Friday 28 November 2014

అమాయకుల ఆందోళన


ఒకానొకప్పుడు - ఎక్కడైనా, ఎప్పుడైనా అంతిమంగా న్యాయమే జయిస్తుందని నమ్మేవాణ్ని. యిలా నమ్మడం నా అమాయకత్వం మాత్రమేనని కొన్నాళ్ళకి అర్ధం చేసుకున్నాను. అప్పుడు నేను - నా అమాయకత్వానికి నవ్వుకున్నాను.

ఈ తరహా అమాయకత్వం ఏ వొక్కడి సొత్తూ కాదనుకుంటాను. ఎందుకంటే - ఈ లోకంలో ఎప్పుడూ కావల్సినంతమంది అమాయకులు వుంటూనే వున్నారు. వాళ్ళని చూస్తుంటే నాకు జాలేస్తుంది. యిలా జాలి పడటం నాకేమీ సంతోషంగా లేదు.

ఒకప్పుడు అజ్ఞానంతో - 'మీ చర్మం రంగు తెల్లగా మార్చేస్తాం' అంటూ క్రీముల కంపెనీలు గుప్పించే ప్రకటనలు చూసి - 'చర్మం ఆరోగ్యంగా వుండాలి గానీ ఏ రంగులో వుంటేనేం?' అని విసుక్కునేవాణ్ని. నేనిప్పుడా ప్రకటనల్ని అర్ధం చేసుకున్నాను, సమర్ధిస్తున్నానుకూడా! అవును - మనం తెల్లగా వుండాలి! వుండి తీరాలి!

'హిందూ మతవాదులు గోవుల్ని చంపడం నిషేధించండి! అంటూ నినదిస్తారే గానీ, అదే జాతైన గేదెల్ని చంపొద్దని ఎందుకు అనరు?' ఇది కంచె ఐలయ్య ప్రశ్న. తెల్లగా వుండటమే గోవుల పవిత్రతకి కారణమా? అయ్యుండొచ్చు! 'ఎరుపంటే కొందరికి భయం భయం!' అన్నాడే కానీ - నలుపు తెలుపుల సంగతి చెప్పలేదు శ్రీశ్రీ.

కాబట్టి - మనిషైనా, జంతువైనా చర్మం నల్లగా వున్నట్లైతే - ప్రాణాలకి రక్షణ ఉండదని అర్ధమవుతుంది. మన పేదదేశాలవారికి అమెరికా ఒక సుందర స్వప్నం. కానీ ఆ అమెరికాలో నివసించే నల్లవారికి మాత్రం ఒక పీడకల. ఈ విషయం మాల్కం ఎక్స్, మార్టిన్ లూధర్ కింగ్ వంటి హక్కుల నాయకులు హత్య చేయబడ్డప్పుడే అర్ధమైంది.

కొన్నిరోజుల క్రితం అమెరికాలో ఓ 'నల్లతోలు' యువకుణ్ని కర్తవ్య నిర్వహణయే పరమావిధిగా భావించిన 'తెల్లతోలు' పోలీసు దొర అనుమానంగా, హడావుడిగా కాల్చి చంపేశాట్ట.

ఇదసలు వార్తేనా? కాదు కదా! మరీ ఆందోళనలేమిటి? ఎందుకంటే - మొదట్లో నే చెప్పినట్లు - ఈ ప్రపంచం అమాయకుల నిలయం. ఈ అమాయకులు అజ్ఞానంతో అరుస్తారు. అలా అరవగా అరవగా - కొంతకాలానికి వారే విజ్ఞానవంతులవుతారు.

ఒక మాజీ అమాయకుడిగా నొక్కి వక్కాణిస్తున్నాను - ఇవన్నీ మనం పట్టించుకుని సమయం వృధా చేసుకోరాదు. ఎంత అన్యాయం! అమెరికా ఎన్నో కష్టనష్టాలకోర్చి, ఎక్కడెక్కిడికో వెళ్ళి దుష్టుల్ని సంహరించి ప్రపంచశాంతిని కాపాడుతుంది కదా! అటువంటి ఒక గొప్పదేశానికి - తన పౌరుడ్ని (వాడు నల్లవాడో తెల్లవాడో మనకనవసరం) చంపుకునే అధికారం, హక్కు వుండకూడదా? వుండాలి! వుండితీరాల్సిందే!!

(photo courtesy : Google)

Monday 24 November 2014

నేరమంతా ఒక్క రాంపాల్ బాబాదేనా?


గత కొన్నిరోజులుగా సంత్ రాంపాల్ అనే ఒక బాబా వార్తల్లో వ్యక్తిగా మారాడు. మీడియా రాంపాల్ అరాచకాల్ని కథలు కథలుగా రాసేస్తుంది. ఆశ్చర్యమేమంటే - రాంపాల్ ఆశ్రమ రహస్యాలు కొందరికి ఆశ్చర్యంగా అనిపించడం! ఈ ఆశ్రమాలు, భక్తుల హడావుడి.. నాకైతే ఇదంతా ఓ deja vu. ఈ బాబాలేం రాత్రికి రాత్రి పుట్టుకు రాలేదు, ఇవన్నీ మనకి కొత్తేం కాదు.

బ్రతకడానికి అనేక వృత్తులు - డాక్టర్లు, న్యాయవాదులు, మెకానిక్కులు.. మొదలైనవి. అలాగే - 'బాబాగిరి' కూడా ఒక వృత్తేనని అనుకుంటున్నాను! నిజం చెప్పాలంటే - మిగతా వృత్తులతో పోలిస్తే ఈ బాబావృత్తిలోనే తీవ్రమైన పోటీ నెలకొని వుంది. వందలమంది బాబాల అవతారం ఎత్తుతారు - అతికొందరికి మాత్రమే 'గుర్తింపు' లభిస్తుంది.

గొంగళిపురుగు సీతాకోక చిలగ్గా మారేముందు అనేక దశలు. అలాగే - బాబాలక్కూడా అనేక దశలు. ముందుగా ఫలానా బాబా మహిమ కలవాడని లోకల్‌గా ప్రచారం చేసుకుంటారు. మందీమార్భలం, శిష్యగణంతో హడావుడి చేస్తారు. నిదానంగా రాజకీయ నాయకుల్ని, ఉన్నతాధికారుల్ని ఆకర్షిస్తారు. ఇదంతా ఒక పకడ్బందీ ప్లాన్ ప్రకారం జరిగిపోతుంది.

క్రమేణా - పాపులారిటీతో పాటు భక్తులూ పెరుగుతారు. భక్తుల్ని జాగ్రత్తగా హేండిల్ చేస్తూ - రాజకీయ నాయకులకీ, ఉన్నతోద్యోగులకీ, కాంట్రాక్టర్లకీ liaison work చెయ్యడం మొదలెడ్తారు. ఉన్నత వర్గాలవారికి నమ్మకమైన బ్రోకర్‌గా వ్యవహరిస్తారు. కొంతకాలానికి - ఆ వర్గాల వారు తమ నల్లధనాన్ని బాబాల దగ్గర పార్క్ చేస్తారు. ఇలా - ఇంతమందీ కలిస్తేనే ఒక 'బాబాసామ్రాజ్యం' తయారవుతుంది. కొన్నిచోట్ల బాబాలకి మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు వున్నాయంటే - వీరి స్థాయేమిటో అర్ధం అవుతుంది.

బాబాల భక్తులుగా - సైంటిస్టులు, డాక్టర్లు వంటి గౌరవనీయమైన వృత్తుల్లో వున్నవాళ్ళు కూడా వుంటారు. ఈ దేశంలో చదువుకున్నవాళ్ళకి అనవసరమైన గౌరవం ఇస్తుంటారు కాబట్టి - 'ఫలానా సైంటిస్టే బాబా కాళ్ళకి మొక్కుతున్నాడు. మనమేమైనా ఆయనకన్నా తెలివైనవాళ్ళమా?' అని కొంతమంది అనుకుంటారు. మనం ఫలానా భక్తుడి కన్నా తెలివైనవాళ్ళం కాకపోవచ్చును, తెలివితక్కువ్వాళ్ళం మాత్రం ఖచ్చితంగా కాదు.

ధీరేంద్ర బ్రహ్మచారి, చంద్రస్వామి.. పేరేదైతేనేం? modus operandi మాత్రం ఒకటే. వీళ్ళకి యోగా అనో, వనమూలికల వైద్యమనో - ఏదోక సైడ్ బిజినెస్ కూడా వుంటుంది. సినిమాల్లో అమ్రిష్ పురీ ఇట్లాంటి బాబా వేషాలు చాలానే వేశాడు. ఒకప్పుడు మన రాష్ట్రంలో బాబాల ఆశ్రమాల్లో కాల్పులు జరిగి మనుషులు చస్తేనే అతీగతీ లేదు. గత కొన్నేళ్ళుగా న్యాయస్థానాలు మాత్రం ఈ బాబాలకి కునుకు లేకుండా చేస్తున్నాయి!

'ఆవారా'లో రాజ్‌కపూర్, కె.ఎ.అబ్బాస్‌లు - నేరమయ వ్యవస్థలో ఒక వ్యక్తి నేరస్తుడిగా ఎలా మారతాడో చెప్పారు. 'గాడ్‌ఫాదర్'లో రాజకీయ వ్యవస్థ, నేర సామ్రాజ్యాన్ని తన అవసరాలకి ఎలా వాడుకుంటుందో మేరియో పూజో, ఫ్రాన్సిస్ కొప్పోలా చూపారు. 'నేరం' అనే ఒక మొక్క - 'నేరవ్యవస్థ' అనే వృక్షంగా రూపాంతరం చెందడంలో తలా ఒక చెయ్యేస్తే గానీ సాధ్యం కాదు.

అయితే - బాబాల నేరాలు బయటపడ్డప్పుడు - బాబాలు మాత్రమే జైలు పాలవుతున్నారు (ప్రస్తుతం జైలు ఊచలు లెక్కబెడుతున్న బాబాల సంఖ్యేమీ తక్కువ కాదు). వీళ్ళతో hand in glove గా వుండి, నేరసామ్రాజ్యాన్ని పెంచి పోషించిన రాజకీయ నాయకులు, అధికారులు మాత్రం తప్పించుకుంటున్నారు (నేను బాబాల్ని సమర్ధించడం లేదు - వారి సహనేరస్తులు తప్పించుకుంటున్నారని చెబుతున్నాను.)

