నోర్మూసుకుని పెళ్ళాం మాట వినడమే మంచి భర్తకి నిర్వచనం అయినట్ల్తైతే మా ఆయన మంచిభర్తల కేటగిరీలోకే వస్తాడు. దించిన తల ఎత్తకపోవడమే బుద్ధిమంతుల లక్షణం అయినట్లయితే మా ఆయన బుద్ధిమంతుల కేటగిరీలోక్కూడా వస్తాడు.
అయితే నాకు మా ఆయన పట్ల ఇష్టానికి కారణాలు ఇవేవీ కావు. నాకు మా ఆయన ఉంగరాల జుట్టంటే ఎంతో ఇష్టం. నాకు ఆయన ఒత్తైన జుట్టు ఒక అద్భుతంగా తోస్తుంది. ఆ నల్లని ఆ జుట్టుని చూస్తూ మైమరిచిపోతాను. తలకట్టు మీద ప్రపంచ పోటీ పెడితే మా ఆయన ఒలింపిక్స్ మెడల్ సాధించుకొస్తాడని నా నమ్మకం!
పెళ్లి చూపుల్లో మొహమాటంగా, ఇబ్బందిగా కూర్చున్న ఆయన్ని చూసి ముచ్చట పడ్డాను. ఫ్యాన్ గాలికి సముద్రపు అలల్లా కదులుతున్న ఆ ఉంగరాల జుట్టు చూసి మత్తెక్కిపొయ్యాను. పెళ్ళయ్యాక ఆయన జుట్టుతో నా అనుబంధం మరీ పెరిగిపోయింది. ప్రేమతో కుంకుడు రసంతో తలంటేదాన్ని. నూనె రాసి అపురూపంగా తల దువ్వేదాన్ని. నిద్ర పట్టనప్పుడు ఆ జుట్టుతో ఆడుకుంటూ ఆనందపడిపోయ్యేదాన్ని.
మా ఆయనకి ఫిల్టర్ కాఫీ చాలా ఇష్టం. ఆయన ఆఫీసు నుండి రాంగాన్లే ఘుమఘుమలాడే చిక్కటి ఫిల్టర్ కాఫీ ఇచ్చేదాన్ని. ఆయనా కాఫీని లొట్టలేసుకుంటూ త్రాగేవాడు. 'నీ చేయి తగిలి కాఫీ మరింత రుచి పోసుకుందోయ్' అని బుగ్గ మీద చిటికేసేవాడు.
సిగ్గుగా అనిపించేది, గర్వంగానూ అనిపించేది. నా అదృష్టానికి నాకే అసూయ కలిగేది. 'గృహమే కదా స్వర్గసీమ! భర్తే గదా సుందరాంగుడు!' అని కూడా అనిపించేది. అందుకే 'జీవితమే మధురము, రాగసుధా భరితము, ప్రేమకథా మధురము' అని పాడుకునేదాన్ని.
కాలచక్రం గిర్రున తిరిగింది. ఇప్పుడు మా పెళ్లై ఇరవయ్యేళ్ళయింది. పిల్లలు పెద్దవాళ్ళయినారు. కొన్నేళ్లుగా నాకు మా ఆయన పట్ల ప్రేమ తగ్గిపోతూ వచ్చింది. ఆయనంటే చాలాసార్లు చికాగ్గా ఉంటుంది. అప్పుడప్పుడు మండిపోతూ కూడా ఉంటుంది.
ఇప్పుడు సమయం సాయంకాలం ఆరు గంటలైంది. చెట్లపై పక్షులు కిలకిలమంటూ కబుర్లాడుకుంటున్నాయి. ఎదురింటి పిల్లలు దీపావళి రోజు మిగిలిపోయిన టపాకాయలు కాల్చుకుంటున్నారు. కొంపలు మునిగిపోతున్నట్లు ఆఫీసు నుండి హడావుడిగా తగలడ్డాడు మా గురుడు. ఏం? ఇంకొచెం సేపు ఆఫీసులోనే ఏడవచ్చుగా!
నవ్వుతూ ఇంట్లోకొచ్చాడు. పళ్ళికిలిస్తూ 'కాఫీ' అంటూ నవ్వాడు.
చూడబోతే తిండి కరువు లాగా.. కాఫీ కరువు ప్రాంతం నుండి వచ్చినట్లుగా ఉన్నాడు. అందుకే అంత కక్కుర్తిగా సిగ్గు లేకుండా కాఫీ అని దేబిరిస్తున్నాడు. చివ్వున లేచి వంటింట్లోకెళ్ళాను.
'ఎందుకు? ఎందుకిలా జరిగింది? నా ఖర్మ ఎందుకిలా తగలడింది? దేవుడా! నేనే పాపం చేశాను? నన్నెందుకిలా అన్యాయం చేశావ్? నీకు తుమ్మెద రెక్కల్లాంటి మా ఆయన జుత్తే కావల్సొచ్చిందా? అందుకేనా మా ఆయన నెత్తి మీద జుట్టంతా ఊడగొట్టేసి అద్దం లాంటి బట్టతలని చేసేశావ్? ఇది నీకు న్యాయమా? ధర్మమా?'
