Wednesday 6 November 2013

నేను రచయితనవడం యెలా?


అన్నా! రచయితనవడం నా జీవితాశయం. నా ఆశయం కోసం గత కొన్నాళ్ళుగా పడరాని పాట్లు పడుతున్నా, కానీ రచయితని మాత్రం కాలేకపోతున్నా. కొంచెం సలహా చెప్పన్నా!

- గురజాడ అంతటివాణ్నవ్వాలని నెత్తిన తలపాగా పెట్టుకు తిరిగాను, 'కన్యాశుల్కం' తలదన్నే నాటకం రాద్దామనుకున్నాను. తలకి గాలాడక బుర్ర హీటెక్కి జుట్టూడిపోయింది గానీ ఒక్క ఐడియా రాలేదు.

- చాసో కథని పట్టుకుందామని అదేపనిగా చుట్టలు కాల్చాను, నోరు చేదెక్కింది తప్పించి ఒక్క కథా పుట్టలేదు.

- శ్రీరంగం నారాయణ బాబుని మరిపిద్దామని జులపాల జుట్టు పెంచాను, చమురు ఖర్చు పెరిగిందే కానీ పన్జరగలేదు.

- రావూరి భరద్వాజ కన్నా పెద్దగెడ్డం పెంచేసి జ్ఞానపీఠాన్ని కొడదామనుకున్నా. మూతి దురద తప్పించి.. జ్ఞానపీఠం కాదుగదా.. కనీసం ముక్కాలి పీట కూడా కొట్టలేకపోయ్యా.

- కారా మాస్టార్లా కారా కిళ్ళీ దట్టించి 'యజ్ఞం'కి బాబులాంటి కథ రాద్దామనుకున్నా. నోరంతా పొక్కి కథాయజ్ఞయత్నం కాస్తా భగ్నమైపోయింది.

- శ్రీశ్రీ కన్నా గొప్పకవిత్వం కోసం ఫుల్లుగా మందు కొట్టాను. 'మహాప్రస్థానం' సంగతేమో గానీ మహామైకం ఆవహించింది.

రావిశాస్త్రి వచనం కోసం బాకీలు చేశాను. బాకీలకి వడ్డీ పెరిగిందేగానీ 'బాకీకథలు' పుట్టలేదు.

- శివారెడ్డిలా శాలువా కప్పుకుని 'మోహనా! ఓ మోహనా!!' అంటూ కవిత్వాన్ని ఆహ్వానించాను. ఉక్కపోత తప్పించి కవిత్వం రాలేదు. 'దేవుడా! ఓ దేవుడా!!' అని ఏడ్చుకున్నాను.

- గద్దర్ పాట కోసం నల్లగొంగళీ భుజాన వేసుకుని చిందులు వేశాను. గొంగళీ వల్ల దురద, గంతుల వల్ల కాళ్ళు నొప్పులు మిగిలాయి.. తప్పించి పాట పెగల్లేదు.

తమ్ముడూ! నువ్వు అన్నీ చేశావు గానీ అసల్ది మర్చిపోయ్యావు. మంచి రచయితవవ్వాలంటే ముందు జీవితాన్ని చదవాలి, నీకు శుభం కలుగు గాక.

- అవునా అన్నా? ఎంతైనా నువ్వు చాలా తెలివైనోడివి, అందుకే గొప్ప సలహా యిచ్చావు. ఇంతకీ ఆ 'జీవితం' పుస్తకం ఎక్కడ దొరుకుతుంది? వెంకట్రామా అండ్ కో లోనా? విశాలాంధ్ర బుక్ హౌజ్ లోనా?

(posted in fb on 20/1/2018)

21 comments:

  1. శ్రీదేవి బుక్ స్టాల్ లో సుబ్బారావు

    ReplyDelete
  2. మీరు రచయిత ఎప్పుడో అయిపోయారు లేకపోతే ఇలా ఒక్క వ్యర్థపదం లేకుండా పొంకముగా పొదగలేరు!ఎంతో ఎదిగి ఒదగలేరు!మీకు జీవితం నేర్పిన పాటాలు మీ లేఖిని తో లిఖించలేరు!

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ!