ఇకనుండి బాబా రాంపాల్ మాత్రమే విలన్. మీడియాలో ఆయన గూర్చి రోజుకో దుర్మార్గమైన నిజం వెలుగులోకొస్తుంది. ఇన్ని కేసులున్న రాంపాల్ ఇప్పుడప్పుడే బయటకొచ్చే అవకాశం తక్కువ. బాబాకి ఇప్పటిదాకా సహకరించినవారు దూరంగా సర్దుకుంటారు. కొన్నాళ్ళకి ఇంకో 'దుర్మార్గ' బాబా భాగోతం బయటపడుతుంది - అంతా మామూలే!

ప్రజల్లో అజ్ఞానం పోనంత వరకూ బాబాలకి కొదవుండదు. రాజకీయ నాయకులకి బాబాల అవసరం వుంది. కావునే - ప్రభుత్వాలకి బాబాల నేరాల్ని కట్టడి చేసే ఆసక్తి వుండదు. మనం బాబాల నేరమయ నేపధ్యం మూలాల్ని అర్ధం చేసుకోకపోతే - ఆ మకిలంతా ఒక్కడికే అంటించేసి, వాణ్ని మాత్రమే విలన్‌గా చేసి చేతులు దులుపుకునే పరిమిత అవగాహనలో వుండిపోతాం.

(photo courtesy : Google)

Thursday 20 November 2014

పాలగుమ్మి సాయినాథ్


మనిషికి డబ్బెందుకు? బ్రతకడానికి డబ్బు అవసరం. సుఖమయ జీవనం కోసం కూడా డబ్బు చాలా అవసరం. ఆపై ఆ డబ్బు అవసరం ఎంత? ఈ ప్రశ్నకి సమాధానం ఆయా వ్యక్తుల ఆలోచనా సరళి బట్టి వుంటుంది. 

మనిషి జీవనానికి అనేక వృత్తులు. అన్ని వృత్తులు ఒకేలా వుండవు. కొన్ని వృత్తులు రెండువైపులా పదునున్న కత్తిలా ప్రత్యేకమైనవి.  

ఇందుకు ఒక ఉదాహరణ - వైద్యవృత్తి. ఈ వృత్తిలో ఎంతగానో సంపాదించే అవకాశం వున్నా - అసలా ఆలోచనే లేకుండా - రోగుల సేవ కోసం మాత్రమే పరితపించిన వైద్యులు నాకు తెలుసు. అలాగే - సంపాదనే ధ్యేయంగా రోగుల రక్తం పీల్చి బలిసిన వైద్యులూ నాకు తెలుసు.

ఇంకో ఉదాహణ - పత్రికా రంగం. ఈ రంగంలో - కనీస విలువలు లేనివారి నుండి, ఎంతో నిబద్దత కలిగినవారిదాకా అనేకరకాలైనవారు వుంటారు. పత్రికా విలేఖరులు భాధ్యతా రాహిత్యంగా పన్జేస్తారని ఒకప్పుడు అనుకునేవాణ్ని. పతంజలి 'పెంపుడు జంతువులు' నవల చదివాకా - నా అభిప్రాయం మార్చుకున్నాను.

దేవాలయాలు పవిత్రమైనవే - అందులో పన్జేసే ఉద్యోగులు పవిత్రులు కానక్కర్లేదు. ధర్మాసుపత్రులు పేదల సేవ కోసమే - ఆ ఆస్పత్రి వైద్యులు సేవాతత్పరులు కానక్కర్లేదు. పత్రికా రంగం భాధ్యతాయుతమైనదే - ఆ పత్రికల్ని నడిపే యాజమాన్యాలు భాధ్యాతాయుతులు కానక్కర్లేదు.  

కావున - కొన్ని వృత్తులు ఒకవైపు నుండి - ఎంతో బాధ్యతాయుతమైనవీ, పవిత్రమైనవీగానూ.. ఇంకోవైపు నుండి - చాలా దరిద్రపుగొట్టువీ, దుర్మార్గమైనవీగానూ నేను భావిస్తున్నాను. అనగా - ఇవి విఠలాచార్య సినిమాలో కత్తి వంటివి. ఆ కత్తిని హీరో ఎన్టీఆర్ సద్వినియోగం చేస్తే, విలన్ రాజనాల దుర్వినియోగం చేస్తాడు.

'ది హిందూ' పత్రిక రూరల్ రిపోర్టర్‌గా పన్జేసిన పాలగుమ్మి సాయినాథ్ తన వృత్తికి వన్నె తెచ్చాడని నేను నమ్ముతున్నాను. ఆయన రైతు సమస్యల గూర్చి అనేక వ్యాసాలు ప్రచురించాడు. ఆ వ్యాసాలు చదివిన నేను చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను. రైతుల జీవనం గూర్చి ఏమాత్రం అవగాహన లేని నేను - రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారో అర్ధం చేసుకున్నానంటే - అందుక్కారణం పి.సాయినాథ్ రచనలే.

పి.సాయినాథ్ తెలుగువాడు. మనిషన్నాక - ఏదోక భాషలో పుట్టక తప్పదు. అంచేత - ఫలానా వ్యక్తి 'తెలుగు తేజం' అంటూ తెలుగు వార్తా పత్రికల వికార భాష నేను రాయను. ఈ దేశంలో ఆకలికి, దరిద్రానికి మూలాల్ని శోధించే వ్యక్తి - తమిళ తేజమైనా, కొంకిణీ తేజమైనా మనకొచ్చిన ఇబ్బంది లేదు. 

పత్రికా రంగంలో పి.సాయినాథ్ చేసిన కృషి చాలా విలువైనది. ఈనాడు మనక్కనిపించే మనిషి మనిషి కాదు, వార్త వార్త కాదు. వార్తలు వినోద స్థాయికి దిగజారుతున్న సరికొత్త యుగంలో మనమున్నాం. అంచేత - ఇవ్వాళ ఇంతకుముందు కన్నా - నిజాన్ని నిక్కచ్చిగా, నిర్భయంగా, నిబద్దతతో రాయగలిగే మరింతమంది సాయినాథ్‌ల అవసరం మనకుంది.  

సాయినాథ్ ఈమధ్య హిందూలోంచి బయటకొచ్చేశాడు. మంచిది! ఇప్పుడింక బంధాలేవీఁ వున్నట్లుగా లేవు - హాయిగా, ప్రశాంతంగా పన్జేసుకోవచ్చు. 

పాలగుమ్మి సాయినాథ్‌కి అభినందనలు. 
     
(photo courtesy : Google)

Wednesday 19 November 2014

మమతా దీదీ మమతానురాగం!


'యే నిమిషానికి యేమి జరుగునో ఎవరూహించెదరు? విధివిధానమును తప్పించుటకై యెవరు సాహసించెదరు?' అంటూ లక్ష్మణుడు బాధ పడ్డప్పుడు - 'ఈ ఘంటసాలకి ఎంత గొప్ప స్టొనుంటే మాత్రం - లక్ష్మణుడి రధానిక్కూడా పాటెందుకు?' అని చిరాకు పడ్డాను - అప్పటికి నాకింకా పెళ్లి కాలేదు. పెళ్ళయ్యాక మాత్రం ఈ పాట ఎంత గొప్పదో తెలిసింది ('పాండురంగ మహత్యం' సెకండాఫ్‌లో ఎన్టీరామారావుకి అయినట్లు - నాకూ కనువిప్పయ్యింది)!  

'మారిపోవురా కాలము, మారుట దానికి సహజమురా!' అని షావుకారులో ఒక తత్వం విన్నాను. 'ఏవిఁటో ఈ చక్రపాణి ఛాదస్తం! అడుక్కునే ముసలాయనక్కూడా ఒక పాట పెట్టాలా?' అని విసుక్కున్నాను. ఆ తరవాత నా నెత్తిన జుట్టూడిపోతున్నప్పుడూ, నడుం నొప్పితో 'కుయ్యో! మొర్రో!' అని మూలుగుతున్నప్పుడూ - 'అహా! ఆ తత్వానికి యింత అర్ధం వుందా!' అని అశ్చర్యపొయ్యాను. 

'కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్!' అని దేవదాసు పార్వతిని తల్చుకుంటూ దుఃఖించాడు. అసలే భగ్నప్రేమికుడు! ఆపై ఫుల్లుగా మందు కొట్టాడు! పాడితే గీడితే 'పారూ! పారూ!' అని ఏడ్చుకుంటూ పాడుకోవాలి గానీ - ఈ కుడి, ఎడమ అంటూ అర్ధం పర్ధం లేని పాటేంటనే సందేహం కలిగినా - రాసింది సముద్రాల వంటి ఘనుడు కాబట్టి (ఏదో గొప్ప అర్ధం వుండేవుంటుందని) - దేవదాసుతో పాటు నేనూ దుఃఖించాను. ఇవ్వాళ ఆ పాటతో భారత రాజకీయ చిత్రాన్నే అర్ధం చేసుకోవచ్చు. ఒకప్పుడు కాంగ్రెస్‌కి ఎదురు లేదు, బీజేపీకి దిక్కు లేదు. ఇవ్వాళ అట్టు తిరగబడింది. ఆనాడు సముద్రాల రాసిన పాటలో ఎంత అర్ధం వుంది! 

కావున మిత్రులారా! ఇప్పుడు మీరు గ్రహించవలసిందేమనగా - గొప్పపాటలు అప్పటికప్పుడు అర్ధం కాకపోయినా - తర్వాత్తర్వాత గొప్పగా బోధపడతాయి! 

ముగింపు -

పొద్దున్నే ఈ సినిమా పాటల గోలేంటయ్యా? ఈ మాత్రం దానికి బ్లాగెక్కి అరవాలా? 

అదేంటి మేస్టారూ! అలా కోప్పడతారేంటి? ఇవన్నీ జ్ఞాపకాలండీ బాబూ జ్ఞాపకాలు! ఇవ్వాళ నేను చెప్పకపోతే భవిష్యత్తరాలకి ఈ గొప్ప సంగతులు ఎలా అర్ధమవుతాయి? ఆ సినిమా పాటల సారాన్ని అర్ధం చేసుకున్నాను కాబట్టే ఇవ్వాళ పొద్దున్నే కమ్యూనిస్టుల్తో మమతా దీదీ మమతానురాగం ఫొటో చూసి తట్టుకున్నాను. లేకపోతే - గుండె పగిలి చచ్చుందును! 

(photo courtesy : Google)

Monday 17 November 2014

చరిత్ర చెరశాలలో.. పటేల్ - నెహ్రూ


ఇప్పుడు సినిమా కబుర్ల కోసం అనేక మాధ్యమాలు వున్నాయి. నా చిన్నప్పుడు ఇవేవీ లేవు. అయితే మా సినిమా కబుర్లకి మాత్రం తక్కువేమీ లేదు.

