Monday 17 November 2014

చరిత్ర చెరశాలలో.. పటేల్ - నెహ్రూ


ఇప్పుడు సినిమా కబుర్ల కోసం అనేక మాధ్యమాలు వున్నాయి. నా చిన్నప్పుడు ఇవేవీ లేవు. అయితే మా సినిమా కబుర్లకి మాత్రం తక్కువేమీ లేదు.

'మా ఏయన్నార్ చేసిన దేవదాసు పాత్రని మీ ఎన్టీవోణ్ని చేసి చూపించమను. సినిమా ఒక్కరోజు కూడా ఆడదు.' అని ఒకడు సవాల్ చేస్తే -

'మా ఎన్టీఆర్ చేసిన బందిపోటు మీ నాగ్గాణ్ని చెయ్యమను. జనాలు తెర చించేస్తారు.' అని వేరొకడు వెక్కిరించేవాడు.

సరదాగా మొదలైన కబుర్లు ఒక్కోసారి తన్నులాటకిక్కూడా దారి తీసేవి. ఏయన్నార్, ఎన్టీఆర్ సినిమాల్లో ప్రత్యర్ధులైనా.. ఇద్దరూ సినిమా నటులే. ఆ విషయం తెలీంది మాకే!

ముప్పైయ్యైదేళ్ళ క్రితం ఈ.వి.రామస్వామి (పెరియార్) రాసిన రామాయణం కొంత చదివాను. 'కొంత' అని ఎందుకంటున్నానంటే మొత్తం చదవడం నావల్ల కాలేదు కాబట్టి. పెరియార్ నాస్తికుడు. ఆనాటి సమాజంలో బ్రాహ్మణాధిపత్యానికి వ్యతిరేకంగా ఉద్యమం చేసిన సాంస్కృతిక నాయకుడు. ఆయన ఉద్యమానికి ఏం చెప్పాలి? 'ఆధిపత్య శక్తులు తమ పెత్తనం సాగించుకోడం కోసం సృష్టించబడ్డ ఒక హిందూ మైథాలజి రామాయణం. దాన్ని చదవకండి, చెత్తబుట్టలో పడెయ్యండి!' అని చెప్పాలి. కానీ ఆయనలా చెప్పలేదు.

మనం ఏవైతే రాముడి లక్షణాలు అనుకుంటామో, అవి తీసుకెళ్ళి రావణుడికి ఆపాదించాడు. సీత లక్షణాలు శూర్పణక, మండోదరిలకి ఆపాదించాడు. అంటే పాజిటివ్ నెగెటివ్‌గానూ, నెగెటివ్ పాజిటివ్‌గానూ రాశాడు. ఆయాన్రాసింది చదువుతుంటే - విఠలాచార్య సినిమాలో ఎన్టీఆర్ రాజనాలతోనూ, రాజశ్రీ విజయలలితతోనూ పాత్రలు మార్చుకున్నట్లుగా అనిపించి నవ్వొచ్చింది. కాకపొతే పెరియార్‌కి రామాయణం పట్ల తీవ్రమైన కోపం వుందని మాత్రం అర్ధమవుతుంది. 

ఒకప్పుడు రామారావు, నాగేశ్వరరావు అభిమానులు తిట్టుకున్నట్లుగానే - ఇప్పుడు నెహ్రూ, పటేల్ అభిమానులు గ్రూపులుగా విడిపొయ్యి వాదించుకుంటున్నారు. ఆనాడు పెరియార్ ఆపాదించినట్లుగా - పటేల్ అభిమానులు నెహ్రూని విలన్‌గా చూపించడానికి తెగ ప్రయత్నిస్తున్నారు. ఈ అభిమానులకి రాజకీయ కారణాలు తప్ప మరే కారణం లేదని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

ఇప్పుడు బీజేపి అధికారంలోకి వచ్చింది కాబట్టి పటేల్ కూడా ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చాడు. ఐతే - హిందుత్వ శక్తులకి పటేల్ మీద అంత ప్రేమెందుకు? పటేల్, మౌలానా ఆజాద్, రాజేంద్ర ప్రసాద్.. అందరూ నెహ్రూ నాయకత్వంలోనే పన్జేశారు కదా? అందరూ కాంగ్రెస్ నాయకులేగా! అయితే అందరూ మంచివాళ్ళవాలి లేదా చెడ్డవాళ్ళవాలి. కానీ - వారికి నెహ్రూ ఒక్కడే చెడ్డవాడు ఎలా అవుతాడు?

