Thursday, 5 February 2015

'థాంక్యూ స్వైన్ ఫ్లూ!'


'మనుషులంతా ఒక్కటే!' అంటూ అనాదిగా తెలుగు కవులు పాటలు రాస్తున్నారు. అవి చదివి - నిజమే కామోలనే భ్రమలో కొన్నాళ్ళపాటు వుండిపొయ్యాను. నాకీ భ్రమల ముసుగు తొలగిపోడానికి చాలా సమయం పట్టింది. ఇప్పుడైతే అటువంటి అబద్దాలు రాసిన కవుల్ని అర్జంటుగా జైల్లోకి తోసెయ్యాలనేది నా అభిప్రాయంగా వుంది!

అసలు సంగతేమనగా - జంతువుల్లో కుక్క, పంది అంటూ అనేక జాతులున్నట్లే మనిషిలోనూ అనేక జాతులున్నాయి. మనుషులందరూ ఒకేరకమైన అవయవ నిర్మాణం కలిగున్నప్పుడు ఈ జాతుల పోలిక కుదర్దని కొందరు యదార్ధవాదులు అనొచ్చు. అయితే వారికి నా సమాధానం ఒక్కటే - రామచిలక్కీ, గెద్దకీ ఒకే రకమైన ముక్కుంటుంది. ఒక ముక్కు జాంకాయల్నీ, సీతాఫలాల్ని గుచ్చితే - ఇంకోముక్కు మాంసాన్ని ఖండాలుగా చేస్తుంది. అంచేత - 'చూడ్డానికి ఒకేరకం' అన్న వాదన ఇక్కడ నిలబడదు!

'మనుషులంతా ఒక్కటే!' అనే వెర్రివాళ్ళు నిజాల్ని చూడరు, చూడలేరు, చూసినా చూడనట్లు నటిస్తారు. వారికి సున్నితమైన వేళ్ళతో సుకుమారంగా వీణ మీటే శంకరశాస్త్రిగారు, మురికి మొరటు వేళ్ళతో చెప్పులు కుట్టే మాదిగ ఓబులేసుగాడూ ఒకటే! పులిగోరు మారాజుగోరు, పులేషం పుల్లారావుగాడూ ఒకటే! మనుసుపడ్డదాని చిరునవ్వుల నగవు కోసం లక్షలు కుమ్మరించే రసికోత్తముడు, పండగపూట పెళ్ళానికి కొత్తకోకైనా కొన్లేని దరిద్ర నారాయణుడూ ఒకటే! ఎలాగవుతుంది? కాదు గదా! అంచేత - కవులు రాసే అభ్యుదయ బూజుని దులిపేసుకుని ఈ లోకాన్ని నా సొంత దృష్టితో పరికించడం మొదలెట్టాను. నా సత్వాన్యేషణలో - కొన్ని వాస్తవాలు చాలా తొందరగానే గుర్తించగలిగాను.

దరిద్రుడనగా ఎవరు? ఎండాకాలం నిప్పుల కొలిమిలో మలమలా మాడి చచ్చేవాడు దరిద్రుడు. కుండపోత వర్షపాతానికి నానినాని చింకి చచ్చేవాడు దరిద్రుడు. వరదల్లో చెత్తలాగా కొట్టుకుపొయ్యేవాడు దరిద్రుడు. ఈ సమాచారం మన జనరల్ నాలెడ్జ్ పుస్తకాల్లో వుండదు. ఎందుకంటే - విద్యార్ధులకి వాస్తవం తెలీడం ప్రభుత్వాలకి ఇష్టం వుండదు (తెలిసినచో వారి పసిహృదయం గాయపడును). కాబట్టి - ప్రకృతిక్కూడా దరిద్రుదంటేనే పగ అని నేను గ్రహించాను.