దుఃఖం భరించలేక భోరున ఏడ్చేశాను.
(pictures courtesy : Google)
డాక్టర్ గారు, ఇది అమ్మ గారి స్వగతం లాగా ఉన్నది. :)
ReplyDeleteమీ ఫొటో చూస్తుంటే, టివిలో ఈ మధ్య ఎక్కువగా కనపడుతున్న పళ్ళంరాజు గారు గుర్తుకొస్తున్నారు.
ReplyDeleteఅవి డాక్టరు గారి ఫోటోలు కావండీ బాబూ. ఎక్కడో గూగుల్ నుండి ఎత్తుకోచ్చినవి అనుకుంటా!
Deleteనేనన్నది యరమణ గారి ప్రొఫైల్ ఫొటోని గురించి.
Deleteవాడిన పూలే వికసించులే అని పాడుకోండి ...కేశ వర్ధని వాడండి.. మళ్ళీ ఘుమఘుమలాడే కాఫీ ఇవ్వండి. ఏ కథ అయినా సుఖాంతమవ్వాలిగా
ReplyDeleteతలలు బోడులయిన తలపులు బోడులవునా?
ReplyDeleteవిశ్వదాభిరామ వినుర వేమా!
అయ్యా దొందూ దొందే అనుకోవాలేమో నండీ?
Deleteమగని గుండు చూసి మగనాలు విలపించు
ప్రేమలొట్టబోవ విభునిపైన
ఆలిలావు జూచి యర్భకు డేడ్చుచు
ప్రేమనటన వెలగబెట్టు చుండు
అంతేనండి.
హహ్హా...! హతవిధీ!
ReplyDeleteమంచీ మర్యాదకు కాకుండా; బోడి జుట్టుకు, బాడీ స్ప్రేలకు వాల్యూ ఇచ్చే పాడుకాలమా ఇది! :-)
రమణగారూ, మీరు వేంఠనే ఏదో ఒకటి చేసేయాలి. సుబ్బూని రంగంలోకి దించండి. మగ పురుషుల ప్రిస్టీజ్ ఇష్యూ ఇది!!
మీ పోస్టులోని మొదటి కొన్ని వాక్యాలు చదువుతుండగానే అర్థమైంది, తరువాతి ఘట్టం బట్టతలగురించే అని! అదేంటో గాని ఒంటిపై ఎక్కడబడితే అక్కడ జుట్టు వద్దురా బాబూ అనుకుంటే అక్కడే మొలుస్తుంది. తలమీద జుట్టు పదికాలాలు ఉండాలి అనుకుంటుంటే అదే రాలిపోతుంది. తానొకటి తలిస్తే తల ఇంకోటి తలచిందనీ... ఏదో సామెత ఉందిలెండి:-)
ReplyDeleteమీరు "అత్తారింటికి దారేది" సినిమా చూడలేదనుకుంటాను.
ReplyDeleteవయసు పెరిగే కొద్దీ, జుట్టు మీద ఉంగరాలు పోయి చేతి వేళ్ళ మీదకు బంగారు ఉంగరాలు వస్తాయట.
hey bhagavaan.................yemitee pareeksha?????
ReplyDeletelol...కొంచెం అప్పుడప్పుడు ఆడవాళ్ళు ఇలా ఫీల్ అవ్వడం నేనెరుగుదును... నవ్వించి చంపేసారు సుమండి.
ReplyDeleteSorry, I am not able to properly empathize with the hair challenged people here because of lack of experience in that department!
ReplyDeleteఎంతో మందికి వాళ్ళ వాళ్ళ స్వగతం లా అనిపిస్తుందండీ ఇది చదువుతుంటే :)
ReplyDeleteప్రియమైన బ్లాగ్మిత్రులారా,
ReplyDeleteఒక చిన్న ఆలోచన.. వెంటనే ఒక బుల్లి పోస్టు రాసేశాను.
ఒక వయసులో అందచందాలకి ఉన్న ప్రాముఖ్యత తరవాత రోజుల్లో ఉండదు. అందుకు కారణం.. priorities మారిపోవడం అవ్వచ్చు. అయితే కొందరికి మారకపోవచ్చు. అటువంటి ఒక వ్యక్తిని ఊహించుకుని ఈ పోస్ట్ రాశాను.
ఇంక నా వ్యక్తిగత విషయం.. నా బట్టతల నన్నెప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. అందుకు కారణం.. నా భార్య నన్ను పెద్దగా పట్టించుకోకపోవడం కావచ్చు!
కామెంట్లు రాసిన మిత్రులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు.
పొరబడ్డారేమోనండీ రమణగారు,
Delete... మీ శ్రీమతిగారు మిమ్మల్ని పట్టించుకుంటున్నారే కాని మీ బట్టతలను కాదని అనుకోవచ్చు గదా?
చాలా బాగా రాసారు . మీ ప్రతిభ రాను రాను కొత్త పుంతలు తొక్కుతున్నాది.
ReplyDeleteUG SriRam గారు,
Deleteథాంక్యూ. మీకీ పోస్టు నచ్చినందుకు సంతోషంగా ఉంది.