"మొన్న ఒబామా ప్రసంగం విన్నావా? వినేప్పుడు భావోద్వేగంతో నా కళ్ళు చెమర్చాయి." అంటూ నా స్నేహితుడు కర్చీఫ్‌తో (మళ్ళీ) కళ్ళు తుడుచుకున్నాడు. అమెరికా అధ్యక్షుడంతటివాడు మన్దేశానికొచ్చి మనని తమతో సమానంగా కలుపేసుకుని మాట్లాడ్డం ఆయన ఉదారత, మన అదృష్టం! అంతటి గొప్ప ప్రసంగాన్ని విన్లేకపోడం నా దురదృష్టం!
ఈ లోకంలో సమస్త జీవరాసులూ భగవంతుని సృష్టేనని అంటారు! అది నల్లైనా, నక్కైనా! పులైనా, పిల్లైనా - ఏదైనా కావచ్చు. కావున - దేవుడు సృష్టించిన ఈ జీవరాసుల మంచిచెడ్డలు ఎంచి చూడ్డం సరికాదని విజ్ఞుల అభిప్రాయం. నేను విజ్ఞుణ్ని కాదు, నాకు పామంటే అసహ్యం. కారణం - ఒకపాము ఇంకో పాముని తింటుంది. నాకిది మిక్కిలి రోతగానూ, అన్యాయంగానూ తోస్తుంది. స్వజాతిని హననం చేసే ఏ జీవైనా అసహ్యించుకోదగ్గదని నేను భావిస్తాను.
నేను డిస్కవరీ, ఏనిమల్ ప్లానెట్ లాంటి టీవీ చానెళ్ళు చూడను, భయం! ఆలోచించగా - నాలో భయం కన్నా బాధే ఎక్కువగా వుందనిపిస్తుంది! పులులు గుంపుగా జింకల్ని తరుముతూ వేటాడ్డం, వాటి నోటబడిన ఆ జింకల నిస్సహాయ దృక్కులు - నా గుండెని కలచివేస్తాయి. దేవుడు పాపుల్ని మాత్రమే శిక్షిస్తాడని విన్నాను. మరి - జింకలు చేసే పాపం ఏమిటి? అవెందుకలా కౄరంగా చంపబడతున్నాయ్?
(ఓయీ అజ్ఞానీ! భగవంతుని సృష్టిరహస్యాల్ని మిడిమిడి జ్ఞానంతో ప్రశ్నించరాదు. ఆయా జంతువులు తమ పూర్వజన్మ సుకృతం వల్లనో, వికృతం వల్లనో ఆ విధంగా చావాలని బ్రహ్మదేవుడు ముందే రాసిపెట్టాడు. కాదనుటకు నువ్వెవరివి? ఇవన్నీ సృష్టి రహస్యాలు! నీకిష్టం లేపోతే టీవీ చూడ్డం మానెయ్, అంతేగానీ అధిక ప్రసంగం చెయ్యకు!)
ఈ ప్రపంచంలో అమాయకులు, అర్భకులు, పేదవారు తమ తప్పేమీ లేకుండానే - నిప్పులు కురిపించే కాలనాగులు కూడా సిగ్గు పడేంత కర్కశత్వం వల్లా, అగ్నిపర్వతాల్ని సైతం బ్రద్దలు కొట్టే కౄరత్వం వల్లా - రోజువారిగా, గంటలవారిగా, నిమిషాలవారిగా నిస్సహాయంగా బలైపోతున్నారు, మలమలా మాడిపోతున్నారు! ఇదీ సృష్టిరహస్యమేనా?
జింకపిల్ల పీక కొరికే ముందు పులి ప్రార్ధన చెయ్యవచ్చు గాక! అంతమాత్రము చేత ఆ పులిని మానవతావాదిగా నీవు భ్రమింపరాదు! అది కేవలం దొంగ ప్రార్ధన మాత్రమే! ఆ ప్రార్ధన - ఆకాశాన్ని చీల్చుకుంటూ వచ్చిన పిడుగు ఫెడేల్మంటూ నెత్తిన పడేముందు కళ్ళు మిరుమిట్లు గొలిపే మెరుపు వంటిది మాత్రమే! ప్రార్ధనలు, ప్రవచనాలు మనసుని ప్రశాంతంగా వుంచగలిగేట్లైతే ఈ లోకంలో ఇంతటి దుర్మార్గాలు వుండకపోను! ఇదంతా కేవలం తెరముందు కనిపించే నాటకం మాత్రమే!
