Saturday 7 December 2013

అనాధరక్షకా! పాహిమాం పాహిమాం!!


(ఉపాధ్యాయులు ఈ పోస్టు చదవరాదు. చదివినచో వారి హృదయము గాయపడును.)

"చాలా కష్టపడి చదువుతున్నాను. అయినా పాస్ మార్కులు కూడా రావట్లేదు. నేను ఇంప్రూవ్ అవ్వాలంటే ఏం చెయ్యాలి?" అడిగాడు ఎంబీయే చదువుతున్న విద్యాధమరావు.

అప్పుడప్పుడు నేను నా పోస్టుల్ని పేషంట్ల సంభాషణతో మొదలెడుతుంటాను. కారణం.. నా ఆలోచనలకి ఫస్ట్ గేర్ వేస్తుంది వాళ్ళే కాబట్టి. ఒక ఆలోచనకి క్రెడిట్ ఇవ్వకపోవడానికి నేనేమీ తెలుగు సినీరచయితని కాను. ఒక్క డబ్బు విషయంలో తప్ప అన్నివిషయాల్లోనూ నైతికతకి ప్రాణం పణంగా పెడతాను.

"బాగా చదువుతున్నానని మీరు అనుకుంటే కుదరదు. హార్డ్ వర్క్ ఈజ్ ద ఓన్లీ కీ ఫర్ సక్సెస్. రీడ్ అండ్ ఫర్గెట్. రీడ్ అండ్ ఫర్గెట్. బట్ డు నాట్ ఫర్గెట్ టు రీడ్......." సడన్ గా మూడాఫ్ అయిపోయింది. మాట్లాడాలనిపించలేదు. విద్యాధమరావుకి ఏదో చెప్పి పంపించేశాను.

నామీద నాకే చికాగ్గా అనిపించింది. అసలింతకీ నే చెప్పేది నేన్నమ్ముతున్నానా? లేదు కదా! మనకి నమ్మకం లేని విషయాల్ని ఎదుటివారికి చెప్పడం ఆత్మవంచన కాదూ? పేజీల కొద్దీ పాఠాల్ని బట్టీయం వేసి పరీక్షలు రాసే విధానానికి నేను పూర్తి వ్యతిరేకిని. ఈ దేశానికి పట్టిన ఈ దరిద్రపు గొట్టు పరీక్షల పధ్ధతి వదిలేదెప్పుడో గదా!

ఇప్పుడు విద్యార్ధుల ప్రతిభని టన్నుల్లెక్కన పెంచి పరీక్షల్లో ప్రధమ స్థానంలోకి నెట్టడానికి వీధికో వ్యక్తిత్వ వికాస నిపుణుడున్నాడు. కానీ పుస్తకాలు వల్లెవేసి పరీక్షల్లో గొప్ప మార్కులు సాధించడం అసలు ప్రతిభే కాదని నా అభిప్రాయం. ఆ విషయం గొంతు పోయ్యేలా అరిచి చెప్పినా వినే వెధవెవ్వడూ కనబడట్లేదు. ఈ రోజుల్లో సుభాషితాలు బోధించడం కూడా ఒక వృత్తిగా మారింది.

నాకు మొదట్నుండీ నీతులు చేప్పేవాళ్ళంటే ఎలర్జీ. ఎదుటి వాడికి నీతులు చెప్పేవాడు వాటిని పాటించడని నా నమ్మకం. తాము పాటించని నీతులు చెప్పడం నీతిబాహ్యమైన విషయం కూడా. యండమూరిని చదివి గురజాడ కబుర్లు చెప్పరాదు. ప్రస్తుతం మన తెలుగు దేశంలో సుభాషితాలు బోధిస్తున్నవారికి కొరత లేదు. విని ఏడవడం మించి మనం చేయగలిగింది లేదు. ఇదంతా ఎందుకు రాస్తున్నానంటే నా 'కౌన్సెలింగు' కూడా ఆ కోవకే చెందుతుంది కాబట్టి.

