Saturday, 28 March 2015

నేడు శ్రీరామనవమి - 'థాంక్స్ టు ఎన్టీఆర్'


ఇవ్వాళ శ్రీరామనవమి. నేను ప్రతి శ్రీరామనవమి రోజునా - 'థాంక్స్ టు ఎన్టీఆర్' అనుకుంటాను! ఎందుకంటే - ఎన్టీఆరే గనక సినిమాల్లో శ్రీరాముడిగా నటించకపోయినట్లైతే - నాకు శ్రీరాముడు గుర్తుండే అవకాశం లేదు! 'రాముడు, సీత' అంటూ చిన్నప్పుడు క్లాసు పుస్తకాల్లో కొంత చదువుకున్నాను గానీ - పరీక్షలైపోంగాన్లే, మార్కుల కోసం సంపాదించిన పుస్తక జ్ఞానాన్ని - పాము కుబుసం విడిచినట్లుగా వదిలియ్యడం నాకలవాటు. కానీ - సీతారాముల్ని మర్చిపోకుండా ఎన్టీఆర్ సినిమాలు అడ్డుపడ్డాయి!

మనం బ్రతకాల్సింది జ్ఞానిగానా, అజ్ఞానిగానా అనేది మనమే నిర్ణయించుకోవాలి. మన్దేశంలో పాఠ్యపుస్తకాల్ని బుద్ధిగా చదవేసి, పరీక్షలనే బురదగుంటల్ని ఈది, మార్కులనే పన్నీట స్నానం చేసిన యెడల సుఖమయ జీవనం సంప్రాప్తించుననే జీవన సత్యం గ్రహించినందున - నేను ఎకడెమిక్ జ్ఞానిగానే మిగిలిపొయ్యాను. కానీ - అందుకు నేను చింతించను. ఎందుకంటే - ఈ సత్యాన్ని గ్రహించని (నాకన్నా తెలివైన) వాళ్ళు - జ్ఞానులయ్యేరు గానీ, జీవితంలో మాత్రం వెనకబడ్డారు.

నేను తొమ్మిదో క్లాసు దాకా 'దేవుడు వున్నాడు' అని నమ్మాను. తొమ్మిదో క్లాసులో దేవుడికో కఠినమైన పరీక్ష పెట్టాను. నాకు చదువులో పుచ్చా పవన్ కుమార్ అనే భీభత్స ప్రత్యర్ధి వున్నాడు. మా ఇద్దరికీ మధ్య తీవ్రమైన మార్కుల యుద్ధం జరిగేది. అన్ని పరీక్షల్లో - మా ఇద్దరికీ రెండు మార్కులు అటూఇటుగా వచ్చేవి. మార్కులలా అటూఇటుగా కాకుండా - ఇటే (అంటే నాకే ఎక్కువ) వచ్చేట్లు చెయ్యమని దేవుడికి పరీక్ష పెట్టాను. 

శివుడు, ఆంజనేయస్వామి మొదలైన దేవుళ్ళని రంగంలోకి దించాను. పన్జరగలేదు. ఇంక లాభం లేదనుకుని - కుంకుడు రసంతో శుభ్రంగా తలంటుకుని, భక్తిప్రవృత్తులతో వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి వెళ్ళాను. కొబ్బరికాయ కొట్టాను, ద్వజస్థంభం ముందు సాష్టాంగ ప్రణామం చేశాను. ఆ రోజంతా స్వచ్చమైన, పవిత్రమైన మనసుతో పదే పదే 'స్వామీ! నాకు పవన్ గాడి కాన్నా ఎక్కువ మార్కులొచ్చేట్లు చూడు!' అనే మంత్రం ఉచ్చరిస్తూనే వున్నాను!

ఎప్పుడూ లేనిది - ఈసారి పరీక్షల్లో పవన్ గాడు నాకన్నా చాలా ముందుకెళ్ళిపొయ్యాడు! ఆనాడు నేనొక సత్యం కనుగొన్నాను - 'దేవుడు ఉన్నాడో లేదో నాకు తెలీదు. ఒకవేళ ఉన్నా - ఆ దేవుడుకి నాకు సహాయం చేసే ఉద్దేశం లేదు! నాకు సహాయం చెయ్యని ఆ దేవుడు ఎంత గొప్పవాడైతే మాత్రం నాకెందుకు?' అంచేత - ఆనాటి నుండి దేవుణ్ని పట్టించుకోవటం మానేశాను! కొంతమంది నన్ను నాస్తికుడంటారు గానీ, నాకా మాట అప్లై అవదనుకుంటాను!

ప్రస్తుతం - దేవుడి ప్రమేయం లేకుండా నా జీవితం సాఫీగానే సాగుతుంది. శ్రీరామనవమి అంటే రాముడు పెళ్ళి చేసుకున్న రోజనీ, సీతాదేవిని రాముడు అడవులకి పంపించాడనీ.. ఇట్లా చాలా విషయాలు నాకు తెలుసు. అందుకు కారణం ద గ్రేట్ ఎన్టీఆర్. ఆయనే లేకపోతే - 'పోర్షన్‌'లో లేని రామాయణం నాకు గుర్తుండేది కాదు. మా పిల్లల్లాగా రాముడి తండ్రి భీష్ముడని 'గెస్' చేస్తుండేవాణ్ని! 

 'థాంక్స్ టు ఎన్టీఆర్'

(picture courtesy : Google)