అందరి వంటకాలని రుచి చూస్తూ, తద్వారా మీ వంటకాన్ని మెరుగు పరుచుకోవటం. ఇది చాలా సింపుల్ ప్రిన్సిపుల్! ఈ పద్ధతే ఫాలో అవుతూ ఇంకొన్ని వంటకాలు నేర్చుకోవటం ఇప్పుడు సులభం. ఇక్కడో ముఖ్యమైన పాయింట్ - బేసిక్స్ తెలుసుకుని త్వరగా మీ వంట మీరు ప్రారంభించాలి. బెస్టాఫ్ లక్.

ఇంకో సలహా. కొందరు దుష్టులకి దూరంగా ఉండండి. ఈ దుష్టులు మంచి రుచులు తెలిసిన తిండిపుష్టి గలవారు. మీచేత అనేకరకాల వంటకాలు తినిపిస్తారు. హైదరాబాద్ బిరియాని, మొఘలాయ్, తండూరి, చెట్టినాడ్, చైనీస్ - ఇట్లా అనేకరకాల, అత్యంత రుచికరమైన వంటలని, ది బెస్ట్ రెస్టారెంట్లలో తినిపిస్తారు. ది బెస్ట్ చెఫ్ లని పరిచయం చేస్తారు. ఆ వంటకాల గూర్చీ, ఆ వంటోళ్ళ గూర్చి మీకు కథలు కథలుగా చెబుతారు. వంట చెయ్యటం ఎంత పవిత్ర కార్యమో, ఎంత నైపుణ్యం కావాలో మీకు సోదాహరణంగా వర్ణిస్తారు.

తత్ఫలితంగా మీకు వంట పట్ల అపార భక్తిప్రవృత్తులు కలుగుతాయి. అందువల్ల మీరు కనీసం వంటిల్లు వైపు కన్నెత్తి చూడాలన్నా వణికిపోతారు. ఒకవేళ వెళ్ళినా, గ్యాస్ స్టవ్ వెలిగించటానికి కూడా భయం. ఇంకా మొండిగా గుత్తొంకాయకూర వండుదామని ఉపక్రమించినా - అప్పటికే మీమీద బలంగా పనిచేస్తున్న స్వదేశీ, విదేశీ వంటల ప్రభావం వల్ల మీ గుత్తొంకాయకూర కాస్తా 'వంకాయ తండూరి గుత్తి చౌచౌ కూర'గా రూపాంతరం చెందుతుంది. మీకు అన్ని రుచులు తెలుసు కాబట్టి, మీకూరకి మీరే సున్నా మార్కులు వేసేసుకుని, ఇంకెప్పుడూ వంట చెయ్యరాదని తీర్మానించేసుకుంటారు. ఇందుమూలంగా ఈ సమాజం ఒక వంటవాడిని కోల్పోతుంది.

ఇప్పుడు మనం ఈ వంటల చర్చని తెలుగు కథలు, రచయితల మీదకి మళ్ళిద్దాం. నాకు హైస్కూల్ రోజుల నుండి తెలుగు పత్రికలు చదివే అలవాటుంది.  థాంక్స్ టు చందమామ, ఆంధ్రపత్రిక అండ్ ఆంధ్రప్రభ. ఈ అనుభవంతో చిన్నప్పుడు స్నేహితులతో కలిసి ఒక వ్రాతపత్రిక నడిపాను. వెల ఐదు పైసలు.

నా స్నేహితుడు ఫణిగాడి తండ్రి వారణాసి సుబ్రహ్మణ్యంగారు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్టర్. ఆయన డబడబా టైపు కొడుతుండేవాడు. ఆయన వాడి పడేసిన కార్బన్ పేపర్లని డస్ట్ బిన్లోంచి సేకరించేవాళ్ళం. చేతులు నొప్పెట్టాలా (వెలిసిపోయిన కార్బన్లు కావున పెన్సిల్ని ఒత్తిపట్టి రాయాల్సొచ్చేది) ఠావుల నిండా కథలు రాసి, ఆ కాపీలని చుట్టుపక్కల ఇళ్ళల్లోవాళ్ళకి అమ్మేవాళ్ళం (అంటగట్టేవాళ్ళం). 

మా రచనా బాధితులు మమ్మల్ని 'ఒరే! ఇంత చిన్నవయసులోనే ఇంత జబ్బపుష్టితో కథలు రాస్తున్నారు. పెద్దయ్యాక చాలా గొప్పకథలు రాస్తారు.' అని దీవించేవాళ్ళు. ఐదు పైసల పత్రికపై వచ్చిన లాభాలతో పుల్లైస్, పీచు మిఠాయి కొనుక్కునేవాళ్ళం. ఆవిధంగా చిన్నతనంలొనే వంట ప్రారంభించాను, లాభాలు గడించాను!

