Monday, 3 November 2014

సదాశివ్ అమ్రపుర్కార్


మరాఠీ నటుడు సదాశివ్ అమ్రపుర్కార్ ఇవ్వాళ చనిపొయ్యాడు. ఆయన 'అర్ధ్ సత్య' సినిమాలో రామా షెట్టి అనే విలన్ పాత్రని చక్కగా పోషించాడు. ఒకప్పుడు శ్యాం బెనగల్, గోవింద్ నిహలాని, కుందన్ షా వంటి దర్శకులు ఆలోచింపజేసే సినిమాలు తీశారు (ఇప్పుడు కూడా అలా ఎవరన్నా తీస్తున్నారేమో నాకు తెలీదు). 

ఇప్పుడు నేను 'అర్ధ్ సత్య' రివ్యూ రాయబోవడం లేదు. ఆ సినిమా జ్ఞాపకాలు మాత్రమే రాస్తున్నాను. ఈ సినిమాని నా మిత్రుడు గోపరాజు రవితో ముప్పైయ్యేళ్ళ క్రితం రంగమహల్‌లో ఈవెనింగ్ షో చూశాను. సినిమా చూశాక - మేమిద్దరం ఆ పక్కనే వున్న బలరాం హోటల్లో టీలు, సిగరెట్లు తాగుతూ సినిమా కథ, కథనం, పాత్రధారుల గూర్చి చాలాసేపు చర్చించుకున్నాం.

అవినీతిమయమైన పోలీసు వ్యవస్థలో నిజాయితీతిగా ఉద్యోగం చేద్దామనుకున్న ఇన్‌స్పెక్టర్ పాత్రలో ఓం పురి నటించాడు. అతన్ని ప్రేమిస్తూ - ఉద్యోగం వల్ల అతనిలో కలిగే మార్పుని (పతనాన్ని) ఇష్టపడని స్నేహితురాలి పాత్రలో స్మితా పాటిల్ నటించింది. రాజకీయ నాయకులకి పోలీసు వ్యవస్థ ఎందుకంత ముఖ్యమో, దానిపై పట్టు కోసం ఎందుకంత పాకులాడతారో రామా షెట్టిని చూస్తే తెలుస్తుంది. రామా షెట్టిగా సదాశివ్ అమ్రపుర్కార్ చాలా కాజువల్‌గా, చాలా మీన్‌గా 'ప్రవర్తించాడు'.

గోవింద్ నిహలాని, విజయ్ టెండూల్కర్ పాత్రల్ని, సన్నివేశాల్ని చాలా విభిన్నంగా కన్సీవ్ చేశారు. సినిమాలో ప్రతి పాత్ర - తమ ఆలోచనల్ని, ప్రవర్తనని వారివారి కోణంలో జస్టిఫై చేసుకుంటాయి. ఓం పురి పై అధికారి షఫీ ఇనాందార్ పాత్ర కూడా భిన్నమైన కోణాల్ని కలిగుంటుంది. ఇట్లాంటి కథని రాయడం కన్నా - సినిమాగా తీసి మెప్పించడం కష్టమని నా అభిప్రాయం. 

సాధారణ సినిమాల మాదిరిగా ఈ సినిమాలో మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు వుండరు. మనలాంటి 'మనుషులు' మాత్రమే వుంటారు. వాళ్ళ ఆలోచనలుంటాయి, ఆశలుంటాయి, ఆశయాలుంటాయి. వారి ఆనందాలు, ఫ్రస్ట్రేషన్స్, స్ట్రగుల్స్, డిజప్పాయింట్‌మెంట్స్ వుంటాయి. ప్రేక్షకులుగా మనం వాటన్నింటితోనూ ఐడెంటిఫై చేసుకుంటాం. బహుశా అందువల్లనే కావచ్చు - ఇన్నాళ్ళైనా ఈ సినిమా జ్ఞాపకాలు నాలో అలాగే ఉండిపొయ్యాయి. 

స్మితా పాటిల్‌తో ఓం పురి చెప్పే (కొన్ని) డైలాగులు గోపరాజు రవికి నచ్చలేదు. అతనికి ఓం పురి పాత్రపై అనుమానం! రవి ఎడ్వొకేట్. కాబట్టి పోలీసుల గూర్చి నాకన్నా తనకే ఎక్కువ తెలుసు. ఫ్రస్ట్రేషన్‌లో వున్న ఓం పురి ఒక చిన్న రేడియో దొంగతనం చేసిన కుర్రాణ్ని లాకప్ డెత్ చేసే సన్నివేశం - పోలీసు బ్రూటాలిటీని జస్టిఫై చేస్తున్నట్లుగా రవికి అనిపించింది. నాకు అలా అనిపించలేదు. పైగా - ఆ సన్నివేశమే కథకి కొత్త డైమన్షన్ ఇచ్చిందనేది నా అభిప్రాయం. ఇద్దరం కరెక్టు కావచ్చు! 

ఇదంతా ఎందుకు రాస్తున్నానంటే - గత సంవత్సరంగా నా మిత్రుడు గోపరాజు రవి లేడు, అతని జ్ఞాపకాలు మాత్రమే వున్నాయి. ఇట్లాంటి సమయంలో నాకు రవి గుర్తొస్తుంటాడు. ఇవ్వాళ సదాశివ్ అమ్రపుర్కార్ గూర్చి కనీసం ఒక గంటైనా ఫోన్లో మాట్లాడేవాడు. రవీ! ఐ మిస్ యు మేన్!

సదాశివ్ అమ్రపుర్కార్! థాంక్యూ ఫరే ఎ గ్రేట్ పెర్ఫామెన్స్!

(photo courtesy : Google)

3 comments:

  1. దాట్రు గారు
    చిన్న ధర్మ సందేహం. ఆ మధ్యనెప్పుడో రాసిన ఒక బ్లాగు పోస్టులో మీకు హిందీ రాదని రాసేరు. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా అర్ధమైనట్టూ రాసేరు. ఏది నిజం. మీకు హిందీ వచ్చా రాదా? అయినా దాక్టర్ అయి ఉండీ సిగరెట్లు కాల్చడం ఏవిటండీ? మానలేరూ?

    ReplyDelete
  2. one of the finest villains.. film industry will miss him!

    ReplyDelete
  3. మహేష్ భట్ దర్శకత్వం వహించిన సడక్ సినేమాలో "మహారాణి" పాత్ర లో హిజ్రా గా, వ్యభిచార గృహ యజమానిగా అత్యద్భుతం గా నటించాడు.
    https://www.youtube.com/watch?v=JymLzxUmCoY

    https://www.youtube.com/watch?v=PmqYMfgLf4Q

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.