"ఈణ్నాకొడుకయ్యా! అన్నం సరీంగా తిండు, తిన్నదొంటబట్టట్లేదు. ఒక బలంసీసా రాయి సార్!" అడిగాడు కోటయ్య.
కోటయ్యది దుర్గి మండలలో ఓ గ్రామం. పొడుగ్గా, బక్కగా, కాయబారిన దేహం. చింపిరి జుట్టు, మాసిన గడ్డం, చిరుగు చొక్కాతో పేదరికానికి బట్టలు తోడిగినట్లుంటాడు. కొన్నాళ్ళుగా నా పేషంట్. ఎప్పుడూ భార్యని తోడుగా తెచ్చుకునేవాడు, ఈసారి తన పదేళ్ళ కొడుకుతో వచ్చాడు.
ఆ 'సరీంగా అన్నం తినని' కోటయ్య కొడుకు వైపు దృష్టి సారించాను. బక్కగా, పొట్టిగా అడుగుబద్దలా ఉన్నాడు. డిప్పకటింగ్, చీమిడిముక్కు, మిడిగుడ్లు. తన లూజు నిక్కర్ జారిపోకుండా ఎడంచేత్తో పట్టుకుని, కుడిచేత్తో తండ్రి చెయ్యిని గట్టిగా పట్టుకుని, ఇంజక్షన్ ఎక్కడ పొడిచేస్తానో అన్నట్లు నావైపు బిక్కుబిక్కుమంటూ చూస్తున్నాడు. మాసిన తెల్లచొక్కా మోకాళ్ళ దాకా లూజుగా వేళ్ళాడుతుంది. చొక్కా గుండీలకి బదులు రెండు పిన్నీసులు. ఈ ఆకారాన్ని ఎక్కడో చూశాను, ఎక్కడ చూశాను? ఎక్కడ? ఎక్కడబ్బా? ఎక్కడో ఏంటీ! అది నేనే!!
గుంటూరు శారదా నికేతనంలో నేను ఒకటి నుండి ఐదోక్లాసు దాకా చదువుకున్నాను. ఎడ్మిషన్ ఫీజు అక్షరాల ఒక రూపాయి, అటుతరవాత ఒక్కపైసా కట్టే పన్లేదు. విశాలమైన ఆవరణలో చుట్టూతా క్లాసురూములు, మధ్యలో ఆటస్థలం. వాతావరణం సరదా సరదాగా వుండేది. బడికి ఒక మూలగా రేకుల షెడ్డు, అందులో ఒక పిండిమర. బడి ప్రాంగణంలో ఈ పిండిమర ఎందుకుందో నాకు తెలీదు, కానీ నాకా పిండిమర ఓ ఇంజినీరింగ్ మార్వల్‌లా అనిపించేది.
సర్రుమంటూ శబ్దం చేస్తూ తిరిగే పెద్ద నవ్వారు బెల్టుల్ని ఆశ్చర్యంతో నోరు తెరుచుకుని చూస్తుండిపొయ్యేవాణ్ణి. రకరకాల ధాన్యాల్ని గిన్నెలు, డబ్బాల్లో వరస క్రమంలో పెడతారు. 'పిండిమరబ్బాయి' వాటిని అదే వరస క్రమంలో, చిన్న స్టూలు మీద నిలబడి, పిండిమర మిషన్‌పైన కప్పలా నోరు తెరుచుకునున్న వెడల్పాటి రేకు డబ్బాలోకి పోసేవాడు. వెంటనే గింజలు 'పటపట'మంటూ శబ్దం చేస్తూ పిండిగా మారి కిందనున్న రేకుడబ్బాలోకి పడేవి. ఆ 'పిండిమరబ్బాయి' నా హీరో. నా హీరో శరీరమంతా పిండి దుమ్ముతో తెల్లగా మారిపోయి గ్రహాంతరవాసిగా అగుపించేవాడు.
శారదా నికేతనం హెడ్మాస్టారుగారు గాంధేయవాది. ఆయన బాగా పొడుగ్గా, బాగా బక్కగా, బాగా బట్టతలతో, ఖద్దరు బట్టల్తో, మందపాటి గుండ్రటి కళ్ళజోడుతో అచ్చు గాంధీగారి తమ్ముళ్ళా ఉండేవారు. ఆయన గదిలో గోడపైన గాంధి, నెహ్రు, బోస్, పటేల్ మొదలైన దేశనాయకుల చిత్రపటాలు ఉండేవి. ఆ రూంలో ఓ మూలగా మంచినీళ్ళ కుండ ఉంటుంది. క్లాసు మధ్యలో దాహం వేస్తే ఆ కుండలోని చల్లని నీళ్ళు తాగేవాళ్ళం. హెడ్మాస్టరుగారి టేబుల్ మీద పెన్సిల్ ముక్కు చెక్కుకునే మిషన్ (షార్పెనెర్) ఉంటుంది. ఆయన గదికి వెళ్ళినప్పుడల్లా ఆయన 'మనది పవిత్ర భారత దేశం, చదువుకుని దేశానికి సేవ చెయ్యటం మన కర్తవ్యం. చక్కగా చదువుకోండి. మిమ్మల్ని చూసి తలిదండ్రులు గర్వించాలి' అంటూ చాలా చెప్పేవాళ్ళు.
బడి గోడల్నిండా 'సత్యము పలుకుము, పెద్దలని గౌరవించవలెను.' లాంటి సూక్తులు రాసుండేవి. అబద్దం చెబితే సరస్వతి దేవికి కోపమొచ్చి చదువు రాకుండా చేస్తుందని గట్టిగా నమ్మేవాణ్ని, భయపడేవాణ్ణి. ఓంకార క్షేత్రంలో ప్రసాదం సమయానికి ఠంచనుగా హజరయ్యేవాణ్ని. ఒక్క ఎగురు ఎగిరి గంటకొట్టి, రెండు చేతులూ జోడించి, కళ్ళు గట్టిగా మూసుకుని బాగా చదువొచ్చేట్లు చెయ్యమని దేవుణ్ణి తీవ్రంగా వేడుకునేవాణ్ణి. పుణ్యానికి పుణ్యం, చేతినిండా ప్రసాదం!
మా స్కూలుకి యూనిఫాం లేదు. నాకు రోజువారీ తోడుక్కోడానికి శుభ్రమైన బట్టలు రెండుజతలు ఉండేవి. సాయంత్రం స్నానం తరవాత పోట్టైపోయి పోయినేడాది బట్టలే గతి. అవి - బిగుతుగా, (ఇప్పటి మన సినిమా హీరోయిన్ల బట్టల్లా) ఇబ్బందిగా ఉండేవి. అమ్మకి చెబితే - 'మగాడివి, నీకు సిగ్గేంట్రా!' అనేది. ఆ విధంగా మగాళ్ళకి సిగ్గుండక్కర్లేదని చాలా చిన్నతనంలోనే గ్రహించాను! బట్టలు సరిపోటల్లేదని ఎంత మొర పెట్టుకున్నా అందరిదీ ఒకటే సమాధానం - ' అసలీ వయసులో నీకెందుకన్ని బట్టలు? ఎట్లాగూ పోట్టైపోతాయ్ గదా!'
