Sunday, 30 October 2011

జ్ఞానం - అజ్ఞానం


'పుస్తకపఠనం మంచి అలవాటు. తద్వారా సాహిత్య, సాంస్కృతిక, రాజకీయ విషయాల్లో టన్నులకొద్దీ జ్ఞానము, విజ్ఞానము సమూపార్జించుకొనవచ్చును. మేధావిగా కీర్తినొందవచ్చును.'

ఈ మాటలు సుబ్బారావు బుర్రలో బలంగా నాటుకుపొయ్యాయి. గొప్ప జీవితసత్యం బోధపడిపోయిందనిపించింది. తద్వారా అతనికి తను చేపట్టవలసిన  భవిష్యత్ కార్యక్రమం  అవగతమైంది.

జ్ఞానం అనబడే ఈ మహాసముద్రాన్ని - పుస్తకం అనే చెంబుతో తోడెయ్యాలని నిర్ణయించేసుకున్నాడు. తదుపరి ర్యాకుల కొద్దీ పుస్తకాలని చదివేసి అవతల పడెయ్యసాగాడు. క్రమేణా పుస్తక పఠనం అనేది సుబ్బారావుకి ఒక వ్యసనంగా మారిపోయింది.

ప్రస్తుతం సుబ్బారావు ఏ విషయాన్నైనా రిఫరెన్స్ లేకుండా మాట్లాట్టం మానేశాడు. 'ఇప్పుడు రాత్రయింది' అని సింపుల్‌గా చెప్పేసి వదిలేస్తే సుబ్బారావుకి మాచెడ్డ చిరాకు. ఇప్పుడు రాత్రి ఎందుకైందో రిఫరెన్స్ చెప్పాలి. పగలు ఎందుక్కాదో కూడా  రిఫరెన్స్ లివ్వాలి.

సుబ్బారావుని అందరూ వాకింగ్ ఎన్‌సైక్లోపీడియా అని మెచ్చుకోటం మొదలెట్టారు. ఇంక సుబ్బారావు రెచ్చిపొయ్యాడు. 

'ధరలు మండిపోతున్నయ్' అంటే అమెరికా ఎకానమీ గూర్చి, డాలర్ పతనం గూర్చి మాట్లాడతాడు. 'ఎండలు మండిపోతున్నయ్' అంటే గ్లోబల్ వార్మింగ్ గూర్చి ఉపన్యసిస్తాడు. 'ఫలానావాడు అప్పు చేశాడు' అంటే ఏ దేశం ఏ దేశానికి అప్పు పడిందో వడ్డీతో సహా లెక్కలు చెబ్తాడు. వర్షం పడుతుంటే వర్షం వెనుక ఫిజిక్స్ చెప్తాడు.

సుబ్బారావు ధోరణి మొదట్లో ముచ్చట గొలిపినా, కొన్నాళ్ళకి బంధుమిత్రులకి విసుగొచ్చేసింది. ఒక్కొక్కళ్ళే అతనికి దూరం కాసాగారు. క్రమేపి సుబ్బారావుకి పుస్తక ప్రపంచానికీ, భౌతిక ప్రపంచానికీ తేడా మర్చిపొయ్యాడు.

రోగిష్టి తల్లి  రాత్రంతా  దగ్గుతూనే  ఉంది. 'ఒరే సుబ్బడూ! దగ్గీదగ్గీ ప్రాణం పొయ్యేట్లుంది, డాక్టరుకి చూపించరా.' దీనంగా అడిగింది. 'అమ్మంటే యెలా వుండాలి? గోర్కీ అమ్మలా వుండాలి.  నువ్వేంటి పొద్దస్తమానం ఇట్లా దగ్గుతున్నావ్?' విసుక్కున్నాడు సుబ్బారావు. 

భార్య మొత్తుకుంది - 'పిల్లలు సరీగ్గా చదవట్లేదు, చాలా సమస్యగా వుంది.' భార్యని జాలిగా చూశాడు సుబ్బారావు - 'పిచ్చిదానా! పిల్లల సమస్య కాశ్మీర్ సమస్య కన్నా పెద్దదా? ఐక్యరాజ్యసమితిలో కాశ్మీర్ మీద జరిగిన ఒప్పందాలు తెలుసా?'

