Wednesday, 29 June 2011

'పిచ్చి' ఉపదేశం


అనగనగా ఓ ఊరు. ఆ ఊళ్ళో ఓ పిచ్చిడాక్టరు. పిచ్చోళ్ళకి వైద్యం చేసీచేసీ ఆ పిచ్చిడాక్టరుకి విసుగొచ్చింది. తదుపరి ఓ అనుమానం కలిగింది.

'అసలు పిచ్చింటే ఏమిటి? ఇంతకీ పిచ్చి నాకా? నా రోగులకా?'. 

ఈ ప్రశ్నలకి సమాధానాల కోసం రాత్రింబగళ్ళు తీవ్రంగా యోచించాడు. బుర్ర వేడెక్కిందిగానీ ప్రయోజనం లేకపోయింది. ఈ సందేహాలు తీరకుండా తనకి వైద్యం చేసే అర్హత లేదనే నిర్ణయానికి వచ్చేశాడు.

అది దండకారణ్యం. అంతటా దట్టమైన చెట్టు, చేమలు, పాము పుట్టలు. వాటిమధ్య తీవ్రంగా, ప్రశాంతంగా తపస్సు చేసుకొంటున్నాడు మహాముని నిగమశర్మ. మునిని చూడంగాన్లే ఆనందంతో పిచ్చిగంతులు వేశాడు మన డాక్టరు. కొద్దిసేపటికి కాళ్ళు నొప్పెట్టి, తన సమస్యని పరిష్కరించమని మునిగారిని దీనంగా వేడుకొన్నాడు.

అట్టకట్టి దురద పుడుతున్న గెడ్డాన్ని గోక్కుంటూ కొద్దిసేపు ఆలోచించాడు నిగమశర్మ. పిమ్మట మందహాసంతో -
               
"పిచ్చివాడా! ఈ ప్రపంచంలో పిచ్చిలేని ప్రాణి లేదు. ఈ సంగతి తెలీని పిచ్చివెధవలు నీ పిచ్చివైద్యానికి పిచ్చిడబ్బులు ఇస్తుంటే, పిచ్చిపిచ్చిగా సంపాదించుకోక ఈ పిచ్చిఆలోచనలేల?" 
               
"కానీ - నాకు పిచ్చొళ్ళతో మాట్లాడిమాట్లాడీ పిచ్చిపిచ్చిగా, తిక్కతిక్కగా ఉంటోంది స్వామీ."

"ఓయీ వెర్రి వైద్యశిఖామణీ ! దానికి ఓ తరుణోపాయం వుంది. తిక్కతిక్కగా వున్నప్పుడల్లా నీ వెర్రిమొర్రి ఆలొచనలన్నీ రాస్తుండు. నీకు పిచ్చిబరువు తగ్గుతుంది. నీ రాతలు చదివినవారికి పిచ్చెక్కుతుంది."
              
"అప్పుడు వాళ్ళకి పిచ్చెక్కి ఇదే ఆయుధం నా మీద ప్రయోగిస్తే?"
              
"ఆ భయం నీకు వలదు నాయనా! ప్రస్తుత ప్రపంచంలో ఎవరికీ నీ ప్రేలాపనలు చదివే తీరిక లేదు." 
             
"ఎవరూ చదవనప్పుడు నా పిచ్చిభారం తగ్గేదెలా? వారికి ఎక్కేదెలా? నాకు తృప్తిగా ఉండేదెలా?"
              
నిగమశర్మకి పూజాసమయం ఆసన్నమైంది. అడుగుతున్న పిచ్చిసందేహాలకి  చిర్రెక్కుతోంది. 
       
"ఓయీ వెర్రి వైద్యాధమా! ఓ పని చెయ్యి!"
            
"సెలవివ్వండి గురువర్యా!" 
      
"రేపట్నుండీ బస్టాండులో బజ్జీలు అమ్ముకో. నీకు ఈ సందేహాల బాధా, నాకు నీ ప్రశ్నల గోలా తప్పుతాయి."
      
"స్వామీ!"

చివరి తోక -

రావిశాస్త్రి కథ 'పిపీలికం' నాకుచాలా ఇష్టం. అందుకే ఆ స్టోరీకి పేరడీ రాశాను. 