నాకు దెబ్బలు తగిలించుకోటంలో గిన్నిస్ రికార్డుంది. కోతికొమ్మచ్చి ఆడుతూనో, గోడ దూకుతూనో.. ఏదో రకంగా శరీరంలోని అనేక భాగాల్లో అనేక దెబ్బలు తగుల్తుండేవి. వాటిల్లో కొన్ని మానుతున్న గాయాలైతే, మరికొన్ని ఫ్రెష్ గాయాలు. ఒక రోజు సైకిల్ నేర్చుకుంటూ కింద పడ్డాను. మోకాలు భయంకరంగా దోక్కుపోయింది, బాగా రక్తం కారుతుంది. వీధి చివర మునిసిపాలిటీ పంపు నీళ్ళధార కింద దెబ్బని కడుక్కున్నాను. రక్తంతో కలిసిన నీళ్ళు ఎర్రగా కిందకి జారిపొయ్యాయి. అబ్బ! భరించలేని మంట. కుంటుకుంటూ, ఏడ్చుకుంటూ ఇంటికి చేరాను.
నాన్న ఇంట్లోనే ఉన్నాడు. అప్పుడే అన్నం తిని, మంచం మీద పడుకుని ఆంధ్రప్రభ చదువుకుంటున్నాడు. నా అవతారం చూడంగాన్లే వీరావేశంతో నన్ను ఉతికి ఆరేశాడు. ఆయనకంత కోపం రావడానికి కారణం నాకు దెబ్బ తగలడం కాదు, అసలాయన నా దెబ్బనే పట్టించుకోలేదు - దెబ్బవల్ల నిక్కర్ అంచు కొంచెం చిరిగింది, అదీ సంగతి!
ఈవిధంగా శరీరంతో పాటు బట్టలకి కూడా అవుతున్న రకరకాల గాయాలకి కట్లు కట్టించుకుంటూ (దీన్నే టైలర్ల భాషలో 'రఫ్' తియ్యడం అంటారు), బొత్తాలు ఊడిపోయిన చొక్కాకి పిన్నీసులు పెట్టుకుంటూ, నిక్కర్ (మేం 'లాగు' అనేవాళ్ళం) జారిపోకుండా మొలతాడుని నడుం చుట్టూ బిగిస్తూ కొత్తబట్టల కోసం భారంగా ఎదురు చూపులు చూస్తుండేవాణ్ణి.
ఈ కొత్తబట్టలకి ఒక లెక్కుంది. ఎండాకాలం సెలవల తరవాత స్కూళ్ళు తెరిచేప్పుడు రెండుజతల బట్టలు, అటుతరవాత ముఖ్యమైన పండగలకి ఒకజత. ఓవర్ బ్రిడ్జ్ పక్కన మూడోలైన్లో కొత్తమాసువారి బట్టల దుకాణం ఉంది. ఆ దుకాణదారుడు నాన్నకి స్నేహితుడు. అంచేత ఎప్పుడైనా కొత్తమాసువారి కొట్లో మాత్రమే గుడ్డ కొనాలి. కొద్దిగా బాగున్న గుడ్డ కొందామనుకుంటే ఆ షాప్ ఓనరుదీ ఇంట్లోవాళ్ళ పాటే! 'అంత ఖరీదైన గుడ్డెందుకు బాబు? ఎదిగే వయసు, ఊరికే పొట్టైపోతాయి. ఈ పన్నా చించుతున్నా, రేటు తక్కువ, గట్టిదనం ఎక్కువ.' అంటూ చేతికందిన గుడ్డని కత్తెరతో పరపర కత్తిరించేసేవాడు. ఆయన నాన్నకి స్నేహితుడవడం చేత నన్ను డామినేట్ చేసేవాడు, ఎంతన్యాయం!
నాకా కొత్తబట్టల ప్యాకెట్ ఎంతో అపురూపంగా అనిపించేది. దాన్ని రెండు చేతుల్త్లో ఆప్యాయంగా దగ్గరకి తీసుకుని, కొత్తబట్టల సువాసనని ముక్కారా ('మనసారా'కి అనుకరణ) ఎంజాయ్ చేస్తూ, నాన్నతోపాటు టైలర్ దగ్గరికి వెళ్ళేవాణ్ణి.
ఓవర్ బ్రిడ్జ్ పక్కన రెండో లైన్ మొదట్లో బాజీ అని మా ఆస్థాన టైలర్ ఉండేవాడు. తెల్లజుట్టు, మాసిన గడ్డం, శూన్యదృక్కులు. అతని మొహం నిర్లిప్తత, నిరాశలకి శాశ్విత చిరునామాలా ఉంటుంది. అతనికీ ప్రపంచంతో, ప్రాపంచిక విషయాల్తో ఆట్టే సంబంధం ఉన్నట్లుగా తోచదు. అతను చిన్నగా, తక్కువగా మాట్లాడతాడు. అతనికి పదిమంది పిల్లల్ట, చాలా కష్టాల్లో కూడా ఉన్నాట్ట. అతని బావ హైదరాబాదులో టైలరుగా బాగా సంపాదిస్తున్నాట్ట, కానీ తన కుటుంబాన్ని అసలు పట్టించుకోట్ట. ఈ విషయాలన్నీ నాన్న అమ్మకి చెబుతుండగా విన్నాను.
బాజీలాగే బాజీ కుట్టు మిషన్ అత్యంత పురాతనమైనది, ఇంకా చెప్పాలంటే శిధిలమైనది. బ్రిటీషు వాడు దేశానికి స్వతంత్రం ఇచ్చేసి, ఈ కుట్టు మిషన్ కూడా వదిలేసి వెళ్లిపొయ్యాడని నా అనుమానం. బాజీ దించిన తల ఎత్తకుండా పొద్దస్తమానం బట్టలు కుడుతూనే ఉండేవాడు. నాకతను కుట్టు మిషన్తో పోటీ పడుతున్న మనిషి మిషన్లా కనపడేవాడు.. యాంత్రికతలో అతను యంత్రాన్ని జయించినవాడు.
మనుషుల్లో రెండురకాలు - ధనవంతులు, పేదవారు. వస్తువులు కూడా రెండురకాలు కొత్తవి, పాతవి. బాజీ కొలతలు తీసుకునే టేపు పాతది మాత్రమే కాదు, అంటువ్యాధిలా దానికి బాజీ పేదరికం కూడా పట్టుకుంది. అందువల్లా అది చీకిపోయి, పెట్లిపోయి ఉంటుంది. దానిపై అంకెలు అరిగిపోయి కనబట్టం మానేసి చాల్రోజులైంది. కనబడని ఆ టేపుతో కొలతలు తీసుకుంటూ, సరీగ్గా అంగుళం మాత్రమే ఉండే పెన్సిల్‌తో బట్టలు కొన్న బిల్లువెనక ఏవో అంకెలు కెలికేవాడు.
