Friday, 13 February 2015

డాక్టర్ కేశవరెడ్డి


ప్రముఖ తెలుగు రచయిత డాక్టర్ కేశవరెడ్డి ఇవ్వాల్టినుండి ఇకలేరు. ఆయన నాన్ హాడ్జికిన్స్ లింఫోమాతో ఇబ్బంది పడుతున్నారని తెలిసినప్పుడు, ఎక్కువ బాధ పడకుండా పోవాలని కోరుకున్నాను. మరణం ఎవరికైనా, ఎప్పటికైనా తప్పదు. నేనెప్పుడూ నాకు ఇష్టమైనవాళ్ళు హాయిగా, ప్రశాంతంగా వెళ్ళిపోవాలని కోరుకుంటూ వుంటాను. ఇది మీకు సిల్లీగా అనిపించొచ్చు. నాకు మాత్రం - ఐసియుల్లో మృత్యువుతో పోరాడే అభాగ్యుల్ని చూసినప్పుడు అలాగే అనిపిస్తుంటుంది.

ప్రపంచవ్యాప్తంగా రచనలు రకరకాలు. సరదా రచనలు, వ్యంగ్య రచనలు, వాస్తవిక రచనలు, అధివాస్తవిక రచనలు, అర్ధం కాని రచనలు, అర్ధం పర్ధం లేని రచనలు - ఇలా. తెలుగు సాహిత్యం చెప్పుకోదగ్గంత స్థాయిలో లేదనేది నా అభిప్రాయం. అందుక్కారణం - భారద్దేశంలో, అందునా తెలుగు దేశంలో అక్షరాస్యులు బహుకొద్ది. ఆ కొద్దిలో ఎక్కువమంది ఉద్యోగం కోసం ఉపయోగపడే చదువులకి పరిమితం. కాబట్టి - తెలుగులో సాహిత్యం చదివేవాళ్ళు అతి తక్కువ. ఆ తక్కువ్వాళ్ళల్లో పుస్తకం కొని చదివేవాళ్ళు మరీ తక్కువ. అందువల్ల మనకి పత్రికలు తక్కువ, పుస్తకాలు తక్కువ, పబ్లిషర్లు తక్కువ. కావున - (సహజంగానే) రచయితలకి దరిద్రం ఎక్కువ!

తెలుగులో అనేక రకాల రచనలు. వాటిలో ఎక్కువ రచనలు బజ్జీలు, పునుగులు పొట్లాలుగా కట్టుకోడానికి తప్ప ఇంకెందుకూ పనికిరావు. అతితక్కువ రచనలు మాత్రమే నాలుక్కాలాల పాటు భద్రంగా దాచుకోదగ్గవి. కొందరి రచనలు చదవడం బ్రాండెడ్ చికెన్ తిండంతో సమానం - తినేప్పుడు బాగుంటుంది కానీ, తిన్నాక కడుపు పాడవుతుంది! కేశవరెడ్డిది ఏ కేటగిరీయో ఆయా పాఠకులే నిర్ణయించుకోవాలి. 

నేను మాత్రం కేశవరెడ్డిని తెలుగు సాహిత్యంలో అత్యుత్తమ రచయితల్లో ఒకడిగా భావిస్తున్నాను. నా ఈ భావనకి కొన్ని దశాబ్దాల చరిత్ర వుంది. ఆయన అప్పుడెప్పుడో ఆంధ్రపత్రికలో సీరియల్‌గా రాసిన 'ఇన్‌క్రెడిబుల్ గాడెస్' చదివి (దళితుల జీవితం తెలీకపోవడం వల్ల అప్పుడు నాకు నవల సరీగ్గా అర్ధం కాలేదు) అర్జంటుగా కేశవరెడ్డి అభిమానిగా మారిపొయ్యాను.

