Thursday, 13 November 2014

ఖడ్గం! 'ఎందుకు?'


'భారద్దేశం ప్రజాస్వామ్య దేశం. ప్రజలే పాలకులు. అంచేత ప్రజలే ఓట్లేసుకుని పాలకుల్ని ఎన్నుకుంటారు.' అని చిన్నప్పుడు చదువుకున్నాను.

ఈ వాక్యాలు చదువుకోడానికి రొమేంటిగ్గా వుంటాయి గానీ - వాస్తవానికి సాధారణ ప్రజలు వేరు, పాలకులు వేరు. పాలక వర్గాలు, పాలిత వర్గాలు - ఆవకాయలో ఆవగింజంత సంబంధం కూడా లేకుండా ఎప్పుడో విడిపొయ్యారు.

అయితే ఈ పాలకులు తాము కూడా ప్రజల్లోనే భాగమని కోడై కూస్తుంటారు. కొందరు అమాయకులు, ఆశావహులు నమ్ముతూనే వుంటారు!

అయితే పులి మనముందు పులిహోర, దద్దోజనం మాత్రమే తింటూ తను శాకహారిని మాత్రమేనని మనని ఎంత నమ్మించినా - దానికి ఏ జింకో, కుందేలో కనిపించినప్పుడు నోరూరుతుంది, లొట్టలేస్తుంది. అలా అనిపించడం పులి తప్పుకాదు - అదా జాతి లక్షణం.

అదేవిధంగా పాలకులు తాము ప్రజల్లో భాగమేనని ఎంతగానో చెబుతుంటారు కానీ - కాదని కూడా వాళ్ళే సంకేతాలు ఇస్తుంటారు!

ఆ సంకేతమేమి? ఒక ఉదాహరణనిమ్ము!

(ఇది ఐదు మార్కుల ప్రశ్న. అంచేత సంగ్రహముగా వివరింపుము.)

ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు అనేక ర్యాలీలు, భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ బోల్డంత హడావుడి చేస్తాయి. ఆ సందర్భంలో ముఖ్యనాయకులు తలపాగా పెట్టుకుని, ఒక పొడవాటి ఖడ్గాన్ని ప్రజలకి చూపిస్తారు.. కార్యకర్తలు హర్షధ్వనాలు చేస్తారు.

ఏ నాగలో, కొడవలో చూపిస్తే 'రైతుబంధు', 'రైతుమిత్ర' అని మార్కులు కొట్టెయ్యొచ్చు గానీ - ఇట్లా ఖడ్గాల్ని చూపించడం ఎందుకు?

త్రిపురనేని గోపిచంద్ "ఎందుకు?" అన్న ప్రశ్న ఎంతో గొప్పదనీ, అందులోంచే అనంతమైన జ్ఞానం పుడుతుందనీ సెలవిచ్చాడు. అంచేత ఇప్పుడు నేను కూడా ప్రశ్నించుకుంటున్నాను.

ఈ ఖడ్గప్రదర్శన "ఎందుకు?"

నాకు తోచిన కొన్ని కారణాలు :

A - పాజిటివ్ (బ్లడ్ గ్రూప్ కాదు) కారణాలు -

1 - సాంప్రదాయ చేతివృత్తుల్ని ప్రోత్సాహించడం మన కర్తవ్యం. అంచేత - మీరు కత్తులు విరివిగా వాడండి. కత్తులు తయారుచేసే కమ్మరి వృత్తిని బ్రతికించండి.

2 - భారద్దేశం స్వతంత్రం రాక ముందు రాచరిక దేశం. అంచేత కొన్ని పార్టీలవాళ్ళు వాళ్ళ ప్రాంతం రాజుల్ని ప్రమోట్ చేసుకుంటారు. ఇందుకో ఉదాహరణ శివసేన! చిన్నప్పుడు శివసేన అంటే శివుడి గుళ్ళో సైనికుల్లా పన్జేసే వాలంటీర్లేమోనని ఆనుకునేవాణ్ని! అదో రాజకీయ పార్టీ పేరని తెలిసినప్పుడు ఆశ్చర్యపొయ్యా! శివసేన వాళ్ళకి ఛత్రపతి శివాజీ మహరాజ్ అంటే తరగని ప్రేమట! మరాఠాల చరిత్ర నాకు తెలీదు. అంచేత - శివాజీ వారసులు ఖడ్గం ఎందుకు చూపిస్తారో తెలీదు. అయితే - ఆ ఖడ్గాన్ని ఎప్పుడోకప్పుడు మరాఠాలు కానివారిపై వాడతారేమోననే భయం మాత్రం నాకుంది.

3 - అవినీతికి పాల్పడేవారిని నరికేస్తా! (ఇది కేవలం మార్కుల కోసం రాసిన పాయింటు - పూర్తిగా అబద్దం.)

