Saturday 2 November 2013

తెలుగు వ్యూస్ చానెళ్ళు


పరిచయం :

ఆ మధ్య ఆర్టీసీ వాళ్ళు సమైక్యాంధ్ర అంటూ కొన్నాళ్ళు సమ్మె చేశారు (అటు తరవాత ముఖ్యమంత్రితో బేరం మాట్లాడుకుని సమ్మె విరమించారనుకోండి). తదుపరి భోరున వర్షాలు. ఇన్ని సమస్యల మధ్య సామాన్యుడు ఇబ్బంది పడ్డాడు, నలిగిపోయ్యాడు, అవసరాల్ని ఆపుకున్నాడు.

అడవిలో ఆహార ప్రాణులు (అనగా ఆకులు, అలములు ముప్పొద్దులా సుష్టుగా మేసి, బాగా కండపట్టి.. ఆపై తీరిగ్గా సింహాలకి, పులులకి ఆహారం అయిపొయ్యే అర్భక ప్రాణులు) కష్టాల్లో పడితే వాటిని భుజించే జంతువులక్కూడా కష్టాలొస్తాయి. అదే విధంగా సామాన్యుని కష్టాల వల్ల, వారిపై ఆధారపడ్డ అనేక వృత్తుల వారికి కూడా కొన్నాళ్ళపాటు పన్లేకుండా పొయ్యింది.

ఒక కుట్ర :

వివేకవంతుడు తీరిక దొరికినప్పుడు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. అజ్ఞాని మాత్రం దుర్వినియోగం చేస్తాడు. నేను అజ్ఞానిని కాబట్టి (ఈ విషయంలో నాకెటువంటి సందేహమూ లేదు), ఆ తీరిక సమయంలో ఎడాపెడా తెలుగు టీవీ చానెళ్ళు చూశాను. తద్వారా ఎంతో విజ్ఞానాన్ని, మరెంతో అజ్ఞానాన్ని సంపాదించాను. అజ్ఞానమైనా, విజ్ఞానమైనా నలుగురితో పంచుకుంటేనే సార్ధకత!

అదీగాక ఆ దిక్కుమాలిన టీవీ చానెళ్ళని చూసి ఎంతో విలువైన సమయాన్ని, మరెంతో విలువైన మనశ్శాంతిని కోల్పోయాను. నాకు కలిగిన ఈ నష్టానికి దుఃఖము మరియూ ఉక్రోశమూ కలుగుతుంది. బురదలో కూరుకుపోయ్యేవాడు వీలయితే పక్కవాడిని కూడా బురదలోకి లాగుతాడు. అదో తుత్తి. అంచేత నా తెలుగు టీవీ చానెళ్ళ వీక్షణానుభవాలు మీతో చదివించి, మీక్కూడా మనశ్శాంతి లేకుండా చెయ్యాలనే కుట్రలో భాగంగా ఈ పోస్టు రాస్తున్నాను.

కులం.. ఎంతో కమ్మనైనది :

మనదేశంలోని ప్రాంతీయ భాషలన్నింటిలోకి తెలుగులోనే న్యూస్ చానెళ్ళు ఎక్కువ. ఇది మనకి గర్వకారణం. తెలుగువారికి ప్రాంతాల వారిగా, కులాల వారిగా న్యూస్ చానెళ్ళు ఉన్నాయి. వీటిలో ఎక్కువ చానెళ్ళు ఒక కులం వారివే. మన తెలుగు సమాజంలో అత్యంత ఎక్కువ డబ్బులు ఆ కులం వారి చెంతనే ఉండుట చేత ఇది సహజ పరిణామం. ఆ చానెళ్ళకి ఎడిటర్లు కూడా ఆ ఓనర్ గారి కులం వాళ్ళే. ఇది కూడా సహజమే.

పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్లు తెలుగువాడికి జనులందు సకుల జనుల పట్ల మిక్కిలి ప్రీతి. ఇది అనాదిగా కొనసాగుచున్న ఆచారము. అందువల్ల బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్ లాగా చానెళ్ళ ఓనర్లు, ఎడిటర్లు ఒకే కులంవాళ్ళయితేనే వ్యాపారము అభివృద్ధి చెందును. ఈ సంగతి రాష్ట్రం బయటి వాడికి ఆశ్చర్యం కలిగిస్తుందేమో గానీ.. మనకి మాత్రం ఇదసలు విశేషమే కాదు.

