Monday 16 December 2013

అపరిచితురాలు

వారిద్దరు భార్యాభర్తలు. అతనికి నలభైకి పైన, ఆవిడకి నలభైకి  లోపుగా వయసుంటుంది. అతనేదో కాలేజిలో పని చేస్తున్నాట్ట. ఆవిడ ఇంటి భార్య ('హౌస్ వైఫ్' కి అచ్చ తెలుగు.. అనగా డబ్బు సంపాదన లేని భార్య అని అర్ధం). పదో క్లాసు పాసైందిట. బొద్దుగా, పొట్టిగా, ఎర్రగా ఉంది. సంప్రదింపు రుసుము (కన్సల్టేషన్ ఫీజ్) రసీదు ఆవిడ పేర ఉన్నది కాబట్టి ప్రస్తుతం ఆవిడ నా పేషంట్.

ఇద్దరూ గదిలోకి వచ్చాడు. భర్త మాట్లాడ్డం మొదలెట్టాడు. భార్యని తనెంత అపురూపంగా చూసుకుంటున్నది.. పెళ్ళైన తరవాత ఒక్కరోజు కూడా భార్యని వదలకుండా ఏవిధంగా ఉండలేనిదీ.. కాలేజిలో ఉన్నాకూడా అనుక్షణం భార్య గూర్చే ఎంత తీవ్రంగా ఆలోచించేదీ.. వైనంగా చెబుతున్నాడు.

భర్త ప్రేమని అపారంగా పొందుతున్న ఆ భార్యామణి అసలు తలే పైకెత్తట్లేదు. బహుశా రోజూ భర్త చూపిస్తున్న టన్నుల కొద్దీ ప్రేమ బరువు మొయ్యలేక మెడ ఒంగిపోయ్యుంటుంది. నాకు చికాకేసింది. ఆయన భార్యని ఆయన ప్రేమించుకోవడంలో విశేషమేముంది! అదీగాక నాకెందుకో భార్య పట్ల బహిరంగంగా ప్రేమ ప్రకటించేవాళ్ళు నమ్మదగ్గ వ్యక్తులుగా అనిపించరు. అటువంటివాళ్ళు అమాయకులైనా అయ్యుండాలి లేదా అబద్దమైనా చెబుతుండాలి అంటాడు మా సుబ్బు. 

"ఇంత ప్రేమగా చూసుకుంటున్నా ఎందుకనో నా భార్య దిగులుగా ఉంటుంది. అప్పుడప్పుడూ ఏడుస్తుంటుంది." అంటూ దిగులు చెందుచూ తన వాక్ప్రవాహాన్ని ఆపాడు. అమ్మయ్య! వర్షం వెలిసినట్లైంది.

ఆవిడ తల పైకెత్తలేదు. పాపం! మరీ మొహమాటస్తురాల్లా ఉంది. నేనావిడ బిడియం పోగొట్టడానికి కొన్ని జెనరల్ ప్రశ్నలు అడిగాను. ఆవిడ తల దించుకునే ముక్తసరిగా సమాధానాలు చెప్పింది.

గదిలో కొద్దిసేపు నిశ్శబ్దం.

"మావారు నన్ను చాలా బాగా చూసుకుంటారు. అయినా.. ఎందుకో దిగులు." ఉన్నట్లుంది అన్నది.

వెంటనే భర్త అందుకున్నాడు.

"అదీ అలా చెప్పు. భయపడకుండా చెప్పాలి. చెప్పు. ఇంకా చెప్పు. డాక్టర్ల దగ్గర ఏదీ దాచకూడదు. నీ మనసులో ఉన్నదంతా చెప్పు.. చెప్పెయ్యి.. చెప్పు" అంటూ ఆవిడని హడావుడి చెయ్యసాగాడు.

నాకు అతని ధోరణి చికాగ్గా అనిపించింది. తెలుగు సినిమాలో కేరక్టర్ ఆర్టిస్టులా ఒకటే మాట్లాడేస్తున్నాడు. ఇతగాడు గదిలో ఉండగా మరొకళ్ళకి మాట్లాడే చాన్స్ ఇవ్వడని అర్ధమైపోయింది.

"మీ భార్యతో పర్సనల్ గా మాట్లాడాలి. ఓ రెండు నిమిషాలు బయట వెయిట్ చేస్తారా?" అన్నాను భర్తతో.

