Sunday, 30 October 2011

జ్ఞానం - అజ్ఞానం


'పుస్తకపఠనం మంచి అలవాటు. తద్వారా సాహిత్య, సాంస్కృతిక, రాజకీయ విషయాల్లో టన్నులకొద్దీ జ్ఞానము, విజ్ఞానము సమూపార్జించుకొనవచ్చును. మేధావిగా కీర్తినొందవచ్చును.'

ఈ మాటలు సుబ్బారావు బుర్రలో బలంగా నాటుకుపొయ్యాయి. గొప్ప జీవితసత్యం బోధపడిపోయిందనిపించింది. తద్వారా అతనికి తను చేపట్టవలసిన  భవిష్యత్ కార్యక్రమం  అవగతమైంది.

జ్ఞానం అనబడే ఈ మహాసముద్రాన్ని - పుస్తకం అనే చెంబుతో తోడెయ్యాలని నిర్ణయించేసుకున్నాడు. తదుపరి ర్యాకుల కొద్దీ పుస్తకాలని చదివేసి అవతల పడెయ్యసాగాడు. క్రమేణా పుస్తక పఠనం అనేది సుబ్బారావుకి ఒక వ్యసనంగా మారిపోయింది.

ప్రస్తుతం సుబ్బారావు ఏ విషయాన్నైనా రిఫరెన్స్ లేకుండా మాట్లాట్టం మానేశాడు. 'ఇప్పుడు రాత్రయింది' అని సింపుల్‌గా చెప్పేసి వదిలేస్తే సుబ్బారావుకి మాచెడ్డ చిరాకు. ఇప్పుడు రాత్రి ఎందుకైందో రిఫరెన్స్ చెప్పాలి. పగలు ఎందుక్కాదో కూడా  రిఫరెన్స్ లివ్వాలి.

సుబ్బారావుని అందరూ వాకింగ్ ఎన్‌సైక్లోపీడియా అని మెచ్చుకోటం మొదలెట్టారు. ఇంక సుబ్బారావు రెచ్చిపొయ్యాడు. 

'ధరలు మండిపోతున్నయ్' అంటే అమెరికా ఎకానమీ గూర్చి, డాలర్ పతనం గూర్చి మాట్లాడతాడు. 'ఎండలు మండిపోతున్నయ్' అంటే గ్లోబల్ వార్మింగ్ గూర్చి ఉపన్యసిస్తాడు. 'ఫలానావాడు అప్పు చేశాడు' అంటే ఏ దేశం ఏ దేశానికి అప్పు పడిందో వడ్డీతో సహా లెక్కలు చెబ్తాడు. వర్షం పడుతుంటే వర్షం వెనుక ఫిజిక్స్ చెప్తాడు.

సుబ్బారావు ధోరణి మొదట్లో ముచ్చట గొలిపినా, కొన్నాళ్ళకి బంధుమిత్రులకి విసుగొచ్చేసింది. ఒక్కొక్కళ్ళే అతనికి దూరం కాసాగారు. క్రమేపి సుబ్బారావుకి పుస్తక ప్రపంచానికీ, భౌతిక ప్రపంచానికీ తేడా మర్చిపొయ్యాడు.

రోగిష్టి తల్లి  రాత్రంతా  దగ్గుతూనే  ఉంది. 'ఒరే సుబ్బడూ! దగ్గీదగ్గీ ప్రాణం పొయ్యేట్లుంది, డాక్టరుకి చూపించరా.' దీనంగా అడిగింది. 'అమ్మంటే యెలా వుండాలి? గోర్కీ అమ్మలా వుండాలి.  నువ్వేంటి పొద్దస్తమానం ఇట్లా దగ్గుతున్నావ్?' విసుక్కున్నాడు సుబ్బారావు. 

భార్య మొత్తుకుంది - 'పిల్లలు సరీగ్గా చదవట్లేదు, చాలా సమస్యగా వుంది.' భార్యని జాలిగా చూశాడు సుబ్బారావు - 'పిచ్చిదానా! పిల్లల సమస్య కాశ్మీర్ సమస్య కన్నా పెద్దదా? ఐక్యరాజ్యసమితిలో కాశ్మీర్ మీద జరిగిన ఒప్పందాలు తెలుసా?'

'నాన్నోయ్! తేజాగాడు నా బ్యాట్ లాక్కున్నాడు, అడిగితే తంతున్నాడు. బాబోయ్, నొప్పి.' అంటూ కొడుకు ఏడుస్తూ వచ్చాడు. 'ప్రశాంత్ భూషణ్ అంతటివాడే శ్రీరామసేనవాళ్ళ చేతిలో దెబ్బలు తిన్నాడు, ఆఫ్టరాల్ నువ్వెంత? పో అవతలకి.' ఆంటూ అరిచాడు.

చెల్లెలు భర్తతో తగాదాపడి పుట్టింటికొచ్చింది. 'అన్నయ్యా! మా ఆయన వాళ్ళమ్మ మాటలిని నన్ను ఒకటే తిడుతున్నాడు.' సుబ్బారావు చెల్లెలి వైపు నిర్వికారంగా చూశాడు. 'చూడమ్మా! రంగనాయకమ్మ 'జానకి విముక్తి'  చదువుకో. నీ సమస్య తీరిపోతుంది.' చెల్లెలు  తెల్లబోయింది.

ఆఫీసుకి వెళ్ళడం మానేశాడు సుబ్బారావు. గడ్డం పెరిగిపోయింది, జుట్టు చెదిరిపోయింది. అతనిప్పుడు రోజంతా శూన్యంలోకి చూస్తూ, తీవ్రంగా యేదో ఆలోచిస్తూ గదిలోనే గడిపేస్తున్నాడు.

భార్య ఏడుస్తూ చెప్పింది - "వంటింట్లో అన్నీ నిండుకున్నయ్. ఈరోజు నుండీ మనందరికీ పస్తే."

"ఇదిగో, ఇలా రా! ఈ పుస్తకాలు చూడు. ఇది ఎమిలీ జోలా 'ఎర్త్'. ఇదేమో పెర్లెస్ బక్ 'గుడ్ ఎర్త్'. వాళ్లీ రచనల్లో దరిద్రాన్ని ఎంతో అందంగా, మరెంతో రొమేంటిగ్గా రాశారు. నిజమే! ఆకలి దుర్భరమైనది. కాబట్టే 'క్రైమ్ అండ్ పనిష్‌మెంట్‌'లో  రాస్కల్నికోవ్‌, ఆఫ్ హ్యూమ  బాండేజ్‌లో  ఫిలిప్‌లు అంతగా ఇబ్బంది పడ్డారు!"

భార్యాపిల్లలూ, తల్లీ ఏడుస్తూ తిట్టటం మొదలెట్టారు. "మీకు కోపం ఎందుకొస్తుందో తెలుసా? మన మెదడులో రసాయనాలు.. " అంటూ ఏదో చెప్పబొయ్యాడు. 

కొడుక్కి మండిపొయ్యింది. తండ్రి ముంజేతిని కసిగా కసుక్కున కొరికాడు. సుబ్బారావుకి నొప్పెట్టింది. వెంటనే నొప్పి కలిగించే నాడీమండల వ్యవస్థ గూర్చి ఆలోచనలో పడ్డాడు.

ఈవిధంగా సుబ్బారావు జ్ఞానసాగరంలో  తేలియాడుతూ.. ఆలోచనల్లో మునుగుతూ.. ఇంటి ముందు రోడ్డు దాటుచుండగా.. స్పీడుగా వెళ్తున్న ఒక కారువాడు గుద్దేసాడు. 

తలకి పెద్దదెబ్బే తగిలింది. మూడ్రోజులు కోమాలో ఉన్నాడు. చుట్టపక్కాలు సుబ్బారావు అయిపోయాడనుకున్నారు.

భార్య పూజల వల్లనైతేనేమి, డాక్టర్ల ప్రతిభ వల్లనైతేనేమి - సుబ్బారావు చావు తప్పించుకున్నాడు. కొన్నాళ్ళకి ఆస్పత్రి నుండి డిశ్చార్జయ్యాడు. భర్తకి పుస్తకాల పిచ్చి వుంటే వుంది, మనిషి దక్కాడు, అంతే చాలనుకుంది  భార్య.

కొన్నాళ్ళ తరవాత -

దగ్గుతున్న తల్లి  దగ్గరకొచ్చాడు సుబ్బారావు - "అమ్మా! హాస్పిటల్‌కి  వెళ్దాం పద." అన్నాడు. తల్లి ఆశ్చర్యపోయింది.

అటుగా వెళ్తున్న కొడుకుని  పిలిచి  మందలించాడు - "ఆటలు ఆడుకో, మంచిదే! కానీ చదువు చాలా ముఖ్యం." కొడుకు బిక్కమొహం వేశాడు.

టీవీ చూస్తున్న చెల్లెల్తో అన్నాడు - "బావకి కబురు చెయ్యమ్మా! నేనతన్తో మాట్లాడాలి." చెల్లెలి కళ్ళల్లో ఆనందం. 

వంటింట్లో వున్న భార్యని పిలిచాడు - "ఇంటి ఖర్చుల విషయంలో నువ్వెన్ని ఇబ్బందులు పడుతున్నావో నాకు తెలుసు, అయాం సారీ! త్వరలోనే ఉద్యోగంలో చేరుతున్నాను." ఆనందం పట్టలేక బిగ్గరగా ఏడ్చేసింది భార్య.

ఇంతలో - 

ఒక బట్టతల పెద్దమనిషి ఇంట్లోకి వచ్చాడు. మామిడిపండ్ల బుట్ట బల్లమీద పెట్టాడు. సుబ్బారావుకి రెండుచేతులు జోడించి నమస్కరించాడు. 

"అయ్యా! ఈ పాపిని క్షమించండి, ఆ రోజు మిమ్మల్ని గుద్దిన కారుని నడిపింది నేనే. నాభార్యని హాస్పిటల్‌కి తీసుకెళ్ళే హడావుడిలో పొరబాటు జరిగిపోయింది."

సుబ్బారావు భార్య కారు యజమానికి తిరిగి నమస్కరించింది. "అయ్యా! మీరు చేసిన మేలు ఈ జన్మకి మర్చిపోలేం, మీరు మా పాలిట దేవుడు."

బట్టతల పెద్దమనిషికి విషయం అర్ధం కాలేదు, బుర్ర గోక్కుంటూ సెలవు తీసుకున్నాడు.

(picture courtesy : Google)

Friday, 28 October 2011

బాలగోపాల్.. కొన్ని జ్ఞాపకాలు


మన సమాజంలో కులం ప్రభావం బలమైనది. ఈ విషయంపై అనేక చర్చలు, విశ్లేషణలు చదువుతూనే ఉంటాం. మనం ఈ కుల ప్రభావానికి లోనుకాకుండా ఉండాలంటే, ముందుగా సమాజంలో కులంపాత్ర అంచనా వెయ్యగలగాలి. ఇది రాస్తున్నప్పుడు నాకు బాలగోపాల్, ఆయనతో గడిపిన క్షణాలు గుర్తొస్తున్నాయి. 

నాకు చంద్ర (బి.చంద్రశేఖర్, న్యాయవాది, పూర్వాశ్రమంలో పౌరహక్కుల నాయకుడు) మంచి మిత్రుడు. అతని ద్వారా నాకు కె.బాలగోపాల్ పరిచయం. బాలగోపాల్ తరచూ గుంటూరు వస్తుండేవాడు. అప్పుడప్పుడు నా స్కూటర్ తీసుకుని ఊళ్ళో పనులు చక్కబరుచుకునేవాడు. ఆ సందర్భంగా మేమిద్దరం కలిసి కాఫీ తాగేవాళ్ళం. 

అప్పటికే పౌరహక్కుల ఉద్యమకారుడిగా బాలగోపాల్ సుప్రసిద్ధుడు. ఆయన సింప్లిసిటీ నన్ను ఆశ్చర్యపరిచేది. బాలగోపాల్ మొహమాటస్తుడు, పేషంట్లు వెయిట్ చేస్తుంటే తనుకూడా వాళ్ళతోపాటు కూర్చునేవాడు. మొదట్లో నా స్టాఫ్ ఆయన్ని పట్టించుకోలేదు. ఎవరో పేషంటుతోపాటు వచ్చినాయన అనుకుని అలాగే వెయిట్ చేయిస్తూ వుంచేవాళ్ళు. అటుతరవాత నేను బాలగోపాల్ పట్ల చూపించే మర్యాద, గౌరవం గమనించి ఆయన్ని హడావుడిగా కన్సల్టేషన్ రూంలోకి పంపేవాళ్ళు.  