ఇచట వార్తలు వండబడును :

వెనకటి కాలంలో చాదస్తపు పత్రికా సంపాదకులు వార్తల్ని ప్రచురించేప్పుడు ప్రజాహితమే పరమావధిగా భావించేవాళ్ళు(ట). ఇప్పుడు కూడా వార్తా సంస్థలకి హితమే ప్రధానం. అయితే అది ప్రజలకి సంబంధం లేని యాజమాన్యం వారి హితం. ఇది చాలాసార్లు ప్రజలకి అహితం కూడా.

నేతిబీరకాయలో నెయ్యుండదు. వార్తా చానెల్లో వార్తుండదు. అసలు ఈ చానెళ్ళు పేరుకి మాత్రమే వార్తా చానెళ్ళు. వాస్తవానికి ఇవి సొంత దుకాణాలు. వారి యాజమాన్య వ్యాపార ప్రయోజనాలకి అనుగుణంగా వార్తల్ని వండుతుంటాయి. తమ రాజకీయ ఎజండాని అమలుచెయ్యడానికి అలుపెరగని ప్రయత్నం చేస్తుంటాయి.

ఒక చానెల్ మాత్రం మళ్ళీ దేవుడి పాలన రావాలని కోరుకుంటూ.. అందుకొరకు అనునిత్యం ఒక నాయకుణ్ణి (ఆయనే ఆ చానెల్ ఓనర్ కూడా) ఫాలో అవుతుంది. దాన్నిండా ఓనర్ గారి అనుకూల వార్తలు మాత్రమే ఉంటాయి. ఇదొకరకంగా భక్తి చానెల్ వంటిది. ఈ చానెల్ గూర్చి ఎవరికీ ఏ భ్రమలూ లేవు. కావున నో కంప్లైంట్స్.

వార్తాపత్రికల్ని కూడా నడిపే రెండు న్యూస్ చానెళ్ళు రెండు విడతలు ముఖ్యమంత్రిగా పనిచేసినాయాన్ని మళ్ళీ గద్దె మీద కూర్చుండ పెట్టడానికి తీవ్రంగా కృషి చేస్తుంటాయి. ఇది వారి అప్రకటిత ఎజెండా. కానీ వారు ఈ విషయాన్ని చెప్పరు. అయితే వారేదో గొప్ప 'వార్తావిశ్లేషణ' చేస్తున్నట్లు పోజు కొడుతూ పొద్దస్తమానం తమ నాయకునికి అనుకూలంగా వార్తలు వ్రాయుదురు, చూపించెదరు. దీన్నే 'ప్రజల్ని మోసం చేయుట' అందురు.

దురదలందు నోటిదురద వేరయా :

పార్లమెంటరీ డెమాక్రసీలో ప్రభుత్వ విధానాన్ని ప్రభుత్వం తరఫున మంత్రులు ప్రకటన చేస్తారు. ఒక రాజకీయ పార్టీ విధానం గూర్చి ఆ పార్టీ తరఫున బాధ్యులు (కార్యదర్శి, అధికార ప్రతినిధి మొదలైనవారు) మాట్లాడతారు. ఈ ప్రకటనలకి మాత్రమే విలువ ఉంటుంది. ఇంకెవరు ఏం మాట్లాడినా ఆ మాటలకి విలువుండదు.

అయితే తెలుగునాట వందల కొద్దీ ఎమ్మెల్యేలున్నారు. డజన్ల కొద్దీ ఎంపీలున్నారు. వీరుకాక వేల కొద్ది మాజీలు ఉన్నారు. వీళ్ళంతా ప్రజానాయకులు. వీళ్ళల్లో చాలామందికి నోటిదురద ఉంది. ఆ దురద నాలుకని తుప్పు రేకుతో గోక్కున్నా తగ్గేది కాదు. అది టీవీ వాళ్ళతో సొల్లు కబుర్లు వాగితేనే తగ్గుతుంది. చానెళ్ళవారిక్కూడా ఇరవై నాలుగ్గంటలూ మసాలా వార్తలు కావాలి.

