Thursday 5 January 2012

మా సుబ్బారెడ్డి మామ

"అల్లుడూ! అర్జంటుగా రా! నీతో చానా విషయాలు మాట్లాడాల." అని కబురంపాడు మా సుబ్బారెడ్డి మామ.

సుబ్బారెడ్డి మామ మాట నాకు శాసనం. ఆఫీసుకి సెలవు పడేసి హడావుడిగా మాఊరికి బయల్దేరాను. మా ఊరు గుంటూరు టౌనుకి దగ్గర్లో వుంటుంది. ఒకప్పుడు పల్లెటూరు, ఇప్పుడు పట్నంలో కలిసిపోయింది.

సుబ్బారెడ్డి మామ ఆజానుబాహుడు, నల్లటి శరీరం, తెల్లటి జుట్టు, బుర్రమీసాల్తో గంభీరంగా వుంటాడు. ముతక ఖద్దరు గుడ్డతో బనీను, దానికో పెద్దజేబు, జేబులో పొగాక్కాడలు. ఇద్దరు ఆడపిల్లలు. పెద్దమ్మాయిని బావమరిది కోటిరెడ్డికి ఇచ్చుకుని ఇంట్లోనే వుంచుకున్నాడు. రెండోఅమ్మాయి భర్త బెంగుళూర్లో ఇంజనీర్.

సుబ్బారెడ్డి నాకు మేనమామ. నేను చిన్నతనంలో మా నాయన్ని కోల్పోయాను. దిక్కుతోచని స్థితిలో వున్న మా కుటుంబాన్ని మా మామ అన్నివిధాలుగా ఆదుకున్నాడు, నన్ను చదివించాడు. ఇవ్వాళ నేను ఉద్యోగం చేస్తున్నానంటే అది మామ చలవే. మామ సాయం లేకపోతే నేను మాఊళ్ళో ఏ గొడ్లో కాసుకుంటూ వుండేవాణ్ని. నాకు సుబ్బారెడ్డి మామంటే అమితమైన గౌరవం, వల్లమాలిన అభిమానం.

ఒకప్పుడు మామ పొద్దున్నే సద్దిబువ్వ తిని పొలానికెళ్ళి రైతువారీ పనుల్లో బిజీగా వుండేవాడు. మా వూరు పట్నంలో కలిసిపొయ్యాక వ్యవసాయ భూములన్నీ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కోట్లరూపాయిల ధనరాసులుగా మారిపొయ్యాయి. మా సుబ్బారెడ్డి మామ తెలివిగా, అవసరానికి మేర భూముల్ని కొద్దికొద్దిగా అమ్ముతూ గుంటూర్లో ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టించాడు. పెద్దమనవడికి డొనేషన్ కట్టి డాక్టర్ కోర్స్ చదివిస్తున్నాడు. ఈమధ్య శ్మశానం అభివృద్ధికీ, గుడి నిర్మాణానికి చందాలిచ్చి పుణ్యాత్ముడని పేరూ సంపాదించాడు.

ఊరికి చేరుకునేప్పటికి సాయంత్రం ఏడయింది. "ఏవిఁరా! మీమామ పిలిస్తేగానీ మనూరు గుర్తుకు రాదా?" అంటూ అత్త నవ్వుతూ పలకరించింది. టీవీలో ఏదో రాజకీయ చర్చ చూస్తున్న సుబ్బారెడ్డి మామ అల్లుడు కోటిరెడ్డి నన్నుచూసి ముఖం అటుగా తిప్పుకున్నాడు, మనసు చివుక్కుమంది. యేదో పనుండి మామ బయటకి వెళ్ళాట్ట, అన్నం తినే వేళకి వచ్చాడు. నన్ను ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు కనుక్కున్నాడు.

భోజనాలకి నేను, మామ, కోటిరెడ్డి పీటల మీద కూర్చున్నాం. ఆ ఇంట్లో డైనింగ్ టేబుల్ లేదు, మామకి అట్లా కింద కూర్చుని తినడమే ఇష్టం. నాటుకోడి ఇగురు, గారెలు, చేపల పులుసు. అన్నీ నాకిష్టమైనవే! అందులో మా అత్త చేతివంట. అత్త కొసరికొసరి వడ్డిస్తూ తినిపించింది.