గురజాడ అప్పారావు బ్రతికున్నప్పుడు - భవిష్యత్తరాలు తన రచనల గూర్చి (ఈ 'గూర్చి' పరిమాణంలో ఆయన రాసిన సాహిత్యం కన్నా ఎక్కువ) అంతకాలం మాట్లాడుకుంటారని ఆయనకి తెలీదు, తెలిసే అవకాశం లేదు. అలాగే కేశవరెడ్డి రచనలు కూడా వయసు ఎక్కువవుతున్న కొద్దీ (సింగిల్ మాల్ట్ విస్కీలాగా) మరింత ప్రాముఖ్యతని సంతరించుకుంటాయనే నమ్మకం నాకుంది.

ఇక్కడో అసందర్భ ప్రస్తావన! తెలుగులో ఆల్రెడీ కొందరు రచయితల్ని దేవుళ్ళుగా చేసేశాం, వారి రచనల్ని పవిత్ర గ్రంధాలుగానూ చేసేశాం. ఇది తెలుగుజాతి ఆయా రచయితలకి చేసిన ద్రోహంగానే నేను భావిస్తున్నాను. కేశవరెడ్డిని ఒక మంచి రచయితగా 'మాత్రమే' పరిగణిస్తూ, ఆయన్నెత్తిన కిరీటం పెట్టకుండా, మనిషిగా భూమ్మీదే నిలబెట్టి - విశ్లేషణాత్మక, వివరణాత్మక చర్చలు జరగాలనీ, అటువంటి వాతావరణం వుండాలనీ కోరుకుంటున్నాను.

అయ్యా కేశవరెడ్డిగారూ! మా తెలుగుజాతికి మీ వంతుగా గొప్పసాహిత్యాన్ని సృష్టించి (మా మొహాన కొట్టి) తాపీగా వెళ్ళిపొయ్యారు. అందుగ్గానూ - మీకు మేం మిక్కిలిగా ఋణపడిపొయ్యాం. తెలుగుజాతి ఏం చేసినా ఈ ఋణం తీరేది కాదు కావున - అదలా వుంచేసుకుంటాం!

అన్నట్లు - శ్రీశ్రీ, రావిశాస్త్రి మొదలైనవారు బోల్డన్ని సిగెరెట్లు తగలేస్తూ పైన మీకోసం ఎదురు చూస్తున్నారని అభిజ్ఞు వర్గాల భోగట్టా! వాళ్ళు మీతో చాలా విషయాలు మాట్లాడాల్ట! ఈ లోకంలో కన్నా పై లోకంలోనే మీకు మంచి కంపెనీ వుందబ్బా! ఎంజాయ్!!

(photo courtesy : Google)

Thursday, 5 February 2015

'థాంక్యూ స్వైన్ ఫ్లూ!'


'మనుషులంతా ఒక్కటే!' అంటూ అనాదిగా తెలుగు కవులు పాటలు రాస్తున్నారు. అవి చదివి - నిజమే కామోలనే భ్రమలో కొన్నాళ్ళపాటు వుండిపొయ్యాను. నాకీ భ్రమల ముసుగు తొలగిపోడానికి చాలా సమయం పట్టింది. ఇప్పుడైతే అటువంటి అబద్దాలు రాసిన కవుల్ని అర్జంటుగా జైల్లోకి తోసెయ్యాలనేది నా అభిప్రాయంగా వుంది!

అసలు సంగతేమనగా - జంతువుల్లో కుక్క, పంది అంటూ అనేక జాతులున్నట్లే మనిషిలోనూ అనేక జాతులున్నాయి. మనుషులందరూ ఒకేరకమైన అవయవ నిర్మాణం కలిగున్నప్పుడు ఈ జాతుల పోలిక కుదర్దని కొందరు యదార్ధవాదులు అనొచ్చు. అయితే వారికి నా సమాధానం ఒక్కటే - రామచిలక్కీ, గెద్దకీ ఒకే రకమైన ముక్కుంటుంది. ఒక ముక్కు జాంకాయల్నీ, సీతాఫలాల్ని గుచ్చితే - ఇంకోముక్కు మాంసాన్ని ఖండాలుగా చేస్తుంది. అంచేత - 'చూడ్డానికి ఒకేరకం' అన్న వాదన ఇక్కడ నిలబడదు!

