Tuesday, 11 October 2011

కల్లోల చిత్రాలు


మనసుని కలిచివేసే చిత్రాల్ని కల్లోల చిత్రాలు అంటారు. ఇవి అందరకీ ఒకటే రకంగా వుండకపోవచ్చు. ఎవరెవరి సామాజిక రాజకీయ అవగాహన బట్టి మారుతుంటయ్. భోపాల్ గ్యాస్ ట్రాజడీలో చనిపోయిన  చిన్నారి ముఖాన్ని చూశాక చాలామందికి అన్నం సయించలేదు, నిద్ర పట్టలేదు. అలాగే - జబ్బుతో తీసుకుంటున్నప్పటి సావిత్రి ఫోటో నన్ను తీవ్రంగా కలచివేసింది.  

మనమంతా చిన్నప్పుడు అమాయకంగా వుంటాం. సినిమాకి, నిజజీవితానికీ తేడా తెలీదు. అంచేత సావిత్రి నాకేనాడూ సినిమానటిగా తెలీదు. బాగా తెలిసిన మనిషిగా, నా కళ్ళల్లోకళ్ళు పెట్టి ముచ్చట్లు చెప్పిన ఆత్మీయురాలిగా అనిపించేది. చాలాసార్లు సూర్యాకాంతాన్ని చంపేసి సావిత్రిని రక్షిద్దామనుకున్నాను. 

దేవదాసు ఇంటికి పార్వతి అర్ధరాత్రి సమయంలో వెళ్లి 'నన్ను పెళ్లిచేసుకో దేవదా!' అని వేడుకున్నప్పుడు, దేవదాసు ఎంత బాధపడ్డాడో తెలీదు గానీ, నాకు మాత్రం కన్నీరు ఆగింది కాదు. ఒంటినిండా నగలతో మెరిసిపోతున్న మిస్సమ్మ 'ఏమిటో నీమాయ' అంటూ ముద్దుముద్దుగా పాడుతుంటే చూడ్డానికి రెండుకళ్ళు చాల్లేదు. లక్ష్మణకుమారుణ్ణి దడిపించిన మాయాశశిరేఖ ఠీవి, దర్పం సూపర్బ్. 'నన్నువదలి నీవు పోలేవులే.. ' అంటూ నాగేశ్వరరావుని మురిపించింది. అందుకే ఆనాటి కుర్రాళ్ళు సావిత్రి లాంటి భార్య కోసం కలలు కన్నారు. 

కొన్నాళ్ళక్రితం యేదో పేపర్ తిరగేస్తుండగా ఒకఫోటో నా దృష్టినాకర్షించింది. అది మందపాటి కళ్ళద్దాలతో, బక్కచిక్కిన వొక వృద్ధుడి ఫోటో. ఆయన బాగా పేదవాట్ట, పూట గడవట్లేదుట. కర్ర సాయంతో ఒంటికాలుపై నిలబడి రెండుచేతులూ జోడించి సాయం చెయ్యమని దీనంగా వేడుకుంటున్నాడు. ఆ కళ్ళు చూశాను, ఎక్కడో చూశాను! ఎక్కడ? ఆ కళ్ళని మరింత పరిశీలనగా చూశాను. వొక్కసారిగా వొళ్ళు ఝల్లుమంది,  ఆపై గుండె బరువెక్కింది. 

ఆ వృద్ధుడు ఆషామాషా వ్యక్తికాదు, వందల సినిమాల్లో ఎన్టీవోణ్ణి ముప్పతిప్పలు పెట్టిన రాజనాల! కృష్ణకుమారి, దేవిక , సావిత్రి, జయలలిత.. హీరొయిన్ ఎవరనేది రాజనాలకి అనవసరం. అతనికసలు 'రొమాంటిక్' అంటే అర్ధం కూడా తెలీదు. కానీ హీరోయిన్లెవరూ రామారావుకి దక్కకుండా చెయ్యాలి! అదే రాజనాల ధ్యేయం, పోటీ, పట్టుదల! అందుకే వాళ్ళని ఎత్తుకెళ్ళిపొయ్యేవాడు, నిర్భందించేవాడు. 'నిన్ను రక్షించడం ఎవరి తరం కాదు' అని క్రూరంగా నవ్వేవాడు!