పెద్దయ్యాక - గుంటూరు మెడికల్ కాలేజీ మ్యాగజైన్ కోసం 'ప్రేమ పిచ్చిది, గుడ్డిది, కుంటిది..!' అని ఒక కథ రాశాను. అయితే అప్పటికే తెలుగు కథ మీద నాకు గౌరవం పెరిగిపోయి, 'నేను ఏ కథా రాయక పోవటమే తెలుగు సాహిత్యానికి నేను చెయ్యగల సేవ' అనే నిర్ణయానికి వచ్చేశాను. కానీ, మ్యాగజైన్ కోసం కథ రాయక తప్పలేదు. ఈ కథాకమామిషు తరవాత వేరేగా రాస్తాను.

రాజును చూసిన కళ్ళతో మొగుణ్ణి చూళ్ళేం గనుక, నా కథ నాకు మొగుళ్ళా కనిపిస్తుందని ముందే తెలుసు గనుక, అచ్చులో పడ్డ నా కథని నేనింతవరకూ చదవలేదు - అసలు పట్టించుకోలేదు! కారణం - 'కథలని చదువుటలో వున్న హాయి, రాయుటలో లేదని, నిన్ననే నాకు తెలిసింది' అని 'బుద్ధిమంతుడు'లో నాగేశ్వర్రావులా పాడుకుంటున్న కారణాన!

మరి నాకళ్ళకి కనిపించిన రాజు ఎవరు? ఏమీ తెలీని రోజుల్లోనే కట్టల కొద్దీ కాగితాలు ఖరాబు చేసిన నన్ను, కాగితం మీద కలం పెట్టటానికి కూడా చలిజ్వరం వచ్చినవాళ్ళా వణికిపోయేట్లు చేసిన ఆ పెద్దమనిషి ఎవరు? ఇంకెవరు! రావిశాస్త్రిగా ప్రసిద్ధుడైన రాచకొండ విశ్వనాథశాస్త్రి! ఈ రావిశాస్త్రి నిర్దయుడు, స్వార్ధపరుడు. తెలుగు కథలని వెయ్యికిలోమీటర్ల ఎత్తుకి తీసికెళ్ళి, వేరెవ్వరూ దరిదాపులకి కూడా రాకుండా, చుట్టూతా పెద్ద కంచెని వేసుకున్నాడు. నావంటి అర్భకులు ఆ ఎత్తు, ఆ కంచె చూసి ఝడుసుకున్నారు!

మెడిసిన్ చదివేవాళ్ళకి సాహిత్యాభిలాష ఒక లక్జరి. ఎంట్రెన్స్లో చచ్చీచెడీ సీటు సంపాదించాం కనుక కొంచెం రిలాక్స్ అవుదాం అనుకునేలోపుగానే, ఎనాటమి అనే ఒక దుష్టదుర్మార్గ పరీక్ష వచ్చేస్తుంది. అటు తరవాత పెథాలజీ అనే ఒక రాక్షసి వస్తుంది. ఇట్లా రక్కసుల సంతతి మనమీద విడతలుగా దాడిచేసి, మనలో గుజ్జు లాగేసి టెంకని మిగులుస్తాయి. చాలాసార్లు 'ఎవరి కోసం? ఎవరి కోసం? ఈ పాపిష్టి బ్రతుకు! ఈ నికృష్ట జీవితం' అని పాడుకోవలసి వచ్చేది. ప్రేమనగర్ సినిమాలో నాగేశ్వర్రావు పాడంగాన్లే వాణిశ్రీ వచ్చింది, నాకు మాత్రం పిశాచ పరీక్షలొచ్చేవి!

నాకు డిగ్రీ చదివే స్నేహితులు కూడా వున్నారు. వారి పరీక్షల పీడన, బాదరాయణం వుండేదికాదు. ఎక్కువగా రాజకీయ సాహిత్య చర్చలు చేస్తుండేవాళ్ళు. వాళ్ళమధ్య 'మౌనమే నీ మూగభాష' అంటూ పాడుకోవటం నాకు ఇబ్బందిగా ఉండేది. వాళ్ళు చాలాసార్లు ఒకపేరు ప్రస్తావించేవాళ్ళు, ఆపేరు రావిశాస్త్రి! అసలీ శాస్త్రి సంగతేంటో తేల్చాలని నిర్ణయించుకున్నాను. వాళ్ళ దగ్గర రావిశాస్త్రి 'బాకీకథలు' బాకీగా తీసుకున్నాను.