'మనుషులంతా ఒక్కటే!' అనే వెర్రివాళ్ళు నిజాల్ని చూడరు, చూడలేరు, చూసినా చూడనట్లు నటిస్తారు. వారికి సున్నితమైన వేళ్ళతో సుకుమారంగా వీణ మీటే శంకరశాస్త్రిగారు, మురికి మొరటు వేళ్ళతో చెప్పులు కుట్టే మాదిగ ఓబులేసుగాడూ ఒకటే! పులిగోరు మారాజుగోరు, పులేషం పుల్లారావుగాడూ ఒకటే! మనుసుపడ్డదాని చిరునవ్వుల నగవు కోసం లక్షలు కుమ్మరించే రసికోత్తముడు, పండగపూట పెళ్ళానికి కొత్తకోకైనా కొన్లేని దరిద్ర నారాయణుడూ ఒకటే! ఎలాగవుతుంది? కాదు గదా! అంచేత - కవులు రాసే అభ్యుదయ బూజుని దులిపేసుకుని ఈ లోకాన్ని నా సొంత దృష్టితో పరికించడం మొదలెట్టాను. నా సత్వాన్యేషణలో - కొన్ని వాస్తవాలు చాలా తొందరగానే గుర్తించగలిగాను.

దరిద్రుడనగా ఎవరు? ఎండాకాలం నిప్పుల కొలిమిలో మలమలా మాడి చచ్చేవాడు దరిద్రుడు. కుండపోత వర్షపాతానికి నానినాని చింకి చచ్చేవాడు దరిద్రుడు. వరదల్లో చెత్తలాగా కొట్టుకుపొయ్యేవాడు దరిద్రుడు. ఈ సమాచారం మన జనరల్ నాలెడ్జ్ పుస్తకాల్లో వుండదు. ఎందుకంటే - విద్యార్ధులకి వాస్తవం తెలీడం ప్రభుత్వాలకి ఇష్టం వుండదు (తెలిసినచో వారి పసిహృదయం గాయపడును). కాబట్టి - ప్రకృతిక్కూడా దరిద్రుదంటేనే పగ అని నేను గ్రహించాను.

మంచివాళ్ళని దేవుడు తొందరగా తీసుకెళ్తాడని చెప్తారు. మంచివాళ్ళ సంగతేమో గానీ దరిద్రుల్ని మాత్రం దేవుడు తొందర తొందరగా, హడావుడి హడావుడిగా తీసుకెళ్తాడు. దరద్రుష్టం ఏమంటే - రోగాలక్కూడా వర్గదృక్పధం వుంది, రాజకీయాలున్నాయి! మెడికల్ మైక్రోబయాలజీలో పేరసైటాలజీ అనే సబ్జక్టొకటుంది. ఆ సబ్జక్టులో వుండే దాదాపు అన్ని రోగాలూ ఆఫ్రికా ఖండంలో వున్నాయి. అన్నీ కాకపోయినా - చాలా రోగాలు ఆసియా ఖండంలోనూ వున్నాయి. అందుకే వాళ్ళు ప్రతేడాది టైఫాయిడ్, మలేరియా, డయేరియా వంటి అతి సాధారణ వ్యాధుల్తో నల్లుల్లా చస్తుంటారు. రోగాలకి, రోగ కారక క్రిములకి జాగ్రఫీ తెలుసేమోనని నా అనుమానం! ఎందుకంటే - అమెరికాలోనూ, యూరప్‌లోనూ గుప్పెడంటే గుప్పెడు రోగాలు మాత్రమే వున్నాయి - అందుకని!

