Friday 29 November 2013

పి.లీల.. నాకు భలే ఇష్టం!


నాకు చిన్నప్పట్నుండి చాలా ఇష్టాలున్నాయి, కొన్ని అయిష్టాలూ ఉన్నాయి. అయితే - ఇష్టమైనవి ఎందుకిష్టమో, ఇష్టం లేనివి ఎందుకయిష్టమో చెప్పగలిగే తెలివి అప్పుడు లేదు.

'ఇప్పుడు చిన్నవాణ్ణి కదా! పెద్దయ్యాక వీటన్నింటికీ కారణాలు తెలుస్తాయిలే.' అని సరిపుచ్చుకునేవాణ్ని. దురదృష్టం! పెద్దయ్యాక్కూడా జ్ఞానానికి సంబంధించి నా పరిస్థితిలో మార్పు రాలేదు.

నా జీవితంలో మొట్టమొదటగా నే విన్న పాట అమ్మ పాడింది. కావున నాకు తెలిసిన మొదటి గాయని అమ్మే. ఇదేమంత విశేషం కాదు. చాలామందికి వారి తల్లులే మొదటి గాయకులు. అయితే నే చెప్పేది 'చందమామ రావే, జాబిల్లి రావే!' టైపు పాట కాదు, చక్కటి సినిమా పాట. ఎలా? ఎప్పుడు?

చిన్నప్పుడు రోజూ అమ్మ పక్కలో పడుకునేవాణ్ని. అందుకొక బలమైన కారణం ఉంది. అమ్మ తప్ప ఇంట్లో ఎవరూ నన్ను తమ పక్కలో పడుకోబెట్టుకోడానికి సాహసించేవాళ్ళు కాదు. నేను వారి పక్కలో పడుకునే హక్కుని కోల్పోయాను, ఇది నా స్వయంకృతాపరాధం. 

స్కూల్లో అవుట్ బెల్లు కొట్టేవాళ్లు.. స్నేహితుల్తో కలిసి పరిగెత్తుకుంటూ వెళ్లి రోడ్డు పక్కన పాసు పోసుకుంటుండగా.. కొద్దిసేపటికి చల్లగా అనిపించి మెళకువ వచ్చేది. చూసుకుంటే నిక్కరు, దుప్పటి ముద్దగా తడిసిపోయుండేవి. అంటే ఇదంతా కలా? నిజం కాదా?!

ఈ కల నాకు రాకుండా చెయ్యాలని ప్రతిరాత్రి దేవుడికి దణ్ణం పెట్టుకుని పడుకునేవాణ్ని. కానీ కల నుండి మాత్రం తప్పించుకోలేకపొయ్యేవాణ్ని. ఈ విధంగా ఆ కల నన్ను ప్రతి రాత్రీ వెంటాడగా.. నిద్రలో పక్క తడిపే కార్యక్రమం క్రమబద్ధంగా, నిర్విఘ్నంగా కొనసాగించాను. ఘోరమైన ఈ అలవాటు నాకు ఇంట్లో ఎవరి పక్కలోనూ స్థానం లేకుండా చేసింది!

అక్కైతే నన్ను తిట్టిపోసేది.

'ఒరే దున్నపోతా! నీకు మంచం ఎందుకురా? వెళ్లి ఆ బాత్రూములోనే పడుకుని చావు. నీకదే సరైన ప్లేసు.' ఎంత దారుణం! సినిమాల్లో తమ్ముడి కోసం అక్క పాట పాడుతుంది, నన్ను మాత్రం అక్క అన్యాయంగా తిడుతుంది! అయితే అక్క కోపానికో కారణం వుంది. మర్నాడు ఆ కంపుకొట్టే బట్టల్ని బక్కెట్లో ముంచేది అక్కే, అదీ సంగతి!

నాకేమో ఒక్కణ్ణే పడుకోడానికి బయ్యం. తెల్లచీర కట్టుకుని, జుట్టు విరబోసుకున్న ఓ ఆడమనిషి కిటికీలోంచి తొంగి చూస్తున్నట్లుగా అనిపించేది. అన్నట్లు ఆడదెయ్యాలు రంగు చీరలు ఎందుక్కట్టుకోవు? జడెందుకేసుకోవు? ఎందుకో ఇవ్వాల్టికీ నాకు తెలీదు.