(picture courtesy : Google)

Tuesday, 28 June 2011

రుస్తుం


ఆమె పేరు పద్మావతి. ఎర్రగా, ఎత్తుగా, బక్కగా ఉంది. ఏడ్చీఏడ్చీ కళ్ళు ఎర్రగా అయిపొయ్యాయి, జుట్టు రేగిపోయింది, మొహం వాచిపోయింది. ఆమె వారం క్రితం ఆత్మహత్యా ప్రయత్నం చేసిందిట.

"నా మొగుడు మా పుట్టింటోళ్ళని ఘోరంగా తిడతన్నాడు. నేను నించుంటే తప్పు, కూర్చుంటే తప్పు. బయటోళ్ళ ముందు ఎగబడతన్నాడు. అదేందంటే తంతన్నాడు, ఇంకా నేను బ్రతకటం అనవసరం." ఏడుస్తూ చెప్పింది పద్మావతి.
               
ఆవిడ చెప్పిన వివరాలు శ్రద్ధగా రాసుకున్నాను. This is a case of adjustment disorder with depressed mood.  కొద్దిగా భర్తని సెన్సిటైజ్ చేస్తే సరి. పద్మావతి భర్త సుబ్బారెడ్డిని నా కన్సల్టేషన్ చాంబర్లోకి పిలిపించాను.  
             
సుబ్బారెడ్డిది నిలువెత్తు అకారం, చామనఛాయ, బొర్రమీసాలు, చేతినిండా ఉంగరాలు, మెళ్ళో పులిగోరు చైన్, గోల్డ్ ఫ్రేమ్ కళ్ళజోడు. అతను ఇరవై ఎకరాల మోతుబరి రైతు. ఊళ్ళో పురుగు మందుల దుకాణం కూడా ఉందిట. చిన్నపాటి రాజకీయ నాయకుడు కూడా.      
             
"చూడండి సుబ్బారెడ్డిగారూ! మీ భార్య డిప్రెషన్లో ఉన్నారు. మందులు మాత్రమే వాడితే ప్రయోజనం ఉండదు. ఆవిడకి మీపై కొన్ని ఆరోపణలు ఉన్నయ్. వాటి జోలికి నేను పోను. దయచేసి ట్రీట్మెంటుకి మీరు సహకరించాలి."  
             
ఇక చాలు, ఆపమన్నట్లు ట్రాఫిక్ పోలీసులా చెయ్యెత్తి సంజ్ణ చేశాడు సుబ్బారెడ్డి.
             
"డాట్టరుగారూ! ఇంకేం సెప్పొద్దు. మందులు రాయండి, చాలు." అన్నాడు సీరియస్‌గా
             
ఒక్కక్షణం ఆగాను. "ఆవిడేం చెబుతున్నారంటే.."
             
"అయ్యా! మందులు రాసివ్వండి. మీరు చదువుకున్నోళ్ళు. నేను ఐదో కళాసుగాణ్ని. నానోటికి మంచిమాటలు రావు." కోపాన్ని కష్టంమీద కంట్రోల్ చేసుకుంటూ అన్నాడు సుబ్బారెడ్డి.  
             
"కానీ - మీ భార్య ఆత్మహత్య దాకా వెళ్ళారు కాబట్టి..."
             
ఇంక ఆగడం సుబ్బారెడ్డి వల్ల కాలేదు. "ఆ  అదీ.. ఆపని చేసే నా పరువు తీసింది. నలుగుర్లో తలెత్తుకోలేకపోతన్నా. తెల్లారి లేస్తే రోజుకి పది చెటిల్మెంట్లు చేస్తా. ఇప్పుడు నలుగుర్లో ఎదవనయిపోయా."    
             
నేనేం మాట్లాడలేదు. ఏంచెప్పి ఇతగాడిని దారికి తెచ్చుకుందామా అని ఆలోచిస్తున్నాను.
             
"అసలు నాకు పెళ్ళితోనే దరిద్రం పట్టింది డాట్టరుగారూ. ఈళ్ళ నాయిన యిస్కూలు టీచరు. ఇంట్లో ఈళ్ళమ్మదే పెత్తనం. ఈళ్ళ వొంసెమే అంత. మగోళ్ళంతా ఆడోళ్ళంటే ఉచ్చ పోసుకుంటారు. నన్నట్టా ఉండమంటే నావల్ల కాదు. నేసెప్తన్నా యినండి! ఆడదాని మాట ఇనే సన్నాసెదవలు మాఇళ్ళల్లో యాడా లేరు. మానాయనంటే మా అమ్మమ్మకీ, నాయనమ్మకి కూడా అడల్. రుస్తుంలాగా బతికాడు. నాది మానాయిన పోలిక. నన్నుకూడా తనబాబులాగా పెళ్ళాం మాటినే ఎదవనాకొడుకుని సేద్దామనుకుంటందేమో.. నీయమ్మ."  కోపంతో బుసలు కొడుతూ మీసాలు దువ్వుకున్నాడు సుబ్బారెడ్డి.
             
