Monday 27 June 2011

నాకు నచ్చిన విద్వాంసుడు


సితార్ రవిశంకర్, వీణ చిట్టిబాబు, ఈమని శంకరశాస్త్రి, షెహనాయ్ బిస్మిల్లాఖాన్ వంటి సంగీత విద్వాంసుల గూర్చి విన్నాను, కానీ వారినెప్పుడూ విన్లేదు. వీరంతా గొప్ప ప్రతిభావంతులని అందరూ అంటుంటారు కాబట్టి నేనూ అర్జంటుగా ఒప్పేసుకుంటున్నాను. అయితే నేనిప్పుడు రాయబోతున్న వ్యక్తి వేరు !

పూర్వపు నలుపు తెలుపు టీవీ రోజులు గుర్తున్నాయా? ఆ రోజుల్లోనే ఇందిరాగాంధి చనిపోయింది. వారం రోజులు సంతాపం. వినోద కార్యక్రమాలన్నీ రద్దు చేయగా - వయొలిన్ ప్రోగ్రాం ఒక్కటే వచ్చేది. ఆ వయొలిన్ వాద్యగాడు నల్లగా, పొట్టిగా ఉండే ఓ మధ్యవయసు ఆసామి. పొట్టి పంచెతో, నలిగిన కుర్తాతో, మాసిన గడ్డంతో - ఒక మహానాయకురాలు చనిపోయిన దేశంలో రోదనకి ప్రతీకగా ఉండేవాడు.

దించిన తల ఎత్తకుండా 'కువూయి, కువూయి' అంటూ తన ఏడుపుగొట్టు వయొలిన్ వాయిద్యాన్ని గంటలకొద్దీ వాయించేవాడు. అప్పుడప్పుడు 'చాలా? ఇంకా వాయించనా?' అన్నట్లు పక్కకి ఎవరికేసో చూస్తుండేవాడు. వార్తలు మొదలయ్యే సమయానికి హఠాత్తుగా వాయింపుడు ఆపేసి, వయొలిన్ పక్కన పెట్టేసి, రెండు చేతులు జోడించి 'నమస్కార్' అని చెప్పేవాడు. 

ఆయన నమస్కారం నాకు అనేకవిధాలుగా గోచరించేది. 'అమ్మయ్య! ఇవ్వాళ నాకు బియ్యానికి డబ్బులొచ్చేసాయ్!' అని ఆనందపడుతున్నవాడిగానూ, 'నాకు మళ్ళీ ఈ సంతాప కచేరీ అవకాశం ఎప్పుడొస్తుందోగదా!' అని ఆశ పడుతున్నవాడిలాగానూ అనిపించేది. ఆరోజుల్లో దూరదర్శన్ వారు అన్ని సంతాపాలకి ఆయన్నే పిలిచేవాళ్ళనుకుంటాను. ఒక దేశ పేదరికాన్నీ, దైన్యాన్నీ -  మొహంలోనూ, వాయింపుడులోనూ అంత తీవ్రంగా వ్యక్తీకరించడం అనితరసాధ్యం! 

పిమ్మట ఆయన రాజీవ్ గాంధి సంతాపదినాల్లోనూ దూరదర్శన్ని ఏలాడు. క్రమేణా కాంగ్రెస్ వాళ్ళకి అనుమానం వచ్చింది. 'సంతాప వాయింపుడు అవకాశాల కోసం ఈ వయొలిన్ విద్వాంసుడు పూజలూ గట్రా చేస్తున్నాడా?!' అని. ఈ లెక్కన తమ కాంగ్రెసు పార్టీకి దేశనాయకుడెవడూ మిగలడని ఒక నిర్ణయానికొచ్చిన కాంగ్రెస్సోళ్ళు ఆయన్ని పక్కన పెట్టేశారు. 

వయొలిన్ విద్వాంసులవారికి మళ్ళీ అవకాశం రాకపోడానికి ఒక బలమైన కారణం వుందని మా గోపరాజు రవి చెబుతాడు. ఆయన సోనియాగాంధి దగ్గరకి పోయి 'నమస్కార్!' అని ఒక నమస్కార బాణం వదిలి - 'అమ్మా! మీ అత్తగారికి నేనే వాయించాను. మీ ఆయనకి నేనే వాయించాను. మీకు కూడా నేనే వాయించే అవకాశం కలిపించండమ్మా!' అని వేడుకున్నాట్ట!

చివరాకరకి నే చెప్పొచ్చేదేమనగా - ఆవిధంగా నా అభిమాన విద్వాంసులవారు టీవీ (తెర) మరుగయ్యారు. సంతాపాలకి రోజులు కాకుండా పొయ్యాయి. కాంగ్రెస్సోళ్ళు 'అమ్మయ్య' అని ఊపిరి పీల్చుకున్నారు.  

(picture courtesy : Google)  

5 comments:

  1. చాలా బాగా రాసారండీ..ముఖ్యంగా మీ అత్తగారికీ నేనే, మీ ఆయనకీ నేనే అనే వాక్యాలు..మనీలో రాఘవేంద్రరావుకీ నేనే, రామ్ గోపాల్ వర్మకీ నేనే టైప్లో తనికెళ్ళభరణి గుర్తొచ్చి భలే నవ్వొచ్చింది...కానీ పోస్టు రెండుసార్లు పేస్టు అయినట్టుంది..)ఒకే దగ్గర..ఒకదాన్ని తొలగించండి.

    ReplyDelete
  2. హహ భలే రాసారు! :))))

    ReplyDelete
  3. సుధ గారు , ఆ.సౌమ్య గారు .. మీ అభినందనలకి చాలా థాంక్స్ . ఈ పోస్ట్ రెండు సార్లు పేస్ట్ ఎందుకయ్యిందో నాకు తెలీదు . దాన్ని తొలగించటం అంతకన్నా తెలీదు . ఈ మధ్యే బ్లాగ్ పోస్ట్ చెయ్యటం నేర్చుకున్నా . దీనికే నాకు హిమాలయపర్వతం ఎక్కినంత ఆనందంగా ఉంది . బ్లాగుల గూర్చి నా పరిమిత జ్ణానాన్ని పెద్దమనసుతో అర్ధం చేసుకోవలసినదిగా విజ్ణప్తి .

    ReplyDelete
  4. మీగ్గానీ కథల్రాసే ఉద్దేశముంటే ఈ కాఫ్కాయిస్క్ పాత్రను సానపెట్టేయండి. లేకపోతే నాబోటి వాడికి అప్పిచ్చినా సరే!

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.