భారద్దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది (అంతకుమించి మనకి వేరే గతి లేదు). ఆ పార్టీలో, ఆ పార్టీ నాయకుల్లో.. ఇప్పటి పార్టీల్లోలానే - అనేక లుకలుకలున్నాయి, కుమ్ములాటలున్నాయి, ఎత్తుకు పైయ్యెత్తులున్నాయి. పన్లో పనిగా మన జాతిపితగారు కూడా తన వంతు పాత్రని పోషించారు - నెహ్రూని ప్రధానిగా చేశారు. ఇట్లాంటివన్నీ ఒక రాజకీయ పార్టీలో సహజమే. కాకపోతే చిన్నప్పుడు పాఠాల్లో వీళ్ళ గూర్చి గొప్పగా చదువుకున్నాం కాబట్టి - వీళ్ళంతా దేవతలన్నట్లుగా ఫిక్సైపొయ్యాం.

ఒక ప్రభుత్వం - దేశానికి మంచి చేసినా, చెడు చేసినా మంత్రివర్గం సమిష్టి బాధ్యత వుంటుంది. పటేల్ తీసుకున్న ప్రతి నిర్ణయం వెనుకా నెహ్రూ ఆలోచన వుండాలి, అలాగే నెహ్రూ తప్పుల్లో పటేల్‌కీ వాటా వుంటుంది. ఒక వ్యక్తికి - ఒక పార్టీలోనైనా, ప్రభుత్వంలోనైనా ఒక నిర్ణయం నచ్చనప్పుడు వ్యతిరేకించాలి, వ్యతిరేకించినా కుదరనప్పుడు బయటకి వచ్చెయ్యాలి. ఏ దేశంలోనైనా ఇదే డెమాక్రటిక్ ప్రిన్సిపుల్‌ అప్లై అవుతుంది. మంచంతా ఫలానా ఆయన గొప్పదనం, చెడంతా ఇంకోకాయన నిర్వాకం అని బుకాయిస్తే.. నమ్మేవాళ్ళు నమ్మవచ్చు గాక - నైతికంగా సరికాదు (పటేల్ చివరిదాకా కాంగ్రెస్‌లోనే వున్నాడని మర్చిపోరాదు).

ఒకప్పుడు పెరియార్‌ రాసినట్లుగా - ఇవ్వాళ సుగుణాలన్నీ పటేల్‌కే వున్నట్లు హిందూత్వ శక్తులు ఆకాశానికి ఎత్తేస్తున్నాయి. నాస్తికుడైన పెరియార్‌కి రావణుడు హీరో అయినట్లుగా, చివరిదాకా కాంగ్రెస్‌వాదిగా మిగిలిన పటేల్ బీజేపీకి హీరో అయ్యాడు! తమ అన్న ధర్మరాజు జూదం ఆడ్డం ఇష్టం లేకపోయినా - నలుగురు తమ్ముళ్ళు నోర్మూసుకుని కూర్చున్నారంటే - వారిక్కూడా ఆ జూదంలో భాగం వుంటుంది. అందుకే ఇవ్వాళ ప్రజలకి మన్‌మోహన్‌సింగంటే అంతే కోపం. పటేల్, నెహ్రూ, అంబేడ్కర్‌లని వేరు చేసి చూపడం అంటే - ఒకే తానులో ముక్కల్ని విడివిడిగా అంచనా వెయ్యబూనడమే.