'మా ఏయన్నార్ చేసిన దేవదాసు పాత్రని మీ ఎన్టీవోణ్ని చేసి చూపించమను. సినిమా ఒక్కరోజు కూడా ఆడదు.' అని ఒకడు సవాల్ చేస్తే -

'మా ఎన్టీఆర్ చేసిన బందిపోటు మీ నాగ్గాణ్ని చెయ్యమను. జనాలు తెర చించేస్తారు.' అని వేరొకడు వెక్కిరించేవాడు.

సరదాగా మొదలైన కబుర్లు ఒక్కోసారి తన్నులాటకిక్కూడా దారి తీసేవి. ఏయన్నార్, ఎన్టీఆర్ సినిమాల్లో ప్రత్యర్ధులైనా.. ఇద్దరూ సినిమా నటులే. ఆ విషయం తెలీంది మాకే!

ముప్పైయ్యైదేళ్ళ క్రితం ఈ.వి.రామస్వామి (పెరియార్) రాసిన రామాయణం కొంత చదివాను. 'కొంత' అని ఎందుకంటున్నానంటే మొత్తం చదవడం నావల్ల కాలేదు కాబట్టి. పెరియార్ నాస్తికుడు. ఆనాటి సమాజంలో బ్రాహ్మణాధిపత్యానికి వ్యతిరేకంగా ఉద్యమం చేసిన సాంస్కృతిక నాయకుడు. ఆయన ఉద్యమానికి ఏం చెప్పాలి? 'ఆధిపత్య శక్తులు తమ పెత్తనం సాగించుకోడం కోసం సృష్టించబడ్డ ఒక హిందూ మైథాలజి రామాయణం. దాన్ని చదవకండి, చెత్తబుట్టలో పడెయ్యండి!' అని చెప్పాలి. కానీ ఆయనలా చెప్పలేదు.

మనం ఏవైతే రాముడి లక్షణాలు అనుకుంటామో, అవి తీసుకెళ్ళి రావణుడికి ఆపాదించాడు. సీత లక్షణాలు శూర్పణక, మండోదరిలకి ఆపాదించాడు. అంటే పాజిటివ్ నెగెటివ్‌గానూ, నెగెటివ్ పాజిటివ్‌గానూ రాశాడు. ఆయాన్రాసింది చదువుతుంటే - విఠలాచార్య సినిమాలో ఎన్టీఆర్ రాజనాలతోనూ, రాజశ్రీ విజయలలితతోనూ పాత్రలు మార్చుకున్నట్లుగా అనిపించి నవ్వొచ్చింది. కాకపొతే పెరియార్‌కి రామాయణం పట్ల తీవ్రమైన కోపం వుందని మాత్రం అర్ధమవుతుంది. 

ఒకప్పుడు రామారావు, నాగేశ్వరరావు అభిమానులు తిట్టుకున్నట్లుగానే - ఇప్పుడు నెహ్రూ, పటేల్ అభిమానులు గ్రూపులుగా విడిపొయ్యి వాదించుకుంటున్నారు. ఆనాడు పెరియార్ ఆపాదించినట్లుగా - పటేల్ అభిమానులు నెహ్రూని విలన్‌గా చూపించడానికి తెగ ప్రయత్నిస్తున్నారు. ఈ అభిమానులకి రాజకీయ కారణాలు తప్ప మరే కారణం లేదని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

ఇప్పుడు బీజేపి అధికారంలోకి వచ్చింది కాబట్టి పటేల్ కూడా ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చాడు. ఐతే - హిందుత్వ శక్తులకి పటేల్ మీద అంత ప్రేమెందుకు? పటేల్, మౌలానా ఆజాద్, రాజేంద్ర ప్రసాద్.. అందరూ నెహ్రూ నాయకత్వంలోనే పన్జేశారు కదా? అందరూ కాంగ్రెస్ నాయకులేగా! అయితే అందరూ మంచివాళ్ళవాలి లేదా చెడ్డవాళ్ళవాలి. కానీ - వారికి నెహ్రూ ఒక్కడే చెడ్డవాడు ఎలా అవుతాడు?

భారద్దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది (అంతకుమించి మనకి వేరే గతి లేదు). ఆ పార్టీలో, ఆ పార్టీ నాయకుల్లో.. ఇప్పటి పార్టీల్లోలానే - అనేక లుకలుకలున్నాయి, కుమ్ములాటలున్నాయి, ఎత్తుకు పైయ్యెత్తులున్నాయి. పన్లో పనిగా మన జాతిపితగారు కూడా తన వంతు పాత్రని పోషించారు - నెహ్రూని ప్రధానిగా చేశారు. ఇట్లాంటివన్నీ ఒక రాజకీయ పార్టీలో సహజమే. కాకపోతే చిన్నప్పుడు పాఠాల్లో వీళ్ళ గూర్చి గొప్పగా చదువుకున్నాం కాబట్టి - వీళ్ళంతా దేవతలన్నట్లుగా ఫిక్సైపొయ్యాం.

ఒక ప్రభుత్వం - దేశానికి మంచి చేసినా, చెడు చేసినా మంత్రివర్గం సమిష్టి బాధ్యత వుంటుంది. పటేల్ తీసుకున్న ప్రతి నిర్ణయం వెనుకా నెహ్రూ ఆలోచన వుండాలి, అలాగే నెహ్రూ తప్పుల్లో పటేల్‌కీ వాటా వుంటుంది. ఒక వ్యక్తికి - ఒక పార్టీలోనైనా, ప్రభుత్వంలోనైనా ఒక నిర్ణయం నచ్చనప్పుడు వ్యతిరేకించాలి, వ్యతిరేకించినా కుదరనప్పుడు బయటకి వచ్చెయ్యాలి. ఏ దేశంలోనైనా ఇదే డెమాక్రటిక్ ప్రిన్సిపుల్‌ అప్లై అవుతుంది. మంచంతా ఫలానా ఆయన గొప్పదనం, చెడంతా ఇంకోకాయన నిర్వాకం అని బుకాయిస్తే.. నమ్మేవాళ్ళు నమ్మవచ్చు గాక - నైతికంగా సరికాదు (పటేల్ చివరిదాకా కాంగ్రెస్‌లోనే వున్నాడని మర్చిపోరాదు).

ఒకప్పుడు పెరియార్‌ రాసినట్లుగా - ఇవ్వాళ సుగుణాలన్నీ పటేల్‌కే వున్నట్లు హిందూత్వ శక్తులు ఆకాశానికి ఎత్తేస్తున్నాయి. నాస్తికుడైన పెరియార్‌కి రావణుడు హీరో అయినట్లుగా, చివరిదాకా కాంగ్రెస్‌వాదిగా మిగిలిన పటేల్ బీజేపీకి హీరో అయ్యాడు! తమ అన్న ధర్మరాజు జూదం ఆడ్డం ఇష్టం లేకపోయినా - నలుగురు తమ్ముళ్ళు నోర్మూసుకుని కూర్చున్నారంటే - వారిక్కూడా ఆ జూదంలో భాగం వుంటుంది. అందుకే ఇవ్వాళ ప్రజలకి మన్‌మోహన్‌సింగంటే అంతే కోపం. పటేల్, నెహ్రూ, అంబేడ్కర్‌లని వేరు చేసి చూపడం అంటే - ఒకే తానులో ముక్కల్ని విడివిడిగా అంచనా వెయ్యబూనడమే.

పాపం! ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీవాళ్ళది విచిత్ర సంకటం. నెహ్రూ, పటేల్ ఇద్దరూ కూడా తమ నాయకులే. ఇన్నాళ్ళూ ఉద్దేశ్యపూర్వకంగా పటేల్‌ని పక్కన పెట్టారు. కానీ - నెహ్రూవియన్ విజన్‌ని అవసరానికి మించి పొగుడ్తుంటారు. అందుకు వారికున్న రాజకీయ ప్రయోజనాలే కారణం. వాళ్ళకి నెహ్రూ లెగసీ పూర్తిగా తమ సొత్తేనని, తామే నెహ్రూ వారసులమనీ ప్రగాఢ విశ్వాసం. అందువల్లనే ప్రస్తుత కాంగ్రెస్ నాయకత్వంపై ప్రజలకి వున్న కోపం నెహ్రూ మీదక్కూడా వెళ్తుంది!

ఈ విధంగా - ప్రస్తుతం హిందుత్వ వాదులు పటేల్నీ, కాంగ్రెస్ వాదులు నెహ్రూని చెరొక పక్కా దొరకబుచ్చుకుని (ఆ నాయకులిద్దరూ ఎంత గింజుకున్నా) వదలట్లేదు. ఆ నాయకులు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చేప్పుడు, వచ్చిన తరవాత - రాజకీయంగా ఉన్నత స్థానాల్లో వుండి, దేశగతినే మార్చేసిన అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాల్లో ఎవరి పాత్ర ఎంతనేది తెలుసుకోవాలనుకోడం ఎలా వుంటుందంటే - 'వంకాయ కూరకి ఉప్పు ముఖ్యమా? కారం ముఖ్యమా?' లాగా!

సంఘ పరివారానికి స్వాతంత్రోద్యమంలో పెద్దగా పాత్ర లేదు, వున్నదంతా కాంగ్రెస్‌దే (అదెంత దరిద్రపు దయినప్పటికీ). ప్రస్తుతం ఆ కాంగ్రెస్ అవినీతి రొచ్చులో పీకల్దాకా కూరుకుపోయింది (ఇప్పుడల్లా బయటకొచ్చే అవకాశాలు కనపడట్లేదు). చరిత్ర లేని సంఘ పరివార్ సమస్య - ఐడెంటిటీ క్రైసిస్. అందుకే తెలివిగా పటేల్‌ని తమ పార్టీలో కలిపేసుకున్నారు. ఇదోరకంగా - మన తెలుగు సినిమా సమస్య. వంశచరిత్ర వున్నవాడికేమో నటన రాదు, నటన తెలిసినవాడికేమో వంశచరిత్ర లేదు!

ఈ దేశగతి మార్చిన - ఏ రాజకీయ ఆలోచననైనా చర్చకి, శల్యపరీక్షకి గురి చెయ్యాల్సిందే. అయితే - అది జరగాల్సింది చరిత్రకారుల శాస్త్రీయ విశ్లేషణల ద్వారా మాత్రమే తప్ప పార్టీ ఆఫీసుల్లో కాదు. ఎందుకంటే నెహ్రూ, పటేల్ వంటి నాయకులు చాలా భిన్నమైన ఆలోచన ధోరణి కలిగినవారు. ఎక్కడైనా, ఎప్పుడైనా - రాజకీయ నాయకులు తీసుకునే నిర్ణయాలు అనేక పరిమితులకి లోనై వుంటాయి. వారు తీసుకునే నిర్ణయాలు కొన్ని మంచి ఫలితాల్నిస్తే, మరికొన్ని బెడిసికొడతాయి. కానీ - అప్పటి నాయకుల్లో వున్నదీ, ఇప్పటి నాయకుల్లో లేనిదీ ఒకటి వుంది - నిజాయితీ!

