నాకో స్నేహితుండేవాడు. అతగాడు స్నేహశీలి, సిగరెట్టుశీలి కూడా. ఆ రెండు శీలాలు నాక్కూడా ఉన్నందున మా ఇద్దరి స్నేహం ఇడ్లీసాంబారులా కలిసిపోయింది. ఎక్కువసేపు కబుర్లు చెప్పుకోవడమే మంచి స్నేహానికి కొలమానం అయినట్లైతే మాది మంచి స్నేహంగా చెప్పొచ్చు. దేశంలో పెరిగిపోతున్న అవినీతి, అక్రమాల గూర్చి బోల్డన్ని కాఫీలు తాగుతూ తీవ్రంగా బాధ పడేవాళ్ళం. (కాఫీ తాగుతుంటేనే సమాజం, దేశం గూర్చి ఆలోచనలు వచ్చునన్న సంగతి నేను ఆరోజుల్లోనే గ్రహించాను).
నా స్నేహితుడి తల్లి మహమాతృమూర్తి (అనగా 'మాతృమూర్తి' కన్నా ఒక డిగ్రీ ఎక్కువ). ఆవిడ తన కొడుకు పట్ల ప్రేమని వంటలో భారీగా రంగరించేది. అందువల్ల నా స్నేహితుడు తినే సింగిల్ గారె, డబుల్ ఇడ్లీ కోసం కష్టపడి పెద్ద వంట చేసేది. చివర్లో మాత్రం ఫిల్టర్ కాఫీ ఇచ్చేది. అది అత్యంత మధురంగా ఉండేది. అంచేత అన్ని దానాల్లోకి కాఫీ దానమే గొప్పదనే ఒక అభిప్రాయం నాలో ఏర్పడిపోయింది.
నా స్నేహితుడి మేనమామ ఈ పోస్టుకి హీరో. పేరు శాస్త్రి. తెలుగు పండితుడు. ఆయన చొక్కా వేసుకోంగా నేను చూళ్ళేదు. బక్కగా ఎండిపోయిన బెండకాయలా ఉండేవాడు. కడుపు లోపలికి పోయి, డొక్కలు ముందుకు పొడుచుకొచ్చి ఎనాటమీ విద్యార్ధుల డిసెక్షన్ కోసం మెడికల్ కాలేజికి పంపడానికి రెడీగా ఉన్న శవంలా ఉండేవాడు. నాకాయన్ని చూస్తుంటే కొన్నిసార్లు గాంధీ తాత, ఇంకొన్నిసార్లు కస్తూరి శివరావు జ్ఞాపకం వచ్చేవాళ్ళు.
నా స్నేహితుని ఇల్లు పెద్దది. వరండా కూడా పెద్దదే. అందులో ఓ మూలగా ఓ చెక్కబల్ల. శాస్త్రిగారా యింట్లో ఉన్నంతసేపూ ఆ చెక్కబల్లపైనే కూర్చునుండేవాడు. నాకెందుకో ఆ చెక్కబల్ల, శాస్త్రిగారు అన్నదమ్ముల్లా కనిపించేవారు. ఆయన ఏదో స్కూల్లో ఫుల్ టైం తెలుగు మాస్టారు, మరేదో గుళ్ళో పార్ట్ టైం పూజారి.
శాస్త్రిగారు పొద్దస్తమానం చుట్టతో చాలా బిజీగా ఉండేవాడు. అంటే ఆయన ఎక్కువ చుట్టలు కాల్చేవాడని అర్ధం కాదు. అసలాయన చుట్ట తాగుతుండంగా నేను అతి తక్కువసార్లు చూశాను. పొగాక్కాడని శ్రద్ధగా పేలికలు చేసేవాడు. ఆపై వాటిని ఏకాగ్రతగా చుట్ట చుడుతుండేవాడు. ఆ చుట్ట ఓపట్టాన వెలిగేది కాదు. అనేక అగ్గిపుల్లలు ఖర్చు చేసి, ఎంతో కష్టపడి చుట్ట కొన ముట్టించేవాడు. ఒకసారి పొగ వదిలి ఏదో చెప్పేలోపు ఆ చుట్ట ఆరిపొయ్యేది. ఇక మళ్ళీ ఆ చుట్ట వెలిగింపుడు కార్యక్రమం మొదలు.
శాస్త్రిగారు ఈవిధంగా పట్టు వదలని విక్రమార్కుడిలా, నిరంతరంగా చుట్టతో విన్యాసాలు చేస్తూ.. 'చుట్ట కాల్చడం' అనే విద్య నేర్చుకునే వయోజన విద్యార్ధిలా అగుపించేవాడు. ఒక్కోసారి ఆయన చుట్ట బాధ చూస్తుంటే కడుపు తరుక్కుపొయ్యేది!
నన్ను చూడంగాన్లే "అక్కయ్యా! బుల్లి డాక్టరొచ్చాడు. కూసిని కాఫీనీళ్ళు తగలెట్టు." అని అరిచేవాడు.
