Thursday, 14 July 2011

మీ (మా) వారపత్రిక


నా చిన్నప్పుడు వారానికొక రోజు కొరియర్ బాయ్‌గా పన్జేసేవాణ్ని. డబ్బు కోసం కాదు - సైకిల్ కోసం! కొంచెం వివరంగా రాస్తాను. ఆరోక్లాసులో నాకు విశ్వం అనే స్నేహితుడు ఉండేవాడు. మనిషి సౌమ్యుడు మరియూ సాత్వికుడే గానీ - తన అన్న డొక్కుసైకిలు తొక్కుతూ బెంజ్ కారు  నడుపుతున్నంత బిల్డప్ ఇచ్చేవాడు. విశ్వం వైభోగానికి ఈర్ష్యాసూయలతో రహస్యంగా కుళ్ళుకునేవాణ్ణి. ఆపై శకుని మామలా తీరిగ్గా ఆలోచించి, ఆ డొక్కుసైకిలు తొక్కే అవకాశం కోసం మావాడితో స్నేహం డోసు పెంచాలని నిర్ణయించుకున్నాను.  
                         
స్కూలు టైము తరవాత పేరట్లో ఉన్న ఉసిరి (చెట్టు) కాయలు తీసుకెళ్ళి వాడికివ్వటం, వాడి చేతిరాత చాలా బాగుంటుందనీ, నాకన్నా వాడికే లెక్కలు బాగా వచ్చని పొగడటం.. ఇత్యాది ప్రణాళికలు రచించి అమలుపర్చాను. కష్టేఫలి! మొత్తానికి విశ్వం ఆంతరంగికులలో చోటు సంపాదించాను. తద్వారా ఆ సైకిల్ తొక్కే అర్హత నాక్కూడా లభించింది.

సైకిల్ తొక్కుతూ ఆనందపరవశుణ్ణైపొయ్యేవాణ్ణి. నేను సైకిల్ తొక్కుతుంటే సైకిలు సీటు ముందున్న కడ్డీ విశ్వానికి ఉచితాసనం. అలానే విశ్వం డ్రైవరయితే నేనా కడ్డీమీద. నిమిషానికొకసారి పడే చైన్ వేసే బాధ్యత కడ్డీ మీదవాడిది! ఆవిధంగా డివిజన్ ఆఫ్ లేబర్ని కూడా పాటించేవాళ్ళం.
                         
అసలు విషయంలోకి వస్తాను. విశ్వం అన్న (సైకిలు సొంతదారుడు) అప్పటికే ఏదో డిగ్రీలాంటిదేదో చదువుకుని ఉద్యోగప్రయత్నాల్లో ఉన్నాడు. ఆయన మాకో పన్జేప్పేవాడు. అదేమంటే - ప్రతివారం (శుక్రవారమా?) పొద్దున్న రైల్వే స్టేషన్‌కి సైకిల్ తొక్కుకుంటూ పోయి హిగ్గిన్ బోథమ్స్‌లో ఆంధ్రపత్రిక (సచిత్రవారపత్రిక) కొనే పని. సైకిల్ కి తాళం లేదు కావున ఒకడు రైల్వే స్టేషన్లోకి వెడితే ఇంకోడు సైకిలుకి కాపలాగా బయటే ఉండాల్సొచ్చేది.    
                 
ఆంధ్రపత్రిక కొని సైకిల్ని వాయువేగంతో, శరవేగంతో తొక్కుతూ (తొందరగా తొక్కేవాళ్ళం అని రాస్తే సరిపోతుంది, కానీ - అంత కష్టపడి తొక్కిన తొక్కుణ్ణి విశేషణాలేమీ జోడించకుండా సింపు్ల్‌గా రాయటం నాకిష్టం లేదు) ఇంటికి తెచ్చి విశ్వం అన్నకి ఇచ్చేవాళ్ళం.
                   
