Friday 1 July 2011

రావిశాస్త్రిని గాంచిన వేళ


"ఇది ఇందూదేసెం! ఈ దేసంలోనే గాదు, ఏ దేసంల అయినసరె పోలోసోడంటే గొప్ప డేంజిరిస్ మనిసని తెలుసుకో! ఊరికి ఒకుడే గూండా ఉండాలా, ఆడు పోలీసోడే అవాల. అప్పుడె రాజ్జెం ఏ అల్లర్లు లేకండ సేంతిబద్రతలు సక్కగ ఉంటయ్. అంచేత్త ఏటంతే, పులికి మీసాల్లాగినట్లు పోలోసోడితో దొంగసరసం జెయ్యకు! సాలా డేంజిరు!.. "

ఈ వాక్యాలు ఎవరివో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు సాహిత్యంలో ఇలా రాయడం ఒక్క రావిశాస్త్రికి మాత్రమే సాధ్యం. పై వాక్యాలు 'మూడుకథల బంగారం'లో సూర్రావెడ్డు బంగారిగాడికి చేసిన ఉపదేశం.

ఒక పద్ధతిగా, ప్రశాంతంగా, హాయిగా, నింపాదిగా సాగిపోతున్న నా జీవితం - ఒక్కసారిగా పెద్ద కుదుపుకు లోనయ్యింది. అందుక్కారణం రావిశాస్త్రి! నేను హౌజ్ సర్జన్సీలో ఉండగా 'ఆరుసారా కథలు' చదివాను. ఆ భాషా, ఆ వచనం, ఆ భావం - దిమ్మ తిరిగిపోయింది. 

అంతకుముందు వరకు స్థిరంగా, గంభీరంగా నిలబడే అక్షరాల్ని చదివాను గానీ - లేడిలా చెంగుచెంగునా పరుగులు తీస్తూ, పాములా సరసరా మెలికలు తిరిగే వచనాన్ని నేనెప్పుడూ చదవలేదు. ఆ తరవాత రావిశాస్త్రిని ఒక్కపేజీ కూడా వదల్లేదు. నాకు గుర్తున్నమటుకు నా మెడిసిన్ సబ్జక్టు పుస్తకాలు కాకుండా రిపీటెడ్‌గా చదివింది రావిశాస్త్రినే! శ్రేయోభిలాషులైన నా మిత్రులు 'పీజీ ఎంట్రన్స్ పరీక్షలకి ప్రిపేర్ అవ్వాలి గానీ నీకీ రావిశాస్త్రి పిచ్చేమిటి?' అని విసుక్కున్నారు.

విశాఖపట్నం వెళ్ళాలి, రావిశాస్త్రిని కలవాలి. ఎలా? ఎలా? ఎలా? నాకు విశాఖపట్నం వెళ్ళడం సమస్య కాదు, కానీ రావిశాస్త్రిని ఎలా కలవాలి? అందుగ్గాను ఎవర్ని పట్టుకోవాలి? ఇదే సమస్య. 

'రావిశాస్త్రిని కలిసి ఏం మాట్లాడతావోయ్?' 

'అయ్యా! దేవుణ్ని దర్శనం చేసుకోవాలి, కుదిర్తే కాళ్ళ మీద పడి మొక్కాలి. అంతేగానీ - దేవుడితో మాట్లాడాలనుకోవడం అత్యాశ!'

ఈ రకమైన ఆలోచనల్లో వుండగా - విశాఖ ప్రయాణం ఒకరోజు రాత్రికిరాత్రే హడావుడిగా పెట్టుకోవలసొచ్చింది. కారణం - మా సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ ENB శర్మగారి అవసానదశ. పనిలోపనిగా రావిశాస్త్రిని కూడా కలవాలనే ఎజెండా కూడా నా ప్రోగ్రాంలో చేర్చాను. ఆ రోజంతా రావిశాస్త్రి ఇంటి ముందు బీటేసినా లాభం లేకపోయింది.