పాపం! ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీవాళ్ళది విచిత్ర సంకటం. నెహ్రూ, పటేల్ ఇద్దరూ కూడా తమ నాయకులే. ఇన్నాళ్ళూ ఉద్దేశ్యపూర్వకంగా పటేల్‌ని పక్కన పెట్టారు. కానీ - నెహ్రూవియన్ విజన్‌ని అవసరానికి మించి పొగుడ్తుంటారు. అందుకు వారికున్న రాజకీయ ప్రయోజనాలే కారణం. వాళ్ళకి నెహ్రూ లెగసీ పూర్తిగా తమ సొత్తేనని, తామే నెహ్రూ వారసులమనీ ప్రగాఢ విశ్వాసం. అందువల్లనే ప్రస్తుత కాంగ్రెస్ నాయకత్వంపై ప్రజలకి వున్న కోపం నెహ్రూ మీదక్కూడా వెళ్తుంది!

ఈ విధంగా - ప్రస్తుతం హిందుత్వ వాదులు పటేల్నీ, కాంగ్రెస్ వాదులు నెహ్రూని చెరొక పక్కా దొరకబుచ్చుకుని (ఆ నాయకులిద్దరూ ఎంత గింజుకున్నా) వదలట్లేదు. ఆ నాయకులు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చేప్పుడు, వచ్చిన తరవాత - రాజకీయంగా ఉన్నత స్థానాల్లో వుండి, దేశగతినే మార్చేసిన అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాల్లో ఎవరి పాత్ర ఎంతనేది తెలుసుకోవాలనుకోడం ఎలా వుంటుందంటే - 'వంకాయ కూరకి ఉప్పు ముఖ్యమా? కారం ముఖ్యమా?' లాగా!

సంఘ పరివారానికి స్వాతంత్రోద్యమంలో పెద్దగా పాత్ర లేదు, వున్నదంతా కాంగ్రెస్‌దే (అదెంత దరిద్రపు దయినప్పటికీ). ప్రస్తుతం ఆ కాంగ్రెస్ అవినీతి రొచ్చులో పీకల్దాకా కూరుకుపోయింది (ఇప్పుడల్లా బయటకొచ్చే అవకాశాలు కనపడట్లేదు). చరిత్ర లేని సంఘ పరివార్ సమస్య - ఐడెంటిటీ క్రైసిస్. అందుకే తెలివిగా పటేల్‌ని తమ పార్టీలో కలిపేసుకున్నారు. ఇదోరకంగా - మన తెలుగు సినిమా సమస్య. వంశచరిత్ర వున్నవాడికేమో నటన రాదు, నటన తెలిసినవాడికేమో వంశచరిత్ర లేదు!

ఈ దేశగతి మార్చిన - ఏ రాజకీయ ఆలోచననైనా చర్చకి, శల్యపరీక్షకి గురి చెయ్యాల్సిందే. అయితే - అది జరగాల్సింది చరిత్రకారుల శాస్త్రీయ విశ్లేషణల ద్వారా మాత్రమే తప్ప పార్టీ ఆఫీసుల్లో కాదు. ఎందుకంటే నెహ్రూ, పటేల్ వంటి నాయకులు చాలా భిన్నమైన ఆలోచన ధోరణి కలిగినవారు. ఎక్కడైనా, ఎప్పుడైనా - రాజకీయ నాయకులు తీసుకునే నిర్ణయాలు అనేక పరిమితులకి లోనై వుంటాయి. వారు తీసుకునే నిర్ణయాలు కొన్ని మంచి ఫలితాల్నిస్తే, మరికొన్ని బెడిసికొడతాయి. కానీ - అప్పటి నాయకుల్లో వున్నదీ, ఇప్పటి నాయకుల్లో లేనిదీ ఒకటి వుంది - నిజాయితీ!