      (ఇలా పొట్టిగా రాయడనికి కారణం సమయం లేకపోవడం మాత్రమే)

      Delete
  3. తలకట్టునీ ఓపెనంగునీ చూడగానె గుర్తుపట్టేశా ఈ పోస్టు మీనుంచే వొచ్చిందని. హ హ హ. ఈ రకమయిన శైలికి మీకె సాటి యెవరూ లేరు.

    ReplyDelete
  4. hahaha. ఆ పుస్తకం ఎక్కడ దొరుకుతుందని ఆరా తీయడం ఉంది చూశారూ... అది మహా రచయితల తాలూకు గొప్ప లక్షణమట. మీకిక తిరుగులేదు :-)

    ReplyDelete
    Replies
    1. అంతేనంటారా? థాంక్యూ!

      Delete
  5. Hhaa hhha... Ramana gaaru naavistoo manchi manchi pustaakalanni cheppesaaru..:-):-)

    ReplyDelete
  6. రమణగారూ,

    ఈ బ్లాగ్రాతలన్నీ కేవలం సరదాకోసం మాత్రమే అనేసి మీరు సరదాకోసం చక్కగా వ్రాస్తున్నారు!
    నాకేమో, చక్కగా వ్రాయాలని గొప్పసరదా. అలా వ్రాయటం అనే సరదా తీరేట్లు లేదు.

    మీ‌ టపా నామకరణం "నేను రచయితనవడం ఎలా?" చూసి మీరేదో మంచి దారి చూపిస్తా రనుకుంటే, బోలెడు మంది పేరున్న వాళ్ళ పట్టిని ఏకరువు పెట్టి మరింత కంగారు పెట్టేశారు. నేనైతే వీళ్ళల్లో ఏ ఒక్కరినీ క్షుణ్ణంగా చదివిన వాడిని కాదే. క్షుణ్ణంగా అనటం అటుంచండి - వీళ్ళ రచనల పేర్లన్నీ ఐనా సరిగా నాకు తెలియవు.

    పైగా, మీరు "మంచి రచయితవవ్వాలంటే ముందు జీవితాన్ని చదవాలోయీ" అని ముక్తాయింపు అనుగ్రహించారు. చిత్తమండి. ప్రతిజీవితమూ ఒక పెద్ద అసంపూర్ణ గ్రంధం అనిపిస్తుంటే, ఏలా చదవటం, ఎన్నని చదవటం చెప్పండి? అదీ కాక మహామహావాళ్ళ జీవితాలతో సహా దాదాపు అన్ని జీవితాలు మాయనటనలే అనిపిస్తున్నప్పుడు, వాటిని చదివి నేర్చుకునేది కూడా పెద్దగా కనిపించటం లేదు. ఏదో పురుషోత్తములన్నారని రాముడూ, కృష్ణుడూ వంటి వారి జీవితాలను అనుశీలనం చేసుకుందామంటే - ఈ‌ కాలం వారికి వీళ్ళు అసలు కంటికే అనటం లేదు.

    అందుచేత, ఎం చేయాలో ఎలాచేయాలో పాలుపోక, అసలు రచయితనయ్యే ప్రయత్నమే దండగ అని విరమించుకుంటున్నా నండి. అదే మహాశుభంలాగా అనిపిస్తోంది నాబోటివారికి.

    ReplyDelete
    Replies
    1. డాక్టరుగారు చెప్పింది ఆయనకు నచ్చిన రచనలు రచయితలగురించి. అవి మీ మనస్తత్వానికి నప్పొచ్చు నప్పకపోవచ్చు. "స్వప్రీతి గ్రంధో కాల వ్యర్థం శ్రేయః " అంటాను నాకు తెలిసిన సంస్కృతం లో:-) అంటే మనకి నచ్చిన పుస్తకం చదివి టైం వేస్టు చేసుకున్నా పరవాలేదు కాని ఎవరికో ఏదో నచ్చిందని మనం కూడా ఎగబడి చదివెయ్యాల్సిన అవసరం లేదు!!

      Delete
    2. శ్యామలీయం గారు,

      ఈ పోస్టు మెచ్చుకున్నందుకు ధన్యవాదాలు.

