Monday, 28 October 2013

భారతదేశము నా మాతృభూమి


'భారతదేశము నా మాతృభూమి,

భారతీయులందరూ నా సహోదరులు.

నేను నా దేశమును ప్రేమించుచున్నాను.'

ఇది మన భారతదేశ ప్రతిజ్ఞ.

ఈ ప్రతిజ్ఞ మనకి తారక మంత్రము. ఎంతో స్పూర్తిదాయకము.

ప్రజలందరూ అన్నదమ్ముల వలే శాంతిసౌభాగ్యములతో వర్ధిల్లాలి.

ప్రజలందరూ అక్కచెల్లెళ్ళ వలె సుఖసంతోషములతో పరిఢవిల్లాలి.

ప్రజలందరూ జాతీయ భావములతో నిండుపున్నిమి లాగా ప్రకాశించాలి.

ఏమిటీ నీతివాక్య ప్రలాపములు?

పక్కరాష్ట్రంవాడు మనకి రావాల్సిన నిధుల్ని దోచేస్తున్నాడు.


ఏందుకలా గగ్గోలు పెడుతున్నావ్? పక్క రాష్ట్రం వాడు మాత్రం మన సహోదరుడు కాడా?

రండి, కదలండి. కాలవలకి తూములు కొట్టేసి పక్క జిల్లావాడికి నీళ్ళు పోకుండా అడ్డం కొట్టేద్దాం.

ఏందుకంత ఆవేశం? పక్క జిల్లావాడు మాత్రం మన సహోదరుడు కాదూ?

నువ్వు చెబుతున్నదేదీ నాకు అర్ధం కావట్లేదు. అన్నట్లు ఇది విన్నావా? మా పక్కింటి వాడొట్టి దౌర్భాగ్యుడు. వాడికి ఉద్యోగం పోయింది. వెధవకి తిక్క కుదిరింది.

ఏం? పక్కింటివాడు నీ సహోదరుడు కాదా? వాడి కష్టం అర్ధం చేసుకోవా? మరి నీ భారతదేశం ప్రతిజ్ఞ ఏమైంది?

ఏవిటోయ్ నీ గోల? ఈ దేశం ఎటు పొతే నాకెందుకు? నేను బాగుండాలి. నా బేంక్ బ్యాలన్స్ బాగుండాలి. నా పిల్లలు గొప్పగా సెటిలవ్వాలి. ఊళ్ళో నేను కొన్నవైపు స్థలాలకి రేట్లు పెరగాలి. అన్నట్టు వడ్డీకి డబ్బులైమైనా కావాలా బ్రదర్? ధర్మవడ్డీ. పది రూపాయిలే. అదీ నీకు మాత్రమే సుమా!


భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు.

చూస్తుంటే ఒట్టి వెర్రిబాగులవాళ్ళా ఉన్నావు. నీ వాలకం చూస్తుంటే అర్ధమవుతుందిలే.

నువ్వు స్వార్ధపరుడివి.

సర్లే! ఈ దేశంలో తెలివైనవాణ్ని అంతే అంటార్లే మిత్రమా! 

మరి నీ సోదరులైన డాక్టర్లు, గవర్నమెంటు ఉద్యోగులు, ప్లీడర్లు నిన్నెందుకు నిలువుదోపిడీ చేస్తున్నారు?


మరి మన భారతీయ సోదరులు తమ సోదరుల్ని కారంచేడు, చుండూరుల్లో వెంటాడి, వేటాడి నిలువునా నరికేశారెందుకు?


ముందు వాళ్లకి చెప్పి ఆ తరవాత నాకు చెప్పు నీ నీతులు.


నువ్వీ భారమాత ముద్దు బిడ్డవు. నీ తల్లికి సేవ చేసుకో.

భారతమాతకి సేవ చెయ్యాలా! ఎందుకు?

భారతదేశంలో ఒంటరిగా కనిపించిన ఆడపిల్లపై అత్యాచారం చెయ్యొచ్చు.


భారతదేశంలో పారిశ్రామిక వ్యర్ధాల్ని నిక్షేపంగా, నిరాటంకంగా త్రాగే నీళ్ళల్లో వెదిలేసుకోవచ్చు.


భారతదేశంలో అడవుల్ని అడ్డగోలుగా నరికేసుకోవచ్చు.


భారతదేశంలో గనుల పేరుతో భూమికి బొక్క పెట్టేసి ఖనిజ సంపదని అడ్డదిడ్డంగా అమ్మేసుకోవచ్చు.


భారతదేశంలో త్రాగే నీటిని, పీల్చే గాలినీ ఎడాపెడా కలుషితం చేసుకోవచ్చును.


నీకు బాధగా ఉండదా? గిల్టీగా ఉండదా?