బాలగోపాల్ మొహమాటస్తుడు గదాని మనం మోసపోకూడదు. విషయం వచ్చినప్పుడు ఖచ్చితంగా, నిక్కచ్చిగా మాట్లాడతాడు. ఒకసారి కాజువల్‌గా అన్నాను - 'తెలుగు వ్యాసాలు సంక్లిష్టంగా రాయటంలో మీరు కె.వి.రమణారెడ్డిగారితో పోటీ పడుతున్నారు' అని. 

'మీరు తెలుగు ఇంకొంచెం నేర్చుకోండి.' అంటూ మొహం మీద గుద్దినట్లు సమాధానం చెప్పాడు బాలగోపాల్

బాలగోపాల్ నా దగ్గరకి వచ్చినప్పుడల్లా కాఫీ ఇవ్వకుండా పంపేవాణ్ని కాదు. అందుక్కారణం - ఆయన్తో కొద్దిసేపు మాట్లాడే ఆవకాశాన్ని వదులుకోకూడదనే నా స్వార్ధం!  

ఒక కాఫీ సమయంలో హఠాత్తుగా అడిగాడాయన.

"మీదే కులం?"

"మీరు.. ఈ ప్రశ్న.. " ఆశ్చర్యంగా చూశాను.

నా ఆశ్చర్యాన్ని పట్టించుకోకుండా స్థిరంగా, స్పష్టంగా అన్నాడు బాలగోపాల్. 

"ఇక్కడ నేను మీతో బంధుత్వం కలుపుకోటానికి కులం అడగట్లేదు. మనమంతా కులరహిత సమాజం కావాలనుకుంటున్నాం. ముందుగా కులం మనమీద చూపిస్తున్న ప్రభావాన్ని గుర్తించగలగాలి. అప్పుడే గదా దాంట్లోంచి బయటపడగలిగేది. నేను పుట్టుకతో బ్రాహ్మణ్ణి. నా అవగాహన, ఆలోచన కొన్నిసార్లు నా కులానికి గల పరిమితులకి లోబడే ఉంటాయి. అది నా తప్పు కాదు. మనమందరం ఈ చట్రంలోంచి బయటపడ్డానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. మనని మనం సంస్కరించుకోవటం అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఉదాహరణకి మీరు దళితులనుకుందాం. నాకా విషయం తెలీనప్పుడు మిమ్మల్ని నేను సరీగ్గా అర్ధం చేసుకోలేను. కొంతమంది కులం పేరెత్తితేనే ఏదో తప్పుగా చికాకు పడతారు, కులాన్ని గుర్తించకపోవడం సరికాదు."

ఇంకో సందర్భం -

ఇంకో కాఫీ సమయం.

"సమాజంలో కులప్రభావాన్ని తక్కువగా అంచనా వెయ్యకూడదు. నేను కిడ్నాప్ అయ్యానన్న వార్తని పత్రికలు విపరీతంగా కవర్ చేశాయి. పత్రికలు అంతలా కవర్ చెయ్యటం వెనుక కూడా కులప్రభావం ఉండొచ్చు."

"ఎలా?"

"మన పత్రికల్లో ఎడిటర్లు, రిపోర్టర్లు ఎక్కువమంది బ్రాహ్మణులు. నా రాజకీయాలు వాళ్లకి నచ్చకపోయినా, మనవాడేనన్న కులాభిమానం వాళ్లకి ఉండి ఉండొచ్చు." అన్నాడు బాలగోపాల్.

మాటల్లో క్లుప్తత బాలగోపాల్ సొంతం. ఒక్కోసారి ఆయన్తో మాట్లాడుతూ వుండిపోవాలని అనిపిస్తుంది. కానీ ఆయన చాలా బిజీ - నలిగిన చొక్కాతో, చెదిరిన క్రాఫుతో హడావుడిగా వెళ్లిపోతాడు. బాలగోపాల్ సర్! ఐ సెల్యూట్ యు.  

(photo courtesy : Google)

Thursday, 27 October 2011

నమస్కారం అన్నయ్యగారు!


'వూరికే తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకీ తేడా యేటుంటాది?' అన్నాడు ముళ్ళపూడి. నేను గొడ్డుని కాదు కాబట్టి - పుస్తకాలు చదివేవాణ్ని, స్నేహితుల్తో సరదాగా కబుర్లు చెప్పేవాణ్ని. నాకు చాలా తెలుసు, కానీ దేంట్లోనూ లోతు తెలీదు. 'జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్, మాస్టర్ ఆఫ్ నన్' అనే నానుడి నాకు సరీగ్గా సరిపోతుంది.

ఈ ధోరణి నాకు అనేకరంగాల స్నేహితుల్ని సంపాదించింది. ఆటో నడిపేవారి నించి యూనివర్సిటీ ప్రొఫెసర్ల దాకా మనకి స్నేహరత్నాలున్నారు. ఇది కొంతమందికి నచ్చదు, నాకు మాత్రం భలే ఇష్టం.

చదువైపోయింది, పీజీ సీటు కోసం పాట్లు పడే దశ మొదలైంది. ఈలోగా నా స్నేహితుల్లో కొందరు - ఉద్యోగం వచ్చిందనొకడూ, కట్నం నచ్చిందని మరొకడు నెమ్మదిగా ఒకింటివాళ్ళైపోవటం మొదలెట్టారు. మంచిది, ఎవరి జీవితం వారిది.

అయితే కొత్త పెళ్ళికొడుకులు నన్ను తప్పించుకు తిరగటం మొదలెట్టారు. నాకర్ధం కాలేదు, ఆశ్చర్యపొయ్యాను. సమాధానం దొరక్క - 'సర్లే! ఎంతవారైననూ కాంతాదాసులే గదా!' అని సర్ధిచెప్పుకున్నాను. అయితే అధికారపక్షం నుండి ప్రతిపక్షంలోకి దిగిపోయిన రాజకీయ నాయకుళ్ళా మనసులో బాధ ముల్లులా గుచ్చుకుంటూనే ఉంది.
                          
మన కొత్త పెళ్ళికొడుకుల ఇబ్బందులు, తిప్పలు నిదానంగా అర్ధమవసాగాయి. ఒక దురదృష్ట దినాన ఒకానొక పెళ్ళిలో ఒకానొక స్నేహితుడి భార్యతో ఒక్క నిమిషంపాటు మాట్లాడాను. వున్నట్లుండి ఆ అమ్మాయి - 'గుంటూరు మెడికల్ కాలేజి చరిత్రలోనే మా ఆయన అత్యుత్తమ విద్యార్ధి.' అన్నది. ఆ అత్యుత్తమ విద్యార్ధి యం.బి.బి.యస్. తీరిగ్గా ఏడేళ్ళపాటు చదివాడు, పరీక్షల్లో కాపీలందించలేక చచ్చాను. ఆవిడ చెప్తున్నది అర్ధం కాక బుర్ర గోక్కుంటూ మావాడి కేసి చూశా, వాడు బ్రతిమాలుతున్నట్లుగా మొహం పెట్టాడు. అంతట నాకు జ్ఞానోదయం అయ్యింది. 

ఈ కొత్త భార్తాధములు, తమ కొత్తభార్యల దగ్గర హైప్ క్రియేట్ చేసుకున్నారు. నేను వారికి తమ గత జీవిత తాలూకా పీడకలని. ఈ కఠోరసత్యం బోధపడ్డాక బాధ కొద్దిగా తగ్గింది. పోన్లే పాపం, ఆ మాత్రం భార్యల దగ్గర మార్కులు కొట్టేయ్యకపోతే వారికి కాఫీ దక్కే పరిస్థితి కూడా ఉండదు. 'ఎక్కడ ఉన్నా ఏమైనా, మనమెవరికి వారై వేరైనా, నీ సుఖమే నే కోరుతున్నా" అంటూ పాడుకుని జీవితాన్నికొనసాగించసాగాను. 
                         
ఇప్పుడు కొద్దిగా ఫాస్ట్ ఫార్వార్డ్. 'స్నేహితుల గూర్చి ఇన్ని నగ్నసత్యాలు రాశావ్. మరి నీ సంగతేంటి?' అనే సందేహం మీకు కలగొచ్చు. దురదృష్టవశాత్తు కొంతకాలానికి నాక్కూడా పెళ్లైంది. అయితే నా భార్యకి గొప్పలు చెప్పుకునే లక్జరీ నాకు లేకుండా పోయింది. కారణం - నా భార్య నేను చదివిన కాలేజీలోనే నా జూనియర్!

కాలేజీలో క్లాసురూముల్లో కన్నా క్యాంటీన్లోనూ, లైబ్రరీలో కన్నా సినిమాహాళ్ళల్లోనూ నా జీవితచరిత్ర లిఖించబడియున్నదని ఆమెకి తెలుసునేమోనని నా అనుమానం. ఎగస్ట్రాలు మాట్లాడితే కొత్త విషయాలేమన్నా బయటకొస్తాయనే అనుమానంతో కిక్కురుమనకుండా నోర్మూసుకున్నాను. కాబట్టి భార్య దగ్గర వీరులం, ధీరులం అనే బిల్డప్పులిచ్చే శీలపరీక్షలో పాల్గొనే అవకాశం నాకు లేకుండా పోయింది. 
                       
ఇప్పుడు మళ్ళీ అసలు విషయంలోకొద్దాం. ఒకసారి మనసు బాగోక ఒక పెళ్ళయిన స్నేహితుడి ఇంటికెళ్ళాను. అతగాడు నాగోడు విండం కన్నా హాలుకీ, వంటింటికీ మధ్యనున్న కర్టెన్ని సర్దడంలో సతమతమౌతున్నాడు. వంటింట్లో వున్న అతని భార్య నా కంటిక్కనపడకుండా తీవ్రమైన చర్యలు తీసుకుంటున్నాడని అర్ధమైంది. కొంచెంసేపటికి వంటింట్లోకెళ్ళి ట్రేలో రెండు కప్పుల కాఫీ తెచ్చాడు. ఒళ్ళు మండిపోయింది, ఈ వెధవకేదో అనుమానం రోగం వున్నట్లుంది. ఇంకొంచెంసేపు నేనక్కడే వుంటే టెన్షన్తో చస్తాడేమోననే భయంవేసి, కాఫీ తాగి హడావుడిగా బయటపడ్డాను.
                      
ఈవిధంగా అనేక అవమానాల అనుభవాల వల్ల నా హృదయం బ్రద్దలైంది. ఈ పెళ్ళైన దుర్మార్గుల్నందర్నీ దూరంగా పెట్టెయ్యాలనే కఠోరనిర్ణయం తీసుకున్నాను, ప్రశాంతంగా జీవించసాగాను. కొన్నాళ్ళకి - 

'నా పెళ్ళికి నువ్వు రాలేదు. నా భార్యకి నీ జోకులు చెప్తే తెగ ఎంజాయ్ చేసింది. అర్జంటుగా నిన్ను పరిచయం చెయ్యాలి, నువ్వు రావాల్సిందే.' అంటూ ప్రాధేయపడ్డాడో మిత్రుడు. 
                        
సరే! మనుషులందరూ ఒకటి కాదు, అందర్నీ ఒకే గాట కట్టరాదు. అయినా వీడి పెళ్ళికి వెళ్ళకపోవటం చేత ఎలాగూ ఒకసారి కొత్త దంపతుల్ని కలవవటం ధర్మం కూడా. అనుకున్న టైముకి వాళ్ళింటికి వెళ్ళాను. ఇల్లంతా నీటుగా సర్ది ఉంది. మావాడు టూత్‌పేస్ట్ ఎడ్వర్టైజ్మెంట్ నవ్వుతో ఎదురొచ్చి మరీ ఆహ్వానించాడు.