'ఎవడు వీడు? ఎచటివాడు? ఇటువచ్చిన శాస్త్రివాడు' అనుకుంటూ రావిశాస్త్రి పుస్తకం తెరిచాను. ఒక కథ చదవంగాన్లే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోయింది. కథ అంటే ఇలాకూడా ఉంటుందా! తెలుగు ఇలాకూడా రాస్తారా! కొన్నిసంవత్సరాలుగా రుచీపచీ లేని మజ్జిగన్నం తిన్నవాడికి వున్నట్టుండి పులిహోర, గారెలు, దోసావకాయతో భోజనం రుచి తగిలితే ఎలా ఉంటుంది?! అప్పుడు సరీగ్గా నాకలాగే అనిపించింది. అన్ని కథలు చకచకా చదివిన తరవాత పుస్తకం మూసి ఆలోచనలో పడ్డాను.

ఇప్పటిదాకా తెలుగులో నేచదివింది అరటి, ఆవు కథలు. అవి అవడానికి కథలేమోగానీ గొప్పకథలు మాత్రం కాదు. రావిశాస్త్రి విస్కీ తాగుతాడు, మనకి తన 'రచనలు' అన్న విస్కీ పోస్తాడు. ఆల్కహాల్ ఎడిక్షన్ లాగానే రావిశాస్త్రి రచనలు కూడా ఒక ఎడిక్షనే! ఆల్కహాల్ని మానిపించటానికి సైకియాట్రిస్టులు ఉన్నారు. ఈ రావిశాస్త్రి ఎడిక్షన్‌కి డీ-ఎడిక్షన్ ఫెసిలిటీ లేదు!

తిరపతి లడ్డు తిన్నవాడికి ఇంకే లడ్డూ రుచిగా ఉండదు. బెజవాడ బాబాయ్ హోటల్లో ఇడ్లీ తిన్న తరవాత ఇంకెక్కడా ఇడ్లీ నచ్చదు. ఈ రుచులు ఎంత కమ్మగా ఉంటాయంటే, మనం వండటానికి ప్రయత్నం చెయ్యాలన్నాకూడా భయమేస్తుంది. వెరీ డిస్కరేజింగ్, కొండకచొ ఇంటిమిడేటింగ్. 

ఈ అల్టిమేట్ రుచులు టేస్ట్ చెయ్యనివాడు అదృష్టవంతుడు. తానేదో వంటగాడిని అనుకుంటూ ఏదోకటి వండుతూనే ఉంటాడు. అలా వండగా వండగా వాడే ఓ మంచి వంటోడు అవ్వచ్చేమో! తినగ తినగ వేము తియ్యగానుండు! ఏదో ఒకటి - కథలు రాసీరాసీ కొన్నాళ్ళకి వాడే గొప్పరచయిత అవ్వొచ్చేమో!

కాబట్టి - కథలు రాయడం మొదలెడదామనుకునే మిత్రోత్తములారా! అనుభవంతో చెబుతున్నాను - మీరు రావిశాస్త్రిని చదవద్దు, చాలా డేంజరస్ రచయిత. అట్లని అసలు చదవకుండా ఉండొద్దు. వార పత్రికల్లో కథలు ఫాలో అవ్వండి, చాలు. ఎందుకంతే - అసలేం చదవకపోయినా కొన్ని ప్రమాదాలు సంభవించవచ్చు. ఫిజిక్స్ కొంచెం కూడా తెలుసుకోకుండా ప్రయోగాలు చేస్తే - న్యూటన్ సూత్రాల్నే మళ్ళీ కనిపెట్టే డేంజరపాయం ఉంది! అట్లాగే సాహిత్యంలో నిరక్షరాస్యులమైతే, కన్యాశుల్కాన్ని (ఆల్రెడీ గురజాడ రాశాడని తెలీక) మళ్ళీ రాసే ప్రమాదం ఉంది, జాగ్రత్త!

"నాన్నోయ్! ఎంతసేపు? నాకు ఆకలేస్తుంది." బుడుగు గావుకేక. 

"బుడుగమ్మా! వచ్చెవచ్చె, ఇదిగో నీ నూడిల్స్." అంటూ నూడిల్స్ సర్వ్ చేశాను. 

ఉఫ్! అలవాటు లేని పని, పూర్తిగా అలసిపోయాను. మీకో రహస్యం చెబుతున్నాను, ప్రపంచంలో అన్నిపనుల్లోకల్లా కష్టమైనది నూడిల్స్ వంటకం!

ఇప్పుడు నాకో మంచి కాఫీ తాగాలనిపిస్తుంది. ఖర్మఖర్మ! ఈ వంటావిడ ఇంకా రాలేదు. అవున్లేండి, వంట నేర్చుకోవాల్సిన రోజుల్లో కడుపునిండా తినడం మించి ఏమీ చెయ్యలేదు. హాయిగా తిని పడుకోవాల్సిన రోజుల్లో వండుతున్నాను, ఆ మాత్రం కష్టంగా ఉండదూ మరి!