ఆయన అప్పటికే పోస్టు కార్డుతో రెడీగా ఉండేవాడు. పత్రిక ఒక అరనిమిషం ముందుకీ, వెనక్కీ తిరగేసేవాడు. ఆ తరవాత ఒకే నిమిషంలో ముత్యాల్లాంటి అక్షరాలతో ఆంధ్రపత్రిక సంపాదకులవారికి ఉత్తరం రాసేవాడు.

ప్రతివారం ఒకటే మేటర్! మీ (మా) వారపత్రికలో ఫలాన కధ అద్భుతం. సీరియల్ తదుపరి భాగం కోసం ఇంట్లో అందరం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాం. మీరు రాసిన వంటింటి చిట్కాలు అమోఘం. అందులో చెప్పిన ఫలానా వంటకం మా చెల్లెలు (ఆయనకసలు చెల్లెల్లేదు) తయారుచేసింది. ఆ రుచిని తట్టుకోలేకపోతున్నాం. ఇట్లా పోస్టు కార్డులో వ్యాసం లాంటిది రాసేవాడు.
                             
ఆయన రాసిన పోస్టు కార్డుని తీసుకుని - మళ్ళీ వాయువేగంతో, శరవేగంతో (ఈ విశేషణాలని మీరు తప్పించుకోలేరు) సైకిల్ తొక్కి, అరండల్‌పేట పెద్ద పోస్టాఫీస్ ముందుండే పెద్ద డబ్బాలో వేసేవాళ్ళం. ఇదంతా నిమిషాల వ్యవధిలో జరిగిపోయేది.
                             
విశ్వం అన్న రాసిన ఉత్తరాలు అప్పుడప్పుడు పబ్లిషయ్యేవి. కానీ - ఆ ఉత్తరం 'పాఠకుల ఉత్తరాలు' శీర్షికలో రెండోదిగానో, మూడోదిగానో ఉండేది! ఎందుకో నాకర్ధమయ్యేది కాదు. నా శ్రమకి తగ్గ ఫలితం లభించట్లేదని బాధా కలిగేది.  

ఒకరోజు విశ్వం అన్న నాకు అసలు రహస్యం చెప్పాడు.
                             
ఆంధ్రపత్రిక బెజవాడ నుండి పబ్లిషవుతుందిట. బెజవాడవాళ్ళు పత్రిక రిలీజు కాకముందే ఒక కాపీ సంపాదించి, గబగబా ఉత్తరం రాసేసి పత్రిక ఆఫీస్ ముందున్న పోస్ట్ డబ్బాలో వేసేస్తారట, లేదా డైరక్ట్‌గా ఆఫీస్‌లోనే ఇచ్చేస్తార్ట. అంచేత బెజవాడ వాళ్ళు మా గుంటూరు వాళ్ళకన్నా ఎంతో ముందుంటారు. ఔరా! ఈ బెజవాడవాళ్ళు ఎంత తొందరపాటు మనుషులు!!

(photo courtesy : Google)    

9 comments:

  1. డియర్ రమణ, నీ సైకిలు కథ బాగుంది. ఐతే ఏ బ్రాండ్ బైసికులు అది? ర్యాలీ హంబరా లేక అట్లాసా? చిన్నప్పుడు నాకు సైకిలు డైనమో పవర్ సోర్స్ మాత్రం చాలా ఫ్యాసినేటింగ్ గా ఉండేది. మన కాళ్ళ శక్తితో కరంట్ పుట్టించి లైట్ బల్బ్ వెలిగించడం చాలా మార్వలెస్ గా అనిపించేది.
    ఇలాగే మంచి కథలు రాస్తుండాలని కోరుతూ,
    బి ఎస్ ఆర్