ముగింపు -

జైళ్ళు బ్రతికున్నవాళ్ళ కోసం వుపయోగిస్తారు. కానీ - పాపం! పటేల్, నెహ్రూలు చనిపోయినా కూడా రెండు రాజకీయ పార్టీలవారి బందిఖానాలో యిరుక్కుపొయ్యారు. వారి స్థితి జీవిత ఖైదీల కన్నా ఘోరం! వారికి చెరసాల నుండి త్వరలో విముక్తి కలగాలని ఆశిస్తున్నాను!

(photo courtesy : Google)

15 comments:

  1. చతురోక్తంగా ఉన్నా చక్కగా, సూటిగా వ్రాశారు రమణ గారు. నిజాయితీ లోపించిన నేటి నేతలు నాటి నిజాయితీగల నేతలను వాడుకోవడానికి చేస్తున్న పిచ్చి ప్రయత్నాలు ఎక్కువకాలం మనుగడ సాగించలేవు. అయినా వీరి కుయుక్తులను బాధ్యత కలిగినవారంతా మీలా ఎండగట్టడం అవసరం.

    ReplyDelete
  2. నెహ్రూ - పటేల్ దగ్గర మొదలుపెట్టి, వంకాయ కూర మీదుగా సాగి, తెలుగు సినిమా దగ్గర ముగించారు నేటి రాజకీయ ప్రహసనాన్ని.

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. రమణ గారు,
    ఒక ఉదాహరణ తీసుకొందాం. లాండ్ మార్క్ వంటి ఒక పెద్ద పుస్తకాల షాప్ ఉంది. కాలంలొ వచ్చిన మార్పులవలన ఆ షాప్ మూతబడబోతున్నాది. ఆ షాప్ తో అనుబంధం ఉన్నవారు ఎమి చేస్తారు? అందులోని విలువగల మంచి పుస్తకాలను కొనుకొని దాచుకొంటారు. అలా కొనుకొనే వాడు పుస్తకాలను జ్ణానం కోసంకొనుకొన్నాడా? అవసరమొచ్చి కొనుకొన్నాడా? నా దగ్గర పేరు ప్రఖ్యతులున్న గొప్ప రచయితలు రాసిన చాలా పాత పుస్తకాలు ఉన్నాయని, ఇతరులకు చూపించటానికి కొనుకొన్నాడా? అనే వంద ప్రశ్నలు సంధించి, తీరికగా సమయం ఉన్నపుడల్లా విశ్లేషించుకోవచ్చు. కాని వంద ప్రశ్నలకు, ఒక్క జవాబు సరైన సమాధానం అని రాయటం సరి కాదు. మీరు రాసిన ఈ టపా కుడా అలానే ఉంది. దేశ చరిత్రలో, ఈ దేశ ప్రజలందరికి కాంగ్రెస్ పార్టి తో అనుబంధం ఉంది. ఆ పార్టిలోని నాయకులు వారొక్కరి స్వంతం కాదు. మూతపడిపోయే దశలో ఉన్న ఆ పార్టి లోని చరిత్ర కలిగిన నాయకులను భవిషత్ తరాల వారికి తెలియజెప్పవలసిన అవసరం బిజెపికి ఎంతో ఉంది. ఎందుకంటే సర్దార్ పటేల్ కి వారసులు ఎవ్వరు లేరు. ఆయన మంత్రిగా పని చేసే రోజులలోనే కుటుంబ సభ్యులను రాజకీయాలకు దూరంగా ఉంచుతూ, డిల్లిలోకి అడుగుపెట్టనిచ్చే వాడు కాదు. ఇక బిజెపి పార్టి పటేల్ గారిని ఈ రోజు కొత్తగా నెత్తిన పెట్టుకోవటంలేదు. 1980 ల నుంచే ఆ పని చేస్తున్నాది.