'అధ్యక్షా! చమురు కోసం మీరు ఇన్నేసి యుద్ధాలు చేయనేల? మీ ఆయుధ కంపెనీల ప్రయోజనాల కోసం మేమెందుకు కొట్టుకు చావాలి? మీకు పనికిరాని ఆయుధాలు మాకు మాత్రం ఎందుకు?' మొదలైన ప్రశ్నలు మనం అడగరాదు. ఎందుకనగా - అదికూడా సృష్టి రహస్యమే! అక్కడ దేవుడు అన్యాయం చేశాడు, ఇక్కడ అగ్రరాజ్యంగారు అన్యాయం చేస్తున్నారు (అన్యాయం మాత్రం కామన్).
ఇక్కడంతా మోసపు ముసుగులే! అందరూ వంచనా శిల్పులే! అందమైన ఈ ప్రపంచాన్ని పెంటపెంట చేసిన హిట్లర్ అంటే నాకసహ్యం (హిట్లర్‌గాణ్ని అసహ్యించుకోనివాళ్ళన్నా కూడా నాకసహ్యం). ఎందుకంటే - హిట్లర్ చాలా కమిటెడ్ హంతకుడు, గోబెల్స్ హిట్లర్‌కి చాలా కమిటెడ్ అనుచరుడు. ఇవ్వాళ హిట్లర్, గోబెల్స్‌గాళ్ళ కమిట్‌మెంట్‌కి అబ్బురపడే ప్రబుద్ధులు తయారయ్యారు!
రెండో ప్రపంచ యుద్ధంలో లక్షలమంది యూదుల్ని చంపడానికి హిట్లర్ చాలా తిప్పలు పడాల్సొచ్చింది. అమెరికావాడు ఒక్క అణుబాంబుతో చులాగ్గా లక్షలాదిమందిని లేపేశాడు. హిట్లర్ అమానుష నేరాలకి జర్మనీ జాతి భారీమూల్యాన్నే చెల్లించుకుంది. కానీ - పెర్ల్ హార్బర్ దాడికి ప్రతీకారంగా అమాయకులైన జపాన్ సంతతిని దారుణంగా జైళ్ళల్లో కుక్కిన రూజ్‌వెల్ట్ నేరానిగ్గానీ, అణుబాంబుని జనావాస పట్టణాలపై వేయించిన హేరీ ట్రూమన్ నేరానిగ్గానీ శిక్ష పడ్డట్టు నాకు తెలీదు. ఇవన్నీ సృష్టి రహస్యాలు - మనం ప్రశ్నించరాదు!
అటుతర్వాత అమెరికా కులాసాగా వియత్నాంలో యుద్ధం చేసుకుంది. అలా - ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అమెరికా ఎన్నో దేశాలపై యుద్ధం చేస్తూనే వుంది (ఈ లిస్టు పెద్దది). పాపం అమెరికా! లోకకల్యాణం కోసం బాధతో, దుఃఖంతో, తప్పనిసరి పరిస్థితుల్లో పళ్ళ బిగువున యుద్ధాలు చెయ్యాల్సొస్తుంది! కానీ - వారికెందుకో క్రూరమైన సౌదీ అరేబియా రాచరికం మాత్రం పరమ పవిత్రం. ఇది కూడా సృష్టి రహస్యమే!
ఇవన్నీ రక్తచరిత్రలు. ఫక్తు ఫ్యాక్షనిస్టు రాజకీయాలు. పులి చంపిన లేడి నెత్తురు చిక్కగా, వెచ్చగా సింగిల్ మాల్ట్ విస్కీలా గొంతులో జారుతుండగా - అర్ధ నిమీలి నేత్రాలతో పులిగారు నీతులు చెప్పబూనడం వినేవాళ్ళకి బాగానే వుండొచ్చు. ఆ స్వరం వెనుక దాగున్న రాయిలాంటి హృదయం కనిపించకపోవచ్చు. అందుకే ఆ నీతులు నా స్నేహితుడిలాంటివారి చేత కన్నీరు కార్పించవచ్చు.