భర్త షాక్ తిన్నాడు. నమ్మశక్యం కానట్లుగా మొహం పెట్టాడు. కేబినేట్ మీటింగు మధ్యలో ముఖ్యమంత్రిని బయటకి పొమ్మన్నప్పుడు కూడా ఇంతలా ఫీలవ్వడేమో!

ఆవిడ కంగారు పడిపోసాగింది.

"ఏవండీ! మీరు బయటకి వెళ్ళకండి. డాక్టరు గారు! మా ఆయన దేవుడు. నా దిగులు తగ్గడానికి మందు రాయండి. చాలు. అంతేగానీ వారిని బయటకి పంపకండి." అని దీనంగా బ్రతిమాలుతున్నట్లుగా అంది.

భార్య దీనావస్థకి భర్త మిక్కిలిగా సంతోషించసాగాడు.

"నా పద్ధతులు నాకున్నాయ్. మీ ఆయన బయటకెళ్ళేది రెణ్ణిమిషాలే కదా. మీరు సహకరించాలి." అన్నాను.

అతను ఒక క్షణం ఆలోచించాడు. తరవాత ఆవిడ చేతిని మృదువుగా నొక్కాడు.

"భయపడకు. డాక్టరు గారు అడిగినవాటికి ధైర్యంగా చెప్పు. బయట వెయిట్ చేస్తాను." అంటూ భార్యకి ధైర్యం చెప్పాడు. 

నాకేసి అదోరకంగా చూస్తూ తలుపు తెరుచుకుని బయటకి వెళ్ళిపొయ్యాడు. స్ప్రింగ్ డోర్ అతని వెనక మూసుకుపోయింది.

ఆవిడ ఒక క్షణం ఆగి డోర్ వైపు అనుమానంగా చూస్తూ లోగొంతుకతో అడిగింది.

"మన మాటలు బయటకి వినబడతాయా?"

"మీరు గట్టిగానే మాట్లాడవచ్చు. మన మాటలు బయటకి అస్సలు వినబడవు." అభయ హస్తం ఇచ్చాను.

ఆవిడ ధోరణి ఒక్కసారిగా మారిపోయింది.

"డాక్టరు గారు, నాలాంటిది బ్రతికి ప్రయోజనం లేదు.. భూమికి భారం తప్ప. ఏదో పిల్లలు అన్యాయం అయిపోతారని చావలేక బతుకుతున్నా. నేనేదో మహా పాపం చేసుకునుంటాను.. ఈ దరిద్రుడు భర్తగా దొరికాడు. నేను నిల్చున్నా అనుమానమే, కూర్చున్నా అనుమానమే. నీడలాగా వెంటే తిరుగుతుంటాడు. మెత్తగానే మాట్లాడతాడు.. కత్తితో కండ కోసినంత బాధగా ఉంటుంది. కనీసం ఒక మంచి చీర కట్టుకున్నా ఓర్చుకోలేడు. నాకు అమ్మానాన్న లేరు. ఉన్న ఒక్క అన్నయ్య పరిస్థితి అంతంత మాత్రం. గతిలేక రోజూ ఏడ్చుకుంటూ కాపురం చేస్తున్నాను." అంటూ నిశ్సబ్దంగా రోదించసాగింది.

నేనావిడని కొద్దిసేపు అలాగే ఏడవనిచ్చాను.

"అర్ధమైంది. మరి మీ ఆయన ముందు అలా చెప్పారేం?"

"అలా చెప్పకపొతే ఇంటికెళ్ళాక విపరీతంగా సాధిస్తాడండి. ఇప్పుడైనా తన గూర్చి మీకేమైనా చెప్పేస్తున్నానేమోనని వణికి చస్తుంటాడు. మీకు దణ్ణం పెడతాను. నేనిలా చెప్పానని మాత్రం ఆయనకి చెప్పకండి." అర్దిస్తున్నట్లుగా అంది.

"డోంట్ వర్రీ. మీరు చెప్పినవన్నీ మనిద్దరి మధ్యే ఉండిపోతాయి. అతన్నిప్పుడు పిలుస్తున్నాను." కాలింగ్ బెల్ మీద వేలు ఉంచి అన్నాను.

