Saturday, 28 April 2012

hmtv వందేళ్ళకథకు వందనాలు.. గొప్ప కామెడీ షో!


"మిత్రమా! ఇవ్వాళ రాత్రి hmtv చూడు. రావిశాస్త్రి గూర్చి ఏదో ప్రోగ్రాం వస్తుందిట." అని నా స్నేహితుడు ఫోన్ చేసి చెప్పాడు. నాకు టీవీ చూసే అలవాటు పెద్దగా లేదు. అందులోనూ తెలుగు న్యూస్ చానెళ్ళు అంటే నాకు భయం! కానీ hmtv కె.రామచంద్రమూర్తి సారధ్యంలో నడుస్తున్న చానెల్. ప్రోగ్రాం బాగుండే అవకాశం ఉంది. కావున రావిశాస్త్రి కార్యక్రమం చూద్దామని నిర్ణయించుకున్నాను.

ప్రోగ్రాం పేరు 'వందేళ్ళకథకు వందనాలు'. సాహిత్య సంచికా కార్యక్రమం. సంపాదకుడు గొల్లపూడి మారుతీరావు. ప్రోగ్రాం మొదలైంది. గొల్లపూడి ఆపకుండా మాట్లాడుతూనే ఉన్నాడు. ఈయన సినిమాల్లో వాగుడుకాయ పాత్రలు వేశాడు. బయటకూడా ఇంతే అని అర్ధమైపోయింది.

ఇంతకీ ఈ ప్రోగ్రాం target viewers ఎవరు? 1.ఆయాకథలు ఆల్రెడీ చదివేసి.. చదివిన కథల్ని టీవీలో చూసుకుని కొత్త అనుభూతి పొందేవారా? 2.సమీప భవిష్యత్తులో ఆయారచయితల కథలు చదువుదాం అనుకునేవాళ్ళా? 3.క్రైం వార్తలు, సీరియళ్ళు చూస్తూ పొరబాటున రిమోట్ నొక్కి hmtv లోకి వచ్చేవాళ్ళా? ఎవరికోసమైనా, ఏరకంగా చూసుకున్నా ఒక 'దశ-దిశ' లేని ప్రోగ్రాం ఈ వందేళ్ళకథలు.

పాతపాటల్ని remix చేస్తున్నట్లుగా ఈమధ్య పాతకథల్ని remix చేసే కార్యక్రమాలు మొదలయ్యాయి. ఖదీర్ బాబు చేతిలో 'సాక్షి' ఉంది కాబట్టి, పాతకథల్ని ఆయన శైలిలో రాసేసుకుంటూ పొయ్యాడు. ఆతను 'ఒక గొప్ప సాహిత్య ప్రయోగం చేశాను. మూలబడ్డ పురాతన కథలకి వెలుగునిచ్చాను.' అని అనుకోవచ్చు. మంచిది.

అయితే ఖదీర్ బాబు ఈ కథల్ని ఎవరికోసం రాశాడు? తెలుగుకథ మహా అయితే ఐదారు పేజీలుంటుంది. చదవటానికి ఎక్కువసేపు పట్టదు. ఆ ఓపిక కూడా లేనివాడికి ఒక నమస్కారం. ఎవరూకూడా తెలుగుకథని చదివి ఉద్ధరించనవసరంలేదు. (మంచి కథలు మనని గ్యారెంటీగా ఉద్ధరిస్తాయి. మనం కథల్ని ఉద్ధరించలేం!)

ఈ స్పీడుయుగంలో అందరూ అన్నీ cash చేసుకుంటారు. అందుకే కథల్ని చదివే ఆసక్తి, ఓపికా లేని మారాజుల కోసం (డబ్బు దండిగా సంపాదించి కథ వైపు తొంగిచూద్దాం అనుకునేవారి కోసం) fast food లాగా, twenty over cricket match లాగా ఖదీర్ బాబు రాసేశాడు.

నాకయితే ఖదీర్ బాబు కథనరీతి మిమిక్రీలాగా, ఏకపాత్రాభినయంలాగా అనిపించింది. సరే! ఎందఱో ఈ ప్రక్రియని విమర్శించారు. కొందరు మెచ్చుకున్నారు. ఖదీర్ బాబు చివరికి బీనాదేవి సర్టిఫికేట్ తో బయటపడ్డాడు. అతనికి ఆ మాత్రం తలంటు పొయ్యకపొతే చలాన్ని, కుటుంబరావుల్ని కూడా తిరగరాసే ప్రయత్నం చేసేవాడేమో!

పుస్తకాల్ని చదవలేని సోమరుల కోసం సంక్షిప్తం చేసే ప్రక్రియ ఇప్పటిది కాదు. కన్యాశుల్కాన్ని నార్ల వెంకటేశ్వరరావు abridge చేశాడు. మన చిన్నప్పుడు text book కి గైడ్ ఉండేది! అలాగన్నమాట. ఈ గైడ్ వల్ల నార్ల సాధించింది ఏమిటో తెలీదు. సరే! ఆయన కలం, ఆయన కాగితం, ఆయన పబ్లిషర్. మనకి అనవసరం. 

మళ్ళీ మన hmtv వందేళ్ళకథకి వద్దాం. తెలుగుసాహిత్యంలో గొల్లపూడి మారుతీరావు స్థానం, స్థాయి ఏమిటో నాకు తెలీదు. తెలీకపోవడం అనేది నా తప్పవుతుందిగానీ గొల్లపూడిది కాదు. నా అజ్ఞానాన్ని మన్నించండి. బహుశా సినిమానటుడు కూడా కావున ప్రోగ్రాంకి ప్రాచుర్యం వస్తుందని అతన్ని ఎంచుకునిఉండొచ్చు.

సెట్ చూస్తే చాలా చౌకగా ఉంది. వందేళ్ళతెలుగు కథేమోగాని.. సెట్ మాత్రం వందేళ్ళక్రితం వేసినట్లు ఉంది. black and white దూరదర్శన్ సెట్లు గుర్తొస్తాయి. ఒక టీపాయ్, రెండు కుర్చీలు. అంతే!

ఈ వందేళ్ళకథకి ఒక editorial policy ఉన్నట్లుంది. ఈ ఇరుకు సెట్లో రచయితకి ఒకకుర్చీ. సదరు రచయిత మరణించిఉంటే ఆకుర్చీలొ రచయిత భార్య, భార్య కూడా పొతే కొడుకు.. మనవడు.. మునిమనవడు. వీళ్ళెవ్వరూ దొరక్కపోతే రచయితగారి పక్కింటాయన! ఈ లెక్కననుసరించి రావిశాస్త్రి లేడు కావున ఆయన కొడుకు గొల్లపూడి ఎదురుకుర్చీలో కూర్చున్నాడు. 

పాపం! ఆ అబ్బాయి గొల్లపూడి వాగ్ధాటికి బెదిరిపోయ్యాడు. గొల్లపూడి తన trademark హావభావాలతో రావిశాస్త్రిని పొగడ్తల దండకంతో ముంచేస్తున్నాడు. అప్పుడప్పుడు రావిశాస్త్రి కొడుకుని మాట్లాడనిస్తున్నాడు. ఆ ప్రశ్నలు కూడా చౌకబారు ప్రశ్నలు. 'నాన్నగారు రాత్రిళ్లు రాస్తారా? పగలా? టేబుల్ మీద రాస్తారా? మంచంమీద రాస్తారా?' ఇవీ ఆ ప్రశ్నలు!

కొంతసేపటికి ఆ అబ్బాయి రావిశాస్త్రి కథ నొకదాన్ని కూడబలుక్కుంటూ చదవసాగాడు. గొల్లపూడి ఆ కుర్రాణ్ణి తన తండ్రి కథని పట్టుమని పదిలైన్లు కూడా చదవనీలేదు. లాక్కుని తనే చదవడం మొదలెట్టాడు. ఒక రాజకీయ నాయకుణ్ణి వందమాగదితులు పోగుడుతున్నట్లు రావిశాస్త్రిని పొగుడుతూనే ఉండటం నిరాటంకంగా కొనసాగింది. నాకు వెగటేసింది. ఇదీ hmtv వాళ్ళ సాహిత్య కార్యక్రమం! 

hmtv ఒక private channel. కావున వాళ్ళు 'ఇది మా ప్రోగ్రాం. మా ఇష్టం. చూస్తే చూడు. లేకపోతే మానెయ్యి' అనొచ్చు. అంటారు కూడా. నేను, నా బ్లాగు, నా ఇష్టం అని మనంకూడా అనుకుంటున్నాంగదా. అయితే నాకు కొన్ని సందేహాలు. ఆస్తిపాస్తులకి వారసత్వం ఉంటుంది. ఇప్పుడు రాజకీయాల్లో ముఖ్యమంత్రి కుర్చీ కూడా వారసత్వమే అంటున్నారు. ఈ సూత్రం తెలుగు సాహిత్యానికి కూడా apply అవుతుందా?

శ్రీశ్రీ, రావిశాస్త్రి, కుటుంబరావులు తెలుగువారి ఆస్థి. పుస్తకాలపై వచ్చే రాయల్టీకి, కుటుంబ సభ్యులకి సంబంధం ఉంటుంది. అంతే! అంతేకాని ఫలానా రచయిత మనవళ్ళని, మునిమనవళ్ళని దుర్భిణీ వేసి వెతికి పట్టుకొచ్చి ఆ రచయితల వ్యక్తిగత అలవాట్లని చర్చించడం సాహిత్య కార్యక్రమం ఎలా అవుతుంది?

