'ఈ సమాజానికి పట్టిన చీడ అవినీతి, ఇది అంతరించిపోవాలి.' సినిమా డైలాగులాంటి ఈ స్లోగన్ ఎంతందంగా వుంది! నా చిన్నప్పట్నుండీ గొంతు పగలేసుకుంటూ ఈ స్లోగన్ని అరిచేవాళ్ళు అరుస్తూనే వున్నారు. అవినీతి మాత్రం కులాసాగా, హాయిగా తన మానాన తను పెరిగిపోతూనే వుంది. అంచేత ముందుగా ఈ స్లోగనీర్స్‌కి నా సానుభూతి తెలియజేసుకుంటున్నాను.
ఇవ్వాళ నీతి అడ్రెస్ లేకుండా అంతరించిపోయింది. అడ్రెస్ లేనివాటి గూర్చి చర్చ అనవసరం, టైం వేస్ట్! కానీ, అవినీతి గూర్చి ఎంతైనా రాయొచ్చు - ఎందుకంటే అదిప్పుడు సినీతారల సౌందర్య రహస్యంలా తళతళా మెరిసిపోతుంది కనుక. అవినీతి కొంత కష్టమైనది, మరెంతో క్లిష్టమైనది! అందుకే ఈ అవినీతిలో ఎప్పుడూ రాజకీయ నాయకులు, బ్యూరాక్రసీ, పారిశ్రామికవేత్తలు.. ఇంకా చాలామంది పార్ట్నర్లుగా వుంటారు. వాళ్ళంతా అలా భాగస్వామ్యం కలిస్తేనే, అవినీతి అదేదో సిమెంటుతో కట్టిన గోడలాగా మన్నికగా, ధృఢంగా వుంటుంది.
గవర్నమెంటు ఆఫీసుల్లో వాడే గుండుసూదుల దగ్గర్నుండీ, సాంఘిక సంక్షేమ హాస్టళ్ళల్లో పసిపిల్లల తినే తిండి దాకా కమీషన్లు లేకుండా ఉద్యోగులు పని చెయ్యరు (ఇది వారి ఉద్యోగ ధర్మం). ప్రభుత్వాసుపత్రుల్లో మందులు, దుప్పట్ల కొనుగోళ్ళల్లో కమీషన్ ఫస్ట్, క్వాలిటీ లాస్ట్ (ఇది వారి వృత్తిధర్మం). ఈ అవినీతి మునిసిపాలిటీ చెత్తలాగా అందరికీ కనబడుతుంటుంది కాబట్టి - మధ్యతరగతి మేధావులు తీవ్రంగా ఖండిస్తుంటారు (వీళ్ళకోసమే 'భారతీయుడు' సినిమా తీశారు).
ఇప్పుడు ఇదే అవినీతి మోడల్ని దేశస్థాయిలోకి తీసుకెళ్దాం. దేశం అన్నాక దానికో రక్షణ వ్యవస్థ అవసరం. ఈ రక్షణ వ్యవస్థ కోసం గన్నులు, యుద్ధ ట్యాంకులు, ఓడలు, విమానాలు, హెలీకాప్టర్లు.. ఇలా చాలా సామాగ్రి కావాలి. కళ్ళముందు జరిగే అవినీతి గూర్చి సామాన్య ప్రజలకి తెలుస్తుంది కానీ రక్షణ వ్యవస్థ - దాని అవసరాలు, కొనుగోళ్ళ గూర్చి తెలీదు.
అందువల్ల యే దేశప్రభుత్వాలకైనా రక్షణ సామాగ్రి కొనుగోళ్ళల్లో రిస్కు తక్కువ, సేఫ్టీ ఎక్కువ! ఇంకోకారణం - రక్షణ సామాగ్రికి ఇడ్లీ, అట్టు రేట్లలాగా పారదర్శకత వుండదు, బిస్కెట్ పేకెట్లకున్నట్లు ఎమ్మార్పీ వుండదు. ఒక వస్తువు ఉత్పత్తి ఖర్చు వందరూపాయిలైతే - దాన్ని లక్షకి అమ్ముకోవచ్చు, కోటికీ అమ్ముకోవచ్చు. రేటు అనేది ఆయా దేశాల రాజకీయ నాయకత్వాల అవసరం (కక్కుర్తి) బట్టి వుంటుంది.