పద్మావతి పెద్దగా ఏడవటం ప్రారంభించింది. "అందుకే నేచస్తే నువ్వు హాయిగా ఉందువుగానీ.."

సుబ్బారెడ్డి పెద్దగా రంకెలెయ్యటం మొదలెట్టాడు.

"చావు. మరి చచ్చేదానివి పదిమాత్రలు మింగి యాక్సన్ చెశావే? నాకు పరువు ముక్యం. ఈరోజు నీ మూలకంగా - ఆడదాని మాట ఇనే ఎదవ లంజకొడుగ్గా మిగిలిపొయ్యా. నాబాధ ఎవురికి సెప్పుకునేది. ఇయ్యాల నేను ఊళ్ళోకి పెద్దమడిసిగా ఎడితే ముసల్లంజ కూడా నామాట ఇంటల్లా. బువ్వ తినకండా నట్టింట్లో ఏడస్తా ఉంటంటే..  సిగ్గు సంపుకుని.. ఏలు తగిలేసి నిన్ను డాట్టర్లకి సూపిత్తా ఉంటంటే.. నువ్వు ఈ ఇదాన నా బతుకుని బజారుకి ఈడుస్తావా? ఈ డాట్టరుకి నామీద చెప్పి.. నాకే నీతులు సెప్పిస్తావా? ఈ డాట్టరు కూడా మీనాయినలాంటోడే. ఎవడనుకున్నావు నన్ను? బాంచత్.. కోటిరెడ్డి కొడుకు.. సుబ్బారెడ్డి.. రుస్తుం.." అంటూ అవేశంతో ఆయాసపడుతూ, మీసాలు మెలేసుకుంటూ, నారూంలోంచి విసురుగా వాకౌట్ చేశాడు రుస్తుంరెడ్డి.. అదే.. సుబ్బారెడ్డి!

P.S.

సంఘటన - వాస్తవం.

పేర్లు - కల్పితం.  

(picture courtesy : Google)    

Monday, 27 June 2011

నాకు నచ్చిన విద్వాంసుడు


సితార్ రవిశంకర్, వీణ చిట్టిబాబు, ఈమని శంకరశాస్త్రి, షెహనాయ్ బిస్మిల్లాఖాన్ వంటి సంగీత విద్వాంసుల గూర్చి విన్నాను, కానీ వారినెప్పుడూ విన్లేదు. వీరంతా గొప్ప ప్రతిభావంతులని అందరూ అంటుంటారు కాబట్టి నేనూ అర్జంటుగా ఒప్పేసుకుంటున్నాను. అయితే నేనిప్పుడు రాయబోతున్న వ్యక్తి వేరు !

పూర్వపు నలుపు తెలుపు టీవీ రోజులు గుర్తున్నాయా? ఆ రోజుల్లోనే ఇందిరాగాంధి చనిపోయింది. వారం రోజులు సంతాపం. వినోద కార్యక్రమాలన్నీ రద్దు చేయగా - వయొలిన్ ప్రోగ్రాం ఒక్కటే వచ్చేది. ఆ వయొలిన్ వాద్యగాడు నల్లగా, పొట్టిగా ఉండే ఓ మధ్యవయసు ఆసామి. పొట్టి పంచెతో, నలిగిన కుర్తాతో, మాసిన గడ్డంతో - ఒక మహానాయకురాలు చనిపోయిన దేశంలో రోదనకి ప్రతీకగా ఉండేవాడు.

దించిన తల ఎత్తకుండా 'కువూయి, కువూయి' అంటూ తన ఏడుపుగొట్టు వయొలిన్ వాయిద్యాన్ని గంటలకొద్దీ వాయించేవాడు. అప్పుడప్పుడు 'చాలా? ఇంకా వాయించనా?' అన్నట్లు పక్కకి ఎవరికేసో చూస్తుండేవాడు. వార్తలు మొదలయ్యే సమయానికి హఠాత్తుగా వాయింపుడు ఆపేసి, వయొలిన్ పక్కన పెట్టేసి, రెండు చేతులు జోడించి 'నమస్కార్' అని చెప్పేవాడు. 