మావాడి స్వాగతం నాకు సంతోషం కలిగించింది. అయ్యో! అజ్ఞానంతో నా స్నేహితులందరూ వెధవలనుకున్నానే. సందేహం లేదు. వీడు మాత్రం జాతిరత్నం! ఇంతలో ఇంట్లొంచి మావాడి భార్య మంచినీళ్ళ గ్లాసుతో వచ్చింది. నేను పలకరింపుగా చిన్నగా నవ్వాను. ఆవిడ మంచినీళ్ళ గ్లాసు టీపాయ్ మీద పెట్టి, రెండు చేతులూ జోడించి -

"నమస్కారం అన్నయ్యగారు!" అన్నది.

క్షణకాలం నాకా పిలుపు అర్ధం కాలేదు, ఆ తర్వాత బిత్తరపోయాను. ఆ అమ్మాయి ఏదో మాట్లాడుతుంది. ప్రతిమాటకి ముందొక 'అన్నయ్యగారు' , వెనకొక 'అన్నయ్యగారు'. నాకైతే ఆమె చెప్పేదేమీ అర్ధం కావట్లేదు. కానీ నాకు కొత్తగా లభించిన ఈ అన్న పోస్టు మాత్రం మోయలేనంత భారంగా వుంది.

ఈ కొత్త చెల్లమ్మ ఇంకొద్దిసేపటికి - 'అన్నా! నీ అనురాగం' పాటేమన్నా ఎత్తుకోదు కదా! నాక్కడుపులో దేవినట్లుగా వికారం మొదలైంది. మావాడు నా ఇబ్బంది గమనించాడు గానీ, తన భార్య నాకిచ్చిన అన్న పోస్టు వల్ల ప్రశాంతంగా వున్నాడు. ఏమి నా దుస్థితి! వీడికన్నాఆ కర్టెన్ల వెధవే నయం.

"అన్నయ్యగారు! మీరే చెప్పండి. మీ ఫ్రెండ్.. " అంటూ ఆ అమ్మాయి ఏదో చెబుతుంది.  

నాకేడుపొచ్చింది. నేనే గనక సీతాదేవినట్లైన - నా తల్లి భూదేవిని ప్రార్ధించి భూమిలోకి కూరుకుపోదును. జేబులో పిస్తోలు ఉన్నట్లయితే కాల్చుకు చద్దును. టెర్రరిస్టునైతే బెల్టు బాంబు పేల్చుకుని ఆత్మాహుతి చేసుకుందును. కానీ నా ఖర్మ - నేనేదీ కాదు.

ఈ అఘాయిత్యాల అవసరం లేకుండానే, వంటింట్లో ఏదో శబ్దం వస్తే లోపలకెళ్ళింది చెల్లెమ్మగారు.

"ఇప్పుడే! ఇక్కడే! ఈ సందు చివరదాకే!" అంటూ గొణుగుతూ మావాడు పిలుస్తున్నా వినిపించుకోకుండా పరుగు లాంటి నడకతో ఒక్క ఉదుటున బయటపడ్డాను. అమ్మయ్య! అన్నపాత్ర విముక్తి ఎంత హాయిగా వుంది!!

(picture courtesy : Google)

Wednesday, 26 October 2011

గాంధీ, నేను, అన్నాహజారే!


"ఒక మాజీ నిరాహారదీక్షకారుడుగా చెప్తున్నాను, అన్నాహజారే చేస్తున్న దీక్ష బహుకష్టం సుమీ!"

"అన్నాహజారే సంగతి మాకు తెలుసు కానీ, నువ్వేంటి నిరాహార దీక్షల్ని ఓన్ చేసుకుంటున్నావ్?"

"నాగూర్చి నేను రాసుకోకూడదు, అయినా రాసుకుంటాను. అసలీ దీక్షల్లో నేను మహాత్మా గాంధీకి జూనియర్ని, అన్నాహజారేకి సీనియర్ని. ఇప్పుడు నాదీక్ష కథ చదివి తరింపుము."

చదూకునే రోజుల్లో నేను మరియూ కొందరు నా మిత్రోత్తములు ఆంగ్ల సంగీతానికి అభిమానులంగా వుండేవాళ్ళం. అప్పుడు మధ్యాన్నం ఒంటిగంట. నేనూ, నా సహ ఆంగ్ల సంగీతాభిమాని గుంటూరు మెడికల్ కాలేజ్ గార్డెన్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం. 

"గురూ! మన లెనన్ని ఎవడో లేపేశాడు." అటుగా వెళ్తూ చెప్పాడో వార్తల వామనరావ్. 

షాకింగ్! ఇద్దరం దుఃఖంలో మునిగిపోయ్యాం. మా ఇద్దరికీ బ్రిటిష్ మ్యూజిక్ గ్రూప్ బీటిల్స్ అంటే ఇష్టం. బీటిల్స్ బ్యాండులో జాన్ లెనన్ అత్యంత ముఖ్యుడు. లెనన్ రాసిన పాటలూ, పాడిన పాటలు గుర్తుతెచ్చుకుని బోల్డు బాధ పడసాగాం. వూరికే బాధపడి వదిలేస్తే ఎలా? లెనన్‌కి తీవ్రమైన నివాళి ఇవ్వాల్సిందే. అంచేత - లెనన్ జ్ఞాపకార్ధం ఒకపూట భోజనం మానెయ్యాలని నిర్ణయించుకున్నాం. లెనన్ గూర్చి కబుర్లు చెప్పుకుంటూ చాలాసేపు కూర్చుండిపొయ్యం. 

మధ్యాహ్నం మూడు గంటలైంది. ఆకలి నెమ్మదిగా మొదలైంది. ఆ తరవాత స్పీడుగా ఎక్కువైంది. ఇప్పుడు - కడుపులో ఎలకలు కాదు కుక్కలు పరిగెడుతున్నయ్. నీరసంతో తల దిమ్ముగా, తిక్కతిక్కగా ఉంది. సంభాషణ లెనన్ నుండి పక్కకి మళ్ళింది. 

"మిత్రమా! యేదో మన పిచ్చి గానీ - మనం ఒకపూట ఆహారం మానేసినంత మాత్రాన చనిపోయిన లెనన్ తిరిగొస్తాడా?"

"అవును, అయినా మనం ఇప్పుడీ నిరాహార దీక్ష చెయ్యడం అవసరమా? ఇవన్నీ ఔట్‌డేటెడ్ సంతాపాలు. కానీ, ఇప్పుడెలా? కమిటైపోయ్యాంగా!"

నీరసంగా మొహమోహాలు చూసుకున్నాం. ఇద్దరిదీ ఒకే భావన. కవులు ప్రేమకి భాష అవసరం ఉండదంటారు. ఆకలికి కూడా భాష అవసరం ఉండదని ఆరోజే అర్ధమయ్యింది. 

మిత్రుడు ఒక్కక్షణం ఆలోచించాడు.

"మనం భోజనం మాత్రమే మానేద్దామనుకున్నాం. భోజనం అంటే రైస్. కాబట్టి రైస్ కాకుండా ఇంకేదైనా తినొచ్చు."

"కానీ - అలా చేస్తే లెనన్‌కి అన్యాయం చేసినట్లు కాదా?" నా ధర్మసందేహం.

"గాడిద గుడ్డేంకాదు, ఉపవాసం అంటూ భక్తజనులు డజన్లకొద్దీ  నేతిపెసరట్లు తింటంలా? అది తప్పు కానప్పుడు ఇదీ కాదు." బల్ల గుద్దాడు మావాడు.

"ఒప్పుకుంటున్నాను. అయితే మనం ఇడ్లీ మాత్రమే తిందాం, అలా అయితేనే నేను ఒప్పుకుంటాను." బింకంగా అన్నాను.

"ఇడ్లీ తప్ప ఏంతిన్నా గడ్డి తిన్నంత ఒట్టు." ప్రతిజ్ఞ చేసాడు మదీయ మిత్రుడు.

గుంటూరు మెడికల్ కాలేజికీ ఆనంద భవన్‌కీ రైలుకట్టే అడ్డం. అంచేత నాలుగు నిమిషాల నలభై సెకండ్లలో ఆనందభవన్లో తేలాం. సర్వారావు మనవాడే. అతని తల్లి మెడికల్ వార్డులో ట్రీట్మెంటు తీసుకుంటుంది. పెద్దాస్పత్రిలో, పెద్దడాక్టరుగారి మందీమార్బలంలో చివరి వరసలో సభ్యులం. కౌరవుల్లో నూరోవాడైనా దుర్యోధన సార్వభౌముడి తమ్ముడే! ఆరకంగా మేమూ అతని ద్రుష్టిలో పెద్దమనుషులమే!   

సర్వారావు కృతజ్ఞాతాభిమానములతో మమ్ము పలుకరించెను. ప్రేమానురాగాములు కురిపించెను. అదృష్టవశాత్తు అతగాడి తల్లి కోలుకుని డిశ్చార్జ్ అయ్యింది. లేకపోతే పరిస్తితి ఇంకోరకంగా వుండేదేమో!

"సార్! ఇడ్లీ వాయ ఇప్పుడే దిగింది. కారప్పొడీ నెయ్యీ.. " 

తెచ్చేసుకో, తిని పెడతాం.

"మైసూర్ బజ్జీ రెడీ అయ్యింది, తెస్తున్నా." 

అయ్యో! తప్పకుండా, దానికేం భాగ్యం? గట్టిచట్నీ వేస్తే ఇంకా బాగుంటుందేమో!

"మూడుముక్కల మినపట్టు? మసాలాదోశ?" 

సమన్యాయం మా మతం, రెంటినీ తినడం మా అభిమతం.

"సార్! ఊతప్పం తెమ్మంటారా? పైన జీడిపప్పు స్పెషల్ గా చల్లిస్తాను."

ఏవిటో నీ పిచ్చిఅభిమానం! అదేచేత్తో ఓ నాలుగు నేతిచుక్కలు, క్యారెట్ తురుం కూడా వేయిస్తే ఇంకా బాగుంటుంది కదా!

"ఫిల్టర్ కాఫీ స్పెషల్గా చేయించాను సార్." అంటూ నురుగుతో పొగలు గక్కు కాఫీ. 

ఆహా! కాఫీ ఎంత మధురముగాయున్నది! 

మైడియర్ సర్వారావ్! చిరంజీవ, చిరంజీవ. సుఖీభవ, సుఖీభవ. రాలిపోటానికి సిద్ధంగాఉన్న రెండు నిండుప్రాణాల్ని నిలబెట్టావ్. నువ్వూ, నీతల్లీ, నీ యావత్ కుటుంబము కలకాలం పచ్చగా జీవించండి.  

కమ్మటి కాఫీ తాగి బయటపడ్డాం. మత్తుగా, భుక్తాయాసంగా ఉంది. ఆహా! ఏమి ఈ ఆనందము! మానవునికి ఇంతకన్నా కావలసినదేమి? మనకీ యుద్ధాలు, దుర్మార్గాలు అవసరమా?

మెడికల్కా కాలేజీ వైపు భారంగా అడుగులు వేస్తూండగా మళ్ళీ దుఃఖం ముంచుకొచ్చింది. 

"లెనన్ లేని బీటిల్స్ ఉప్పులేని పప్పులాంటిది." అన్నాను.

"అసలా యోకో ఓనో మన లెనన్‌కి శనిలా పట్టింది. ఆమె మూలంగానే బంగారంలాంటి గ్రూప్ విడిపోయింది. ఎప్పుడోకప్పుడు కలవక పోతారా అనుకునేవాణ్ణి." అన్నాడు మావాడు.

ఇంతలో ఇడ్లీ మాత్రమే తినాలన్న నిబంధన గుర్తొచ్చి కెవ్వుమన్నాను. మావాడు విసుక్కున్నాడు - "నువ్వు మరీ చాదస్తంగా మాట్లాడుతున్నావ్. అసలు మనం ఆర్డర్ ఇచ్చామా? ఇవ్వలేదు గదా! ఆ సర్వర్  హడావుడి చేసి మనతో అన్నీ తినిపిస్తే అది మన తప్పెలా అవుతుంది?"

"అయినా మనం తిన్నట్లే గదా!" సందేహంగా అన్నాను.