41 comments:

  1. >>>>ప్రేమనగర్ సినిమాలో నాగేశ్వర్రావు పాడంగాన్లే వాణిశ్రీ వచ్చింది. నాకు మాత్రం పిశాచ పరీక్షలొచ్చేవి!

    :)సూపర్! మీ నూడిల్స్ బాగున్నాయి. మీరు చాలా కష్టపడి సొజ్జప్పాలు,భక్ష్యాలు,కుండొకటి తెచ్చి పూతరేకులు, బూందీ లడ్డూల్లాంటివి చేసి ఆకలి పోటుకి గురైన మీ బాబుకి పెట్టినా, ఈ కాలం పిల్లాడు కదా..నూడిల్స్ మాత్రమే కావాలంటాడేమో..

    ReplyDelete
  2. Adirindi..Meeru chaalaa baaga raastaaru Ramana gaaru..

    --Rustum Reddy

    ReplyDelete
    Replies
    1. క్రిష్ణప్రియ గారు..
      పరీక్షలు పిశాచాలని గట్టిగా నమ్ముతున్నాను.
      ఈ రోజుకీ నాకు పీడకలలుగా వస్తుంటయ్!

      Delete
  3. అయ్యా రమణ గారు,

    మా బాగా చెప్పారు. రాసే వాళ్లెప్పుడూ వేరే వాళ్ళ కథలూ గట్రా ఒట్టేసి చదవకూదదండీ. రాయాలంటే మా బాగా వంట చెయ్యడం తెలిసి వుండాలన్నది నూరు శాతం జిలేబీ నమ్మకం. జిలేబీ లు వెయ్యడానికి వంట బాగా వచ్చి ఉంటె చాలు!

    అందుకేనండోయ్, నీను మీరు చెప్పిన ఎవ్వరి రాతలు చదవలే, పల్ప్ ఫిక్షన్ అన్న వాళ్ళతో చేర్చి. చదివితే మన తల రాతలు చెడి పోవూ ! కాబటి చదవ మన్న మాట

    ఇక వంకాయ గురించి అంటారా నేనో కొత్త రకం వంట కనిబెట్టా దాంతోటి. అదేమంటే ... చెప్పమంటారా .. గుత్తొంకాయ కూర చేసి , ( కూర అంటే సాంబారు కాదండోయ్, కర్రీ లా అన్న మాట) దాన్ని మిక్సీ లో ఓ తిప్పు తిప్పి చూడండీ, అది దేన్తోటి చేసారో ఎవరూ కనుక్కో లేరు. దాని రంగు రుచి వాసన అన్నీ వేరే అయి పోతాయన్న మాట.

    You have an exceptional talent in writing Doctor. Kudos and cheers!

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
    Replies
    1. సాహిత్యాన్నీ , వంటలనీ భలే కలిపేసారు :)

      Delete
    2. జిలేబి గారు..

      >>"రాయాలంటే మా బాగా వంట చెయ్యడం తెలిసి వుండాలన్నది నూరు శాతం జిలేబీ నమ్మకం. జిలేబీ లు వెయ్యడానికి వంట బాగా వచ్చి ఉంటె చాలు!"
      పూర్తిగా ఒప్పుకుంటున్నాను.

      >>"చదివితే మన తల రాతలు చెడి పోవూ!"
      ఈ సంగతి నాకు లేటుగా అర్ధమైంది.

      మీ మిక్సీ గుత్తొంకాయ ఫార్ములా బాగుంది.

      Thank you for the compliment Zilebi ji. It means a lot to me.

      Delete
    3. మాలా కుమార్ గారు..
      ధన్యవాదాలు.

      Delete
  4. సాహితీ గీతోపదేశం చేశారు రమణగారు :)

    ReplyDelete
    Replies
    1. (నాగ)అర్జునా!
      అర్ధమయ్యింది కదా!

      Delete
  5. అమ్మ బాబోయ్ మీకు రావి శాస్త్రిగారంటే ఏదో అభిమానం అనుకున్నానుగానీ మారీ ఇంత పిచ్చి అని ఇప్పుడే తెలిసింది. మీ అభిమానం ఏమోగానీ ఇలా పోస్త్ రాసినప్పుడల్లా ఆయన పేరు చెబుతూ నన్నేడిపిస్తున్నారు.

    నేనందుకే చదువుతాను తప్ప రాసే జోలిక అస్సలు వెళ్ళను,సరదాగా కూడా కథల ప్రయత్నం ఈ జన్మకి చెయ్యను గాక చెయ్యను.

    ReplyDelete
    Replies
    1. ఆ.సౌమ్య గారు..

      >>"రావి శాస్త్రిగారంటే ఏదో అభిమానం అనుకున్నానుగానీ మారీ ఇంత పిచ్చి అని ఇప్పుడే తెలిసింది."
      ఈ ముక్క ఇంకెక్కడా అనకండి.
      నా ప్రాక్టీసుకి దెబ్బ!