ఆయన నమస్కారం నాకు అనేకవిధాలుగా గోచరించేది. 'అమ్మయ్య! ఇవ్వాళ నాకు బియ్యానికి డబ్బులొచ్చేసాయ్!' అని ఆనందపడుతున్నవాడిగానూ, 'నాకు మళ్ళీ ఈ సంతాప కచేరీ అవకాశం ఎప్పుడొస్తుందోగదా!' అని ఆశ పడుతున్నవాడిలాగానూ అనిపించేది. ఆరోజుల్లో దూరదర్శన్ వారు అన్ని సంతాపాలకి ఆయన్నే పిలిచేవాళ్ళనుకుంటాను. ఒక దేశ పేదరికాన్నీ, దైన్యాన్నీ -  మొహంలోనూ, వాయింపుడులోనూ అంత తీవ్రంగా వ్యక్తీకరించడం అనితరసాధ్యం! 

పిమ్మట ఆయన రాజీవ్ గాంధి సంతాపదినాల్లోనూ దూరదర్శన్ని ఏలాడు. క్రమేణా కాంగ్రెస్ వాళ్ళకి అనుమానం వచ్చింది. 'సంతాప వాయింపుడు అవకాశాల కోసం ఈ వయొలిన్ విద్వాంసుడు పూజలూ గట్రా చేస్తున్నాడా?!' అని. ఈ లెక్కన తమ కాంగ్రెసు పార్టీకి దేశనాయకుడెవడూ మిగలడని ఒక నిర్ణయానికొచ్చిన కాంగ్రెస్సోళ్ళు ఆయన్ని పక్కన పెట్టేశారు. 

వయొలిన్ విద్వాంసులవారికి మళ్ళీ అవకాశం రాకపోడానికి ఒక బలమైన కారణం వుందని మా గోపరాజు రవి చెబుతాడు. ఆయన సోనియాగాంధి దగ్గరకి పోయి 'నమస్కార్!' అని ఒక నమస్కార బాణం వదిలి - 'అమ్మా! మీ అత్తగారికి నేనే వాయించాను. మీ ఆయనకి నేనే వాయించాను. మీకు కూడా నేనే వాయించే అవకాశం కలిపించండమ్మా!' అని వేడుకున్నాట్ట!

చివరాకరకి నే చెప్పొచ్చేదేమనగా - ఆవిధంగా నా అభిమాన విద్వాంసులవారు టీవీ (తెర) మరుగయ్యారు. సంతాపాలకి రోజులు కాకుండా పొయ్యాయి. కాంగ్రెస్సోళ్ళు 'అమ్మయ్య' అని ఊపిరి పీల్చుకున్నారు.  

(picture courtesy : Google)  

ఒక తిక్కవెధవ మరణం


ప్రతి మనిషికీ ఏదోక ఆనందం వుంటుంది. రోజూ పొద్దున్నే టీ త్రాగుతూ న్యూస్‌పేపర్ చదువుకోవటం నాకున్న ఆనందాల్లో ఒకటి. అయితే అప్పుడప్పుడు కొన్నివార్తలు నాకర్ధంకావు. ఉదాహరణకి ఇవ్వాళొక వార్త. 

'భార్య పుట్టింటికి వెళ్ళి తిరిగి కాపురానికి రావట్లేదనే నిరాశతో ఒక యువకుడి ఆత్మహత్య!' 

పెళ్ళాం పుట్టింటి నుండి తిరిగి రాకపోతే పండగ చేసుకోవాలిగానీ చావడమేమిటి! వీడేవడో బుర్రతక్కువ్వాళ్ళా వున్నాడు. ప్రపంచంలో రొజురోజుకీ పిచ్చెదవలు పెరిగిపోతున్నారు. 

కొంతమంది తిక్కవెధవలంతే, ఎప్పుడేం చెయ్యాలో తెలీదు. వీడెవడో పండగ చేసుకోవాల్సిన సందర్భంలో ఆత్మహత్య చేసుకున్నాడు. వీడి ఆత్మ పైకెళ్ళగానే - అక్కడి భార్యాబాధితసంఘ పిశాచాలన్నీ వీడు చేసిన బుద్ధి తక్కువ పనికి పీక్కుతింటాయేమో!  