    బిజెపి యేతర పార్టీల లోని గొప్ప నాయకులను అక్కున చేర్చుకోనే కార్యక్రమం పటేల్ తో మొదలయ్యి పివి వరకు కొనసాగవచ్చు. రానున్న రోజులలో కమ్యునిస్ట్ పార్టి లు డైనోసార్ లా పూర్తిగా మాయమైతే, దేశానికి EMS నంబుద్రిపాద్ చేసిన సేవలు కూడా గుర్తించి, గౌరవిస్తారు. సంఘ పరివార్ చరిత్రకి కోసం చేస్తున్నాదని అనేది వాస్తవం కాదు. సంఘ్ పరివార్ పట్టించుకోకపోతే వారిని పట్టించుకొనే వారే ఉండరు.
    మీలాంటి ఒకరిద్దరు రచయితలు బిజెపి కమ్యునిస్ట్ లకు పడదు. ఉప్పు నిప్పు లాగా కొట్టుకొనే వారు. వారిని వీరేలా సత్కరిస్తారు అని, లా పాయింట్ తీసి బ్లాగులో టపాలు రాసుకొన్నా ఫలితం ఉండదు. మాయమైన కమ్యునిస్ట్ పార్టి లోని మిగిలిన వారు యన్.జి.ఒ. లు పెట్టుకొని నడుపుకొంట్టూ, ఇటువంటి అంశాల పై గళం విప్పినా, పట్టించుకోరు. కొత్త తరం ప్రజలకు అది వింతగా ఉంట్టుంది. ఎప్పుడో మూత పడిన పార్టి వారికి, ఇప్పుడు సన్మానం చేయటం అవసరమా? ఎదో బిజెపి వాళ్లు పాత నాయకులను స్మరించుకోంట్టూంటే, వారిని ఇంతగా విమర్శించాలా అని సామాన్య ప్రజలు మీలాంటివారినే తప్పు పట్టే అవకాశాలు ఎక్కువ. పాత తరం నాయకులను బిజెపి ప్రభుత్వం సన్మానించకపోతే, ప్రజలు ఎంత కాలం చందాలేసుకొని కార్యక్రమాలను చేస్తారు? అని ప్రశ్నిస్తారు, ఆ తరువాత ఆ బాధ్యతను ప్రజలే ప్రభుత్వానికి అంటే BJP కి అప్పజెపుతారు.

    ReplyDelete
    Replies
    1. శ్రీ రాం గారు,
      మీ విశ్లేషణ బాగుంది.

      రమణ గారి టపా చదివిన తరువాత, రమణ గారిని ఒక ప్రశ్న అడగాలనిపించిది.
      రమణ గారు, మీరు అనుకుంటునట్లే "భాజపా" వాళ్ళు పటేల్ గారిని నెత్తిన పెట్టుకున్నరు అనుకుందాము!
      కాని గత 65+ సంవత్సారాలుగా , ఒకే ఒక్క కుటుంబాన్ని, ఎక్కువ చెయ్యటం కోసం మిగతా నాయకులని చిన్న చూపు చూడటం, ఒక వర్గం వాళ్ళని ప్రసన్నం చెయ్యటం కోసం, దేశ చరిత్రనే మార్చటం జరిగింది. లేదు "అలా జరగలేదు" అని మీరు మనస్పూర్తిగా అనుకుంటె ఇక ఇక్కడితొ చదవటం అపేయండి.

      ఒకవేళ లేదు అలా జరిగింది, అని మీరు కూడా ఒప్పుకుంటే, మీ ఉద్దెశ్యంలో , ఇప్పుడు వున్న అధికార పార్టీ ఎం చెయ్యాలి? ఏ నాయకులని గురించి ప్రజలకి చెప్పాలి?
      లేదా అసలు వాళ్ళెమీ చెయ్యకూడదా?

      కృష్ణ

      Delete
    2. This comment has been removed by the author.

      Delete
  5. ఆ మధ్య భగత్ సింగ్ కూడా మావాడె నన్నారు. ఇప్పుడెందుకో వదిలేశారు. ఆయన్ దేశ భక్తికి చిన్ హం కాదు కాబోలు.