బాజీ మెజర్‌మెంట్స్ లూజుగా తీసుకునేవాడు. అంచేత లూజు కొంచెం తాగించి ఆదులు తీసుకొమ్మని బాజీకి చెప్పమని నాన్నని బ్రతిమాలేవాడిని. నాన్న పట్టించుకునేవాడు కాదు. బాజీ గూర్చి రాయడం దండగ. అతను వినడు, మాట్లాడడు, రోబోలాగా నిర్వికారంగా కొలతలు తీసుకునేవాడు. ఆవిధంగా నాన్న నాకు అరణ్యరోదన అంటే ఏంటో చిన్నప్పుడే తెలియజెప్పాడు. గుడ్డ అంగుళం కూడా వేస్ట్ కాకూడదు, అదే అక్కడ క్రైటీరియా! ఈ మాత్రం దానికి కొలతలు ఎందుకో అర్ధం కాదు!
నిక్కర్ భయంకరమైన లూజ్ - పొలీసోళ్ళ నిక్కర్లకి మల్లే (ఆరోజుల్లో పోలీసులు నిక్కర్లు వేసుకునేవాళ్ళు) మోకాళ్ళని కవర్ చేస్తుంది. నిక్కర్ కింద అంచు లోపలకి రెండుమూడు మడతలు మడిచి కుట్టబడేది (పొరబాటున ఆ సంవత్సరం నేను హఠాత్తుగా పదడుగులు పొడవు పెరిగినా ఆ మడతలు ఊడదీస్తే సరిపోతుందని నాన్న దూరాలోచన). చొక్కా వదులుగా, అందులో ఇంకా ఇంకోనలుగురు దూరగలిగేంత విశాలంగా ఉండేది.
చొక్కా ఎంత పొడవున్నా, నిక్కర్ దానికన్నా పొడవుండడం వల్ల పరువు దక్కేది. లేకపోతే చొక్కాకింద ఏమీ వేసుకోలేదనుకునే ప్రమాదం ఉంది! ఇన్నిమాటలేల? నా బట్టలు నాన్నక్కూడా సరిపోతాయి! ఆ బట్టలు నా శరీరాన్ని ఎంత దాచేవో తెలీదు కానీ, వాటిని మొయ్యలేక దుంప తెగేది. ఏ మాటకామాటే - కొంత సుఖం కూడా దక్కేది, గాలి ధారాళంగా ఆడేది. ఆ పెద్దజేబుల్లో బోల్డన్ని మరమరాలు కుక్కొచ్చు, పెన్సిల్ ముక్కలు దాచుకోవచ్చు.
కొత్తబట్టలేసుకున్నానన్న ఆనందం ఒకపక్కా, అవి మరీ లూజుగా ఉన్నాయన్న దిగులు మరోపక్కా సమానంగా ఉండేవి. మరీ ఇంత వదులైతే ఎలా? పక్కింటివాళ్ళు ఆరేసుకున్న బట్టల్ని కాజేసి వాడుకుంటున్నాననుకోరూ! ఈ అవతారంతో బడికెళ్తే నా పరువేం కావాలి? పైగా అక్కడ అమ్మాయిలు కూడా ఉంటారాయె. అందులోనూ మొన్న సుమతీ శతకం పద్యాలు గుక్కతిప్పుకోకుండా అప్పజెప్పినప్పుడు పక్కబెంచిలోంచి కె.లలిత నన్ను ఎంత ఎడ్మైరింగ్‌గా చూసింది!
బెరుకుగా బడికెళ్లాను, బిడియంగా నా 'బి' సెక్షన్లోకి అడుగెట్టాను. అక్కడ క్లాసులో ముప్పాతికమంది కొత్తబట్టలతో దర్శనం. ఆశ్చర్యం! వాళ్ళవి నాకన్నా వదులు దుస్తులు. వాళ్ళతో పోలిస్తే నా బట్టలు చాలా నయం. ఆలోచించగా - తండ్రులందరిదీ ఒకే జాతిలాగా తోస్తుంది. ఈ తండ్రుల పొదుపు వల్ల పిల్లల బట్టలకి రక్షణ లేకుండా పోయింది. పిల్లలు అమాయకులనీ, వారి హృదయాల్లో దేవుడుంటాడనీ.. కబుర్లు మాత్రం చెబుతారు, ఆచరణలో మాత్రం అందుకు వ్యతిరేకం, ఏమిటో ఈ మాయదారి ప్రపంచం!
వేసవి సెలవల తరవాత ఆ రోజే క్లాసులు మొదలు, అంచేత - క్లాసంతా గోలగోలగా ఉంది. సూరిని చూస్తే నవ్వొస్తుంది, తిరపతి పోయ్యాట్ట, వాడి బోడిగుండు నున్నగా ఇత్తడి చెంబులా మెరిసిపోతుంది. సీతారావుడు సూరి గుండుని రుద్దుతూ ఏడిపిస్తున్నాడు. శీనుగాడి కుడిచేతికి పిండికట్టు, పక్కింట్లో దొంగతనంగా మామిడి కాయలు కోస్తూ చెట్టుమీంచి పడ్డాట్ట. ఆ మూల వీరయ్య, సుబ్బిగాళ్ళ మధ్యన కూర్చునే ప్లేసుల దగ్గర తగాదా. అరె! నా ప్లేసులో వాడెవడో కొత్తోడు కూర్చున్నాడే! 'వురేయ్ ఎవడ్రా అది? ఆ ప్లేసు నాది, మర్యాదగా లేస్తావా లేదా?' ఆ క్షణంలోనే నా లూజు బట్టల వేదాంతం, సిద్ధాంతం, రాద్ధాంతం.. అన్నీ మర్చిపోయి నా హక్కుల సాధనలో మునిగిపొయ్యాను!
అంకితం -
నా చిన్ననాటి జ్ఞాపకాలు, ముచ్చట్లు నెమరు వేయించిన వదులు దుస్తుల వీరుడు కోటయ్య కుమారుడికి.
కృతజ్ఞతలు -
కోటయ్య కొడుకు బొమ్మని అందంగా గీసిన అన్వర్ గారికి, అందుకు కారకులైన భాస్కర్ రామరాజు గారికి.
You have just vividly described my (and I suspect many of our friends') childhood clothing experience. I think all the anti-fashion fascists (parents) conspired against their children in this aspect.
ReplyDeleteమా నిక్కర్లకి వెనక తోక లుండేవి. బిగుతుగా కట్టుకునే వాళ్ళం. చిన్నప్పుడు ముందరా. కొంచెం పెద్దయ్యాక వెనకా. మనమందరం చిన్నప్పుడు ఇల్లా పెరిగిన వాళ్ళమే. మా ఇంట్లో తానులు కొని పాలేరాళ్ళతో సహా అందరికీ ఒకేరకం బట్టలు కుట్టించే వాళ్ళు.
ReplyDeleteఇంతకీ పాపం ఆ కుర్రాడికి ఏమన్నా మందు రాసిచ్చారా డాక్టరుగారూ ?
ప్చ్..ఎన్ని కష్టాలు డాక్టర్ గారు.
