ఛత్తీస్‌గఢ్‌లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న మహిళలు చనిపొయ్యారు. ఈ చావులు ఆ కుటుంబాలకి తీరని నష్టం. ఈ సంఘటన దేశపౌరులుగా మనమందరం సిగ్గుతో తల దించుకోవాల్సిన విషయంగా నేను భావిస్తున్నాను.
ఈ చావులకి కారణం తెలుసుకోడానికి ప్రభుత్వం ఒక విచారణ కమిటీని వేస్తుంది. ఆ కమిటీ ఏదో రిపోర్టునిస్తుంది. ఆ రిపోర్టుపై ప్రభుత్వం ఏవో చర్యలు తీసుకున్నామని కూడా చెబుతుంది. ఇదంతా ఓ తమాషా మాత్రమేనని అర్ధం చేసుకోడానికి పెద్దగా జ్ఞానం అక్కర్లేదు.
అవడానికి మనది ఒకటే దేశమైనా - ఒకదేశంలోనే అనేక దేశాలున్నాయి. ఒకదేశంలో ప్రపంచస్థాయి వైద్యం జరిగితే, ఇంకోదేశంలో కుక్కల కన్నా హీనమైన వైద్యం జరుగుతుంది. ఒకదేశంలో చిటికెన వేలు దెబ్బకి పదిమంది వైద్యుల బృందం వైద్యం ఆపరేషన్ చేస్తే, ఇంకోదేశంలో సరైన ప్రసూతి సౌకర్యాలు లేక చనిపోతారు.
ఈ దేశంలో పేదలకి రక్షణ లేదు. పేదల పట్ల ధర్మకర్తలుగా వుండాల్సిన ప్రభుత్వాలు.. తమ కర్తవ్యాన్ని వదిలేసి అగ్రరాజ్యాలకీ, అంతర్జాతీయ వ్యాపారస్తులకీ మోకరిల్లుతున్నారు. అదేమంటే - ఏవో అర్ధం కాని లెక్కల్తో ఆర్ధిక పాఠాలు చెబుతారు.
ఏ దేశంలోనైనా పేదవాడి బ్రతుకు హీనమే. దరిద్రులంటే దోమలకి లోకువ, రోగాలకి లోకువ, బొచ్చుకుక్కలకి లోకువ. ఇంతమందికి లోకువైన ఈ ప్రత్యేకజాతి ఐదేళ్ళకోసారి ఓట్లేయించుకోటానికి తప్ప ఇంకెందుకూ పనికిరాదని ప్రభుత్వం వారిక్కూడా లోకువే.
అందుకే - పేదవాళ్ళు ఆకలికి అలమటించి చస్తారు, చలికి నీలుక్కుపొయ్యి చస్తారు, ఎండకి ఎండిపొయ్యి చస్తారు, వరదలకి కొట్టుకుపొయ్యి చస్తారు. ఇన్నిరకాలుగా చచ్చేవాళ్ళు ఇప్పుడు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకుని కూడా చస్తున్నారు. ఇకనుండి వాళ్ళు చచ్చేందుకు మరో కొత్తకారణం!
విచారణలో అనేక విషయాలు ప్రస్తావనకి రావొచ్చు. సరైన ప్రీ ఆప్ చెకప్స్ జరగలేదనీ, లేపరోస్కోపీ పరికరాన్ని సరీగ్గా స్టెరిలైజ్ చెయ్యలేదనీ, గేస్ కలుషితమైందనీ, డాక్టర్ నిర్లక్ష్యమనీ, పోస్ట్ ఆప్ కేర్ సరీగ్గా ఇవ్వలేదనీ, మందులు మంచివి కావనీ.. ఇలా. సరే! ఈ లోపాల్నన్నింటినీ సరిచేసుకుని - భవిష్యత్తులో పొరపాటున కూడా మళ్ళీ ఇలా జరక్కుండా చేసుకునే కట్టుదిట్టమైన వ్యవస్థ మనకుందా? లేదని నేననుకుంటున్నాను.
వీధికుక్కల సంఖ్య పెరక్కుండా వాటికి స్టెరిలైజ్ చెయ్యాలని కొన్ని స్వచ్చంద సంస్థలు చెబుతుంటాయి. ఈ గోలంతా లేకుండా - చాలా మునిసిపాలిటీల్లో వీధికుక్కల్ని ఊరి బయటకి పట్టుకెళ్ళి మూకుమ్మడిగా చంపేస్తారు. ఒకవేళ ప్రభుత్వాలకి కూడా జనాభా నియంత్రణకి కుక్కల మోడెల్లో ఏదైనా హిడెన్ ఎజెండా వుందేమో తెలీదు. వున్నా అవి మనకి చెప్పవు.
ఎందుకంటే - బహుళజాతి మందుల కంపెనీలు పేదవారిపై తమ మందుల్ని ప్రయోగించి పరిశీలించుకునే సౌలభ్యాన్ని కల్పించిన దేశం మనది. ఇక్కడ ఏదైనా జరగొచ్చు. ఇలా జరుగుతుందని బయటపడ్డప్పుడు మాత్రం ఎంతోకొంత నష్టపరిహారం ప్రకటించి, ఒక విచారణ కమిటీ వేసి చేతులు దులుపుకోవడం మన ప్రభుత్వాలకి వెన్నతో పెట్టిన విద్య.