కత్తియుద్ధంలో రామారావుకి సమఉజ్జీ రాజనాల. చివరాకరికి ఓడిపోతానని తెలిసినా గంటలకొద్దీ ఫైటింగులు, యుద్ధాలు చేసేవాడు. ఎన్నికుట్రలు పన్నాడు! ఎంతమంది రాజుల్ని  చెరబట్టాడు! ఎన్నిఘోరాలు చేశాడు! అంతటి అరివీర భయంకరుడు రాజనాల ఇలా అయిపొయ్యాడేమిటి! 

'రాజనాలకి వృద్దాప్యం రాకూడాదా? ఆర్ధిక ఇబ్బందులు స్వయంకృతం. సినిమా ఇండస్ట్రీలో ఇవన్నీ మామూలే.' మనందరికీ సింహం అంటే అందమైన జూలు, ఠీవీగా నడచివచ్చే అందమైన జంతువు గుర్తొస్తుంది గానీ - పళ్ళూడిపోయిన జబ్బు సింహం గుర్తురాదు. అట్లాంటి సింహాన్ని చూస్తే - 'అయ్యో!' అనిపిస్తుంది. ఈ భావన ఏ ముసలికుక్కనో, జబ్బుపిల్లినో చూసినప్పుడు రాదు. నాకు రాజనాలని చూడంగాన్లే జబ్బు సింహం గుర్తొచ్చింది.  

ఒకసారి సినిమావాళ్ళ చివరి రోజుల గూర్చి చర్చ వచ్చినప్పుడు, ఒక పెద్దమనిషి "సినిమావారికి లేని అలవాటుండదు, వ్యసనపరులు. అందుకే చివర్రోజుల్లో కష్టాలు పడతారు." అని ఈసడించుకున్నాడు. ఆయనగారు క్రమం తప్పకుండా ఉదయాన్నే యోగా చేస్తూ, శనివారాలు ఉపవాసాలు చేస్తూ సిస్టమేటిగ్గా జీవిస్తున్న బుద్ధిజీవి. అటువంటి జీవితం మంచిదే కానీ అందరూ అలా జీవించలేరు గదా!

మనమంతా ఒక మూసలో కోట్టుకుపోతుంటాం. చదువులు, ఉద్యోగాలు, బాధ్యతలు మనలోని మనిషి లక్షణాలని హరిస్తాయేమో. అందుకే ఎంత ప్రతిభావంతులైనా సరే - వారి వ్యక్తిగత బలహీనతల్ని ఎక్కువచేసి చూస్తూ.. అసలావ్యక్తి ప్రతిభనే మర్చిపోతాం. ఈ ధోరణి చదువుకున్నవారిలోనే ఎక్కువనుకుంటాను!

సావిత్రి గొప్పనటి. పార్వతిగా, మిస్సమ్మగా, శశిరేఖగా తెలుగువాళ్ళని మైమరపించింది. ఒక తరం తెలుగు ప్రేక్షకులు సావిత్రి అందానికీ, అభినయానికీ ఫిదా అయిపోయ్యారు. అటువంటి సుందరమూర్తి - గుర్తు పట్టలేనంత సన్నగా, పుల్లల్లాంటి చేతుల్తో, ప్రపంచలోని బాధనంతా తానే అనుభవిస్తున్నట్లుగా - ఎంత ఘోరం! అందుకే ఫోటో చూడంగాన్లే మనసంతా దిగులుగా అయిపొయింది. 


(photos courtesy : Google)

15 comments:

 1. @కళాకారులకి జీవితంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటారు. మానసికంగా పసివారితో సమానం. చిన్న విషయానికి కూడా తీవ్రంగా స్పందిస్తారు. ఈ గుణం వృత్తిపరంగా వారికి వరం. వ్యక్తిగతంగా ఒక శాపం.

  మీరన్నది అక్షరాలా నిజం. ఈ విషయంలో నాదొక సందేహం. మానసికవైద్యనిపుణులు కాబట్టి మిమ్ములను అడుగుతున్నాను. ఆయా పాత్రలలోకి పరకాయ ప్రవేశంచేసి తదనుగుణంగా నటించడం, హావభావాలను మార్చడంవల్ల(ముఖ్యంగా extreme situations, conditionsలో) నటుల మానసిక ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు ఉంటాయా?

  హాలీవుడ్ లోని మార్లిన్ బ్రాండోలాంటి సుప్రసిద్ధనటులు పలు మానసిక సమస్యలతో మానసికవైద్యులను తరచూ సంప్రదిస్తూ ఉండేవరని అంటారు.