ReplyDelete(ఇప్పటి మన హీరోయిన్ల బట్టల్లా.. ఇబ్బందిగా ఉండేవి. అమ్మ 'మగాడివి. నీకు సిగ్గేంట్రా!' అనేది. మగాళ్ళకి సిగ్గుండక్కర్లేదా!. ..) సూపర్ సర్.
మన హీరోయిన్లు ని అడిగితే..మగవాళ్ళకి తప్పకుండా ఉండాలని చెప్పి ఉంటారండి. అందుకే ..పుల్ సూట్ లో ఒదిగి కనిపిస్తారు...కదండీ!
ఇంతకీ డాక్టర్ గారు.. కర్చీఫ్ల అంత బట్టలు కట్టుకునే వాళ్లకి ఏమైనా మానసిక రోగం అంటారా!?అండీ.. ఆ వివరాలతో..మీ మార్క్ ఓ..టపా పేల్చ కూడదూ! తగలాల్సిన వారికి కాస్త తగులుతుందేమో..అని ఆశ. ..
గురువు గారు,
ReplyDeleteమొన్న టీవిలో మన శ్రీక్రిష్ణదేవరాయలు "తిక్కవరపు సుబ్బరామిరెడ్డి" వాళ్ళ అస్తాన విద్వాంసుడు అక్కినేనికి 75 సంవత్సరాలనీ అందరినీ పిలిచి కార్యక్రమం చెసాడు పనిలోపనిగా ఆయన్ని నాకోసం ఇంత మంచి కార్యక్రమం చేసారని పొగిడించుకున్నాడు.
ఇకపొతే నిక్కరు(లాగు),చొక్కాలతో నా చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తు చేసారు .థ్యాంకూ సార్.
జి రమేష్ బాబు
గుడివాడ
Rao S Lakkaraju గారు,
ReplyDeleteఅయ్యో! ఒక టానిక్ సీసా మాత్రమేనా! ఆ అబ్బాయి నా పోస్టుకి inspiration కావున చాక్లెట్లు కూడా ఇచ్చాను.
(నా దగ్గర పిల్లల కోసం చాక్లెట్లు ఉంటాయిలేండి. ఎక్కువగా నేనే చప్పరిచ్చేస్తుంటాను.)
అందమైన వాక్చిత్రం. నోస్టాల్జియాలో ఆనందాలకు కారపు పూత, విషాదాలనూ చక్కెర పూతా పూసిన తీరు బాగుంది.
ReplyDeleteముందుగా మీ రచనా సామర్ద్యానికి జోహర్లండి..
ReplyDeleteమీరు చెప్పడం కాదు సినిమా చూపించారు... అదీ బ్లాక్ అండ్ వైట్ లో....
లూజు బట్టలతో మేము ఇబ్బంది పడ్డమండీ... మీ తర్వాత జనరేషన్ లో పుట్టి కూడా.
నేను మాత్రమేనా లేక నా ఈడు వాళ్ళు అందరూ ఇలానే ఉంటారో తెలియదు కాని..
ReplyDeleteనేను మాత్రము కొంత కాలం నుండి ఏ పనిని కూడా అస్వాదించలేకపోతున్నాను. అదొక రకం నిర్లిప్తత...
కాని మీ అర్టికల్ చదివి కొద్దిగా అస్వాదించగలిగాను అనిపిస్తుంది డాక్టరు గారు...
పాత రోజుల్ని చాల బాగా గుర్తుచేసావు మిత్రమా. నీ రచన శైలికి జోహార్లు. అందరు చెప్పేదే నేను చెప్తాను. అందరమూ అలాగే పెరిగినవాల్లము. కాకపోతే నిక్కరు లూస్ లో ఒకటి రొండు అంగుళాలు తేడా! శారదానికేతన్ లోనే కాదు, మన ఫ్రెండ్స్ కొంత మంది లాగు, చొక్కాలు గురవయ్య హై స్కూల్ లో కూడా అలాగే ఉండేవి. అందులో ముఖ్యం గా సాగి సత్తై , భాస్కర్ చెప్పుకో తగ్గవాళ్ళు. నీకన్న నేను కొంచెం బెటర్ ఎందుకంటే నేను బాలానందం లో చదివాను, మాకు uniform వుండేది.
ReplyDeleteగో వె ర
బాల్యాన్ని కళ్ల ముందు నిలబెట్టారు. టపా అద్భుతం అంతే...
ReplyDeleteవనజవనమాలి గారు,
ReplyDelete>>కర్చీఫ్ల అంత బట్టలు కట్టుకునే వాళ్లకి ఏమైనా మానసిక రోగం అంటారా!?<<
మానసిక రోగం కాదండి. డబ్బు రోగం. వ్యాపారావసరం.
@Ramaad-Trendz,
ReplyDeleteరమేష్ బాబు గారు,
మన లాగు, చొక్కా జ్ఞాపకాలు గొప్ప నోస్టాల్జియా.
ఇప్పటి పిల్లల్ని చూస్తే నాకు దిగులుగా ఉంటుంది. చదువు నావని ఈడవలేని వాళ్ళ మొహాలు.. రాజశేఖరరెడ్డి చెప్పిన వాక్యం గుర్తు తెప్పిస్తయ్. ('తల్లి గర్భంలోంచి ఎందుకు బయటకొచ్చామా!' అని ఏడుస్తున్నట్లు ఉంటుంది.)
puranapandaphani గారు,
ReplyDeleteధన్యవాదాలు.
రాజీవ్ రాఘవ్ గారు,
ReplyDeleteధన్యవాదాలు.
నన్ను కూడా అప్పుడప్పుడు నిర్లిప్తత ఆవరిస్తుంది. స్నేహితులు, పుస్తకాలు, మ్యూజిక్.. నన్ను రక్షిస్తుంటాయి. మీకు తోడు నేనున్నాను! don't worry.
@Go Ve Ra,
ReplyDelete>>నీకన్న నేను కొంచెం బెటర్.<<
మీ బాలానందానికి యూనిఫాం ఉండొచ్చు. నువ్వు కొద్దిగా లూజు తక్కువ బట్టలు వేసుకునుండొచ్చు. అక్కడితో ఆగు.
మీ బాలానందానికి పక్కన ఓంకారక్షేత్రం ఉందా? పోనీ కనీసం పిండిమరయినా ఉందా? అంచేత.. డ్రెస్ తప్ప అన్ని విషయాల్లో శారదా నికేతనమే బెటర్!
@మనసు పలికే,
ReplyDeleteథాంక్యూ!
డాక్టర్ జీ! ఒక మాట. ఆ రోజు కష్టపడ్డామనుకున్నాం. ఈ రోజు నిజంగా సంతోషిస్తున్నాం, వాళ్ళ తపనకి.