'మనుషులంతా ఒక్కటే'నా? కాకపోతే మానె - మరీ ఇంత ఘోరమైన తేడానా! ఈ స్పష్టమైన తారతమ్యం చూశాక నన్ను నిరాశ కమ్మేసింది. నా దురవస్థని గమనించిన పరమ నిష్టాగరిస్టుడైన నా స్నేహితుడు - ఎండిన డొక్కల గజ్జి కుక్కని ముద్దులొలికే బొద్దు బొచ్చుకుక్క చూసినట్లు ఎంతో జాలితో చూసి, మరెంతో దయతో ఒక సలహా ఇచ్చాడు - 'చావుపుట్టుకలు దైవాధీనం. నువ్వు దేవుణ్ని నమ్ము. నీ మనసులోని ఈ గజిబిజి ఆలోచనలు పోయి హాయిగా వుంటుంది'. నిజమే కామోలు - అలా చెప్పేప్పుడు అతని వదనం పరమ ప్రశాంతంగా వుంది!

నేనిలాంటి సందిగ్దావస్థలో కొట్టుమిట్టాడుతుండగా -

ఈమధ్య దేశంలోకి స్వైన్ ఫ్లూ వచ్చింది. మెరుపు లేని ఉరుములా, ఇంజన్ లేని గూడ్సు బండిలా - మెత్తగా, సుతిమెత్తగా నాగుపాము సరసరా జరజరా పాకినట్లుగా - నిశ్శబ్దంగా, అతి నిశ్శబ్దంగా వచ్చేసింది. ఈ ఫ్లూ జ్వరానికి ప్రజలంతా ఒణికి పోతున్నారు, చచ్చీ పోతున్నారు!

తరచి చూడగా - ఈ స్వైన్ ఫ్లూ వైరస్‌ ఎంత ప్రమాదకారో అంత మంచిదిగా తోస్తుంది! ఏలననగా - ఈ వైరస్‌కి అస్సలు క్లాస్ బయాస్ లేదు! వీడు ధనవంతుడనీ, వాడు గోచీపాతరగాడనీ రాజకీయ నాయకుళ్ళా లెక్కలేసుకోదు. చాలా ధర్మబద్ధంగా, ఎంతో ప్రజాస్వామ్యయుతంగా గంభీరంగా, ప్రేమగా, ఆప్యాయంగా దొరికినవాణ్ని దొరికినట్లు అక్కున చేర్చుకుంటుంది. కుదిర్తే ప్రాణం తీస్తుంది, కుదరకపోతే వెళ్లిపోతుంది!

ఈ స్వైన్ ఫ్లూ వైరస్‌కున్న ధర్మబుద్ధీ, ప్రజస్వామ్య స్పూర్తీ మన ప్రభుత్వాలక్కూడా వుండాలని ఆశిస్తున్నాను. ఏదో మాటవరసకి రాస్తున్నానే గానీ - మన ప్రభుత్వాలకి స్వైన్ ఫ్లూకున్నంతటి విశాల దృక్పధం వుండదని నాకు తెలుసు. అయితే - 'అగాధమౌ జలనిధిలోనా శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే' అన్న శ్రీశ్రీ పలుకుల్ని గుర్తు తెచ్చుకుంటూ - స్వైన్ ఫ్లూ చూపిన మార్గంలోనే మన సమాజం కూడా సమసమాజం వైపు (ఎప్పుడో ఒకప్పటికైనా) పురోగమిస్తుందనీ, మనకీ మంచిరోజులొస్తాయనే పాజిటివ్ నోట్‌తో ముగిస్తున్నాను.

ఈ ఆలోచనల్ని నాతో రాయించిన స్వైన్ ఫ్లూకి వైరస్‌కి కృతజ్ఞతలతో -

'థాంక్యూ స్వైన్ ఫ్లూ!' 

(photo courtesy : Google)

Monday, 2 February 2015

ఉపన్యాసాలకి మోసపోదామా?


"మొన్న ఒబామా ప్రసంగం విన్నావా? వినేప్పుడు భావోద్వేగంతో నా కళ్ళు చెమర్చాయి." అంటూ నా స్నేహితుడు కర్చీఫ్‌తో (మళ్ళీ) కళ్ళు తుడుచుకున్నాడు. అమెరికా అధ్యక్షుడంతటివాడు మన్దేశానికొచ్చి మనని తమతో సమానంగా కలుపేసుకుని మాట్లాడ్డం ఆయన ఉదారత, మన అదృష్టం! అంతటి గొప్ప ప్రసంగాన్ని విన్లేకపోడం నా దురదృష్టం!