Medical science లో ఎన్ని బ్రాంచ్ లు ఉన్నాయో సాహిత్యంలో అంతకన్నా ఎక్కువే ఉన్నాయి. అనేక పీఠాలున్నయ్. పీఠాధిపతులూ ఉన్నారు! వీరికి చాలా స్పష్టమైన విభజన రేఖలున్నయ్. ఒకళ్లంటే ఇంకొకళ్ళకి పడదు. కొన్ని ఉదాహరణలు రాస్తాను. ముళ్ళపూడి గూర్చి శ్రీరమణ అద్భుతంగా చెప్పగలడు. రావిశాస్త్రి గూర్చి చలసాని ప్రసాద్, చలం గూర్చి రంగనాయకమ్మ, శ్రీశ్రీ గూర్చి కె.శివారెడ్డి.. ఇట్లా అనేకరకములైన రచనలకి వేరువేరు స్పెషలిస్టులు ఉన్నారు.. ఉంటారు. విశ్వనాథ సత్యన్నారాయణని కాళీపట్నం రామారావు చేత విశ్లేషించ బూనడం సరికాదు. మా.గోఖలేకి ముదిగొండ శివప్రసాద్ పనికిరాడు. (గుండెపోటుకి చర్మవ్యాధుల వైద్యం పనికిరాదు).

అంచేత తెలుగు కథలకి పరిచయమో, పొగడ్తో.. అన్నింటికీ anchor ఉదయభానులా ఒకళ్ళే ఉండటం సరికాదు. కథకులందర్నీ అదేపనిగా ఆకాశానికి ఎత్తేస్తుంటే ఇంకా నీ గోలేంటి? నిజమే! కథా పరిచయం, విశ్లేషణ ఒక సీరియస్ సాహిత్య ప్రక్రియ. అప్పుడు మనకి రకరకాల వ్యక్తుల అభిప్రాయాలు, రిఫరెన్సులు  అవసరమవుతాయి. పొగడటానికి ఎవరైతే ఏంటి! ఏ తెలుగు పండితుడైనా.. ఏ సన్మాన పత్రాలు రాసేవాడైనా సరిపోతుంది.

hmtv వారి సాధకబాధలు మనకి తెలీదు. ఖర్చు తగ్గించుకుందామనో, సాహిత్యపు ప్రోగ్రాములకి ఇదిచాల్లే అనుకున్నారో తెలీదు. దూషణ భూషణములన్నీ గొల్లపూడి ఖాతాలోకి పోతాయిలే.. మనకెందుకు అనుకున్నారా? లేదా గొప్ప ప్రోగ్రాం అంటే ఇదే అని ఆనందపడుతున్నారేమో! మంచిది. నాకు మాత్రం ఏదో సినిమా నటుల్ని పొగిడే ప్రొగ్రాంలాగా అనిపించింది. అందుకే ఈ ప్రయత్నం ఒక C-grade TV serial స్థాయిలో  ఉంది.

అయితే.. hmtv వాళ్ళు తెలుగు సాహిత్యం అంటూ కనీసం (ఎంత చెత్త ప్రోగ్రామయినప్పటికీ) ఒక ప్రోగ్రాం చేస్తున్నారు. అందుకు అభినందిస్తున్నాను. హుందాతనంలో మిగిలిన తెలుగు చానెల్స్ తో పోలిస్తే hmtv ఎంతో ముందుంది.  మిగిలిన చానెల్స్ మరీ నాసిగా ఉంటాయి.


కె.రామచంద్రమూర్తి print medium వదిలి టీవీకి వెళ్ళడం వల్ల తెలుగు జర్నలిజానికి నష్టం జరిగిందని భావిస్తున్నాను. ఒకవిషయం గూర్చి అవగాహనతో లోతైన విశ్లేషణ చెయ్యడం, చేయించడం print medium లోనే సాధ్యం. తెలుగు టీవీకి serious journalism అవసరమా? అవసరం లేదనుకుంటున్నాను. సరే! ఇది రామచంద్రమూర్తి career. పూర్తిగా ఆయనిష్టం. మన ఇష్టాయిష్టాలు ఆయనకనవసరం. అడగడానికి మనమెవరం? (నేను hans india పేపర్ చూళ్ళేదు.)

చికాగ్గా నాస్నేహితుడికి ఫోన్ చేసాను. "ఏమి నాయనా! నీకు నామీద ఇంత కోపముందని తెలీదు. ఒక దిక్కుమాలిన ప్రోగ్రాం చూడమంటావా?" అన్నాను.

ఆతను పెద్దగా నవ్వాడు. "ఆ ప్రోగ్రాం అసలుపేరు  గొల్లపూడి talk show. జనాలు చూడరని గంభీరత కోసం పేరు మార్చారు. నీకు ఆ ప్రోగ్రాం చూసి కోపం వచ్చింది. నాకు మాత్రం నవ్వొస్తుంది. గొల్లపూడి వాక్ప్రవాహంలో కొట్టుకుపోతున్న అతిధులని చూస్తుంటే భలే కామెడీగా ఉంటుంది నాకు. కాదేది కామెడీకనర్హము!"

"ఆ కామెడీ ఏదో నువ్వే ఎంజాయ్ చెయ్యొచ్చుగా! నా time waste చెయ్యడం దేనికి?"

"హి.. హి.. హి.. నీతో తిట్టించుకోవటం కూడా కామెడీగా ఉంది." అంటూ ఫోన్ disconnect చేశాడు!

(pictures courtesy : Google)

Wednesday, 25 April 2012

చిత్తూరు నాగయ్య.. ద సైకోథెరపిస్ట్

"ఒకే విషయం ఎన్నిసార్లని చెప్పాలి? చెప్పేప్పుడు బుద్ధిగా తలూపుతారు, పని మాత్రం చెయ్యరు. అసలు మీ సమస్యేమిటి? వినపడదా? అర్ధం కాదా?" విసుగ్గా అన్నాను.

నా హాస్పిటల్లో స్టాఫ్ అవడానికి సీనియర్లే. కానీ వాళ్లకి ప్రతిరోజూ, ప్రతివిషయం కొత్తే! మా సుబ్బు సరదాగా అంటుంటాడు - 'యధా వైద్యుడు, తధా స్టాఫ్.' 

కానీ ఇవ్వాళ మరీ చిరాగ్గా ఉంది - 'వెరీ ఇర్రెస్పాన్సిబుల్ పీపుల్!' అని పదోసారి అనుకున్నాను.

ఇంతలో - గదిలో ఏదో అలికిడి. విసుగ్గా తలెత్తి చూశాను. ఎదురుగా ఒక ఆజాను బాహుడు, ధవళ వస్త్రాల్లో ధగధగ మెరిసిపోతున్నాడు. ఈయన్ని ఎక్కడో చూసినట్లుందే? ఎవరబ్బా! ఈయన.. ఈయన.. చిత్తూరు నాగయ్య! ఆయన ప్రశాంత వదనంతో, దరహాసంతో నన్నే చూస్తున్నాడు.

అంతే కాదు - 'నువ్విక మారవా?' అని నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ప్రశ్నిస్తున్నట్లుగా కూడా అనిపించింది.

'అబ్బా! ఈయన్తో చచ్చేచావుగా ఉంది, ప్రశాంతంగా కోపాన్ని కూడా తెచ్చుకోనివ్వడు గదా! వేలకి వేలు జీతాలిస్తున్నాను. ఏం? నా స్టాఫ్ ని ఆమాత్రం మందలించేంత హక్కు నాకుండదా? సినిమా చూస్తున్నప్పుడు లక్షాతొంభై అనుకుంటాం. అంతమాత్రానికే ఈయన అప్పులాళ్ళా వచ్చెయ్యడమేనా?'

అంతలోనే నా చికాకు, కోపం, అసహనం అన్నీ ఒక్కసారిగా ఆవిరైపొయ్యాయి. సిగ్గుతో తల దించుకున్నాను.

నేనెందుకు ఇంత చెత్తగా ఆలోచిస్తున్నాను! దిసీజ్ నాట్ కరెక్ట్. చిత్తూరు నాగయ్యని నా థెరపిస్ట్‌గా ఎప్పాయింట్ చేసుకున్నది నేనే. ఈ థెరప్యూటిక్ ఎలయెన్స్‌తో నాగయ్యకి ప్రమేయం లేదు. నాకూ, చిత్తూరు నాగయ్యకి పేషంట్ డాక్టర్ రిలేషన్‌షిప్ కొన్నాళ్ళుగా నడుస్తుంది. ఒక విషయం చెప్పేప్పుడు ఎత్తుగడగా ముందు కొంత సంభాషణతో మొదలెట్టి, అటుతరవాత అసలు కథలోకి వచ్చే నా ఓ.హెన్రీ అనుకరణ మార్చుకోలేకున్నాను. ఇవ్వాళ కూడా నా అరిగిపోయిన స్టైల్లోనే రాస్తున్నాను, మీరు నన్ను మన్నించాలి.

చిత్తూరు నాగయ్య గొప్ప నటుడు, గొప్ప గాయకుడు అని నా నమ్మకం. అయన మరీ అంత గొప్పేం కాదు అని ఎవరైనా అంటే నాకస్సలు అభ్యంతరం లేదు. నా అభిప్రాయాలేవో నాకున్నాయి, అవి ఇతరుల్తో సరిపోలాలని నేనెప్పుడూ అనుకోను. అయితే నాగయ్య పట్ల నా అభిమానం స్వార్ధపూరితమైనది. వాడ్డూయూ మీన్ బై - 'స్వార్ధాభిమానం'!? 