    ReplyDelete
  2. డియర్ బి ఎస్ ఆర్,
    కథ మీకు నచ్చినందుకు థాంక్స్. మీరు సైకిలు బ్రాండ్ బెంజా, మెర్సిడీసా అన్నట్లు అడుగుతున్నారు. నేను తొక్కిన సైకిలు రంగు వెలిసి, తుప్పు పట్టిన కారణాన అది ఏ బ్రాండుదో తెలుసుకునే అద్రుష్టం కలగలేదు.
    మీరు చెప్పిన డైనమో పవర్ సోర్స్ నిజంగా గొప్ప అనుభవం. సైకిల్ టైరుకి బురదంటితే .. ఆ డైనమో పనిచెయ్యదు. తత్కారణంగా .. రాత్రిపూట లైట్ వెలగక .. పోలీసు కనిపించినప్పుడల్లా .. సైకిలు దిగి నడవాల్సొచ్చేది. ఏమరుపాటుగా ఉండినట్లయితే పోలీసుకి పావలా సమర్పించుకోవలసిన అగత్యం పట్టేది.
    అయినా .. డైనమో, క్యారియర్, ఫుల్ చైన్ కేస్ డబ్బున్న మారాజుల భోగలాలసాలు. మనకెందులకా గోల!

    ReplyDelete
  3. డెబ్బై వ దశకం లో ఉండే అతి కొద్ది మధ్యతరగతి విలాసాల్లో
    కొన్ని అ ) ఇంటికో సైకిలు కలిగి ఉండటం
    ఆ) వారానికో వార పత్రిక కొనుక్కోవటం ( అందులో ఉన్న వెసులు బాటు రోజూ కొనలేముగా )
    ఇ) పత్రిక కి ప్రతి వారం ఉత్తరాలు రాయటం ( కార్డు అర్ధణా మరి)
    ఈ) ఆ ఉత్తరం పత్రిక వాళ్ళు ప్రచురించటం
    పవైన్నీ కలిగి ఉన్న మీరు మధ్యతరగతి మహారాజులు. గొప్పే !!
    టు హావ్ ఎ పై అండ్ ఈటింగ్ ఇట్ టూ లాగన్న మాట

    ReplyDelete
  4. ఒక్క టపాలో విశ్వాన్నంతటినీ చుట్టేశారు.....చుట్టించేశారు. గుంటూరు రైల్వే స్టేషన్ దగ్గరికి తీసుకెళ్ళారు, అరండల్ పేట మీదుగా!

    పత్రిక్కి రాసిన ఉత్తరం అద్భుతం! అప్పట్లో పత్రికల నిండా ఇవే ఉత్తరాలు నిజంగానే! మీ(మా) పత్రిక అని ప్రతి పాఠకుడూ రాస్తాడా లేక పత్రికల వాళ్ళు అలా జోడిస్తారా అనుకునే దాన్ని చిన్నప్పుడు. మా ఇంటికి కట్టలు కట్టలు పత్రికలు వచ్చేవి కానీ మేము ఒక్క ఉత్తరమూ రాసేవాళ్ళం కాదు. వీళ్ళకి ఉత్తరాల రచయితలు అని పేరు కూడా ఉండేదనుకుంటా! నవ్వుకునే వాళ్ళం ఇలాంటి ఉత్తరాలను కూడా "రచిస్తారా" అని!

    సైకిలు ప్రహసనం చాలా బాగుంది. ఎందుకంటే మా ఇంట్లో కూడా ఇలాంటి యుద్ధాలు స్నేహాలు పోటీలు సైకిల్ కోసం జరుగుతుండేవి మా అన్నయ్యలిద్దరికీ!

    వాళ్ళిద్దరి సైకిలుకి బెల్లు ఉండేది కానీ,పాపం బొటనవేలు ఎముక ఫ్రాక్చర్ అయ్యేలా నొక్కినా కీచుమనేది తప్ప మోగేది కాదు. అందువల్ల 'తప్పుకోండి" అని అరవాల్సిన బాధ్యత కడ్డీ మీద కూచునేవాడిదిగా ఉండేది.

    మీ బ్లాగు ఇప్పుడే చూస్తున్నా, ఇక నుంచి రెగ్యులర్ గా చూడాలనుకుంటున్న్నా! పాత పోస్టులు కూడా చదవాలి.