ముగింపు -

జైళ్ళు బ్రతికున్నవాళ్ళ కోసం వుపయోగిస్తారు. కానీ - పాపం! పటేల్, నెహ్రూలు చనిపోయినా కూడా రెండు రాజకీయ పార్టీలవారి బందిఖానాలో యిరుక్కుపొయ్యారు. వారి స్థితి జీవిత ఖైదీల కన్నా ఘోరం! వారికి చెరసాల నుండి త్వరలో విముక్తి కలగాలని ఆశిస్తున్నాను!

(photo courtesy : Google)

Friday 14 November 2014

సిగ్గుతో తల దించుకుందామా?


ఛత్తీస్‌గఢ్‌లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న మహిళలు చనిపొయ్యారు. ఈ చావులు ఆ కుటుంబాలకి తీరని నష్టం. ఈ సంఘటన దేశపౌరులుగా మనమందరం సిగ్గుతో తల దించుకోవాల్సిన విషయంగా నేను భావిస్తున్నాను. 

ఈ చావులకి కారణం తెలుసుకోడానికి ప్రభుత్వం ఒక విచారణ కమిటీని వేస్తుంది. ఆ కమిటీ ఏదో రిపోర్టునిస్తుంది. ఆ రిపోర్టుపై ప్రభుత్వం ఏవో చర్యలు తీసుకున్నామని కూడా చెబుతుంది. ఇదంతా ఓ తమాషా మాత్రమేనని అర్ధం చేసుకోడానికి పెద్దగా జ్ఞానం అక్కర్లేదు. 

అవడానికి మనది ఒకటే దేశమైనా - ఒకదేశంలోనే అనేక దేశాలున్నాయి. ఒకదేశంలో ప్రపంచస్థాయి వైద్యం జరిగితే, ఇంకోదేశంలో కుక్కల కన్నా హీనమైన వైద్యం జరుగుతుంది. ఒకదేశంలో చిటికెన వేలు దెబ్బకి పదిమంది వైద్యుల బృందం వైద్యం ఆపరేషన్ చేస్తే, ఇంకోదేశంలో సరైన ప్రసూతి సౌకర్యాలు లేక చనిపోతారు.

ఈ దేశంలో పేదలకి రక్షణ లేదు. పేదల పట్ల ధర్మకర్తలుగా వుండాల్సిన ప్రభుత్వాలు.. తమ కర్తవ్యాన్ని వదిలేసి అగ్రరాజ్యాలకీ, అంతర్జాతీయ వ్యాపారస్తులకీ మోకరిల్లుతున్నారు. అదేమంటే - ఏవో అర్ధం కాని లెక్కల్తో ఆర్ధిక పాఠాలు చెబుతారు. 

ఏ దేశంలోనైనా పేదవాడి బ్రతుకు హీనమే. దరిద్రులంటే దోమలకి లోకువ, రోగాలకి లోకువ, బొచ్చుకుక్కలకి లోకువ. ఇంతమందికి లోకువైన ఈ ప్రత్యేకజాతి ఐదేళ్ళకోసారి ఓట్లేయించుకోటానికి తప్ప ఇంకెందుకూ పనికిరాదని ప్రభుత్వం వారిక్కూడా లోకువే. 

అందుకే - పేదవాళ్ళు ఆకలికి అలమటించి చస్తారు, చలికి నీలుక్కుపొయ్యి చస్తారు, ఎండకి ఎండిపొయ్యి చస్తారు, వరదలకి కొట్టుకుపొయ్యి చస్తారు. ఇన్నిరకాలుగా చచ్చేవాళ్ళు ఇప్పుడు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకుని కూడా చస్తున్నారు. ఇకనుండి వాళ్ళు చచ్చేందుకు మరో కొత్తకారణం!

విచారణలో అనేక విషయాలు ప్రస్తావనకి రావొచ్చు. సరైన ప్రీ ఆప్ చెకప్స్ జరగలేదనీ, లేపరోస్కోపీ పరికరాన్ని సరీగ్గా స్టెరిలైజ్ చెయ్యలేదనీ, గేస్ కలుషితమైందనీ, డాక్టర్ నిర్లక్ష్యమనీ, పోస్ట్ ఆప్ కేర్ సరీగ్గా ఇవ్వలేదనీ, మందులు మంచివి కావనీ.. ఇలా. సరే! ఈ లోపాల్నన్నింటినీ సరిచేసుకుని - భవిష్యత్తులో పొరపాటున కూడా మళ్ళీ ఇలా జరక్కుండా చేసుకునే కట్టుదిట్టమైన వ్యవస్థ మనకుందా? లేదని నేననుకుంటున్నాను.  

వీధికుక్కల సంఖ్య పెరక్కుండా వాటికి స్టెరిలైజ్ చెయ్యాలని కొన్ని స్వచ్చంద సంస్థలు చెబుతుంటాయి. ఈ గోలంతా లేకుండా - చాలా మునిసిపాలిటీల్లో వీధికుక్కల్ని ఊరి బయటకి పట్టుకెళ్ళి మూకుమ్మడిగా చంపేస్తారు. ఒకవేళ ప్రభుత్వాలకి కూడా జనాభా నియంత్రణకి కుక్కల మోడెల్లో ఏదైనా హిడెన్ ఎజెండా వుందేమో తెలీదు. వున్నా అవి మనకి చెప్పవు.

ఎందుకంటే - బహుళజాతి మందుల కంపెనీలు పేదవారిపై తమ మందుల్ని ప్రయోగించి పరిశీలించుకునే సౌలభ్యాన్ని కల్పించిన దేశం మనది. ఇక్కడ ఏదైనా జరగొచ్చు. ఇలా జరుగుతుందని బయటపడ్డప్పుడు మాత్రం ఎంతోకొంత నష్టపరిహారం ప్రకటించి, ఒక విచారణ కమిటీ వేసి చేతులు దులుపుకోవడం మన ప్రభుత్వాలకి వెన్నతో పెట్టిన విద్య. 

చివరిగా -

లేపరోస్కోపిక్ ట్యూబెక్టమీ చేయించుని హీనంగా, దారుణంగా చనిపోయిన మహిళలకి - సిగ్గుతో తల దించుకుని - నివాళులర్పిస్తున్నాను. 

(photo courtesy : Google)

తూచ్! 'పని లేక.. ' పేరు మార్చట్లేదు


నా బ్లాగు పేరుని చిత్తూరు నాగయ్యలా మృదువుగా, ఎస్వీరంగారావులా బరువుగా, గుమ్మడిలా గంభీరంగా మారుద్దామనుకున్నాను.

ఇంతలో -

సినిమాల్లో తాళి కట్టే ముందు 'ఆగండి!' అని కేక వేసినట్లుగా..

శంకరాభరణం శంకరశాస్త్రి 'శారదా!' అని అరచినట్లుగా..

'ఈ బ్లాగ్ పేరు మార్చడానికి మేం ఒప్పుకోం!' అంటూ గద్దించారు కొందరు మిత్రులు.

మీకు 'పని లేక.. ' పేరే అంత బాగుంటే - దాన్ని మార్చి నే బావుకునేదేమిటి?

ఏవీఁ లేదు.

కాబట్టి - ఇలా 'పని లేక.. ' గానే మిగిలిపోదామనుకుంటున్నాను.. మిగిలిపోతున్నాను!

గమనిక -

ఇప్పుడీ పోస్ట్ హడావుడిగా ఎందుకు రాశానంటే - ఈ విషయం ఇంతటితో వదిలేద్దామని తెలియజెయ్యడానికి..

(picture courtesy : Google)

'పని లేక.. ' బ్లాగ్ పేరు 'అల్పజీవి అంతరంగం'గా మారుస్తున్నాను


మూడేళ్ళ క్రితం బ్లాగ్ మొదలెడదామనుకున్నప్పుడు - కొందరు మిత్రులు 'పని లేదా?' అని నవ్వారు. 'అవును. పని లేదు.' అనుకుని నా బ్లాగుని కూడా 'పని లేక.. ' అనేశాను. ఇదో రకమైన తిక్క. కొన్నిసార్లు నా పోస్ట్ శీర్షికలకి ముందు 'పని లేక.. ' అని ఉండటం చేత అర్ధం మారిపోయింది. ఈ విషయమై జిలేబి, బోనగిరి మొదలైన మిత్రులు జోకులు కూడా వేశారు. 

రాయడం మొదలెట్టినప్పుడు నేనిన్ని పోస్టులు రాస్తానని అనుకోలేదు. నాక్కొన్ని విషయాలు నచ్చుతాయి, ఇంకొన్ని నచ్చవు. కొన్నాళ్ళకి ఈ లిస్టు అటూ ఇటుగా మారిపోతుంది. ఆ రకంగా చూస్తే 'పని లేక.. ' ఇన్నాళ్ళపాటు వుండటం నాకే ఆశ్చర్యంగా వుంది. అందుకు కారణం - కొంత సెంటిమెంటు, కొన్ని జ్ఞాపకాలు.

'పని లేక.. ' చూస్తుంటే నాకు నా మిత్రుడు బి.చంద్రశేఖర్ గుర్తొస్తాడు. "నీ 'పని లేక' హెడింగే ఒక పెద్ద అబద్దం. నువ్వు రాసేవన్నీ అబద్దాలని ఇంతకన్నా ఋజువు కావాలా ?" అంటూ పెద్దగా నవ్వేవాడు చంద్ర. దాదాపు ప్రతి పోస్ట్ చదివేవాడు. వెంటనే ఫోన్ చేసి సలహాలిచ్చేవాడు. 

'పని లేక.. ' చూస్తుంటే నాకు అత్యంత ఆప్తుడైన గోపరాజు రవి గుర్తొస్తాడు. చాలాసార్లు బ్లాగ్ టైటిల్ని (ఏదైనా ఒక రావిశాస్త్రి రచన పేరుగా) మార్చేద్దామనిపించేది. కానీ - అందుకు గోపరాజు రవి ఒప్పుకునేవాడు కాదు. అతనికి 'పని లేక.. ' పేరే బాగా నచ్చింది. అప్పటికీ ముచ్చట పడి - 'అల్పజీవి' అన్న పేరుతొ రావిశాస్త్రి రచనల కోసం ఒక బ్లాగ్ మొదలెట్టాను. అయితే నాకున్న పరిమితుల వల్ల అది ముందుకు సాగలేదు.