"ఒక్క క్షణం." అంటూ కర్చీఫ్ తో కళ్ళు, ముక్కు తుడుచుకుని, జుట్టు సరిచేసుకుంది. పిమ్మట 'ఓకే' అన్నట్లు సైగ చేస్తూ తల దించుకుంది.

కాలింగ్ బెల్ నొక్కాను. నర్స్ భర్తని లోపలకి పంపింది.

భర్తని చూడంగాన్లే భార్య భయం భయంగా బిత్తర చూపులు చూస్తూ బేలగా "ఏమండి! వద్దంటున్నా బయటకి ఎందుకెళ్ళారండీ? మీకు తెలీకుండా చెప్పడానికి నాదగ్గరేముంటుందండి?" అన్నది.

తన భార్య అమాకత్వాన్ని చూసి భర్త తృప్తిగా, సంతోషంగా తలాడించాడు.

"మనిద్దరి మధ్యా ప్రేమ తప్ప మరేదీ లేదని నీకు తెలుసు, నాకు తెలుసు.. కానీ - డాక్టర్లకి తెలీదుగా! అందుకే నన్ను వెళ్ళమన్నారు, నేను వెళ్లాను. నువ్వేం ఫీలవకు." అంటూ మళ్ళీ మృదువుగా భార్య చెయ్యి నొక్కుతూ నావైపు విజయ గర్వంతో చూశాడు.

చిన్నగా నవ్వుకున్నాను. ఇతగాడికి అసలు సంగతి తెలిస్తే గుండాగి ఛస్తాడేమో! ఆవిడ నటనా కౌశలాన్ని మనసులోనే మెచ్చుకున్నాను. నాకిప్పుడు శంకర్ తీసిన 'అపరిచితుడు' సినిమా జ్ఞాపకం వస్తుంది. నా ఎదురుగా కూర్చునున్నది ఒక అపరిచితురాలు!

చివరి తోక :

ఎవరినీ ఉద్దేశించి రాసింది కాదు. 100% కల్పితం.

(picture courtesy : Google) 

21 comments:

  1. పేర్లు చెబితే సంసారాలు కూలిపోతాయి. ఎంతమంది పత్రివ్రతలో!

    ReplyDelete
  2. డాక్టర్ గారూ రసీదు ఎవరి పేరు మీద ఉన్నా మందు మాత్రం రోగికే ఇవ్వండి.

    ReplyDelete
    Replies
    1. జ్యోతిర్మయి గారూ... ఇక్కడ రోగి భర్తేనండి......దహా.

      Delete
  3. నేను అమాయకుడ నేనండీ.......దహా.

    ReplyDelete
  4. ఏమాటకామాట చెప్పుకోవాలండీ. మీరు 100% కల్పించి రాసినా, చాలా ఇళ్ళల్లో జరుగుతున్నదే ఇది. ఈ మధ్యే తెలుసుకున్నాను.

    ReplyDelete
  5. "ఇతగాడికి అసలు సంగతి తెలిస్తే గుండాగి ఛస్తాడేమో!"

    అతను చావటం సంగతి దేవుడెరుగు, తెలీకుండానే అంత కాల్చుకుతిన్నవాడు, తెలిస్తే ఇంకేం చెస్తాడో????

    ReplyDelete
  6. మీ సుబ్బు గారి మాటల్లో వంద శాతం నిజముందండీ!

    ReplyDelete
  7. ఎవరినీ ఉద్దేశించి రాయక పోయినా, మీరు ఉద్దేశింది స్త్రీలనే నని మాకు తెలుస్తుంది లెండీ. పైన అమె ఎవరో చెప్పారుగా. అయినా అంతర్లీనంగా మీ సుబ్బు లేక పొతే జీవిత సత్యాలు బయట పడవేమో నండీ!

    ReplyDelete
  8. మిత్రులకి ఒక మనవి.

    హాస్పిటల్లో నా అనుభవాల్ని (నా profile తో) ఇలా రాయడం professional ethics కి వ్యతిరేకమేమో అనే అనుమానం నాకుంది.

    అందుకనే అప్పుడప్పుడు సరదాగా ఒకట్రెండు రాసినా disclaimers తోనే రాస్తున్నాను.

    ReplyDelete
    Replies
    1. I think it is acceptable as long as you don't provide info that can lead to identification. Having said this, it is better to avoid recent cases to eliminate problems (e.g. the husband reads the blog & finds the truth).