వృత్తిరీత్యా నేను సైకియాట్రిస్టుని, ఫీజుచ్చుకుని కోపాన్ని పోగొట్టడానికి కౌన్సెలింగ్ చేస్తాను. కానీ నాకు కోపం ఎక్కువ! ఎదుటివారి కోపం ఎలా తగ్గించాలో తెలిసిన నాకు, నా కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలీదు. ఈ కన్ఫెషన్‌ని  నా మోడెస్టీగా భావించనక్కర్లేదు, శిక్ష పడదంటే హంతకుడు కూడా నేరాన్ని ఒప్పుకుంటాడు!

అది అర్ధరాత్రి, ఇంట్లోవాళ్ళు హాయిగా నిద్ర పోతున్నారు. నాకు మొదట్నుండీ సరీగ్గా నిద్ర పట్టదు. దూరదర్శన్‌లో నాగయ్య నటించిన 'యోగి వేమన' వేస్తున్నారు. సుఖమయ నిద్ర కోసం ఈ పురాతన సినిమాకి మించిన మంచి సాధనమేముంది అని ఆ సినిమా చూడ్డం మొదలెట్టాను. క్రమేపి సినిమాలో లీనమైపోయ్యాను.

వేమారెడ్డికి అన్నకూతురంటే ఎంతో ప్రేమ. ఆ పాప జబ్బుచేసి చనిపోతుంది. నిర్వేదనగా స్మశానంలో తిరుగుతున్నాడు. ఒక మనిషి పుర్రెని చేతిలోకి తీసుకుని 'ఇదేనా, ఇంతేనా' అంటూ పాడుతున్నాడు. వెచ్చగా బుగ్గల మీద యేదో స్పర్శ! అవి నా కన్నీళ్ళూ! అర్ధరాత్రి కాబట్టి నా కన్నీళ్ళని ఎవరూ గమనించే ప్రమాదం లేదు కాబట్టి నేనా కన్నీళ్ళని ఆపుకోవటానికి ప్రయత్నించలేదు. నా ప్రమేయం లేకుండానే కళ్ళల్లోంచి కన్నీళ్ళు ధారగా కారిపోతున్నయ్! ఈ అనుభూతి నాకు కొత్త, నాలో ఇన్ని కన్నీళ్ళున్నాయా! సినిమా చివరిదాకా గుడ్లప్పగించి అలా చూస్తూ కూర్చుండిపొయ్యాను. 

ఆశ్చర్యం! ఆ మరుసటి రోజు నాకు కోపం రావాల్సిన సందర్భంలో కూడా పెద్దగా కోపం రాలేదు. ఆ తరవాత నాగయ్య నటించిన సినిమాల్ని వరసగా చూశాను. నా కోపం క్రమేపి ఇంకాఇంకా తగ్గసాగింది. నాగయ్యది ప్రశాంత వదనం. మృదువుగా, మార్ధవంగా నటిస్తాడు. నాగయ్యని నిశితంగా గమనిస్తాను, పాటల్ని ఏకాగ్రతతో వింటాను. అప్పుడే నాకు కోపం వచ్చినప్పుడు నాగయ్యని గుర్తు చేసుకోవడం ఈజీగా ఉంటుంది.

ప్రతిరోజూ పాలు తాగడం ఆరోగ్యానికి మంచిది, ఉదయాన్నే నడక కూడా మంచిది. నాగయ్య చిత్రాలు చూస్తూ ఉండటం కూడా ఇదే  కోవలోకి వస్తాయని నమ్ముతున్నాను. ఫైటింగ్ సినిమాలు చూసేవాడిలో నేరప్రవృత్తి ఉంటుందట. సెక్స్ సినిమాల ప్రేమికుడికి లోకమంతా బూతుమయంగా ఉంటుందట. అలాగే - నాగయ్య సినిమాలు చూసినవాడు ప్రశాంత చిత్తంతో సాత్వికుడుగా మారిపోతాడు.

'పాండురంగ మహత్యం'లో నాగయ్య ఎన్టీఆర్‌కి తండ్రి, భోగలాలసుడైన కొడుకు వృద్ధులైన తలిదండ్రులపై దొంగతనం మోపి అర్ధరాత్రివేళ ఇంట్లోంచి వెళ్ళ గొడతాడు. అప్పుడు నాగయ్యని చూస్తే నాకు దుఃఖం ఆగలేదు. కొడుకు పట్ల ప్రేమ, అవమాన భారం, నిర్వేదం, నిర్లిప్తత.. ఇన్నిభావాల్ని అలవోకగా ప్రదర్శిస్తాడు.

ఈ పాత్రని పృధ్వీరాజ్ కపూర్ వంటి నటుడు ఇంకా బాగా నటించవచ్చునేమో కానీ, నాగయ్యంత కన్విన్సింగ్‌గా వుండదు. ఎందుకు? నాగయ్యది నిజజీవితంలో కూడా పుండరీకుని తండ్రివంటి మనస్తత్వం, అందుకని! మానవ జీవితంలో అత్యంత విలువైనది డబ్బు. ఎవరెన్ని కబుర్లు చెప్పినా డబ్బు విలువని గుర్తించకుండా జీవించగలగడం ఎంతో కష్టం. ఇది అతికొద్దిమందికి మాత్రమే సాధ్యమైంది. అర్ధరాత్రి ఇంటిని కొడుక్కి తృణప్రాయంగా వదిలేసి అడవి బాట పట్టిన పాండురంగని తండ్రి లాగే, నాగయ్య కూడా సిరిసంపదల్ని వదిలేశాడు.

కోపానికి నాగయ్య సినిమాలు యాంటిడోట్‌గా పనిచేస్తాయి, అందుకే నా కోపాన్ని జయించటానికి తెలివిగా నాగయ్యని వాడుకుంటున్నాను. సైకోథెరపీ ప్రిన్సిపుల్స్ ప్రకారం నాగయ్య నా థెరపిస్ట్. సైకియాట్రిస్టులకి సొమ్ము తగలేసే కన్నా ఇది సుఖమైన మార్గం అని నా అభిప్రాయం!

Wednesday, 18 April 2012

కోడి విలాపం

అయ్యలారా! అమ్మలారా! దయగల తల్లులారా! ఇది నా కథ, మనోవ్యధ, ఆత్మఘోష. నేనెవర్ని? తెలీదు! నేను కోడినా? కోడిలాంటిదాన్నే - కానీ కాదు. ప్రాణిలాంటిదాన్నే - కానీ కాదు. ఇదేదో పొడుపుకధలా ఉంది కదూ? కానీ కాదు! ఇదొక దిక్కులేని, దిక్కుమాలిన కోడికాని కోడికథ.
                              
అనగనగా ఒక కోడి. ఆ కోడికి ఎన్నోరంగులు. మగకోడిని 'పుంజు' అనీ, ఆడకోడిని 'పెట్ట' అనీ పిలిచేవారట. గ్రామాల్లో కోడి 'కొక్కొరొక్కో' అని కూస్తేగానీ తెల్లారేదికాదట! కోడిపెట్ట గుడ్లు పెడుతుందట, గుడ్లు పొదుగుతుందట! తన బుజ్జి పిల్లల్ని వెంటేసుకుని దర్జాగా తిరుగుతూ పురుగుల్నీ, గింజల్నీ ఏరుకుని తింటూ, తన పిల్లలికి తినిపిస్తూ ఊరంతా తిరుగాడుతుందట!

రోజురోజుకీ జనాభా పెరిగిపోతుంది, కోళ్ళూ అంతరించిపోతున్నారు. మానవుడు తెలివైనవాడు. ఎప్పటికప్పుడు తన అవసరాలకి తగినట్లు కొత్త వస్తువులు సృష్టించుకుంటాడు, కొత్త ఆహారాన్నీ తయారు చేస్తుంటాడు. మనుషుల తిండి కోసం (వ్యాపార కోసం) నేను కనిపెట్టపడ్డాను. నన్ను 'బ్రాయిలర్ చికెన్' అంటారు. మేం చూడ్డానికి దొరల్లా తెల్లగా, అందంగా ఉంటాం.
                     
పేరుకు కోడినే, కానీ నేనొక కృత్రిమ కోడిని. నన్ను నాతల్లి తన గుడ్డు పొదగి జన్మనివ్వ లేదు. తలిదండ్రులు లేకుండా పుట్టాను కాబట్టి నేను పుట్టుకతోనే అనాధను. పుట్టి బుద్ధెరిగి ఏనాడూ నాలుగడుగులు నడిచిన పాపాన పోలేదు. పుట్టంగాన్లే నన్ను ఇరుకైన గది(కేజ్)లో బంధిస్తారు, కాబట్టి నేను పుట్టుకతోనే బందీని కూడా!

నా జైలు జీవితం బహుదుర్భరం. నా గది అత్యంత చిన్నది. ఆ గదిలోనే ఇంకో నలుగురైదుగురితో సహజీవనం. వెలుతురుండదు, గాలి ఉండదు, దుర్గంధపూరితం. జీవితంలో కనీసం ఒక్కసారయినా మనసారా రెక్కలు విప్పి టపటపలాడించాలని నా కోరిక. కానీ నా గదిలో నాకు నించునే జాగా కూడా ఉండదు, ఇంక రెక్కలు ఎలా విప్పేది? ఎలా ఆడించేది?