ఈ లోకంలో సమస్త జీవరాసులూ భగవంతుని సృష్టేనని అంటారు! అది నల్లైనా, నక్కైనా! పులైనా, పిల్లైనా - ఏదైనా కావచ్చు. కావున - దేవుడు సృష్టించిన ఈ జీవరాసుల మంచిచెడ్డలు ఎంచి చూడ్డం సరికాదని విజ్ఞుల అభిప్రాయం. నేను విజ్ఞుణ్ని కాదు, నాకు పామంటే అసహ్యం. కారణం - ఒకపాము ఇంకో పాముని తింటుంది. నాకిది మిక్కిలి రోతగానూ, అన్యాయంగానూ తోస్తుంది. స్వజాతిని హననం చేసే ఏ జీవైనా అసహ్యించుకోదగ్గదని నేను భావిస్తాను.

నేను డిస్కవరీ, ఏనిమల్ ప్లానెట్ లాంటి టీవీ చానెళ్ళు చూడను, భయం! ఆలోచించగా - నాలో భయం కన్నా బాధే ఎక్కువగా వుందనిపిస్తుంది! పులులు గుంపుగా జింకల్ని తరుముతూ వేటాడ్డం, వాటి నోటబడిన ఆ జింకల నిస్సహాయ దృక్కులు - నా గుండెని కలచివేస్తాయి. దేవుడు పాపుల్ని మాత్రమే శిక్షిస్తాడని విన్నాను. మరి - జింకలు చేసే పాపం ఏమిటి? అవెందుకలా కౄరంగా చంపబడతున్నాయ్?

(ఓయీ అజ్ఞానీ! భగవంతుని సృష్టిరహస్యాల్ని మిడిమిడి జ్ఞానంతో ప్రశ్నించరాదు. ఆయా జంతువులు తమ పూర్వజన్మ సుకృతం వల్లనో, వికృతం వల్లనో ఆ విధంగా చావాలని బ్రహ్మదేవుడు ముందే రాసిపెట్టాడు. కాదనుటకు నువ్వెవరివి? ఇవన్నీ సృష్టి రహస్యాలు! నీకిష్టం లేపోతే టీవీ చూడ్డం మానెయ్, అంతేగానీ అధిక ప్రసంగం చెయ్యకు!)

ఈ ప్రపంచంలో అమాయకులు, అర్భకులు, పేదవారు తమ తప్పేమీ లేకుండానే - నిప్పులు కురిపించే కాలనాగులు కూడా సిగ్గు పడేంత కర్కశత్వం వల్లా, అగ్నిపర్వతాల్ని సైతం బ్రద్దలు కొట్టే కౄరత్వం వల్లా - రోజువారిగా, గంటలవారిగా, నిమిషాలవారిగా నిస్సహాయంగా బలైపోతున్నారు, మలమలా మాడిపోతున్నారు! ఇదీ సృష్టిరహస్యమేనా?

జింకపిల్ల పీక కొరికే ముందు పులి ప్రార్ధన చెయ్యవచ్చు గాక! అంతమాత్రము చేత ఆ పులిని మానవతావాదిగా నీవు భ్రమింపరాదు! అది కేవలం దొంగ ప్రార్ధన మాత్రమే! ఆ ప్రార్ధన - ఆకాశాన్ని చీల్చుకుంటూ వచ్చిన పిడుగు ఫెడేల్మంటూ నెత్తిన పడేముందు కళ్ళు మిరుమిట్లు గొలిపే మెరుపు వంటిది మాత్రమే! ప్రార్ధనలు, ప్రవచనాలు మనసుని ప్రశాంతంగా వుంచగలిగేట్లైతే ఈ లోకంలో ఇంతటి దుర్మార్గాలు వుండకపోను! ఇదంతా కేవలం తెరముందు కనిపించే నాటకం మాత్రమే!