    ReplyDelete
  5. మీ సైకిల్ ప్రహసనం చదువుతుంటే శ్రీరమణ కథ 'ధనలక్ష్మి' గుర్తొచ్చింది.. ఆకుపచ్చ హంబార్ సైకిల్ తొక్కడం కోసం రామాంజనేలుతో స్నేహం, అతగాడు బడి మానేయ్యగానే సైకిల్ తొక్కే భాగ్యం పోయిందని కథకుడు బాధ పడడం అన్నీ గుర్తొచ్చాయ్.. ఇక ఉత్తరాలకి సంబంధించి, కొందరి ఉత్తరాలు అన్ని పత్రికల్లోనూ కనిపించేవి.. వాళ్ళ పేరు చూస్తె ఏం రాసి ఉండేవారో ఊహించగలిగేలా ఉండేవి ఉత్తరాలు..

    ReplyDelete
  6. @ఆత్రేయగారు, మీరు వ్రాసిన ఇంటికో సైకిలు గూర్చి ఇంకొంచెం పొడిగింపు. నాన్న నిద్రపోతున్నప్పుడు ( దొంగతనంగా ) ఆయన సైకిల్ తొక్కుకోవటం .. సైకిలుపై నుండి పడి .. మొకాలి చిప్ప పగిలి .. రక్తం కారుతూ ఏడుస్తున్న నన్ను పట్టించుకోకుండా .. సైకిలుకి దెబ్బ తగిలిందని ఆయనచే వీపు విమానం మోత మోగించుకున్న ఘనత నాది. ఒకపక్క మోకాళ్ళ నొప్పి, ఇంకోపక్క వీపు మంట. ఈ సైకిల్ ఇంత పవర్ ఫుల్లు కాబట్టే ఎన్టీఆర్ పవర్లోకి వచ్చాడని నా నమ్మకం. కామెంటినందకు ధన్యవాధాలు.

    ReplyDelete
  7. @సుజాతగారు, నా పోస్టుకు మీ అభిప్రాయాలు జత చేసి నిండుదనాన్ని తెచ్చారు. థాంక్సండి. వ్రాయటం సరదాగా మొదలెట్టాను. మీరు బాగుందంటున్నారు కావున ఇంకొన్ని కబుర్లు వ్రాయటానికి ప్రయత్నిస్తాను. ( రాయటం అనాలా? వ్రాయటం అనాలా? ప్రస్తుతానికి " వ్ర " కి ఫిక్స్ అవుతున్నాను.)

    ReplyDelete
  8. @మురళిగారు, నేను శ్రీరమణని చదవలేదు. నాదెంతసేపూ.. ఘంటసాల, రఫీ పాటల్లాగా.. పాత పుస్తకాల పాండిత్యమే! నా ప్రధాన అడ్డంకి నా ప్రొఫెషన్. మీరు నా బ్లాగులో కామెంట్ రాయటం ఆనందంగా ఉంది.

    ReplyDelete
  9. రమణ గారూ,గుంటూరుతో నా అనుబంధానికి మీ టపా సువాసనలు అద్దారు మరి! కొరిటపాడులో ఉండే అక్క వాళ్ళింటికి వెళ్ళడానికి నరసరావుపేట నుంచి రైలెక్కి శనాదివారాలు వచ్చేసేవాళ్ళం! ఏం గుంటూరో గానీ ఊరినిండా చుట్టాలే! సంగడిగుంటలో,అమరావతి రోడ్ లో,శ్యామలా నగర్లో,పట్టాభిపురంలో,బ్రాడీపేట 4/18 లో, రవి కాలేజీ దగ్గరా...ఇలా! రెండు రోజుల్లో అందరిళ్ళూ ప్రదక్షిణాలు చేసి ఆదివారం సాయంత్రానికి వాపస్ పేట చేరాలి. లేకపోతే చాంతాడుతో పెళ్ళవుతుంది మరి!

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.