నా కేజ్ నుండి మెడ మాత్రమే బయటకి పెట్టి నిర్ణీత ఆహారం తీసుకోవాలి. నాకు అత్యంత శ్రద్ధగా ఒక పద్ధతి ప్రకారం వేక్సిన్లు పొడుస్తారు, రోగాలు రాకుండా యాంటీ బయోటిక్స్ ఇస్తారు. నేను తినేతిండీ, మందులూ సమతూకంలో ఉండాల్ట. అప్పుడే నేను మంచి కండబట్టి, ఖర్చుకు తగ్గ బరువుతో నన్ను పెంచినవాడికి లాభాలు తెస్తాంట.

నా శరీరంలో ఏ భాగం ఎంత పెరగాలో కూడా మందులే నిర్ణయిస్తాయి. ఒక్కోసారి నా బ్రెస్ట్ కండ నా శరీరానికి మించి పెరుగుతుంది. అప్పుడు నేను సరీగ్గా నించోలేను, కాళ్ళు కూడా విరిగిపోతుంటాయి, గుండె ఆగిపోతుంటుంది. అయినా - మీక్కావలిసింది నా రెక్కల జాయింట్లు బలవడమే కానీ నా కష్టం కాదుగా?

మేం కేజిల్లో కోళ్ళం, మేం ఒకళ్ళనొకళ్ళు పొడుచుకుని గాయాల పాలవకుండా మా ముక్కులు కత్తిరించేస్తారు. కత్తిరించబడ్డ ముక్కునొప్పితో ఇవ్వాళ నా పక్కనున్న కోడిపిల్ల ఒకటి - 'మనదీ ఒక బ్రతుకేనా? కుక్కల వలె, నక్కల వలె! మనదీ ఒక బ్రతుకేనా? సందులలో పందుల వలె!' అంటూ ఒకటే ఏడుస్తుంది! ఓసి దీని అమాయకత్వం దొంగల్దోలా! ఆ జంతువులు మాకన్నా చాలా నయం!

నాకీ ప్రపంచమంతా కేవలం నాలుగు కోళ్ళ మయం! నా కేజ్‌లో ఉండే నాలుగు కోళ్ళే నా ప్రపంచం. హీనమైన జీవనాన్ని 'కుక్కబ్రతుకు' అని అంటారు కానీ - 'బ్రాయిలర్ కోడి బ్రతుకు' అని ఎవరూ అనరు. ఎందుకంటే - మాదసలు బ్రతుకే కాదు కాబట్టి!

నా ఆయుష్షు నలభై రోజులే. నలభై రోజల తర్వాత - నేను తినేతిండికి సరిపడేంత బరువు పెరగను, అందువల్ల నాకు తిండి దండగ. 'దిగుబడి' రాకపొతే పెంచేవాడికి నష్టం వస్తుంది కాబట్టి నాకు నలభై రోజులకే నూరేళ్ళు నిండుతాయి. ఆ రోజు నా పీక పరపరా కోసి చంపేస్తారు.

'నిప్పులు చిమ్ముకుంటూ.. నింగికి నే నెగిరిపోతే.. నిబిడాశ్చర్యంతో వీరు.. నెత్తురు క్రక్కుకుంటూ.. నేలకి నే రాలిపోతే.. నిర్ధాక్షిణ్యంగా వీరె' అని మహాకవి రాశాడు. ఆయన ఎవరి కోసం రాసాడో తెలీదు కానీ - నాకు మాత్రం నా గూర్చే రాసినట్లనిపిస్తుంది.

కనీసం చంపబోయే ముందు కూడా మేం ప్రాణులమని గుర్తించరు. డొక్కువేన్లలో, ఇరుకైన బోనుల్లో మమ్మల్ని గడ్డి కుక్కినట్లు కుక్కుతారు. అంచేత ఊపిరాడక కొందరం వేన్లోనే చస్తాం. అక్కణ్ణుండి మా కాళ్ళు కట్టేసి, గుట్టగా పడేసి ద్విచక్రవాహానాల్లో తీసికెళతారు. రోడ్డుకి తల గీసుకుని కొందరం, చక్రంలో పడి నలిగిపోయి ఇంకొందరం దార్లోనే చస్తాం.

చికెన్ సెంటర్లలో మా కళ్ళముందే మా స్నేహితుల పీకల్ని కత్తిరిస్తుంటారు. రక్తం కారుతూ గిలగిల కొట్టుకుంటుండగా, మమ్మల్ని మా సోదరుల విగత శరీరాలపై గుట్టగా పడేస్తారు. 'భగవంతుడా! తొందరగా చావు ప్రసాదించవయ్యా!' అని దుఃఖంతో, భయంతో వణుకుతూ కళ్ళు మూసుకోవడం తప్ప ఏం చెయ్యగలం?
             
జాషువా 'గబ్బిళం' రాసుకున్నాడు. తిలక్ 'గొంగళీ పురుగులు' రాశాడు. పువ్వు కష్టాలపై కరుణతో కరుణశ్రీ 'పుష్పవిలాపం' రాసుకున్నాడు. మామీద మాత్రం ఎవ్వరూ ఏమీ రాయలేదు, రాయరు కూడా. కేవలం 'దిగుబడి' కోసమే మా బ్రతుకు. మీ ఇళ్ళల్లో, హోటళ్ళల్లో - మా శరీర ఖండాలు భోజన పదార్ధాలవుతాయి, అదే మా జీవన పరమార్ధం.

------------------

అమ్మయ్య! ఇన్నాళ్ళకి మాకో తోడు దొరికింది. భూమండలంలో ఇండియా అనే దేశం ఒకటుందిట. ఆ దేశం ఈ మధ్య విపరీతంగా అభివృద్ధి సాధిస్తుందట. అక్కడ చదువులే పెట్టుబడిట, ఉద్యోగాలే దిగుబడిట. ఆ దేశంలో ఆడపిల్లల్ని తల్లి గర్భంలోనే చంపేస్తారట. ఆడపిల్లలకి దాణా దండగ. వాళ్ళు చదువుకుని ఉద్యోగం చేసినా దిగుబడి మొగుడికి వెళ్ళిపోతుందిట - అందుకని!

ఇండియాలో మగపిల్లల్ని ఈ లోకంలోకి ఎర్రతివాచీతో స్వాగతం పలుకుతార్ట. కొన్నాళ్ళకి ఆ పిల్లల కాళ్ళ క్రింద నుండి ఆ ఎర్రతివాచీ లాగేసి మడత పెట్టేస్తార్ట. వారు బుడిబుడి నడకలతో 'అమ్మా, అత్తా' అంటూ ముద్దుపలుకులు మొదలెట్టంగాన్లే ఎల్కేజీ (ఇదో రకమైన కేజ్)లో పడేస్తార్ట. ఆ బుజ్జిగాళ్ళకి చదువు (ఆరోగ్యకరమైన దాణా) కుక్కుతార్ట (వేస్తారు). వాళ్ళకి పద్ధతిగా పరీక్షలు (వేక్సీన్లు) పెడతార్ట (వేస్తారు). పాపం! ఈ పిల్లలు కూడా మాలాగే బందీలు, వీళ్ళకి బాల్యం ఉండదు.

వీరికి ఆటపాటలంటే యేంటో తెలీదుట. చదువుడే చదువుడు, రుద్దుడే రుద్దుడు, గుద్దుడే గుద్దుడు. పుస్తకాల బ్యాగులు మోసీమోసీ వెన్నుపూస ఒంగిపోతుందిట. పిల్లలకి జ్ఞాపకశక్తిని పెంచడానికి 'పర్సనాలిటీ డెవలప్‌మెంట్' అనే దుకాణదారులు ఉంటార్ట. వీళ్ళు విజయానికి వెయ్యిమెట్లు ఎక్కిస్తార్ట. ఈ మెట్లెక్కలేని దురదృష్టవంతుల్ని మధ్యలో అర్ధంతరంగా తోసేస్తార్ట. మేం రోగాలోచ్చి చచ్చినట్లే - పరీక్షలు తప్పిన విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకుని చస్తుంటార్ట!

నా జీవచ్ఛవ బ్రతుకు కేవలం నలభై రోజులే, ఈ పిల్లగాళ్ళ బ్రతుకులు అంతకన్నా ఎక్కువ. ఇప్పుడు నాకనిపిస్తుంది - నేను చాలా అద్రుష్టవంతుణ్నని!

Wednesday, 11 April 2012

నాన్న పొదుపు - నా చిన్నికష్టాలు


"ఈణ్నాకొడుకయ్యా! అన్నం సరీంగా తిండు, తిన్నదొంటబట్టట్లేదు. ఒక బలంసీసా రాయి సార్!" అడిగాడు కోటయ్య. 

కోటయ్యది దుర్గి మండలలో ఓ గ్రామం. పొడుగ్గా, బక్కగా, కాయబారిన దేహం. చింపిరి జుట్టు, మాసిన గడ్డం, చిరుగు చొక్కాతో పేదరికానికి బట్టలు తోడిగినట్లుంటాడు. కొన్నాళ్ళుగా నా పేషంట్. ఎప్పుడూ భార్యని తోడుగా తెచ్చుకునేవాడు, ఈసారి తన పదేళ్ళ కొడుకుతో వచ్చాడు.