మన నోటి దురద నాయకులు ఎదుటి పక్షం వాణ్ని తిడుతూ రోజువారీగా ఇంటర్వ్యూలిస్తారు. ఆ తిట్లని టీవీవాళ్ళు లైవ్ కవరేజ్ ఇస్తూ ఆనందిస్తారు. ఇదొరకంగా ఇద్దరు దొంగలు ఒకరినొకరు సహకరించుకునే కార్యక్రమం. ఒకడు ఇంకోడిని గజ్జికుక్క అంటాడు. వాడు ప్రతిగా బురద పంది అంటాడు. అటుపై ఫలానావాడు నిజంగానే గజ్జికుక్కా? లేక బురద పందా? అనే రోజువారీ SMS ప్రోగ్రాముల చర్చా కార్యక్రమం నడుస్తుంటాయి.

ఆయా చానెళ్ళ వారు ఎగస్పార్టీ వారిని తిట్టిన ఉన్న తిట్లని పదేపదే చూపిస్తారు. ఎదుటివాడు తమ నాయకుడిని విమర్శించిన వార్తని అస్సలు చూపించరు. పైగా ఆ విమర్శ చేసిన నాయకుడిని చాలా హీనంగా చూపిస్తూ ఒక స్టోరీ రన్ చేస్తారు. ఈ విషయాల్లో కనీస స్థాయి మర్యాద చూపించరు. ఈ కళలో మన చానెళ్ళకి ఎవరూ సాటి రారు.

చర్చలా అవి! కాదు కాదు.. అరుపులు, కేకలు :

ఇక టీవీ చర్చలు. అవి చూస్తుంటే కొద్దిసేపట్లోనే అక్కడున్నవారికి కనీస స్థాయిలో పరిజ్ఞానం లేదన్న వాస్తవం అర్ధమవుతుంది. ఆ విషయం వాళ్ళకీ తెలుసు. అందుకే గందరగోళంగా ఒకేసారి మాట్లాడతారు. ఈ చర్చల్లో న్యూట్రల్ ఎంపైర్ లా పత్రికలకి సంబంధించిన ఒక పన్లేని వ్యక్తిని కూడా కూర్చోపెడతారు. కానీ ఆయనకి మాట్లాడే చాన్స్ ఎప్పుడో గానీ రాదు. వచ్చినా ఆయన ఏం చెబుతాడో మనకి అర్ధం కాదు.

ఈ టీవీల వాళ్ళకి అప్పుడప్పుడు ఏక్ దిన్ కా సుల్తాన్లు కూడా దొరుకుతుంటారు. మొన్నామధ్య అన్ని టీవీ చానెళ్ళ వాళ్ళు ఒక ఎన్జీవో నాయకుణ్ణి రోజువారీ, గంటల వారీ ఇంటర్వ్యూ చేసి పీల్చి పిప్పి చేశారు. ఆయన్ని మామిడి రసం పిండినట్లు పిండేశారు. ఇప్పుడాయనలో టెంక తప్ప ఏమీ మిగల్లేదు. ఇదీ టీవీల వాళ్ళ జగన్నాటాకం!

నా గోల :

నేన్రాసినవన్నీ అసలు విశేషాలే కాదు. ఇవన్నీ రోజువారీగా టీవీ చూసేవాళ్ళకి అనుభవమే. కాకపొతే 'ఈ గొప్ప అనుభవం' నాకు ఈ మధ్యనే అయ్యింది. పంటి నొప్పి గూర్చి రాయాలంటే పంటికి నొప్పి కలగాలి. వీపు దురద గూర్చి రాయాలంటే ఆ దురద అనుభవంలోకి రావాలి. అప్పుడే మనసులోని ఆవేదన, కసి రచన రూపంలో తన్నుకొస్తుంది. నాకీ చానెళ్ళ విశ్వరూప దర్శన భాగ్యం ఈమధ్యనే కలిగింది. ఇప్పటిదాకా ఈ చానెళ్ళ వీక్షణ ఇంతటి వ్యధాభరితమని తెలీదు.