భోజనాలు అయ్యాక వరండాలో నవ్వారు మంచాల మీదకి చేరాం. మామ పొగక్కాడ సాపు చేసుకుంటూ అసలు విషయంలోకి వచ్చాడు. 

"రవణారెడ్డి! ఈమధ్యన మన కోటిరెడ్డి కొత్త ఆలోచనలు చెప్తా ఉండాడు. ఏది చేసినా నీతో ఆలోచన సెయ్యకుండా ఏదీ సెయ్యను. నువ్వూ, కోటిరెడ్డి ఒక మాటనుకుంటే నాకు దైర్నం." అంటూ చుట్ట కట్టటం మొదలెట్టాడు.

"అన్నా! ఏందా ఆలోచన?" ఆసక్తిగా కోటిరెడ్డిని అడిగాను.

కోటిరెడ్డి ఒకక్షణం ఆలోచించి మాట్లాడాడు. 

"తమ్ముడూ! మన్దగ్గర డబ్బుంది, ఊళ్ళో మంచిపేరుంది. ఈ రోజుల్లో ఇయ్యి మాత్రమే సరిపోతయ్యా? సరిపోవు. డబ్బున్నోడికి పలుకుబడి కూడా వుంటేనే అందం చందం. మరి పలుకుబడి యాడుంది? డబ్బులో వుందా? లేదు. మరెందులో వుంది? అధికారంలో ఉంది. మరా అధికారం యాడుంది? అధికారం రాజకీయ నాయకుల చేతిలో వుంది. ఆ అధికారం, వోదా ముందు మన్డబ్బు చిత్తుకాయితంతో సమానం! ఆ యవ్వారవే యేరు."

నాకు విషయం అర్ధమైంది. కోటిరెడ్డి రాజకీయాల్లో దిగాలనుకుంటున్నాడు. సుబ్బారెడ్డి మామకి నా సలహా కావాలి. నేనడ్డం కొడతానని కోటిరెడ్డి అనుమానం. ఆలోచిస్తూ మౌనంగా వుండిపొయ్యాను.

చుట్ట నోట్లో పెట్టుకుంటూ నావైపు చూస్తూ "ఏమిరా! ఉలుకూ పలుకూ లేకుండా అట్లా కూకున్నావ్?" అన్నాడు మామ.

"మామా! ఈ యవ్వారం మీరూమీరు మాట్లాడుకోండి. మధ్యన నేన్దేనికి?" పొడిగా అన్నా.

మామ పెద్దగా నవ్వాడు. "ఏందిరో! అయిదరాబాదు నీళ్ళు బాగా వంటబట్టినయ్యే. పరాయోడిలా గుట్టుగా మాట్లాడతా వున్నావు. సదువుకున్నోడివి, తెలివైనోడివి, మనోడివనీ నిన్ను అర్జంటుగా పిలిపిస్తిని. నువ్వేంది ఎనకా ముందాడతా వున్నావు?" అంటూ అగ్గిపుల్ల వెలిగించి చుట్టకొనకి నిప్పంటించాడు.

మామ ఈమాట అనంగాన్లే నాకు చాలా సంతోషమేసింది. ఇంక నేను నా మనసులో మాట సూటిగా చెప్పొచ్చు, కోటిరెడ్డి ఏమనుకుంటాడోనని సందేహం అనవసరం.

"రాజకీయాలకి బయట వుంటూ చేసే విశ్లేషణ వేరు, రాజకీయాన్ని ఒక కెరీర్‌గా ఎంచుకునేప్పుడు చెయ్యాల్సిన ఆలోచన వేరు. మన రాజకీయ అవసరాలు, ఆయా పార్టీ భవిష్యత్తుల్ని అంచనా వేసుకోవాలి. ఒక పార్టీ ఫిలాసఫీ గొప్పగా ఉండొచ్చు, ఆపార్టీని నడిపించే నాయకుడూ మంచోడయ్యుండొచ్చు. కానీ మనకి అవకాశాలివ్వని పార్టీ ఎంత మంచిదైనా మనకి అనవసరం."

నా మాటల ధోరణికి కోటిరెడ్డి మొహం చిట్లించాడు.