'నాన్నోయ్! తేజాగాడు నా బ్యాట్ లాక్కున్నాడు, అడిగితే తంతున్నాడు. బాబోయ్, నొప్పి.' అంటూ కొడుకు ఏడుస్తూ వచ్చాడు. 'ప్రశాంత్ భూషణ్ అంతటివాడే శ్రీరామసేనవాళ్ళ చేతిలో దెబ్బలు తిన్నాడు, ఆఫ్టరాల్ నువ్వెంత? పో అవతలకి.' ఆంటూ అరిచాడు.

చెల్లెలు భర్తతో తగాదాపడి పుట్టింటికొచ్చింది. 'అన్నయ్యా! మా ఆయన వాళ్ళమ్మ మాటలిని నన్ను ఒకటే తిడుతున్నాడు.' సుబ్బారావు చెల్లెలి వైపు నిర్వికారంగా చూశాడు. 'చూడమ్మా! రంగనాయకమ్మ 'జానకి విముక్తి'  చదువుకో. నీ సమస్య తీరిపోతుంది.' చెల్లెలు  తెల్లబోయింది.

ఆఫీసుకి వెళ్ళడం మానేశాడు సుబ్బారావు. గడ్డం పెరిగిపోయింది, జుట్టు చెదిరిపోయింది. అతనిప్పుడు రోజంతా శూన్యంలోకి చూస్తూ, తీవ్రంగా యేదో ఆలోచిస్తూ గదిలోనే గడిపేస్తున్నాడు.

భార్య ఏడుస్తూ చెప్పింది - "వంటింట్లో అన్నీ నిండుకున్నయ్. ఈరోజు నుండీ మనందరికీ పస్తే."

"ఇదిగో, ఇలా రా! ఈ పుస్తకాలు చూడు. ఇది ఎమిలీ జోలా 'ఎర్త్'. ఇదేమో పెర్లెస్ బక్ 'గుడ్ ఎర్త్'. వాళ్లీ రచనల్లో దరిద్రాన్ని ఎంతో అందంగా, మరెంతో రొమేంటిగ్గా రాశారు. నిజమే! ఆకలి దుర్భరమైనది. కాబట్టే 'క్రైమ్ అండ్ పనిష్‌మెంట్‌'లో  రాస్కల్నికోవ్‌, ఆఫ్ హ్యూమ  బాండేజ్‌లో  ఫిలిప్‌లు అంతగా ఇబ్బంది పడ్డారు!"

భార్యాపిల్లలూ, తల్లీ ఏడుస్తూ తిట్టటం మొదలెట్టారు. "మీకు కోపం ఎందుకొస్తుందో తెలుసా? మన మెదడులో రసాయనాలు.. " అంటూ ఏదో చెప్పబొయ్యాడు. 

కొడుక్కి మండిపొయ్యింది. తండ్రి ముంజేతిని కసిగా కసుక్కున కొరికాడు. సుబ్బారావుకి నొప్పెట్టింది. వెంటనే నొప్పి కలిగించే నాడీమండల వ్యవస్థ గూర్చి ఆలోచనలో పడ్డాడు.

ఈవిధంగా సుబ్బారావు జ్ఞానసాగరంలో  తేలియాడుతూ.. ఆలోచనల్లో మునుగుతూ.. ఇంటి ముందు రోడ్డు దాటుచుండగా.. స్పీడుగా వెళ్తున్న ఒక కారువాడు గుద్దేసాడు. 

తలకి పెద్దదెబ్బే తగిలింది. మూడ్రోజులు కోమాలో ఉన్నాడు. చుట్టపక్కాలు సుబ్బారావు అయిపోయాడనుకున్నారు.

భార్య పూజల వల్లనైతేనేమి, డాక్టర్ల ప్రతిభ వల్లనైతేనేమి - సుబ్బారావు చావు తప్పించుకున్నాడు. కొన్నాళ్ళకి ఆస్పత్రి నుండి డిశ్చార్జయ్యాడు. భర్తకి పుస్తకాల పిచ్చి వుంటే వుంది, మనిషి దక్కాడు, అంతే చాలనుకుంది  భార్య.