'అధ్యక్షా! చమురు కోసం మీరు ఇన్నేసి యుద్ధాలు చేయనేల? మీ ఆయుధ కంపెనీల ప్రయోజనాల కోసం మేమెందుకు కొట్టుకు చావాలి? మీకు పనికిరాని ఆయుధాలు మాకు మాత్రం ఎందుకు?' మొదలైన ప్రశ్నలు మనం అడగరాదు. ఎందుకనగా - అదికూడా సృష్టి రహస్యమే! అక్కడ దేవుడు అన్యాయం చేశాడు, ఇక్కడ అగ్రరాజ్యంగారు అన్యాయం చేస్తున్నారు (అన్యాయం మాత్రం కామన్).

ఇక్కడంతా మోసపు ముసుగులే! అందరూ వంచనా శిల్పులే! అందమైన ఈ ప్రపంచాన్ని పెంటపెంట చేసిన హిట్లర్ అంటే నాకసహ్యం (హిట్లర్‌గాణ్ని అసహ్యించుకోనివాళ్ళన్నా కూడా నాకసహ్యం). ఎందుకంటే - హిట్లర్ చాలా కమిటెడ్ హంతకుడు, గోబెల్స్‌ హిట్లర్‌కి చాలా కమిటెడ్ అనుచరుడు. ఇవ్వాళ హిట్లర్, గోబెల్స్‌గాళ్ళ కమిట్‌మెంట్‌కి అబ్బురపడే ప్రబుద్ధులు తయారయ్యారు!

రెండో ప్రపంచ యుద్ధంలో లక్షలమంది యూదుల్ని చంపడానికి హిట్లర్ చాలా తిప్పలు పడాల్సొచ్చింది. అమెరికావాడు ఒక్క అణుబాంబుతో చులాగ్గా లక్షలాదిమందిని లేపేశాడు. హిట్లర్ అమానుష నేరాలకి జర్మనీ జాతి భారీమూల్యాన్నే చెల్లించుకుంది. కానీ - పెర్ల్ హార్బర్ దాడికి ప్రతీకారంగా అమాయకులైన జపాన్ సంతతిని దారుణంగా జైళ్ళల్లో కుక్కిన రూజ్‌వెల్ట్‌ నేరానిగ్గానీ, అణుబాంబుని జనావాస పట్టణాలపై వేయించిన హేరీ ట్రూమన్ నేరానిగ్గానీ శిక్ష పడ్డట్టు నాకు తెలీదు. ఇవన్నీ సృష్టి రహస్యాలు - మనం ప్రశ్నించరాదు!

అటుతర్వాత అమెరికా కులాసాగా వియత్నాంలో యుద్ధం చేసుకుంది. అలా - ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అమెరికా ఎన్నో దేశాలపై యుద్ధం చేస్తూనే వుంది (ఈ లిస్టు పెద్దది). పాపం అమెరికా! లోకకల్యాణం కోసం బాధతో, దుఃఖంతో, తప్పనిసరి పరిస్థితుల్లో పళ్ళ బిగువున యుద్ధాలు చెయ్యాల్సొస్తుంది! కానీ - వారికెందుకో క్రూరమైన సౌదీ అరేబియా రాచరికం మాత్రం పరమ పవిత్రం. ఇది కూడా సృష్టి రహస్యమే!

ఇవన్నీ రక్తచరిత్రలు. ఫక్తు ఫ్యాక్షనిస్టు రాజకీయాలు. పులి చంపిన లేడి నెత్తురు చిక్కగా, వెచ్చగా సింగిల్ మాల్ట్ విస్కీలా గొంతులో జారుతుండగా - అర్ధ నిమీలి నేత్రాలతో పులిగారు నీతులు చెప్పబూనడం వినేవాళ్ళకి బాగానే వుండొచ్చు. ఆ స్వరం వెనుక దాగున్న రాయిలాంటి హృదయం కనిపించకపోవచ్చు. అందుకే ఆ నీతులు నా స్నేహితుడిలాంటివారి చేత కన్నీరు కార్పించవచ్చు.