అస్సలు ఉండదు. నా చేతికంటిన రక్తం మరకలు తుడిచేసుకునే ఉపాయం కూడా నా దగ్గర ఉంది.

ఎవర్రా అక్కడ? రేపు నా పుట్టిన్రోజు. పెద్దాసుపత్రిలో రోగిష్టి దరిద్రులకి బిస్కట్లు, పండ్లు పంచిపెట్టండి. వికలాంగులకి ట్రై సైకిళ్ళు పంచండి. వితంతువులకి కుట్టు మిషన్లు ఇవ్వండి. ప్రెస్సోళ్ళకి మంచిమంచి కానుకలు పంపండి. నాపేరు మీద గొప్ప సమాజ సేవ జరిగినట్లు వార్తలు ప్రముఖంగా వచ్చేలా చూడండి.


ఒరే వెర్రిబాగులాడా! ఇప్పుడు చెప్పు ఏం చెబ్తావో!


అవును, నీ కీర్తీ దశదిశలా వ్యాపించును. నిన్ను ప్రజలు వేనోళ్ళ శ్లాఘించెదరు.

అవును, నువ్వు దయామయుడవు. భారతదేశం ప్రతిజ్ఞ నీకు నరనరాల జీర్ణించుకుపోయింది.

అవును, ఇపుడు నీకు పాపపరిహారం అయిపోయింది. ఇక నిశ్చింతగా జీవింపుము బిడ్డా!

అవును, ఇప్పుడు ఒప్పుకుంటున్నాను.

నేను వెర్రిబాగులాణ్నే!

(picture courtesy : Google)

15 comments:

  1. 'భారతదేశము నా మాతృభూమి,
    భారతీయులందరూ నా సహోదరులు.
    నేను నా దేశమును ప్రేమించుచున్నాను.' అని స్కూల్లో నేర్పించింది. అక్కడ చెప్పించినవన్ని ఇంకా గుర్తుపెట్టుకొని ఉంటారా? మీరేమైనా ఈమధ్య కొత్తగా స్కూలుకెల్తున్నారా సార్‌? బలే గుర్తుపెట్టుకున్నారు. అవన్నీ గుర్తుపెట్టుకున్నవారెవరు బాగుపన్న దాఖలా లేదు. వాల్లంత మీరు చెప్పినట్లు వెర్రిబాగులా ల్లే అని ఒప్పుకేసుక తప్పదు.
    దేశ భక్తి కూడు పెడుతుందా సార్‌! మీ రచన చాలా బావుందండీ!

    ReplyDelete
  2. సోదర భావం గురించి మీ కోపం చక్కగా వ్యక్తం చెసారు
    మరి ఈ సోదర భావం మన మనుషుల్లో కలగాలంటే ఎలా.?
    ఒక మానసిక వైద్యుడిగా మీ ఉపాయం ఎమిటి.?
    ఈ భావం మన మనసులో రావాలంటె ఏమిచెయ్యాలి? బుద్ది పరంగా ఇలాంటి భావనలు అప్పుడప్పుడు మనకు కలుగుతుంటాయి
    కానీ బుద్ది పరంగా కలిగే భావనలు కొంత సేపే ఉంటాయి.. మనసు పరంగా మరి మనిషి సొదరభవం పెంపొందించుకొవాలంటే ఏమిచెయ్యాలండీ..??

    ReplyDelete
  3. మీ బ్లాగ్ చదువుతుంటె ఎందుకో George Orwell రాసిన Animal Farm గుర్తొస్తోంది. ఒక మంచి పుస్తకం మల్లి గుర్థు చేసినందుకు ధన్యవాదాలు.

    మీరు రాసినవన్నీ అక్షరసత్యాలే.

    ReplyDelete
  4. గాలి వాటు గమనానికి కాలి బాట దేనికి
    గొర్రెదాటు మందకి మీ జ్ణానబోధ దేనికి
    యే చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం
    యే క్షణాన మార్చుకుంది జిత్తుల మార్గం...

    ReplyDelete
  5. దేశమంటే మట్టి కాదోయ్‌
    దేశమంటే మనుషులోయ్‌

    ReplyDelete
  6. బడి లో ఒక పాఠం అమ్మ/నాన్న వడిలో దానికి వ్యతిరేకమైన పాఠం విన్న చిన్నారుల దుస్థితి ఇది :)

    భారతీయులందరూ సహోదరులు అని బడిలో చెబితే, అమ్మ నాన్నేమో హిందువులు , అందులో నాస్తికులు కాని వారు, పలానా ఆహారం తినేవారు , పలానా వి తినని వారు అని సోదరభావం లోని స్పూర్తికి వ్యతిరేకంగా నడిపిస్తున్నారు (ఇది ఏదో ఒక్క కులంలో మాత్రమె ఉన్న జాడ్యం కాదు , కాని కాస్త ఎక్కువ తక్కువలు అంతే )


    @ మహేష్ గారు

    చూస్తె మీ ప్రశ్న ఇదేలా ఉంది.