"ఆపరా నాయనా, ఆపు నీసోది. బావా! ఈడు భయస్తుడు. అవకాశాలు చూసుకోటానికి ఇదేమన్నా ఉద్యోగమా! ఇదంతా నాకనవసరం. మనకి మన కులపోళ్ళ పార్టీ వుంది, ఇంకోపార్టీ గురించి ఆలోచిస్తే ఎంత నామర్దా!" అన్నాడు కోటిరెడ్డి.

"నువ్వు తగ్గు, ఆణ్ణి చెప్పనీ." అంటూ కొటిరెడ్డి వైపు చూస్తూ చుట్టపొగ గుప్పున వదిలాడు సుబ్బారెడ్డి మామ.

నేను మాట్లాడసాగాను. "మామా! ఒప్పుకుమంటున్నాను. రాజకీయాల్లో మనకి మనోళ్ళ పార్టీనే ఫస్ట్ చాయిస్. కానీ ఆలోచించు. సపోజ్ మనం రాజకీయంగా మన పార్టీలో దిగాం అనుకుందాం. అప్పుడేమవుద్దీ? ఎలక్షన్ల దాకా పార్టీకయ్యే ఖర్చు మన్చేతే పెట్టిస్తారు. పోనీ సీటు గ్యారంటీనా అంటే అదీ వుండదు. టిక్కెట్లిచ్చేప్పుడు కులాలు, మతాలు లెక్కేలేస్తారు. చివరాకరికి టిక్కెట్టు ఇంకెవరికో ఇవ్వొచ్చు."

మామామని ఎట్లాగైనా రాజకీయాల్లోకి దించాలని పట్టుదలగా వున్నాడు కోటిరెడ్డి.

"యేందిరా నువ్వు! మనోడి పార్టీలో చేరటానికి నువ్విట్టా లాభనష్టాలు లెక్కేస్తావేంది. బావా! నాకీలెక్కలు అనవసరం. నేను మనోడి పార్టీలో చేర్తన్నా, ఎలక్షన్ల గెల్చి ఎమ్మెల్యేనైతా. ఈ రవంణారెడ్డిగాడితో నాకు మాటలేంది?"

ఆరిపోయిన చుట్ట ముట్టించుకుంటూ నాకేసి చూశాడు మామ.

"మామా! నా దృష్టిలో రాజకీయాలు పేకాటతో సమానం. వందమంది ఆరిపోతే ఒక్కడు పైకొస్తాడు. వున్న వూళ్ళో దర్జాగా హాయిగా కాలుమీద కాలేసుకుని బతుకుతున్నాం. రాజకీయాల్లోకి దిగితే ఆ వొచ్చే పదవేందో గానీ, విమర్శలు మాత్రం దారుణంగా ఎదుర్కోవాలి. ఇయ్యన్నీ మనకి అవసరమా?" అన్నాను.

"థూ నీయవ్వ! నువ్వసలు మడిసివేనా! పిరికిముండాకొడుకులు ఎంత సదూకుంటే మాత్రం యేం లాభం, గుండెకాయలో ధైర్నం లేనప్పుడు." కయ్యిమన్నాడు కోటిరెడ్డి.

"అన్నా! ఎందుకు నామీద కోపం జేస్తావ్! మామ అడగబట్టే కదా నేజెబుతుండా! ఈ రాజకీయాలు రొచ్చుగుంటలాంటివి. పార్టీని నీ చేతిలో పెడుతున్నామంటారు, పార్టీకి నువ్వే దిక్కంటారు. నీచేత గాడిద చాకిరి చేయించుకుంటారు. తీరా ఎలక్షన్ల సమయానికి వాళ్ళేసే కూడికలు, తీసివేతల్లో నీకు టికెట్ రాకపోవచ్చు. ఇట్లా దెబ్బ తిన్నోళ్ళని ఎంతమందిని చూళ్ళేదు. ఎవరో ఎందుకు? మన కిష్టారెడ్డిని చూడు. పాపం! పొలమంతా అమ్ముకున్నాడు, అప్పులపాలయ్యాడు. ఈ రాజకీయాల్లో ఏదయినా జరగొచ్చు. ఏదీ జరక్కపోవచ్చును కూడా! ఏదైతే అదైంది, పోతేపోయింది వెదవ డబ్బేగదా అనుకుంటే ఇందులోకి దిగు." అంటూ చెప్పదం ముగించాను.