ఈ విధంగా అందరి పక్కల నుండి బహిష్కృతుడనైన నేను.. నెమ్మదిగా అమ్మ పక్కలోకి చేరేవాణ్ని. అమ్మ నన్నెప్పుడూ ఏమీ అన్లేదు. 'కొన్నాళ్ళకి ఆ అలవాటు పోతుందిలే' అని ధైర్యం కూడా చెప్పేది. అమ్మ నాకు నిద్రోచ్చేదాకా పాట(లు) పాడేది. ఈ (లు) ఎందుకంటే - మొదటి పాట పూర్తయ్యేలోపే నిద్రపొయ్యేవాణ్ణి. కాబట్టి నేను నిద్ర పోయింతర్వాత అమ్మ ఇంకే పాటైనా పాడేదో లేదో నాకు తెలీదు.

అమ్మ రోజూ పాడే ఆ పాట - 'ఓహో మేఘమాల! నీలాల మేఘమాల! చల్లగా రావేలా, మెల్లగా రావేల'. అమ్మ గానం గొప్పగా అనిపించేది. పాట వింటూ నిద్రోలోకి జారుకునేవాణ్ని. రేడియోలో, సినిమాల్లో.. ఎక్కడా, ఎవరూ అమ్మ పాడినంత బాగా పాడేవాళ్ళు కాదని నా నిశ్చితాభిప్రాయం.

ఇక్కడో సందేహం. ఇంత బాగా పాడే అమ్మ మరి సినిమాల్లో ఎందుకు పాడట్లేదు? బహుశా వంటకి ఇబ్బందవుతుందని నాన్న వద్దనుంటాడు. అప్పటికీ అమ్మకోసారి సలహా ఇచ్చాను. 'అమ్మా! నువ్వు సినిమాలకి పాడు.' అమ్మ చాలా సంతోషిస్తూ 'ఈ పాట లీల పాడింది, గొప్ప సింగర్.' అంది. 

అందువల్ల - అమ్మకి ఎంతగానో నచ్చిన 'ఓహో మేఘమాలా!' పాటంటే నాక్కూడా ఎంతో అభిమానం ఏర్పడిపోయింది. అమ్మకి ఇష్టమైన లీల నాక్కూడా అభిమాన గాయని అయిపొయింది. నాకు లీల గొంతు మృదువుగా, దయగా, ఆత్మీయంగా, లోతుగా, మార్దవంగా వినబడుతుంది. 'ఒకే గొంతు ఇన్ని "గా"లుగా ఎలా వినిపిస్తుంది?' అని అడక్కండి, నాదగ్గర సమాధానం లేదు!

సినిమా పాటల పండితులు తమ పాండిత్య ప్రావీణ్యంతో తూకం వేసి.. లీల కన్నా లతా మంగేష్కర్, సుశీల గొప్పగా పాడతారని తేల్చినా.. నేనస్సలు పట్టించుకొను. ఎందుకంటే నాకు సంగీతం తెలీదు, గొప్పగా పాడటం అంటే ఏంటో తెలీదు. అంచేత లీల పర్ఫెక్ట్ గాయని అని వాదించి యెవర్నీ ఒప్పించలేను. కానీ - లీల ఎక్కాల పుస్తకంలో రెండో ఎక్కాన్ని కూడా మధురంగా పాడుతుందని నా నమ్మకం!

నాకు ఇష్టమైన అమ్మకి లీల ఇష్టం, ఎవరికైనా ఇష్టమైనవారికి ఇష్టమైనది ఇష్టంగా కాకుండా ఎలా వుంటుంది? నేను లీలని ఇష్టపడటంలో నా బాల్యం, నా కుటుంబం, అమ్మ.. అనేక తీపి జ్ఞాపకాలు కలగలిపి వున్నాయి. 

అందుకే - పి.లీల.. నాకు భలే ఇష్టం!



(photos courtesy : Google)

29 comments:

  1. "ఇంత బాగా పాడే అమ్మ మరి సినిమాల్లో ఎందుకు పాడట్లేదు? బహుశా వంటకి ఇబ్బందవుతుందని నాన్న వద్దనుంటాడు."
    నాన్నలెందుకు ఇలా చెస్తారో నాకు ఎప్పటికీ అర్థం కాదు.

    "లీల ఎక్కాల పుస్తకంలో రెండో ఎక్కాన్ని పాటగా పాడినా నాకిష్టమే!"
    నాకు కూడా తను ఎది పాడినా ఇష్టమే కానీ ఎక్కాలకి బదులు సోషల్ టెక్ష్ట్ బుక్ పాడిస్తే నాకు సోషల్ లో మంచి మార్కులొచ్చుండేవేమో.