    ReplyDelete
    Replies
    1. నిజమే మాష్టారు,
      ఇటువంటి భావనలు మొదట తల్లి తండ్రులనుండే నేర్చుకొని తర్వాత, సమాజం నుండి ఇంకొంచెం నేర్చుకొని ఈ దుస్థితికి చేరుకున్నాము. కాని మనం ఎప్పుడూ కూడా జరగవలసిన మార్పు పక్కవాడిలో కోరుకొంటాము కానీ, మార్పు మొదట మనలో తేవటానికి ప్రయత్నించము. అందుకే "తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు" అని పెద్దాయన ఎప్పుడో చెప్పారు.

      Delete
  7. ప్రజల్ని అజ్ఞానంలో, కలహాల్లో ఉంచినంత కాలమే గదా పాలకుల, నేతల పబ్బం గడిచేది. ఇక డబ్బు, అధికారం చేతిలో ఉండాలే గానీ... పాపపరిహారం చిటికెలో పని. వ్యవస్థ పతనాన్ని చక్కగా రాశారు మీరు. ఈ దుస్థితి నుండి త్వరగా మార్పు వస్తుందని ఆశిద్దాం!

    ReplyDelete
    Replies
    1. నాగరాజు గారు,
      పాలకులు మొసగాళ్లు, ప్రజలు మంచి వారు, అమాయకులు అనే అర్థంలో మీరు రాసే వ్యాఖ్యలు బాగా లేదు

      Delete
    2. SriRam Garu,
      మెజారిటీ నేతలు, పాలకులు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు, ప్రజల్ని వంచిస్తున్నారు, అవన్నీ మన కళ్ల ముందే కనిపిస్తున్నాయి కాబట్టి వాళ్లను మోసగాళ్లు అనక తప్పట్లేదండి. ఇక మనలాంటి ప్రజల మాటంటారా... నా మట్టుకు నేను... మెజారిటీ శాతం ప్రజల్ని మంచివాళ్లనే గట్టిగా నమ్ముతాను. Of course, అది నా అభిప్రాయంగా మాత్రమే రాశాను. అంతకుమించి మరేం లేదు. ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఉండొచ్చు. ఏమైనా తప్పులుంటే చెప్పండి, మార్చుకునేందుకు ప్రయత్నిస్తాను. థాంక్యూ!

      Delete
  8. Love Your Neighbor as Thyself: This mental concept about loving the neighbor is not being interpreted carefully. Man must be able to love his own self and then he gets the ability or capacity to love his neighbor. To express self-love, man must know his true, or real identity. There is a fundamental problem as man is not able to know or understand his own true nature. To love another person, man must know about himself, and the world in which he lives. The problems of human behavior and action are caused by man's ignorance or "avidya."

    ReplyDelete
  9. రమణ గారు,
    గనులు, ఖనిజ సంపదాల గురించి రాసి, అన్నిటి కన్న పెద్ద స్కాం అయిన ఇసుక స్మగ్లింగ్ గురించి రాయటం మరచి పోయినట్లున్నరు. దాని గురించి మీకు తెలుసొ లేదొ, లింక్ లు ఇస్తున్నాను తెలుసుకోండి.

    http://www.ibtl.in/news/national/2015/thorium-disappearing-upas-new-coalgate/

    www.youtube.com/watch?v=naSqI1vr6lM

    http://ireport.cnn.com/docs/DOC-839177

    ReplyDelete
  10. చిన్నప్పుడు "భారతదేశం నా మాతృభూమి.." అని ప్రతిజ్ఞ చదువుతున్నారు.

    కాని పెద్దవాళ్ళయ్యేసరికి "నా స్వగృహమే నా మాతృభూమి, నా కుటుంబ సభ్యులు మాత్రమే ఈ దేశ పౌరులు, నేను నా బంధు మిత్రులను ప్రేమించుచున్నాను..." అని మార్చుకుంటున్నారు.

    ReplyDelete
  11. chaalaa chaalaa aalochimpajese vidamgaa undi mee post. siply superb.
    http://www.googlefacebook.info/

    ReplyDelete
  12. ఈ పొస్టుకి చక్కటి కామెంట్లు రాసిన మిత్రులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.

    ఆదివారం సాయంకాలం కొద్దిసేపు 'పతంజలి భాష్యం' చదివాను. బహుశా ఈ పోస్టు పతంజలి side effect కావచ్చు!

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.