ReplyDeleteమీరు మంచివాళ్ళే మీ నాన్న గార్ని తిట్టుకోలేదు. మాకు ఇంజినీరింగ్ అయ్యేదాకా చిరిగిపోయిన బట్టలే. మొట్టమొదటి షూ కొనుక్కున్నడి ఇంజినీరింగ్ అయిపోయేకా, ఉద్యోగం ఇంటర్వ్యూ కి వెళ్ళడనికి. దరిద్రం నట్టింట్లో తాండవిస్తూ ఉండేది. ఒక్కోరోజు అన్నం వడియాలు తిన్నాము. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టూ అవే రోజుల్లో ఇంటికి చుట్టాలు వచ్చేవారు. ఇప్పటికీ నాకు కోపం పోలేదు. అలాంటి జీవితం ఎటువంటి భయాన్ని నేర్పిందంటే, ఇప్పటికీ ఆ రోజులు మళ్ళీ వస్తాయేమో అని భయం వదల్లేదు. ఈ జీవితంలో వదలదు కూడా.
ReplyDeletekastephale గారు,
ReplyDeleteనేననుకోవటం.. ఈనాటి తలిదండ్రులే మరీ ఎక్కువ తపన పడుతున్నారు. తద్వారా పిల్లల్ని ఇక్కట్ల పాలు చేస్తున్నారు.
మన అమ్మానాన్నలు మన గూర్చి పెద్దగా తపన పడలేదు. అందుకే హాయిగా ఆడుకోనిచ్చారు. అదే మనకి ప్లస్ అయింది. అందువల్లనే మన బాల్యం పుస్తకాలు, చదువుల పేరుతో చిదిమి వేయబడలేదు.
మన అమ్మానాన్నలు మన గూర్చి పెద్దగా తపన పడలేదు. అందుకే హాయిగా ఆడుకోనిచ్చారు. అదే మనకి ప్లస్ అయింది. అందువల్లనే మన బాల్యం పుస్తకాలు, చదువుల పేరుతో చిదిమి వేయబడలేదు.
ReplyDelete--------------
very very very true.
రమణ గారు నేను రెగ్యులర్ గా మీ బ్లాగ్ ని ఫాలో అవ్వుతుంటాను..మీ కామెడీ సెన్సు సూపర్..మీరు గుంటూరు గురించి చెప్పింది వంద శాతం కరెక్ట్...చదువుతుంటే కళ్ళ ముందు కదులుతున్నాయి అండి బ్రోదిపేట్ లో బాల్యం రోజులు..మా ఇల్లు ఐదవ లైను తోమ్మ్మిదవ అడ్డరోడ్డు లో ఉండేది.నేను ధన్ గారి దగ్గర చదివాను..అదృష్టం కొద్ది నేను చదివే అప్పటికే స్కూల్ ప్యాంటు వచ్చేసాయి
ReplyDeletehareen గారు,
ReplyDeleteధన్యవాదాలు.
మన గుంటూరు సుజనులు బ్లాగుల్లో బాగానే ఉన్నట్లున్నారు. అందరికీ వందనాలు.
CVN ధన్ గారు మహానుభావుడు. గొప్ప విద్యావేత్త. ఆయన గూర్చి మీరు ఒక టపా రాయొచ్చేమో!
రమణ గారు మన గుంటూరు సామ్రాజ్యం దస దిశ వ్యాప్తంగా విస్తరించబడినది . నేను కూడా మిమ్మల్ని ధన్ గారి గురించి రాయమని అడుగుదాం అనుకుంటునాను..అయన ఆఖరి రోజుల్లో కూడా తెల్లటి ఖద్దర్ చొక్కా లో గుబురు మీసాలతో సింహం లాగ ఉండేవాళ్ళు. టైం చూసి ఒక మంచి టపా వెయ్యండి.
ReplyDeleteమై డియర్ రమణ,
ReplyDeleteచాలా చక్కగ, సహజంగా వ్రాసావు.
1970 కి ముందు చాలామంది ఇదే రకమయిన అనుభవం ఎదుర్కొనే ఉంటారు. కారణం అప్పట్లో సమిష్ఠి కుటుంబ వ్యవస్థ. ప్రతి దంపతులకు కనీసం నాలుగైదు పిల్లలుండే వారు. ఇంటి యజమాని ఒక్కడిదే సంపాదన. అదీ కూడా "అవినీతి" లేనిది. అందువలన సంపాదించిన డబ్బును అనవసరంగా ఎదిగే పిల్లల గుడ్డలకు పెట్టేబదులు మంచి తిండికి, నిత్యం పిల్లలకోసమని పిండివంటలకు (బయట కొనాల్సిన అవసం రాకుండా) పెట్టేవారు. (డబ్బులున్న వాళ్ళు కూడా)
పిల్లలు బడి దగ్గర ఏమీ కొనుక్కోవసరం రాకుండా ఇంట్లో చేసిన పిండివంటలు జేబులో వేయటానికని లాగుకి పెద్ద పెద్ద జేబులు కుట్టించేవారు. అప్పుడు జేబులు తాయిలాల బరువుకి లాగు అంచు దాటి కనబడేది. నేను బడికి వెళ్ళేలోపునే జేబులు ఖాళీ జేసి వచ్చేటప్పుడు "బెచ్చాలు" ఆడుకోవటానికని దోవలో రోడ్డుప్రక్కన కనబడ్డ ప్రతి సిగిరెట్టుపెట్టెలతో (ఖాళీవి) జేబు నింపే వాడిని. ఆ రోజులే వేరు. ఎటువంటి తారతమ్యం లేకుండా అందరి పిల్లలూ ఇలాంటి స్కూళ్ళ లోనే చదువుకునేవారు. ఇప్పటికాలపు పిల్లల ఆలోచనలకన్నా అప్పట్లో దాదాపుగా అందరి ఆలోఅచనలు "స్నేహ భావం" తో అందరితో పంచుకునే గుణం ఎక్కువగా ఉండేది. ఆరోజులు "స్మృతులుగానే మిగులుతాయి.
జన్మ భూమి, విద్యా బుధ్ధులు నేర్పిన చోటు (గురువులతో సహా) రెండూ కూడా "స్వర్గము" కన్నా ఎక్కువే. ఇంకా చెప్పాలంటే ప్రకృతిలో "కన్న తల్లి" కన్నా అందమయినది ఎక్కడా కనిపించదు.
ఇప్పటి మన హీరోయిన్ల బట్టల్లా.. ఇబ్బందిగా ఉండేవి. అమ్మ 'మగాడివి. నీకు సిగ్గేంట్రా!' అనేది. మగాళ్ళకి సిగ్గుండక్కర్లేదా!. ..) సూపర్ సర్.
ReplyDeleteహ..హ...అల్లగే ఉండేవి ఆ రోజుల్లో...పాపం ఫ్యాంట్
కావాలంటే కాలేజ్ కి రావాలేమో కదా...చక్కగా వ్రాసారు
@DSR Murthy,
ReplyDeleteనీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.
(బ్లాగర్లలో మనం ముసలాళ్ళం. గతమెంతో ఘనము అంటూ కుర్రాళ్ళకి బోర్ కొడుతున్నామేమో!)
consumerism పెరుగుతున్న కొద్దీ మనిషికి అశాంతి కూడా అదే రేషియోలో పెరుగుతుందని అనుకుంటున్నాను.