ఇప్పుడు చైనా చాలా వేగంగా ముందుకెళ్తుందనీ, చైనా భయం అమెరికాని వణికిస్తుందనీ, అందుకే అమెరికా తన వ్యాపార ప్రయోజనాల నిమిత్తం భారత మార్కెట్ కోసం ఆత్ర పడుతుందని ప్రపంచ రాజకీయాల్ని మాట్లాడే నా స్నేహితుడు చెబుతుంటాడు. అంటే - అధ్యక్షులవారు ఎంత తియ్యగా మాట్లాడినప్పటికీ - అది వ్యాపార ప్రయోజనం తప్ప మరేదీ కాదన్న మాట! అవును - ఆయనకి ఓట్లేసి గెలిపించుకుంది అమెరికా పౌరులు కాని భారత పౌరులు కాదు గదా! మరప్పుడు నా మిత్రుడికి ఉద్వేగం ఎందుకు!?
ప్రపంచానికిప్పుడు చైనా అనే కొత్త విలన్‌గాడు చాప కింద నీరులా విస్తరిస్తున్నాడన్నమాట! వీడి చరిత్రా హీనమే - తియనాన్మెన్ మారణ కాండ గుర్తుంది కదూ! నాకీ ప్రపంచ రాజకీయాల కన్నా పురాణాలే నయమనిపిస్తుంది. పురాణాల్లో రకరకాల రాక్షసులు చివరాకరికి విష్ణుమూర్తి అవతారాల చేతిలో వధించబడతారు. కానీ - రాజకీయాల్లో మాత్రం రాక్షసుల్దే రాజ్యం! రక్షిస్తామని చెప్పేవాడు కూడా - విష్ణుమూర్తి మాస్కుతో వచ్చే డ్రామా కంపెనీవాడే అయ్యుంటాడు గానీ - నిజమైన దేవుడు కాడు! ఇవన్నీ సృష్టి రహస్యాలు! మనం ప్రశ్నించరాదు!
రాక్షసులు నల్లటి చర్మం, చింపిరిజుట్టు, కోరమీసం, బానకడుపుల్తో చూడ్డానికి భయంకరంగానూ, అసహ్యంగానూ వుంటారు. పులులకి పచ్చని చర్మంపై నల్లని చారలుంటాయి, నోట్లో పదునైన కోరలుంటాయి. మనమీ శత్రువుల్ని తేలిగ్గానే గుర్తు పట్టేస్తాం. కానీ - ఈ ఆధునిక ప్రపంచంలో రాక్షసులు, పులులు కూడా టిప్‌టాప్‌గా దర్జాగా విమానాల్లో తిరుగుతుంటారు. మెత్తగా, తియ్యగా, మృదువుగా కబుర్లు చెబుతుంటారు. వాడు మన శత్రువో, మిత్రుడో అర్ధం చేసుకోడం కష్టం!
ఉపన్యాసం ఒక కళ. ఉపన్యాస కళాకారులకి పద్మ ఎవార్డులిచ్చి గౌరవించుకునే సంస్కృతి మనది! చక్కగా ఉపన్యసించేవారి కబుర్లు నిజమనుకుని మురిసిపొయ్యేవారికి నా సానుభూతి. నేనైతే - ఆ కబుర్లు చెప్పేవాడి గతచరిత్ర, వర్తమాన ఆచరణ అన్నీ గమనించాలంటాను. అప్రమత్తంగా లేకపోతే - హంతకుడు అహింస గూర్చి, దుర్మార్గుడు మంచితనం గూర్చి ఉపన్యాసం ఇస్తారు. నక్కలు నిజాయితీ గూర్చి, సింహం శాకాహారం గూర్చి పాఠాలు చెబ్తాయి! అంచేత - మనం ఉపన్యాసాలకి మోసపోరాదు! తస్మాత్ జాగ్రత్త!!
(picture courtesy : Google)
ఇట్టి మీమాంస మనకవసరమా నాయనా, నీతి, నిజాయితీ, కర్మ అకర్మ అన్నీ మానవ కల్పన. మనమంతా నిమిత్త మాత్రులం. పులిని లేడి చంపనా, లేడీని పులిచంపినా అది దైవ సంకల్పం, కొండకచో అది ఒబామా గారి సంకల్పం కూడా. ఎందుకంటే సృష్టి దైవాదీనమైనది. ఒబామా దేవుని ప్రతినిది. చంపుతున్నది నేను, బ్రతక నిస్తున్నది నేను. సృష్టి నా అదీనమైది, అర్జునా!, మధ్యలో నీవెందుకు వగచదవు అని శ్రీకృష్ణ పరమాత్మ బోదించెను గదా! మీమాంస సృష్టికి వ్యతిరేక మైనది.కనుక దాని జోలికి పోరాదు. ఆధునిక శ్రీకృష్ణ పరమాత్ముడు ఒబామా. ఆయన భోధనలు ఆలకించక భారతయుద్దంలో అర్జునిలా ఎందులకు ఈ ప్రేలాపనలు? ఇట్టి మీ మాంసకులు సృష్టిలో లేడి వంటి వారు. బతకలేరు. అందుకే పులులు వేటాడును. ఒబామా గ్నాన బోధ పెడచెవిన పెట్టకుమా లేనిచో పెరుమాల్ మురుగన్ అవుదురు.
