Monday, 24 November 2014

నేరమంతా ఒక్క రాంపాల్ బాబాదేనా?


గత కొన్నిరోజులుగా సంత్ రాంపాల్ అనే ఒక బాబా వార్తల్లో వ్యక్తిగా మారాడు. మీడియా రాంపాల్ అరాచకాల్ని కథలు కథలుగా రాసేస్తుంది. ఆశ్చర్యమేమంటే - రాంపాల్ ఆశ్రమ రహస్యాలు కొందరికి ఆశ్చర్యంగా అనిపించడం! ఈ ఆశ్రమాలు, భక్తుల హడావుడి.. నాకైతే ఇదంతా ఓ deja vu. ఈ బాబాలేం రాత్రికి రాత్రి పుట్టుకు రాలేదు, ఇవన్నీ మనకి కొత్తేం కాదు.

బ్రతకడానికి అనేక వృత్తులు - డాక్టర్లు, న్యాయవాదులు, మెకానిక్కులు.. మొదలైనవి. అలాగే - 'బాబాగిరి' కూడా ఒక వృత్తేనని అనుకుంటున్నాను! నిజం చెప్పాలంటే - మిగతా వృత్తులతో పోలిస్తే ఈ బాబావృత్తిలోనే తీవ్రమైన పోటీ నెలకొని వుంది. వందలమంది బాబాల అవతారం ఎత్తుతారు - అతికొందరికి మాత్రమే 'గుర్తింపు' లభిస్తుంది.

గొంగళిపురుగు సీతాకోక చిలగ్గా మారేముందు అనేక దశలు. అలాగే - బాబాలక్కూడా అనేక దశలు. ముందుగా ఫలానా బాబా మహిమ కలవాడని లోకల్‌గా ప్రచారం చేసుకుంటారు. మందీమార్భలం, శిష్యగణంతో హడావుడి చేస్తారు. నిదానంగా రాజకీయ నాయకుల్ని, ఉన్నతాధికారుల్ని ఆకర్షిస్తారు. ఇదంతా ఒక పకడ్బందీ ప్లాన్ ప్రకారం జరిగిపోతుంది.

క్రమేణా - పాపులారిటీతో పాటు భక్తులూ పెరుగుతారు. భక్తుల్ని జాగ్రత్తగా హేండిల్ చేస్తూ - రాజకీయ నాయకులకీ, ఉన్నతోద్యోగులకీ, కాంట్రాక్టర్లకీ liaison work చెయ్యడం మొదలెడ్తారు. ఉన్నత వర్గాలవారికి నమ్మకమైన బ్రోకర్‌గా వ్యవహరిస్తారు. కొంతకాలానికి - ఆ వర్గాల వారు తమ నల్లధనాన్ని బాబాల దగ్గర పార్క్ చేస్తారు. ఇలా - ఇంతమందీ కలిస్తేనే ఒక 'బాబాసామ్రాజ్యం' తయారవుతుంది. కొన్నిచోట్ల బాబాలకి మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు వున్నాయంటే - వీరి స్థాయేమిటో అర్ధం అవుతుంది.

బాబాల భక్తులుగా - సైంటిస్టులు, డాక్టర్లు వంటి గౌరవనీయమైన వృత్తుల్లో వున్నవాళ్ళు కూడా వుంటారు. ఈ దేశంలో చదువుకున్నవాళ్ళకి అనవసరమైన గౌరవం ఇస్తుంటారు కాబట్టి - 'ఫలానా సైంటిస్టే బాబా కాళ్ళకి మొక్కుతున్నాడు. మనమేమైనా ఆయనకన్నా తెలివైనవాళ్ళమా?' అని కొంతమంది అనుకుంటారు. మనం ఫలానా భక్తుడి కన్నా తెలివైనవాళ్ళం కాకపోవచ్చును, తెలివితక్కువ్వాళ్ళం మాత్రం ఖచ్చితంగా కాదు.