సరే! అదలా ఉంచుదాం. అందరూ 'ప్రధమ స్థానం పొందడం ఎలా?' అనే రాస్తున్నారు. కానీ అధమ స్థానం వారిని పట్టించుకునేవాడేడి? ఎందుకు లేడు? నేనున్నాను! అందువల్ల ఇప్పుడు నేను 'వెంట్రుక వాసిలో పరీక్ష పాసవ్వడం ఎలా?' అన్న సబ్జక్టుపై కొన్ని టిప్స్ ఇస్తాను. చదివి బొటాబొటి మార్కుల్తో పాసైపోయి చరితార్ధులు కండి.
              
పరీక్షలు రాయటంలో ఒక్కోడిది ఒక్కో స్టైల్. బాగా చదువుకుని మంచి మార్కులు సంపాదించుకునేవాడి గూర్చి మనకనవసరం. వాణ్ని అవతల పెడదాం.ఇప్పుడు మూరెడు చదువుకి బారెడు మార్కులు కొట్టేయ్యడం ఎలా? అన్నది విషయం. అసలిదో ఆర్ట్. పాసుకీ, ఫైలుకీ వెంట్రుకవాశిలో ప్రమాదకరమైన ప్రయాణం సాగిస్తూ.. టి ట్వెంటీ మ్యాచిలోలా చివరి బంతికి గెలిచినట్లు.. చివరాఖరికి పాసై బయటపడటం అనేది ఒక గొప్ప విద్య.

మనం ముందుగా అధ్యాపకుల సైకాలజీ విశ్లేషించుకోవాలి. ఎక్కువమంది అధ్యాపకుల మనస్సు చిత్తూరు నాగయ్య, గుమ్మడి వెంకటేశ్వరరావుల మేలు కలయిక. అత్యంత ఉదార స్వభావులు. కలలో కూడా ఎవరికీ అపకారం తలపెట్టని బుద్ధిజీవులు. ఈ విధంగా టీచర్ల సైకాలజీ గుర్తుంచుకునిన యెడల తలపెట్టిన కార్యము విజయవంతంగా ముగించ వచ్చును. 
                            
వెనకటొకడు ఆవు పాఠం మాత్రమే చదువుకుని పరీక్షల కెళ్ళేవాట్ట. ఏ ప్రశ్నకైనా తనకి తెలిసిన ఆవుపాఠం మాత్రమే రాయాలని డిసైడయిపొయ్యాడు. రైలు గూర్చి రాయమంటే.. రైలు, రైలు పక్కన ఆవు, ఆవు తెల్లగానుండును, ఆవు పాలిచ్చును. అని ఆవు పాఠం రాసేసేవాడు. వృక్ష ప్రయోజనాలు రాయమంటే.. 'వృక్షము, పక్కనే ఆవు, ఆవు తెల్లగానుండును.' అంటూ మళ్ళీ తన ఆవు పాఠం రాసేవాడు. అనగా.. ప్రశ్న ఏదైనా సమాధానం మాత్రం ఒకటే!

చాలామంది ఈ ఆవుకథని ఒక జోకుగా భావిస్తారు. కానీ నాకు ఈ కథలో ఒక గొప్ప జీవితసత్యం కనిపిస్తుంది. ఇప్పుడు మీ సబ్జక్టులో మీకు నచ్చిన ఏవైనా నాలుగైదు ప్రశ్నలకి సమాధానాలు క్షుణ్ణంగా చదువుకోండి. ఓపికుంటే ఒకట్రెండు స్లిప్పులు రాసుకుని దాచుకోండి. ఇన్విజిలేటర్ కరుణామయుడైనట్లైతే ఈ స్లిప్పులే ఆదుకోగలవు. ఇప్పుడిక మీ ఆవు పాఠం రెడీ!
                    
మీరు ప్రశాంత చిత్తంతో పరీక్షా హాల్లోకి అడుగు పెట్టవలెను. పెద్దగా చదివి చచ్చింది లేదు కాబట్టి ఎలాగూ టెన్షన్ ఉండే అవకాశం లేదు. ప్రశ్నాపత్రాన్ని ఒకటికి రెండుసార్లు శ్రద్ధగా చదవవలెను. ఇప్పుడు చంద్రబాబు ఇంకుడు గుంట, రాజన్న జలయజ్ఞం స్థాయిలో ఒక ప్రణాళిక వేసుకోవాలి. రాయాల్సిన సమాధానాల్ని మనసులోనే మూడు సెక్షన్లుగా విభజించుకోవాలి.