'కన్ఫెషన్స్ ఆఫ్ ఏన్ ఎకనామిక్ హిట్ మేన్' (తెలుగులో 'ఒక దళారి పశ్చాత్తాపం') అనే పుస్తకంలో జాన్ పెర్కిన్స్ అనే ఆయన బయటకి గౌరవంగా, మర్యాదగా కనిపిస్తూనే అనేక దేశాలు ఈ వ్యవహారాల్ని ఎలా చక్కబెట్టుకుంటాయో, వాటి మోడస్ ఒపరాండై ఏవిఁటో చక్కగా వివరించాడు. అభివృద్ధి చెందిన దేశాలకి ఉప్పుపప్పూ వ్యాపారాల మీద మోజుండదు - ఆ రంగాల్లో కిరాణాకొట్టులాగా పరిమిత లాభాలు మాత్రమే వుంటాయి కనుక. అంచేత అవి ఆయుధాల వ్యాపారం ఎంచుకుని, ఈ వ్యాపారాన్ని నిరాటంకంగా చేస్తుంటాయి (ఆయుధాల టెక్నాలజీ వారికి మాత్రమే సొంతం, ఇంకెవడైనా ఆయుధాలు తయారు చెయ్యాలని ప్రయత్నిస్తే వాడికి సద్దాం హుస్సేన్‌కి పట్టిన గతే పడుతుంది).
ప్రజలు తమ అవసరాల నిమిత్తం కొన్నిచోట్లకి వెళ్ళి కావాల్సిన వస్తువులు కొనుక్కుంటారు - బట్టలకొట్టు, చెప్పులషాపు.. ఇలాగా. అలా కొనేవాళ్ళని అయా వ్యాపారస్తులు 'కస్టమర్లు'గా పరిగణిస్తారు. మరైతే ఆయుధాలు ఎవరికి అవసరం? అవి కొనడానికి కస్టమర్లు ఎక్కణ్నుండి వస్తారు? ఒక వస్తువుని అమ్ముకోవాలంటే ఆ వస్తువుకి డిమాండ్ వచ్చేలా చేసుకోవటం వ్యాపారంలో ప్రాధమిక సూత్రం. కావున రక్షణ సామాగ్రి అమ్ముకునేవాళ్ళు తమ కస్టమర్లని తామే సృష్టించుకుంటారు. అందుకోసం తాము ఆయుధాలు అమ్మాలనుకునే దేశాల్లో అంతర్గతంగా అశాంతి, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు వుండేట్లు ఆయుధ వ్యాపారులు తీవ్రంగా శ్రమిస్తారు (ఇందుకయ్యే ఖర్చులు ఫైనల్ బిల్లులో రాబడతార్లేండి).
ఆఫ్రికా, దక్షిణ అమెరికా దేశాల్లో తిరుగుబాటుదార్ల దగ్గర ఇబ్బడిముబ్బడిగా ఆయుధాలుంటాయి (అవి ఎక్కణ్నుండి వచ్చాయని అడక్కండి), వారి నుండి తమ ప్రభుత్వాల్ని రక్షించుకోడానికి ఆ ప్రభుత్వాలు ఆయుధాలు కొనుక్కోవాలి. అమ్మయ్య, ఇక్కడ పనైపోయింది! మరి మిడిల్ ఈస్ట్ సంగతేంటి? అక్కడ ఇజ్రాయిల్ పుణ్యామని యుద్ధం రావణ కాష్టంలా మండుతూనే వుందిగా! వాళ్ళు తమ సహజ సంపదైన చముర్ని అమ్ముకుంటూ, ఆయుధాలు కొనుక్కుంటూ, జాతి విద్వేషాల్తో ఒకళ్ళనొకళ్ళని చంపుకుంటూ కులాసాగా జీవనం కొనసాగిస్తున్నారు. అంటే పేకాటలో డబ్బు ఎవరు పోగొట్టుకున్నా వాళ్ళందరికీ అప్పిచ్చేది మాత్రం ఒక్కడే!
ఇక మన విషయానికొస్తే - మనకీ, పాకిస్తాన్‌కీ మధ్య ఇంచక్కా కాశ్మీర్ 'సమస్య' వుండనే వుంది. ఈ రెండుదేశాల సాధారణ ప్రజానీకం మాత్రం మలేరియా, టైఫాయిడ్‌లాంటి సింపుల్ రోగాల్తో చస్తుంటారు. వడదెబ్బకీ, చలిక్కూడా చస్తుంటారు. పంటలు పండకా, పండినా గిట్టూబాటు ధరల్లేకా రైతులు ఆత్మహత్యలు చేసుకు చస్తుంటారు. దిక్కులేనివాళ్ళు ఆకలి చావులు చస్తుంటారు. ఇంకా చెప్పుకోడానికి సిగ్గుపడే అనేక కారణాలతో రోజువారీ కుక్కచావులు చస్తూనే వుంటారు.