  ReplyDelete
 2. రమణ గారూ హెవీ ఏమీ అవలేదు. సావిత్రి గారి గురించి ఎంత వ్రాసినా తక్కువే.
  "కళాకారులకి జీవితంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటారు. మానసికంగా పసివారితో సమానం. చిన్న విషయానికి కూడా తీవ్రంగా స్పందిస్తారు."
  అలా స్పందించకపోతే వారు కళాకారులవలేరు. ఆ ఫొటో సావిత్రిదంటే నమ్మలేక పోతున్నాను. సావిత్రిని గుర్తుచేసినందుకు మీకు ధన్యవాదాలు.

  ReplyDelete
 3. జ్యోతిర్మయి గారు..
  ధన్యవాదాలు.

  ReplyDelete
 4. ఏడిపించారండీ!

  ఆ సావిత్రి చివరి క్షణాల ఫొటో నన్నెంతగా కుదిపివేసిందో చెప్పలేను. నా ఆవేదనంతా మీ పోస్ట్ లో చూస్తున్నాను. ఇదే బాధ నేనూ పడ్డాను. సావిత్రి మీద వీరాభిమానంతో ఊగిపోయే నాకు సావిత్రి తాగుడికి బానిస అయింది, చివరి రోజుల్లో పతనమయ్యిందన్న నిజాన్ని ఎప్పటికీ జీర్ణించుకోలేను. పైగ తలుచుకున్నప్పుడల్లా కడుపులోనుండి బాధ తన్నుకు వస్తుంది. ఒక్క సావిత్రే కాదు చాలా మంది సినీ కళాకారుల జీవితాలు ఇలాగే అవుతాయిట. మీరు చెప్పినవన్ని పచ్చి నిజాలు...బాగా రాసారు, నిజంగా గుండెని పిండేసారు.

  నా సావిత్రి ఆరాధన ఇక్కడ:

  http://vivaha-bhojanambu.blogspot.com/2010/12/blog-post_24.html

  ReplyDelete
 5. Tejeswi గారు..
  ధన్యవాదాలు.
  కళాకారులు పాత్రధారణ మూలంగా మానసిక సమస్యలకి లోనవుతారా అన్న విషయంపై నా దగ్గర సమాచారం లేదు.
  ఇది చెట్టు ముందా? విత్తు ముందా? లాంటి ప్రశ్న.
  Savitri suffered from diabetes, depression and alcohol dependence syndrome.

  ReplyDelete
 6. ఆ.సౌమ్య గారు..
  ధన్యవాదాలు.

  ReplyDelete
 7. I totally understand and agree with your feelings.
  పతనమైన గొప్పతనం గుండెలని ఎలా పిండేస్తుందో కుటుంబరావు గారు ఒక కథ (ప్రేమించిన మనిషి)లో వివరిస్తారు.
  మీ బాధ బాగా అర్ధమైంది, పంచుకుంటున్నాము కూడా.

  కొన్ని జీవితాలు ఇతరులకి జీవిత సత్యాలు బోధించటానికే అన్నట్టుంటాయేమో!
  శారద

  ReplyDelete
 8. లేటుగా చూశాను. ఎప్పుడూ నవ్వులే కాకుండా, అప్పుడప్పుడు ఇలాంటివి రాయండి. ఎంత బాగా రాశారు. చాలా బాగుంది.

  ReplyDelete
 9. chandu S గారు..
  కామెంటుకి థాంక్సండి.
  ఏం రాయటం లేండి!
  చాలా టైం ఖర్చైపోతుంది.
  ఒకపక్క పేషంట్లు.. ఇంకోపక్క టైపింగు..
  ప్రస్తుతానికి సరదాగానే ఉంది.

  ReplyDelete
 10. శారద గారు..
  చాలా మంచి కామెంట్ రాశారు.
  ధన్యవాదాలు.
  కుటుంబరావు 'ప్రేమించిన మనిషి' ని ప్రస్తావించారు.
  ఆ నవలలో పద్మ క్యారెక్టర్ నాకు ఇష్టం.
  కానీ.. నేను గోపాలంలా ఆలోచిస్తుంటానేమోనని అనుమానం.

  ReplyDelete
 11. ఎందుకు ఇలా సంభవిస్తాయి అని ఆలోచిస్తే నాకు రెండు సంగతులు మనసులో మెదులుతాయి.
  1. అందరివిధంగా ఆలోచించకుండా కొత్తవి చెయ్యాలనే తపన. వీరు అనుకునేవి సాధించవచ్చు సాధించలేక పోవచ్చు. సాధిస్తే గొప్ప వాళ్ళు అంటాము లేకపోతే పనికిరాని వాళ్ళు అంటాము.