ఆ 'సరీంగా అన్నం తినని' కోటయ్య కొడుకు వైపు దృష్టి సారించాను. బక్కగా, పొట్టిగా అడుగుబద్దలా ఉన్నాడు. డిప్పకటింగ్, చీమిడిముక్కు, మిడిగుడ్లు. తన లూజు నిక్కర్ జారిపోకుండా ఎడంచేత్తో పట్టుకుని, కుడిచేత్తో తండ్రి చెయ్యిని గట్టిగా పట్టుకుని, ఇంజక్షన్ ఎక్కడ పొడిచేస్తానో అన్నట్లు నావైపు బిక్కుబిక్కుమంటూ చూస్తున్నాడు. మాసిన తెల్లచొక్కా మోకాళ్ళ దాకా లూజుగా వేళ్ళాడుతుంది. చొక్కా గుండీలకి బదులు రెండు పిన్నీసులు. ఈ ఆకారాన్ని ఎక్కడో చూశాను, ఎక్కడ చూశాను? ఎక్కడ? ఎక్కడబ్బా? ఎక్కడో ఏంటీ! అది నేనే!!
                                                    
గుంటూరు శారదా నికేతనంలో నేను ఒకటి నుండి ఐదోక్లాసు దాకా చదువుకున్నాను. ఎడ్మిషన్ ఫీజు అక్షరాల ఒక రూపాయి, అటుతరవాత ఒక్కపైసా కట్టే పన్లేదు. విశాలమైన ఆవరణలో చుట్టూతా క్లాసురూములు, మధ్యలో ఆటస్థలం. వాతావరణం సరదా సరదాగా వుండేది. బడికి ఒక మూలగా రేకుల షెడ్డు, అందులో ఒక పిండిమర. బడి ప్రాంగణంలో ఈ పిండిమర ఎందుకుందో నాకు తెలీదు, కానీ నాకా పిండిమర ఓ ఇంజినీరింగ్ మార్వల్‌లా అనిపించేది.

సర్రుమంటూ శబ్దం చేస్తూ తిరిగే పెద్ద నవ్వారు బెల్టుల్ని ఆశ్చర్యంతో నోరు తెరుచుకుని చూస్తుండిపొయ్యేవాణ్ణి. రకరకాల ధాన్యాల్ని గిన్నెలు, డబ్బాల్లో వరస క్రమంలో పెడతారు. 'పిండిమరబ్బాయి' వాటిని అదే వరస క్రమంలో, చిన్న స్టూలు మీద నిలబడి, పిండిమర మిషన్‌పైన కప్పలా నోరు తెరుచుకునున్న వెడల్పాటి రేకు డబ్బాలోకి పోసేవాడు. వెంటనే గింజలు 'పటపట'మంటూ శబ్దం చేస్తూ పిండిగా మారి కిందనున్న రేకుడబ్బాలోకి పడేవి. ఆ 'పిండిమరబ్బాయి' నా హీరో. నా హీరో శరీరమంతా పిండి దుమ్ముతో తెల్లగా మారిపోయి గ్రహాంతరవాసిగా అగుపించేవాడు.

శారదా నికేతనం హెడ్మాస్టారుగారు గాంధేయవాది. ఆయన బాగా పొడుగ్గా, బాగా బక్కగా, బాగా బట్టతలతో, ఖద్దరు బట్టల్తో, మందపాటి గుండ్రటి కళ్ళజోడుతో అచ్చు గాంధీగారి తమ్ముళ్ళా ఉండేవారు. ఆయన గదిలో గోడపైన గాంధి, నెహ్రు, బోస్, పటేల్ మొదలైన దేశనాయకుల చిత్రపటాలు ఉండేవి. ఆ రూంలో ఓ మూలగా మంచినీళ్ళ కుండ ఉంటుంది. క్లాసు మధ్యలో దాహం వేస్తే ఆ కుండలోని చల్లని నీళ్ళు తాగేవాళ్ళం. హెడ్మాస్టరుగారి టేబుల్ మీద పెన్సిల్ ముక్కు చెక్కుకునే మిషన్ (షార్పెనెర్) ఉంటుంది. ఆయన గదికి వెళ్ళినప్పుడల్లా ఆయన 'మనది పవిత్ర భారత దేశం, చదువుకుని దేశానికి సేవ చెయ్యటం మన కర్తవ్యం. చక్కగా చదువుకోండి. మిమ్మల్ని చూసి తలిదండ్రులు గర్వించాలి' అంటూ చాలా చెప్పేవాళ్ళు.

బడి గోడల్నిండా 'సత్యము పలుకుము, పెద్దలని గౌరవించవలెను.' లాంటి సూక్తులు రాసుండేవి. అబద్దం చెబితే సరస్వతి దేవికి కోపమొచ్చి చదువు రాకుండా చేస్తుందని గట్టిగా నమ్మేవాణ్ని, భయపడేవాణ్ణి. ఓంకార క్షేత్రంలో ప్రసాదం సమయానికి ఠంచనుగా  హజరయ్యేవాణ్ని. ఒక్క ఎగురు ఎగిరి గంటకొట్టి, రెండు చేతులూ జోడించి, కళ్ళు గట్టిగా మూసుకుని బాగా చదువొచ్చేట్లు చెయ్యమని దేవుణ్ణి తీవ్రంగా వేడుకునేవాణ్ణి. పుణ్యానికి పుణ్యం, చేతినిండా ప్రసాదం!

మా స్కూలుకి యూనిఫాం లేదు. నాకు రోజువారీ తోడుక్కోడానికి శుభ్రమైన బట్టలు రెండుజతలు ఉండేవి. సాయంత్రం స్నానం తరవాత  పోట్టైపోయి పోయినేడాది బట్టలే గతి. అవి - బిగుతుగా, (ఇప్పటి మన సినిమా హీరోయిన్ల బట్టల్లా) ఇబ్బందిగా  ఉండేవి. అమ్మకి చెబితే - 'మగాడివి, నీకు సిగ్గేంట్రా!' అనేది. ఆ విధంగా మగాళ్ళకి  సిగ్గుండక్కర్లేదని చాలా చిన్నతనంలోనే గ్రహించాను! బట్టలు సరిపోటల్లేదని ఎంత మొర పెట్టుకున్నా అందరిదీ ఒకటే సమాధానం - ' అసలీ వయసులో నీకెందుకన్ని బట్టలు? ఎట్లాగూ  పోట్టైపోతాయ్ గదా!'

నాకు దెబ్బలు తగిలించుకోటంలో గిన్నిస్ రికార్డుంది. కోతికొమ్మచ్చి ఆడుతూనో, గోడ దూకుతూనో.. ఏదో రకంగా శరీరంలోని అనేక భాగాల్లో అనేక దెబ్బలు తగుల్తుండేవి. వాటిల్లో కొన్ని మానుతున్న గాయాలైతే, మరికొన్ని ఫ్రెష్ గాయాలు. ఒక రోజు సైకిల్  నేర్చుకుంటూ  కింద  పడ్డాను. మోకాలు భయంకరంగా దోక్కుపోయింది, బాగా రక్తం కారుతుంది. వీధి చివర మునిసిపాలిటీ పంపు నీళ్ళధార కింద దెబ్బని కడుక్కున్నాను. రక్తంతో కలిసిన నీళ్ళు ఎర్రగా కిందకి జారిపొయ్యాయి. అబ్బ! భరించలేని మంట. కుంటుకుంటూ, ఏడ్చుకుంటూ ఇంటికి  చేరాను.

నాన్న ఇంట్లోనే ఉన్నాడు. అప్పుడే అన్నం తిని, మంచం మీద పడుకుని ఆంధ్రప్రభ చదువుకుంటున్నాడు. నా అవతారం చూడంగాన్లే వీరావేశంతో నన్ను ఉతికి ఆరేశాడు. ఆయనకంత కోపం రావడానికి కారణం నాకు దెబ్బ తగలడం కాదు, అసలాయన నా దెబ్బనే పట్టించుకోలేదు - దెబ్బవల్ల నిక్కర్ అంచు కొంచెం చిరిగింది, అదీ సంగతి!

ఈవిధంగా శరీరంతో పాటు బట్టలకి కూడా అవుతున్న రకరకాల గాయాలకి కట్లు కట్టించుకుంటూ (దీన్నే టైలర్ల భాషలో 'రఫ్' తియ్యడం అంటారు), బొత్తాలు ఊడిపోయిన చొక్కాకి పిన్నీసులు పెట్టుకుంటూ, నిక్కర్ (మేం 'లాగు' అనేవాళ్ళం) జారిపోకుండా మొలతాడుని నడుం చుట్టూ బిగిస్తూ కొత్తబట్టల కోసం భారంగా ఎదురు చూపులు చూస్తుండేవాణ్ణి.   