"శెబాస్ అల్లుడు! ఇషయం ఇడమర్చి సెప్పావ్!" మెచ్చుకోలుగా అన్నాడు సుబ్బారెడ్డి మామ.

ఆవేశంతో ఊగిపోయాడు కోటిరెడ్డి. "రే రవణారెడ్డిగా! నీలాంటి ఎదవనాకొడుకు మన కుటుంబంలో ఉంటం మా దరిద్రం రా! గుడిసేటి నాయాలా." అంటూ అరిచాడు.

"ఏందిరా పెద్దంతరం చిన్నంతరం లేకండా నాముందే నోరు లేస్తా ఉండాది. ఆడి ఆలోసెన ఆడు సెప్పాడు, ఇందులో నేకేంది నెప్పి." అంటూ ఆరిపోయిన చుట్టని పడేశాడు సుబ్బారెడ్డి మామ.

కోటిరెడ్డి పెద్దగా అరుస్తూ విసురుగా వెళ్ళిపోయాడు.

నాకు బాధేసింది. కోటిరెడ్డి నన్ను అంతేసి మాటలంటాడని ఊహించలేదు. రాత్రంతా కలతనిద్ర. మామాఅల్లుళ్ళ మధ్య అనవసరంగా ఇరుక్కున్నానేనోమోనన్న భావన నన్ను సరీగ్గా నిద్ర పోనీయలేదు. రకరకాల ఆలోచనలు.

'ఏదో ఒకరకంగా డబ్బు గడించి అధికారమే పరమావధిగా రాజకీయాల్లోకొస్తున్నారు. ఇప్పుడున్న నాయకులేమన్నా ఆకాశం నుండి వూడిపడ్డారా! నా మధ్యతరగతి నేపధ్యం, ఉద్యోగ మనస్తత్వంతో అనవసరంగా కోటిరెడ్డిని నిరుత్సాహపరిచానా? ఏమో!'

-----

గుంటూరు నుండి హైదరాబాదుకి పల్నాడు ఎక్స్‌ప్రెస్ ఉదయానే ఐదున్నరకుంది. ఇంక వుండాలనిపించట్లేదు. తెల్లారుఝాము నాలుగింటికి లేచి బట్టలు సర్దుకుంటుంటున్నాను. నెమ్మదిగా నా గదిలోకొచ్చాడు సుబ్బారెడ్డి మామ.

"ఏమిరా అల్లుడూ! ఇంకో నాలుగు దినాలు వుండి పోవచ్చుగదా! ఆడేమి కొంపలు మునిగిపోతున్నాయి."

"మామా! ఆఫీసులో అర్జంటు పని, రాత్రే ఫోనొచ్చింది. ఇప్పుడు బయల్దేరితే ఆఫీస్ టైంకి అందుకోవచ్చు."

నా కళ్ళల్లోకి చూశాడు సుబ్బారెడ్డి మామ.

"అల్లుడూ! అర్ధమయ్యింది, నీ మనసుకి కష్టం కలిగింది. ఈ రాజకీయాల్లోకి దిగితే ఉన్నది వూడుద్దని నాకూ తెలుసు. కానీ కోటిరెడ్డికి రాజకీయం పిచ్చ పట్టింది. మరీ బడాయికి పోతా ఉండాడు. ఎన్ని సుట్లు సెప్పినా బుర్రకెక్కట్లా. నన్నేమన్లేక పెళ్ళాన్ని తిడతా ఉండాడు. గట్టిగా సెబుదామంటే.. పిల్లనిచ్చుకున్నానాయే. కడుపు సించుకుంటే కాళ్ళమీద పడుద్ది. నీసేత ఆ నాలుగు ముక్కలు సెప్పిస్తే, అయ్యడ్డం పెట్టుకుని ఆణ్ణి కొన్నాళ్ళు ఆపొచ్చు. అందుకే నిన్ను అడావుడిగా పిలిపించా."

నేను ఆశ్చర్యపొయ్యాను. నేనేదో తెలివైనోణ్ణననుకుని రాత్రి రాజకీయాల గూర్చి క్లాస్ పీకా. మామ తను చెప్పదలిచింది నాతో చెప్పిచ్చాడు. తను మంచోడిగా మిగిలాడు. ఎటోచ్చి కోటిరెడ్డి దృష్టిలో సైంధవుణ్ణి నేనే! ఇంత తెలివైన సుబ్బారెడ్డి మామకి రాజకీయాలొద్దని తప్పు సలహా చెప్పానా!