చంద్ర, రవి - ఇద్దరూ కొన్ని నెలల తేడాలో ఒకే సంవత్సరం వెళ్లిపొయ్యారు. నాకు వీళ్ళిద్దరూ వున్నప్పుడు చాలా ధైర్యంగా వుండేది. చంద్రాతో వాగ్వివాదం, రవితో సంభాషణ నాకు చాలా ఇష్టం. ఒకప్పుడు పోలిటిక్స్ కొంచెం ఘాటుగా రాసేవాణ్ని. అందుక్కారణం కూడా వీళ్ళిద్దరే!

ఈ సెంటిమెంట్లు, జ్ఞాపకాలు పక్కన పెడితే - ఇప్పుడు 'పని లేక.. ' అన్న పేరు నాకే బోరు కొట్టేస్తుంది. నా బ్లాగ్ పేరు మార్చడానికి ఇదొక్కటే కారణం. అయితే - కొత్తగా ఏ పేరు పెట్టినా - అది రావిశాస్త్రి రచనే కావాలి అన్న ఖచ్చితమైన నీయమం మాత్రం నాకుంది. నేన్రాసే ప్రతి వాక్యం వెనుక రావిశాస్త్రి వున్నాడని నమ్ముతున్నాను (అది నా మూఢనమ్మకం అని మీరనుకున్నా నాకు అభ్యంతరం లేదు).

ఎలాగూ 'అల్పజీవి' అనుకున్నాను కాబట్టి - ఇకనుండి నా బ్లాగ్ పేరు 'అల్పజీవి అంతరంగం'గా మారుస్తున్నాను. అంచేత ఇకపై బ్లాగ్ ఎగ్రిగేటర్లలో నా 'పని లేక.. ' బ్లాగ్ 'అల్పజీవి అంతరంగం'గా కనపడుతుంది. అరవైయ్యేళ్ళ క్రితం 'అల్పజీవి' అన్న పేరుతో రావిశాస్త్రి రాసిన నవల చాలా ప్రసిద్ధి గాంచింది. అయితే - అల్పజీవి 'సుబ్బయ్య'కీ, నాకూ ఏ మాత్రం సంబంధం లేదని గుర్తించ మనవి (ఆ సుబ్బయ్యో దొంగ వెధవ. నేను మాత్రం మంచి వెధవని).

నా బ్లాగ్ ఎడ్రెస్ (URL) yaramana.blogspot.in గానే ఉంచేస్తున్నాను. కావున bookmark చేసుకున్నవారికి ఇబ్బంది వుండదు. ఇకనుండి మీకు 'అల్పజీవి అంతరంగం' అన్న బ్లాగ్ కనిపిస్తే - ఇది ఒకప్పటి 'పని లేక.. ' వాడి బ్లాగే అన్న సంగతి గుర్తుంచుకుంటే సంతోషిస్తాను (గుర్తు రాకపోతే దుఃఖిస్తాను). 

ఎందుకైనా మంచిది - కొన్నాళ్ళపాటు in brackets లో 'పని లేక.. ' అని కూడా వుంచుతాను. ఇంత చెప్పావుగా? ఇంకా పాత పేరు గుర్తు చెయ్యడం దేనికి అంటారా? ఇదో ఓల్డేజ్ ఆబ్సెషన్! అంతకుమించి మరేం లేదు!

(picture courtesy : Google)

Thursday 13 November 2014

ఖడ్గం! 'ఎందుకు?'


'భారద్దేశం ప్రజాస్వామ్య దేశం. ప్రజలే పాలకులు. అంచేత ప్రజలే ఓట్లేసుకుని పాలకుల్ని ఎన్నుకుంటారు.' అని చిన్నప్పుడు చదువుకున్నాను.

ఈ వాక్యాలు చదువుకోడానికి రొమేంటిగ్గా వుంటాయి గానీ - వాస్తవానికి సాధారణ ప్రజలు వేరు, పాలకులు వేరు. పాలక వర్గాలు, పాలిత వర్గాలు - ఆవకాయలో ఆవగింజంత సంబంధం కూడా లేకుండా ఎప్పుడో విడిపొయ్యారు.

అయితే ఈ పాలకులు తాము కూడా ప్రజల్లోనే భాగమని కోడై కూస్తుంటారు. కొందరు అమాయకులు, ఆశావహులు నమ్ముతూనే వుంటారు!

అయితే పులి మనముందు పులిహోర, దద్దోజనం మాత్రమే తింటూ తను శాకహారిని మాత్రమేనని మనని ఎంత నమ్మించినా - దానికి ఏ జింకో, కుందేలో కనిపించినప్పుడు నోరూరుతుంది, లొట్టలేస్తుంది. అలా అనిపించడం పులి తప్పుకాదు - అదా జాతి లక్షణం.

అదేవిధంగా పాలకులు తాము ప్రజల్లో భాగమేనని ఎంతగానో చెబుతుంటారు కానీ - కాదని కూడా వాళ్ళే సంకేతాలు ఇస్తుంటారు!

ఆ సంకేతమేమి? ఒక ఉదాహరణనిమ్ము!

(ఇది ఐదు మార్కుల ప్రశ్న. అంచేత సంగ్రహముగా వివరింపుము.)

ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు అనేక ర్యాలీలు, భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ బోల్డంత హడావుడి చేస్తాయి. ఆ సందర్భంలో ముఖ్యనాయకులు తలపాగా పెట్టుకుని, ఒక పొడవాటి ఖడ్గాన్ని ప్రజలకి చూపిస్తారు.. కార్యకర్తలు హర్షధ్వనాలు చేస్తారు.

ఏ నాగలో, కొడవలో చూపిస్తే 'రైతుబంధు', 'రైతుమిత్ర' అని మార్కులు కొట్టెయ్యొచ్చు గానీ - ఇట్లా ఖడ్గాల్ని చూపించడం ఎందుకు?

త్రిపురనేని గోపిచంద్ "ఎందుకు?" అన్న ప్రశ్న ఎంతో గొప్పదనీ, అందులోంచే అనంతమైన జ్ఞానం పుడుతుందనీ సెలవిచ్చాడు. అంచేత ఇప్పుడు నేను కూడా ప్రశ్నించుకుంటున్నాను.

ఈ ఖడ్గప్రదర్శన "ఎందుకు?"

నాకు తోచిన కొన్ని కారణాలు :

A - పాజిటివ్ (బ్లడ్ గ్రూప్ కాదు) కారణాలు -

1 - సాంప్రదాయ చేతివృత్తుల్ని ప్రోత్సాహించడం మన కర్తవ్యం. అంచేత - మీరు కత్తులు విరివిగా వాడండి. కత్తులు తయారుచేసే కమ్మరి వృత్తిని బ్రతికించండి.

2 - భారద్దేశం స్వతంత్రం రాక ముందు రాచరిక దేశం. అంచేత కొన్ని పార్టీలవాళ్ళు వాళ్ళ ప్రాంతం రాజుల్ని ప్రమోట్ చేసుకుంటారు. ఇందుకో ఉదాహరణ శివసేన! చిన్నప్పుడు శివసేన అంటే శివుడి గుళ్ళో సైనికుల్లా పన్జేసే వాలంటీర్లేమోనని ఆనుకునేవాణ్ని! అదో రాజకీయ పార్టీ పేరని తెలిసినప్పుడు ఆశ్చర్యపొయ్యా! శివసేన వాళ్ళకి ఛత్రపతి శివాజీ మహరాజ్ అంటే తరగని ప్రేమట! మరాఠాల చరిత్ర నాకు తెలీదు. అంచేత - శివాజీ వారసులు ఖడ్గం ఎందుకు చూపిస్తారో తెలీదు. అయితే - ఆ ఖడ్గాన్ని ఎప్పుడోకప్పుడు మరాఠాలు కానివారిపై వాడతారేమోననే భయం మాత్రం నాకుంది.

3 - అవినీతికి పాల్పడేవారిని నరికేస్తా! (ఇది కేవలం మార్కుల కోసం రాసిన పాయింటు - పూర్తిగా అబద్దం.)

B - నెగెటివ్ కారణాలు -

1 - మీరంతా మా పార్టీకే ఓట్లెయ్యలి. వెయ్యకపోతే - 'అమ్మతోడు! అడ్డంగా నరికేస్తాం!'

2 - ఒక్కసారి మాకు అధికారం ఇచ్చి చూడండి. సాధారణ పౌరుల్ని ఈ కత్తితోనే నరుక్కుని కూరొండుకు తినేస్తాం.

3 - ఖడ్గం మన జాతీయ చిహ్నం. అంచేత - మీరీ ఖడ్గాలతో మర్డర్లు చేసినట్లైతే కేసులుండవని హామీ ఇస్తున్నాం (ఈ పాయింటు సర్దాగా రాసిందే గానీ - అసలు పాయింటే కాదు).

(ఇంతటితో నా "ఎందుకు?" అనే ప్రశ్నకి సమాధానం సమాప్తం.)

సరే! ఖడ్గం, నాగలి, కుక్క, పిల్లి.. ఏదైతేనేం? ఏం చూపించినా, ఏం చెప్పినా - రాజకీయ పార్టీలు ఒక్కసారి అధికారంలోకి వచ్చాక వాటి పని అవి (క్రమశిక్షణ కలిగిన సైనికుల వలె) చేసుకుపోతాయి. ఒక్కో పార్టీకి వారి (తెర వెనుక) లాబీలు 24 x 7 పన్జేస్తేగానీ అధికారం రాదు. ఆ లాబీలని లిక్కర్ లాబీ, ఎడ్యుకేషనల్ లాబీ, మీడియా లాబీ.. అంటూ క్లాసిఫై చేసుకోవచ్చు గానీ.. అదీ పోస్టుతో సంబంధం లేని అంశం కాబట్టి ఇంతటితో వదిలేస్తాను.

అయితే - ఒక్కటి మాత్రం నిజం. అధికార ఫలాల్ని పంచుకోవడంలో ఈ లాబీలు 24 x 7 పాటు న్యాయమైన వాటాలు వేసుకుంటూ పంచుకుంటారు. ఈ విషయంలో వీరికి ఆలీబాబా నలభై దొంగల్లో - నలభై దొంగలకున్నంత ఐకమత్యం వుంటుంది.

