Tuesday, 26 April 2016

అందర్ కీ బాత్


"గుడ్మార్నింగ్ శ్రీహరీ!"

"హాయ్ నారదా! భూలోక విశేషములేమి?"

"యేమని చెప్పను శ్రీహరి! ఇండియన్ పార్లమెంటులో అరుపులు, వాకౌట్లు తప్ప ప్రజల సమస్యల గూర్చి చర్చ ఏమాత్రం చర్చ జరగట్లేదు."

"పిచ్చి నారదా! అటు నా ఎల్యీడీ స్క్రీన్ చూడుము."

పార్లమెంటు భవనంలో ఓ గదిలో ఓ మూలగా కూర్చుని అధికార, ప్రతిపక్ష నేతలు గుసగుసలాడుకుంటున్నారు.

"ఉత్తరాఖండ్ సమస్యపై మూడ్రోజులకి మించి వాకౌట్ చెయ్యలేం, మీరు మా ఇబ్బందుల్ని గుర్తించాలి." ప్రతిపక్ష నాయకుడు దీనంగా అన్నాడు.

"మూడోరోజుకి ఇంకో సమస్యని సృష్టిస్తాం, డోంట్ వర్రీ! కానీ - ఎట్టి పరిస్థితుల్లోనూ అధిక ధరలు, కరువు కాటకాలు చర్చకి రాకూడదు. మీరు అధికారంలో వున్నప్పుడు మేం ఎంత బాగా సహకరించామో గుర్తుందిగా!" హెచ్చరికగా అన్నాడు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి.

రిమోట్‌తో ఎల్యీడీ స్క్రీన్ స్విచాఫ్ చేశాడు విష్ణుమూర్తి.

"నారదా! మబ్బుల్లో లోకసంచారం చెయ్యడం మినహాయించి నీకు 'అందర్ కీ బాత్' అర్ధం కావట్లేదు. నువ్వు మరీ outdated అయిపోతున్నావు." ఎగతాళిగా అన్నాడు విష్ణుమూర్తి.

నారదుడు కొద్దిసేపు ఆలోచించాడు, ఆపై పెద్దగా ఏడవడం మొదలెట్టాడు. విష్ణుమూర్తి కంగారు పడ్డాడు.

"నారదా! అయామ్ జస్ట్ జొకింగ్."

"శ్రీహరీ! నేనేడుస్తుంది మీకోసమే."

"వై?" ఆశ్చర్యపొయ్యాడు విష్ణుమూర్తి.

"మానవుడు ఎంత తెలివైనవాడు! ఈమాత్రం తెలివి లేకనే గదా - మీరు ఎంతో శ్రమ పడి దశావతారాలు ఎత్తి టైమ్ వేస్టు చేసుకున్నారు!"

విష్ణుమూర్తికి కూడా దుఃఖం ఆగింది కాదు. 

(picture courtesy : Google)

No comments:

Post a Comment

comments will be moderated, will take sometime to appear.