Monday, 10 November 2014

కారా మాస్టారి పుట్టిన్రోజు హడావుడి, ఆర్భాటం!


ప్రపంచంలో ప్రతి జీవికీ చావుపుట్టుకలుంటాయి. పుట్టిన ప్రతి జీవి చావక మానదు. ఆ మాటకొస్తే బల్లలు, కుర్చీల్లాంటి వస్తువులక్కూడా చావుపుట్టుకలుంటాయి. తాత్వికంగా చూస్తే - ఈ పుట్టిన్రోజు, చచ్చిన్రోజులకి పెద్ద ప్రాముఖ్యత వుండదు, వుండరాదు.

బాగా డబ్బున్నవారికీ, పేరుప్రఖ్యాతులు సంపాదించినవరికీ ఈ పుట్టిన, చచ్చిన రోజులు పవిత్రమైన పుణ్యదినాలు. ముఖ్యంగా రాజకీయ నాయకులు తమ కాడర్ కోసం ఈ సందర్భాల్ని వాడుకుంటారు. ఇంక సినిమా హీరోల పిచ్చి అభిమానులు చేసే హడావుడి యింతంత కాదు.. పరమ రోతగా వుంటుంది.

ఈ మధ్య ఈ పుట్టిన్రోజుల హడావుడి తెలుగు సాహిత్యంలోకి కూడా వచ్చి చేరింది. గురజాడ, శ్రీశ్రీ మొదలైన ఆధునిక రచయితలు పుట్టిన వందో సంవత్సరాన్ని ఓ పండగలా చేశారు. ఎవరి ఉత్సాహం వారిది. వారి ఆనందాన్ని కాదన్డానికి మనమెవరం?

మా ఊళ్ళో క్వారీ యజమానులు, పొగాకు వ్యాపారస్తుల దగ్గర్నుండి చందాలు వసూలు చేసి సాహిత్య సభలు పెడ్తుంటారు! ఈ చందా వసూళ్ళు కార్యక్రమం అచ్చు ఒకప్పుడు శ్రీరామనవమి చందా వసూళ్ళ లాగా, ఇప్పుటి గణేష్ చతుర్ధి చందా వసూళ్ళలా సాగుతుంది. ఆ చందాలతో అభ్యుదయ కవుల పుట్టిన్రోజు పండగలు జరుపుతారు!

పై ఫోటోలో కిరీటం పెట్టించుకుని శాలువాలు కప్పించుకుంటున్న వ్యక్తి సామాన్యుడు కాదు. తెలుగులో ఎన్నో గొప్ప కథలు రాసిన కాళీపట్నం రామారావు (కారా మాస్టారు). నిన్న కారా మాస్టారి పుట్టిన్రోజు. ఆ పుట్టిన్రోజు జరపబడ్డ వార్త చదువుతుంటే చికాగ్గా అనిపించింది. ఏ రాజకీయ నాయకుడి, సినిమా హీరో పుట్టిన్రోజుకీ తక్కువ కాకుండా రంగరంగ వైభవంగా జరిపారు. ఈ హడావుడి మాస్టారి అనుమతి లేకుండా జరిగే అవకాశం లేదు. మరప్పుడు ఆయన ఇట్లాంటి ఆర్భాటాలకి ఎందుకు ఒప్పుకున్నాడు?

నా అభ్యంతరం కారా మాస్టారి అభిమానులకి కోపం తెప్పించొచ్చు. కానీ - నేనూ ఆయన అభిమానినే! అందుకే నాకు చిరాగ్గా వుంది. ఇదే ఏ పాపులర్ రచయిత పుట్టిన్రోజైతే అస్సలు పట్టించుకోం. వాళ్ళు గజారోహణ చేసినా మనకి సంబంధం లేని అంశం. కానీ - అఫాల్ ద పీపుల్ - కారా మాస్టారా!