    ReplyDelete
    Replies
    1. ఇప్పుడు నాన్నలు మారిపొయ్యార్లేండి. పిల్లల్ని స్టూడియోలమ్మట తిప్పుతూ మరీ పాటలు పాడిస్తున్నారు.

      Delete
    2. పిల్లల్ని తిప్పుతారండీ, భార్యలని కాదు, ఎప్పటికీ.

      Delete
  2. హిందోళం/మాల్కౌస్ రాగ మాధుర్యాన్ని చవిచూడాలనుకుంటే అది లీల స్వరంలోనే వినాలేమో! నాకూ పి లీల అంటే చాలా ఇష్టం. బాగా రాశారు. మీ పోస్టు సాంతం సీరియస్ గా సాగుంటే ఎంత అద్భుతంగా ఉండేదో! ప్చ్... రావిశాస్త్రి ఎఫెక్ట్?! :-)

    ReplyDelete
    Replies
    1. నాగరాజ్ గారు,

      >>మీ పోస్టు సాంతం సీరియస్ గా సాగుంటే ఎంత అద్భుతంగా ఉండేదో!

      అలా రాయాలంటే విషయం ఉండాలి. ఇక్కడది లేదు! :)

      Delete
  3. Nice expression of your feelings :)

    ReplyDelete
  4. మనకు సినిమా పాటలు గుర్తుంటాయి... కానీ పాఠాలు గుర్తుండవెందుకు అనే అంశం మీద చిన్నప్పుడే రీసెర్చ్ చేశా. అప్పటి రోజుల్లో విడుదలైన సినిమాలోని ఒక పాట బాణీలో ప్రయోగాత్మకంగా "అమ్మనీ కమ్మనీ గుడ్డు... ఎంత బెస్టుగా ఉన్నదీ ఫుడ్డు. ప్రొటీన్లన్నీ ఉన్నదీ... విటమిన్ సీ లేనిదీ" అంటూ చిన్నప్పుటి పాఠాన్ని... పాట బాణీలోకి ఆమ్లెట్ గా వేశా. అంతే... పాట మరచిపోయి... పాఠం మాత్రమే నిలిచిపోయే ప్రమాదం దాపరించింది. పోతేపోనీలే పాఠాలు... కావాలంటే పెద్దయ్యాక చదువుకోవచ్చు. సినిమా పాట మరచిపోవడం లాంటి అనర్ధాలు జరిగితే ఎలా అని పాటలనే ఎంచుకున్నా. లోకం అనుకున్నట్లే జరిగింది. ఎందుకూ పనికిరాకుండా పోయాడంటూ అందరూ ఇప్పుడు నామీద జాలిపడుతున్నారు. నేనేమో సినిమా పాటలు హమ్ చేసుకుంటూ మిగిలా

    ReplyDelete
    Replies
    1. మీకు నా ప్రగాఢ సానుభూతి. :)

      Delete
  5. "నీ లీల పాడెద దేవ"

    ఈ పాట లీల ఎందుకు పాడలేదో?

    ReplyDelete
  6. మీ సెంటిమెంట్ తో మా గుండెలని పిండేసారు బాబుగారూ.. పిండేసారు!!

    ReplyDelete
  7. రమణ గారు,

    సాధారణం గా దెయ్యాలు భూతాల ను నమ్మెది చదువు సంధ్యా, డబ్బులు, ధైర్యం లేని పేదవాళ్లు. తెల్ల చీరతో పోలిస్తే రంగు రంగుల చీరలు ఖరీదెక్కువ, జుట్టు విరగబొసుకొంటె జడకి అయ్యే కొబ్బరి నూనె ఆదా అవుతుంది. సింపుల్ గా చెప్పాలి అంటె ఉన్నవారు వారి జీవితాన్ని విదేశల లోని జీవన శైలితో ఎలా ఊహించుకొంటారో, అలాగే డబ్బులు లేని వారు, వారి జీవితంలో సమస్యలెదురైతే, దానికి దెయ్యాలు భూతాలు కారణమనుకొంట్టూ, దెయ్యాలను తెల్ల చీర, జుట్టు విరగబొసుకొనె విధంగా తక్కువ ఖర్చు తో ఊహించుకొంటారని పిస్తుంది. మీరే మంటారు?

    ReplyDelete
    Replies
    1. UG SriRam గారు,

      మీ లాజిక్ బాగానే ఉంది. అయితే కొన్ని సందేహాలు.

      1.దయ్యాల్ని విపరీతంగా నమ్మే చదువుకున్నవారు, డబ్బున్నవారు నాకు చాలామంది (పేషంట్లుగా) తెలుసు.