సెక్షన్ 1.

ఇది సమాధానాలు బాగా తెలిసి చక్కగా ఆన్సర్లు రాయగలిగిన సెక్షన్. ఈ సెక్షన్లో చక్కగా, నీటుగా రాసెయ్యాలి. ఎప్పుడు కూడా మనకి బాగా తెలిసిన ఆన్సర్లతోనే పరీక్ష రాయడం మొదలెట్టాలని గుర్తుంచుకోవాలి. దురద్రుష్టవశాత్తు.. మనకీ సెక్షన్ అతి చిన్నది. దిగులు చెందకు. సాహసమే నీ ఊపిరిగా ముందుకు (తరవాత ప్రశ్నకి) సాగిపొమ్ము. ఒక్క ప్రశ్నకి సమాధానం తెలిసినా చాలు. కానీ ఓపెనింగ్ మాత్రం అద్దిరిపోవాలి.   
                    
సెక్షన్ 2.

ప్రశ్న అర్ధమవుతుంది. ఆన్సర్ మాత్రం పూర్తిగా గుర్తు రాదు. గుర్తొచ్చినా.. అది పరిమాణంలో తెలుగు సినిమా కథలా కొంచెంగా మాత్రమే ఉంటుంది. అందువల్ల ఆన్సర్లు కూడా.. కాళ్ళు, కళ్ళు లేని మనిషి బొమ్మ గీసినట్లుగా రాసెయ్యాలి. అయితే పేపర్ కరెక్ట్ చేయు పెద్దమనిషి అమాయకుడు. 'పాపం! ఈ కుర్రాడెవడో క్వశ్చన్ సరీగ్గా అర్ధం చేసుకోలేకపొయ్యాడు. కానీ వీడికి ఆన్సర్ తెలుసు. తెలిసినా ఎందుకో సరీగ్గా రాయలేకపోయాడు.' అనే భావనతో మార్కులు వేసేస్తారు.

ఈ రకంగా రాయడం పేపర్ దిద్దే వ్యక్తిని మోసం చెయ్యడం అవదూ? ఆహా! ఎందుకవదు? ఇది ఖచ్చితంగా మోసం చెయ్యడమే. కానీ.. అట్లాంటి గిల్ట్ ఫీలింగ్స్ మనసులోకి రానీయకు. నథింగ్ పెర్సనల్. ఇదంతా ఆటలో భాగం. పరీక్ష పాసవ్వడమే నీ తక్షణ కర్తవ్యం. అంతలోనే మర్చిపోయ్యావా? 
                              
సెక్షన్ 3.

ఈ సెక్షన్ అతి ముఖ్యమైనది. అస్సలు అర్ధం కాని ప్రశ్నలు ఈ సెక్షన్లోనే ఉంటాయి. ఈ సెక్షన్ విడియో గేమ్ లో లాస్ట్ స్టేజ్ వంటిది. ప్రశ్నకి సమాధానం కనీసం ఏ చాప్టర్లో ఉంటుందో కూడా తెలీదు. ఇప్పుడు మనం అతి జాగ్రత్తగా మన ఆవుకధని బయటకి తీసి రాయటం మొదలెట్టండి. సాలెపురుగు దారం మందాన సమాధానానికి, ప్రశ్నకి లంగరు వెయ్యండి. 
                            
ఈ ఆవుకధ సమాధానం రాయటంలో అండర్ కరెంట్ గా 'బాంచెన్! కాల్మొక్తా', 'అనాధ రక్షకా! పాహిమాం పాహిమాం' అని ఆర్తనాదాలు చేస్తూ మన దీనావస్థని ప్రదర్శిస్తున్నట్లుగానూ.. 'అయ్యా! మాదాకబళం తండ్రీ' అంటూ ముష్టెత్తుతున్నట్లుగానూ ద్వనింపచేయటం మంచిది. ఇక్కడ మన దురవస్థని ఎంత బాగా ప్రజంట్ చెయ్యగలిగితే అంత గిట్టుబాటు. అందుకే ఈ మూడో సెక్షన్ రాసేముందు మూడ్ కోసం 'నడిపించు నా నావా' మరియూ 'గాలివానలో వాననీటిలో' వంటి స్పూర్తిదాయకమైన పాటలు మనసులో పాడుకోండి.  
                    