ధీరేంద్ర బ్రహ్మచారి, చంద్రస్వామి.. పేరేదైతేనేం? modus operandi మాత్రం ఒకటే. వీళ్ళకి యోగా అనో, వనమూలికల వైద్యమనో - ఏదోక సైడ్ బిజినెస్ కూడా వుంటుంది. సినిమాల్లో అమ్రిష్ పురీ ఇట్లాంటి బాబా వేషాలు చాలానే వేశాడు. ఒకప్పుడు మన రాష్ట్రంలో బాబాల ఆశ్రమాల్లో కాల్పులు జరిగి మనుషులు చస్తేనే అతీగతీ లేదు. గత కొన్నేళ్ళుగా న్యాయస్థానాలు మాత్రం ఈ బాబాలకి కునుకు లేకుండా చేస్తున్నాయి!

'ఆవారా'లో రాజ్‌కపూర్, కె.ఎ.అబ్బాస్‌లు - నేరమయ వ్యవస్థలో ఒక వ్యక్తి నేరస్తుడిగా ఎలా మారతాడో చెప్పారు. 'గాడ్‌ఫాదర్'లో రాజకీయ వ్యవస్థ, నేర సామ్రాజ్యాన్ని తన అవసరాలకి ఎలా వాడుకుంటుందో మేరియో పూజో, ఫ్రాన్సిస్ కొప్పోలా చూపారు. 'నేరం' అనే ఒక మొక్క - 'నేరవ్యవస్థ' అనే వృక్షంగా రూపాంతరం చెందడంలో తలా ఒక చెయ్యేస్తే గానీ సాధ్యం కాదు.

అయితే - బాబాల నేరాలు బయటపడ్డప్పుడు - బాబాలు మాత్రమే జైలు పాలవుతున్నారు (ప్రస్తుతం జైలు ఊచలు లెక్కబెడుతున్న బాబాల సంఖ్యేమీ తక్కువ కాదు). వీళ్ళతో hand in glove గా వుండి, నేరసామ్రాజ్యాన్ని పెంచి పోషించిన రాజకీయ నాయకులు, అధికారులు మాత్రం తప్పించుకుంటున్నారు (నేను బాబాల్ని సమర్ధించడం లేదు - వారి సహనేరస్తులు తప్పించుకుంటున్నారని చెబుతున్నాను.)

ఇకనుండి బాబా రాంపాల్ మాత్రమే విలన్. మీడియాలో ఆయన గూర్చి రోజుకో దుర్మార్గమైన నిజం వెలుగులోకొస్తుంది. ఇన్ని కేసులున్న రాంపాల్ ఇప్పుడప్పుడే బయటకొచ్చే అవకాశం తక్కువ. బాబాకి ఇప్పటిదాకా సహకరించినవారు దూరంగా సర్దుకుంటారు. కొన్నాళ్ళకి ఇంకో 'దుర్మార్గ' బాబా భాగోతం బయటపడుతుంది - అంతా మామూలే!

ప్రజల్లో అజ్ఞానం పోనంత వరకూ బాబాలకి కొదవుండదు. రాజకీయ నాయకులకి బాబాల అవసరం వుంది. కావునే - ప్రభుత్వాలకి బాబాల నేరాల్ని కట్టడి చేసే ఆసక్తి వుండదు. మనం బాబాల నేరమయ నేపధ్యం మూలాల్ని అర్ధం చేసుకోకపోతే - ఆ మకిలంతా ఒక్కడికే అంటించేసి, వాణ్ని మాత్రమే విలన్‌గా చేసి చేతులు దులుపుకునే పరిమిత అవగాహనలో వుండిపోతాం.

(photo courtesy : Google)

9 comments:

  1. నేరసామ్రాజ్యాన్ని పెంచి పోషించిన రాజకీయ నాయకులు, అధికారులు మాత్రం తప్పించుకుంటున్నారు
    అవునండీ. వీళ్ళని బయటకు తెద్దామన్నా అన్నీ‌ పెద్దపెద్ద తేనెతుట్టెలు. అందులో అస్మదీయులూ ఉంటారు కదా అనివార్యంగా. అందుచేత రాణీ యీగని పట్టేసుకుని ఊరుకుంటారు. మిగత యీగలన్నీ వేరే రాణీయీగని వెదుక్కుంటాయి. అంతే.