శాంతా సిన్హా వంటి వారు పిల్లల్ని child labour నుండి విముక్తి చేస్తున్నామంటూ టీ కప్పులు కడుగుతున్న పిల్లల్ని తీసుకెళ్ళీ బళ్ళల్లో పడేస్తుంటారు. కానీ అసలు సిసలైన child labour ఉంటున్నది corporate schools లో అన్నది అందరికీ తెలిసిందే!
శశికళ గారు,
ReplyDeleteఅవును.
కాలేజి కొస్తే గానీ ప్యాంటు ప్రాప్తం ఉండేది కాదు.
నాకైతే ఇంకో యాడెడ్ అడ్వాంటేజ్ కూడా ఉండేది. మా అన్నయ్యకి బిగుతైపోయిన బట్టలన్నీ నాకు కొత్త బట్టలుగా సంప్రాప్తించేవి. వంశపారంపర్య లాగూలు, చొక్కాలు, అందునా తేడాలు లేకుండా ఉండాలనే ఒకే తానువి అందరికీ కుట్టించడంతో నేను దాదాపు ఆరేళ్లు ఒకే రంగు లాగూలు, చొక్కాలు ధరించాను. అప్పుడు నాకు గిన్నిస్ బుక్ వాళ్ల అడ్రస్సు తెలీదు. తెలిసుంటే నా పేరు ఇప్పటికే విశ్వవిఖ్యాతమయ్యేది. విశ్వనాథ వారి భాషలో అది యొక దురదృష్టము.
ReplyDeleteమా నాన్న ఒకసారి కుట్టించుకున్న పాంటు, షర్టును దాదాపు పదేళ్లు వాడాడు (నేను గుర్తుంచుకున్నంత వరకూ) ఆయనకీ ఆ బుక్కులో స్థానం దక్కలేదు. అందుకే ఆ పుస్తకాన్ని నేను ఇస్పుడు బహిష్కరిస్తున్నా.
మళ్లీ నా బాల్యాన్ని గుర్తుకు తెచ్చినందుకు ధన్యవాదాలు
your way of writing is hilarious...ramana garini minchi poyela vunnaru. edo saradaga annalendi ramanagaru.. emee anukokandi
Deleteమీకు కనీసం టైలర్ కుట్టాడు, మాకు మా అమ్మ గారే నేర్చుకున్నారు (మా నిక్కర్లు కుట్టి కుట్టి )... ఫాంట్ల స్థాయికి వచ్చాక ఒక కుర్ర బాజీ, మీరా నామ ధేయుడు దొరికాడు మా ప్రాణానికి. మా నాన్న గారికి మాకూ ఒకేలా కుట్టేవాడు. ఎప్పుడైనా విడిగా వెళ్లి బతిమాలుకుంటే కూడా, చదువుకునేవారు మీకు ఎందుకయ్యా ఫేషన్లు అని కొట్టి పారేసి, మా నాన్న గారికి విడిగా చెప్పేవాడు :(
ReplyDeleteమా అమ్మా నాన్నలకి, మీరాకి కృతజ్ఞతలతో
సీతారాం
పూర్ణప్రజ్ఞాభారతి గారు,
ReplyDeleteమీ కామెంట్ చదువుతూ చాలాసేపు పగలబడి నవ్వాను. చాలా చాలా బాగుంది. ధన్యవాదాలు.
Seetharam గారు,
ReplyDeleteమధ్యతరగతి కుటుంబాల్లో ఆడపిల్లలకి పెళ్ళికి ముందే కుట్టు పని కొద్దిగా నేర్పించేవారు (ఇది పెళ్ళికూతురుకి additional qualification).
ఈ ఆడపిల్లలు తల్లులైన తరవాత తమ కుట్టు కళకి దుమ్ము దులిపి నోరు లేని పిల్లల మీద ప్రయోగాలు చేసేవాళ్ళు. మీరు మీ అమ్మగారికి బాగా ఉపయోగపడ్డారు. కంగ్రాట్స్!
మీ టపా చదువుకుని నవ్వుకున్నా, బాల్యపు రోజులు గుర్తొచ్చి నవ్వు ఆగిపోయింది. ఏదో బాధలుపడిపోయామని కాదుగానీ ఏమో.. పేరు పెట్టలేని భావనలు కొన్ని ఉంటాయ్ కదా! :)
ReplyDeleteమా ఆస్థాన దర్జీ, బట్టల కొట్టతను, ఇంటికి వచ్చే పుల్లేటికుర్రు చీరల రామారావు.. అందరూ గుర్తొచ్చేసారు. మా కుమిలి మడేలు కూడా! :)
ఆడపిల్లలకి అదనంగా ఉండే ఇంకో తీపిగుర్తు పేద్ద టక్ వేయించి గౌన్లు, పరికిణీలూ కుట్టించడం.. మనం పదడుగుల పొడవయిపోయాక అవి విప్పితే మిగిలిన గౌనంతా రంగు వెలిసిపోయి, ఆ టక్ లో దాగున్న గుడ్డ చక్కగా కొత్త రంగులో మెరిసిపోతూ..
ఏది ఏమయినా ఆ రోజులే బావుండేవి. ఇప్పుడు కొత్త బట్టలు తెచ్చే ఆనందమే లేకుండాపోతోంది.
హహహ! భలే చెప్పారు! నా చిన్నప్పుడు గౌన్లు కుట్టినా ఫిల్టు వేసి కుట్టిన్చేవారు.
ReplyDeleteరమణా,
ReplyDeleteఅద్భుతంగా ఉందిరా నీ వర్ణన. శారదా నికేతనాన్ని అందరికీ కళ్ళకు కట్టినట్లు వర్ణించావు. మనమంతా "కన్స్యూమరిజం" ప్రబలక ముందు పెరిగిన వాళ్ళం. అందుకే మనకు మన పెద్దవాళ్ళ బిహేవియర్ అర్ధం అవుతుంది. చాలా బాగా వ్రాశావు.
దినకర్.
రసజ్ఞ గారు,
ReplyDeleteఆడయినా.. మగయినా.. ఫిల్టులు మాత్రం యూనివర్సల్. తప్పించుకొనుట అసాధ్యం!
మా టైలరు భాషా ఐతే, మా నాన్న ప్యాంట్లని, నా నిక్కర్లుగా కుట్టేసేవాడు, వాటికి తోడు ఆ నిక్కర్లు ఊడిపోకుండా, వెనుకనుండి భుజాలమీదుగా నిక్కరు బెల్టుకు కట్టుకునే లాడీలు, ఏ అవసరానికి అవి విప్పెసినా, మళ్ళీ కట్టుకోలేక, నిక్కరు వెనకాల తొకలాగా ఈడ్చుకుంటూ తిరిగేవాళ్ళం, మా నాన్న గారైతే, కాలేజీకు కూడా నిక్కర్లే కుట్టించబోతే, ఇంటిలొ ఒక మౌనపొరాటంచేసి గానీ, ప్యాంట్లను సాధించుకొవడం జరగలేదంటే నమ్మండి, బాల్యస్మృతులను మీ టపా ద్వారా తడిమినందుకు ధన్యవాదాలు
ReplyDelete- డా. రమేష్ బాబు బొబ్బిలి
కొత్తావకాయ గారు,
ReplyDeleteమన చిన్నప్పటి సమాజం ఇప్పుడంత consumer oriented కాదు.
