Wednesday 20 July 2011

బిరుదులు - బరువులు


టీవీలో ఏదో సినిమా వేడుక చూపిస్తున్నారు. వేదికపై కళాతపస్వి, దర్శకేంద్రుడు, దర్శకరత్న, యువసామ్రాట్, మెగాస్టార్ మొదలైన పెద్దలు ఆశీనులైవున్నారు. ఈ బిరుదులు, విశేషణాలు ఎవరన్నా ఇచ్చారో, వాళ్ళే తగిలించుకున్నారో నాకు తెలీదు. 

'విశ్వవిఖ్యాత నటసార్వభౌమ' అని ఎన్టీరామారావుకి ఒక బరువైన బిరుదుంది. అయితే ఆంధ్రరాష్ట్రం దాటితే నటుడు ఎన్టీఆర్ అంటే ఎవరికీ తెలీదని నా నమ్మకం. 'నవరసనటనా సార్వభౌమ' అంటూ సత్యనారాయణకి కూడా ఒక మెలికల బిరుదుంది. నవరసాల సంగతెందుగ్గాని సత్యనారాయణ ప్రేమరసం అభినయిస్తే జనాలు పారిపోతారని నమ్ముతున్నాను.

మన తెలుగువాడికి పేరుకి ముందు ఏదో ఒక విశేషణ తగిలించుకుంటేగానీ తుత్తిగా ఉండదేమో! భౌతికశాస్త్ర భయంకర Newton, మనోకల్లోల Freud, చిత్తచాంచల్య Adler, కథకచక్రవర్తి Maupassant, శాంతివిభూషణ J.F. Kennedy, జగదోద్ధారక Karl Marx, నటనాడింఢిమ Marlon Brando, హాస్యవిశారద Charlie Chaplin - ఇట్లా పేర్లముందు నానాచెత్త చేర్చి పైశాచికానందాన్ని పొందుతాం. వాళ్ళు తెలుగువాళ్ళు కాదు కాబట్టి పెనుప్రమాదం తప్పించుకున్నారు!  

బిరుదుల విషయంలో ప్రభుత్వాలూ భలే ఉత్సాహంగా వుంటాయి. పద్మశ్రీ, పద్మవిభూషణ్ వగైరా అవార్డుల పేర్లతో తెగ హడావుడి చేస్తాయి. సూర్యకాంతానికి ముందు పద్మశ్రీ అని చేర్చి - పద్మశ్రీ సూర్యకాంతం అని చదువుకోండి. అబ్బ, ఎంత ఎబ్బెట్టుగా ఉంటుందో! మరప్పుడు ఈ బిరుదులకి కల ప్రయోజనమేమి!? 

ప్రతిభకి అసలైన బిరుదు సామాన్యప్రజలే ఇచ్చేస్తారని నా అభిప్రాయం. 'ఎన్టీవోడు ఇరగదీసాడ్రా, నాగ్గాడు అదరగొట్టాడు, కైకాలోడికి తిక్క కుదిరింది. దరిద్రప్ముండ సూర్యకాంతం - పాపం! సావిత్రిని రాచిరంపాన పెడ్తుంది.' మెచ్చుకునేప్పుడు కూడా ముద్దుగా తిట్టుకుంటూ మెచ్చుకునే అలవాటు మనది. అసలైన బిరుదులు ఇవేనని నా అభిప్రాయం.

(picture courtesy : Google)         

10 comments:

  1. "ప్రతిభకి అసలైన బిరుదు సామాన్య ప్రజలే ఇచ్చేస్తారు. ప్రభుత్వాలు కాదు. ఎన్టీ వోడు ఇరగదీసాడ్రా. నాగ్గాడు అదరగొట్టాడు. కైకాలోడికి తిక్క కుదిరింది. ఈ సూర్యకాంతం ముండ ఎప్పుడు చస్తుందోనమ్మ! దీని నోరు పడ! ఈ శ్రీ శ్రీ దుంప తెగ, ఎంత అద్భుతంగా రాస్తాడండీ! మెచ్చుకునేప్పుడు కూడా ముద్దుగా తిట్టుకుంటూ మెచ్చుకునే అలవాటు మనది. అసలైన బిరుదులు ఇవేనని నా అభిప్రాయం."

    Perfect!!

    ReplyDelete
  2. భేష్ భేష్...చప్పట్లు చప్పట్లు!