'ప్రజలారా! కలత చెందకండి, భయపడకండి. కాశ్మీరు మనది, అక్కడ ప్రతి అంగుళం మనదే, ఒక్క అంగుళం కూడా అవతలవారికి చెందనియ్యం.' ఈ తరహా ప్రచారం ఇటు ఇండియాలో, అటు పాకిస్తాన్‌లోనూ నిరంతరంగా కొనసాగుతుంటుంది. 'కాశ్మీరు సంగతి సరే! మరి మా సంగతేంటి?' అనడిగితే మనం అర్జంటుగా దేశద్రోహులైపోతాం, మనని అరిచి మందలించి భయపెట్టడానికి అర్నబ్ గోస్వామి వంటి భీభత్సమైన దేశభక్తులు వుండనే వున్నారు!
అయ్యా ఆయుధాలమ్మే అగ్రరాజ్యంగారు! నమస్తే. మాది శాంతికాముక దేశం సార్! కానీ మా సరిహద్దు దేశంగాడున్నాడే, వాడొట్టి దొంగాముండావాడండీ! ఆ దుర్మార్గుణ్నించి మమ్మల్ని మేం రక్షించుకోవాలి కదండీ? అంచేత అర్జంటుగా మాకిప్పుడు ఆయుధాలు కావాలి. కానీ మాదగ్గర ఈడ్చి తన్నినా పైసా లేదు. ఇప్పుడెలా? ఎలా? ఎలా?
డోంట్ వర్రీ! మై హూనా? అప్పుగా ఆయుధాలు ఎన్నైనా తీసుకోండి. వడ్డీలు, చక్రవడ్డీలు, ఈయమ్మైలు.. మొత్తం మేమే నిర్ణయిస్తాం. మీరు నిదానంగా కట్టండి. ఈలోపు అంతర్జాతీయంగా మేం తీసుకునే ప్రతి నిర్ణయానికీ మీరు కిక్కురుమనకుండా, గుడ్డిగా మద్దతు పలకాలి. లేదా, మా అప్పు వసూలుకి విజయవాడ కాల్ మనీ టైపు పద్ధతులు అమలు చేస్తాం. ఇంకో ముఖ్యవిషయం - మా మార్కెట్ రంగాన్ని మీ దేశంలోకి తలుపులు బార్లా తెరిచి ఆహ్వానించాలి.
తలుపులు మరీ బార్లా తెరిస్తే మాకు రాజకీయంగా ఇబ్బంది.
నిజమే కదూ! అయితే ఓ పన్జెయ్యండి, తలుపులు కొద్దిగా తెరవండి చాలు. వేలుపెట్టే సందు దొరికితే కాలు పెట్టడం మా ప్రత్యేకత! అయినా - ఒక ఇంట్లోకి ప్రవేశించాలంటే మాకు అనేక మార్గాలున్నాయి. సమయానుకూలంగా దొడ్డిదోవన వొస్తాం, వంటింటి కిటికీలోంచి దూరి వొస్తాం, పక్కింటిగోడ దూకి వొస్తాం.
ఇప్పుడు మనం అలనాటి బోఫోర్సు నుండి నేటి అగస్టావెస్ట్‌లేండ్ (ఈ హవాలా దివాలా పేర్లు భలే సెక్సీగా వుంటాయి) దాకా తెర వెనుక కథ తెలుసుకున్నాం. ఇవన్నీ చాలా సాధారణ విషయాలు, పవిత్ర గంగానదిలాగా నిరంతరం అలా పారుతూనే వుంటాయి. ఈ వ్యాసం రాస్తున్న సమయంలో ప్రపంచంలో యేదోకచోట ఒక డీల్ కుదురుకుంటూ వుంటుంది.
నోనో, ఇలా స్వీపింగ్ జెనరలైజేషన్ చెయ్యకూడదు. మా ప్రభుత్వం గత ప్రభుత్వం కుంభకోణాన్ని బయటపెట్టింది, మా పార్టీ నిప్పు.