ReplyDeleteనా ప్రేలాపనల సంగతేమో గానీ - పెరుమాళ్ మురుగన్ పేరు వింటుంటేనే భయంగా వుంది.
Deleteదెయ్యాలు వేదాలు వల్లించినట్లు, డాక్టరు గారూ.
ReplyDeleteప్రస్తుతం అమెరికాకి ఇండియాతో చాలా అవసరం వుంది. అంచేత, అమెరికన్ MEA వారు - (మన తెలుగు బ్లాగర్లలాంటి మంచి రచయితల్తో) ఒబామాకి ఒక మంచి ఉపన్యాసం రాసిచ్చారు. ఆయన చక్కగా perform చేశాడు. :)
DeleteI hope that our leaders are not going to fall in the trap of US president.
ReplyDeleteI think our leaders are smart. What they lack is commitment.
Deleteడాక్టరుగారూ,
ReplyDeleteఅప్పుడెప్పుడో అన్నా హజారేగారు లంచాలమీద యుధ్ధం ప్రకటించి, ఉద్యమం నడిపినప్పుడు, మన ప్రజానాయకులందరూ జై..జై.. కొట్టలేదూ ? అలాగే ఇదీనూ...
అంతేనంటారా!?
Deleteమిగతా వ్యాపారాలతో నాకు పెద్దగా ముప్పేమీ కనపడటంలేదు కాని అణు ఒప్పందం మనకు అవసరమా?
ReplyDeleteఎప్పుడూ ఎండకు కరువు లేని మన దేశంలో సౌరశక్తిని ఉపయోగించుకోవడం మంచిది కదా!
అణుఒప్పందాలు కూడా అవసరమే. కాకపోతే ఆ ఒప్పందాల ప్రయోజనాలు అవతలవాడి కోసం కాకుండా మనకోసమే వుండాలి.
Deleteమీ విలన్ల లిస్టు లో స్టాలిన్ ని యాడ్ చేయటం మరచారా?
ReplyDeleteఅమెరికన్ ప్రెసిడెంట్ ఉపన్యాసం కదా! అంచేత స్టాలిన్‌ని దూరంగా పెట్టాను :)
Delete(అసలు కారణం - ఇప్పటికే ఈ పోస్టు అనేక మెలికలు తిరిగింది, ఇంకా తిప్పే ఓపిక లేదు!)
వేటాడే క్రూర మృగాలు కూడా ముందు బలహీనమైన వాటి పైనే తమ దృష్టి పెడతాయి. బలమైన వాటి జోలికి వెల్లవు... ఎందుకంటే వాటి ద్వారానే మళ్ళీ ఆ తినబడే జాతి పుట్టాలి కాబట్టి... ఇదే తంతు సౌదీ అరేబియా కు కూడా వర్తిసుంది... ఏమో .... ఎవరు చూడ వచ్చారు... ఇరాక్, ఆఫ్గనిస్థాన్ లకు పట్టి గతే సౌదీ అరేబియా కు కూడా పడుతుందేమో.... చాలా రోజుల తరువాత మళ్ళీ “ ఒక దళారి పత్యాశ్చాపము” పుస్తకం గుర్తుకు వచ్చింది .
ReplyDeleteథాంక్యూ!
DeleteLots of truth in your write up Ramana. In reality, it is the CIA and Military Industrial Complex that is largely responsible for all the ills, After living in the US for better part of my life, I can say with some authority that the American people are just as innocent as the rest of the world and are often taken for a ride. Most or all of the western countries are mercantile nations. Trade with them, but, be on guard and protect your interests. Always develop indigenous defense tech as much as possible (including GPS). Don't be afraid to negotiate, but, drive a hard bargain.
ReplyDeleteప్రస్తుతం Natural Gas ఉత్పత్తికి ప్రపంచెం లో అమెరికా ఫస్టు. కొన్ని సంవత్సరాల్లో Oil ఉత్పత్తి కి ప్రపంచెం లో ఫస్టు కాబోతోంది. ఆ రెండూ మనకి లేవు. అమెరికాతో మంచి సంబంధాలు పెట్టుకోవటం మన మంచికే అనుకుంటాను.
