"డైరక్టర్‌గారూ! మీకిప్పుడో సూపర్ హిట్ కథ చెబ్తాను."
"చెప్పండి."
"అది కోర్టు. ముఖ్యమైన కేసు విచారణ జరుగుతుంది. జడ్జిగారు ఆడలేడీసు. ఆవిడ కరుణామయి, త్యాగశీలి, అభిమానవతి, పుణ్యవతి, శీలవతి... "
"అర్ధమైంది, కేరీ ఆన్."
"కానీ జడ్జిగా ఆమె నిప్పులాంటి మనిషి. ఆవిడ కోర్టులో రంగయ్య డఫేదారు. పాపం! రంగయ్యకి రెండ్రోజులుగా జొరం, తట్టుకోలేక కళ్ళు తిరిగి కోర్టు మధ్యలో పడిపొయ్యాడు."
"జొరంగా వుంటే సెలవు పెట్టొచ్చుగా?"
"చెప్పాగా! జడ్జిగారు మహాస్ట్రిక్టు."
"అవును కదా, మర్చిపొయ్యా."
"డ్యూటిలో వుండగా కింద పడిపోయినందుగ్గానూ జడ్జిగారు రంగయ్యని సెక్షన్ 106, 271, 398, 469 ప్రకారం ఉద్యోగంలోంచి సస్పెండ్ చేశారు. తీర్పు చదువుతుండగా జడ్జిగారి ముఖంలో కాఠిన్యం, కంట్లోనీరు! కిందపడ్డ రంగయ్య నేలమీద నుండే హతాశుడయ్యాడు. కొద్దిసేపటికి 'ఇన్నాళ్ళ నా సేవకి ఇదా ఫలితం?' అన్నట్లు జడ్జిగారిని దుఃఖంగా చూశాడు. ఆ తరవాత నిదానంగా కోర్టుని కలియజూశాడు, ఇప్పుడు రంగయ్య కళ్ళల్లో గర్వం!"
"ఎందుకని!!!????"
"అదే మన కథలో ట్విస్టు. జడ్జమ్మాయిగారు డఫేదార్ రంగయ్య కూతురు! రంగయ్య తన ఆరోగ్యాన్ని లెక్కజెయ్యకుండా, రాత్రనకా పగలనకా గొడ్డులా కష్టపడి కూతుర్ని చదివించి ఇంతదాన్ని చేశాడు! ఎలా వుంది సీన్?"
"సూపర్. కాకపోతే మీరీ కథని యాభైయ్యేళ్ళు లేటుగా చెబ్తున్నారు."
"!!!???"
"యేంలేదు. ఈ పాత్రలు పోషించడానికి సావిత్రి, గుమ్మడి కావాలి. ఇప్పుడు మనం వాళ్ళని తేలేం కదా! కాబట్టి ఈ కథ వద్దులేండి."
(picture courtesy : Google)
మరేమీ ఫరవా లేదండీ. పరిస్తితులకు అనుగుణంగా కాస్త మార్చుకుంటే చాలు.
ReplyDeleteఈ రోజులలో హీరోయిన్ ప్రధాన సినిమాలు నడవవు. అంచేత జడ్జీ గారి పాత్ర బాలయ్య పోషిస్తే ఎంచక్కా జస్టీస్ చౌదరి తరహాలో ఉంటుంది.
తండ్రి సెంటిమెంట్ కంటే తల్లికే గిరాకీ ఎక్కువ. డఫేదారు (అనగా హీరో తల్లి) పాత్రలో ఊర్వశి శారద సినిమాలలో రీ-ఎంట్రీ చేస్తే బాహుబలి రికార్డ్ బద్దలు కొట్టడం ఖాయం.
ఒక ఇద్దరు తెల్లతోలు నాయికలు, ఒక ఐటం సాంగ్, బ్రాహ్మీ కామెడీ ట్రాక్ షరా మామూలే.