(picture courtesy : Google)

గిరీశం.. మనోడే!


ప్చ్.. 'దేవదాసు పార్వతిలది అమరప్రేమ!' అనడం మేధావిత్వం. గిరీశం ప్రేమని మెచ్చుకోవటం అధమత్వం. అయినా సరే, ప్రస్తుతానికి అధముడిగానే గిరీశం కేస్ ప్రెజెంట్  చేస్తాను.   

గిరీశం చాలా ప్రాక్టికల్‌గా ఆలోచిస్తాడనీ, గొప్ప తెలివైనవాడనీ నా అభిప్రాయం! ఎందుకంటే - తిండికి గతిలేక పూటకూళ్ళమ్మని పట్టాడు, పెళ్ళి చేసుకుంటానని నమ్మించాడు. ముప్పొద్దులా దుక్కలా పూటకూళ్ళమ్మ తిండి తినేసి, ఆమె డబ్బులన్నీ దొబ్బేసి - మధురవాణిని ఉంచుకోటానికి ప్లాన్ చేశాడు. గిరీశం కన్నా తెలివైంది కాబట్టే, మధురవాణి గిరీశం మాటకారితనాన్ని ఇష్టపడ్డా అతన్ని నమ్మలేదు. అందుకే ఆమె రామప్పపంతులుతో వెళ్ళిపోడానికి సిద్ధపడింది

అందుకే ఉదర పోషణార్ధం శిష్యుడు వెంకటేశంతో కలసి అగ్నిహోత్రుడి పంచన చేరతాడు. పిల్లికి బిచ్చం పెట్టని అగ్నిహోత్రావధానుల్ని బురిడీ కొట్టించి, అతని సలహాదారుడౌతాడు. బుచ్చెమ్మని బుట్టలో వేసుకుంటాడు. చివరికి సౌజన్యారావు పంతులు గడ్డిపెడితే సింపుల్‌గా - "డామిట్, కధ  అడ్డం తిరిగింది!" అని డిజప్పాయింట్ అవుతాడే గానీ దిగులేసుకోడు. దేవదాసులా మందుకొట్టి విరహగీతాలు పాడుకోడు.    
                
'రైలందకపోతే బస్సు, బస్సందకపోతే ఆటో, ఏదీ అందకపోతే చివరాకరకి ఎడ్లబండి!' ఇదీ గిరీశం ధోరణి! దీన్నే యధార్ధవాదం అంటారు. ఇప్పుడు చెప్పండి - దేవదాసు, గిరీశంలలో ఎవరు బెటరో?

(photo courtesy : Google)   

Sunday, 26 June 2011

ప్రణవ్ ముఖర్జీ జీడిపప్పుల కధ


సోనియా గాంధీ కొలువు తీరింది. అదే - కాంగ్రెస్ పార్టీ 'కోర్ కమిటీ' మీటింగ్ జరుగుతుంది. ప్రణవ్ ముఖర్జీ నేతిలో వేయించిన జీడిపప్పుని నోరు కదపకుండా చప్పరిస్తున్నాడు. ఆంటోని కూనికిపాట్లు పడుతున్నాడు. మొయిలీ దొంగచూపులు చూస్తున్నాడు. చిదంబరం సోడాబుడ్డి కళ్ళద్దాల్లోంచి శూన్యంలోకి చూస్తున్నాడు. అక్కడందరూ మీటింగ్ ఎప్పుడయిపోతుందాని ఎదురు చూస్తున్నట్లుగా వున్నారు. మరైతే అప్పుడీ మీటింగెందుకు? ఏలినవారు ఇట్లాంటి హంగామా చెయ్యటం మహాభారతం రోజుల్నుండీ ఆనవాయితీగా వస్తుంది.
               
దుర్యోధనుడు కూడా ఇట్లాగే చాలా కోర్ కమిటీ మీటింగులు పెట్టేవాడు. బోల్డంత జీతాలు తీసుకుంటున్న భీష్ముడు, ద్రోణుడు, విదురుడు వంటి గడ్డం మేధావులు రారాజుకి మంచిసలహాలు ఇవ్వొచ్చు. "మై డియర్ దుర్యోదనా! ఎంతసేపూ ఆ ద్రౌపదిని నీ తొడమీద కూర్చోపెట్టుకోవాలనీ, బట్టలిప్పించాలనే వెకిలి ఆలోచనలు మానుకో. అసలు నీ పాండవుల obsession వదుల్చుకో. నువ్వు ఈ దేశాధినేతవి. ప్రజారక్షకుడిగా, జనరంజకంగా పాలించవోయి, అది నీ విధి." అని మాత్రం చెప్పరు.     
               