మంచివాళ్ళని దేవుడు తొందరగా తీసుకెళ్తాడని చెప్తారు. మంచివాళ్ళ సంగతేమో గానీ దరిద్రుల్ని మాత్రం దేవుడు తొందర తొందరగా, హడావుడి హడావుడిగా తీసుకెళ్తాడు. దరద్రుష్టం ఏమంటే - రోగాలక్కూడా వర్గదృక్పధం వుంది, రాజకీయాలున్నాయి! మెడికల్ మైక్రోబయాలజీలో పేరసైటాలజీ అనే సబ్జక్టొకటుంది. ఆ సబ్జక్టులో వుండే దాదాపు అన్ని రోగాలూ ఆఫ్రికా ఖండంలో వున్నాయి. అన్నీ కాకపోయినా - చాలా రోగాలు ఆసియా ఖండంలోనూ వున్నాయి. అందుకే వాళ్ళు ప్రతేడాది టైఫాయిడ్, మలేరియా, డయేరియా వంటి అతి సాధారణ వ్యాధుల్తో నల్లుల్లా చస్తుంటారు. రోగాలకి, రోగ కారక క్రిములకి జాగ్రఫీ తెలుసేమోనని నా అనుమానం! ఎందుకంటే - అమెరికాలోనూ, యూరప్‌లోనూ గుప్పెడంటే గుప్పెడు రోగాలు మాత్రమే వున్నాయి - అందుకని!

'మనుషులంతా ఒక్కటే'నా? కాకపోతే మానె - మరీ ఇంత ఘోరమైన తేడానా! ఈ స్పష్టమైన తారతమ్యం చూశాక నన్ను నిరాశ కమ్మేసింది. నా దురవస్థని గమనించిన పరమ నిష్టాగరిస్టుడైన నా స్నేహితుడు - ఎండిన డొక్కల గజ్జి కుక్కని ముద్దులొలికే బొద్దు బొచ్చుకుక్క చూసినట్లు ఎంతో జాలితో చూసి, మరెంతో దయతో ఒక సలహా ఇచ్చాడు - 'చావుపుట్టుకలు దైవాధీనం. నువ్వు దేవుణ్ని నమ్ము. నీ మనసులోని ఈ గజిబిజి ఆలోచనలు పోయి హాయిగా వుంటుంది'. నిజమే కామోలు - అలా చెప్పేప్పుడు అతని వదనం పరమ ప్రశాంతంగా వుంది!

నేనిలాంటి సందిగ్దావస్థలో కొట్టుమిట్టాడుతుండగా -

ఈమధ్య దేశంలోకి స్వైన్ ఫ్లూ వచ్చింది. మెరుపు లేని ఉరుములా, ఇంజన్ లేని గూడ్సు బండిలా - మెత్తగా, సుతిమెత్తగా నాగుపాము సరసరా జరజరా పాకినట్లుగా - నిశ్శబ్దంగా, అతి నిశ్శబ్దంగా వచ్చేసింది. ఈ ఫ్లూ జ్వరానికి ప్రజలంతా ఒణికి పోతున్నారు, చచ్చీ పోతున్నారు!

తరచి చూడగా - ఈ స్వైన్ ఫ్లూ వైరస్‌ ఎంత ప్రమాదకారో అంత మంచిదిగా తోస్తుంది! ఏలననగా - ఈ వైరస్‌కి అస్సలు క్లాస్ బయాస్ లేదు! వీడు ధనవంతుడనీ, వాడు గోచీపాతరగాడనీ రాజకీయ నాయకుళ్ళా లెక్కలేసుకోదు. చాలా ధర్మబద్ధంగా, ఎంతో ప్రజాస్వామ్యయుతంగా గంభీరంగా, ప్రేమగా, ఆప్యాయంగా దొరికినవాణ్ని దొరికినట్లు అక్కున చేర్చుకుంటుంది. కుదిర్తే ప్రాణం తీస్తుంది, కుదరకపోతే వెళ్లిపోతుంది!

ఈ స్వైన్ ఫ్లూ వైరస్‌కున్న ధర్మబుద్ధీ, ప్రజస్వామ్య స్పూర్తీ మన ప్రభుత్వాలక్కూడా వుండాలని ఆశిస్తున్నాను. ఏదో మాటవరసకి రాస్తున్నానే గానీ - మన ప్రభుత్వాలకి స్వైన్ ఫ్లూకున్నంతటి విశాల దృక్పధం వుండదని నాకు తెలుసు. అయితే - 'అగాధమౌ జలనిధిలోనా శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే' అన్న శ్రీశ్రీ పలుకుల్ని గుర్తు తెచ్చుకుంటూ - స్వైన్ ఫ్లూ చూపిన మార్గంలోనే మన సమాజం కూడా సమసమాజం వైపు (ఎప్పుడో ఒకప్పటికైనా) పురోగమిస్తుందనీ, మనకీ మంచిరోజులొస్తాయనే పాజిటివ్ నోట్‌తో ముగిస్తున్నాను.