      సుస్వాగతం. మీరు నా జాతివారే అయినందుకు సంతోషం!

      Delete
    2. Ramana,

      Neelo inta talent undani ippude telusukunna

      Née friend

      Delete
    3. <>
      మీ సెన్సాఫ్ హ్యూమర్ కి హ్యాట్సాఫ్ సార్ :-))

      Delete
    4. వేణూ శ్రీకాంత్ గారు..
      థాంక్యూ!

      Delete
  6. "మంచి తెలుగు రాయాలంటే మంచి ఇంగ్లీషు పాండిత్యాన్ని సంపాదించమని కూడా రావిశాస్త్రికి సలహా ఇచ్చాడు"

    Very true, just see Yandamuri Veerendranath's "inspired" novels. The idea can be extended to music (and other "copyright" arts). Bhappi Lahiri & co. achieved great fame only because they always listen to the latest chartbusters.

    ReplyDelete
    Replies
    1. Jai Gottimukkala గారు..

      తెలుగు పాపులర్ రైటర్స్ ఇంగ్లీషులోంచి ఎత్తుకొచ్చి రాశారేమో నాకు తెలీదు. నేను చదవలేదు.
      తెలుగులో సీరియస్ లిటరేచర్ రాసిన శ్రీశ్రీ, కుటుంబరావు లాంటివారు ఇంగ్లీష్ సాహిత్యంలో పండితులు.
      మరీ ముఖ్యంగా శ్రీశ్రీ పై ప్రపంచ సాహిత్య ప్రభావం ఎక్కువ.

      Delete
  7. వంటనీ సాహిత్యాన్నీ కలిపి, చదివేటప్పుడు కూడా నోరూరిస్తూ చదివించావ్! మళ్ళీ మళ్ళీ చదివించటానికిదొక కొత్త ప్రయోగమా? నామీద సక్సెస్ అయ్యింది! కమ్మగా ఉంది
    గౌతం

    ReplyDelete
    Replies
    1. గౌతం..
      హ.. హ.. హ..
      నీ లాంటివాణ్ణి బుట్టలో వేసుకోటానికి ఇట్లాంటి తిప్పలు తప్పవు నాయనా!

      నిన్నా, మొన్నా బొత్తిగా 'పని లేక.. ' ఈ టపా రాసి పడేశాను.
      వంట నేర్చుకోకపోవడం నాకు గిల్టీగా ఉంటుంది.
      నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు ఇదే!
      ఆ బాధ కూడా పోస్టులో కలిపేశాను గదా!

      Delete
  8. సంబంధం లేని విషయాలు ఒకదానితో ఒకటి కలిపేసి హాస్యాన్ని పండించి భళీ అనిపించుకోవడంలో మీకు మీరే సాటి డాక్టర్ గారూ..

    ReplyDelete
    Replies
    1. జ్యోతిర్మయి గారు..

      ముందుగా మీకు కృతజ్ఞతలు.
      ఈ పోస్టుకి ప్రేరణ మీ కామెంట్!
      నా 'సుబ్బారెడ్డి మామ' కథలో నన్ను కథలెందుకు రాయకూడదని అడిగారు.
      ఈ పోస్టులో మీ వ్యాఖ్యకి సమాధానం రాశాననుకుంటున్నాను.
      ధన్యవాదాలు.

      Delete
  9. తినడం కొద్దిగా నన్న వచ్చి, చేసే వాళ్ళ వంట పర్వాలేదు కానీయండి , చేతికి దొరికింది చాలు అని చేసే పడేసే వాళ్ళ వంట మాత్రం భరించటం కష్టం బాబోయ్ :)))
    మీరు మాత్రం బాగా తిండిపుష్టి కలవారేనండి డాక్టరు గారు :D

    ReplyDelete
    Replies
    1. Sravya Vattikuti గారు..

      >>తినడం కొద్దిగా నన్న వచ్చి, చేసే వాళ్ళ వంట పర్వాలేదు కానీయండి , చేతికి దొరికింది చాలు అని చేసే పడేసే వాళ్ళ వంట మాత్రం భరించటం కష్టం బాబోయ్.
      అవును.

      >>మీరు మాత్రం బాగా తిండిపుష్టి కలవారేనండి.
      తిండిగలవాడే కండగలవాడోయ్.
      కండగలవాడే మనిషోయ్!