      2. సినిమాల్లో చూసేవాడికి అర్ధం కావటం కోసం కొన్ని పాత్రల్ని స్టీరియోటైపీలుగా చూపిస్తుంటారు. (ఉదా. దొంగని అడ్డచారాల టీ షర్టుతో. అలాగే మనవాళ్ళు దెయ్యాలకి ఒక డ్రెస్ కోడ్ ఇచ్చినట్లున్నారు).

      3.ఊహించుకోవడంలో కూడా మనవాళ్ళు అంత దరిద్రంగా ఉంటారంటారా?!

      మొత్తానికి దెయ్యలకి మీరొక రాజకీయ కోణం కూడా రాశారు. అభినందనలు. :)

      Delete
    2. *ఊహించుకోవడంలో కూడా మనవాళ్ళు అంత దరిద్రంగా ఉంటారంటారా?!*
      రమణగారు
      భలే వారే. సినేమాలలో సుఖభోగాలను ఊహించుకోనేటప్పుడు, హీరో హీరోయిన్ లు స్విజర్లాండ్ లోని రోజాపూల తోటలో, ఇళయరాజ/ రెహ్మాన్ సంగీతం పెట్టుకొని కొత్త కొత్తగా ఉన్నది, స్వర్గమిక్కడే అన్నది అనే పాట పాడుకొంటారు. అలాగే దు:ఖాన్ని చూపించేటప్పుడు డబ్బులు లేని తండ్రి,రోగం తో మరణిస్తే, కట్టేల కోసం అప్పుచేసి, చాలి చాలని డబ్బులతో అంత్యక్రియలు చేయటానికి పుట్టేడూ దు:ఖం తో శవాన్ని తీసుకుపోతుంటే, బాక్ గ్రౌండ్ లో ఎవరు నీ వారు కారు, ఎవరు నీ తోటి రారు, అడిగిన వారికి లేదనకా దానం చేసిన ధర్మదాత అని ఘంటసాల బావురు మంట్టూ పాడుతూ ప్రేక్షకులను మరీ గుండేలు పిండేసే విధంగా సన్నివేశం సృష్టిస్తారు. చెప్పొచేదేమిటంటే మాంచి దు:ఖంలో ఉన్నపుడు గంటసాల పాడిన ఏడుపు పాటలు వింటే మొదట కొంచెం బాధ ఎక్కువై, తరువాత జీవితం లో ఇంతకన్నా వరేస్ట్ సిట్యువేషన్ ఉండదు,రాబోదు అని అర్థమై మనుషులకు ఒకవిధమైన ప్రశాంతత దానికదే తిరిగి వస్తుంది. సింపుల్ గా చెప్పాలి అంటే దరిద్రాన్ని మరింత దరిద్రంగా ఊహించుకోవటం లో ఒక విధమైన ఆనందం ఉంది.సినేమా సంగతి పక్కన పెట్టి వాస్తవ జీవితానికి వస్తే, చిన్నపుడు మా ఎదురుగా ఉండే, వీధిలో చాలా పూరి గుడిసేలు ఉండేవి. అక్కడ ఒకతను దెయ్యాలను వదలించటం, ప్రశ్న/అంజనం,చెప్పేవాడు. దానికొరకు చాలా మంది వచ్చే వారు. ఆయన కష్టమర్లు చాలా పేదవారు. ఆయన పేషంట్లను పూజకు పూలు,పండ్లు తాంబూలం,పంచేలు, చీర, రవికే, ఇటువంటి లిస్ట్ రాసి ఇస్తే చివరికి, ఈయనకు ఇచ్చే ఫీజు వారు ఇచ్చుకోలేరు. అందువలన నేమో బహుశ దెయ్యాలు,భూతాలను వదలించటానికి పూజలు చేసేవారు, వారి తాహతును దృష్టిలో పెట్టుకొని తక్కువ ఖర్చు తో కూడిన తెల్లచీర మొద|| లిస్ట్ ఇచ్చి, పూజ అయిన తరువాత ఫీజు ఆయనకు ముట్టే విధంగా జాగ్ర్రత్తపడేవారేమో!

      Delete
    3. శ్రీరాం గారు,

      మీ లాజిక్ బానే ఉంది. నాకో భూతవైద్యుడు తెలుసు. ఆయన చాలా తెలివైనవాడు. వీలైతే ఆయనపై ఓ పోస్టు రాస్తాను.