ఇప్పుడు చైనా చాలా వేగంగా ముందుకెళ్తుందనీ, చైనా భయం అమెరికాని వణికిస్తుందనీ, అందుకే అమెరికా తన వ్యాపార ప్రయోజనాల నిమిత్తం భారత మార్కెట్ కోసం ఆత్ర పడుతుందని ప్రపంచ రాజకీయాల్ని మాట్లాడే నా స్నేహితుడు చెబుతుంటాడు. అంటే - అధ్యక్షులవారు ఎంత తియ్యగా మాట్లాడినప్పటికీ - అది వ్యాపార ప్రయోజనం తప్ప మరేదీ కాదన్న మాట! అవును - ఆయనకి ఓట్లేసి గెలిపించుకుంది అమెరికా పౌరులు కాని భారత పౌరులు కాదు గదా! మరప్పుడు నా మిత్రుడికి ఉద్వేగం ఎందుకు!?

ప్రపంచానికిప్పుడు చైనా అనే కొత్త విలన్‌గాడు చాప కింద నీరులా విస్తరిస్తున్నాడన్నమాట! వీడి చరిత్రా హీనమే - తియనాన్మెన్ మారణ కాండ గుర్తుంది కదూ! నాకీ ప్రపంచ రాజకీయాల కన్నా పురాణాలే నయమనిపిస్తుంది. పురాణాల్లో రకరకాల రాక్షసులు చివరాకరికి విష్ణుమూర్తి అవతారాల చేతిలో వధించబడతారు. కానీ - రాజకీయాల్లో మాత్రం రాక్షసుల్దే రాజ్యం! రక్షిస్తామని చెప్పేవాడు కూడా - విష్ణుమూర్తి మాస్కుతో వచ్చే డ్రామా కంపెనీవాడే అయ్యుంటాడు గానీ - నిజమైన దేవుడు కాడు! ఇవన్నీ సృష్టి రహస్యాలు! మనం ప్రశ్నించరాదు!

రాక్షసులు నల్లటి చర్మం, చింపిరిజుట్టు, కోరమీసం, బానకడుపుల్తో చూడ్డానికి భయంకరంగానూ, అసహ్యంగానూ వుంటారు. పులులకి పచ్చని చర్మంపై నల్లని చారలుంటాయి, నోట్లో పదునైన కోరలుంటాయి. మనమీ శత్రువుల్ని తేలిగ్గానే గుర్తు పట్టేస్తాం. కానీ - ఈ ఆధునిక ప్రపంచంలో రాక్షసులు, పులులు కూడా టిప్‌టాప్‌గా దర్జాగా విమానాల్లో తిరుగుతుంటారు. మెత్తగా, తియ్యగా, మృదువుగా కబుర్లు చెబుతుంటారు. వాడు మన శత్రువో, మిత్రుడో అర్ధం చేసుకోడం కష్టం!

ఉపన్యాసం ఒక కళ. ఉపన్యాస కళాకారులకి పద్మ ఎవార్డులిచ్చి గౌరవించుకునే సంస్కృతి మనది! చక్కగా ఉపన్యసించేవారి కబుర్లు నిజమనుకుని మురిసిపొయ్యేవారికి నా సానుభూతి. నేనైతే - ఆ కబుర్లు చెప్పేవాడి గతచరిత్ర, వర్తమాన ఆచరణ అన్నీ గమనించాలంటాను. అప్రమత్తంగా లేకపోతే - హంతకుడు అహింస గూర్చి, దుర్మార్గుడు మంచితనం గూర్చి ఉపన్యాసం ఇస్తారు. నక్కలు నిజాయితీ గూర్చి, సింహం శాకాహారం గూర్చి పాఠాలు చెబ్తాయి! అంచేత - మనం ఉపన్యాసాలకి మోసపోరాదు! తస్మాత్ జాగ్రత్త!!

(picture courtesy : Google)