పొద్దున్నే చద్దన్నంలోకి గడ్డ పెరుగు, ఆవకాయ బద్ద. కొన్ని జతల బట్టలు. స్నేహితుల్లో కనీసం డొక్కు సైకిల్ కూడా ఎవరికీ ఉండేది కాదు. (బాగా డబ్బున్నవారి ఇంట్లో మర్ఫీ రేడియో ఒక స్టేటస్ సింబల్ అనుకోండి.)
ఇప్పటి మన టీవీలు, కంప్యూటర్లు లేని ఒకప్పటి సమాజంలో మానవ సంబంధాలకి చాలా ప్రాముఖ్యత ఉండేది. ఇప్పుడు మనం సృష్టించుకున్న నూతన ప్రపంచంలో మానవీయ సంబంధాలకి కూడా అవకాశం ఉందా!
@Dinkar,
ReplyDeleteఅవును.
అన్నట్లు నాకీమధ్య ఒక కల వచ్చింది. మనల్ని మన నాన్నలు ఏదో కార్పొరేట్ స్కూల్లో పడేశార్ట! మెళుకువొచ్చి చూస్తే భయంతో ఒళ్ళంతా చెమటలు!
అప్పుడు గుర్తొచ్చింది. ఆ రోజు ఒక కార్పొరేట్ గినీ పిగ్ (విద్యార్ధి) కేసొకటి చూశాను!
Ramesh Bobbili గారు,
ReplyDelete'చూడ చూడ తండ్రులందరూ ఒక్కటే!'
మొత్తానికి నా పోస్ట్ అందర్నీ తమ చిన్ననాటి లాగూ, చొక్కాల జ్ఞాపకాల్ని తవ్వించింది. థాంక్యూ!
Wonderful post Ramana garu. It took me back to my childhood days. I had studied class 4th and 5th in Saradaniketanam and later in MGHS. At that time head master was Anjaneyulu garu and my class teacher was Mrs. Vijayalakshmi. My childhood was as simple as discribed by you .. when I reminisce now, it is so beautiful and very rich experiences.
ReplyDeleteRam
దాటేరు రమణ గారు,
ReplyDeleteమాటల్లేవు. చాలా బాగా రాసారు చిన్న నాటి అనుభవాలని, చిన్ని ఆనందాలని.
దూరమైనా క్షణాలు మధురమైన క్షణాలేమో ఎప్పటికీ !
The infinite is always the memorable one for ever!
In the time capsule memories are the events that shoot up now and then making this moment joyful and cheerful !
మీరు మరిన్ని ఇట్లాంటి టపాలు రాస్తారని ఆశిస్తూ
చీర్స్
జిలేబి.
మాకైతే పంచవర్ష ప్రణాళిక లాగా, ఒక ఐదేళ్ళకి సరిపోయే సైజ్ కుట్టించేవాల్లు...
ReplyDeleteపైగా అన్నకి నాకు కలిపి ఒకే తానులో కొని కుట్టించేవాళ్ళు...
పండగలకి ఇద్దరం ఒకే డ్రస్సులో గంతులేసేవాల్లం :)
బట్టలు ఉతికి ఆరేసిన తర్వాత లాగు/చొక్కా పొడుగు చూసి ఎవరిదేదో గుర్తు పట్టేవాళ్ళం :)
మీ టైలరు గురించే అనుకుంటా ఈ మధ్య ఒక ఆడు వస్తుంది (మాస్టర్జీ నాన్న పాంటుని కొంచం కట్ చేయండి)!
ReplyDeleteRamachandra గారు,
ReplyDeleteఆంజనేయులు గారు మా కాలంలో 4A టీచర్. వారి భార్యయైన 1B టీచర్ గారు (కష్టపడి) నాకు అఆ ఇఈ లు నేర్పారు. నేను ఒకటి నుండి ఐదు తరగతుల వరకూ B section.
మా 5B వెంకటరత్నం మాస్టారు ఘోరమైన gender biased. ఆడపిల్లల పట్ల ఆప్యాయంగా, మగపిల్లల పట్ల చండశాసనుడిగా ఉండేవారు. ఆడపిల్లలు గొడవ చేసినా మాకు బెత్తంతో వడ్డించేవారు!
ఈ టపా నా శారదానికేతనం జ్ఞాపకాలకి అంకితం.
Zilebi గారు,
ReplyDeleteమీ కామెంట్ కోసమే ఎదురు చూస్తున్నాను.
నా పోస్టులకి మీ కామెంట్లు లేకపోతే నిండుదనం రాదు.
ధన్యవాదాలు.
Jai Gottimukkala గారు,
ReplyDeleteహ.. హ.. హా.. మా టైలర్ ఆంత హుషారు కాదు లేండి!
"మా టైలర్ ఆంత హుషారు కాదు లేండి!"
ReplyDeleteఅవును లెండి. ఆంత హుషారు ఉంటె ఉట్టి బాజీ బదులు సినీ ఫేం బాజీ అని advertise చేసుకొని మదరాసు వెళ్ళేవాడు. చిన్న పిల్లల లాగూలకంటే హీరోయిన్ల జాకెట్లు కుడితే ఎంతో డబ్బు, కలాపోసన.
ఒక సారి ఫేస్ బుక్ తెరిచి చూడండి. ప్లస్ లో మీ అభిమానులు ఒక పోస్ట్ పెట్టారు.
ReplyDelete@WitReal,
ReplyDeleteఅన్నదమ్ములందరికీ బ్యాండ్ మేళం డ్రెస్ లా ఒకే రకమైన దుస్తులు. గమ్మత్తుగా ఉండేది కదూ!
@Chandu S,
ReplyDeleteఇప్పుడే చూశాను. థాంక్యూ! కొటయ్య కొడుకు బొమ్మ చాలా బాగుంది!
రమణ గారూ,
ReplyDeleteమీ యింట్లో అన్నదమ్ములకి మాత్రమే నేమో, మా యింట్లో అయితే ఏకంగా కజిన్స్ అందరికీ ఒకే తాన్లో గుడ్డ, దాంతొ వయసు వారీగా బట్టలు! అంటే టీనేజర్స్ కి లంగా-ఓణీలూ, కొంచెం(మాలాటి) చిన్నపిల్లలకి స్కర్టులూ, ఇంకొంచెం చిన్న పిల్లలకి గౌనులూ, ఇంకా చిన్న పిల్లలకి జుబ్బాలూ,,,, అలాగన్నమాట.
ఇంతోటి కొత్త బట్టలకి మళ్ళీ మాకందరికీ "సాధనా" హెయిర్ కట్టింగు, గ్రూపు ఫోటోలూ. ఇప్పటికీ వాటిని చూసి విరగబడి నవ్వుకుంటాం.