కొన్నాళ్ళకి నా అదృష్టం ధనలక్ష్మి లాటరీ టిక్కెట్టులా తలుపు తట్టింది. రావిశాస్త్రి ఒక పుస్తకావిష్కరణ సభకి గుంటూరు రావడం జరిగింది. చివరిక్షణంలో సమాచారం తెలుసుకున్న నేను 'భలే మంచిరోజు, పసందైన రోజు' అని మనసులో పాడుకుంటూ ఉరుకుపరుగులతో ఏకాదండయ్య హాలు దగ్గరకి చేరుకున్నాను. 

అక్కడ హాల్ బయట ఓ పదిమంది నిలబడి కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు. నేనూ ఓ పక్కగా నించుని రావిశాస్త్రి కోసం ఎదురు చూడసాగాను. ఒక్కొక్కళ్ళుగా సభస్థలానికి చేరుకుంటున్నారు. 'రావిశాస్త్రి రాలేదేమో?' కొద్దిగా అనుమానం, ఇంకొద్దిగా నిరాశ. 

ఓ పదినిమిషాలకి - అర చేతుల చొక్కా టక్ చేసుకుని - తెల్లటి వ్యక్తి, నల్లటి ఫ్రేం కళ్ళద్దాలతో నిదానంగా నడుచుకుంటూ ఆవరణలోకి రావడం కనిపించింది. ఆ వ్యక్తి ఎవరో నాకెవ్వరూ చెప్పనక్కర్లేదు. ఆ వ్యక్తి నాకు అనేక ఫోటోల ద్వారా చిరపరిచితం. ఆయన రావిశాస్త్రి!

క్షణాలు లెక్క పెట్టుకుంటూ ఎంతో ఉద్వేగంగా రావిశాస్త్రి కోసం ఎదురు చూసిన నేను - తీరా ఆయన వచ్చేసరికి చేష్టలుడిగి నిలబడిపొయ్యాను. ఈ లోపు కొందరు ఆయనతో మాట్లాడ్డం మొదలెట్టారు. రావిశాస్త్రినే గమనిస్తూ ఆయనకి సాధ్యమైనంత సమీపంలో నిలబడ్డాను. ఈలోపు నేను మెడికల్ డాక్టర్నని ఆయనకెవరో చెప్పారు. నాకేసి చూస్తూ 'మా చెల్లెలు నిర్మల తెలుసా?' అనడిగారు.

'తెలుసు. వారు నాకు ఫార్మకాలజి పరీక్షలో external examiner సార్.' అని బదులిచ్చాను. మా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇంతే!

రావిశాస్త్రి ప్రక్కన చాలాసేపు గడిపాను (నిలబడ్డాను). ఒక్కమాట మాట్లాడలేదు. ఎవరెవరో ఏంటేంటో అడుగుతున్నారు. అవన్నీ - 'రాజు - మహిషి' ఎప్పుడు పూర్తిచేస్తారు? 'రత్తాలు రాంబాబు'ని పూర్తి చెయ్యకుండా ఎందుకు వదిలేశారు?' వంటి రొటీన్ ప్రశ్నలే. అవన్నీ నా మనసులో మెదలాడే ప్రశ్నలే! అయితే - నాకు వాళ్ళ సంభాషణ చికాకు కలిగించింది. 

'రావిశాస్త్రి నావాడు, నాకు మాత్రమే చెందినవాడు, నా మనిషిని ఇబ్బంది పెడతారెందుకు? అసలిక్కడ మీకేం పని? పోండి పోండి!'

నేను తెలివైనవాణ్ని. అందుకే కళ్ళు పత్తికాయల్లా చేసుకుని రావిశాస్త్రినే చూస్తూ ప్రతిక్షణం నా మనసులో ముద్రించుకున్నాను. ఎందుకంటే - నాకు తెలుసు. ఆ క్షణాలు నా జీవితంలో అమూల్యమైనవిగా కాబోతున్నాయని. అందుకే ఈ రోజుకీ రావిశాస్త్రి నాకు అతి దగ్గరలో నిలబడి ఉన్నట్లుగా అనుభూతి చెందుతాను. ఈ అనుభూతి నాకు ఎంతో ఆనందాన్ని, మరెంతో తృప్తినీ కలిగిస్తుంది. 