"అల్లుడూ! నిన్న కోటిరెడ్డన్న మాటలు మనసులో పెట్టుకోమాక." అంటూ చటుక్కున నా రెండు చేతులు పట్టుకున్నాడు మామ.

నాకు కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి. "ఎంత మాటన్నావ్ మామా! నీ కోసం నేను చావటానిక్కూడా సిద్ధం! అట్లాంటిది నీకోసం మాట పడ్డం ఎంతపని? అవసరమైతే మళ్ళీ కబురంపు." అని మామ కాళ్ళకి నమస్కరించి రైల్వే స్టేషన్ కి బయలుదేరాను.    

42 comments:

  1. 'డాటేరు' గారు,

    ఇదేమిటీ ఈ మారు సుబ్బుడి 'రోలు' మీరు తిప్పేశారు ?

    మొత్తం మీద మావ 'దాటేసారన్నమాట'!

    సుబ్బుడు వెకేషన్ లో వున్నాడా ?

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  2. Zilebi గారు..
    నా పోస్ట్ లకి మీ సరదా వ్యాఖ్య కోసం ఎదురుచూట్టం అలవాటయ్యింది.
    ధన్యవాదాలు.
    సుబ్బు 'రోలు'కి (హ.. హ.. హ) నేనే శెలవిచ్చాన్లేండి.
    (వాడు మరీ పాపులర్ అయిపోయి నన్ను పాపర్ చేస్తాడేమోననే భయం చేత!)

    ReplyDelete
  3. రమణ
    మొత్తమ్మీద డాక్టరువి, అందులోనూ తెలివిగల పిచ్చి డాక్టరువి అనిపించావు.
    మీ మామ తను చెప్పదల్చుకున్నది ఎలా నీతో చెప్పించాడో.. అలాగే
    నువ్వు కూడా నువ్వు చెప్పదల్చుకున్నది రెడ్డి చేత చెప్పించావు!
    రవి

    ReplyDelete
  4. బాగుందండీ,
    Bold, novel, open and setting new trend. Heart touching at the end.

    ReplyDelete
  5. ఈ వస్తువు తో కారా మాస్టారు ఒక కథ రాశారు అని గుర్తు. నాయుడమ్మ అని ముఖ్య పాత్ర.

    ReplyDelete
  6. బాగుంది డాట్టరు గారూ, అంకిరెడ్డి పాలెంలో ఒకరోజు గడిపినట్టు అనిపించింది. నేను మీ బ్లాగుకు వచ్చేది ఇలా "మన" భాష వింటానికే. కాకపోతే ఒక కధ/కధానిక లాగా చూసుకొంటే కొంచెం underwhelming గా ఉంది. ఇంతకీ క్రిష్ణారెడ్డి గారు హైదరాబాదులో ఉంటున్నారా?

    ReplyDelete
  7. bondalapati గారు..
    నాకు కారా మాస్టారి యజ్ఞం, కుట్ర, చావు మొదలైన ప్రముఖమైన కథలే గుర్తున్నాయి.
    నాయుడమ్మ కథని వెదికే పని పెట్టారు.
    ధన్యవాదాలు!

    ReplyDelete
  8. వనజ వనమాలి గారు..
    ధన్యవాదాలు.
    మంచి అభిప్రాయం!
    ఎవరిదో మీరు రాయలేదు.

    ReplyDelete
  9. nvasireddi గారు..
    మీది గుంటూరే! మాది గుంటూరే!!
    ఎంతయినా మన గుంటూరు గుంటూరే!!!
    నా కథలో కిష్టారెడ్డి ఆచూకీ చెప్పేశానుగా.
    ఇంకెక్కడ కిష్టారెడ్డి!

    ReplyDelete
  10. ఫస్ట్ టైమ్ మీ బ్లాగ్ చూడడం....
    మీ ఊరు వెళ్ళి వచ్చినట్టే ఉంది, మీరు రాసినది చదివి....
    చాలా బాగా వ్యక్తీకరించారు.... ఇంకా ఏదో ఏదో వాగేద్దామని ఉంది ఇందులో..
    బాగొదు కదండి అలా చేస్తే.....

