Wednesday, 19 November 2014

మమతా దీదీ మమతానురాగం!


'యే నిమిషానికి యేమి జరుగునో ఎవరూహించెదరు? విధివిధానమును తప్పించుటకై యెవరు సాహసించెదరు?' అంటూ లక్ష్మణుడు బాధ పడ్డప్పుడు - 'ఈ ఘంటసాలకి ఎంత గొప్ప స్టొనుంటే మాత్రం - లక్ష్మణుడి రధానిక్కూడా పాటెందుకు?' అని చిరాకు పడ్డాను - అప్పటికి నాకింకా పెళ్లి కాలేదు. పెళ్ళయ్యాక మాత్రం ఈ పాట ఎంత గొప్పదో తెలిసింది ('పాండురంగ మహత్యం' సెకండాఫ్‌లో ఎన్టీరామారావుకి అయినట్లు - నాకూ కనువిప్పయ్యింది)!  

'మారిపోవురా కాలము, మారుట దానికి సహజమురా!' అని షావుకారులో ఒక తత్వం విన్నాను. 'ఏవిఁటో ఈ చక్రపాణి ఛాదస్తం! అడుక్కునే ముసలాయనక్కూడా ఒక పాట పెట్టాలా?' అని విసుక్కున్నాను. ఆ తరవాత నా నెత్తిన జుట్టూడిపోతున్నప్పుడూ, నడుం నొప్పితో 'కుయ్యో! మొర్రో!' అని మూలుగుతున్నప్పుడూ - 'అహా! ఆ తత్వానికి యింత అర్ధం వుందా!' అని అశ్చర్యపొయ్యాను. 

'కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్!' అని దేవదాసు పార్వతిని తల్చుకుంటూ దుఃఖించాడు. అసలే భగ్నప్రేమికుడు! ఆపై ఫుల్లుగా మందు కొట్టాడు! పాడితే గీడితే 'పారూ! పారూ!' అని ఏడ్చుకుంటూ పాడుకోవాలి గానీ - ఈ కుడి, ఎడమ అంటూ అర్ధం పర్ధం లేని పాటేంటనే సందేహం కలిగినా - రాసింది సముద్రాల వంటి ఘనుడు కాబట్టి (ఏదో గొప్ప అర్ధం వుండేవుంటుందని) - దేవదాసుతో పాటు నేనూ దుఃఖించాను. ఇవ్వాళ ఆ పాటతో భారత రాజకీయ చిత్రాన్నే అర్ధం చేసుకోవచ్చు. ఒకప్పుడు కాంగ్రెస్‌కి ఎదురు లేదు, బీజేపీకి దిక్కు లేదు. ఇవ్వాళ అట్టు తిరగబడింది. ఆనాడు సముద్రాల రాసిన పాటలో ఎంత అర్ధం వుంది! 

కావున మిత్రులారా! ఇప్పుడు మీరు గ్రహించవలసిందేమనగా - గొప్పపాటలు అప్పటికప్పుడు అర్ధం కాకపోయినా - తర్వాత్తర్వాత గొప్పగా బోధపడతాయి! 

ముగింపు -

పొద్దున్నే ఈ సినిమా పాటల గోలేంటయ్యా? ఈ మాత్రం దానికి బ్లాగెక్కి అరవాలా? 

అదేంటి మేస్టారూ! అలా కోప్పడతారేంటి? ఇవన్నీ జ్ఞాపకాలండీ బాబూ జ్ఞాపకాలు! ఇవ్వాళ నేను చెప్పకపోతే భవిష్యత్తరాలకి ఈ గొప్ప సంగతులు ఎలా అర్ధమవుతాయి? ఆ సినిమా పాటల సారాన్ని అర్ధం చేసుకున్నాను కాబట్టే ఇవ్వాళ పొద్దున్నే కమ్యూనిస్టుల్తో మమతా దీదీ మమతానురాగం ఫొటో చూసి తట్టుకున్నాను. లేకపోతే - గుండె పగిలి చచ్చుందును! 

(photo courtesy : Google)

4 comments:

  1. ఎ సబ్ కుండలి కా ఖేల్ హై! నమో బెంగాల్ లో కాలు అడుపెట్టకమునుపే పరిస్థితి మారిపొయింది. మోడి అధికారంలోకి వచ్చిన తరువాత, కాంగ్రెస్ నాయకులు విదేశీయానం చేస్తూ రిలాక్స్ అవుతూంటే, కమ్యునిస్ట్ లు నమో విజయాన్ని తట్టుకోలేక, గత చరిత్రను తలచుకొంట్టూ,తెగ బాధపడుతూ, ఇకనైన వామపక్షలు ఒకత్రాటి కిందకు వచ్చి ఐక్యతతో, ప్రజాపోరాటం చేయాలని, చాలామంది మేధావులు తీర్మానిస్తూ ఆర్టికల్స్ రాసేవారు. ఎంతో పెద్ద పోరాటం చేసి పెను దుమారం లేపుతారనుకొంటే, చివరికి మమత బీబీ తో పొత్తులు కుదుర్చుకొన్నారనమాట. కమ్యునిస్ట్ ల పోరాట పటిమతో పోలిస్తే రాంపాల్ బాబాలో పోరాట పటిమ ఎక్కువగా ఉంది. ప్రజలను వ్యుహాత్మకంగా సేకరించి, రెండురోజులనుంచి ప్రభుత్వ దళాలతో భీకరంగా పోరాటం చేస్తూన్నాడు :)

    ReplyDelete
  2. మమతా దీదీ గురించి ఇంతకుముందే మాట్లాడుకొన్నాం కదా , భారత రాజకీయాలని ఎప్పటికప్పుడు రిఫ్రెష్ చెస్తూ మనకి వినోదాన్ని పంచుతారు వారు .

    ReplyDelete
  3. మీరు దీన్ని బూర్జువా పార్టీలవంటి అవకాశవాధ మనుకుంటున్నారు గానీ, ఐక్య సంఘటనా పోరాటమండి బాబూ, ఐక్య సంఘటనా.................? :)

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.