"ఖచ్చితంగా కాదు! ఆ సర్వర్ తెచ్చి పెడుతుంటే, కాదనలేక మొహమాటం కొద్దీ తిన్నాం. అంతే! అతనక్కడ లేకపొతే నాప్రాణం పోయినా ఇడ్లీ తరవాత ఇంకే ఆర్దరిచ్చేవాణ్ణే కాదు, నన్ను నమ్ము." అన్నాడు మావాడు. 

నిజమే కదా! నాకు మావాడి లాజిక్ నాకు భలేగా నచ్చేసింది. అందుకే పూర్తిగా నమ్మేశాను.

"ఎంతయినా జాన్ లెనన్ లేని లోటు పూడ్చలేనిది." మళ్ళీ జాన్ లెనన్ బాధ మనసుని తొలిచెయ్యటం మొదలైంది. 

అవ్విధముగా -

జాన్ లెనన్ గూర్చి ఆలోచనలతో దుఃఖము పొంగిపొర్లిపోతూ సంతాప సమాలోచనలు కొనసాగుచుండగా భారంగా మా నడక కొనసాగించితిమి. 

నీతి -

బాధ ఎంతైనా పడు, తిండి మాత్రం మానకు!

(photo courtesy : Google)

Sunday, 23 October 2011

సినిమాలు మంచివే! కానీ మనం?


'సినిమాల్లో చెడు ఉండరాదు, బలహీన మనస్తత్వం కలవారు చెడిపోతారు.'

ఇది నేను నా చిన్నప్పట్నించీ వింటున్న సుభాషితం. ఓకే! ఒప్పుకుంటున్నా. ఇప్పుడు అట్టు తిరగేద్దాం. మరి - సినిమాల్లో మంచిని చూసి బాగుపడినవాళ్ళు ఎందరున్నారు? ఫలానా సినిమాలో ఫలానా పాయింటు నాకళ్ళు తెరిపించింది. కావున - ఫలానా విధంగా నా ఆలోచనా విధానాన్ని మార్చుకున్నాను, ప్రవర్తిస్తున్నాను. అన్నవాళ్ళు  మీకెక్కడైనా కనిపించారా? నాకైతే కనిపించలేదు.

'దేవదాసు'లో ఎస్వీరంగారావు - అంతస్తు తక్కువ పిల్లని చేసుకుంటే తుపాకీతో కాల్చుకు చస్తానని బెదిరించి మరీ నాగేశ్వర్రావుని సావిత్రి నుండి వేరు చేస్తాడు. ఆ తరవాత దేవదాసు, పార్వతిలు తెలుగువాళ్ళని దారుణంగా ఏడిపించారు. అరవైయ్యేళ్ళ క్రితం ఈ ఫార్ములా సూపర్ హిట్టు. కానీ ఈరోజుకీ తమ పిల్లలు దేవదాసు, పార్వతిల్లా భ్రష్టుపట్టిపోతారనే భయంతో  పిల్లల ప్రేమవివాహాలు ఒప్పుకునే దయార్ధ్ర హృదయులు నాక్కనిపించట్లేదు.
                             
నా చిన్నప్పుడు అమ్మ, పక్కింటి పిన్నిగారితో కలిసి ఎన్నో ఏడుపుగొట్టు సినిమాలు చూశాను. 'అన్నా! నీ అనురాగం' అంటూ గుండెలు పగిలే గుడ్డి చెల్లెలి ఆక్రందనల్ని ఎర్రటికళ్ళతో, మొహం వాచిపోయేలా బిగ్గరగా రోదిస్తూ సినిమాని చూశారు పిన్నిగారు. ఇంటికెళ్ళంగాన్లే బండెడు ఇంటి చాకిరీ సరీగ్గా చెయ్యలేదని తన విధవాడపడుచుని ఇల్లెగిరిపొయ్యేలా కేకలేసింది!

శారద నటించిన 'మనుషులు మారాలి'  సినిమా తెలుగువాళ్ళ హృదయాన్ని పీల్చి పిప్పి చేసింది. శోభన్ బాబు హత్య, ఆపై శారద దుర్భర దరిద్రాన్ని తట్టుకోలేక తన పిల్లల్ని చంపేసుకోవటం.. నాకు తెలిసి తెలుగులో ఇంతకన్నా సీరియస్ సినిమా మరోటి లేదు. జనాలు విరగబడి చూసి యేడ్చేశారు. ఆ సినిమా విజయవంతమై నిర్మాతలకి కాసులు తెచ్చింది గానీ జనాల్లో మార్పు తేలేకపోయింది. 

'రోజులు మారాయి'లో దళిత వర్గానికి చెందిన షావుకారు జానకిని వ్యవసాయ వర్గానికి చెందిన నాగేశ్వర్రావ్  ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. ఈ దళిత అగ్రవర్ణాల పెళ్ళి అలనాటి మాలపిల్ల దగ్గర మొదలై - కాలం మారింది, బలిపీఠం లాంటి సూపర్ హిట్ల మీదుగా చాలా పెద్దప్రయాణమే చేసింది. మనం కూడా సమాంతరంగా కారంచేడు, చుండూరు, నీరుకొండల మీదుగా ఇంకో పెద్దప్రయాణం చేస్తున్నాం!
                           
నేను ఈ ఉదాహరణల్ని సినిమా ప్రభావం సమాజం మీద ఉండదని చెప్పటానికి రాయట్లేదు. ఉంటుందని అన్డానికి తగినంత ఆధారాల్లేవని చెప్పటానికి మాత్రమే రాస్తున్నాను.
                             
సినిమా మన ఈగోని సంతృప్తి పరుస్తుంది. వాస్తవ ప్రపంచంలో మనకున్న తోర్రల్ని పూడ్చి ఆకాశంలో విహరించే ఆదర్శవంతమైన పాత్రల్ని భలే ఇష్టపడతాం. అసలా పాత్ర విలువల పట్ల కనీసం దర్శక రచయితలకే నమ్మకం ఉండదు. ఆదర్శవంతమైన ఆలోచనలు, సాధ్యంకాని కోరికలు, లేని విలువలు ఆపాదించుకోవటానికి డబ్బుతో కొనుక్కునే సాధనం సినిమా.

ఇవ్వాల్టికీ వాస్తవ జీవితంలో కులమతాలు, ఆస్తిఅంతస్తులు చాలా ముఖ్యం. కానీ సినిమాల్లో పడవ నడిపే వ్యక్తి ఆమాయక ప్రేమ (మూగమనసులు), నల్లటివాడి కవితాత్మక ప్రేమకథ (చెల్లెలి కాపురం), పనివాడి మొరటు ఆత్మీయత (ఆత్మబంధువు), రిక్షా కార్మికుని కుటుంబ మమకారాలు (శభాష్ రాముడు) ముచ్చట గొలుపుతయ్. అంటే - నిజ జీవితంలో మనకేది ఉండదో అదే సినిమాల్లో చూసుకుని తృప్తినొందుతాం!
                             
కాబట్టి నా పాయింటేంటంటే - జనం చెడిపోతున్నారని ఎవరూ గుండెలు బాదుకోనక్కర్లేదు. మీరూ నేనూ ఈ జనంలో భాగమే. ఎంత గొప్ప సినిమా చూసినా మీరూ నేనూ ఆవగింజంతైనా బాగుపడనట్లే, ఎవరూ కూడా చెడిపోరు. కాకపోతే తెలుగువాళ్ళల్లో కొందరు మేధావులున్నారు. వాళ్ళు సామాన్య ప్రజల కన్నా పైస్థాయివాళ్ళు కాబట్టి - సినిమాల్లో చెడు చూసి జనాలు చెడిపోతున్నారంటూ స్టేట్మెంట్లు పడేస్తారు! 

పోనీ - చిన్నపిల్లలయినా సినిమా ప్రభావానికి లోనవుతారా? ఇదీ అనుమానమే! గుండమ్మకథ పదిసార్లు చూసిన నా అన్న నన్ను ఎన్టీఆర్ నాగేశ్వర్రావుని చూసినట్లు ఆప్యాయంగా చూసుకోకపోగా, నామీద నాన్నకి పితూరీలు చెప్పి తన్నించేవాడు. 'రక్తసంబంధం'లో తీవ్రమైన అన్నాచెల్లెళ్ళ సెంటిమెంట్ వుంది. సినిమా చూస్తూ హాల్లో కడవల కొద్దీ కన్నీరు కార్చిన అక్క - నేను తన పెన్సిలూ, ఎరేజరు వాడేస్తున్నాని రాక్షసిలా రక్తమొచ్చేట్లు గిచ్చింది. ఆరకంగా మాదీ రక్తసంబంధమైపోయింది! మరి పిల్లల మీద సినిమాల ప్రభావం ఏంటి!?

సినిమాల ప్రభావం ఉండదని నిరూపించడానికి అన్నీ నెగెటివ్ పాయింట్లు రాస్తున్నాను కదూ! కాబట్టి ట్రాక్ మారుస్తా. చిన్నప్పుడు సినిమాలు చూస్తున్నప్పుడు నాకు కొన్ని కోరికలు కలిగేవి. 'శభాష్ రాముడు' చూసి రామారావులా రిక్షా తొక్కుదామనే కోరికతో తహతహలాడాను. కాలేజీకి వచ్చాక నా రిక్షా తొక్కుడు కోరిక తీరింది. 

కొంచెం పెద్దయ్యాక ఏడుపుగొట్టు ఇల్లాళ్ళు నచ్చడం మొదలెట్టారు. మొగుడు 'ఇంకోదాన్తో పోతాను మొర్రో!' అంటున్నా పట్టించుకోకుండా మొగుడిగాడి కాళ్ళమీద పడి భీభత్సంగా కన్నీరుగార్చే పతివ్రతా శిరోమణులు నా మనసు దోచారు. ఆరోజుల్లో నాకు నచ్చిన డైలాగ్ - "ఏవఁండీ! మీ పాదాల దగ్గర ఇంత చోటివ్వండి, కనీసం మీఇంట్లో పనిమనిషిగా ఉండనిస్తూ ఇంత ముద్ద పడెయ్యండి." ఇట్లాంటి సీన్లు చూసినప్పుడల్లా అర్జంటుగా పెళ్లి చేసుకుని ఏడిచే భార్యతో బ్రతిమాలించుకోవాలని తెగ ముచ్చటపడేవాణ్ని. కానీ - పదోక్లాసులో పెళ్లి చేసుకునే సౌలభ్యం, సౌకర్యం లేక ఆగిపొయ్యా! రిక్షా ముచ్చటైతే తీరింది గానీ, ఈ పాదాల దగ్గర చోటు ముచ్చట తీరలేదని ప్రత్యేకంగా రాయడం అనవసరం. 

చివరాకరికి నే చెప్పొచ్చేదేమనగా - సినిమా చూడ్డం అనేది కేవలం కాలక్షేపం మాత్రమే. అది తీసేవాడికీ తెలుసు, చూసేవాడికీ తెలుసు. మరి తెలీన్ది ఎవరికి? 'సినిమాల్లో చెడు ఉండరాదు. బలహీన మనస్తత్వం గలవారు చెడిపోతారు.' అనేవాళ్లకి. ఇంతకీ ఆ చెడిపొయ్యే బలహీన మనస్తత్వ దుర్భలులు ఎక్కడ వుంటారో, ఎలా వుంటారో వాళ్ళు చెప్పరు. అదే తంటా!

(photo courtesy : Google)

Thursday, 20 October 2011

అద్వానీ రథయాత్ర


రాజకీయాలు క్లిష్టమైనవే కాదు, కఠినమైనవి కూడా. ఒకప్పుడు రథయాత్ర చేసి బీజేపీ టీఆర్పీని అమాంతంగా పెంచేశాడు అద్వానీ. మళ్ళీ ఇప్పుడు ఇంకో రథయాత్ర మొదలెట్టాడు. చరిత్ర పునరావృతం అవుతుందంటారు. రాజకీయాలకి ఈ సూత్రం వర్తించకపోవచ్చు. ఈసారి రథయాత్ర ఎలా ఉందో చెప్పే కార్టూన్. 