ReplyDeleteఅమెరికాతో మాత్రమే కాదు - సాధ్యమైనన్ని ఎక్కువ దేశాల్తో (మన దేశ ప్రయోజనాల్ని కాపాడుకుంటూ) మంచి సంబంధాలు పెట్టుకోవాలన్నది నా అభిప్రాయం.
Delete>>ఉపన్యాసం ఒక కళ. ఉపన్యాస కళాకారులకి పద్మ ఎవార్డులిచ్చి గౌరవించుకునే సంస్కృతి మనది!
ReplyDeleteడాటేరు బాబు గారు,
మీకు "బద్మాష్విభూషణ్" బిరుదు ఇవ్వాలని రికమెండ్ చేస్తున్నామండీ !!
సూపెర్ 'డూపర్' !
చీర్స్
జిలేబి
జిలేబి జీ,
Deleteనాకు బిరుదులంటే ఏమాత్రం గిట్టదు సుమండీ! అయినా మీరింత ముచ్చట పడుతుంటే కాదన్లేకపోతున్నాను.
ఆ చేత్తోనే ఓ శాలువా సన్మానం కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందేమో ఆలోచించండి! :)
రమణ గారూ, హిందీ రాకపోవడం ఎంత ప్రమాదమో ఇప్పటికయినా గుర్తించడం. జిలేబీ గారు మీకు ఇస్తున్న బద్మాష్విభూషణ్ బిరుదుకు శాలువా కాదు, గళ్ళ లుంగీ & మెడలో రుమాలు కావాలి.
Deleteఅంత ఘనమైన బిరుదుకి డాక్టర్ రమణ గారు అర్హత సంపాదించుకోలేదండీ జిలేబీ గారూ :)
Deleteజిలేబి జీ నాకు పద్మభూషణ్ లాంటిదేదో రికమెండ్ చేస్తున్నారనుకున్నానే! కాదా!?
Deleteకొ. కు. చాలా బలంగా గుర్తొచ్చాడు చదివినంతసేపూ!
ReplyDeleteఅలాగా! థాంక్యూ!
Deleteరావిశాస్త్రి గుర్తు రానందుకు మరోసారి థాంక్స్! :)
అద్భుతంగా రాశారు రమణ గారు!!
ReplyDeleteథాంక్యూ!
Deleteజై 'గొట్టిముక్కల' వారి కామెంటు ' గళ్ళ లుంగీ , మెడలో రుమాల్ ' అదురహో !!
ReplyDeleteచీర్స్
జిలేబి
మీరు బ్లాగ్ మొదలు పెట్టినప్పటి నుండి ఇప్పటివరకు రాసిన టపాలు అన్ని చదివాను సర్. పోయిన నెల ప్రారంభించిన బ్లాగ్‌చదివే కార్యక్రమం నేటితో పూర్తి అయ్యింది. పూర్తి అయ్యిన తర్వాత అన్నింటికీ కలిపి ఒకేసారి కామెంట్ పెట్టాలి అనుకున్నాను కానీ ఒక టపాలో కామెంట్ రాసే సౌకర్యాన్ని తెసేయ్యడం చూసి నిరాశ చెందాను. కానీ నా లాంటి అభిమానుల కోసం మళ్లీ మీరు కామెంట్ పెట్టడానికి మార్గం సుగమం చేయడం చూసి మిక్కిలి సంతోషించాను.
ReplyDeleteమీ టపాలు అన్నింటికీ కలిపి ఒకే ఒక్క పెద్ద _/\_. అంతకు మించి నాయొక్క అభిమానాన్ని, మీ టపాలు చదివినప్పుడు కలిగిన ఆనందాన్ని వ్యక్తం చెయ్యలేకపోతున్నందుకు మిక్కిలి బాధ పడుతున్నాను.
ఉపేందర్
ఉపేందర్ గారు,
Deleteనా పోస్టులన్నీ ఓపిగ్గా చదివినందుకు ధన్యవాదాలు. మీ అభిమానానికి కృతజ్ఞతలు.
నాకేమో మీ జాల రచనలలో రావి శాస్త్రి గారు ఎప్పుడూ అంతర్లీనంగా కనిపిస్తారు.
ReplyDeleteఒబామా గారు అమెరికా వెళ్ళాక ప్లేటు ఫిరాయించారుగా
ఆయనకు గాంధీగారి ఆత్మ కబుర్లంపింది పాపం.