    ReplyDelete
  11. రాజీవ్ రాఘవ్ గారు..
    నా బ్లాగుకి స్వాగతం. సుస్వాగతం.
    మనం ఏం చెప్పినా అది 'మాట్లాడుట' కిందకి వచ్చును.
    అవతలివాడు ఏం మాట్లాడినా అది 'వాగుట' కిందకి వచ్చును.
    నేనయితే ఈ principle ఫాలో అయిపోతున్నా!
    మీరూ నా రూట్లోకి రావచ్చు గదా!
    తోడుగా ఉంటారు!

    ReplyDelete
  12. మీరు ఏడిపిస్తారాండీ? నవ్వులే పూయిస్తారు అనుకున్నాను..

    ReplyDelete
  13. సుభ గారు..
    ఏం చెయ్యమంటారు?
    బ్లాగులు రాసుకుంటున్నానని.. డిస్టర్బ్ చెయ్యటం దేనికిలే అని.. పేషంట్లు రావటం మానేశారు.
    పేషంట్లు రాక.. ప్రాక్టీస్ లేక.. ఆదాయం లేక.. ఆర్ధిక ఇబ్బందులతో తల్లడిల్లితూ.. కొంచెం హెవీగా రాశాలేండి!
    ఓ నలుగురు పేషంట్లొచ్చి.. ఇంట్లో ఉప్పూ, పప్పూ కొనుక్కునేదాకా.. నాది ఇదే ట్రెండ్!

    ReplyDelete
  14. చాలా బాగుందండీ wonderful...

    ReplyDelete
  15. వేణూ శ్రీకాంత్ గారు..
    ధన్యవాదాలు.
    గ్రామీణ నేపధ్యంతో నేనెప్పుడూ రాయలేదు. కారణం..
    నా జీవితంలో ఈ రోజు వరకూ నేను ఏ ఒక్క రోజు కూడా ఏ గ్రామంలో గడప లేదు.
    ఇది నాలోని అతి పెద్ద లోపం.
    నా స్నేహితులు మాది ఫలానా గ్రామం అని చెబుతుంటే ఈర్ష్యగా ఉంటుంది.
    గ్రామీణ జీవితం గూర్చి నా అవగాహన పుస్తకాలు, సినిమాల నుంచే!
    ఈ కథలో పాత్రలు గ్రామీణ యాసలో మాట్లాడతాయి గానీ..
    యాసలో consistency లేదు. గమనించే ఉంటారు.
    కారణం.. నా పరిమితులు.
    అదీ కథ!

    ReplyDelete
  16. రమణ గారు,
    మీ కోసం నేను వెతికి పెట్టానండీ. ఇటీవల వచ్చిన కా రా మాస్టారి సమగ్ర రచనల సంపుటి లో ఉంది ఈ కథ. ఆయన దీనిని 2006 లో రాశారు. కథ పేరు "అన్నెమ్మ నాయు రాలు.". నాయుడమ్మ కాదు. నేను తప్పు పడ్డాను.
    మీకు ఈ కథ కావాలంటే చెప్పండి. కాపీ తీసి పంపిస్తాను.

    ReplyDelete
  17. "నా జీవితంలో ఈ రోజు వరకూ నేను ఏ ఒక్క రోజు కూడా ఏ గ్రామంలో గడప లేదు."
    నిజమా? నమ్మలేక పోతున్నాను. How sad!

    ReplyDelete
  18. కానీ మీ పాత్రలతో బాగా మాట్లాడిస్తారే, పల్లెటూరితో పరిచయం లేదని మీరు చెప్తే తప్ప, నాకు అనుమానమే రాలేదు

    ReplyDelete
  19. bondalapati గారు..
    ధన్యవాదాలు.
    ఇప్పుడే మితృలు, రచయిత నల్లూరి రుక్మిణి గారితో మాట్లాడాను.
    వారి వద్ద నున్న కారా మాస్టారి మనసు foundation వారి సమగ్ర సంకలనం పంపిస్తానన్నారు.
    అందులో మీరు ప్రస్తావించిన కథ కూడా ఉంది. నా దగ్గర 1980 ల సంకలనం మాత్రమే ఉంది.
    ఆ తరవాత కథలు నేను చదవలేదు.

