నిత్యానందుని శృంగారం, కల్కివారి మత్తుమందులు, విజ్ఞుల ఆక్రందనలు - టీవీలో చూళ్ళేక ఛస్తున్నా. ఒకప్పుడు బాబాలు - తగ్గని రోగాలకీ, రాని ఉద్యోగాలకీ, పుట్టని పిల్లలకీ తాయెత్తులు కట్టేవాళ్ళు. ప్రస్తుతం ఈ బాపతు మనూరి మునిసిపాలిటీ బడివలే పేదోళ్ళకే పరిమితమయ్యారు.
ఇప్పుడు అమెరికా అనకాపల్లి కన్నా దగ్గరైపోయింది. డాలర్లు ఏరులై పారుతున్నాయ్. మన అవసరార్ధం కార్పోరేట్ ఆసుపత్రులూ, షాపింగ్ మాల్సూ, పబ్బులూ, క్లబ్బులూ వెలిశాయి. యోగా, భక్తిమార్గం corporatize చేసుకొన్నాం. యోగం, ధ్యానం, ఆత్మ, జీవాత్మ, పరమాత్మ, అంతరాత్మలను కలగలుపుతూ ఇంగ్లీషులో అనర్గళంగా ప్రసంగించే కొత్తదేవుళ్ళని సృష్టించుకొన్నాం.
మన career prosperity కి వారి పాలరాతి మందిరాల్లో, భక్తిప్రసాద రిసార్టుల్లో ముక్తి నొసంగెదరు, మనకి గుండెల నిండా గాలి ఎలా పీల్చుకోవాలో నేర్పించెదరు, మనసులోని కుళ్ళు వదిలించెదరు. డబ్బున్నబాబులకి ఈ భక్తి టూరిజం ఓ ముక్తిమార్గం. కాదన్డానికి మనవెవరం?
ప్రజల అవసరార్ధం గిరీశాలు పుట్టుకొస్తారు. సొమ్ము చేసుకొంటారు. గిరీశాన్ని నమ్మి లేచిపోయిన బుచ్చమ్మది తప్పవుతుందిగానీ.. తన వాక్చాతుర్యంతో బుచ్చమ్మని నమ్మించిన గిరీశానిది తప్పెలా అవుతుంది?!
రూపసి అయిన గిరీశం నాలుగు బొట్లేరు ఇంగిలీసు మాటలతో (గిరీశం పట్ల గల అసూయతో రామప్ప పంతులు బొట్లెరింగ్లీషంటాడే గానీ గురజాడవారు గిరీశంతో మంచి ఇంగ్లీషే మాట్లాడించారు.) బుచ్చమ్మని పడేసాడు. వైధవ్యం నుండీ అగ్నిహోత్రుని అగ్నినుండీ విముక్తి లభిస్తుందని బుచ్చమ్మ నమ్మింది. అయినా లేవదీసుకుపోయిన గిరీశానికీ, లేచిపోయిన బుచ్చెమ్మొదినకీ లేని బాధ మనకేల?
మోసం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే వస్తుమార్పిడి వంటిది. చదరంగం ఆట లాంటిది కూడా. మనమెవ్వరి పక్షమూ వహించనక్కర్లేదు. కానీ నాకు గిరీశాలన్నా, నిత్యానందులన్నా అసూయ - ఎందుకు? మోసం చెయ్యడానికి తెలివి కావాలి. ఆ తెలివి లేనివాడు మాత్రమే భవిష్యత్తు కోసం, భుక్తి కోసం చదువనో, వ్యాపారమనో నానా కష్టాలు పడతాడు. నేను రెండో కేటగిరీకి చెందినవాణ్ణి, అందుకు!
(picture courtesy : Google)