ఆయన శిష్యకోటి తమ అభిమానం వ్యక్తం చేసేందుకు ఇలాంటి చౌకబారు ప్రదర్సన ఏర్పాటు చేసుండొచ్చు. ఆయన సహజంగానే మొహమాటస్తుడు కాబట్టి - కాదనలేకపోవచ్చు. కానీ - ఈ మొహమాటం ఆయన కథల్లో వుండదు కదా! నాకిప్పుడు అనిపిస్తుంది. రచయితగా కారా వేరు, వ్యక్తిగా కారా వేరు. ఈ వైరుధ్యంతోనే మనం ఆయన్ని అర్ధం చేసుకోగలగాలి - అదెంత కష్టసాధ్యమైనా!

కారా మాస్టారు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా, హాయిగా, ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటున్నాను. 

(photo courtesy : Google)

14 comments:

  1. ఇలాంటిది నాకొక అను(ణు)మానం కొన్నాళ్ళక్రితం వచ్చింది. రచన గొప్పది, రచనకే విమర్శ కావాలి, రచయిత సృజన అది, రచయితను పర్సనల్ గా తిట్టరాదు కానీ రచనను తిట్టొచ్చు అని విమర్శకాగ్రణులు చెప్పారు (కారా గారు అలా చెప్పినట్టు గుర్తు). మరి రచననే ఏనుగుల మీదా, గుర్రాల మీద ఊరేగించవచ్చు కదా? రచయితను ఎందుకు ఏనుగు మీదా, మరొక జంతువు మీదా ఎక్కించి ఊరేగిస్తారు? అలాగే రచనకే అవార్డు ఇచ్చి, ఆ అవార్డుకు వచ్చిన డద్దుతోటి ఆ రచనకు పేరు తీసుకు రావడమో లేక ఆ రచనకు సబ్సిడీగా ఆ సాహిత్యసంస్థలూ, అకాడీమీలూ, పీఠాలూ తాము "రచయిత"కిచ్చే డబ్బును allocate చేసి ఆ రచనను సాధ్యమైనంత ఎక్కువ పాఠకుల వద్దకు తీసుకుపోవచ్చు. రచయితకు సన్మానాలెందుకు చేస్తారు?

    ReplyDelete
    Replies
    1. రచనకే దూషణభూషణాలు రావాలన్న మాటతో ఏకీభవిస్తాను.

      రచన అనేది తనంతట తాను ఆకాశం నుండి రాలిపడదు కదా. అది మనలోకంలో ఆవిర్భవింపజేసిన వాడు రచయిత. (లేదా రచయిత్రి).

      ఒక అమూల్యరచనను ప్రోత్సహించటానికే డబ్బూ దస్కం ఇచ్చి కర్చు చేయాలనటం మంచి ఆలోచనయే. అప్పీలు లేదు.

      కాని రచయితలూ బ్రతకాలి. కాబట్టి వాళ్ళను సమాజం పోషించటం మంచి పధ్ధతి. లేక రచనాకారుల్ని పెట్టుబడిదారులు గాడిదల్లా చాకిరీకి వాడుకుంటే వారికి అమూల్యరచనలు చేసేందుకు వారు అవకాశం దొరకనీయక పోవచ్చును. ఎలాగో అలా అటువంటి రచన ఏర్పడినా ఆ పెట్టుబడిదారులు తమకు నచ్చకపోతే నాశనం చేయవచ్చును. అందుచేత సన్మానం పేరిట ప్రోత్సహించటమూ, వారికి స్వతంత్రజీవనానికి అవకాశం కోసం ధనసాయం చేయటమూ సమాజం చేస్తే మంచిదే. అది తప్పు కాదు.

      పేరుప్రతిష్ఠలు తమ నిష్పాక్షికతకు చెరుపే చేస్తాయనుకునే వాళ్ళు అజ్ఞాతంగానే ఉండి రచనలూ చేయవచ్చును. అదీ దొసగు కాదు.

      Delete
    2. శ్యామలీయం గారు,

      నాకు తెలిసిన సమాచారం - ఈ సన్మానం చేసింది ఆయన స్టూడెంట్లు.

      వాళ్ళో లక్షరూపాయిలు సొమ్ము కూడా ఇచ్చారు - అది (ఎప్పట్లాగే) 'కథానిలయం' ఖాతాలోకి వెళ్ళిపోయింది.