శాస్త్రిగారికి కాఫీ అంటే ఎంతో ఇష్టం. స్టీలు గ్లాసులోని కాఫీని ఆప్యాయంగా చూసుకుంటూ.. చిన్న సిప్పులతో చప్పరిస్తూ (కొండకచో లొట్టలేస్తూ) తాగేవాడు. కాఫీని తాగుతూ ఎంతగా ఎంజాయ్ చెయ్యొచ్చో శాస్త్రిగార్ని చూసిన తరవాతే నాకర్ధమైంది. మందుకు బానిసైనవాణ్ని మందుబాబు అంటారు. ఆ లెక్కన శాస్త్రిగార్ని కాఫీబాబు అనొచ్చు.
ఆయన చుట్ట కాల్చడానికి తీవ్రంగా కృషి చేస్తూనే నాతో కబుర్లు చెబ్తుండేవాడు.
"కట్నం తీసుకోవడం మహాపాపం. కట్నం అడిగే గాడ్దెకొడుకుల్ని నిలువునా పాతెయ్యాలి. గాంధీగారేమన్నారు? గురజాడ ఏమన్నాడు?" అంటూ ఆవేశపడేవాడు.
గాంధీగారు, గురజాడలు కట్నాల విషయంలో ఏమన్నారో నాకు తెలీదు కావున మౌనంగా ఉండేవాణ్ని.
ఆయనకొక కూతురు, ఒక కొడుకు. కూతురికి సంబంధం వెతికే ప్రయత్నంలో తలమున్కలుగా ఉండేవాడు. అయినా ఆయనకి కాఫీపై ఉన్నంత శ్రద్ధ పిల్లదాని పెళ్ళిసంబంధం చూట్టంలో లేదని.. ప్రతిరోజూ భార్య 'తలంటు' పోసేది. ఆ వేడెక్కిన బుర్రతో దిక్కుతోచక అక్కగారి పంచన చేరి కాఫీ తాగుతూ ఆ చెక్కబల్లపై కాలక్షేపం చేస్తుండేవాడు.
"దేనికైనా సమయం కలిసి రావాలి. ప్రతి తలకిమాసిన వెధవా వేలకివేలు కట్నాలు పట్రమ్మంటే ఎక్కణ్నించి తెచ్చేది? ఇక్కడేమన్నా డబ్బులు చెట్లకి కాస్తున్నయ్యా? పెళ్ళిఖర్చులు ఆడపిల్ల తండ్రి నెత్తిన రుద్దడమేంటి? కట్నంలోనే సరిపుచ్చుకు చావొచ్చుగా? పోలీసు రిపోర్టిస్తాను. ముండాకొడుకుల్ని బొక్కలో వేసి మక్కెలిరగ తంతారు. నేను మాత్రం ఖాళీగా కూర్చున్నానా? ఎన్నిచోట్లకి తిరగట్లేదు?"
శాస్త్రిగారు ఇలా తనకి తనే ప్రశ్నలు వేసుకుంటూ కాఫీ చప్పరిస్తూ ఉండేవాడు.
నా స్నేహితుని అన్న అమెరికాలో డాక్టరు.. జీర్ణకోశ వ్యాధుల నిపుణుడు. శాస్త్రిగారు తన మేనల్లుణ్ని 'డాక్టరు' అని రిఫర్ చేస్తాడు కావున నేను బుల్లి డాక్టర్నయినాను.
ఎందుకనో శాస్త్రిగారికి అమెరికా అంటే చిరాకు.
"అదేం దేశం! ఒట్టి దరిద్రపుగొట్టు దేశం. అక్కడందరూ మేక మాంసాన్ని కత్తుల్తో కోసుకు తింటార్ట! మరి అజీర్ణం చెయ్యమంటే చెయ్యదూ? ఆ దరిద్రానికి మన డాక్టరు పైనుండి, కిందనుండి గొట్టాలేస్తాట్ట! ఎంత డబ్బులిస్తే మాత్రం అక్కడ గొట్టాలెయ్యడవేంటి! అసలింతోటిదానికి గొట్టాలెందుకు? హాయిగా ఇంగువ, శొంఠి రుచి చూపిస్తే అజీర్ణం ఆమడ దూరం పరిగెత్తదూ? ఆ తెల్లతోలు గాడిదలకి డాబుగా కార్లల్లో తిరగడం తప్ప ఒంటి శుభ్రత కూడా ఉండదట! పాడు దేశం, పాడు మనుషులు." అని విసుక్కునేవాడు.
అటు తరవాత కొన్నాళ్ళకి ఆయన కూతురి పెళ్ళి చేశాడు. మంచి సంబంధం. అల్లుడు కూడా బుద్ధిమంతుడు. మొత్తానికి శాస్త్రిగారి కష్టాలు గట్టెక్కాయి. నాకేదో పరీక్షల హడావుడి ఉండటం వల్ల కొంతకాలం పాటు నా స్నేహితుడి ఇంటికి వెళ్ళడం కుదర్లేదు.