('ఔట్‌లుక్‌'లో ప్రచురితమైన సందీప్ కార్టూన్)

Tuesday, 11 October 2011

కల్లోల చిత్రాలు


మనసుని కలిచివేసే చిత్రాల్ని కల్లోల చిత్రాలు అంటారు. ఇవి అందరకీ ఒకటే రకంగా వుండకపోవచ్చు. ఎవరెవరి సామాజిక రాజకీయ అవగాహన బట్టి మారుతుంటయ్. భోపాల్ గ్యాస్ ట్రాజడీలో చనిపోయిన  చిన్నారి ముఖాన్ని చూశాక చాలామందికి అన్నం సయించలేదు, నిద్ర పట్టలేదు. అలాగే - జబ్బుతో తీసుకుంటున్నప్పటి సావిత్రి ఫోటో నన్ను తీవ్రంగా కలచివేసింది.  

మనమంతా చిన్నప్పుడు అమాయకంగా వుంటాం. సినిమాకి, నిజజీవితానికీ తేడా తెలీదు. అంచేత సావిత్రి నాకేనాడూ సినిమానటిగా తెలీదు. బాగా తెలిసిన మనిషిగా, నా కళ్ళల్లోకళ్ళు పెట్టి ముచ్చట్లు చెప్పిన ఆత్మీయురాలిగా అనిపించేది. చాలాసార్లు సూర్యాకాంతాన్ని చంపేసి సావిత్రిని రక్షిద్దామనుకున్నాను. 

దేవదాసు ఇంటికి పార్వతి అర్ధరాత్రి సమయంలో వెళ్లి 'నన్ను పెళ్లిచేసుకో దేవదా!' అని వేడుకున్నప్పుడు, దేవదాసు ఎంత బాధపడ్డాడో తెలీదు గానీ, నాకు మాత్రం కన్నీరు ఆగింది కాదు. ఒంటినిండా నగలతో మెరిసిపోతున్న మిస్సమ్మ 'ఏమిటో నీమాయ' అంటూ ముద్దుముద్దుగా పాడుతుంటే చూడ్డానికి రెండుకళ్ళు చాల్లేదు. లక్ష్మణకుమారుణ్ణి దడిపించిన మాయాశశిరేఖ ఠీవి, దర్పం సూపర్బ్. 'నన్నువదలి నీవు పోలేవులే.. ' అంటూ నాగేశ్వరరావుని మురిపించింది. అందుకే ఆనాటి కుర్రాళ్ళు సావిత్రి లాంటి భార్య కోసం కలలు కన్నారు. 

కొన్నాళ్ళక్రితం యేదో పేపర్ తిరగేస్తుండగా ఒకఫోటో నా దృష్టినాకర్షించింది. అది మందపాటి కళ్ళద్దాలతో, బక్కచిక్కిన వొక వృద్ధుడి ఫోటో. ఆయన బాగా పేదవాట్ట, పూట గడవట్లేదుట. కర్ర సాయంతో ఒంటికాలుపై నిలబడి రెండుచేతులూ జోడించి సాయం చెయ్యమని దీనంగా వేడుకుంటున్నాడు. ఆ కళ్ళు చూశాను, ఎక్కడో చూశాను! ఎక్కడ? ఆ కళ్ళని మరింత పరిశీలనగా చూశాను. వొక్కసారిగా వొళ్ళు ఝల్లుమంది,  ఆపై గుండె బరువెక్కింది. 

ఆ వృద్ధుడు ఆషామాషా వ్యక్తికాదు, వందల సినిమాల్లో ఎన్టీవోణ్ణి ముప్పతిప్పలు పెట్టిన రాజనాల! కృష్ణకుమారి, దేవిక , సావిత్రి, జయలలిత.. హీరొయిన్ ఎవరనేది రాజనాలకి అనవసరం. అతనికసలు 'రొమాంటిక్' అంటే అర్ధం కూడా తెలీదు. కానీ హీరోయిన్లెవరూ రామారావుకి దక్కకుండా చెయ్యాలి! అదే రాజనాల ధ్యేయం, పోటీ, పట్టుదల! అందుకే వాళ్ళని ఎత్తుకెళ్ళిపొయ్యేవాడు, నిర్భందించేవాడు. 'నిన్ను రక్షించడం ఎవరి తరం కాదు' అని క్రూరంగా నవ్వేవాడు!

కత్తియుద్ధంలో రామారావుకి సమఉజ్జీ రాజనాల. చివరాకరికి ఓడిపోతానని తెలిసినా గంటలకొద్దీ ఫైటింగులు, యుద్ధాలు చేసేవాడు. ఎన్నికుట్రలు పన్నాడు! ఎంతమంది రాజుల్ని  చెరబట్టాడు! ఎన్నిఘోరాలు చేశాడు! అంతటి అరివీర భయంకరుడు రాజనాల ఇలా అయిపొయ్యాడేమిటి! 

'రాజనాలకి వృద్దాప్యం రాకూడాదా? ఆర్ధిక ఇబ్బందులు స్వయంకృతం. సినిమా ఇండస్ట్రీలో ఇవన్నీ మామూలే.' మనందరికీ సింహం అంటే అందమైన జూలు, ఠీవీగా నడచివచ్చే అందమైన జంతువు గుర్తొస్తుంది గానీ - పళ్ళూడిపోయిన జబ్బు సింహం గుర్తురాదు. అట్లాంటి సింహాన్ని చూస్తే - 'అయ్యో!' అనిపిస్తుంది. ఈ భావన ఏ ముసలికుక్కనో, జబ్బుపిల్లినో చూసినప్పుడు రాదు. నాకు రాజనాలని చూడంగాన్లే జబ్బు సింహం గుర్తొచ్చింది.  

ఒకసారి సినిమావాళ్ళ చివరి రోజుల గూర్చి చర్చ వచ్చినప్పుడు, ఒక పెద్దమనిషి "సినిమావారికి లేని అలవాటుండదు, వ్యసనపరులు. అందుకే చివర్రోజుల్లో కష్టాలు పడతారు." అని ఈసడించుకున్నాడు. ఆయనగారు క్రమం తప్పకుండా ఉదయాన్నే యోగా చేస్తూ, శనివారాలు ఉపవాసాలు చేస్తూ సిస్టమేటిగ్గా జీవిస్తున్న బుద్ధిజీవి. అటువంటి జీవితం మంచిదే కానీ అందరూ అలా జీవించలేరు గదా!

మనమంతా ఒక మూసలో కోట్టుకుపోతుంటాం. చదువులు, ఉద్యోగాలు, బాధ్యతలు మనలోని మనిషి లక్షణాలని హరిస్తాయేమో. అందుకే ఎంత ప్రతిభావంతులైనా సరే - వారి వ్యక్తిగత బలహీనతల్ని ఎక్కువచేసి చూస్తూ.. అసలావ్యక్తి ప్రతిభనే మర్చిపోతాం. ఈ ధోరణి చదువుకున్నవారిలోనే ఎక్కువనుకుంటాను!

సావిత్రి గొప్పనటి. పార్వతిగా, మిస్సమ్మగా, శశిరేఖగా తెలుగువాళ్ళని మైమరపించింది. ఒక తరం తెలుగు ప్రేక్షకులు సావిత్రి అందానికీ, అభినయానికీ ఫిదా అయిపోయ్యారు. అటువంటి సుందరమూర్తి - గుర్తు పట్టలేనంత సన్నగా, పుల్లల్లాంటి చేతుల్తో, ప్రపంచలోని బాధనంతా తానే అనుభవిస్తున్నట్లుగా - ఎంత ఘోరం! అందుకే ఫోటో చూడంగాన్లే మనసంతా దిగులుగా అయిపొయింది. 


(photos courtesy : Google)

Sunday, 9 October 2011

టెండూల్కరుని టెక్కునిక్కులు


సినిమా రంగం, క్రీడా రంగం.. ఇలా ఏదోక రంగంలో పేరుప్రఖ్యాతులు సంపాదించినవాళ్ళని సెలబ్రిటీ అంటారు. ఈ సెలబ్రిటీలు తమ కెరీర్ అయిపొయ్యాక, అనుభవాల్ని పుస్తకంగా రాస్తారు. ఈ రాతకోతల సంగతులు సెలబ్రిటీలకి తెలీనందున, వారికి సహకరించేందుకు ప్రొఫెషనల్ రైటర్స్ వుంటారు. కొన్నిసార్లు సెలెబ్రిటీల అనుభవాల్తో పుస్తకం వాళ్ళే రాసేస్తారు. ఇక్కడ ఆయా సెలబ్రిటీల క్రేజ్ కేష్ చేసుకోవడమే ప్రధాన లక్ష్యం, ఇంకేదీ కాదు. ప్రపంచవ్యాప్తంగా ఈ తతంగం ఎప్పణ్నుండో నడుస్తుంది. 

ఇప్పుడు మనం ఇంకో విషయం గమనించాలి. పుస్తకాల్ని మార్కెటింగ్ చేసుకోవాలంటే పుస్తకంలో కొన్ని వివాదాలు వుండాలి, వుండేట్లు రాయాలి. అప్పుడే కొనేవాడికి ఆసక్తి కలుగుతుంది. అంచేత పబ్లిషర్, రచయిత ఈ విషయాల్ని జాగ్రత్తగా ప్లాన్ చేస్తారు. ఇది బుక్ పబ్లిషింగ్‌లో పురాతనకాలం నుండి అమలవుతున్న టెక్నిక్. 

వ్యాపారం అన్నాక ఎప్పుడు యేది మాట్లాడాలో, ఎందుకు మాట్లాడాలో బాగా తెలిసుండాలి. అందుకే యే ఇంటర్నేషల్ క్రికెటర్ అయినా ఇండియాలో అడుగు పెట్టంగాన్లే సచిన్ టెండూల్కర్‌ని ఆకాశానికెత్తేస్తాడు. అలా చేస్తేనే అతనికి క్రికెట్ అభిమానుల ఆదరణ, మీడియాలో ప్రచారం. ఇది చాలా సింపుల్ లాజిక్, వివేకంతమైన వ్యాపార టెక్నిక్.  

షోయబ్ అఖ్తర్ పాకిస్తాన్ క్రికెటర్, అత్యంత వేగంతో బంతులు విసిరేస్తాడని పేరుగాంచాడు. సరే, అందరిలా తనూ సొమ్ము చేసుకుందామని తన అనుభవాల్తో యేదో పుస్తకం రాశాడు. అఖ్తర్‌కి ఇండియాలో అభిమానులున్నారు, కాబట్టి అతని పుస్తకానికి ఇక్కడ మార్కెట్ వుంటుంది. అప్పుడతను సచిన్ గూర్చి గొప్పగా రాయాలి, పోనీ కనీసం విమర్శించకూడదు. మరి అమ్మకాల కోసం వివాదం ఎలా సృష్టించాలి? మసాలా కోసం యే వెస్టీండీస్ క్రికెటర్నో, ఆస్ట్రేలియా క్రికెటర్నో విమర్శిస్తే పొయ్యేది. అది మంచి వ్యాపారస్తుడి లక్షణం.  

అఖ్తర్‌కి వ్యాపార తెలివితేటలు లేనట్లుగా తోస్తుంది లేదా అతనికి సరైన సలహదారులు లేరేమో. తన బంతులకి సచిన్ భయపడ్డాడనే వివాదంతో పుస్తకం మార్కెటింగ్ మొదలెట్టాడు. సచిన్ మనకి దేవుడు, దేవుడెలా భయపడతాడు! మనవాళ్ళకి సహజంగానే కోపం వచ్చింది. అందుకే పుస్తకం అమ్మకాలు అంత అశాజనకంగా లేవు. 

సచిన్ అభిమానులకి నచ్చకపోయినా - 'అక్తర్ బంతులకి సచిన్ భయపడ్డాడు' అనుకుందాం. అప్పుడు సచిన్ యేం చేస్తాడు? అక్తర్ బౌలింగ్ విడియోని తన కోచ్ అధ్వర్యంలో అధ్యయనం చేస్తూ, అతని బౌలింగుని ఎలా ఎదుర్కోవాలో సాధన చేస్తాడు, ఆ తరవాత అక్తర్ బౌలింగుని ప్రతిభావంతంగా ఎదుర్కొంటాడు. 