    సూర్యకాంతం ని చూసి కసి తీర తిట్టుకునేవాళ్ళని చూసి నేను అనుకునేదాన్ని" ఈవిడ ఎంత ప్రతిభాశాలి, ఇంతమంది చేత తిట్టించుకుంటున్నాదంటే ఆవిడ నటన అనన్యసామాన్యం కదూ" అని.

    ReplyDelete
  3. ఇండియన్ మినర్వా గారు చెప్పిన బిరుదులే నేనూ అంగీకరిస్తాను.

    భౌతిక శాస్త్ర భయంకర న్యూటన్, మనోకల్లోల ఫ్రాయిడ్, చిత్త చాంచల్య ఎడ్లర్, కథక చక్రవర్తి మొపాసా, శాంతి విభూషణ జె.ఎఫ్.కెనడీ, జగదుద్దారక కారల్ మార్క్స్, నటనా డింఢిమ మార్లన్ బ్రాండో, హాస్యవిశారద చార్లీ చాప్లిన్ ......:-))))))))

    ReplyDelete
  4. ఏముందండీ ఈ బిరుదుల గురించి చెప్పడానికి, బహిరంగ రహస్యమే.. ఇప్పుడు కొత్తగా విదేశీ (మనం ఎప్పుడో పేరు కూడా వినని) యూనివర్సిటీల నుంచి డాక్టరేట్లు కూడా సంపాదిస్తున్నారు కదా.. అన్నట్టు, ఆ వర్డ్ వెరిఫికేషన్ తీసేసి, కామెంట్ మోడరేషన్ పెట్టుకోండి.. వ్యాఖ్యలు రాసేవాళ్ళకి, మీకూ కూడా సౌకర్యంగా ఉంటుంది.

    ReplyDelete
  5. నా బ్లాగుని చదివి .. కామెంట్ కూడా రాసిన రాజేంద్రకుమార్ దేవరపల్లిగారికి, Indian Minerva గారికి, ఆ.సౌమ్యగారికి, సుజాతగారికి మరియూ మురళిగారికి .. హ్రుదయపూర్వక ధన్యవాదాలు.
    @మురళిగారు, మీ సలహా పాటిస్తున్నాను. థాంక్సండి.

    ReplyDelete
  6. బాగా చెప్పావురా అబ్బీ!
    ఇది మనకొక అంటూ జాడ్యం అయిపొయింది. అడ్రస్ రాసే ముందు శ్రీ అని శ్రీమతి అని, చివరలో గారు, గారికి అని తగిలించాలి. లేకపోతె మనమేమో వాళ్లకి మర్యాద ఇవ్వట్లేదు అనుకొంటారు. పెళ్లి కార్డులో పేరు పక్కన డిగ్రీ పెట్టి 'కి' ఇచ్చి అని వేస్తారు అంటే పెళ్ళికొడుకు/కూతురు కి ఇస్తున్నారో లేకపోతె డిగ్రీ లకి పెళ్లి చేస్తున్నారో తెలియదు.
    రమణ

    ReplyDelete
  7. అదర గొట్టావ్, బహు ప్రముఖ హాస్య బ్లాగు వీరా,అసాధారణ నిశిత విమర్శకా, సంఘ సంస్కారా, రమణా
    బి ఎస్ ఆర్

    ReplyDelete
  8. Sorry, I disagree.
    ఏదైనా కళలో నిష్ణాతులకి బిరుదులిచ్చి గౌరవించుకోవడం మన ఆచారం. ఒక విధంగా అది మన సమాజంలో కళాపోషణకి కళాతృష్ణకి ఉండే సూచన.
    ఇప్పుడూ పుచ్చుకుంటున్నావారు అర్హులా కాదా అనేది వేరే విషయం. ఒక బిరుదు వచ్చాక దాన్ని కండువాలాగా బుజాలుచుట్టూ వేసుకునో, గొడుగులాగా తలపైన పట్టుకునో అలా ఊరేగాలా అంటే - అది కూడా వేరే విషయమే. కానీ గొప్ప కళాకారులకి ఇటువంటి సత్కారాలు బిరుదులు జరుగుతుండాలి.

    ReplyDelete
  9. chala baga rasarandi. mirannatlu birudu baruvula chakram lo irukkokudadu

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.