చాల్రోజుల తరవాత ఒకరోజు నా స్నేహితుని ఇంటికెళ్ళాను.
వరండాలో ఎదురుగా చెక్కబల్లపై చెక్కమనిషి! ఆరోజు కూడా యధావిధిన ఆయన తన చుట్టతో కుస్తీ పడుతున్నాడు.
నన్ను చూడంగాన్లే "అక్కయ్యా! బుల్లి డాక్టరొచ్చాడు. కాసిని కాఫీనీళ్ళు తగలెయ్యి." అనరిచాడు.
ఎప్పుడూ అన్యమస్కంగా, ఆందోళనగా ఉండే ఆయన ఇవ్వాళ ప్రశాంతంగా ఉన్నాడు. బహుశా కూతురి పెళ్ళి బాధ్యత తీరి.. భార్య 'తలంటు' పోటు తప్పినందువల్ల కావచ్చు.
ప్రశాంతంగా కాఫీ చప్పరిస్తున్న ఆయన నోట్లోంచి బాంబులాంటి డైలాగొకటొచ్చింది.
"ఎంతైనా అమెరికా అమెరికానే! అది తెల్లోళ్ళ దేశం. దొరల తెలివి ముందు మనమెంత?"
ఆశ్చర్యపొయ్యాను. కొద్దిసేపటి తరవాత విషయం అర్ధమైంది.
శాస్త్రిగారి కూతురి పెళ్ళి కోసం అమెరికా మేనల్లుడు డబ్బు పంపాట్ట. పెళ్ళిఖర్చులన్నీ పోంగా కొంత సొమ్ము కూడా ఆయన మిగుల్చుకున్నాట్ట! అంచేత ఉన్నట్టుండి ఆయనకి అమెరికా మంచి దేశమైపోయింది!
సరే! ప్రపంచ దేశాలే అమెరికా పట్ల సమయానుకూలంగా తమ అభిప్రాయాలు మార్చుకుంటుంటే ఈ సగటు మనిషి ఏపాటి?
"ఇప్పుడింక మీ అబ్బాయికి పెళ్ళి చెయ్యాలి గదా. కట్నం లేకుండా వాడికో మంచి సంబంధం చూడనా?" నవ్వుతూ అన్నాను.
చుట్టపొగ గుప్పున వచ్చింది. ఉన్నట్లుండి ఆయన గొంతు గంభీరంగా మారింది.
"కట్నం తీసుకోకపోతే పిల్లడికేదో లోపముందనుకుంటారు. అయినా ఆ సొమ్ము నాకోసం కాదుగదా? ఆ రాబోయే పిల్లదాని పుట్టబొయ్యే పిల్లల కోసమేగా? అసలే కరువు రోజులు. అయినా ఎన్టీఆర్ కట్నం తీసుకోలేదా? మర్రి చెన్నారెడ్డి పుచ్చుకోలేదా?"
యధాప్రకారం చుట్ట ఆరిపోయింది. అది వెలిగించడానికి అగ్గిపుల్లలు గియ్యడం మొదలైంది.
ఎన్టీఆర్, చెన్నారెడ్డిలు కట్నం తీసుకున్నారో లేదో నాకేం తెలుసు? ఇప్పుడు తెలుసుకునే ఓపిక్కూడా లేదు. కానీ ఈయన తన కొడుక్కి కట్నం తీసుకోడానికి రెడీగా ఉన్నాడని మాత్రం బాగా అర్ధమైంది.
'నీ కూతురుకి కట్నం ఇవ్వడానికి ఇష్టపడనివాడివి కొడుక్కి కట్నం ఎలా ఆశిస్తావు?' అని ఆయన దగ్గర లా పాయింట్ లాగితే ఆయన ఏం చెప్పేవాడో తెలీదు. ఎందుకంటే - అడగటం దండగని నాకు తెలుసు కాబట్టి నేనాయన్ని ఆ ప్రశ్న అడగలేదు.
కొన్నాళ్ళకి నా స్నేహితుడు అమెరికాలోని అన్న దగ్గరకి వెళ్ళిపొయ్యి అక్కడే స్థిరపడ్డాడు. అంచేత అటు తరవాత శాస్త్రిగారిని నేను కలవలేదు.
శాస్త్రిగారు! ఇప్పుడు మీరు రిటైర్ అయ్యి శేషజీవితం గడుపుతూ ఉండవచ్చు. మీరెక్కడున్నా కానీ.. చుట్టతో మీ చుట్టరికం చిరకాలం హాయిగా కొనసాగాలని.. జీవితంలో కనీసం ఒక్క చుట్టైనా నిరాటంకంగా, ఏకబిగిన కాల్చగలిగే అదృష్టం మీకు ఆ భగవంతుడు ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను!
(picture courtesy : Google)