ఆచార్యులవారు మన పేపర్దిద్దటం మొదలెట్టిన మొదట్లో ఎవడో distinction గాడి పేపేర్ దిద్దుతున్నానుకుంటారు. వారినలా అనుకోనిద్దాం. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. ఆయనగారి దిద్దుడు సెకండ్సెక్షన్లోకి వచ్చినప్పుడు 'పాపం చాలా మంచి స్టూడెంట్ ఇలా తికమక పడ్డాడేమిటి?' అనే అశ్చర్యంతో మార్కులు వేస్తారు. చివరి సెక్షన్ కొచ్చేసరికి మన అసలు రంగు బయట పడుతుంది. మన సినేమా కబుర్లు చదివి.. ఈ దరిద్రుడికి సత్తా లేదనీ, సత్తు రూపాయ్ గాడనీ అర్ధమైపోతుంది. కానీ అప్పటికే రెండోసెక్షన్లో ఉదారంగా మార్కులేసేసి ఉండటం చేత.. తను మోసపోయినందుకు పిచ్చికోపం వస్తుంది .  
                          
మిత్రులారా! మరొక్కసారి చెబుతున్నాను. అనాదిగా ఉపాధ్యాయులు ఉత్తములు, దయామయులు, కరుణా స్వరూపులు, సహృదయులు, ధర్మప్రభువులు. వారి కోపం పాలపొంగు. వీడి ఆవుకధకి గుండుసున్నా వేసి విసిరికొడదాం అనుకుంటూనే.. అప్పటిదాకా మనం స్కోర్ చేసిన మార్కులు చూస్తారు. పాసుమార్కులకి కూతవేటు దూరంలో.. సరిహద్దు గాంధీ వలే పారాడుతూ ఉండుట గమనించి ఆలోచనలో పడతారు.

'ఇంకొన్ని మార్కులు.. తృణమో, పణమో' అంటూ జిడ్డుమొహంతో, బిక్షాపాత్రతో వీధులంట తిరిగే దీనబిక్షువు వలే తచ్చాడుతున్న మన దురవస్థకి జాలిపడి 'యూజ్ లెస్ ఫెలో, ఈడియట్, యు డొంట్ డిజర్వ్ టు బి పాస్డ్' అని విసుక్కుంటూ పాసుకి అవసరమయ్యే దోసెడు మార్కులు.. మన ఆవుకధకి వేస్తారు.  
                      
ఏం పర్లేదు, ఫీలవ్వకండి. మనని వాళ్ళెంత తిట్టినా మనక్కావాల్సింది పాసవ్వటం. పైగా.. మనకి వాళ్ళ తిట్లు అర్దమయ్యేంత ఇంగ్లీషు రాదు కాబట్టి.. వాళ్ళ తిట్లు వాళ్ళదగ్గరే ఉండిపోతాయి, మన మార్కులు మనకి పడిపోతాయి. అమ్మయ్య! ఇప్పుడు మీరు పాసైపొయ్యారు. రిలాక్స్! హాయిగా సెకండు షో సినిమాకెళ్లి, అన్నం తిని బబ్బొండి.

ఉపసంహారం :

'భలే చెప్పావు. నీ జ్ఞానాన్ని బిందెల కొద్దీ బోర్లించావు. టిప్పులు బానే ఉన్నాయి. థాంక్స్! ఇన్ని నీతులు చెప్పిన నువ్వు, విద్యాధమరావుకి ఫీజు వాపసు ఎందుకివ్వలేదు?'