అసలీ టీవీ లెందుకు? :

ఈ టీవీ చానెళ్ళ వల్ల సమాజానికి ఏమన్నా ఉపయోగం ఉందా?

అసలు చానెళ్ళు సమాజానికి సేవెందుకు చెయ్యాలి?

రియల్ ఎస్టేట్, విద్యావైద్య రంగ మాఫియాలు సంపాదించిన డబ్బుల్తో టీవీలు పెట్టింది సొమ్ము చేసుకోడానికీ, రాజకీయ ప్రాపకం కోసం మాత్రమే. ఇందులో ప్రజాశ్రేయస్సు లాంటి ఆలోచనలకి తావు లేదు.

ప్రజా సమూహంలో గొప్ప మేధావి నుండి నిఖార్సైన అజ్ఞాని దాకా అనేక రకాల వాళ్ళు ఉంటారు. అందువల్ల ఈ టీవీ రాజకీయ వీరుల గూర్చి రకరకాలైన అభిప్రాయాలున్నాయి.

1. ఈ టీవీల్లో కనిపించేవాడు పనిలేనివాడనీ, పనికిమాలిన వాడనీ చాలామందికి సరైన అవగాహనే ఉంది.

2. అతి తక్కువ మంది మాత్రం పొద్దస్తమానం టీవీలో కనిపించేవాడే ఓ మోస్తరు నాయకుడు అనుకుంటారు.

3. కొందరికి టీవీ రాజకీయ నాయకుల మీద సదభిప్రాయం ఉండదు. కానీ వారీ చర్చల్ని ఎంజాయ్ చేస్తారు. అదో టైపు మనస్తత్వం. వారికి పంపు దగ్గర తగాదాలు, టీ బడ్డీల దగ్గర బూతుల దండకం కూడా చాలా ఆసక్తికరంగా, సరదాగా ఉంటుంది.

జనాలు తెలివి మీరారు. కొన్నాళ్ళు సినిమాలు, ఇంకొన్నాళ్ళు క్రికెట్ మ్యాచులు, మరికొన్నాళ్ళు ఈ టీవీ చర్చల్ని సీజనల్ గా వీక్షిస్తుంటారు. చివరాఖరికి ఎలెక్షన్లప్పుడు బాగా ఆలోచించి తమ కులం పార్టీకో, డబ్బులిచ్చిన వాడికో ఓటేస్తారు.

ఏ పుట్టలో ఏ పాముందో! :

మరప్పుడు న్యూస్ చానెళ్ళు చెవి కోసిన మేకల్లా (మేకలూ! నన్ను మన్నించండి) అదే పనిగా తమ ప్రచారం ఎందుకు చేస్తుంటాయి? శ్రీకృష్ణుడు గీతలో ఏమని చెప్పాడు? నీ కర్తవ్యం నువ్వు నిర్వహించు, ఫలితాన్ని నాకొదిలెయ్యి అన్నాడు. అందువల్ల - ఏమో! ఎవరు చెప్పొచ్చారు? తెలుగువాళ్ళంతా వెధవన్నర వెధవలై, బుర్ర చచ్చిపొయ్యి ఆ టీవీవాడు చెప్పిందే నిజమని నమ్మి గొర్రెల మందలా (గొర్రెలూ! నన్ను క్షమించండి) ఓట్లేస్తారేమో! ఏ పుట్టలో ఏ పాముందో కదా!

ఉపసంహారం :

మిత్రులారా! ఇంతటితో నా టీవీ చానెళ్ళ ఆలోచనలు రాయడం పూర్తయ్యింది. ఈ విధంగా సమ్మె సందర్భంగా, వర్ష కారణంగా  అనుకోకుండా దొరికిన తీరికని ఎంతో ఘోరంగా దుర్వినియోగం చేసుకున్నానని (కుంచెం సిగ్గుపడుతూ) తెలియజేసుకుంటున్నాను.

ఇష్టమైన విషయాలపై ఎంతైనా రాయొచ్చు. అది చాలా తేలిక కూడా. నచ్చని సంగతుల్ని రాయాలంటేనే బహుకష్టం. ఆ సంగతీ పోస్టు రాస్తున్నప్పుడు అర్ధమైంది. కానీ మీ సమయం కూడా వృధా చెయ్యాలనే తీవ్రమైన దురాలోచనే నాచేత ఈ పోస్టు రాయించింది. అమ్మయ్య! ఇప్పుడు నాకు చాలా తృప్తిగా ఉంది.