ఇది మంచి ఆటగాడి లక్షణం. భయపడటం అనేది బూతుమాట కాదు. అసలు ఆ భయమే చాలాసార్లు మనని కార్యసాధకుణ్ణి చేస్తుంది. కానీ తమ హీరో భయపడ్డాడంటే అభిమానులు తట్టుకోలేరు. ఈ భయపడటం అనే పదం పిరివాడి పేటెంట్ రైట్! ధైర్యానికి మాత్రం వీరుడూ, శూరుడూ అంటూ అనేక విశేషణాలున్నయ్. 

సచిన్ టెండూల్కర్‌కి భారతరత్న ఇవ్వాలని అభిమానులు అత్యంత తీవ్రంగా ఘోషిస్తున్నారు. మంచిదే, క్రికెట్ ఆడటం పబ్లిక్ సర్విస్ క్రిందకి వస్తుందేమో నాకు తెలీదు. టెండూల్కర్ బూస్ట్ నించి బర్నాల్ దాకా వంద బ్రాండ్లకి ఎంబాసిడర్ (అంబాసిడర్ కారుకీ బ్రాండ్ అంబాసిడర్‌కీ సంబంధం లేదు), గొలుసు హోటళ్ళు (chain of hotels) కూడా ఉన్నాయి. 

రేపు 'బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై భారతరత్న' అనే కొత్త ట్యాగ్‌లైన్తో మరిన్ని కాంట్రాక్టులు రాబట్టుకోవచ్చు.' వంద పెప్సీ మూతలు కలెక్ట్ చేసుకోండి, భారతరత్నతో షేక్ హ్యాండ్ చెయ్యండి.' అనే కొత్త ప్రచారం మొదలుపెట్టొచ్చు. బెస్టాఫ్ లక్ టు సచిన్. 

సామాన్య ప్రజానీకానికి సంబంధంలేని రత్నాలు, ముత్యాల మీద ఎవార్డులు ఇవ్వడమే పెద్ద జోక్. భారతబొగ్గు, భారతఉప్పు లాంటి పేర్లు ఎవార్డులకి పెడితే మరింత అర్ధవంతంగా ఉంటుందేమో! బొగ్గూ, ఉప్పు లేని బ్రతుకు ఊహించుకోలేం. మనకి ఏమాత్రం సంబంధంలేని రాళ్ళూ, రప్పల పేర్ల మీద ఎవార్డులు ఇస్తున్న ప్రభుత్వంవారి ఉద్దేశ్యం కూడా - వీళ్ళని పట్టించుకోండి అనేమో!  

అసలీ ఆటలకీ ప్రజాసంక్షేమానికీ యే మాత్రం సంబంధం లేదు. టెండూల్కర్ శరద్ పవార్‌తో్ వాళ్ళ మాతృభాష మరాఠీలో - "అంకుల్! నా అభిమానులు ఉల్లిపాయలు కొన్లేక చస్తున్నారు, ధర తగ్గించండి." అన్చెప్పొచ్చు. అప్పుడేమౌతుంది? టెండూల్కర్‌కి భారతరత్న రావటం అటుంచి, వున్న అవార్డులు, రివార్డులు పొయ్యే ప్రమాదం ఉంది. 

భారత క్రికెటర్ల సంపాదనకీ, లాబీయింగ్ రాజకీయాలకీ పితామహుడు గవాస్కర్. కాబట్టి టెండూల్కర్ ప్రజలకి సంబందించిన 'చెత్త' ఆలోచనల్ని పొరబాటున కూడా దగ్గరికి రానివ్వడు. తనకి పనికొచ్చే 'మంచి' ఆలోచన మాత్రమే చేస్తాడు. 'బొంబాయి నడిబొడ్డున నాలుగెకరాలు ఫ్రీగా ఇస్తే క్రికెట్ అకాడెమీ పెడతాను.' అంటూ గురువు గవాస్కర్ పధ్ధతిలో శరద్ పవార్‌ని అడుగుతాడు

సచిన్ ఒక మంచి క్రికెటర్. కష్టపడి ఆడాడు, ఇంకా కష్టపడి సంపాదించుకున్నాడు. అందుకతను యేవో మార్కెటింగ్ టెక్కునిక్కులు ప్రయోగించాడు, అవన్నీ మనకనవసరం. అయితే ఒక ఆటగాడికి భారతరత్న ఇవ్వాలనుకుంటే  ఈమాత్రం సరిపోతుందా? జనాకర్షణ కలిగిన ఒక ఆట ద్వారా కోట్లు వెనకేసుకోవటం, పుట్టపర్తి బాబావారి సేవలో తరించిపోవటం మించి పబ్లిక్ లైఫ్‌లో సచిన్ సాధించిందేమిటి?

'అసలిప్పుడు నోబెల్ ప్రైజులకే దిక్కు లేదు. అందరి దృష్టీ స్టీవ్ జాబ్స్, బిల్ గేట్స్, నారాయణమూర్తిల మీదే ఉంది. అట్లాంటి ఈ రోజుల్లో భారతరత్నకి మాత్రం ఏపాటి విలువుంది?' అంటారా? 

అయితే గొడవే లేదు! 

(photo courtesy : Google)   

Thursday, 6 October 2011

సున్నిత సమస్యాపురం


"జోగినాధం! కళ్ళెట్టుకు సూడు. ఆకాశంలో ఏదో మర్డర్ జరినట్టుంది కదూ!" అన్నాడు ప్రెసిడెంటు.

రావు గోపాల్రావు లాంటి ప్రెసిడెంటు ఆఊరికి మహారాజే. ప్రెసిడెంటుది ఆరడగుల భారీవిగ్రహం. అతని దర్జా అంతా ఆ కోరమీసంలోనే ఉందంటారు. అతనికి జోగినాధం నమ్మిన బంటు. పొట్టిగా, బక్కగా, మాసిన గడ్డం, పాత కోటు, బూతద్దాల కళ్ళజోడూ.. చూట్టానికి అచ్చు అల్లు రామలింగయ్యలా ఉంటాడు.
                   
"మహాప్రభో! ఇవ్వాళేం జరుగుతుందోననీ.. మన కనెక్సన్ కట్టయిపోద్దేమొనని నాకు కాలూ చెయ్యీ ఆడట్లేదు. మీరేమో ఆకాశమంటూ, మర్డరంటూ ఏవేమో శెలవిస్తున్నారు." భయంగా అన్నాడు జోగినాధం.

సిగరెట్ దమ్ము లాగుతూ విలాసంగా చిర్నవ్వు నవ్వాడు ప్రెసిడెంటు.
                   
జోగినాధం చెప్తున్న ఆ సమస్య గతకొన్నాళ్ళుగా ఆఊరిని అగ్నిగుండంగా మార్చేసింది. ఏ ఇద్దరు కలిసినా ఆసమస్య గూర్చే చర్చ. ఇంతకీ ఏమా సమస్య? ఏంటా కథ?


రంగి, రంగడు గత పాతికేళ్ళుగా భార్యాభర్తలు. మొదట్లో వారి కాపురం సజావుగానే సాగింది. కానీ.. గతకొన్నేళ్లుగా రంగడు ఫుల్లుగా తాగి రంగిని బాదిపడేస్తున్నాడు. ఈ రోజువారీ దెబ్బలు భరించలేని రంగి విడిపోవాలని నిర్ణయించుకుంది. రంగి చుట్టాలు కూడా రంగడికి చెప్పీచెప్పి విసిగిపొయ్యి.. ఈ ఎదవ ఇంక మారడనీ, రంగి విడిపోవాల్సిందేననే అభిప్రాయానికి వచ్చేశారు.
                   
కానీ.. విడిపోటం అనేది పెద్దసమస్యగా మారింది. రంగి పుట్టింటి తరఫున కట్నంగా తెచ్చుకున్న అరెకరా మాగాణి సమస్యంతటికీ మూలకారణం.

'నా అరెకరా నాకెచ్చియ్. నా సావు నే సస్తా.' అంది రంగి.

'మీ పుట్టింటోళ్ళ బీడు బూమి నా రెక్కల కట్టంతో బాగు చేశాను. ఇన్నాళ్ళూ దున్నాను. కాబట్టి పొలం నాదే.' అన్నాడు రంగడు.  

'దున్నేవోడిదే బూమి.' అని రాజకీయాలు కూడా మాట్లాడాడు.

రంగికి నలుగురు అన్నదమ్ములు. ముగ్గురు అప్పచెల్లెళ్ళు. రంగడికి ముగ్గురు అన్నలు. ఇద్దరు తమ్ముళ్ళు.
                   
వ్యవహారం ప్రెసిడెంటు దాక పొయ్యింది. మొదట్లో రంగి పరివారం ఆ అరెకరా పొలం గూర్చి అడిగినప్పుడల్లా ప్రెసిడెంటుకి అందులో చాలా న్యాయం కనిపించేది.

"అయినా మీపొలంతో వాడికేంటి సమ్మందం? మీకెందుకు. నే మాట్లాడతా. మీరు పోండి." అని పంపించేసేవాడు.

అసలే ఎలక్షన్లు రాబోతున్నాయ్. ఈతీర్పుతో రాబోయే ఎలక్షన్లలో కలిగే లాభనష్టాల బేరీజులో ఉన్నాడు ప్రెసిడెంటు.
                   
జోగినాధం ద్వారా ఈ సంగతి గ్రహించిన రంగడి పటాలం.. ఆరెకరా కోసం తెలివైన వాదన ఎత్తుకుంది.

'మనది ఇందూ దేశం. ఇక్కడంతా ఇందూ దరమం. పెళ్ళంటే నూరేళ్ళపంట. మొగుడెంత ఎదవైనా.. ఎంత తాగుబోతు సన్నాసైనా.. మొగుడు మొగుడే. ఇడాకులు మహాపాపం. మాకు ఇందూ నాయం గావాల.' అంటూ మతం సెంటిమెంటుతో కొట్టారు.

'ఈఇదాన పెతి ఆడముండా పొలం పుట్రా తీసేస్కుని పుట్టింట జేర్తే పాపం మగోడి బెతుకేం గావాల్న?' అంటూ ఆర్ధికసామాజికాంశాలతో కొట్టారు.

'అయినా .. కలిసుంటే కలదు సుకం అని ఎన్టీవోడు సేప్పాడు గందా. ఆ బాబు సెప్పినంక ఇంక ఏరే నాయమేంది?' అని చరిత్రతోనూ కొట్టారు.
                   
ఈ దెబ్బలకి ఆలోచనలో పడ్డాడు ప్రెసిడెంటు. ఏదో నాలుగు కేకలేసి యవ్వారం సెటిల్ చేద్దామనుకున్నాడు. కానీ ఇందులో లోతెక్కువుందని గ్రహించాడు. ఆవిధంగా ఈ మొగుడూపెళ్ళాల గోల్లో ప్రెసిడెంటు కూడా అడ్డంగా ఇరుక్కుపొయ్యాడు. ఆఊళ్ళో వీళ్ళ కులపోళ్ళ వోట్లు లేకుండా ప్రెసిడెంటుగిరీ అసాధ్యం. అటూఇటూ కలిపి ఓ ఆరొందల ఓట్లు నికరంగా ఉన్నయ్. అదీగాక.. ఊరంతా రంగీ, రంగడి పార్టీలుగా విడిపోయుంది.
                   
ఆడంగులంతా కూడా రెండు పార్టీలుగా విడిపొయ్యారు.

'ఎంతన్నేయం! తాగుబోతు సచ్చినోడు పొలాన్ని కూడా ఇడిసిపెట్టడా!' అంది రంగి పార్టీ.

'ఈ రంగిముండకి పొయ్యేకాలమొచ్చింది. మొగుడన్నాక ఆమాత్రం తన్నడా? నా మొగుడు రోజూ తాగి మక్కెలిరగదంతన్నా, ఎంతమంది ముండలెనకాల బోయినా.. ఒక్కరోజయినా చూడకుండా ఉండలేనమ్మా.' అంది రంగడి పార్టీ.
                   