మరప్పుడు మన్లాంటివాళ్ళేం చెయ్యాలి? మీ సంగతేమో నాకు తెలీదు కానీ - నేను మాత్రం ఏం చెయ్యాలో తెలీక - ఇలా బ్లాగుల్రాస్తుంటాను! జైహింద్!

(photo courtesy : Google)

Monday 10 November 2014

కారా మాస్టారి పుట్టిన్రోజు హడావుడి, ఆర్భాటం!


ప్రపంచంలో ప్రతి జీవికీ చావుపుట్టుకలుంటాయి. పుట్టిన ప్రతి జీవి చావక మానదు. ఆ మాటకొస్తే బల్లలు, కుర్చీల్లాంటి వస్తువులక్కూడా చావుపుట్టుకలుంటాయి. తాత్వికంగా చూస్తే - ఈ పుట్టిన్రోజు, చచ్చిన్రోజులకి పెద్ద ప్రాముఖ్యత వుండదు, వుండరాదు.

బాగా డబ్బున్నవారికీ, పేరుప్రఖ్యాతులు సంపాదించినవరికీ ఈ పుట్టిన, చచ్చిన రోజులు పవిత్రమైన పుణ్యదినాలు. ముఖ్యంగా రాజకీయ నాయకులు తమ కాడర్ కోసం ఈ సందర్భాల్ని వాడుకుంటారు. ఇంక సినిమా హీరోల పిచ్చి అభిమానులు చేసే హడావుడి యింతంత కాదు.. పరమ రోతగా వుంటుంది.

ఈ మధ్య ఈ పుట్టిన్రోజుల హడావుడి తెలుగు సాహిత్యంలోకి కూడా వచ్చి చేరింది. గురజాడ, శ్రీశ్రీ మొదలైన ఆధునిక రచయితలు పుట్టిన వందో సంవత్సరాన్ని ఓ పండగలా చేశారు. ఎవరి ఉత్సాహం వారిది. వారి ఆనందాన్ని కాదన్డానికి మనమెవరం?

మా ఊళ్ళో క్వారీ యజమానులు, పొగాకు వ్యాపారస్తుల దగ్గర్నుండి చందాలు వసూలు చేసి సాహిత్య సభలు పెడ్తుంటారు! ఈ చందా వసూళ్ళు కార్యక్రమం అచ్చు ఒకప్పుడు శ్రీరామనవమి చందా వసూళ్ళ లాగా, ఇప్పుటి గణేష్ చతుర్ధి చందా వసూళ్ళలా సాగుతుంది. ఆ చందాలతో అభ్యుదయ కవుల పుట్టిన్రోజు పండగలు జరుపుతారు!

పై ఫోటోలో కిరీటం పెట్టించుకుని శాలువాలు కప్పించుకుంటున్న వ్యక్తి సామాన్యుడు కాదు. తెలుగులో ఎన్నో గొప్ప కథలు రాసిన కాళీపట్నం రామారావు (కారా మాస్టారు). నిన్న కారా మాస్టారి పుట్టిన్రోజు. ఆ పుట్టిన్రోజు జరపబడ్డ వార్త చదువుతుంటే చికాగ్గా అనిపించింది. ఏ రాజకీయ నాయకుడి, సినిమా హీరో పుట్టిన్రోజుకీ తక్కువ కాకుండా రంగరంగ వైభవంగా జరిపారు. ఈ హడావుడి మాస్టారి అనుమతి లేకుండా జరిగే అవకాశం లేదు. మరప్పుడు ఆయన ఇట్లాంటి ఆర్భాటాలకి ఎందుకు ఒప్పుకున్నాడు?

నా అభ్యంతరం కారా మాస్టారి అభిమానులకి కోపం తెప్పించొచ్చు. కానీ - నేనూ ఆయన అభిమానినే! అందుకే నాకు చిరాగ్గా వుంది. ఇదే ఏ పాపులర్ రచయిత పుట్టిన్రోజైతే అస్సలు పట్టించుకోం. వాళ్ళు గజారోహణ చేసినా మనకి సంబంధం లేని అంశం. కానీ - అఫాల్ ద పీపుల్ - కారా మాస్టారా!

ఆయన శిష్యకోటి తమ అభిమానం వ్యక్తం చేసేందుకు ఇలాంటి చౌకబారు ప్రదర్సన ఏర్పాటు చేసుండొచ్చు. ఆయన సహజంగానే మొహమాటస్తుడు కాబట్టి - కాదనలేకపోవచ్చు. కానీ - ఈ మొహమాటం ఆయన కథల్లో వుండదు కదా! నాకిప్పుడు అనిపిస్తుంది. రచయితగా కారా వేరు, వ్యక్తిగా కారా వేరు. ఈ వైరుధ్యంతోనే మనం ఆయన్ని అర్ధం చేసుకోగలగాలి - అదెంత కష్టసాధ్యమైనా!

కారా మాస్టారు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా, హాయిగా, ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటున్నాను. 

(photo courtesy : Google)

ఆకలి - అజ్ఞానం


అవి నేను ప్రాక్టీసు మొదలుపెట్టిన రోజులు. నాది పూర్తిగా పట్టణ నేపధ్యం. అంచేత గ్రామాలకి సంబంధించిన విషయాలేవీ నాకు తెలిసేవి కావు. ఒక పట్టణం అనేది అనేక గ్రామాలకి కేంద్ర స్థానమనీ, అందువల్ల - పేషంట్లలో ఎక్కువమంది గ్రామాల నుండే వస్తారనీ తెలుసుకున్నాను. గ్రామీణ పేషంట్లతో ఇంటరాక్ట్ అవ్వడం నాక్కొంచెం ఇబ్బందిగా వుండేది.

వ్యవసాయ పనులైన - నాట్లు, కలుపులు లాంటి పదాలకి అర్ధం వాళ్ళనే అడిగి తెలుసుకునేవాణ్ని. కొందరు పేషంట్లు ఓపిగ్గా వివరించేవాళ్ళు, ఇంకొందరు - 'వీడికి వ్యవసాయం గూర్చే తెలీదు! ఇంక మనకి వైద్యమేఁం చేస్తాడు?' అన్నట్లు నావైపు అనుమానంగా చూసేవాళ్ళు.

గ్రామీణ యువతులు చూడ్డానికి చిన్నగా వుంటారు. అందుక్కారణం - వారికి చాలా చిన్నవయసులోనే పెళ్లైపోతుంది. ఆ చిన్నవయసులోనే ఇద్దరు ముగ్గురు పిల్లల్ని కనేస్తారు. అంచేత వారి శరీరంలో ఎదుగుదల వుండదు. పాలిపోయిన మొహాల్తో, ఎండిపోయిన డొక్కల్తో బలహీనంగా, హీనంగా కనబడ్తూ వుండేవారు. 'వీడికీ మాత్రం తెలీదా?' అని మీలో కొందరికి అనిపించొచ్చు, ఇంకొందరికి నా అజ్ఞానం సిల్లీగా కూడా అనిపించొచ్చు. కానీ ఏం చేసేది? నిజంగానే నాకేమీ తెలీదు!

అంతేనా? వాళ్లకి మందులు రాసేప్పుడు కూడా కన్ఫ్యూజ్ అయ్యేవాణ్ని. ఆ స్త్రీలు పెళ్ళై పిల్లలున్నవారు, కావున - టెక్నికల్‌గా వాళ్ళని పెద్దవాళ్ళు(ఎడల్ట్స్)గా పరిగణించాలి. కానీ - శరీర బరువు రీత్యా చూస్తే వాళ్ళు చిన్నపిల్లల కేటగిరీలోకొస్తారు! ఇంతకీ - వాళ్ళు పిల్లలా? పెద్దలా? ఎవరనుకుని మెడిసిన్ రాయాలి?

ఇటువంటి సమస్యల గూర్చి సైకియాట్రీ టెక్స్ట్ బుక్సులో రాయరు. మొత్తానికి ఏవో తిప్పలు పడి ప్రిస్క్రిప్షన్ రాసేవాణ్ని.

అంతా అయ్యాక - చివరాకరికి వాళ్ళు "బలానికి ఒక మంచి 'స్టానిక్' రాయి సార్!" అనడిగేవారు!

జీవితం గూర్చి నాది పూర్తిగా పుస్తకాల జ్ఞానమే! ఆకలి, కష్టాలు వంటి పదాలకి అర్ధం తెలీదు. పంట పొలాల్ని, గ్రామాల్ని రైల్లోంచి చూసిన అనుభవం మాత్రమే వుంది. గ్రామీణ పేదల జీవితాల్ని అర్ధం చేసుకోడానికి నా దగ్గరున్న ఏకైక టూల్ - సాహిత్యం! ఎమిలి జోలా 'ఎర్త్' (ఈ నవల్లో దరిద్రానికున్న దుర్మార్గపు యాంగిల్ దారుణంగా వుంటుంది), పెర్లస్ బక్ 'గుడ్ ఎర్త్' (ఈ నవల్లో దరిద్రం కొంత డీసెంటుగా వుంటుంది) వంటి నవలల పరిజ్ఞానం మాత్రమే!

నాకు వారి 'స్టానిక్' అజ్ఞానానికి జాలేసేది! లాభం లేదు, నా దేశప్రజల అజ్ఞానమును నా జ్ఞానమనే టార్చి లైటుతో పోగొట్టవలననే సత్సంకల్పంతో, సదాశయంతో - 'నేను సైతం, నేను సైతం' అనుకుంటూ - ఉత్సాహంగా గొంతు సవరించుకుని - 'పోషకాహారం అనగానేమి? అందువల్ల కలుగు లాభములేమి?' అంటూ ఓ మంచి క్లాసు పీకేవాణ్ని! ముక్తాయింపుగా - బీ కాంప్లెక్స్ మందులు వాడటం శుద్ధదండగని అమూల్యమైన సలహా ఇచ్చేవాణ్ని.

'సరైన ఆహారం లేకపోడమే మీకున్న రోగం. రోజూ రెండు గుడ్లు తినండి, గ్లాసుడు పాలు తాగండి. బ్రహ్మాండమైన బలం వచ్చేస్తుంది.'

వారు నా ఉపన్యాసాన్నంతా ఓపిగ్గా విని -

"బలానికి ఒక మంచి 'స్టానిక్' రాయి సార్!" అని మళ్ళీ అడిగేవారు. నాకు చికాగ్గా అనిపించేది.

'ఓ ప్రభువా! నా దేశప్రజల్ని ఎలా ఎడ్యుకేట్ చేసేది? ఎలా? ఎలా?' అంటూ సమాధానం లేని ప్రశ్నల్ని వేసుకుని జుట్టు పీక్కునేవాణ్ని.