      Delete
    2. ఇప్పుడు నేను రాసింది వేరే అర్ధం వచ్చిందంటారా (బుర్ర గోక్కుంటూ )? పై కామెంట్ లో నా ఉద్దేశ్యం అసలు చదవకుండా రాసిపడేసే వాళ్ళని భరించటం కష్టం అని , అలాగే మీరు మంచి కథకుడు దానితో పాటు గా చాల మంచి పాఠకుడు కూడా అనండి

      Delete
    3. నా పోస్ట్ కేవలం సరదా కోసం రాశాను.
      అసలు విషయం..
      యద్దనపూడి, ముళ్ళపూడి, యండమూరి, మల్లాది..
      ఈ కాలక్షేపం బఠాణీలు రాసేవాళ్ళకి జ్ఞానం అవసరం లేకపోవచ్చు.
      కానీ మంచి కథలు రాయటాని మంచి రచనలు చదివి ఉండాలి.
      లోతైన పరిశీలన, ఆలోచన ఎంతో అవసరం. ఇందుకు షార్ట్ కట్స్ లేవు.
      చాలా కృషి, ఎంతో అవగాహన అవసరం.

      ఈ విషయంలో నాకు స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నయ్.
      నేను బ్లాగుల్లో రాసే కబుర్లకీ, నా అభిప్రాయాలకి కొన్నిసార్లు పొంతన ఉండదు.
      ఈ విషయాన్ని సభాముఖంగా (బ్లాగ్ముఖంగా) తెలియజేస్తున్నాను.

      Delete
  10. మీ హాస్యచతురత, కథనం నడిపించే విధానం మొత్తంగా మీ శైలి చాలా బావుంటుంది. నా ప్రశ్నకు చక్కటి సమాధానం లభించిందన్నమాట. ధన్యవాదాలు రమణ గారూ...

    ReplyDelete
  11. This comment has been removed by the author.

    ReplyDelete
  12. యద్దనపూడి, ముళ్ళపూడి, యండమూరి, మల్లాది..
    ఈ కాలక్షేపం బఠాణీలు రాసేవాళ్ళకి జ్ఞానం అవసరం లేకపోవచ్చు.
    కానీ మంచి కథలు రాయటాని మంచి రచనలు చదివి ఉండాలి.
    లోతైన పరిశీలన, ఆలోచన ఎంతో అవసరం. ఇందుకు షార్ట్ కట్స్ లేవు.
    చాలా కృషి, ఎంతో అవగాహన అవసరం
    -----------------------------------------------------

    ఎంత నిజమో! వాళ్ళనే కల్ట్ గా ఆరాధించి వాళ్ళ మీద చరచలు కూడా జరుపుకున్నవాళ్ళిక్కడ. కూడోస్

    ReplyDelete
  13. పని లేక పోతేనే ఇంత బాగా వ్రాస్తున్నారు. ఇదే పనిగా పెట్టుకుంటే ఇంకెంత బాగా వ్రాస్తారో.

    ReplyDelete
    Replies
    1. బులుసు సుబ్రహ్మణ్యం గారు..
      ధన్యవాదాలండి.

      Delete
  14. పుచ్చా18 January 2012 at 17:13

    నీ (సాహితీ) వంట, మాకు కన్నుల పంట.

    చదివే కొద్ది మనిషికి తానెంత అజ్ఞానినో తెలుస్తుంది.

    నీ బ్లాగ్ చదివిన తర్వాత (మరీ, నా లాంటి వాడికి);

    continue your good work..

    -పుచ్చా

    ReplyDelete
  15. వంట నేర్చుకోవాల్సిన రోజుల్లో..

    వంట ఎప్పుడైనా నేర్చుకోవచ్చండి.
    తినడం మాత్రం వయసులోనే చెయ్యాలి. ముసలాళ్ళయ్యాకా అన్నీ తినలేం కదా!

    టపా బాగుంది.

    ReplyDelete
  16. baagundi. writinglo cheyyi tiragadamante ide. vantalo gante thippadam kuda mellga vastundi. chandrasekhar

    ReplyDelete
  17. bagundi. Cheyyi tirigindi. gantekudaa tippadam vasundi mellaga.

    ReplyDelete
  18. Krishna Kumari Bommakanti23 January 2012 at 23:43

    రమణా,

    >>'కన్యాశుల్కాన్ని (గురజాడ రాశాడని తెలీక) మళ్ళీ రాసే ప్రమాదం ఉంది....'


    మీకు అలాంటి భయం ఏమీ అక్కరలేదు రమణా!

    గురజాడ 'గిరీశాలుంటారు జాగర్త!' అని చెప్పాడు.

    కొడవటిగంటి కుటుంబరావు కాలానికి ఆ గిరీశాలకి స్టార్ హోదా వచ్చేసింది.

    అసలు ఇపుడయితే ఆధిపత్యమే గిరీశాలది.

    అందుకని ఇపుడు గురజాడే మళ్లీ పుట్టి రాసినా.. ఆ 'కన్యాశుల్కాన్ని' రాయటం అసాధ్యం.

    శ్రీశ్రీ, రావిశాస్త్రి , కుటుంబరావు మేరునగధీరులే కావచ్చు.