ఈ కొత్తబట్టలకి ఒక లెక్కుంది. ఎండాకాలం సెలవల తరవాత స్కూళ్ళు తెరిచేప్పుడు రెండుజతల బట్టలు, అటుతరవాత ముఖ్యమైన పండగలకి ఒకజత. ఓవర్ బ్రిడ్జ్ పక్కన మూడోలైన్లో కొత్తమాసువారి బట్టల దుకాణం ఉంది. ఆ దుకాణదారుడు నాన్నకి స్నేహితుడు. అంచేత  ఎప్పుడైనా కొత్తమాసువారి  కొట్లో మాత్రమే గుడ్డ కొనాలి. కొద్దిగా బాగున్న గుడ్డ కొందామనుకుంటే ఆ షాప్ ఓనరుదీ ఇంట్లోవాళ్ళ పాటే! 'అంత ఖరీదైన గుడ్డెందుకు బాబు? ఎదిగే వయసు, ఊరికే పొట్టైపోతాయి. ఈ పన్నా చించుతున్నా, రేటు తక్కువ, గట్టిదనం ఎక్కువ.' అంటూ చేతికందిన గుడ్డని కత్తెరతో పరపర కత్తిరించేసేవాడు. ఆయన నాన్నకి స్నేహితుడవడం చేత నన్ను డామినేట్ చేసేవాడు, ఎంతన్యాయం!

నాకా కొత్తబట్టల ప్యాకెట్ ఎంతో అపురూపంగా అనిపించేది. దాన్ని రెండు చేతుల్త్లో ఆప్యాయంగా దగ్గరకి  తీసుకుని, కొత్తబట్టల సువాసనని ముక్కారా ('మనసారా'కి అనుకరణ) ఎంజాయ్ చేస్తూ, నాన్నతోపాటు టైలర్ దగ్గరికి వెళ్ళేవాణ్ణి.

ఓవర్ బ్రిడ్జ్ పక్కన రెండో లైన్ మొదట్లో బాజీ అని మా ఆస్థాన టైలర్ ఉండేవాడు. తెల్లజుట్టు, మాసిన గడ్డం, శూన్యదృక్కులు. అతని మొహం నిర్లిప్తత, నిరాశలకి శాశ్విత చిరునామాలా ఉంటుంది. అతనికీ ప్రపంచంతో, ప్రాపంచిక విషయాల్తో ఆట్టే సంబంధం ఉన్నట్లుగా తోచదు. అతను చిన్నగా, తక్కువగా మాట్లాడతాడు. అతనికి పదిమంది పిల్లల్ట, చాలా కష్టాల్లో కూడా ఉన్నాట్ట. అతని బావ హైదరాబాదులో టైలరుగా బాగా సంపాదిస్తున్నాట్ట, కానీ తన కుటుంబాన్ని అసలు పట్టించుకోట్ట. ఈ విషయాలన్నీ నాన్న అమ్మకి చెబుతుండగా విన్నాను. 

బాజీలాగే బాజీ కుట్టు మిషన్ అత్యంత పురాతనమైనది, ఇంకా చెప్పాలంటే శిధిలమైనది. బ్రిటీషు వాడు దేశానికి స్వతంత్రం ఇచ్చేసి, ఈ కుట్టు మిషన్ కూడా వదిలేసి వెళ్లిపొయ్యాడని నా అనుమానం. బాజీ దించిన తల ఎత్తకుండా పొద్దస్తమానం బట్టలు కుడుతూనే ఉండేవాడు. నాకతను కుట్టు మిషన్తో పోటీ పడుతున్న మనిషి మిషన్లా కనపడేవాడు.. యాంత్రికతలో అతను యంత్రాన్ని జయించినవాడు.

మనుషుల్లో రెండురకాలు - ధనవంతులు, పేదవారు. వస్తువులు కూడా రెండురకాలు కొత్తవి, పాతవి. బాజీ కొలతలు తీసుకునే టేపు పాతది మాత్రమే కాదు, అంటువ్యాధిలా దానికి బాజీ పేదరికం కూడా పట్టుకుంది. అందువల్లా అది చీకిపోయి, పెట్లిపోయి ఉంటుంది. దానిపై అంకెలు అరిగిపోయి కనబట్టం మానేసి చాల్రోజులైంది. కనబడని ఆ టేపుతో కొలతలు తీసుకుంటూ, సరీగ్గా అంగుళం మాత్రమే ఉండే పెన్సిల్‌తో బట్టలు కొన్న బిల్లువెనక ఏవో అంకెలు కెలికేవాడు. 

బాజీ మెజర్‌మెంట్స్ లూజుగా తీసుకునేవాడు. అంచేత లూజు కొంచెం తాగించి ఆదులు తీసుకొమ్మని బాజీకి చెప్పమని నాన్నని బ్రతిమాలేవాడిని. నాన్న పట్టించుకునేవాడు కాదు. బాజీ గూర్చి రాయడం దండగ. అతను వినడు, మాట్లాడడు, రోబోలాగా నిర్వికారంగా కొలతలు తీసుకునేవాడు. ఆవిధంగా నాన్న నాకు అరణ్యరోదన అంటే ఏంటో చిన్నప్పుడే తెలియజెప్పాడు. గుడ్డ అంగుళం కూడా వేస్ట్ కాకూడదు, అదే అక్కడ క్రైటీరియా! ఈ మాత్రం దానికి కొలతలు ఎందుకో అర్ధం కాదు!
                     
నిక్కర్ భయంకరమైన లూజ్ - పొలీసోళ్ళ నిక్కర్లకి మల్లే (ఆరోజుల్లో పోలీసులు నిక్కర్లు వేసుకునేవాళ్ళు) మోకాళ్ళని కవర్ చేస్తుంది. నిక్కర్ కింద అంచు లోపలకి రెండుమూడు మడతలు మడిచి కుట్టబడేది (పొరబాటున ఆ సంవత్సరం నేను హఠాత్తుగా పదడుగులు పొడవు పెరిగినా ఆ మడతలు ఊడదీస్తే సరిపోతుందని నాన్న దూరాలోచన). చొక్కా వదులుగా, అందులో ఇంకా ఇంకోనలుగురు దూరగలిగేంత విశాలంగా ఉండేది. 

చొక్కా ఎంత పొడవున్నా, నిక్కర్ దానికన్నా పొడవుండడం వల్ల పరువు దక్కేది. లేకపోతే చొక్కాకింద ఏమీ వేసుకోలేదనుకునే ప్రమాదం ఉంది! ఇన్నిమాటలేల? నా బట్టలు నాన్నక్కూడా సరిపోతాయి! ఆ బట్టలు నా శరీరాన్ని ఎంత దాచేవో తెలీదు కానీ, వాటిని మొయ్యలేక దుంప తెగేది. ఏ మాటకామాటే - కొంత సుఖం కూడా దక్కేది, గాలి ధారాళంగా ఆడేది. ఆ పెద్దజేబుల్లో బోల్డన్ని మరమరాలు కుక్కొచ్చు, పెన్సిల్ ముక్కలు దాచుకోవచ్చు.
                                 
కొత్తబట్టలేసుకున్నానన్న ఆనందం ఒకపక్కా, అవి మరీ లూజుగా ఉన్నాయన్న దిగులు మరోపక్కా సమానంగా ఉండేవి. మరీ ఇంత వదులైతే ఎలా? పక్కింటివాళ్ళు ఆరేసుకున్న బట్టల్ని కాజేసి వాడుకుంటున్నాననుకోరూ! ఈ అవతారంతో బడికెళ్తే నా పరువేం కావాలి?  పైగా అక్కడ అమ్మాయిలు కూడా ఉంటారాయె. అందులోనూ మొన్న సుమతీ శతకం పద్యాలు గుక్కతిప్పుకోకుండా అప్పజెప్పినప్పుడు పక్కబెంచిలోంచి కె.లలిత నన్ను ఎంత ఎడ్మైరింగ్‌గా చూసింది!

బెరుకుగా బడికెళ్లాను, బిడియంగా నా 'బి' సెక్షన్లోకి అడుగెట్టాను. అక్కడ క్లాసులో ముప్పాతికమంది కొత్తబట్టలతో దర్శనం. ఆశ్చర్యం! వాళ్ళవి నాకన్నా వదులు దుస్తులు. వాళ్ళతో పోలిస్తే నా బట్టలు చాలా నయం. ఆలోచించగా - తండ్రులందరిదీ ఒకే జాతిలాగా తోస్తుంది. ఈ తండ్రుల పొదుపు వల్ల పిల్లల బట్టలకి రక్షణ లేకుండా పోయింది. పిల్లలు అమాయకులనీ, వారి హృదయాల్లో దేవుడుంటాడనీ.. కబుర్లు మాత్రం చెబుతారు, ఆచరణలో మాత్రం అందుకు వ్యతిరేకం, ఏమిటో ఈ మాయదారి ప్రపంచం!

వేసవి సెలవల తరవాత ఆ రోజే క్లాసులు మొదలు, అంచేత - క్లాసంతా గోలగోలగా ఉంది. సూరిని చూస్తే నవ్వొస్తుంది, తిరపతి పోయ్యాట్ట, వాడి బోడిగుండు నున్నగా ఇత్తడి చెంబులా మెరిసిపోతుంది. సీతారావుడు సూరి గుండుని రుద్దుతూ ఏడిపిస్తున్నాడు. శీనుగాడి కుడిచేతికి పిండికట్టు, పక్కింట్లో దొంగతనంగా మామిడి కాయలు కోస్తూ చెట్టుమీంచి పడ్డాట్ట. ఆ మూల వీరయ్య, సుబ్బిగాళ్ళ మధ్యన కూర్చునే ప్లేసుల దగ్గర తగాదా. అరె! నా ప్లేసులో వాడెవడో కొత్తోడు కూర్చున్నాడే! 'వురేయ్ ఎవడ్రా అది? ఆ ప్లేసు నాది, మర్యాదగా లేస్తావా లేదా?' ఆ క్షణంలోనే నా లూజు బట్టల వేదాంతం, సిద్ధాంతం, రాద్ధాంతం.. అన్నీ మర్చిపోయి నా హక్కుల సాధనలో మునిగిపొయ్యాను!
                              