      Delete
  9. రమణ గారు,
    ప్రొఫెషనల్ ఎథిక్స్ అది ఇది అని, మీరు మరీ సీరియస్ గా తీసుకొంట్టున్నారు. ఈ కథలో కొత్త దనమేమి లేదు. మీరు రాయటమే ఆశ్చర్యం అనిపించింది :)

    ReplyDelete
  10. On a related but different note,
    నాకు ఇంకా, కనపడ్డ ప్రతి స్త్రీని చెల్లెలని వర్ణిస్తూ, "ఏమ్మా, బాగున్నావా?" అంటు తలా భుజాలూ ఆప్యాయంగా నిమురుతూ మాట్లాడే మగవాళ్ళని కూడా చచ్చినా నమ్మొద్దనిపిస్తుంది. నిజంగా నా భావనని సమర్థించుకోవడానికి నేను సైకియాట్రిస్టుని కానూ, కానీ I feel they are real frauds and dangerous men.
    నాకు ఇంకా, కనపడ్డ ప్రతి స్త్రీని చెల్లెలని వర్ణిస్తూ, "ఏమ్మా, బాగున్నావా?" అంటు తలా భుజాలూ ఆప్యాయంగా నిమురుతూ మాట్లాడే మగవాళ్ళని కూడా చచ్చినా నమ్మొద్దనిపిస్తుంది. నిజంగా నా భావనని సమర్థించుకోవడానికి నేను సైకియాట్రిస్టుని కానూ, కానీ I feel they are real frauds and dangerous men.
    నవ్వులాటలాగే అనిపించినా మీరు చాలా తీవ్రమైన సమస్య ప్రసావంచారు.
    శారద

    ReplyDelete
    Replies
    1. I guess by mistake I must have posted my comment twice (in the above comment). Sorry for the nuisance.
      Sharada

      Delete
  11. “డబ్బు సంపాదన లేని భార్య”....ఈ వాక్యం చాలా తప్పు. “డబ్బు సంపాదన లేని భార్య అని కొందరు అనుకొనే భార్య” అని వ్రాసి వుండాల్సింది.
    భార్య చేసే యింటి పనులకు వెల కడితే, ఏ భార్యా కూడా “డబ్బు సంపాదన లేని భార్య” కాదు. (తల్లి, యిల్లాలు పాత్రలు వదిలేసి, ఎందుకంటే ఆ పాత్రలకి ఎవ్వడూ వెల కట్టలేడు)

    ReplyDelete
  12. మిత్రులారా,

    సైకియాట్రీ ప్రాక్టీస్ కొంచెం విభిన్నంగా ఉంటుంది. వ్యక్తులతో పెర్సనల్ గా మాట్లాడటం అనేది మెడికల్ సైన్స్ లో ఇంకే విభాగంలో ఉండదు.

    ఇట్లాంటి పోస్టులు రాయడం వల్ల.. ఇవ్వాళ చదివినవారు.. (భవిష్యత్తులో సైకియాట్రిస్టుని కన్సల్ట్ చేస్తే) లోపల డాక్టర్తో మాట్లాడుతున్న తమ కుటుంబ సభ్యులు తమ గూర్చి నెగెటివ్ గా చెబుతున్నారేమోననే భావన (అలా చెప్పకపోయినా) బయట ఉండేవాళ్ళకి కలిగే అవకాశం ఉంది.

    వృత్తిగతంగా సైకియాట్రిస్ట్ కి ఎవరి పట్లా నెగెటివ్ భావాలు ఉండవు.. ఉండరాదు. పోస్టు కొంత వ్యంగ్యంగానూ, భర్త పట్ల వ్యతిరేకతతోనూ ఉంది. ఇది తప్పు.

    నేను యాక్టివ్ గా సైకియాట్రి వైద్యం ప్రాక్టీస్ చేస్తూ.. పేషంట్ల గూర్చి, వారి ప్రవర్తన గూర్చి ఎంత bland గా రాసినా.. కరెక్ట్ కాకపోవచ్చు. ఇది వారిని ఎగతాళి చేస్తున్నట్లుగా కూడా ధ్వనించవచ్చు.

    ఇంత సందేహిస్తూ ఎందుకు రాయడం?