    అలా అని ఆ బంగారు కొండల వైపే చూస్తూ కూర్చుంటే..

    మీ పక్కనించే నడుచుకుంటూ వెళ్తున్న నల్లూరి రుక్మిణిని, గంటేడ గౌరునాయున్ని...

    ఇంకా ఇంకా చాలామందిని మిస్ అవుతున్నారేమో.

    పదేళ్ళ పాప మీద పదహారు, పదిహేడేళ్ళ కుర్రాడు అత్యాచారం చెయ్యటానికి దారి తీసిన పరిస్థితుల్ని ఎంత బాగా విప్పి చెప్పింది నల్లూరి రుక్మిణి! (కథ పేరు గుర్తు లేదు. 'నెగడు' సంపుటిలో ఉంది.)

    'అభివృద్ధి పేరుతో ఊళ్ళు ముంచేసి, నాలుగిళ్లు అయితే ఇవ్వగలవేమో గాని, కొట్టుకుపోయిన కల్చర్ని ఎక్కణ్ణుంచి తీసుకొచ్చి ఇస్తావ్...' అని అర్థమయ్యేలా, కళ్ళకు కట్టినట్లుగా ఎంత బాగా కథ చెప్పాడు గౌరునాయుడు! (సారీ. ఈ కథ పేరు కూడా గుర్తు లేదు.)

    ఇంక పతంజలి అయితే 'గెలవడం సరే.. ముందు బతకడమెలాగా?' అని అన్నాడు.

    ఇవన్ని మీరు మిస్ అవుతున్నారేమో! ఆలోచించండి.

    కృష్ణకుమారి

    ReplyDelete
  19. కృష్ణ కుమారి..

    మనవాళ్ళు గిరీశానికి హీరో స్టేటస్ ఇచ్చేసి సినిమా కూడా తీసేశారు.

    ఆ మేరకు మనం ఒక నాటకాన్ని నడుస్తున్న సమాజానికి అనుగుణంగా.. నాటకకర్త ప్రమేయం లేకుండా.. యాభై యేళ్ళ క్రితమే మార్చేసుకున్నాం.

    నూట ఇరవై యేళ్ళ క్రితమే గిరీశాన్ని సృష్టించిన గురజాడ.. ఇవ్వాళ రాస్తే గీస్తే రాబోయే వందేళ్ళ సమాజ తీరుతెన్నుల్ని అంచనా వేస్తూ పాత్రల్ని సృష్టిస్తాడేమో!

    నేను చెప్పదలచుకున్న విషయానికి సూట్ అవుతుందని.. న్యూటన్, గురజాడ పేర్లు వాడుకున్నాను. అంతే!

    తెలుగు సాహిత్యంతో నాకున్న పరిచయం చాలా పరిమితమైనది.

    గత రెండు దశాబ్దాలుగా కాల్పనిక సాహిత్యం వైపు చూడట్లేదు. ఇదేమన్నా వ్యాధి లక్షణమేమో!

    ఈ వ్యాధి కారణంగా నాకు మంచి మిత్రులైన నల్లూరి రుక్మిణి, డా.వి.చంద్రశేఖరరావులని కూడా అప్పుడప్పుడు మిస్ అవుతున్నాను.

    ఎప్పుడూ ఘంటసాల పాటలు వినేవాడికి ఈ మధ్యన చక్కగా పాడుతున్న గాయకుల గూర్చి పెద్దగా తెలీదు.

    ప్రస్తుతం నేనున్న స్థితి ఇది! ఈ స్థితి నాకు చిరాకు, దు:ఖాన్ని కలగజేస్తుంది. దీన్లోంచి బయటపడాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాను.

    నేను బ్లాగ్ రాయు విధంబు ఎట్టిదనగా.. సమయం దొరికినప్పుడల్లా (ఎక్కువగా అర్ధరాత్రిళ్ళు) మనసులో మెదలిన ఆలోచనని, జ్ఞాపకాన్ని అప్పటికప్పుడు రాసి ప్రచురిస్తుంటాను.

    ఏం చెయ్యను? బుర్రలోని ఆలోచనలన్నీ ఇక్ష్వాకుల కాలం నాటివి!

    నేరం నాది కాదు! నా బుర్రది!!

    ReplyDelete
  20. హమ్మయ్య రమణగారూ నా కళ్ళు తెరిపించారు. నెనెందుకు రాయలేకపోతున్నానో నాకు అరటి పండు వలిచి మరీ చెప్పేశారు. ఇప్పుడు నాకు బెంగ తీరిపోయింది. ఇక నేను హాయిగా పుస్తకాలు చదివేసుకుని బతికేస్తాను. ఇంకెప్పుడూ కథలు రాయడానికి ప్రయత్నించను గాక ప్రయత్నించను. కథలు రాసినా రాయకపోయినా రావిశాస్త్రి గారు చెప్పిన సూత్రం మాత్రం తూచ తప్పకుండా పాటించేస్తాను, అదేనండీ ఇంగ్లీషు సాహిత్యం చదవమన్నారు కదా అది.