ఎందుకు? ఎందుకంటే - ఈ ముసలి సలహాదారులు పెద్ద అవకాశవాదులు. 'ఏం చెపితే ఏమవుతుందో! ఈరాజుగాడు ఎట్లా పోతే మనకేంటి? మనకి జీతం, గీతం బాగానే గిట్టుబాటవుతుందిగదా. అయినా ఈ దరిద్ర దుర్యోధనుడు శకుని మాటైతే వింటాడుగానీ మన మాటెందుకు వింటాడు? చచ్చినా వినడు. వీడు గనక యుద్ధంలో భీముడు చేతిలో చస్తే ధర్మరాజు కొలువులో చేరాలి. ఇంకొంచెం జీతం పెంచమని పైరవీలు చేసుకోవాలి.' అని మనసులో జీతభత్యాలు లెక్కలేసుకుంటూ - కనీసం చెప్పే ప్రయత్నం కూడా చెయ్యరు . 

ఇప్పుడు మీకు ఈ కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ మీటింగుల కధాకమామీషు అర్దమైందికదూ! ప్రణబ్ ముఖర్జీ జీడిపప్పులు తినడం మాని - "దొరసానమ్మా! ధరలు తగ్గించు, సామాన్యజనం ఆకలిచావులు చచ్చేట్లున్నారు. కాశ్మీర్ సంగతేం చేద్దాం? పొద్దస్తమానం నీ కొడుకుని ప్రధానమంత్రిని చెయ్యాలనే తాపత్రయం తగ్గించుకో  తల్లీ! భాజాపా గూర్చి బుర్రబద్దలు కొట్టుకోకు. ప్రజలకి నువ్వు మంచి చేస్తే ప్రజలే భాజాపాని పక్కన పెడతారు." అని వాస్తవాలు మాట్లాడడు. ఎందుకంటే ప్రణవ్ ముఖర్జీ బ్రతక నేర్చినవాడు. 

మరి ఏం ఆలోచిస్తుంటాడు? 'ఈ పిచ్చిది మనం ఎంతచెప్పినా తనకొడుకు రాహుల్ గాంధీ చెప్పినట్లే చేస్తుంది. అందుకే నోరు మూసుకుని హాయిగా ఇంకొంచెం జీడిపప్పు తిందాం. ఎట్లాగూ రేపు భాజాపా గవర్నమెంట్ వస్తే నా దొంగసొత్తు బయటకి రాకుండా అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్‌లతో బేరం కుదుర్చుకున్నా. కాబట్టి నేను సేఫ్. తేడాలొస్తే ఈ సోనియా, దీని కొడుకే శంకరగిరిమాన్యాలు పడతారు. నాకెందుకొచ్చిన ఆయాసం.' అని ఆలొచిస్తుంటాడు!

(pictures courtesy : Google) 

బోడిగుండుకి బట్టతలే శిక్ష


"తలనీలాలు ఇచ్చారు, ఏ దేవుడుకి సార్?" ఒక అతికుతూహల పేషంట్ అనవసరపు వాకబు. 
              
"డాక్టర్‌గారు! మీరు చాలా పధ్ధతిగల మనిషండీ. ఈ రోజుల్లో చదువుకున్నవారిలో భక్తిభావం అరుదుగా కనిపిస్తుంది!" ఒక మామ్మగారి అతిమెచ్చుకోలు.
             
'ఓ ప్రభువా! ఈ పాపిని రక్షించు!'
              
గత కొంతకాలంగా నెత్తిమీద కేశరహిత ప్రదేశం పెరగడం ఆగకపోవడం వల్ల.. జయసూర్య, బ్రూస్ విల్లిస్ మొదలగువారి నుండి స్పూర్తినొంది.. నేనూ బోడిగుండు చేయించుకొని.. ఫేషన్ గురు వలే పోజ్ కొట్టిన మొదటిరోజు అనుభవమిది!
              