(photo courtesy : Google)

14 comments:

  1. మీరింకా హింది చానెళ్ళు చూసినట్టు లేరు.వాటి లో రెండే విషయాలు.ఓ స్వామీజి పిచ్హి కల ఆధారంగా తవ్వుతున్న గోతులు,మరొ సామీజి టీనెజి అమ్మాయి తొ వెలగబెట్టిన రాసలీలలు.

    ReplyDelete
  2. "తృప్తి గా" కూడా ఉందా? మీ "దురాలోచన"ని గర్హిస్తున్నాను.

    ReplyDelete
  3. రమణగారూ
    అబ్బబ్బ. ఆ TV కట్టెయ్యండి బాబూ మీకు పుణ్యం ఉంటుంది.

    ReplyDelete
  4. డాక్టరు బాబు గారు,

    . ... మీ సమయం కూడా వృధా చెయ్యాలనే తీవ్రమైన దురాలోచనే నాచేత ఈ కామెంటు రాయించింది. అమ్మయ్య! ఇప్పుడు నాకు చాలా తృప్తిగా ఉంది.!!

    శుభాకాంక్షల తో !
    'టీ వీ' వారి
    జిలేబి

    ReplyDelete
  5. Excellent post.

    Except for the loss of some employment, it would be good if all these private TV channels are banned.

    ReplyDelete
  6. మీ '' అజ్ఞానాన్ని'' బయట పెట్టి పాఠకులకు మనశాంతి లేకుండ ఛేయటం అనే కుట్రను అద్బుత పగడ్బందిగా అమలు జరిపారు! మీరు బలే ప్లానరి !

    ReplyDelete
  7. v Pravde net izvestiy, v Izvestiyakh net pravdy

    Soviet Union had two governmental “news” outlets, the main Communist newspaper and the main Soviet newspaper, Pravda and Izvestia. Those names meant “the truth” and “the news” respectively… and a popular Russian saying was “v Pravde net izvestiy, v Izvestiyakh net pravdy” (In the Truth there is no news, and in the News there is no truth).

    ReplyDelete
  8. వ్యంగ్యం, హాస్యం కలబోతతో ఛానెళ్లపై మీకే సాధ్యమైన పోస్టుమార్టం రిపోర్టు భలేగుంది. మీరు ఇంకొంత సమయాన్ని వెచ్చించి ఛానెళ్ల గోలపై తగురీతిన ఓ థీసిస్ గానీ లేదా ఓ నవల గానీ రాసి తెలుగుజాతి ఆత్మక్షోభకు శాంతి చేకూర్చగలరని కోరుతున్నాం :-)

    ReplyDelete
  9. అయినా నాకర్థం కాదు. కుటుంబ నియంత్రణలా, ఒకరో ఇద్దరో వ్యక్తులతో చర్చ జరిపిస్తే, ఈ కొట్టుకుచావడం ఉండదు కదా!

    ఆ మధ్య ఎవరో ఒక టపా వ్రాసారు.
    ఈ దిక్కుమాలిన న్యూస్ చానళ్ల వలన మీ డాక్టర్ల ప్రాక్టీస్ పెరుగుతోందని.

    ReplyDelete
  10. @Jai Gottimukkala:

    Wow, in now-a-days news we know there is no truth but truth can't be a news?

    ReplyDelete
  11. తెలుగు న్యూస్ చానెళ్ళపై నేరాసిన ఈ పోస్టు చదివి కామెంటిన మిత్రులకి పేరుపేరునా ధన్యవాదాలు.

    ReplyDelete
  12. Ramana gaaru... Hha...hha... Ammo bagaa navvestunnaa:-):-)

    ReplyDelete
  13. ఈ మధ్య ఎక్కడో చదివానండీ " News is what somebody, somewhere wants to suppress. Everything else is advertising."

    ReplyDelete
  14. Yidi oka rakanga bhakti channel..... hats offto you doctor...u r tooo good ...I want to give u chamatkaara samraat title

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.