శారద
అసలు మీరు మా అమ్మ దగ్గర పెరగాల్సిందండీ..ఇలాంటివి ఎన్ని రాసి ఉండేవారో.. మీరు చాలా నయం..మా అన్నయ్యలకు కాలేజీ కొచ్చినా పాంట్ ప్రాప్తం లేదు. "ఏవిట్రోయ్ పోయినేటికీ, ఈ ఏడుకూ ఏమంత పెరిగావనీ పాంటూ.. అమ్మాయిల ముందు వేషాలు వెయ్యడానికేగా."అని .కాలేజీ కెళ్ళేది జ్ఞాన సముపార్జనకే గానీ , గాలి వేషాలకు కాదని చెప్పి ఇంటర్ మొదటి సంవత్సరం లో ఆర్నెల్లు లాగుతోనే పంపించింది.
ReplyDelete@sbmurali2007,
ReplyDeleteశారద గారు,
ఇలా పిల్లలందరికీ బట్టలు ఒకే తానులోంచి కుట్టించడం పెద్దలకి పొదుపులో భాగం కావొచ్చు. కానీ.. ఇందులో గొప్ప డెమాక్రసీ కనిపిస్తుంది. హమారా భారత్ తరహాలో 'హమారా ఫ్యామిలి' భావం కూడా కలుగుతుంది.
హహహ నాకు మా ఇంట్లో ఉన్న బ్లాక్ & వైట్ ఫొటోలు చూస్తున్నట్టనిపించింది ఇది చదివితే. ఆ పెద్ద నిక్కర్లకి జారిపోకుండా రెండు బెల్టులు కూడా ఉండేవి కదండీ. భుజాం నుండీ వేలాడుతూ అవి నిక్కర్లకి తగిలించేవారు :))
ReplyDeleteమీకో చిన్న కానుక మరియు సర్ప్రైజ్...ఇక్కడ చూడండి.
ReplyDeletehttp://ramakantharao.blogspot.in/2012/04/blog-post.html
http://ramakantharao.blogspot.com/2012/04/blog-post.html
ReplyDeleteఆర్యా
వందనం
మీ బ్లాగుని అజ్ఞాతగా చదివేవారిలో నేను భీ ఒకణ్ణి.
కోటయ్యగారి పిల్లాడి బొమ్మని శ్రీ అన్వర్ గారిచే గీయించాను. పై లింకు అదే.
చూడ ప్రార్థన
శుభమ్
భాస్కర్
భాస్కర్ రామ రాజు గారు,
ReplyDeleteవెల్ డన్! చిత్రం సూపర్బ్!
చీర్స్
జిలేబి.
@Chandu S,
ReplyDeleteఏ కుర్రాడి చరిత్ర చూసినా
ఏమున్నది గర్వకారణం?
పిల్లల చరిత్ర సమస్తం
పెద్దల పీడన పరాయణత్వం!
రమణ గారు
ReplyDeleteనిజంగా మాటలు లేవు మీ టపా చదివిన తరువాత.
ఇంకిపోయిన జ్ఞాపకాలని మీ బ్లాగ్ జల్లులు తో తడి తడి గ లేపారు. అదే అమ్మ, అదే నాన్న, అదే టైలర్, అవే మాటలు, అవే జ్ఞాపకాలు.
మీకు చాల క్రతజ్నతలు.
: వెంకట కాశి
భాస్కర్ రామరాజు గారు,
ReplyDeleteవావ్! గ్రేట్! అన్వర్ గారు మన కోటయ్య కొడుకుని అద్భుతంగా గీశారు. మీరు దాన్ని ఒక టపాగా మలిచారు. చాలా సంతోషం. మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
ఈ బొమ్మని నా కథలో పొందుపరచవచ్చునా? అన్వర్ గారి అనుమతి తీసుకోవాలని ఉంది. మీకు అభ్యంతరం లేకపోతే అన్వర్ గారి మెయిల్ ఎడ్రెస్ నాకు మెయిల్ చెయ్యగలరు. థాంక్యూ!
ఆ.సౌమ్య గారు,
ReplyDeleteఈ సారి మీ ఇంట్లో b & w ఫొటోలు చూస్తున్నప్పుడు.. ఫొటోలోని పిల్లల లూజు దుస్తుల ఆత్మఘోష వినిపిస్తుందనుకుంటున్నాను.
వెంకట కాశి గారు,
ReplyDeleteథాంక్యూ!
నిరభ్యంతరంగా వాడుకోండి. మన బ్రాడీపేట మన పధ్నాలుగో అడ్డరోడ్డు మన ఓంకారక్షేత్రం మన రెండోలైను...అంతా మనే!! ఏసేస్కోండి!!
ReplyDeleteనాదీ అదే ఏరియాలేండి....మీ ఇస్కూల్ ఎనకమాల రాఘవేంద్రరావు మామ కాడ పిజిక్సు ట్యూషను సదివీ, ఓంకార క్షేత్రానికి రెండడుగులు ముందుకేసి మా మిత్రుడి ఇంట్లో షెటిలుకాకు ఆడి, ఈంకారక్షేత్రానికి అటైపు మూలన తాత బడ్డీకొట్టుకాడ సోడాతాగి...............అబ్బో ఇయన్నీ సెప్పాల్నంటే బల్లాగులు సాలవు..
అదన్నమాట ఇషయం
భాస్కర్ రామరాజు గారు,
ReplyDeleteథాంక్యూ!
రమణ గారూ,
ReplyDeleteఅబ్బో, నాలాంటోళ్ళు ఎంతమందో ఇక్కడ!
ఒక చిన్న విమర్శ.
"సగం కాలిన కట్టెలా ఉండే కోటయ్య"
ఇలాంటి ఉపమానాలు పేదవాళ్ళకే ఎందుకు? ఇది మీ తప్పు కాదు. సాధారణంగా రచయితలు అందరూ ఇలాగే వ్రాస్తారు. ఈ మధ్య కొత్తపాళీ గారు తెలుగు కధల్లో క్లిషేలు అని వ్రాసారు. ఇదీ అలాంటిదే అనుకుంటా.
bonagiri గారు,
ReplyDeleteనేను రావిశాస్త్రి వీరాభిమానిని. ఆయన సిమిలిలకి నేల క్లాసులోంచి విజిల్స్ వేసే దురభిమానిని. (మాట్లాడేప్పుడు కూడా ఉపమానాలు వాడటం నాకలవాటు. అదో సరదా!) ఐతే.. సాహిత్యంలో ఈ ధోరణిని నామిని కూడా తీవ్రంగా విమర్శించాడు.
>>ఇలాంటి ఉపమానాలు పేదవాళ్ళకే ఎందుకు?<<
నేనయితే గమనించలేదు. ఇప్పుడు ఆలోచిస్తున్నాను.
balegaaa undi not only blog post but also the comments and your response, both are organic whole. well done Ramana.
ReplyDelete@chandrasekhar,
ReplyDeletethank you Chandra!
Chala bagundi doctor...
ReplyDelete