అంకితం -

నా చిన్ననాటి జ్ఞాపకాలు, ముచ్చట్లు నెమరు వేయించిన వదులు దుస్తుల వీరుడు కోటయ్య కుమారుడికి.

కృతజ్ఞతలు -

కోటయ్య కొడుకు బొమ్మని అందంగా గీసిన అన్వర్ గారికి, అందుకు కారకులైన భాస్కర్ రామరాజు గారికి.        

Wednesday, 4 April 2012

నా పులి సవారి

ఇవ్వాళ  సోమవారం, హాస్పిటల్ వాతావరణం పేషంట్లతో హడావుడిగా ఉంది. తప్పనిసరిగా ఓ ముఖ్యమైన పెళ్ళికెళ్ళి హాజరుపట్టీలో సంతకం చెయ్యాలి, అదే - అక్షింతలు వెయ్యాలి. మధ్యాహ్నం రెండైంది, అయినా పెళ్ళికి వెళ్ళే వ్యవధి దొరకడం లేదు. వెళ్ళాలి, వెళ్ళక తప్పదు, వెళ్ళి తీరాల్సిందే. కానీ - ఎలా? ఎలా? ఎలా?

నాకీ పెళ్లిళ్ళు, అక్షింతల, భోజనాలు అంటే చిరాగ్గా, విసుగ్గా వుంటుంది.ఈ కార్యక్రమాలకి వెళ్ళడం దాదాపుగా మానేశాను. వాళ్ళు పిల్చిన పెళ్ళి ఎటెండ్ అవ్వకపోతే, కొందరు నన్ను దుష్టుల కేటగిరీలోకి నెట్టడం ఆశ్చర్యపరిచింది. పెళ్ళికి వెళ్ళాలా లేదా అనేది పూర్తిగా మన హక్కు. అయితే పెళ్ళివిషయాల్లో హక్కుల ప్రస్తావన పనికిరాదని ఆలస్యంగా గ్రహించిన కారణాన - కొన్ని ముఖ్యమైన పెళ్ళిళ్ళకి హాజరవడం అలవాటు చేసుకున్నాను. 

ఆ తరవాత ఒకట్రెండు పెళ్ళిళ్ళకి వెళ్ళిన తరవాత విషయం అర్ధమైంది. వెనుకటి రోజుల్లోలా భోజనం చెయ్యమని మనకి ఎవరూ మర్యాదలు చెయ్యరు. అసలక్కడ మన్నెవరూ పట్టించుకోరు. కానీ వెళ్ళకపోతే మాత్రం బాగా పట్టించుకుంటారు! ఎందుకంటే - ఆ పెళ్ళి చాలా ఖర్చుతో అట్టహాసంగా చేస్తారు. అది మనం మెచ్చుకోవాలి, అందుకని! అంచేత - వరద బాధితుల్ని మంత్రిగారు పలకరించినట్లు, ఈ పెళ్ళిళ్ళకి ఫ్లాష్ విజిట్స్ వేస్తే చాలు, సరిపోతుంది. పిల్చినవాడు కొడా ఖుషీ అయిపోతాడు.  

మా ఊళ్ళోఎ వుంటానికి రోడ్లున్నయ్. కానీ ఆ రోడ్డు కార్లు, ఆటోలు, మోటార్ సైకిళ్ళూ, రిక్షాల్తో భారంగా వుంటుంది. వీటికితోడుగా రోడ్డు మాధ్యలో ఆవులు, వాకర్లు, టాకర్లు వుండనే వున్నారు. పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఊరేగింపులూ వుండొచ్చు. కాబట్టి అంత ట్రాఫిక్‌ని తట్టుకుని పెళ్ళీ అటెండ్ అవడం ఎలా అని కొద్దిసేపు ఆలోచించాను. 

ఐడియా! యే ఊళ్ళోనైనా ట్రాఫిక్‌ని ఛేధించగల సత్తా ఎవరికుంది? ద ఆన్సర్ ఈజ్ సింపుల్ - ఆటోకి! ఆటోని పిలిపించి ఆస్పత్రి బయట వెయిటింగులో వుంచాను. 'సమయం గూర్చి ఎందుకు చింత? ఆటో ఉండగా నీ చెంత!' అనుకుంటూ వడివడిగా బయటకి నడచి ఆటోలో కూలబడ్డాను.  
                  
నేనింకా పూర్తిగా కూర్చోలేదు, ఆటో ముందుకి దూకింది. ఆ ఊపుకి సీటు వెనకనున్న కుషంకి గుద్దుకున్నాను. వెన్నులో ఎక్కడో కలుక్కుమంది. వెనక్కి తిరిగి చూస్తే అక్కడ కుషన్‌కి బదులుగా ఓ చెక్కుంది! నడుం సవరించుకుంటూ సీటులో సర్దుక్కూర్చునే లోపునే ఒక బడ్డీ కొట్టు ముందు సడన్ బ్రేక్ వేసి ఆపాడు, ఒక్కసారికి ముందుకొచ్చి పడ్డాను, ఇప్పుడు డ్రైవర్ వెనకుండే కడ్డీ మోకాళ్ళకి పొడుచుకుంది. 

బాధతో మోకాలు రుద్దుకుంటూ - 'ఎదురుగా వాహనాలేం లేవుగా? మరి ఇంత భీభత్స బ్రేకెందుకబ్బా!' అని ఆశ్చర్యపోతుండగా -

ఆటోవాలా బడ్డేకొట్టు ముందువెళ్ళాడుతున్న దండల్లోంచి ఒక కైనీ పాకెట్ తుంచుకుని, దాన్ని వొడుపుగా అడ్డంగా చించి తలెత్తి మొత్తంగా నోట్లో ఒంపేసుకున్నాడు. 'పావుగంటలో వచ్చేస్తా, జిలానీ వస్తే వుండమని చెప్పు.' అంటూనే ఒక్క ఉదుటున ఆటోని ముందుకు దూకించాడు. 

నాకున్న చిన్నిఆనందాల్లో ఆటో ప్రయాణం ఒకటి. అడవిలో దర్జాగా, పులిమీద సవారి ఎవరికి మాత్రం సంతోషంగా ఉండదు? అర్ధం కాలేదా! ఏమాత్రం ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఇష్టమొచ్చినట్లుగా, అడ్డదిడ్డంగా స్వైరవిహారం చేసే ఆటోలంటే నాకు సంభ్రమం. అందుకే ఆటోలు పులుల్తో సమానం అని నా అభిప్రాయం.

లక్షల ఖరీదు చేసే కార్లు ఆటోలకి గజగజ వణుకుతూ దారినిస్తాయి. ద్విచక్రీయులు కూడా ఆటోలకి దూరంగా బిక్కుబిక్కుమంటూ డ్రైవ్ చేసుకుంటుంటారు. కాళ్ళూచేతులు విరగ్గొట్టుకునే ధైర్యం ఎవరికుంటుంది చెప్పండి? రోడ్డు మొత్తం ఆటోలకి అణుగుణంగా, వినయంగా, క్రమశిక్షణగా ఎడ్జెస్ట్ అయిపోతుంది. రోడ్డే అడవి అనుకుంటే పులి మన ఆటో, భయపడి ఒదిగిపోయే అర్భకప్రాణులు మిగతా వాహనదారులు. 
                
ఆటో ప్రయాణం భలే థ్రిల్లుగా ఉంటుంది. ఎదురుగా వస్తున్న వాహనం వందడుగుల దూరంలో కనబడుతున్నా, సరీగ్గా 99.9 అడుగుల దాకా స్పీడుగా వెళ్లి - 'గుద్దేశాడ్రా బాబోయ్!' అని కళ్ళు మూసుకుని 'కెవ్వు' మనేలోపు, కీచుమంటూ భయంకరమైన బ్రేకేసి, మన్ని ఎగ్గిరి పడేసి లాఘవంగా వాహనాన్ని తప్పించుకుని, శరవేగంగా పరుగులు తీస్తుంటుంది. ఈ సీక్వెన్స్ బంగీ జంపంత థ్రిల్లుగా ఉంటుంది. మీది వీక హార్టా? బి కేర్ఫుల్! ఇది చాలా డేంజర్ గురూ!

ఆటోవాలాతో పాటుగా మనం కూడా ట్రాఫిక్‌ని జాగ్రత్తగా గమనిస్తుంటేనే మన ఆరోగ్యానికి భద్రత!

'ట్రాఫిక్‌ని ఫాలో అవ్వాల్సింది డ్రైవర్ కదా! మనం దేనికి?' అనుకుంటున్నారా?

'ఏంటి మాస్టారు! ప్రతొక్కటి ఎక్కడ విడమర్చి చెబుతాం? దేనికంటే - ఆ మెలికల డ్రైవింగ్‌కీ, సడన్ బ్రేకులకీ సీట్లోంచి క్రిందకి పడిపోవడమో.. నిన్న తాగిన కాఫీ వాంతి చేసుకోవడమో జరగొచ్చు. పులి మీద సవారీనా మజాకా!'
               
ఈ క్షణంలో వందోవంతు బ్రేక్ కొట్టే కళ యొక్క గుట్టు ఆటో డ్రైవరైన నా పేషంట్ వెంకట్రావు విప్పాడు. 