అలా నా అజ్ఞాన పేషంట్లకి అనేక ప్రవచనాలు ఇస్తూ ఇస్తూ, దాదాపు అన్నిసార్లు ఓడిపోతూ పోతూ - కొన్నాళ్ళకి నేను పెద్దమనిషినయ్యాను. ఈలోగా - నాలో జ్ఞానకిరణాలు మునిసిపాలిటీ వీధి దీపంలా ఆలస్యంగా వెలిగాయి.

ఆ జ్ఞానకిరణాలేమనగా -

ఆ స్త్రీలు వ్యవసాయ కూలీలు. వారి జీవితంలో తీయనైన అనుభూతులుండవు (గొడ్డుకారం మాత్రమే వుంటుంది). వారికి సుఖం తెలీదు, పరమాన్నం తెలీదు, బిరియానీ తెలీదు, సినిమాలు తెలీదు, షికార్లు తెలీదు, అన్నింటికన్నా ఆశ్చర్యం - మన మధ్యతరగతి వారు బహు బాగా ఎంజాయ్ చేసే సంగీత సాహిత్యములన్న అసలే తెలీదు!

అలా అని వారికి ఏదీ తెలీదని కాదు, వారికీ కొన్ని తెలుసు. రోజంతా ఎండలోపడి నడుములిరిగేట్లు కూలి పన్జెయ్యడం తెలుసు. పచ్చడి మెతుకుల రుచి తెలుసు. అర్ధాకలి తెలుసు, కష్టాలు తెలుసు, కన్నీళ్లు తెలుసు. జీవితాన్ని బాధగా, భారంగా ఎలా నెట్టాలో తెలుసు.

వారికి - కోడిగుడ్డు, పాలు 'బలం' అని కూడా తెలుసు. కానీ - అవి వారికి అందని ద్రాక్ష పళ్ళు. వాళ్ళది పసిపిల్లలకే సరైన ఆహారం పెట్టుకోలేని దుస్థితి. అందువల్లనే ఒక 'స్టానిక్' బలం మందు తాగేసి.. షార్ట్‌కట్‌లో పోషకాహారం లేని లోటు తీర్చుకుందామనే ఆశ! ఇన్నాళ్ళూ ఇంత చిన్న విషయం తెలీంది నాకే!

వాళ్ళు నండూరి సుబ్బారావు ఎంకిపాటలా చిలిపిగా వుండరు, వడ్డాది పాపయ్య వర్ణచిత్రంలా వయ్యారంగా వుండరు, బాపు బొమ్మలా అందంగా వుండరు. మరెలా వుంటారు? సత్యజిత్ రే హీరోయిన్లా బోల్డంత పేదగా, మురికిగా వుంటారు. మా.గోఖలే కథలా వాస్తవంగా వుంటారు. ఆరు సారాకథల ముత్యాలమ్మలా తెలివిగానూ వుంటారు. 

ఆ స్త్రీలలో చాలామందికి రాత్రిళ్ళంటే భయం. వారి భర్తలకి వీరి ప్రవర్తన పట్ల 'అనుమానం'! అందువల్ల  ఆ భర్తోత్తములు రాత్రిళ్ళు పూటుగా తాగొచ్చి, నాటుగా భార్యల్ని కొడతారు.

'అప్పుడు మీరు మీ పుట్టింటికి వెళ్లిపోవచ్చుగా?' అని ఆశ్చర్యంగా అడిగేవాణ్ని!

ఇట్లాంటి గొప్ప సందేహాలు పుస్తకాల ద్వారా ఆకలిని అర్ధం చేసుకుందామనుకునే అజ్ఞానులకి మాత్రమే కలుగుతాయనుకుంటా! ఎంతైనా - మధ్యతరగతి అజ్ఞానానికి అవధులుండవు!

'ఎళ్ళొచ్చు! కానీ - ఆడింకా గోరం. మా నాన రోజూ తాగొచ్చి అమ్మని సావకొడతా వుంటాడు. మా వదిన ఒకటే తిట్టుద్ది. అది తిండిక్కూడా గతిలేని పాడుకొంప. ఆడా బాదలు పడేకన్నా - ఆ చావేదో ఈడే చస్తే పోద్ది!'

వారిది చాలా ప్రాక్టికల్ థింకింగ్. నో నాన్సెన్స్ ఎప్రోచ్. (మనలా) ఆలోచనలో జీళ్ళపాకం సాగతీతలుండవు. థియరీ ఎండ్ ప్రాక్టీసులో అంతరాలుండవు. స్పష్టమైన అవగాహన, ముక్కుసూటి ఆచరణ వారి సొంతం.

ముగింపు -

పుస్తకములెన్ని చదివిననూ పాండిత్యము మాత్రమే వచ్చును గానీ, జ్ఞానము రాదు. తమ ఆకలి కబుర్లతో నా అజ్ఞానాన్ని పారద్రోలిన ఎందరో పేషంట్లు.. అందరికీ వందనములు.     

(picture courtesy : Google)

Monday 3 November 2014

సదాశివ్ అమ్రపుర్కార్


మరాఠీ నటుడు సదాశివ్ అమ్రపుర్కార్ ఇవ్వాళ చనిపొయ్యాడు. ఆయన 'అర్ధ్ సత్య' సినిమాలో రామా షెట్టి అనే విలన్ పాత్రని చక్కగా పోషించాడు. ఒకప్పుడు శ్యాం బెనగల్, గోవింద్ నిహలాని, కుందన్ షా వంటి దర్శకులు ఆలోచింపజేసే సినిమాలు తీశారు (ఇప్పుడు కూడా అలా ఎవరన్నా తీస్తున్నారేమో నాకు తెలీదు). 

ఇప్పుడు నేను 'అర్ధ్ సత్య' రివ్యూ రాయబోవడం లేదు. ఆ సినిమా జ్ఞాపకాలు మాత్రమే రాస్తున్నాను. ఈ సినిమాని నా మిత్రుడు గోపరాజు రవితో ముప్పైయ్యేళ్ళ క్రితం రంగమహల్‌లో ఈవెనింగ్ షో చూశాను. సినిమా చూశాక - మేమిద్దరం ఆ పక్కనే వున్న బలరాం హోటల్లో టీలు, సిగరెట్లు తాగుతూ సినిమా కథ, కథనం, పాత్రధారుల గూర్చి చాలాసేపు చర్చించుకున్నాం.

అవినీతిమయమైన పోలీసు వ్యవస్థలో నిజాయితీతిగా ఉద్యోగం చేద్దామనుకున్న ఇన్‌స్పెక్టర్ పాత్రలో ఓం పురి నటించాడు. అతన్ని ప్రేమిస్తూ - ఉద్యోగం వల్ల అతనిలో కలిగే మార్పుని (పతనాన్ని) ఇష్టపడని స్నేహితురాలి పాత్రలో స్మితా పాటిల్ నటించింది. రాజకీయ నాయకులకి పోలీసు వ్యవస్థ ఎందుకంత ముఖ్యమో, దానిపై పట్టు కోసం ఎందుకంత పాకులాడతారో రామా షెట్టిని చూస్తే తెలుస్తుంది. రామా షెట్టిగా సదాశివ్ అమ్రపుర్కార్ చాలా కాజువల్‌గా, చాలా మీన్‌గా 'ప్రవర్తించాడు'.

గోవింద్ నిహలాని, విజయ్ టెండూల్కర్ పాత్రల్ని, సన్నివేశాల్ని చాలా విభిన్నంగా కన్సీవ్ చేశారు. సినిమాలో ప్రతి పాత్ర - తమ ఆలోచనల్ని, ప్రవర్తనని వారివారి కోణంలో జస్టిఫై చేసుకుంటాయి. ఓం పురి పై అధికారి షఫీ ఇనాందార్ పాత్ర కూడా భిన్నమైన కోణాల్ని కలిగుంటుంది. ఇట్లాంటి కథని రాయడం కన్నా - సినిమాగా తీసి మెప్పించడం కష్టమని నా అభిప్రాయం. 

సాధారణ సినిమాల మాదిరిగా ఈ సినిమాలో మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు వుండరు. మనలాంటి 'మనుషులు' మాత్రమే వుంటారు. వాళ్ళ ఆలోచనలుంటాయి, ఆశలుంటాయి, ఆశయాలుంటాయి. వారి ఆనందాలు, ఫ్రస్ట్రేషన్స్, స్ట్రగుల్స్, డిజప్పాయింట్‌మెంట్స్ వుంటాయి. ప్రేక్షకులుగా మనం వాటన్నింటితోనూ ఐడెంటిఫై చేసుకుంటాం. బహుశా అందువల్లనే కావచ్చు - ఇన్నాళ్ళైనా ఈ సినిమా జ్ఞాపకాలు నాలో అలాగే ఉండిపొయ్యాయి. 

స్మితా పాటిల్‌తో ఓం పురి చెప్పే (కొన్ని) డైలాగులు గోపరాజు రవికి నచ్చలేదు. అతనికి ఓం పురి పాత్రపై అనుమానం! రవి ఎడ్వొకేట్. కాబట్టి పోలీసుల గూర్చి నాకన్నా తనకే ఎక్కువ తెలుసు. ఫ్రస్ట్రేషన్‌లో వున్న ఓం పురి ఒక చిన్న రేడియో దొంగతనం చేసిన కుర్రాణ్ని లాకప్ డెత్ చేసే సన్నివేశం - పోలీసు బ్రూటాలిటీని జస్టిఫై చేస్తున్నట్లుగా రవికి అనిపించింది. నాకు అలా అనిపించలేదు. పైగా - ఆ సన్నివేశమే కథకి కొత్త డైమన్షన్ ఇచ్చిందనేది నా అభిప్రాయం. ఇద్దరం కరెక్టు కావచ్చు! 

ఇదంతా ఎందుకు రాస్తున్నానంటే - గత సంవత్సరంగా నా మిత్రుడు గోపరాజు రవి లేడు, అతని జ్ఞాపకాలు మాత్రమే వున్నాయి. ఇట్లాంటి సమయంలో నాకు రవి గుర్తొస్తుంటాడు. ఇవ్వాళ సదాశివ్ అమ్రపుర్కార్ గూర్చి కనీసం ఒక గంటైనా ఫోన్లో మాట్లాడేవాడు. రవీ! ఐ మిస్ యు మేన్!

సదాశివ్ అమ్రపుర్కార్! థాంక్యూ ఫరే ఎ గ్రేట్ పెర్ఫామెన్స్!

(photo courtesy : Google)

చెత్తబ్రతుకులు


"భాయియో ఔర్ బెహనో! నా పిలుపందుకుని చెత్తని ఊడ్చెయ్యడానికి కృషి చేసిన మీకు నా శుభాభినందనలు."