ఈ ఆలోచనల్ని నాతో రాయించిన స్వైన్ ఫ్లూకి వైరస్‌కి కృతజ్ఞతలతో -

'థాంక్యూ స్వైన్ ఫ్లూ!' 

(photo courtesy : Google)

11 comments:

  1. ఏ మన్నారు, ఏమన్నారు? స్వైన్ ప్లూకి వర్గ స్వబావం లేదా? ఇప్పుడు ఎవరికి స్వైన్ ప్లూ వచ్చిందని? ఉండాలసినోల్లంతా బాగానే ఉన్నారుగా?
    మనుషులంతా ఒక్కటంటం దేవుడుకూడా ఒప్పుకోడు. దేవుడికి కూడా వర్గ స్వభావం ఉంది. దరిద్రుడికి ఎప్పుడు సాహాయం చేయడు. ఆయనకు కానుకలు చెల్లించుకొనే వారికే. కాక పోతే కానుక విలువను బట్టి సహాయం చేస్తాడేమో ! మరిన్ని కానుకలిచ్చినవారికి మరింత సహాయం, చిన్న కానుకలిచ్చిన వారికి చిన్న సహాయం. అలాంటప్పుడు స్వైన్ ప్లూ కూడా మురికి కొంపల్లో గాలిలో పాకి నట్లు ఏసి గదుల్లోకి వెల్ల లేదుగదా? :) :)

    ReplyDelete

  2. వస్తున్నా ! వస్తున్నా! గుంటూరు వస్తున్నా ! 'డాటేరు' బాబులకు పని బెట్ట డానికి !!

    చీర్స్
    'స్వైన్మణీ' !

    ReplyDelete
  3. పదిలంగా కుళ్ళి కాల్వలు బాహాటమున ఏరులై పారగా
    ‘పంది జలుబు’ పది తలలవానిగా వికటాట్టహాసంబు చేయగా
    పదికాలముల పాటు ఉచ్చ భారతము ఏరులై దారిలో పారగా
    పదవవిలోనున్న చంద్రులు, శతాబ్దము మనదేనని పేలేరు పిచ్చిగా

    ReplyDelete
  4. ....ఆణిముత్యమున్నటులే...
    You are taking away even that small hope!
    స్వైన్ ఫ్లూ అంత డెమొక్రాటికేం కాదు. ఇది పేద వాళ్ళని, మైనారిటీస్ ని ఎక్కువగా హాస్పిటలైజ్ చేస్తుంది/చంపుతుంది.
    http://www.cdc.gov/h1n1flu/race_ethnicity_qa.htm
    http://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC3020202/
    బి.ఎస్.ఆర్

    ReplyDelete
    Replies
    1. డాక్టరుగారూ, ఈ అంటురోగాల విషయంలో ముఖ్యంగా రెండు కారణాలవలన ఆర్థికంగానో సామాజికంగానో వెనుకబడిన వర్గాలవారు వాటికి గురవటం జరుగుతున్నది. ముదటిది పరిశుభ్రమైన వాతావరణంలో జీవించటానికి వారికి తరచుగా వీలుకాకపోవటం. రెండవది అక్షరాస్యతలో అసమతుల్యత, ప్రభుత్వసామాజికకార్యక్రమాలప్రయోజనాలు వారికి తక్కువగా చేరటం కారణంగా అవగాహనాలోపాలు మిక్కుటంగా ఉండటం. ఇటువంటి కారణాలవలన వారు హెచ్చుగా జబ్బుపడటాన్ని మినహాయిస్తే, అంటురోగాలకు మనుష్యుల స్థితిగతులతో సంబధం ఉంటుందనిపించదు. ఈ స్వైన్ ఫ్లూ అనేది హాస్పిటల్స్‌లో వైద్యసిబ్బందికీ సోకుతున్న గాథలు వార్తామాథ్యమాల్లో చూస్తూనే ఉన్నాం కదా. అలాగే అంతో ఇంతో చదువుకున్న వారే బాధ్యతారహితంగా తమకు ఈ వ్యాధిసోకినా సరైన వైద్యం చేయించుకోకుండా ప్రయాణాలు చేయటమూ గమనిస్తున్నాం.