      Delete
  2. ఆఖరి లైను మాత్రం నచ్చింది. మిగిలినది చేదుగా ఉంది.
    మన రచయతలను మనం గౌరవించుకోపోతే ఎలా?

    ReplyDelete
  3. నేను సైతం నాచేతి నుంచి చందా పంపాను సుమండీ!

    ReplyDelete
  4. చాలా మంచి ప్రశ్న . యధా రాజా తధా ప్రజా అన్నారు గధా, ప్రజలు రాజును అనుసరింతురు. రాజు ఎంత దుర్మార్గుడైనా ప్రజలు తలమీద ఎత్తుక మోయక తప్పదు. ఆ సంస్కృతి లో బ్రతుకుతూ దాన్ని మొయ్యకుంటే పూట్టగతులుండవు కదా? ఇప్పుడే చదివాను ఒక రచయిత '' చారిత్రక కోణం నుంచి చూస్తే, ఇది మన జాతి జీవలక్షణం అనిపిస్తుంది. అన్నిరకాల వైరుధ్యాలను, వ్యతిరేకతలను, భావజాలాలను తనలో కలిపేసుకుని తను మాత్రం అలాగే ఉండిపోయే ఒక కాలబిలం(బ్లాక్ హోల్) లాంటిది అది.'' అని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమో గానీ, కారా మాష్టారు ఇక ఎంత మాత్రం మీ అభి మాని అంటే వారు (పాలకులు) ఒప్పుకోరు.

    ReplyDelete
  5. పోనీ లెద్దురూ ! అంతా బావుంది కానీ ఆ కిరీటం పెట్టడమే బావు లేదు. తల పాగా మన సాంప్రదాయక వస్త్ర విశేషం. కానీ, కిరీటం రాచ రికపు దర్పానికి ప్రతీక అనుకుంటాను. నిర్వాహకుల ముచ్చట మనమేల కాదనాలి ? ఇంతకీ మాస్టారి తల మీద ఉంచినది కిరీటమా ? తల పాగాయా ? లేక ... మాస్టారికి పెట్టినది టోపీయా ! తెలీడం లేదు. తల పాగాను పోలిన కిరీటమో, కిరీటమును పోలిన టోపీయో లేక ... పని లేక .. ఎందుకు లెండి ... మాస్టారు చల్లగా ఉండాలి.

    ReplyDelete

  6. కారా మాస్టారి తలమీద ఉన్నది చం లాతో చుట్టిన తలపాగాయే.కిరీటం కాదు.మరీ అంత గొప్పగా ఏమీ ఆ సత్కారాన్ని జరపలేదు.ఆయనకు ఆర్భాటాలు ఇష్టముండదు.90 ఏళ్ళు పూర్తైన సందర్భంలో అభిమానులు,శిష్యులు జరిపారు.అంత విమర్శించనక్కరలేదు.

    ReplyDelete
  7. నాకు కారా మాస్టారి రచనలంటే ఇష్టం మరియు గౌరవం. అందుకే నాకాయన సన్మానం ఫోటో నచ్చలేదు.

    నా పోస్ట్ చదివి కొందరు హర్ట్ అయినట్లుగా అర్ధమవుతుంది. అయాం సారీ!

    ReplyDelete
  8. పుట్టిన రోజుల ఆర్భాటాల గురించి చక్కగా రాశారు రమణ గారూ!కవుల్ని రచయితల్ని గౌరవించడం అనగానే సన్మానాలు చేయడం,కిరీటాలు పెట్టడం అని అభిమానులు అనుకుంటారల్లే ఉంది. వాళ్ళు సరే, మరి ఆయా రచయితలు కూడా దాన్ని అంగీకరిస్తున్నారంటేనే ఏదోగా ఉంది!!

    మన పత్రికల వాళ్ళు కూడా ఫలానా రచయిత పుట్టిన రోజు సందర్భంగా, లేక వర్ధంతి సందర్భంగా.. అంటూ వ్యాసాలు ప్రచురిస్తుంటారు. మామూలు రోజుల్లో వాళ్లని తల్చుకుంటే మహా పాపమేదో చుట్టుకుంటుందన్నట్టు!