B - నెగెటివ్ కారణాలు -

1 - మీరంతా మా పార్టీకే ఓట్లెయ్యలి. వెయ్యకపోతే - 'అమ్మతోడు! అడ్డంగా నరికేస్తాం!'

2 - ఒక్కసారి మాకు అధికారం ఇచ్చి చూడండి. సాధారణ పౌరుల్ని ఈ కత్తితోనే నరుక్కుని కూరొండుకు తినేస్తాం.

3 - ఖడ్గం మన జాతీయ చిహ్నం. అంచేత - మీరీ ఖడ్గాలతో మర్డర్లు చేసినట్లైతే కేసులుండవని హామీ ఇస్తున్నాం (ఈ పాయింటు సర్దాగా రాసిందే గానీ - అసలు పాయింటే కాదు).

(ఇంతటితో నా "ఎందుకు?" అనే ప్రశ్నకి సమాధానం సమాప్తం.)

సరే! ఖడ్గం, నాగలి, కుక్క, పిల్లి.. ఏదైతేనేం? ఏం చూపించినా, ఏం చెప్పినా - రాజకీయ పార్టీలు ఒక్కసారి అధికారంలోకి వచ్చాక వాటి పని అవి (క్రమశిక్షణ కలిగిన సైనికుల వలె) చేసుకుపోతాయి. ఒక్కో పార్టీకి వారి (తెర వెనుక) లాబీలు 24 x 7 పన్జేస్తేగానీ అధికారం రాదు. ఆ లాబీలని లిక్కర్ లాబీ, ఎడ్యుకేషనల్ లాబీ, మీడియా లాబీ.. అంటూ క్లాసిఫై చేసుకోవచ్చు గానీ.. అదీ పోస్టుతో సంబంధం లేని అంశం కాబట్టి ఇంతటితో వదిలేస్తాను.

అయితే - ఒక్కటి మాత్రం నిజం. అధికార ఫలాల్ని పంచుకోవడంలో ఈ లాబీలు 24 x 7 పాటు న్యాయమైన వాటాలు వేసుకుంటూ పంచుకుంటారు. ఈ విషయంలో వీరికి ఆలీబాబా నలభై దొంగల్లో - నలభై దొంగలకున్నంత ఐకమత్యం వుంటుంది.

మరప్పుడు మన్లాంటివాళ్ళేం చెయ్యాలి? మీ సంగతేమో నాకు తెలీదు కానీ - నేను మాత్రం ఏం చెయ్యాలో తెలీక - ఇలా బ్లాగుల్రాస్తుంటాను! జైహింద్!

(photo courtesy : Google)

3 comments:

  1. // అదేవిధంగా పాలకులు తాము ప్రజల్లో భాగమేనని ఎంతగానో చెబుతుంటారు కానీ - కాదని కూడా వాళ్ళే సంకేతాలు ఇస్తుంటారు!
    ఆ సంకేతమేమి? ఒక ఉదాహరణనిమ్ము!//
    ఒరే, వెదవల్లారా! మేము ప్రజల్లో భాగమని చెప్పినంత మాత్రానా, మా అంతటి హక్కులు మీకుంటాయని కాదు, మిమ్మల్ని ఓటులు వేయమన్నామని విర్ర వీగి పోకండి! ఏదో ప్రజా స్వాంయమ్మని పేరు పెట్టుకున్నాము కాబట్టి మిమ్మల్ని కూడా ఓట్ల జాతరాలో అలవ్‌ చేస్తున్నాము. అంత మాత్రాన సమాన హక్కులు, ' రెండు రెళ్లు నాలుగు ' అని మాట్ల్లడకండి. మాట్లాడారో, అధికారమనే ఈ ఖడ్గంతో హతం చేస్తాం. మేమిచ్చే ప్రీబిలు తింటు బ్రతకండి. మాలెక్కల పుస్తకములో రెండు రెళ్లు తొమ్మిది అని ఉంటుంది. అసలు తొమ్మిదేమిటి మేము ఎంతచెపితే అంత వుంటుంది. అని అర్ధం సార్‌, నాకు మాత్ర పది మార్కు వేయండి. :) :)

    ReplyDelete
    Replies
    1. THIRUPALU P garu,

      you scored 10/5. Congratulations. :)

      Delete
  2. మీకు తెలియకేం,

    A0. కారణం: ఖడ్గం విజయానికి చిహ్నం.... పాతరోజుల్లో రాజులు శత్రువుని నరికి అలా కత్తి పైకెత్తుతారన్నమాట... ఈ రోజుల్లో అవుతే, మన బాబు గారు రెండు వేళ్ళు చూపించి constipation మొఖం పెట్టినట్టు

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.