"ఓనర్లు నడిపే కార్లు మేవఁసలు లెక్కచెయ్యం. బోల్డు డబ్బు పోసి కొనుక్కుని బిక్కుబిక్కుమంటూ నెమ్మదిగా నడుపుతుంటారు. అందుకే మాకందరూ సైడిస్తారు." అన్నాడు వెంకట్రావు.అంటే- ఇక్కడ సైకాలజీ గుద్దడానికైనా సరే ఎవడు తెగిస్తాడో వాడిదే అంతిమ విజయం. 

"నిజమేననుకో! ఒకవేళ పొరబాటున బ్రేక్ పడకపోతే గుద్దేస్తారు గదా!" ఆసక్తిగా అడిగాను.

"ఆఁ! గుద్దితే ఏవఁవుద్ది? ఆ కారు షెడ్డుకి పోద్ది, పదేలు బొక్క, మన ఆటోకి రెండు సుత్తి దెబ్బలు.. కొంచెం పసుపు రంగు, యాభయ్యో వందో ఖర్చు." తాపీగా అన్నాడు వెంకట్రావు, ఆరి దుర్మార్గుడా!
               
రహస్యం బోధపడింది, సింపుల్ మ్యాథమెటిక్స్! వందకన్నా పదివేలు ఎన్నోరెట్లు ఎక్కువ. ముల్లు, అరిటాకు సామెత! ప్రపంచమంతా డబ్బున్నోడిదే ఇష్టారాజ్యం. అయితే - ఇక్కడ డబ్బున్నోడి మీద పేదవాడిదే విజయం. మార్క్స్ ఆర్ధికశాస్త్రం తిరగబడింది! ఆరోజు నుండీ నాకు మాఊళ్ళో ఆటోవాలాలో చె గువేరా కనబడసాగాడు.
               
ప్రస్తుతం నా ఆటో ప్రయాణానికొస్తే - ఎసీ కాలేజ్ రోడ్డులో ట్రాఫిక్ కొంచెం తక్కువగా వుంది. నా ఆటోవాలా హ్యాండిల్ వదిలేసి, చేతులు పైకెత్తి బద్దకంగా ఒళ్ళు విరుచుకున్నాడు. భయంతో నా గుండె ఒక బీట్ మిస్సయింది. ఐనా ఆటో స్టడీగానే పోతుంది? ఈ ఆటోకి 'ఆటో పైలట్' మోడ్ ఉందా! 

ఓవర్ బ్రిడ్జి (ఈమధ్య కొందరు దీన్నే 'ఫ్లై ఓవర్' అంటున్నారు, మాకైతే బ్రిడ్జి అని పిల్చుకోడమే ఇష్టం) మీద ట్రాఫిక్ జామ్. మాములే! మన పులి వంకరటింకర్లు తిరుగుతూ ట్రాఫిక్ లోంచి బయటపడింది.

శంకరవిలాస్ సెంటర్లో ట్రాఫిక్ పోలీసులు. మళ్ళీ మన ఆటో 'ఆటో పైలట్' మోడ్‌లోకి వెళ్ళింది. మళ్ళీ నా గుండె బీట్‌లో తేడా! పిసిసర్కార్ మేజిక్ లాగా ఆటోవాలా చేతిలో ఒక మాసిన ఖాకీ చొక్కా ప్రత్యక్షం, క్షణంలో తొడిగేసుకున్నాడు. 

ఇదేంటి నా కుడికాలు నొప్పిగా ఉంది! ఎందుకబ్బా? అర్ధమైంది. టెన్షన్లో ఎక్కిందగ్గర్నుండీ కుడికాలుతో బ్రేకులేస్తున్నాను. అదీ సంగతి! అందుకే సుబ్బు ఆటోలని 'టార్చర్ చాంబర్లు' అంటాడు. ఆటో నడిపే వ్యక్తికి 'ఆటోక్రాట్' అని ముద్దుపేరు కూడా పెట్టాడు. 

సరీగ్గా పదినిమిషాల్లో ఆటో కళ్యాణ మండపం చేరుకుంది. మంటపం బయట రోడ్డు పక్కన కార్ పార్కింగ్ చేసుకోడానికి సరైన స్థలం కోసం వెతుక్కుంటున్నారు.. పాపం! ఖరీదైన కార్ల బాబులు (మా ఊళ్ళో ఫంక్షను హాళ్ళకి ప్రత్యేకంగా పార్కింగ్ ప్లేసులుండవు, రోడ్డు మార్జిన్లే పార్కింగ్ ప్లేసులు)! ఆ అమాయక అజ్ఞానులని జాలిగా చూస్తూ - "ఐదే ఐదు నిముషాల్లో వచ్చేస్తా, ఆ పక్కన వెయిట్ చెయ్యి." అని ఆటోవాలాకి చెప్పి వడవడిగా లోపలకెళ్ళాను. 

కళ్యాణ మంటపం బాగా పెద్దది. పెళ్ళికొడుకు అమెరికా సాఫ్ట్‌వేర్ కుర్రాట్ట. బాగా హార్డ్ వర్క్ చేస్తున్నట్లున్నాడు, సగం బుర్ర బట్టతల. ఆడవాళ్ళు కష్టపడి ఖరీదయిన చీరలు, నగల్ని మోస్తున్నారు. మగవాళ్ళు పట్టు పంచెలు, షేర్వాణీలలో ఆడవాళ్ళతో పోటీ పడుతున్నారు. అంతా డబ్బు కళ! (విచిత్రం - పేదరికాన్ని గ్లోరిఫై చేస్తూ రాసే కవితలు బాగుంటాయి, డబ్బిచ్చే సుఖమూ బాగుంటుంది.)

అప్పటిదాకా ఏదో సినిమా పాటని ఖూనీ చేస్తున్న బ్యాండ్ మేళం వాళ్ళు, హఠాత్తుగా గుండెలు పగిలే ప్రళయ గర్జన చెయ్యడం మొదలెట్టారు. పెళ్లికొడుకు ముసిముసిగా నవ్వుకుంటూ మంగళ సూత్రం కట్టాడు. రాబోయే ప్రళయానికి సూచనగా, హెచ్చరికగా బ్యాండ్ మేళం వాళ్ళు భీకర పిశాచాల మ్యూజిక్ వాయించినా, తనెంత డేంజరపాయంలో ఇరుక్కుంటున్నాడో ఈ పెళ్లికొడుకు వెధవకి అర్ధమైనట్లు లేదు - మరీ అమాయకుళ్ళా వున్నాడు! 

స్టేజ్ ఎక్కి అక్షింతలు వేసి, పెళ్ళికూతురు తండ్రికి మీ అల్లుడు చాలా హ్యాండ్‌సమ్ అని ఒక అబద్దం, పెళ్ళికూతురు అన్నకి పెళ్లిభోజనాలు రుచిగా వున్నాయని ఇంకో అబద్ధం చెప్పి బయట వెయిట్ చేస్తున్న ఆటోలోకి వచ్చిపడ్డాను. 

ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు టి ట్వెంటీ మ్యాచిల్లాంటివి. స్టేజ్ ఎక్కి అక్షింతలు వేస్తూ యేదొక కెమెరాలో ఎటెండెన్స్ వేయించుకుంటే చాలు, మన హాజరు పట్టీ సంతకానికి సాక్ష్యం కూడా గట్టిగా ఉంటుంది! 
                
నా తిరుగు ప్రయాణం - షరా మామూలే. ఆటోలో నేను - నా పులి సవారి షురూ! డిస్కవరీ చానల్లో చూపిస్తున్నట్లుగా - పులిని చూసి కకావికములైపోయే జీబ్రాలు, జిరాఫీలు (అనగా  కార్లూ, స్కూటర్లు). 

మెలికల డ్రైవింగ్‌కీ, సడన్ బ్రేకులకి ఎగిరిపోకుండా ముందున్న కడ్డీని అతి ఘట్టిగా పట్టుకుని - 'ఒరే! రండ్రా చూసుకుందాం. అమ్మతోడు, అడ్డదిడ్డంగా గుద్దేస్తా!' అంటూ నిశ్శబ్దంగా పెడబొబ్బ పెడుతూ..  పొగరుగా, గర్వంగా వికటాట్టహాసం (ఇదికూడా నిశ్శబ్దంగానే) చేశాను (బయటకి సాధుజంతువులా మెతగ్గా కనబడే నాలో ఇంత ఘోరమైన విలన్ దాగున్నాడని ఇన్నాళ్ళు నాకూ తెలీదు)!

ఆహాహా! సుఖమన్న ఇదియే గదా! 'ఎంత హాయి ఈ ఆటో పయనం! ఎంత మధురమీ ఎగుడు దిగుడు యానం!' అంటూ కూనిరాగం తియ్యసాగాను.  

'తీసుకెళ్ళే దూరానికి మాత్రమే డబ్బులు చార్జ్ చేస్తూ, ప్రపంచాన్నే జయించిన రాజాధిరాజు ఫీలింగ్ కలిగిస్తున్న ఆటోలకి జై!' అని మనసులో అనుకున్నాను (బయటకి చెబితే నా ఫీలింగుకి ఎక్స్‌ట్రా చార్జ్ చేస్తాడేమోననే భయం చేత)!  

(విజయవాడ ఆలిండియా రేడియోవారు 'హాస్యప్రసంగం' శీర్షికన చదివారు, తేదీ గుర్తు లేదు)