చివరిగా -
లేపరోస్కోపిక్ ట్యూబెక్టమీ చేయించుని హీనంగా, దారుణంగా చనిపోయిన మహిళలకి - సిగ్గుతో తల దించుకుని - నివాళులర్పిస్తున్నాను.
(photo courtesy : Google)
చాలా విఛారించవలసిన సంగతి నిజంగా!
ReplyDeleteఒక డాక్టరుగారు ఎంత ప్ర్వీణులైనా సరే 5 గంటల్లో 84 ఆపరేషన్లను ఏకధాటిగా చేసిపారేసారంటే (అక్షరాలా) ఆ స్పీడు చూసే జనం చచ్చిపోవాలి ఆశ్యర్యంతో. ఒక్కో ఆపరేషనుకు సగటున 3 నిముషాల 24 సెకన్లన్న సంగతి . జనం చస్తే అది వేరే సంగతి కాని ముందా మహానుభావుడికి గిన్నీసు రికార్డు అందించాలేమో కదా!
దారి తప్పిన దేశం.
ReplyDelete
ReplyDeleteమీ తో ఏకీభవిస్తున్నాను.మొదట్లో కంటి ఆపరేషన్లు కూడా కేంపుల్లో చేసేవారు.కాని ఇప్పుడు కేసులు కేంపుల్లో ఎన్నిక చేసుకున్నా cataract surgeries హాస్పటల్సుకి తీసుకువెళ్ళి జాగ్రతగా చేస్తున్నారు అలాగే,కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కూడా క్షేత్రస్థాయిలో ఎన్నుకొని మంచిహాస్పటల్ కితీసుకువెళ్ళి చేయిస్తే ఇలాంటి ప్రమాదాలు,ఘోరాలు జరగవు.మరొక విషయమేమంటే చిన్నచిన్న బేచిల్లో చేయాలికాని వందలకొద్దీ ఒకేరోజు చేయకూడదు.
It is really very sad news. The first culprits are their husbands. Why should they let their wives go through these operations? Why can not they undergo vasectomy which is much more simpler?
ReplyDeleteఅలాగే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అనగానే అది కేవలం మహిళలు మాత్రమే చేసుకోవాల్సిన ఆపరేషన్ గా మాత్రమే చూడడం ఈ దేశంలో ఓ విషాదం. పురుషులు కూడా ముందుకొచ్చిన రోజు ఇటువంటి ఘోరాలు కొంతైనా అరికట్టే అవకాశం ఉంటుందేమో....
ReplyDeleteఅదెలా? మీరన్నట్లు, పురుషులు కూడా ముందుకొచ్చిన రోజున, తప్పుడు లేదా కలుషితమైన మందులూ, సరిగా స్టెరిలైజ్ చేయని వైద్యపరికరాలూ, వైద్యుల నిర్లక్షమూ, చికిత్సానంతరసేవల్లో లోపమూ వంటి కారణాల వలన ఆ చనిపోయే వారిలో పురుషులుకూదా తగినంత శాతానికి చేరతారు. అంతే కాని ఘోరాలు కొంతైనా ఎలా అరికట్టబడతాయీ?
Delete//ఒకవేళ ప్రభుత్వాలకి కూడా జనాభా నియంత్రణకి కుక్కల మోడెల్లో ఏదైనా హిడెన్ ఎజెండా వుందేమో తెలీదు.//
ReplyDeleteఉన్నా హాశ్చర్య పోవటనికి ఏమి లేదు.భారతీయులు గినీఫిగ్ లు అన్న సంగతి బహిరంగ రహాస్యమే. పోలీయో డ్రాప్ ను ప్రపంచ బ్యాంక్ మన మీద దయతలచి బిక్షమేసింది.
డాక్టర్ గారూ!
ReplyDeleteమన భారతీయులం, సిగ్గుతో తలదించుకొనే స్థితిని కొన్ని దశాబ్దాలక్రితమే దాటేసాం.
అన్ని విషయాలలోనూ నిర్లక్ష్యంగా, నిర్లిప్తంగా, నిర్లజ్జగా ఉండే స్థితికి అభివృద్ధి చెందాం.
Not related to this post.
ReplyDeleteదేశ విభజనానంతరం పాకిస్తాన్ లో కమ్యునిస్ట్ పార్టి ప్రయాణం గురించి సమీక్ష.you may like it.
The first left
http://www.dawn.com/news/1142900
రోగులు ఆసుపత్రి చుట్టూ... డాక్టర్లు కోర్టుల చుట్టూ
ReplyDeletehttp://telugu.greatandhra.com/articles/mbs/rogulu-asupatri-chuttu--57472.html
Chhattisgarh sterilization deaths: Drug company's director, son arrested
ReplyDeletehttp://timesofindia.indiatimes.com/india/Chhattisgarh-sterilization-deaths-Drug-companys-director-son-arrested/articleshow/45148986.cms