  కానీ వీళ్ళు కావాలి. అభివృద్ది అనేది జరిగితే వీళ్ళ మూలానే. వీళ్ళ బాగోగులకి మనమేమి చెయ్యలేమా?

  2. జీవితంలో బంధు మిత్రుల నెట్వర్క్ చాలా ముఖ్యం. క్రింద ఎవరన్నా జారి పడుతుంటే ఆత్మీయతతో ఒకరయినా లేవతీయటానికి ప్రయత్నించవచ్చు.

  "సావిత్రి" చివరి ఫోటో నేను చూడలేను. ఏమీ చెయ్యలేక పోయానే అని బాధపడలేను. సుఖంగా జీవించటానికి కావలసినవి ఏమిటి? ఓ గుప్పెడు అన్నం, ఓ నలుగురు ఆత్మీయులు.

  ReplyDelete
 12. రమణ గారూ,

  సావిత్రి గారి మీద నాకు ఎంత అభిమానము అంటే, సావిత్రి ని అలా చేసినందుకు (అయన పాత్ర ఎంత ఉందో నాకు నిజము గా తెలీదు కానీ), జెమిని గణేషన్ అంటే ఒళ్ళు మంట.

  మనకి తెలిసిన రాజనాల, సావిత్రి ల కథలు వెంటాడి వేధిస్తాయి. అంత కంటే ఎక్కువ గా, వెలుగు లోకి రాని వ్యధలు ఎన్ని ఉన్నాయో అన్న ఆలోచనే చాల బాధాకరము గా ఉంటుంది. కొద్ది లో కొద్ది, మా అసోసియేషన్ తరపున కొంత మంది కి సేవ చేస్తున్నారు. అభినందనీయము. ఎక్కడ డబ్బు ఉందో, అక్కడ మెర మెచ్చులూ ఉంటాయి కానీ, కనీసము కొంత మంది కైనా సాయము అందుతోంది అనిపిస్తుంది.

  మంచి వ్యాసము వ్రాశారు. మళ్ళీ చప్పట్లు (ఏదో సినిమా లో నూతన్ ప్రసాదు గారి డైలాగు)

  భవదీయుడు
  సీతారామం

  ReplyDelete
 13. Rao S Lakkaraju గారు..
  మీతో ఏకీభవిస్తున్నాను.
  ధన్యవాదాలు.

  ReplyDelete
 14. Seetharam గారు..
  ఈ టపా మీకు నచ్చినందుకు సంతోషం.
  సావిత్రి వ్యక్తిగత జీవితంలో చాలా నష్టపోయింది. జెమినీ గణేశన్ తో జీవితం కావాలనుకుని, ఆలోచించుకుని.. సొంతంగా తీసుకున్న నిర్ణయం అది. ఒక నటుడి జీవితంలోకి మూడో భార్యగా ప్రవేశించటం పెద్ద రిస్క్. అది ఆవిడ తీసుకుంది. ఎంత గొప్ప వ్యక్తయినా పొరబాటు నిర్ణయాలు తీసుకుంటారు. కానీ.. ఆ నిర్ణయం, అంచనా వికటించినప్పుడే గదా మనకి ఆ ఫలానా పని తప్పని తెలిసేది. ఇద్దరు వ్యక్తుల మధ్య పడనప్పుడు.. మనకి నచ్చిన వారి సైడ్ తీసుకుంటాం. సావిత్రి కున్న పాపులారిటీ మూలంగా అందరి దృష్టిలో జెమినీ గణేశన్ విలన్ అయిపోయ్యాడు. వాస్తవంగా జరిగిందేంటో మనకి తెలీదు. తెలుసుకోవటం అనవసరం కూడా.
  మీ అసోసియేషన్ తరఫున సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు అభినందనలు.

  ReplyDelete
 15. Small clarification -- I meant the "Movie Artists Ascosiation (MAA)" run by Murali Mohan and others I guess. Not some thing that 'I or We' do :)

  This I quoted as I read in news couple of years ago.., that Mr.Rajanala was given a 1,00,000 or so, thru them,

  Coming to Savitri, I totally agree with you, the internal matters are irrelavant to us, but I just quoted it to exaggerate my fondness towards her..

  Regards

  Seetharam

  ReplyDelete

comments will be moderated, will take sometime to appear.