కొన్నాళ్ళ తరవాత -

దగ్గుతున్న తల్లి  దగ్గరకొచ్చాడు సుబ్బారావు - "అమ్మా! హాస్పిటల్‌కి  వెళ్దాం పద." అన్నాడు. తల్లి ఆశ్చర్యపోయింది.

అటుగా వెళ్తున్న కొడుకుని  పిలిచి  మందలించాడు - "ఆటలు ఆడుకో, మంచిదే! కానీ చదువు చాలా ముఖ్యం." కొడుకు బిక్కమొహం వేశాడు.

టీవీ చూస్తున్న చెల్లెల్తో అన్నాడు - "బావకి కబురు చెయ్యమ్మా! నేనతన్తో మాట్లాడాలి." చెల్లెలి కళ్ళల్లో ఆనందం. 

వంటింట్లో వున్న భార్యని పిలిచాడు - "ఇంటి ఖర్చుల విషయంలో నువ్వెన్ని ఇబ్బందులు పడుతున్నావో నాకు తెలుసు, అయాం సారీ! త్వరలోనే ఉద్యోగంలో చేరుతున్నాను." ఆనందం పట్టలేక బిగ్గరగా ఏడ్చేసింది భార్య.

ఇంతలో - 

ఒక బట్టతల పెద్దమనిషి ఇంట్లోకి వచ్చాడు. మామిడిపండ్ల బుట్ట బల్లమీద పెట్టాడు. సుబ్బారావుకి రెండుచేతులు జోడించి నమస్కరించాడు. 

"అయ్యా! ఈ పాపిని క్షమించండి, ఆ రోజు మిమ్మల్ని గుద్దిన కారుని నడిపింది నేనే. నాభార్యని హాస్పిటల్‌కి తీసుకెళ్ళే హడావుడిలో పొరబాటు జరిగిపోయింది."

సుబ్బారావు భార్య కారు యజమానికి తిరిగి నమస్కరించింది. "అయ్యా! మీరు చేసిన మేలు ఈ జన్మకి మర్చిపోలేం, మీరు మా పాలిట దేవుడు."

బట్టతల పెద్దమనిషికి విషయం అర్ధం కాలేదు, బుర్ర గోక్కుంటూ సెలవు తీసుకున్నాడు.

(picture courtesy : Google)

9 comments:

  1. /"చూడమ్మా! రంగనాయకమ్మ రాసిన 'జానకి విముక్తి' చదువుకో. నీ సమస్య నువ్వే పరిష్కరించుకో." /

    మీరు అసలు చెప్పాలనుకొన్నది ఇదే కదా :)

    ReplyDelete
  2. Mauli గారు,
    ధన్యవాదాలు.
    మీకు అలా అర్ధమైందా!

    ReplyDelete
  3. హారం updates లో మీ వ్యాసం title చూసి అల new tab లో
    మీ blog open చేశాను

    చక్కగా పెద్దదైన FONT SIZE విశాలంగా కావలసినంత line space ఇచ్చి కనులకు ఇంపుగా ఉన్నఒక వ్యాసం కనబడింది ,

    ఇంకోక్క క్షణం ఆగలేదు నాకళ్ళ కన్నా స్పీడ్ గా నా మనసు చదివేస్తూ,

    అది పకపకా నవ్వేలోపు, చకచకా నా కళ్ళు next ఏమిటా? అని తొంగిచుసాయి ..... ఇలా సాగింది మీ వ్యాసంగం చదవటం

    sorry "feel అవ్వటం" ఇలా అంటే అంత బాలేదు గానీ, సరే "అనుభూతి నోందడం".

    బాగుంది అంటే weight ఉండడంలా ఏ మధ్య so భేషుగ్గా ఉంది.

    modern తెలుగు లో చెప్పాలంటే కేక, కత్తి.

    ఆదివారం సందడి ఇది చదివాకా పొందానండి.


    ఇంతకు ఎందుకు ఇంతలా స్పందిస్తున్న అంటారా?

    ఆ పుస్తకవ్యసనం నాకు లేక పోలేదు, నాకు reference కావలి

    సాధారణం గా ఈ type అఫ్ character ప్రతి ఒక్కరిలో ఉంటుంది సహజంగా,
    అయితే స్థాయి బేధం కూడా ఉండటం చేత హెచ్చు తగ్గులు ....