"థాంక్యూ సార్! మమ్మల్నింకేం చెయ్యమంటారు సార్? మీరేం చెప్పినా చెయ్యడానికి రెడీగా వున్నాం సార్!"

"ఈ రోడ్ల మీద చెత్త ఊడ్చెయ్యగానే సరిపోదు. ఇదేవిధంగా చెత్తబ్రతుకుల్ని కూడా ఊడ్చెయ్యాలని పిలుపిస్తున్నాను."

"చెత్తబ్రతుకులా! అంటే?"

"భాయియో ఔర్ బెహనో! మన దేశం అభివృద్ధి పథంలో ముందుకు పోకుండా వెనక్కి లాగేస్తుంది ఎవరు? కూటిగ్గతిలేని దరిద్రప్ముండాకొడుకులు. కాలే కడుపుల్తో, ఎండే డొక్కల్తో దరిద్రానికి బ్రాండ్ ఎంబాసిడర్లుగా విలసిల్లే దౌర్భాగ్యులు. ప్రభుత్వాన్ని అడుక్కుంటున్నటు నటిస్తూ ట్యాక్స్ పేయర్స్ మనీని దోచుకు తిండానికి క్యూలో నిలబడే అలగా వెధవలు. వీళ్ళ కోసం ఉపాథి పథకాలు, సబ్సిడీలు, ధర్మాసుపత్రులు, సంక్షేమ హాస్టళ్ళు.. ఎన్నని చెప్పను? మన సొమ్మంతా ఈ బజారు మనుషులకే ఖర్చైపోతుంది. ఇంక దేశం ముందుకెలా వెళ్తుంది?"

"ఎంత దారుణం!"

"ఈ డబ్బుల్తో మనం యుద్ధం చేసి పాకిస్తాన్నీ, బంగ్లాదేశుల్ని మనలో కలిపేసుకోవచ్చు. చైనావాణ్ని తరిమికొట్టొచ్చు. అమెరికావాడికి అప్పివ్వచ్చు. ప్రపంచ పటంలో దేదీప్యమానంగా వెలిగిపోవచ్చు. కానీ - అన్నింటికీ అడ్డం ఈ చెత్తబ్రతుగ్గాళ్ళే!"

"ఎంత ఘోరం!"

"శశి థరూరుగారు చచ్చిన ఎలుకతో పోజులిచ్చారు. కానీ ఈ దరిద్రపుగొట్టెధవలు ఆ చచ్చిన ఎలుక్కన్నా ప్రమాదకారులు. ఇప్పుడు మీకు నా సందేశం అర్ధమయ్యిందనుకుంటా!"

"అర్ధమైంది సార్! ఇకనుండి కనబడ్డ ప్రతి పేదవాణ్నీ చెత్తకుండీలో పడెయ్యాలి. అంతేగా? కానీ ఒక చిన్న డౌటు సార్! అప్పుడా చెత్తగాళ్ళు ఆ చెత్తకుండీలోనే కాపురం పెట్టేస్తారేమో?"

"మీకా భయం అక్కర్లేదు. ప్రతి చెత్తకుండీ కింద లోతైన కందకాలు తవ్వించాను. ఒక్కసారి వాళ్ళనా గోతిలో పడేస్తే మళ్ళీ పైకి రాలేరు. ఆకలిదప్పులతో అలమటించి ఆ గోతిలోనే ఛస్తారు."

"కానీ సార్! మీడియావాళ్ళకీ కందకాల సంగతి తెలిస్తే.. "

"మీకా భయం అస్సలు అక్కర్లేదు. మీడియావాళ్ళు పెంపుడు జంతువులు. తమ పత్రికా యాజమాన్య వ్యాపార ప్రయోజనాల కోసం వార్తలు వండటమే నేడు పాత్రికేయులు నిర్వహిస్తున్న పవిత్ర కర్తవ్యం. అంచేత - వాళ్ళా చెత్తకుండీలోకి తొంగి చూడరు. చూసినా నిజాలు చెప్పరు."

"మీరామాత్రం భరోసా ఇస్తే చాలు సార్! కానీ సార్ - దరిద్రప్ముండా కొడుకులు చూడ్డానికి బక్కగా వున్నా బలంగా వుంటారు సార్! వాళ్ళని ఈడ్చికెళ్ళి చెత్తకుండీలో పడెయ్యడం కష్టం సార్! ముండాకొడుకులు - గిచ్చినా గిచ్చుతారు, కొరికినా కొరుకుతారు."

"ఆ విషయం నాకు తెలుసు. అందుకే కుక్కల్ని పట్టే వ్యాన్ల కోసం నిధులు శాంక్షన్ చేస్తున్నాను."

"థాంక్యూ సార్! ఇక చూస్కోండి మా తడాఖా!"

"భాయియో ఔర్ బెహనో! ఈ దేశాన్ని చెత్తరహితంగా వుంచాలనే నా ఆలోచనని చెత్తశుద్ధిగా.. మాఫ్ కీజియే! చిత్తశుద్ధిగా అమలు చేస్తున్న మీకు నా అభినందనలు. మీకు జయం కలుగుగాక! ధన్యవాద్!"

(picture courtesy : Google)

Saturday 1 November 2014

వారెన్ ఏండర్సన్ దొరగారి ఆత్మ శాంతించుకాక!


యూనియన్ కార్బైడ్ పెద్దమనిషి వారెన్ ఏండర్సన్ దొరగారు చనిపోయ్యార్ట. ముప్పైయ్యేళ్ళ క్రితం - ఈ ఏండర్సన్ దొరగారి వల్ల నాకు అప్పటిదాకా తెలీని చాలా సంగతులు తెలిశాయి. అప్పటిదాకా భారద్దేశం సర్వస్వతంత్ర దేశమనీ, ఈ దేశంలో అన్యాయాలు, అక్రమాలు పెద్దగా శిక్షింపబడకపోయినా.. ఘోరమైన, దారుణమైన, దుర్మార్గమైన నేరాలు మాత్రం ఖచ్చితంగా శిక్షింపబడతాయని నమ్మేవాణ్ని.

అయితే - నేరం చేసేవాడు ఒక శక్తివంతమైన దేశానికి చెందినవాడైతే.. శిక్ష సంగతి దేవుడెరుగు.. వాణ్ని కనీసం విచారణ బోనులో కూడా మనం నిలబట్టలేమని నాకు అర్ధమయ్యేట్లు చేసిన మహానుభావుడు వారెన్ ఏండర్సన్ దొరగారు.

పొనీ - ఆ దొంగేమైనా 'గ్రేట్ ఎస్కేప్'లో స్టీవ్ మెక్వీన్‌లాగా అష్టకష్టాలు పడి పారిపోయాడా (పాపం! చివర్లో స్టీవ్ మెక్వీన్ దొరికిపోతాడు) అంటే అదీ కాదు! సాక్షాత్తు ప్రధానమంత్రిగారి కనుసన్నల్లో, ముఖ్యమంత్రిగారి దర్శకత్వంలో దర్జాగా, దొరబాబులా నడుచుకుంటూ విమానం ఎక్కేసి వెళ్ళిపొయ్యాడు.

అంచేత - మన దేశం ఒక సర్వస్వతంత్ర దేశం అని ఇంకా చెప్పుకుంటున్నాం అంటే మనకి సిగ్గైనా లేకపొయ్యుండాలి లేదా ఆ పదానికి అర్ధమైనా తెలీకపోయ్యుండాలి. ఎవరికైనా భ్రమలుంటే వారికి నా సానుభూతి! ఒక బహుళజాతి సంస్థ ముందు మన ప్రభుత్వాలు బానిసల్లా ఎంతగా సాగిలిపడతాయో అర్ధం చేసుకోడానికి ఈ వారెన్ ఆండర్సన్ ఉదంతం ఒక కేస్ స్టడీగా పనికొస్తుందని నా అభిప్రాయం. 

బురదలో జీవించే సూడిపంది తన పిల్లల జోలికొస్తే పీకి పాకం పెడుతుంది. ఒక వీధికుక్క తన పిల్లల్ని ముట్టుకుంటే కండ వూడేట్లు కొరికి పడేస్తుంది. అలాగే అనేక జంతువులు తమ సంతానాన్ని ప్రాణాలకి తెగించి మరీ కాపాడుకుంటాయి. మన ప్రభుత్వాలకి మాత్రం - ఈ దేశపౌరులు ఎన్నో ఆశలతో తమకి వోట్లేసి గెలిపించుకున్నారనీ, వారి భద్రతకి తాము పూచీ పడ్డామన్న స్పృహ వుండదు, లెక్కుండదు. అందుకే వాటికి ఇంత బరితెగింపు!

ఒకళ్ళా ఇద్దరా? వందా రెండొందలా? కొన్నివేలమంది తమ పౌరులు మృత్యువాత పడ్డా మన ప్రభుత్వాలకి చలనం లేదు. వాటికి తమ వర్గ ప్రయోజనాలే ముఖ్యం, తమ ప్రభువుల సేవే పరమార్ధం! అవును మరి - మనది కర్మభూమి, ఇచ్చట జనన మరణాలు దైవనిర్ణయం. కావున - యూనియన్ కార్బైడ్ తనవంతు కర్తవ్యాన్ని మాత్రమే నిర్వర్తించింది. చచ్చినవాడు నష్టజాతకుడు, అంతే! అందుకే - వేలమందిని పొట్టబెట్టుకున్న ప్రధాన నిందితుణ్ణి మనవాళ్ళు సగౌరవంగా సాగనంపారు!

ఈ దేశంలో అధర్మం, అన్యాయం, అక్రమం, అవినీతి నాలుగు పాదాల మీద నడుస్తాయని తెలిజెప్పిన వారెన్ ఏండర్సన్ దొరగారికి, రాజీవ్ గాంధీగారికీ, అర్జున్ సింగుగారికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అయ్యా! మీరంతా నాలాంటి అజ్ఞానిని రాత్రికిరాత్రే జ్ఞానిగా మార్చేశారు. లేకపోయినట్లైతే - ఈ విషయం అర్ధం చేసుకునేందుకు ఎన్నో పుస్తకాలు చదవాల్సొచ్చేది, ఎంతో ఆలోచించాల్సొచ్చేది. ఆ గోలేమీ లేకుండా నాకు చాలా సమయం ఆదా చేశారు. అందుక్కూడా మీకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను! థాంక్యూ!

వారెన్ ఏండర్సన్ దొరగారి ఆత్మ శాంతించుకాక!

(picture courtesy : Google)