ప్రెసిడెంటు బుర్ర గోక్కున్నాడు. రాజకీయాల్లో కులం, మతంలాంటి ఈక్వేషన్లు ఆయనకి తెలుసు. ఈ కొత్తసమస్య ఎటుపొయ్యి ఎటొస్తుందో.. చివరాకరికి ఎగస్పార్టీవాడికి లాభిస్తుందేమోననే అనుమానం కలిగింది. చట్టం తన పని తను చేసుకుపోతుందని తప్పించుకోటానికి ఇది కోర్టుకేసు కాదాయె!

అంచేత.. "ఇదంత అర్రీబర్రీగా తేలే యవ్వారం గాదు." అంటూ వాయిదాల మీద వాయిదాలు వేయసాగాడు.

రంగడు తాగుడు ఎక్కువ చేశాడు. ఆపై పెళ్ళాన్ని బాదుడూ ఎక్కువ చేసాడు. అతనికి 'ఇందూ నాయం' బాగా కలిసొచ్చింది. రంగి అలిగి అన్నం తినడం మానేసింది.

ఒకరోజు రంగి అన్న పీకల్దాకా తాగి 'ఏందీ అన్నేయం?' అంటూ ప్రెసిడెంటుని నిలేసాడు.
                   
ప్రెసిడెంటు ఆలోచనలో పడ్డాడు. మూడ్రోజులు ఏకధాటిగా మందుకొట్టి ఆలోచించాడు.

'పొరబాటున ఈ రొచ్చులో కాలుపెట్టా. ఇప్పుడు కాలు జాగ్రత్తగా కడుక్కొకపొతే నా ప్రెసిడెంటుగిరీకే ఎసరొచ్చేట్లుంది. ఈ అరెకరా ఆరుచెరువుల నీళ్ళు తాగిస్తుందనుకోలేదు. అయినా.. ఈ ముష్టిపొలం ఆ తాగుబోతెదవకి పొతే నాకేంటి? పిచ్చిముండ రంగికి పొతే నాకేంటి? సత్తెం జెప్పడానికి నేనేమన్నా అరిచ్చంద్రుణ్ణా? కాదుగదా! మరెందుకు నాకీ ధర్మసంకటం?'

మందు బాగా పనిచేసింది. ప్రెసిడెంటుకి కత్తిలాంటి ఐడియా తట్టింది.
                   
మర్నాడు.. అప్పుడెప్పుడో కోర్టు డఫేదారుగా పనిచేసిన తాగుబోతు కిట్టయ్యని పోరుగూర్నించి పిలిపించాడు. విషయం వివరించాడు. అతనికి సహాయంగా పదోక్లాసు పదిసార్లు తప్పి.. రోడ్లెంట జులాయిలుగా తిరుగుతున్న ఓ నలుగురు కుఱ్ఱాళ్ళనీ అదే ఊర్నించి పిలిపించాడు.

'ఈళ్ళందరూ ఓ కమిటీ.' అన్నాడు ప్రెసిడెంటు.

'కమిటీ అంటే ఏంది?' అనడిగారు ఊరిజనం.

'ఈళ్ళు మీరు జెప్పేది రాసుకుంటారు. ఆ తరవాత నాకు సలహా ఇస్తారు. అప్పుడు మీకు నేన్నాయం జేస్తాను.' అన్నాడు ప్రెసిడెంటు.
                   
కిట్టయ్య తన నలుగురు అసిస్టెంట్లతో కలిసి రంగీ, రంగడి బంధువులందర్నీ కలిశాడు. వాళ్లందరూ చెప్పింది రాసుకున్నాడు. ఎవరేం చెప్పినా రాసుకున్నాడు. తాము చెప్పే సోదంతా కమిటీ రాసుకోవటం ఊళ్ళోవాళ్ళకి భలే నచ్చింది. ఒక్కోడు చేటభారతాలు చెప్పాడు. కమిటీ మెంబర్లు బస్తాల కొద్దీ కాయితాలు నింపేశారు. ఊళ్ళో ఉన్న జనంకన్నా అభిప్రాయాలు ఎక్కువున్నై!
                   
తనకి అనుకూలంగా తీర్పు రావాలని వేడుకుంటూ.. కమిటీకి ఆరంగారంగా విస్కీ, బ్రాందీలు పోయించాడు రంగడు. రకరకాల మాంసాలతో వేపుళ్ళు వడ్డించాడు. బొమ్మిడాయిల పులుసు ఇళ్ళకి పంపించాడు. 'టీ' ఖర్చులకంటూ కొంతపైకం జేబులో కుక్కాడు.

రంగి కూడ అప్పోసప్పో చేసి బాగానే ఖర్చు పెట్టింది. ఆవిధంగా ఇరువైపులా తినీ, తాగీ.. తాగీ, తినీ.. ఆయాసం, రొప్పు రాగా మత్తుగా నిద్రపొయ్యారు. ఆపై నిద్రలేచి.. బద్దకంగా ఒళ్ళిరుచుకుంటూ.. నివేదిక అంటూ జోగినాధానికి ఒక 'సీల్డ్ కవర్' ఇచ్చాడు తాగుబోతు కిట్టయ్య.


ఊరి జనమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తుండగా.. ప్రెసిడెంట్ సమక్షంలో సీల్డ్ కవర్ విప్పాడు జోగినాధం. అక్షరాలు కూడబలుక్కుంటూ పెద్దగా చదవసాగాడు.
                   
"ఆప్షన్ 1.రంగీ, రంగడు కలిసుండాలి. ఇది హిందూధర్మం."

రంగడు వైపోళ్ళు ఈలలేస్తూ డ్యాన్సు చెయ్యనారంభించారు. కళ్ళజోడు సరిచేసుకుంటూ ఆపమన్నట్లు చెయ్యి పైకెత్తి సైగ చేసాడు జోగినాధం.
                   
"ఆప్షన్ 2.తప్పనిసరైతే.. రంగీ, రంగడూ విడిపోవచ్చు. రంగి తనపొలం పుట్టింటికి తీసుకుపోవచ్చు."

ఈసారి రంగివైపు హర్షధ్వనాలు. మళ్ళీ చెయ్యెత్తాడు జోగినాధం!
                     
"ఆప్షన్ 3.రంగీ, రంగడు కలిసి విడిపోవచ్చు. విడిపోయి కలిసుండొచ్చు. కొన్నాళ్ళు కలిసి ఇంకొన్నాళ్ళు విడిపోవచ్చు."
                     
జనాలకి విషయం అర్ధమైంది. కిట్టయ్య కోసం వెతికారు. ఇంకెక్కడి కిట్టయ్య? ఎప్పుడో జారుకున్నాడు. జనాలు కిట్టయ్యని బూతులు తిడుతుంటే.. మీసాలచాటున ముసిముసిగా నవ్వుకున్నాడు ప్రెసిడెంట్.

షరా మామూలే. మళ్ళీ వాయిదాల మీద వాయిదాలు.

మళ్ళీ రంగి అన్న తాగి తూలుకుంటూ ప్రెసిడెంటు మీదకెళ్ళాడు.
                       
ప్రెసిడెంటు ఆలోచించాడు.

"ఇప్పుడు మన ఇస్కూలు పంతులుతో ఒక ఏకసభ్య కమిటీ వేస్తున్నా." అంటూ ఆ ఊరి ప్రాధమిక పాఠశాల ఏకైక టీచరుకి కమిటీ బాధ్యతలప్పచెప్పాడు.

అసలే కూతురి పెళ్లి ఇబ్బందుల్లో ఉన్న పంతులు వణికిపొయ్యాడు. ఆరాత్రి మందుకొట్టే సమయంలో పంతులు చక్కబెట్టాల్సిన రాచకార్యాన్ని గీతోపదేశం చేశాడు ప్రెసిడెంటు. 'హమ్మయ్య' అనుకున్నాడు పంతులు.                


కొన్నాళ్ళకి అందరూ ఎదురుచూస్తున్న రోజు రానేవచ్చింది. ఉదయం నుండి జోగినాధం టెన్షన్ తో చస్తుంటే.. ప్రెసిడెంటు ఆకాశమంటూ, మర్డరంటూ ఏదేదో మాట్లాడుతున్నాడు. అదీ కథ.

ఇప్పుడు విషయంలోకి వద్దాం.
                   
పంచాయితీ మొదలయ్యింది. పంతులు ఏవో చాలా పుస్తకాలు ప్రెసిడెంటు ముందుంచాడు. అవ్వన్నీ స్కూలు పిల్లల పరీక్షల తాలూకా నోటు పుస్తకాలు. ఆ సంగతి ఊర్లోవాళ్ళకి తెలీదు.

ఆ పుస్తకాల్ని చూసి 'అబ్బో! ఏదో అనుకున్నాం. ఇస్కూలు పిల్లకాయల నోటు బొక్కుల్నిండా పంతులు కూడా శానా రాసాడే!' అని మెచ్చుకున్నారు.

ఒక సీల్డ్ కవర్ జోగినాధానికి ఇచ్చాడు పంతులు.
                   
జోగినాధం ఆత్రంగా కవరు చించి ఒక పెద్ద కాగితం బయటకి  తీసాడు.

"ఇది సున్నిత సమస్య"

అని కాగితం మధ్యలో తాటికాయంత అక్షరాలతో రాసుంది.

తెల్లమొహంతో వెర్రిచూపులు చూస్తున్న జోగినాధానికి కన్ను కొట్టాడు ప్రెసిడెంటు.
                   
అర్ధం చేసుకున్న జోగినాధం "అయ్యబాబోయ్! సున్నిత సమస్యే!" అంటూ గుడ్లు తేలేశాడు.
                   
జోగినాధం చేతిలోని కాగితాన్ని తీసుకుని ఊరందరికీ చూపిస్తూ గంభీరంగా అన్నాడు ప్రెసిడెంటు.

"విన్నారుగా. ఇది సున్నిత సమస్య. అయినా తీర్పు చెప్పమంటే చెబుతా. కానీ.. ఆపై జరిగే అరిష్టానికి నేను బాధ్యణ్ణి కాను."  
                   
ఊళ్ళోవాళ్ళు అరిష్టం అనంగాన్లే భయపడిపోయారు. ఈమధ్యనే ఊర్లో అమ్మోరు పోసి నలుగురు చచ్చారు. కంగారుగా 'వద్దు, వద్దు, మాకు ఏ నాయం అక్కర్లేదు.' అంటూ పారిపోయారు.
                   
రంగి అన్నకి ఇందులో కుట్ర కనిపించింది. సున్నిత సమస్యంటే ఏందో చెప్పాల్సిందేనని తాగి ప్రెసిడెంటుని నిలదీశాడు. చిత్రం! ఆ అర్ధరాత్రి అతని గుడిసె పూర్తిగా ఎవరో కావాలని తగలబెట్టినట్లు కాలిపోయింది. ఆవిధంగా రంగి తాగుబోతు అన్నకి కూడా సున్నిత సమస్యంటే ఏంటో అర్ధమైపోయింది.
                   
ఆరోజు నుండి ఎవరూ రంగికి న్యాయం కావాలని అడగలేదు.

'పాపం! పెసిడెంటుబాబు దరమపెబువు. రంగికి నాయం చేద్దామని మాలావు పెయత్నం జేశాడు. కానీ.. ఆ ఇస్కూలు పంతులు ముందర కాళ్ళకి బందం ఏసాడు. ఆ బాబు ఊరి మేలు కోరేవాడు కాబట్టి నోరిప్పలేకపోతున్నాడు.' అనుకుని రంగివైపువాళ్ళు ఉసూరుమన్నారు.

'పెసిడెంటు మన మడిసి కాబట్టే చక్రం అడ్డేసాడు.' అని రంగడిముఠా సంతోషించింది.

ఈతీర్పు దెబ్బతో ప్రెసిడెంటు బంపర్ మెజారిటీతో ఎలక్షన్లో మళ్ళీ గెలిచాడు.


ఇంతకీ రంగీరంగళ్ళు ఏమయ్యారు?

ఈ సున్నిత సమస్య డ్రామా తన సమస్య తీర్చటం కోసం కాదనీ, ప్రెసిడెంటు ఓట్ల డ్రామా అని అర్ధమైన రంగికి పిచ్చెక్కింది. ఆ తరవాత ఇల్లిడిచి ఎటో పోయింది.