    ఒకానొక సమయంలో ఒక flow లో (ఆర్నెల్ల క్రితం) ఈ పోస్ట్ రాసేశాను. పబ్లిష్ చెయ్యాలన్న temptation ఇన్నాళ్ళకి నన్ను జయించింది. ఇకముందు సైకియాట్రీ ఇంటర్వ్యూలకి సంబంధించిన పోస్టులు రాయకుండా ఉండడానికి ప్రయత్నిస్తాను.

    ReplyDelete
  13. మీ పోస్టులో ఒకరే పేషెంటుగాని, కామెంట్లు మాత్రం ఎంతమంది పేషెంట్లనుండి వచ్చాయో!

    ReplyDelete
  14. If you want you can move it back to draft state so that it will not visible to public.

    ReplyDelete
  15. Not related to this topic sir. Thought of sharing this article with you

    How life has changed for Delhi rape victim’s family
    ‘A dream’All that the family is really left with are her memories, the good and the bad. And a dream.Her mother says she remembers how her daughter would talk the night away with her father and her brothers about their hopes for the future. They remember her final hours in the intensive care unit after doctors gave up hope: her brother says the family stood around her bed as “her heart beat slowed, the alarm bells went ringing and the monitors flat-lined”.Her father says he has a dream often.The victim’s brother is studying to become a doctor “She comes in one dream, you know,” he says, his eyes gleaming suddenly, looking at me. “We are in a hotel in a town to see her. She visits us. She stands near me and asks me whether I need money. I tell her, I don’t need any money, just take care of your brothers. And then she vanishes.“She would always tell me not to worry about money. That she would take care of the family.”That is what poverty does to you, the father says. Think about money all the time. Think about whether you have enough money in your pocket to take your daughter’s body home.“When I went to the hospital on the night of 16 December with a friend the doctors told me my daughter would not possibly live beyond a couple of hours. My first thought was how will I take her body home?” he says.“Between the two of us we had 1,000 rupees ($16; £9). Would it be enough to pay for the medicines and the ambulance? She survived the night. Next day a politician came and paid me 25,000 rupees ($405; £250). I felt better. At least I had the money to take her body home if she died. This is what poverty does to you.

    http://www.bbc.co.uk/news/world-asia-india-25344403

    ReplyDelete
  16. you may like this.............
    http://eenadu.net/Cinema/cinemainner.aspx?item=gnapaka

    ReplyDelete
  17. "...భర్త షాక్ తిన్నాడు. నమ్మశక్యం కానట్లుగా మొహం పెట్టాడు..."

    మీరువ్రాసినది ఈ సినిమాలో జరిగినది ఒకే సందర్భం కాదు కాని, గ్రేట్ డిక్టేటర్ సినిమాలో, హిట్లర్ వేషంలో ఉన్న చాప్లిన్ ముస్సోలినీతో ఒంటరిగా మాట్లాడటానికి సౌజ్ఞ చేస్తాడు. హిట్లర్ చెంచా సేనాని ఒకడు ఆ గదిలో ఉన్న అందరినీ బయటకు తోస్తాడు. చివరకు చాప్లిన్ తన చెంచాని కూడా ఔట్ అంటాడు. అప్పుడు ఆ నటుడు తన మొహంలో చూపిన హావ భావాలు గుర్తొచ్చాయి మీరు వ్రాసినది చదవంగానే.

    మీరు ప్రస్తుతం ప్రాక్టీస్ చేసున్న సైక్రియాటిస్ట్ గా మీ వృత్తి పరంగా మీరు చూసే సంఘటనల గురించి వ్రాయకపోవటమే మంచిదని నా సలహా. మీ దగ్గరకు వచ్చే పేషంట్లు బ్లాగు చదివే ప్రమాదం అంతగా లేకపోయినా, చెప్పలేం ఏ తొర్రలో ఏ పామున్నదో. చివరకు, ఎవడో చదివేసి "మనమీదేనర్రోయ్" అని గుండెలు బాదుకుని ప్రచారం చేసే పిచ్చిలో పడితే, మీ ప్రాక్టీసుకే దెబ్బ.

    "ఇకముందు సైకియాట్రీ ఇంటర్వ్యూలకి సంబంధించిన పోస్టులు రాయకుండా ఉండడానికి ప్రయత్నిస్తాను" మంచి మాట అన్నారు. ప్రయత్నించటం కాదు, వ్రాయకపోవటమే మంచిదని నా ఉద్దేశ్యం.

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.