'అయ్యా! నేనిందాకే మనవి చేసుకున్నాను. ఒక్క డబ్బు విషయంలో తప్ప అన్ని విషయాల్లో నేను నిప్పులాంటి మనిషినని. పోస్టు ముందొక మాటా, వెనకొక మాట చెప్పే నిలకడలేని మనిషిని కాదు. ఫీజు వాపసిచ్చేసి నా కఠోర నియమాన్ని వదుకోలేను.'  
(pictures courtesy : Google) 

27 comments:

  1. పరీక్షల మీద ఎడతెగని దండయాత్ర చేసే బడుగు, బలహీన, వెనకబడిన విద్యార్థులంటే... మీకు ఎంత ప్రేమ, జాలి, దయ! గొప్ప సలహాలిచ్చారండి. NCERT వాళ్లతో మాట్లాడి దీన్ని సిలబస్సులో పెట్టిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఎలాగూ రాష్ట్రంలో ఉద్యమ వాతావరణం మాంచి వేడిమీద ఉంది కాబట్టి ప్రాంతాలకతీతంగా విద్యార్థి జాక్ నాయకులతో మాట్లాడి ఈ డిమాండ్ లేవదీసి సఫలీకృతం కావచ్చు. నిప్పులాంటి మనుషుల్ని ప్రోత్సహించి కాపాడుకోవడం బ్లాగర్ల గురుతర బాధ్యత. :-)

    ReplyDelete
    Replies
    1. పరీక్షల్లో వెనకబడ్డవాడు గొప్పమేధావని నా అభిప్రాయం.

      అయినా ఇవన్నీ సీక్రెట్లండి. మీరిలా పబ్లిక్ చెయ్యరాదు. :)

      Delete
  2. ఛాలా బాగ సెలవిచ్చారు (అంటే చెప్పారని అర్థం, అంతే కానీ పరీచ్చలైపొయాయి ఇంక ఇంటికెల్లి బబ్బో అని కాదు).

    కానీ చిన్న చిక్కు ఉంది ఇక్కడ. మాది మొత్తం ఆఖరు ప్రశ్న బాచ్చి. ఇప్పుడెలా డాక్ట్రారూ..

    సమాధానానికి చెప్పినా చెప్పకున్నా పారితోషికం మాకు అప్పిచ్చారనుకోండి. (ఆప్పిచ్చువాడు వైద్యుడు మరి)

    నా పేరు
    సీతారామం

    ReplyDelete
    Replies
    1. సీతారామం గారు,

      బహుకాల కామెంట్దర్శనం. బాగున్నారా?

      మీది చిన్న చిక్కు కాదు, పెద్ద చిక్కే! గట్టిగా ఆలోచించవలసిన తీవ్రమైన చిక్కు కూడా. మళ్ళీ అప్పంటూ భయపెడుతున్నారాయే. మా సుబ్బూనడిగి సమాధానం చెబ్తాను. :)

      Delete
    2. ఏదొ తమవంటి వారి (వైద్యుల) దయ లేకపోవటంచేత కుశలమేనండీ. నన్ను బాగా గుర్తుపెట్టుకున్నందుకు కృతజ్ఞతలు.
      నా పేరు
      సీతారామం

      Delete
  3. గురువుగారికి నమస్కారములు మంచి పోస్ట్ చేసారు సూపర్ సార్
    నవ్వలేక కడుపు నొప్పి వచ్చింది . కానీ మంచి నిజం చెప్పరు

    ReplyDelete
    Replies
    1. ఈ ట్రిక్కులు వాడి నేనింతవాడినయ్యాను. నా జ్ఞానాన్ని భావితరానికి అందించాలని ఈ పోస్టు రాసితిని. :)

      Delete
  4. సార్... ఇంత మంచి పోస్టును తొందరపడి ఈ డిసెంబరులోనే ఎందుకు రాశారు సార్. దయచేసి మాలాంటి వాళ్ల కోసం ఒక పని చేయండి. ఈ పోస్టును బాగా ప్రిసైజ్ చేసి ఒక సగాన్ని ఐదు మార్కుల ప్రశ్నకు ఆన్సర్ సైజలోనూ, మరో పావు భాగాన్ని బిట్ పేపరు ఆన్సర్ల తరహాలోనూ, ఇంకో పావు భాగాన్ని ఫిలప్ ద బ్లాంక్స్ గానూ (కుండలీకరణాల్లో ఆన్సర్లతో సహా) మార్చి నెలలో ఇవ్వగలరు. మంచి గైడ్ లాంటి మీ పాఠాన్ని తప్పక బట్టీ పట్టగలం.
    ఇట్లు,
    యాసీన్ ఇ. (మా ఇంటిపేరు ఎనకబెంచీ. జస్టిఫికేషన్ కోసం ఎప్పుడూ ఇంటి పేరు ఎనకే రాస్తుంటా)
    పీఎస్ : ఇ ఫోష్ఠు లో థప్పుంలుటే క్షమిచ్చగల్లరు