    ReplyDelete
    Replies
    1. స్వాతంత్ర సమరయోదులు, దేశానికి నిస్వార్థంగా సేవచేసిన వారందరిని కలిపి ఒకే సంవత్సరంలో, పనిగట్టుకొని ప్రభుత్వం చంకనెత్తుకొంటే బాగుండదు. ఏ పని లేక, ప్రజలకు సేవ చేయలేక, ఈ పని మొదలు పెట్టారనుకొంటారు. అది చూసేవారికి సిటి బస్సు లో ఆత్రం కొద్ది ప్రజలను కుక్కినట్లు గా ఉంట్టుంది.
      చారిత్రక పురుషులకు సమయం, సందర్భం చూసి (100 వ పుట్టినరోజనో, 75వ వర్దంతి సందర్బంలోనో) వారి స్థాయికి తగినట్లు ప్రభుత్వం కార్యక్రమాల ఏర్పాట్లు చేస్తుంది. భగత్ సింగ్ ను ఎలా మరచిపోతారు? అపోసిషన్ పార్టి లో పుట్టి, పెరిగి, చివరి వరకు కొనసాగిన సర్దార్ పటేల్ ను బిజెపి వారు వారి వైపుకు విజయవంతంగా లాగేసుకొంట్టుంటే, ఏ పార్టి లో సభ్యుడు కాని భగత్ సింగ్ లాంటి స్వతంత్ర సమరయోధులను గుర్తించి, గౌరవించటం తప్పక చేస్తారు.

      Delete
  6. అంబేద్కర్ కాంగ్రెస్స్ వాది కాదు,హిందూ కోడ్ బిల్లు కోసం నెహ్రు తో విభేదించి మంత్రి పదవిని వదులుకున్నాడు,మీ టపా లో ఏదైనా విషయం గురించి రాయాలి అనుకుంటే పూర్తిగా తెల్సు కొని రాయగలరు

    ReplyDelete
    Replies
    1. @ జెన్నీగారు,

      I regret for the factual error. I've edited the post deleting Ambedkar part.

      I'ii be more careful in future. Thanks a lot for the correction.

      Delete

    2. ఇదేమన్నా న్యూస్ పేపర్ కి ఎడిటోరియల్ కోసం రాసినదాండీ ! $$$

      జిలేబి

      Delete
    3. ఇన్ని రోజులనుంచి రమణ గారి బ్లాగు చదువుతూ, ఆయన గురించి ఇదా మీకు అర్థమైంది. రమణ గారంటే మీరేవరనుకొన్నారు? ముఖాన విభూతిరేఖలు, నెత్తిన పిలక లేని కామ్రేడ్ శంకరాభరణం శంకరశాస్త్రి గారు. శంకరశాస్త్రి పెర్ఫెక్షన్ కోసం ఎంత తపిస్తారో, దాసు బ్రోచేవారేవరు రా పాటను విని ఎలా బాధపడతారో, అలాగే రమణగారు కూడా పెర్ఫెక్షన్ కోసం పరితపిస్తారు, అందులో ఎవైనా లోపాలు దొర్లితే వారు తట్టుకోలేరు :)

      Delete
  7. "వంకాయ కూరకి ఉప్పు ముఖ్యమా? కారం ముఖ్యమా?"

    రెంటి కంటే వంకాయే ముఖ్యం!

    ReplyDelete
    Replies
    1. అంటే కారం ఉప్పు లాంటి పటేల్ మరియు అంబేడ్కర్ గార్లకన్న వంకాయ్ లాంటి నెహ్రూనే గొప్ప అన్నమాట.

      Delete
  8. *ఈ దేశగతి మార్చిన - ఏ రాజకీయ ఆలోచననైనా చర్చకి, శల్యపరీక్షకి గురి చెయ్యాల్సిందే. *
    రమణ గారు మొన్నటి ఎన్నికలు దేశ చరిత్ర గతిని మార్చాయని శల్యపరీక్షలు జరిపి, చివరికి తేల్చిందేమిటంటే :)
    Learn from RSS, Karat tells unions

    http://www.thehindu.com/news/national/learn-from-rss-karat-tells-unions/article6615605.ece?homepage=true

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.