    కారా గారి రచనలంటే నాకూ ఇష్టమే! ఆయన కథల్లోని స్పృహకు, వ్యతిరేకంగా ఉన్న ఈ ఆర్భాటాలే మింగుడు పడటం లేదు

    ReplyDelete
  9. "Kadhanilayam", the abode of story, is a unique effort to preserve the Telugu fiction in all its manifestations to posterity. The noted writer and Kendra Sahitya Academy award recipient, Mr Kalipatnam Rama Rao, has taken upon himself with a missionary zeal this herculean task of collecting the published Telugu stories. The effort is aimed at giving short story its pride of place because of its role in social development and its ability to lead to an understanding of complex human relations and life.---ఇక తెలుగు కథలు కంచికి పోవు,
    శ్రీకాకుళం లోని కథా నిలయానికి పోతాయి
    కథా నిలయం (కారా) రామా రావ్ మాస్టారి కృషి వలన!

    ReplyDelete
  10. ఈ విధమైన కార్యక్రమాలు ఏదో ఒక సందర్భాన్ని పురస్కరించుకొని జరగడం చాలా మంచిది.ఇప్పుడు ఇంకొంత మందికి పరిచయం అవుతారు . ఈ టపా చూసే వరకు ఆయన రచనలు చదవాలని బలంగా అనిపించలేదు మరి. కినిగే లో దొరుకుతాయా? పెద్ద వాళ్ళకి పంపించడానికి కారా మాస్టారు వి, ఇంకా కొన్ని తెలుగు రచనలు ఎవరైనా చెపుదురూ ...


    సన్మానాలు ఆయన అంగీకరిన్చావచ్చునా లేదా అన్నది పూర్తీ గా అప్రస్తుతం అని నా అభిప్రాయం . ఫోటో లో ఆయన

    ReplyDelete
  11. Interesting perspective. కారా మాస్టారు తన రచనకీ రచనా దృక్పథానికీ మరీ అంత విభిన్నమైన మనిషి కాదు. మొదట్లో ఆయనకి రాష్ట్ర ప్రభుత్వ సాహిత్య ఎకాడమీ బహుమతి వచ్చింది. ప్రభుత్వ విధానాలను నమ్మని మాస్టారు ఆ బహుమతిని తిరస్కరించారు. ఆ తరవాత కేంద్ర సాహిత్య ఎకాడమీ వాళ్ళు బహుమతి ఇచ్చారు. అప్పుడు కూడా ఆయన తిరస్కరించాలనే అనుకున్నారు కానీ పలువురు సన్నిహితులు నచ్చ చెప్పారు ఆ బహుమతిని ఏదైనా మంచి పనికి వినియోగించవచ్చని. అలా కథా నిలయం మొదలీంది. ఆ తరవాతనించీ మాస్టారు తెలుగు కథకి ఒక ఎంబ్లెం అయ్యారు. ఆయన కూడా తనను తాను అలాగే చూసుకున్నారు. తనకి వివిధ వేదికల మీద జరిగిన సన్మానాలన్నీ తెలుగు కథకి, కథానిలయానికి జరిగిన సన్మానాలుగానే ఆయన భావించారు. అవన్నీ అలా ఉండగా, రొడ్డకొట్టుడు సన్మాన కార్యక్రమాలను వదిలిపెట్టి అర్ధవంతమైన రీతిలో సత్కరించుకునే పద్ధతుల్ని మనం వెతుక్కోవాలి.

    ReplyDelete
  12. 'ఏదో పెద్దాయన ముచ్చటపడ్డాడు. మధ్యలో నీగోలేంటోయ్?' అన్నారు కొందరు పెద్దలు.

    'అవున్నిజమే! మధ్యలో నా గోలేంటి?' అనిపించింది.

    కాబట్టి - ఈ విషయంపై ఇంక నే చెప్పేదేమీ లేదు!

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.