    నేను కూడా చాల తెలుసుకున్నాను, మీ వ్యాసంగం పుణ్యమా అని కొంత
    మార్పు తెచ్చుకోవాలని అనుకుంటున్నాను,

    నా డౌట్ ఏమంటే అతగాడు ఈ వ్యాసాన్ని hospital లో rest తీసుకునే టైములో చదివి ఉండి ఉంటాడు

    అంచేతనే ఈ పెను మార్పు (revolutionary Change )

    ఎదేమైనప్పటికిని తెలియ వలసినదానిని తెలివిగా తెలిపారు

    ధన్యులం !!

    నమస్తే !!

    ReplyDelete
  4. ఎందుకో ఏమో? గారు..
    ధన్యవాదాలు.
    ఈ కథకి మూలం "చదవేస్తే ఉన్న మతి కాస్తా పోయిందట." అనే సామెత.
    పుస్తకాలు చదవటం శృతి మించితే ఇలా ఉండొచ్చు అన్న ఊహకి రూపం ఈ కథ.
    I attributed obsessive traits to Subbarao's character to highlight my point.
    వాస్తవానికి పుస్తక ప్రేమికులంటే నాకు చాలా గౌరవం. ఇష్టం.
    సుబ్బారావు నాకు నిజ జీవితంలో తారస పడితే..
    అతనికి ఆత్మీయుడనైపోతాను.

    ReplyDelete
  5. 'jaanaki vimukti' navala pai koosinta setire vesaremo anukunnaanu. nijame sumaa ani anipimchelaa :)

    ReplyDelete
  6. నాకు కధలో ఉన్న వాస్తవికత నచ్చింది, అంటే ఏదో ఒక ఆదర్శం లేకుండా అంటే ఒక Authority లేకుండా ఉంటె (మాట్లాడితే) వ్యవహరిస్తే నచ్చని nature ప్రతిదానికి reference ఇస్తూ పోతుంటే అవతలి వారు యావగిమ్పుకునే తీరు reality కి అత్యంత సంమేపంగా ఉన్నాయ్ ! పైగా నా అనుభవం కూడా ! ఇక పోతే పుస్తక ప్రపంచానికి బాహ్య ప్రపంచానికి పొంతన లేకుండా ఉంది ఆ TYPE వారి BEHAVIOUR నాకు బాగా తెలిసింది. దీనివల్ల...!

    ఇంతకు మళ్ళీ నేను ఈ COMMENT ఎందుకు వ్రాస్తున్నానంటే పెద్దలనేది ఏమంటే
    "అనుభవం పుస్తకాన్ని ఇస్తుంది కాని, పుస్తకం అనుభవాన్ని ఇవ్వడు అని "

    హమ్మయ్య ! చెప్పాలనుకున్నది చెప్పేసాను !! అన్నం చల్లారి పోతోంది ఒక పక్క్కన !! ఇక ఉంటానంది !!

    ReplyDelete
  7. పుచ్చా30 October 2011 at 22:01

    చాలా బాగుంది. ఇది బెజవాడ సుబ్బారావు నుంచి దువ్వూరి సుబ్బారావు దాక అందరికీ వర్తిస్తుంది.

    ReplyDelete
  8. పుచ్చా..

    థాంక్యూ.

    నా టపా ఇప్పుడే మళ్ళీ చదువుకున్నాను.

    సుబ్బారావు స్కిజోఫ్రినిక్ (ఏక్సిడెంట్ ముందు) అనిపించాడు.

    పుస్తకాల పురుగులు దైనందిన జీవితంలో అమాయకంగా ప్రవర్తిస్తారనే పాయింట్ రాద్దామనుకున్నాను.

    కానీ.. మిస్ అయ్యాను.

    ఏవిటో! చేతిలో కీ బోర్డుంది కదాని.. కొట్టి పడేస్తున్నాను.

    ఇక నుండి జాగ్రత్తగా ఉంటాను.

    ReplyDelete
  9. ఎందుకో ఏమో? గారు..

    మీ కామెంట్ ఎందుకో ఏమో స్పాంలో కెళ్ళి కూర్చుంది.

    ఇప్పుడే చూశాను. వెంటనే పబ్లిష్ చేస్తున్నాను.

    ఆలస్యానికి మన్నించగలరు.

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.