సరే! కుంభకోణాల్ని బయటపెడుతున్నారు. మరప్పుడు బోఫోర్స్ కుంభకోణంలో ఎందరు జైలుకెళ్ళారు? కార్గిల్ శవపేటిక కుంభకోణంలో ఎందరు శిక్షించబడ్డారు? సమాధానం చెప్పి మమ్మానందింపజేయ ప్రార్ధన. ఈ కుంభకోణాల వెలికితీత వెనుక రాజకీయ ప్రయోజనాలకి మించి ప్రజల సంక్షేమం ఎంత మాత్రం లేదని మరీ బల్ల కాకపోయినా టీపాయ్ గుద్ది చెప్పొచ్చు.
'పార్ధా! ప్రభుత్వ పక్షమేమిటి? ప్రతిపక్షమేమిటి? అన్నిపక్షాలు నేనే! నువ్వు యే పక్షమైనా డీల్ కుదుర్చువాడను నేనే! ప్రజలకి ఫలానా పార్టీకి చెందిన ప్రభుత్వంపై మొహం మొత్తంగాన్లే పాతపార్టీల్తో కొత్తపక్షాన్ని సృష్టించి గద్దె నెక్కించువాడను నేనే! చదరంగంలో ఇవ్వాళ తెల్లపావుల్తో ఆడినవాడు రేపు నల్లపావుల్తో ఆడతాడు. ఒక దేశంలో ప్రభుత్వ ప్రతిపక్షాలన్నియూ ప్రజల భ్రాంతేనని వికిలీక్స్ సాక్షిగా నీవు గ్రహించగలవు. కావున నీవు నిస్సందేహముగా అవినీతికి పాల్గొనుము. ఇదే కలియుగ ధర్మం, వినకపోతే నీ ఖర్మం."
తెలుగు సినిమా ప్రేక్షకులు హీరోలకి వీరాభిమానులు. మా హీరో గొప్పంటే మా హీరో గొప్పని తన్నుకు చస్తుంటారు. ఈ హీరోలతో సినిమాలు తీసేవాళ్ళు మాత్రం తెర వెనక ఐకమత్యంగా వుంటారు. డబ్బు సంపాదనే తమ ధ్యేయమనీ, మీరు కొట్టుకు చావకండని హీరోలు చచ్చినా చెప్పరు, చెబితే అది బ్యాడ్ బిజినెస్ స్ట్రేటజీ అవుతుంది. ఎందుకంటే - తమలో తమకి పడదని సాధారణ ప్రేక్షకుడు భావించడం కూడా హీరోల వ్యాపారంలో భాగమే కాబట్టి.
తెలుగువాళ్ళకి సినిమా ట్రాజెడీగా ముగిస్తే నచ్చదు. ఈ నచ్చకపోవడం అనేది ఇలాంటి వ్యాసాలక్కూడా అప్లై అవుతుందని నా అనుమానం. అందువల్ల ఈ వ్యాసాన్ని పాజిటివ్ నోట్‌తో ముగిస్తాను. భవిష్యత్తులో ఈ అవినీతి చీడ / భూతం (యేదైతేనేం) అంతరించిపోవాలని, నీతి అనేది నిజాయితీగా తలెత్తుకు నిలబడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. కొంచెం పొయిటిక్‌గా, పచ్చిఅబద్దంలా అనిపిస్తుంది కదూ! నేనేం జెయ్యనూ? అబద్దాలంతే, అవలాగే వుంటాయి!
(ప్రచురణ - 'సారంగ' 12 - 5 - 2016 సంచిక)
cool!
ReplyDeleteNice article.
ReplyDeleteCurrently I am reading The New Confessions of an Economic Hit Man. Very scary stuff. As you have pointed out, the whole thing is managing the masses. Irrespective of what party forms the government, all these things will continue.
I don't think the corruption will ever be eradicated, at least in our country. Again, it is just managing, you will have good and bad all the time, including in our mythology. So, why complain, when it becomes unmanageable, a new incarnation will tackle that evil :)
తొలి - మధ్య ఆండ్రాయిడ్ యుగాల్లో రమణ యడవల్లి గారనే అనే ఓ మంచి చమత్కార సరదా విశ్లేషాత్మక పిచ్చిడాక్టరుగారుండేవారు. ఆయనిప్పుడెక్కడా కనబడట్లేదు.ఈ ఫేసుబుక్కు సమాజంలో ఆయన మనుగడ సాగిస్తున్నారా లేక అంతరించిపోయారా...???
ReplyDeleteఒకవేళ ఫేసుబుక్కు సమాజంలో లేకపోతే చెప్పండి.. ఆయన్ని బాహ్య ప్రపంచంలో పట్టుకుని తలవెనుక జాకులు తగిలించి ఫేసుబుక్కు మ్యాట్రిక్స్ లో ప్రవేశపెడదాం....!!!