    ReplyDelete
  20. Chandu S గారు..
    మొదటి కామెంట్ : అసలే బాధ పడుతుంటే మళ్ళీ మీ సానుభూతొకటి!

    రెండో కామెంట్ : మీరు గమనించలేదా! అనుమానం రాలేదా!
    అయ్యో! సత్య హరిశ్చంద్రుళ్ళా నిజాలు మాట్లాడేశానే! తూచ్..!

    ReplyDelete
  21. మొత్తానికి మని సుబ్బారెడ్డి మామ ని రాజకీయాలకి దూరం చేసారా ? (అంటే.. మీరు మా అన్నయ్య గందా)

    ReplyDelete
  22. బాగుంది. ముఖ్యం గా ఎండింగ్ నచ్చింది నాకు.

    ReplyDelete
  23. యాసలో inconsistency నేనసలు గుర్తించలేదు రమణ గారు.. మీరన్నట్లు ఒకవేళ ఉన్నా అది ఫ్లోకి ఏవిధంగానూ అడ్డుపడలేదు.. పల్లెటూరితో పరిచయంలేకుండా ఇంత చక్కగా రాశారంటే టోపీలు తీసేస్తున్నా(హ్యాట్సాఫ్) :-)

    ReplyDelete
  24. నేను టెంత్ పాసయ్యాకా ఏమి చదవాలా అని మా ఇంట్లో డిస్కషన్ జరిగింది.
    (అప్పట్లో ఎంసెట్ మాత్రమే జీవితం కాదు. బాంకు క్లర్కు అయితే చాలు అనుకునే రోజులు అవి)

    మా నాన్న గారు ఒకే మాట చెప్పారు.
    'ఏమయినా చెయ్యి కాని, సినిమాలలోకి, రాజకీయాలలోకి మాత్రం వెళ్ళవద్దు ' అని.

    ReplyDelete
  25. Ramana, turns out the uneducated farmer is better at managing human psychology than a qualified professional like you :)

    "The answer, sir, lies in the psychology of the individual": Jeeves

    ReplyDelete
  26. చాలా బాగుందండి . కాని పాపం మేనళ్ళుడినే ఫూల్ ని చేసారు :)

    ReplyDelete
  27. చాలా బావుంది. మీ మావతో మీ బంధాన్ని చాలా చక్కగా వ్రాశారు. Very touching. మీ మావకుటుంబానికి మేలు చేసే పని నిర్మొహమాటంగా చేశారు.

    రాజకీయాల దృష్టినుండి చూస్తే, మీరు చేసింది చాలా మంచిపని. మీ కోటిరెడ్డి రాజకీయాల్లోకి రాక పోవటమే మంచిది. (కోటిరెడ్డి గారికి క్షమాపణలతో). ఇప్పుడు అన్ని పార్టీల్లోనూ మీ కోటిరెడ్డన్నయ్య లాంటి ఉద్దేశ్యాలతో వచ్చినవాళ్ళు చాలా మంది ఉన్నారు. మళ్ళీ ఈయనెందుకు కొత్తగా !

    ReplyDelete
  28. వీకెండ్ గారు,

    మీరు అన్నయ్య గారు (:)) చేసిన సమర్ధించడం అస్సలు ఊహించలేదు . ఇంకా మీరు వస్తారు నిలదీస్తారు. రమణ గారు వెళ్లి మామయ్యకి సర్ది చెపుతారు అని ఎదురు చూస్తున్నాము :)

    సరే అలాక్కాదంటే మరి రమణ గారు రాజకీయాల్లోకి వచ్చేలా మీరు ఒప్పించేయ్యాలి(ఇంకో టపా వ్రాసే లోగా :P)

    ReplyDelete
  29. Mouli గారు,

    హ హ హ... అలా అంటారా. తప్పకుండా ప్రయత్నిద్దాం :) కాకపోతే రాజకీయాలైనా, మరే ఇతర రంగమైనా ఎవరికి వాళ్ళు నిర్ణయించుకొని రావల్సిందే. ఒకళ్ళు చెప్పారనో, ఏవరో ఒప్పించారనో రావడం రాజకీయలకైతే అస్సలు జరగని పని.