      రచయిత/ కవుల కొన్ని ప్రత్యేక లక్షణాలు (నాకు వెంటనే స్పురించినవి) వాడుకున్నాను. వీరిలో రావూరి భరద్వాజ రాసిన ఒక్క అక్షరం కూడా నే చదవలేదు. ఇంక మీకు తెలిసే ఉంటుంది.. రావిశాస్త్రి ఎప్పుడూ నా గుండెల్లొనే ఉంటాడు.

      Delete
    3. @సూర్య,

      'నాకు నచ్చిన రచయితలు' అన్న నియమం పెట్టుకోలేదు.

      (అప్పుడు కుటుంబరావు, పతంజలి, కేశవరెడ్డి, నామిని.. లిస్టు ఇలా ఉండేది.)

      Delete
  7. "ఇంతకీ ఆ 'జీవితం' పుస్తకం ఎక్కడ దొరుకుతుందన్నా? వెంకట్రామా అండ్ కో లోనా? విశాలాంధ్ర బుక్ హౌజ్ లోనా"

    అక్కడి దాకా వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టె ఓపిక నాకు లేదు. అంతర్జాలంలో free download దొరికితే చదువుతాను. అంతకన్నాఎక్కువ నానుంచి ఆశించడం భావ్యం కాదు గురువు గారూ.

    ReplyDelete
    Replies
    1. మీరిలా 'ఫ్రీ'గా రచయిత అయిపోదామనుకోవడం ఏమీ బాగాలేదు. :)

      Delete
  8. "జీవితం" పుస్తకం ఎక్కడ దొరుకుతుంది? ఓపిక ఉంటే డైరీ లో ప్రతి రాత్రి ఒక పేజీ దొరుకుతుంది!!

    ReplyDelete
  9. ఇలా రాస్తే రచయిత ఔతారేంటండి...
    .?
    ..?
    ...?
    ...?
    మహా గొప్పరచయితే ఇలారాస్తారు :-)

    ReplyDelete
  10. జీవితాన్ని చదివి రచయిత అయితే -
    పేదలు, హీనులు, దీనుల గురించి రాయాల్సి వస్తుంది. అప్పుడు ధనికులు, వ్యాపారులు, పెట్టుబడిదారులు దూరం పెడ్తారు.
    ఆడవాళ్ళ కష్టాల గురించి, నష్టాల గురించి రాయాల్సి వస్తుంది. అప్పుడు మగాళ్ళు దుమ్మెత్తి పోస్తారు.
    నల్లగొండ ఫ్లోరోసిస్ గురించి, తెలంగాణకు జరిగిన అన్యాయాల గురించి రాయాల్సి వస్తుంది. అప్పుడు సీమాంధ్రులు "తెలబాన్లు" అని దూషిస్తారు.
    ఈ బాధలన్నీ ఎందుకన్నా! హాయిగా తిని తొంగుంటే పోలా?

    ReplyDelete
    Replies
    1. ఫణీంద్ర గారు,

      వ్యాపార రచయితలు (యండమూరి, మల్లాది etc) ప్రజలకి నచ్చేట్లు రాసి సొమ్ము చేసుకుంటారు. వాళ్ళగూర్చి ఎవరూ పట్టించుకోరు.

      ఇక మీరన్నట్లు ప్రజల కష్టాల గూర్చి రాసే రచయితల్ని అందరూ పట్టించుకుంటారు. కనుకనే.. తీవ్రమైన పదజాలంతో విమర్శిస్తారు. కవుల్లో శ్రీశ్రీని తిట్టినంత దారుణంగా ఎవర్నీ తిట్టి ఉండరు.

      (అంచేత ఈ తిట్లని కూడా ఒక రకమైన కితాబుగానే స్వీకరించాలేమో!)

      Delete
    2. యండమూరి సక్సెస్ వెనుక రహస్యం ఏమిటి? ఆయన ఇంటి దగ్గరలో బ్రహ్మాండమయిన ఇంగ్లీషు నవలలను రోజువారీ లెక్కలో అద్దెకిచ్చే హుసేన్ బుక్ స్టాల్!

      Delete

comments will be moderated, will take sometime to appear.