    ReplyDelete
    Replies
    1. అయ్యో! ఎంత కఠిన నిర్ణయం తీసుకున్నారు!

      తొందర పడ్డారేమోననిపిస్తుంది!

      Delete
  21. Krishna Kumari Bommakanti27 January 2012 at 08:23

    రమణా,

    కొందరు గిరీశానికి. హీరో స్టేటస్ ఇచ్చేసాం అనుకోవచ్చు.
    ఇచ్చేద్దాం అనుకోవచ్చు.
    కాని మిగిలిన వాళ్ళు అయినా అర్హత అనర్హతల గురించి ఆలోచిస్తారు కదా.

    పక్కన డబ్బుతో బుచ్చమ్మ ఉంది కనుక,
    పెళ్లి చేస్తున్నది సౌజన్యారావు పంతులు కనుక ధైర్యంగా కూచున్నాడు కాని,
    లేకపోతె పుంజాలు తెంపుకుని పారిపోడా?
    వాడు (వాడు ఏకవచనం. నీచార్థంలో కాదు) హీరో ఏంటసలు?

    ఎవరి సాయం అక్కరలేకుండానే పూటకూళ్ళమ్మ రోడ్డెక్కి చీపురు తిరగేసిందిగా గిరీశాన్ని కొట్టటానికి.

    ఏదో పోనీలే, తన ఇంట బతుకుతెరువు చూపించిన యజమాని ఆ పెళ్ళికి పెద్ద కదా అని మంచితనానికి ఊరుకుని ఉందేమో కాని,
    లేకపోతె ఆపాటికి అట్లకాడ కాల్చి వాతలు పెట్టేది కాదూ గిరీశానికి.

    ఎవరూ లేనపుడు చూసి. 'బుచ్చీ! ఇంద. ఇదుంచుకో. ఎపుడయిన పనికొస్తుంది' అని చెంగుచాటు నుంచి కొత్త చీపురుకట్ట తీసి పెళ్ళికానుకగా బుచ్చమ్మకి ఇచ్చే ఉంటుందని,
    బుచ్చమ్మ పూటకూళ్ళమ్మ కాళ్ళని కళ్ళకద్దుకునే ఉంటుందని నా ప్రగాఢ విశ్వాసం.
    లేకపోతె గిరీశం సంతతిని ఎవరు భరించగలరు?

    గిరీశానికి స్టార్ హోదా వచ్చేనాటికే పూటకూళ్ళమ్మ విస్మరించబడింది.
    లేదా స్థాయి తగ్గించబడింది.
    విస్మరించబడింది కదా అని ఆ వారసత్వం లేకుండా పోతుందా ఏం?

    మొన్నీ మధ్య (2006 లోనో, 2007 లోనో) బలభద్రపాత్రుని రమణి 'శిక్ష' అని కథ రాసింది.
    ఆ కథ చదవగానే నాకయితే పూటకూళ్ళమ్మ వారసత్వం కనిపించింది.

    తెలుగు సాహిత్యంతో పరిచయం తక్కువ సరే, పోనీ ఇంగ్లీష్ సాహిత్యం గురించి మాట్లాడుకుందాం రండి.
    మిల్టన్ paradise lost గురించి తెలుసు కదా.... అంటూ జోక్చేద్దామనుకున్నా.
    కాని ఈలోపుగానే ఫ్లాష్ వెలిగి థాంక్స్ చెప్పే position కి వచ్చేసా.

    కన్యాశుల్కం సినిమా ఎందుకు హిట్ అయిందో, ఇంకా రకరకాల కథలలో నేను సరిగా convey చెయ్యలేకపోయిన చాలా విషయాలకు క్లారిటీ చాలావరకు వచ్చేసింది.
    మీకు ఇపుడు ఒకేసారి convey చెయ్యటం కష్టం.
    చాలా థాంక్స్.

    కృష్ణకుమారి

    ReplyDelete
    Replies
    1. నాకు తెలిసి 'కన్యాశుల్కం ' సినిమా సక్సెస్ కాలేదు.

      పూటకూళ్ళమ్మ POV లో నాటకాన్ని చక్కగా విశ్లేషించారు.

      Delete
  22. మా reactions డబ్బాలో 'చాలా బాగుంది' అన్న అర లేదేమిటండీ? ఉంటే ఈ టపాకి నా టిక్ అందులో కనపడి ఉండేది ...

    ReplyDelete
  23. ముందుగా వంట బాగా చేయడమెలాగో నేర్చుకుంటానండీ ! చాలా బాగుంది మీ వంట కథ తంటా.

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.