    ReplyDelete
  2. నిజాన్ని స్పష్టంగా సూటిగా చెప్పారు. బాబాగిరి ఒక విషవలయం. అందులో బాబాగా చెలామణి అయ్యే వ్యక్తి కేంద్ర బిందువు అయితే, రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు, కాంట్రాక్టర్లు ఆ విష వ్యవస్తని నిలబెట్టే ఫీడర్స్.

    ReplyDelete
  3. మన దేశంలో చదువుకున్న వారికే గౌరవం ఇస్తారా!? డబ్బు-అధికారం ఉన్నవారెంత వెధవలైనా ఇస్తారు. అజ్ఞానం బాగున్నవారు ఇలాంటి బాబాలకీ ఇస్తారు. ప్రజలెవరెవరికి గౌరవం ఇస్తారో , ఏయే భ్రమలలో ఉన్నారో తెలుసుకుని వాటిని పొషిస్తూ అవి తమ పోషణకు ఎలా ఉపయోగించుకోవాలో తెలివిగలిగినవారిలో వెధవలంతా ప్రయత్నిస్తుంటారు. ఏ కొద్దిమందో తప్ప మహా నే(మే)తలంతా ఈ దరిద్రపుగొట్టు బాబాల కాళ్లకు మొక్కినవారే. ఓ సినిమా పాటలో అన్నట్లు మెదడే పెరిగీ హృదయం తరిగీ నరుడే ఈనాడూ వానరుడైనాడూ.... చదువు పెరుగుతున్నకొద్దీ సారీ చదువుకున్నవారే దొంగ బాబాలను బాగా నమ్ముతూ పూజలు చేస్తున్నట్లనిపిస్తోంది.

    ReplyDelete
    Replies
    1. బాబాలు, దొంగ బాబాలు వేరని మీ అభిప్రాయమా కొండలరావు గారు ?

      Delete
  4. నిస్వార్థంగా, ఆడంబరాలకి దూరంగా ఉండే మంచి వాళ్ళకి కూడా ఇలాంటి వారివల్ల చెడ్డ పేరు వస్తున్నది.

    ReplyDelete
  5. This comment has been removed by the author.

    ReplyDelete
  6. ప్రతి ఒకడు ఇంకొకడిడి దోచుకొనే వాడే
    తన స్వార్దం తన గంయం చూచు కొనే వాడే!
    ఈ మాట బతికున్నంతవరకు బాబాలు, రాజకీయ నాయక్య్లు, మాపియాలు బతికే ఉంటారు. :)

    ReplyDelete
  7. రమణ గారు, మీరు వెన్నలాంటి మెత్తని మనసుగలవారని తెలుసు. అయినా సరే, ఈ వార్త తెలిసిన తరువాత మీతో పంచుకోకుడా ఉండలేకపోతున్నాను ఈ విషయం చదివి, బాధపడి, రేపు ఉదయం అడవిలో ఉండే కుక్కలు, నక్కలు, తోడేళ్ల పోటోలు పెట్టి టపా రాయరని ఆశిస్తాను :)
    “People, especially Leftists from Delhi, easily get carried away by the Maoist story of sacrifice and a crusade against corporate invaders. The story on the ground is vastly different, with Maoists showing scant respect for villagers,... “Sexual harassment is rampant. Women in these camps are used like sex slaves. All that ideological flourish of the movement is history.”

    http://www.openthemagazine.com/article/nation/the-last-farce

    ReplyDelete
  8. Rational living without believing in magic would be nice, but, seems unachievable for mankind. When well educated (especially science based) people fall prey to the baba nonsense (unless they are in cahoots with the said babas in the first place!) it is really sad. Kasiki poyanu ramahari was a 1958 song and nothing has changed.

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.