    ReplyDelete
    Replies
    1. ఇ యాసీన్ గారు,

      మీ ఇంటిపేరు ముందుకు తీసుకొచ్చాను. అట్లే మిమ్మల్నీ చదువులో ముందుకు నెట్టటానికి ప్రయత్నిస్తాను. :)

      (గైడ్ కోసం ఎదురు చూస్తూ ఉండండి.)

      Delete
  5. పోష్టు అమోఘం! కానీ ఇప్పుడు వాడే స్కాంట్రాన్లకిది వర్తించదేమో?

    ReplyDelete
    Replies
    1. ఇప్పుడు టెక్నాలజీ అంతలా మారిపోయిందా మిత్రమా?

      (ఇక్కడ మనవాళ్ళు మాత్రం essay questions రాస్తూనే ఉన్నారే!)

      Delete
  6. మై డియర్ రమణ,
    నీవు వ్రాసినది అక్షర సత్యం. లోక జ్ఞానం ఇవ్వని చదువు సుధ్ధ దండగ. నా మటుకు నేను నీవు వ్రాసిన మూడు సెక్షన్ల ప్రకారమే పరీక్షలు వ్రాసి ప్రస్తుత స్థితిలో ఉన్నా. పూర్వం(మనం చదువుకున్న రోజులు) విద్యార్ధులకు కొంత లోక జ్ఞానం కలిగించేవి గా ఉన్నాయి. కానీ ఇప్పుడో ఏదో ప్రొఫెషనల్ కోర్సు వాళ్ళు తప్ప ఆర్డినరి డిగ్రీ చదివిన వాళ్ళు లోక జ్ఞానం లేక భారంగా జీవితాన్ని ఈడుస్తున్నారు.

    ReplyDelete
    Replies
    1. ఇప్పుడు professional courses వాళ్ళు కూడా గైళ్ళే చదువుతున్నార్ట!

      Delete
  7. సార్‌! మీరేలాగు కౌన్సిలింగ్‌ ఇస్తూన్నట్లున్నారు. నాకు '' డబ్బు ఎలా సంపాదించడం? '' అనే సీక్రెట్‌ తెలియదు. అంతటి వ్యక్తిత్వ వికాసం లేదు. బాబ్బాబు ఆ వ్యక్తిత్వ వికాసం ఇచ్చి కాస్త పున్నెం కట్టు కొండీ సార్‌! పీజు కావాలంటారా? అది లేకనే కదా ఆ వికాసాన్ని అందివ్వమనేది.
    '' అందరూ 'ప్రధమ స్థానం పొందడం ఎలా?' అనే రాస్తున్నారు.'' అందరూ ప్రధమ స్తానానికి పోతే మరి అధమ స్థానం లో ఎవరుంటారండి ? ఓ! నాలాంటి ఏదో ఒక వ్యక్తిత్వ వికాసం లేని వారు ఉంటారన్నమాట. అయినా బలే టిప్స్‌ ఎచ్చారు. ధన్యవాధలు సార్‌!

    ReplyDelete
    Replies
    1. అయ్యా తిరుపాలు గారు,

      "డబ్బు ఎలా సంపాదించడం?" అన్నది తెలీకనే నేను బ్లాగులు రాస్తుంది. :)

      డబ్బు విషయంలో నాకు కఠిన నియమం ఉందని ఆల్రెడీ రాశాను. అయినా మీరు ఫ్రీ కౌన్సిలింగు అడుగుతున్నారు. ఇదేం బాలేదు. :)

      Delete
  8. ఎప్పట్లాగే మీ మార్కు అద్భుత:. పోస్టు ఆద్యంతం చమక్కులే.