ఒక్కోసారి అనిపిస్తుంది - నేనారోజు రావిశాస్త్రి ముందు ఎందుకలా నిలబడిపోయాను!? ఒక మహోన్నత శిఖరం ముందు నిలబడ్డప్పుడు ఆ దృశ్యసౌందర్యానికి spellbound అయిపోయి.. చేష్టలుడిగి నిలబడిపోతాం. ఆ రోజు నా స్థితి అట్లాంటిదేనా? అయ్యుండొచ్చు! 

(photo courtesy : Google)     

10 comments:

  1. మనలో చాలామంది రావిశాస్త్రిమీద పిచ్చిప్రేమ (అలా వద్దనుకుంటే అభిమానం అనుకోండి) పెంచుకున్నవాళ్ళు ఎంతో మంది ఉండే ఉంటారు.. వారిలో ఎవరూ మీలా ఇలా టపా రాయలేదంతే...మనం ప్రాణంగా అభిమానించే వ్యక్తులు ఎదుటపడినప్పుడు, ఎంత ప్రీప్లాన్డ్ గా ఉన్నా ఈ అనుభవం ఇలాగే ఉంటుంది. నోటమాటరాదు,నిలువుగుడ్లు పడతాయి..ఒకవేళ మాట వచ్చినా మనకంతకు ముందు లేని కొత్త విద్య అదే మాట నట్టుతూ ఉండడం కూడా వస్తుంది.కొండొకచో అదే నత్తిగా కూడా పర్యవసిస్తుంది.ఇలాంటి వింత అనుభవం ముళ్ళపూడివారితోను, రావిశాస్త్రిగారిని కలిసినప్పుడు నేను పొందాను. రావిశాస్త్రిగారికి పరిచయం అవగానే ఇంటిపేరు అడగడం అలవాటుట. నన్నూ అలాగే అడిగి..ఆ పేరుగల రచయితలు తెలుసా అని నా జవాబుతో మరో నాలుగు మాటలు మాట్లాడేరు నాతో..మద్రాసు కాపురంలో ఎన్నిసార్లు బాపు,ముళ్ళపూడిగారిని ఎదురుపడ్డానో, పక్కపక్కనే నిలబడి ఉన్నప్పుడు కూడా వారిని చూస్తూనే కళ్ళునింపుకున్నాను కానీ మాటాడలేకపోయేదాన్ని..మీ పోస్టుచూస్తే అవన్నీ గుర్తొస్తున్నాయి.అందుకే మీ టపాలోనే నా అనుభవం కూడా రాసేస్తున్నా.రావిశాస్త్రి, ముళ్ళపూడి నాకు రెండు కళ్ళు....

    ReplyDelete
  2. ఎంత యాదృచ్చికం!! ఇవాళే నేను 'రావిశాస్త్రీయం' చదవడం పూర్తి చేశాను...
    నిజమే. దూరం నుంచి అభిమానించే వాళ్ళతో దగ్గరికి వెళ్తే మాట్లాడ లేమండీ..

    ReplyDelete
  3. మన మెయిల్ బాక్స్ కన్నా ఎక్కువగా కట్టుకున్న వాళ్ళ మెయిల్ బాక్స్ చెక్ చేసే మంచి అలవాటున్న వాళ్ళలో నాదే మొదటి స్థానం. అలా చూస్తూ వుండే రోజుల్లో ఈ బ్లాగ్ ఓనర్ గారి రచనలు నా కంట బడ్డాయి. ఆహా తెలుగక్షరాలు అంటూ చదివి, ఇన్స్పయిర్ అయ్యి, ఏవో పనికి మాలిన రచనలు మొదలు పెట్టాను.

    బ్లాగ్ ప్రారంభించిన సందర్భంగా ఓ అభినందన

    మీరందరూ ఆ పరుపుల మీద సెటిల్ అవ్వండి.