      Delete
    2. శ్యామలీయం గారు, మీరు చెప్పింది కరక్టే. కాని, పేదరికం, జనాభా సాంద్రత, పరిసుభ్రత, విద్యా స్థాయి లాంటి కారకాలు పక్కన పెట్టినా, కొన్ని అంటు వ్యాధుల తీవ్రత, మరణాల రేటు జాతి ని బట్టి, శరీర తీరు ని బట్టి, జీన్స్ ని బట్టి కూడా ఉంటాయి. ఉదాహరణ కి, అమెరికా లో ఏషియన్స్ తెల్ల వాళ్ళ కంటే ఎక్కువ రేటులో హాస్పిటలైజ్ అవుతారు స్వైన్ ఫ్లూ కి, కాని, వాళ్ళ మోర్టాలిటీ తెల్ల వాళ్ళ కన్న చాలా తక్కువ.
      https://lifescienceexplore.wordpress.com/2014/01/17/some-ethnic-groups-more-susceptible-to-h7n9-bird-flu/
      http://www.theguardian.com/world/2009/aug/30/swine-flu-obesity-link
      http://articles.latimes.com/2010/jan/15/local/la-me-h1n1-stats15-2010jan15

      Delete
    3. డాక్టరుగారు, కొంతలోకొంత genetic predisposition ఆన్నది కూడా తప్పకుండా ఒక ముఖమైన risk factor. నిజమే. ఒక ప్రాంతంలో బహుతరాలుగా నివసిస్తున్నవారిలో అనువంశిక జన్యులక్షణాలలోని మార్పులు వారికి కొన్ని విధాలుగా రోగనిరోధకశక్తిని అందిస్తాయి కొన్నికొన్ని వైరస్‌ల వంటి బారినుండి. కారణం అర్థం చేసుకోవటంలో చిక్కు ఏమీ లేదు. ఐతే, అంతకన్నా తక్కువతరాలుగా అక్కడ నివాసం ఏర్పాటుచేసుకున్న జాతుల ప్రజల్లో అటువంటి విషయాల్లో తగిన నిరోధకశక్తులు ఇంకా సన్నధ్ధం కాకపోవటం వలన అటువంటి వారికి ఇబ్బంది హెచ్చు. తెల్లవారికన్నా నల్లవారు తరువాతి కాలంలో వెళ్ళారు. ఆ మానవజాతుల శరీరాలు వేరేవేరే శీతోష్ణమండలాలకు చెందినవి. అందువల్ల చల్లని వాతావరణంలో పెరిగే వైరస్‌ల ప్రభావాన్ని తట్టుకునే‌శక్తి తెల్లవారికి అధికంగా ఉండటం జరుగుతోందని నా అభిప్రాయం. పైగా జీవనపరిస్థితుల్లోని అసమతుల్యతల కారణంగా నల్లవారు మరింతగా అటువంటి వ్యాధులకు సులభంగా గురికావటం జరుగుతున్నది.

      Delete
  5. I don't want to prolong this discussion much, but, suffice to say that the modes of infectious disease transmission, morbidity and mortality are complex and are governed by multiple factors including genetic predisposition. Many of the flu viruses actually originate in tropical areas - East and South East Asia. So, the cold weather acclimatization theory cannot explain this. Contrary to expectation, the incidence of flu in the US is much greater in the warmer Southern states compared to colder North Eastern states among all races. I too like simple explanations, but, epidemiology of diseases is not that simple unfortunately.

    ReplyDelete
  6. This comment has been removed by the author.

    ReplyDelete
  7. మొత్తానికి స్వైన్-ఫ్లూ వల్లా మంచి ఉందన్నమాట.
    రోగాల విషయంలో రకరకాల పద్ధతులున్నాయి.
    షుగర్ జబ్బు గతంలో ధనలంతులకే వచ్చేది....ఇపుడు అందరికీ వస్తోంది. బీపీ కూడా అంతే.

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.