    "పాసుమార్కులకి కూతవేటు దూరంలో.. సరిహద్దు గాంధీ వలే పారాడుతూ ఉండుట గమనించి ఆలోచనలో పడతారు"'....
    అలాంటి ఆలోచనలతోనే ఇంటికొచ్చిన తర్వాత కూడా తెగ మథన పడిపోయేవారు మా నాన్నగారు. గఫార్‌ ఖాన్‌లని ముందుకి లాగలేక... లాగకుండా ఉండలేక... ఎలాగోలా ఏదో ఒకటి చేసి గట్టెక్కించే వారు. తర్వాత వారం రోజులు గింజుకుంటూ ఉండేవారు.. "అయ్యో పాపం, ఫెయిలైతే వాడికి ఎలాంటి కష్టాలు చుట్టుముడతాయో'"అనుకుంటూ...

    ReplyDelete
    Replies
    1. మీ నాన్నగారి జ్ఞాపకాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు.

      మనని ఎలాగైనా సరే గట్టెక్కించాలనుకున్న గురువర్యులకి ప్రణామములు.

      Delete
  9. ఇలా కూడా పరీక్షలు రాయొచ్చని తెలీక నేను చాలా కష్టపడ్డానండీ!!!!!

    ReplyDelete
    Replies
    1. తప్పదు.. తెలివి లేనప్పుడు కష్టపడక తప్పదు! :)

      Delete
  10. నమస్కారమండీ! ఇంత అలవోకగా సూపర్ సూపర్ పోస్ట్స్ ఎలా రాయగలుగుతున్నారో కూడా వివరిస్తూ ఓ పోస్ట్ రాసేయకూడదటండీ?

    ReplyDelete
    Replies
    1. ఒహో అలాగే! మళ్ళీ దానికింకో పోస్టెందుకు? చెప్పేస్తున్నా వినండి.

      పోస్టు రాద్దామనుకున్నప్పుడల్లా తల గోడకేసి బాదుకుంటాను. కళ్ళ ముందు నక్షత్రాలు ప్రత్యక్షమౌతాయి. ఆపై మంచి ఐడియాలొస్తాయి! :))

      Delete
    2. హహ్హహహ మీరు చెప్పారు కదా అని ప్రయత్నించానండీ.. తల బొప్పి కట్టింది కాని ఐడియా రాలేదు! :P

      Delete
  11. బాగా వ్రాశారు. సెలబ్రిటి, లెజెండ్ లాగా; సుభాషితాలకు, ప్రవచనాలకు తేడా ఏమిటి?

    ReplyDelete
    Replies
    1. రెండూ వినేది వెర్రివెధవలే! అంచేత తేడా ఏం లేదు.

      Delete
  12. భలే ఉన్నాయి మీ ట్రిక్కులు ..మా అమ్మాయి ఓ కార్పోరేట్ కాలేజ్ లో చదువుతుంది .ఎవరో సార్ పరిక్షలప్పుడు ఇంచుమించుగా ఇలాంటివే చెప్పారట .

    ReplyDelete
    Replies
    1. ఈ పరీక్షలనే కొండ పైకి.. పూర్వం నాలాంటివారు అనేక కష్టాలు పడి ఒక చిన్న బాట వేశారు. తదనంతరం ఆ బాటలో అనేకమంది నడుటచే.. అదిప్పుడందరికీ ఒక పెద్ద రోడ్డుగా మారిపోయింది. :)

      Delete
  13. చాలా చాలా బాగుంది...మీ బ్లాగులు పుస్తకంగా అచ్చై వచ్చినప్పుడు...ఇది అందులో ఉండాలని నా కోరిక.
    దీనినే ముందు చదువుతాను ప్రతీ సారీ ఆ పుస్తకంలో...
    మీ ప్రభావంతో...నాకెందుకింత నచ్చిందని విశ్లేషించుకున్నా...ఇంకేందుకో కాదండీ...నేను నా చదువు అలాగే నేట్టుకోచ్చేసాను...ఇది 'నా రహస్యం'అనుకున్నాను ఇన్నాళ్ళూ ...మీరు బయట పెట్టేసారు.

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.