    ఆ వెనక కూర్చున్న ఆయన ముందుకు రావాలి.

    చూడండి మీరు ఇది బిగ్గరగా చదవండి. అలా ముసిముసి నవ్వులు నవ్వుతూ ఒకటే ఫీల్ అయ్యి పోకండి. మీకేదో పెద్ద తల్కాయ ఉందని పిలవ లేదు. మీకున్న అర్హత అల్లా ఆ పట్టు ఉత్తరీయం.

    కానివ్వండి నా అభినందన తవిక.

    ఆగండి. ఉగాది కవిత చదివారా ఎప్పుడైనా? ఏంటీ విన్నారా? సరే కానివ్వండి. అల్లాగ చదవాలి.

    R  పెట్టిన చోట మరొక్క సారి అనండి.

    V  పెట్టిన చోట మీరంతా వహ్వా వహ్వా అనాలి.

    C  అంటే చప్పట్లు


    మీ తెలుగక్షరాలు
    R
    నా పాలిట అగ్గిపుల్లలు
    R
    వెలిగించెను తిక్క రాతల దీపాలు
    V
    మీ తెలుగక్షరాలు
    R
    అక్షరాలు కావవి, తాళాలు
    R
    తెరిచాయి నా పిచ్చి రచనల వాకిళ్ళు
    V
    ఏవీ నాకు నచ్చిన " భోజనాలు- భయాలు"
    R R
    బ్లాగులో ఉంచమని వేడి కోలు
    V
    మీ తెలుగక్షరాలు
    R
    చెప్పాలి స్వాగతాలు
    R
    రావాలి నాలాగా ఏకలవ్యులు
    V
    ఇవ్వలేను బొటన వేలు
    R R
    కావాలిగా మరి జీతపు రాళ్ళు/ వేలు
    C C

    ReplyDelete
  4. Small mistake while pasting the text. Add this B 4 u compete.

    ఆగండి, చదవగానే వెళ్ళిపోవటమేనా? ఆ ఉత్తరీయం తీసి ఈయనకి కప్పి వెళ్ళండి.

    ReplyDelete
  5. రావిశాస్త్రిగారిని యేళ్లతరబడి చూస్తూ ఉండిపోయిన వాళ్లలో నేను ఒకడ్నిఅంటే యూనివర్శిటీ విద్యార్థిగా,జర్నలిస్టు అయ్యాక కూడా ఆయనతోమాట్లాడలేకపోవటం ఇప్పటికీ నాకు వింతగానే ఉంది.అందుకే ఇప్పుడు ఎవరు కనిపించినా మాట్లాడించకుండామాత్రం ఉండను కారాగారితో సహా,

    ReplyDelete
  6. నేను రవి శాస్త్రి గారి ” ఆరు సారా కథలు ” పుస్తకం కొరకు వెతుకుచున్నాను , దయచేసి ఎక్కడ దొరుకుతుందో తెలియచేయగలరు , కృతఙ్ఞతలు

    హనుమంతు (న్యాయవాది) : 8121112333
    విజయవాడ.

    ReplyDelete
    Replies
    1. రావిశాస్త్రి 'ఆరు సారా కథలు' ప్రస్తుతం అలభ్యం. హైదరాబాద్ నవోదయా వాళ్ళు పబ్లిష్ చేస్తున్నారని మొన్నామధ్య చలసాని ప్రసాద్ చెప్పారు. కావున మీరు ఇంకొంత కాలం ఆగాలి.

      Delete
    2. Y.V.RAMANA గారి కి కృతఙ్ఞతలు

      Delete
  7. నేనారోజు రావిశాస్త్రి ముందు అలా ఎందుకు నిలబడిపోయాను? ఒక మహోన్నత శిఖరం ముందు నిలబడ్డప్పుడు ఆ దృశ్యసౌందర్యానికి spellbound అయిపోయి.. చేష్టలుడిగి నిలబడిపోతాం. ఆ రోజు నా స్థితి అట్లాంటిదేనా? అయ్యుండొచ్చు!

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.