మనది కర్మభూమి. ఇచ్చట ఫాషన్ గుండునీ, దేవుడి భక్తిగుండునీ ఒకేగాట గట్టే అజ్ఞానులే ఎక్కువ. భగవంతుణ్ణీ భక్తుణ్ణీ అంబికా దర్బార్ బత్తి ఎంత అనుసంధానం చేస్తుందో నాకు తెలీదు కానీ, బోడిగుండు మాత్రం ఖచ్చితంగా చేస్తుందని చెప్పగలను. 

'మానవునికి తన జుట్టు అందానికీ, అహంకారానికీ చిహ్నం. ఈ రెండూ ఆ దేవుడికి సమర్పించడం త్యాగానికీ, భక్తికీ కొలబద్ద' అని అంటాడు అన్నయ్య. అటులనే కానీండు, మరి గుండు దాచడానికి టోపీ ఎందుకు పెట్టుకుంటారో!
               
అయినా నా బట్టతలకో కథ ఉంది. నాకు మెడిసిన్ సీటొస్తే గుండు చేయిస్తానని మా అమ్మ తన ఇష్టదైవమైన ఆ తిరపతి వెంకన్నకి మొక్కుకుంది. కానీ నేను ససేమిరా అన్నాను. నాకు జుట్టుపై ప్రేమకన్నా.. కష్టపడి సాధించిన మెడికల్ సీటుని దేవునిఖాతాలో వెయ్యడానికి మనసొప్పలేదు. అంచేత ఏంచేయ్యాలో తోచని అమ్మ మధ్యేమార్గంగా రెండేళ్ళ మా అక్కకొడుక్కి గుండు కొట్టించింది.  

ఈ ఎడ్జస్టుమెంట్ గుండు ఆ దేవుడికి నచ్చినట్లు లేదు. అప్పటినుండీ వెంకటేశ్వరస్వామి నా మీద పగబట్టి.. నా నెత్తిమీద కల తనదైన బాకీ (జుట్టు)ని.. వాయిదాల పధ్ధతిన శాస్వతంగా తీసేసుకున్నాడు. ఫైనాన్స్ వ్యాపారివలే దేవుడు కూడా బాకీ వసూలు దగ్గర ఖచ్చితంగా ఉంటాట్ట - అమ్మ చెప్పింది!

'దేవుడు జుట్టునే బాకీగా ఎందుకు వసూలు చేసుకోవడం? ఏకంగా మెడిసిన్ సీటే వెనక్కి లాక్కోవచ్చుగా?' ఈ సందేహానికి అమ్మ దగ్గర రెడీమేడ్ ఆన్సర్ ఉంది. 'తిరపతి వెంకన్నకి అదెంతసేపు పని! కానీ ఆయన అలా చెయ్యడు. నువ్వు తన భక్తురాలి కొడుకువి! అంచేత ఏదో మందలించి వదిలేసినట్లు బట్టతల అనే తక్కువ శిక్ష వేశాడు, సంతోషించు.' అంటూ అమ్మ బల్ల గుద్దుతుంది, నమ్మక తప్పదు!

కాబట్టి ఇక్కడ మనం అర్ధం చేసుకోవాల్సింది - యుల్ బ్రిన్నర్, బ్రూస్ విల్లిస్, అమ్రిష్ పూరీ, గిబ్స్ మొదలైన బోడిగుండు వీరులంతా కూడా.. వారి తల్లుల మొక్కుల్ని కాదని, నాలా బట్టతలల బారిపడ్డారని! అప్పుడేకదా మా అమ్మ 'గుండుమొక్కులు - బట్టతల థియరీ' కరెక్టయ్యేది.

ఈమధ్య ఓ తోటి బట్టబుర్రవాడు బట్టతల మేధావిత్వానికీ, మగతనానికీ ప్రతీకలనీ.. ఇంకా ఏవో చాలా చెప్పాడు. కానీ వాడు తన బట్టతల గూర్చి తీవ్రంగా వ్యాకులత చెందుతూ.. ఆ భాధ తప్పించుకోడానికి మాత్రమే ఈరకమైన వాదనలని తలకెత్తుకున్నాడని అర్ధమైంది. నాకు మాత్రం నా జుట్టులేమి మీద అంత ఆత్మన్యూనతా భావమేమి లేదు. 'ఉంటే మంచిదే.. ఉండకపోతే మరీ మంచిది!' లాంటి ఉదాసీనవైఖరి తప్ప!
  
(photo courtesy : Google)