    రమణ గారి లాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఆనందమే. రమణ గారి లాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చేలా మన రాజకీయాలు మారుతాయని ఆశిద్దాం.

    ReplyDelete
  30. Mauli గారు..
    తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం 'అన్నయ్యగారు'!
    మీరు నన్ను 'అన్నయ్యగారు' అనకుండా ఉండాలంటే నేనేం చెయ్యాలి?

    ReplyDelete
  31. bonagiri గారు..
    అది పాత రోజుల్లో.
    ఈ రోజు రాజకీయ, సినిమా రంగాలు వారసులకి రిజర్వ్ అయిపోయాయి గదా!
    మనని ఎందుకు రానిస్తారు?

    ReplyDelete
  32. మాలా కుమార్ గారు..
    ఈ కథ కాని కథని మెచ్చుకున్నందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  33. క్రిష్ణప్రియ గారు..
    ధన్యవాదాలు.

    ReplyDelete
  34. Weekend Politician గారు..
    ధన్యవాదాలు.
    నా వృత్తి రీత్యా నాకు చోటా మోటా రాజకీయ జీవులు తారస పడుతుంటారు.
    వారి అమాయకత్వం, అజ్ఞానం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.
    'ఈ సారి టికెట్ నాకే!' అంటూ బల్ల గుద్దుతారు.
    'ఫలానా నాయకుడు నేనెంత చెబితే అంత!' అని కాలర్ ఎగరేస్తుంటారు.
    చివరికి భార్యాబిడ్డలని రోడ్డున పడేస్తారు.
    చిన్నపిల్లాడికి కూడా అర్ధమయ్యే లాజిక్ వీళ్ళకి అర్ధం కాదేమి!
    నా పోస్టుకి ప్రేరణ ఈ ఆశాజీవులే.

    ReplyDelete
  35. అన్నాయ్ ఈ సారి నేనొచ్చినపుడు అత్తని 'బొమ్మిడాయల పులుసు'....రెకమండ్ చేయావా.

    ReplyDelete
  36. డాక్టర్ గారూ...కథనం బావుంది..మీరు కథలెందుకు రాయకూడదూ...

    ReplyDelete
  37. "మా మామని ఎట్లాగైనా సరే! రాజకీయాల్లోకి దించాలని పట్టుదలగా ఉన్నాడు కోటిరెడ్డి."

    ఇంకేం మామ స్వతహాగా మంచోడే, కాకపోతే అవకాసం వచ్చేదాకా ఖర్చు పెట్టకుండా, సాధించుకోగల సత్తా రావాలి. ఎలక్షన్ లో ఖర్చు తప్పనిసరి. కాబట్టి కోటిరెడ్డి ని పక్కనపెట్టినా, ఆలోచించి సలహా ఇచ్చున్దాల్సింది :)

    ఇది కధలోని లోపం కాదా ?

    ReplyDelete
  38. జ్యోతిర్మయి గారు..
    కథలు రాయవలసిన వయసులో రాయలేకపోయాను.
    దానికి కారణాలు వివరంగా రాస్తాను.
    ఇప్పుడు నాకంత ఉత్సాహం / ఓపిక / ఏకాగ్రత / సమయం లేదు.

    ReplyDelete
  39. Mauli గారు..
    మీరు కథలో ఏదో లోపం ఉందన్నారు.
    కానీ.. మీ కామెంట్ నాకర్ధం కాలేదు.
    క్షమించగలరు.

    ReplyDelete
  40. "ఏందిరో! అయిదరాబాదు నీళ్ళు బాగా వంట బట్టినయ్యే. పరాయోడిలా గుట్టుగా మాట్లాడతా ఉన్నావు."


    rajakeeyala sangathi ala pakkana pedithe,ee vakyam chalabaga nachindi.entha baga chepparandi.nijamga ee ayidarabad vallu sontha vallu ayina parayi valla laga matladatharu....bahusa adi fashion emo...

    ReplyDelete
    Replies
    1. వంశీ గారు..
      ధన్యవాదాలు.
      పట్టణీకరణ ప్రభావం మనుషుల్ని 'మర్యాదస్తుల్లా' మార్చేస్తుంది లేండి.

      Delete

comments will be moderated, will take sometime to appear.