      Delete
  8. TOUCHING. NAAKU ISTAMAINA MAA AMMA PAATA, KARUNINCHU MERI MAATAA..
    PUTCHA

    ReplyDelete
    Replies
    1. నిజంగా!

      (చిన్నప్పుడు రేడియోలో ప్రతి ఆదివారం ఉదయం వేస్తుండేవాళ్ళు.)

      Delete
  9. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. Yaseen గారు,

      మొన్నరాత్రి నుండి జ్వరం. మీ కామెంట్ చాలా సరదాగా ఉంది. తీరిగ్గా ఆలోచించి మీ కామెంటుకి ధీటుగా పెద్ద సమాధానం రాద్దామని ఆగాను. ఇప్పుడేమో మీరు కామెంట్ withdraw చేసుకున్నారు. లేటయినందుకు వెరీ సారీ. మన్నించండి.

      Delete
  10. రమణ గారు!
    గుండెను తడిమారు. మా అమ్మను గుర్తు చేసారు.
    ధన్యవాదాలు!

    ReplyDelete
    Replies
    1. ఫణీంద్ర గారు,

      మన అమ్మలందరూ ఒకటేనండీ.

      (ఈ పోస్టు మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది.)

      Delete
  11. డాక్టర్ రమణ గారు...
    మొదట్లో నా కామెంట్ నాకూ సరదగానే అనిపించింది. ఆ తర్వాత చూసుకుంటే కాస్త ఓవర్ గా రాసినట్లు ఫీలయ్యాను. ఎవరైన నన్ను "నరరూప దెయ్యం" అనుకోకముందే విత్ డ్రా చేసుకుంటే బాగుంటుందేమో అనిపించి అలా.. కాబట్టి నేనే సారీ.

    ReplyDelete
  12. లీల గారూ జిక్కి గారూ ఇద్దరూ ఇద్దరే. తెల్లవార వచ్చె తెలియక నాసామి అని చిరంజీవులు లో లీల గారి పాట, చివర లో 'నాన్నా మీ అమ్మ గోపెమ్మ పిలిచేను వెన్న తిందువు గాని లేరా' అన్న వాక్యం లో మార్దవం అనితర సాధ్యము. అలాగే, జిక్కి గారి గొంతు కూదా చాలా ప్రత్యెకమైనది. ఇద్దరూ నా అభిమాన గాయనీ మణులు, మీకు లాగే, మా అమ్మ తరువాత.. మా అమ్మ గారు పాడే "ఘుమ్ము ఘుమ్మని పెరుగు తరచగ కోరి విని ప్రార్ధించి కృష్ణుదు..." నా జన్మ లో నేను మరచిపోలేను.

    నా పేరు
    సీతారామం

    ReplyDelete
  13. పి. లీల గారి తో పాటు యస్. వరలక్ష్మి గొంతు కూడా బాగుంట్టుంది.
    http://www.youtube.com/watch?v=6onOsBCkNyI

    సంగీతం అంటే ఇష్టం ఉన్న వారు, అమీర్ ఖుస్రో సంగీత వారసులు (పాకిస్తాన్) పాడిన ఈ క్రింది పాటను వినండి. కొత్త శైలి లో కవ్వాలి పాటను పాడారు.
    http://www.youtube.com/watch?v=BXmIpbBOSvI
    http://www.youtube.com/watch?v=NymD_xFRQQ8

    Pls watch below songs also

    http://www.youtube.com/watch?v=zMBD4ONmBk0
    http://www.youtube.com/watch?v=SEDVtEsb398

    ReplyDelete

  14. ఈ పాట 40స్లో వచ్చిన 'కిస్మత్ 'అనే హిందీ సినిమాలో ముంతాజ్ శాంతి పాడిన(లేక ప్లే బాక్)పాటకు అనుకరణ.సిన్మా కథ కూడా అనుకరణే.అప్పట్లో కిస్మత్ సినిమా(అశోక్ కుమార్ హీరో ) నాలుగేళ్ళు వరసగ కలకత్తా లో ఆడిందట.ఆ రికార్డు మళ్ళీ 'షోలే ' సినిమా దాకా మరే సినిమా అందుకోలేదని రాసేవారు. ఈ పాట అంటే నాకూ ఇష్టమే.

    ReplyDelete
    Replies
    1. కమనీయం గారు,

      మీరు చెప్పిన కిస్మత్ పాట లింక్ ఇదిగో -

      https://www.youtube.com/watch?v=sn7OIQGD8tM

      Delete

comments will be moderated, will take sometime to appear.