ఈ అన్యాయం తట్టుకోలేక రంగి అన్న తాగి రంగణ్ణి పొడిచేశాడు. రంగి అన్నని రంగడి తమ్ముడు పొడిచేశాడు. ఈ కత్తిపోట్ల పరంపర నేటికీ సాగుతూనే ఉంది. ఆఊళ్ళో సగంమంది యువకులు జైళ్ళల్లో శిక్ష అనుభవిస్తున్నారు. మిగిలిన సగంమంది మందుకొట్టి రోడ్లమీద పొర్లుతున్నారు.
                   
ఒకప్పుడు పచ్చని చేలతో కళకళ్ళాడిన ఆఊరు నేడు వల్లకాడయ్యింది. ఆ తరవాత ప్రెసిడెంటుని ఎదురొడ్డేవాడే లేకుండాపొయ్యాడు. చచ్చేదాకా ఆయనే ఆఊరిని ఏలాడు. ఒక రోడ్డుగానీ, ఒక ప్రభుత్వ పథకంగానీ.. ఆఊరు చేరదు. అడిగే దిక్కు లేదు. అడిగినా.. సున్నిత సమస్యంటూ ప్రెసిడెంటు తీర్పు చెప్తాడనే భయం!
                   
అప్పట్నించీ ఆఊరుకి 'సున్నిత సమస్యాపురం'గా పేరొచ్చింది.

ఇప్పుడు బస్సుల మీద కూడా పేరు కుదించి 'ఎస్.ఎస్.పురం' అని రాస్తున్నారు."  

(picture courtesy : Google)      

Saturday, 1 October 2011

ప్రపంచ భర్తల్లారా! ఏకం కండి!!


ఆ వూళ్ళో భార్యాబాధిత సంఘం మొదలెట్టి సరీగ్గా సంవత్సరం అయింది. ఇవ్వాళ మొదటి వార్షికోత్సవ సభ జరుపుకుంటున్నారు. సంఘంలో సభ్యులైతే చాలామందే వున్నారు. సుఖవ్యాధి రోగుల్లాగా (సుఖరోగం అంటే రోగం సుఖంగా ఉంటుందని కాదు, పరులతో సుఖించడం వల్ల వచ్చిన రోగమని అర్ధం), భార్యాబాధితులు బయటకి చెప్పుకోటానికి మొహమాటపడతారు. 

కాబట్టి - యోగాలంటూ గుండెల్నిండా గాలి పీల్చుకొమ్మని బొధించే స్వామిజీ సభలంతగా కాకపోయినా, కొద్దిమందైనా రాకపోతారా అనే ఆశతో నిర్వాహకులు ఎదురుచూశారు. సభ్యులు ఒక్కొక్కళ్ళుగా చేరుకుంటూ సభ ప్రారంభమయ్యే సమయానికి్ కొద్దిమంది కన్నా ఎక్కువమందే వచ్చారు. అంచనాలకి మించి హాజరైన భార్యాబాధిత భర్తల్ని చూసి నిర్వాహకులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. 
                  
కుర్రభర్తలు, ముసలిభర్తలు, పొట్టిభర్తలు, పొడుగుభర్తలు, వేదాంతభర్తలు, విప్లవభర్తలు - అదొక నానావిధ భర్తలోకం! 'విధి ఒక విషవిలయం' అనుకునే ఉసూరు భర్తలు, 'ఉందిలే మంచికాలం ముందూముందునా' అనుకునే ఆశావాహ భర్తలు - ఎటు చూసినా పీడిత తాడిత భర్తలే!           

అధ్యక్షులవారైన గుమ్మడి గుర్నాధం వేదికపైకొచ్చాడు. ఆయన పెళ్ళానికి తప్ప పులిక్కూడా భయపడని ధీరోధాత్తుడు! ఎర్రటి శరీరమంతా మానిన గాయాల తాలూకా గుర్తులు. పండిపోయిన కాకరకాయలా, వడలిపోయిన వంకాయలా ఉన్నాడు. వారీ సంఘాన్నేర్పరచటంలో జీవితాన్నే ధారబోసిన గొప్ప త్యాగమూర్తి! 
                 
కొంచెంసేపు దగ్గి, అధ్యక్షోపన్యాసం మొదలెట్టాడు. 

"మితృలారా! మీ ఉత్సాహం చూస్తుంటే మన భర్త జాతికి మంచికాలం వచ్చేసిందనే నమ్మకం నాకు కలుగుతుంది. మన పురుషజాతి గతవైభవాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. దేవుళ్ళందరికీ రెండు ఫ్యామిలీలు. శ్రీకృష్ణుడికి పదహారు వేలమంది గోపికలు. వీళ్ళు చాలరన్నట్లు అనేకమంది భార్యలు. కన్యాశుల్కంలో మధురవాణి కోసం గిరీశం, రామప్పపంతులు పోటీ పడ్డారు. వనితలను ఆదుకొనుట మన సంస్కృతి, సాంప్రదాయం, సంస్కారం. మన కవులు, కళాకారులు రెండోభార్య వల్లనే అద్భుత క్రియేటివిటీ సాధించారని చరిత్రలో లిఖితమై ఉంది." అంటూ ఖణేల్ ఖణేల్మంటూ దగ్గాడు. 
                 
కొంచెంసేపు రొప్పి, మరికొంతసేపు నిట్టూర్చి విషాదవదనంతో చెప్పసాగాడు.  

"కాలం కౄరమైనది. విధి విచిత్రమైనది. ఒకప్పుడు మన కాళ్ళ మీద పడి సావిత్రిలా విలపిస్తూ పాదాల దగ్గర చోటు అర్ధించిన స్త్రీజాతి ఇప్పుడు మనని శాసించే స్థాయికి ఎదుగుట కడు శోచనీయము. ఇంట్లో పాత ఫర్నీచర్లా ఒక మూల పడుండే భార్యజాతి - ఈరోజు మనపై వరకట్న కేసులు, గృహహింస కేసులు.. భగవాన్! ఏమిటీ విధివైపరీత్యం!" 

హాలంతా వేడి నిట్టూర్పులతో నిండిపోయింది.  

"ఎందుకిన్ని కఠిన చట్టాలు? మనమేమన్నా పక్కింటోడి భార్యని తంతున్నామా? ఏం! ఆమాత్రం సొంతభార్యని తన్నుకునే కనీసస్వేచ్ఛ కూడా మనకి లేదా? ముల్లు అరిటాకు సామెతలో ఇప్పుడు మనం అరిటాకులమైపొయ్యాం. ఎందుకిలా జరుగుతుంది? స్త్రీజాతి నుండి పురుషజాతికి రక్షణే లేదా?" జవాబుల్లేని ప్రశ్నలేసుకుని బాధ భరించలేక భోరుమన్నాడు అధ్యక్షులవారు.             
                 
తదుపరి కార్యక్రమంగా కార్యదర్శి రమాపతి తమ సంస్థ చేపట్టిన కార్యక్రమ వివరాలు సుదీర్ఘంగా చెప్పాడు. ఈరోజు నుండి భార్య చేత చావుదెబ్బలు తిన్న భర్తలకి అయ్యే ట్రీట్మెంట్ ఖర్చుల్ని 'ఆరోగ్యశ్రీ' లిస్టులో చేర్చినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియచేశాడు. ప్రతివారం భార్యబాధిత సంఘ అధ్యక్ష, కార్యదర్శులు 'భార్యల హెచ్చులు - భర్తల హక్కులు' అనే ప్రశ్నోత్తర లైవ్ కార్యక్రమాన్ని, మెరుగైన సమాజం కోసం తిప్పలు పడుతున్న టీవీ 420 వారి సౌజన్యంతో నిర్వహించబోతున్నామని చెప్పాడు. సభ్యులంతా ఆనందంతో చప్పట్లు కొట్టారు.  

చివరగా భార్యని ఎదిరించి భర్తజాతి పరువు నిలిపిన విప్లవజ్యోతి ఆర్.సత్యన్నారాయణమూర్తికి సన్మానం కార్యక్రమం. ఆర్.సత్యన్నారాయణమూర్తిది స్థూలకాయం. ఆయన్ని టైమడిగినా ఆవేశంతో ఊగిపోతాడు, హూంకరిస్తాడు. సన్మాన గ్రహీతగా మాట్లాడబోయే ముందు ఎర్రజెండాకి నమస్కరించాడు. 

అతనిలో ఒక అల్లూరి సీతారామరాజునీ, ఒక భగత్ సింగునీ గాంచి భర్తజనులందరూ ఉప్పొంగిపోయారు. ఆర్.సత్యనారాయణమూర్తి తన బొంగురు గొంతుకతో గద్దర్ స్టైల్లో దిక్కులు పిక్కటిల్లేట్లు ఒక పాటందుకున్నాడు. 

"గ్యాసు మనదిరా, గిన్నెమనదిరా, బట్ట మనదిరా, సబ్బు మనదిరా! నడుమ పెళ్ళమేందిరో, దాని పీకుడేందిరో!" భర్తాధములందరికీ ఆవేశంతో గుండెలుప్పొంగగా కోరస్ అందుకున్నారు. కొందరు ఆనందం తట్టుకోలేక కిందపడి గిలగిలా కొట్టుకోసాగారు.

పాట అయిపోయింది. ఒక్కక్షణం ఆగి ఆయాసం తీర్చుకుని ఆవేశంగా చెప్పసాగాడు ఆర్.సత్యన్నారాయణమూర్తి. "బ్రదర్స్! విప్లవం మొదలయ్యింది. మనం మీసమున్న మొగాళ్ళం, బానిసలం కాదు. భార్యకి భయపడేదేంటి బ్రదర్? నేనేనాడూ నా భార్యని లెక్కజేయలా. మగాళ్ళా, పులిబిడ్డలా బతుకుతున్నా! ఇవ్వాళ మీ సన్మానం నాలోని ఫైర్ పదింతలు పెంచింది."   
                 
ఇది కలా, నిజమా? ఇదెలా సాధ్యం? ఆర్.సత్యన్నారాయణమూర్తి తన రహస్యాన్ని బయటపెట్టి తీరాలంటూ సభికులంతా ముక్తకంఠంతో నినాదాలు చేశారు, ఆపై వేడుకున్నారు.
                 
ఆర్.సత్యన్నారాయణమూర్తి ఆవేశంగా ఊగిపోయాడు. పిడికిళ్ళు బిగించాడు. 

"బ్రదర్స్! నేనేరోజూ నా భార్య మాట విన్లేదు, వినను కూడా, వినను గాక వినను. నా భార్యా కుడికాలు పట్టమంటే ఎడంకాలు పడతా, ఎడంకాలు పట్టమంటే కుడికాలు పడతా. బట్టలుతకమంటే వంట చేస్తా. వంట చెయ్యమంటే అంట్లు తోముతా. వంకాయకూర చెయ్యమంటే దొండకాయ వేపుడు చేస్తా. కాఫీ ఇమ్మంటే టీ ఇస్తా. అంతేగానీ నా భార్య చెయ్యమన్న పని పొరబాటున కూడా చెయ్యను. మాట వినే ప్రసక్తే లేదు. భూమ్యాకాశాలు దద్దరిల్లనీ - వాగులూ, వంకలూ పొంగనీ! అవసరమైతే ప్రాణత్యాగానిక్కూడా సిద్ధమే! ప్రపంచ భర్తల్లారా! ఏకం కండి, పోరాడితే పొయ్యేదేం లేదు బానిస సంకెళ్ళు తప్ప. విప్లవం వర్ధిల్లాలి, ఇంక్విలాబ్ జిందాబాద్." 

ఆర్.సత్యన్నారాయణమూర్తి గాండ్రింపుకి మైకు ఠప్పున పేలిపోయింది! 
                 
భర్తలందరూ పెద్దపెట్టున నినాదాలు చేసి, ఆనందం తట్టుకోలేక కన్నీటి పర్యంతమయ్యారు.  
                 
"సభని జయప్రదం చేసిన మీ అందరికీ కృతజ్ఙతలు. మళ్ళీ ఇదే అలవరసలపై వచ్చే సంవత్సరం కలుద్దాం. జైహింద్!"

సభ ముగిసింది.

(picture courtesy : Google)