Friday, 27 December 2013

సన్మానాలు - శాలువాలు

ఈ సంవత్సరం 'కొండేపూడి శ్రీనివాసరావు సాహితీ పురస్కారం' ప్రముఖ రచయిత డాక్టర్ వి.చంద్రశేఖరరావుకి లభించిందని చదివి సంతోషించాను.

డాక్టర్ చంద్రశేఖరరావు గుంటూరు మెడికల్ కాలేజిలో నాకు క్లాస్మేట్. ఎనాటమీ డిసెక్షన్లో నా బాడీమేట్ (ఇద్దరం ఒకే శవాన్ని పంచుకున్నాం). ఆరోజుల్లో మంచి స్నేహంగా ఉండేవాళ్ళం. ఇప్పుడీ ముక్కలు ఇక్కడ రాయడం 'చంద్రబాబు నాయుడు నా స్నేహితుడు' అని చెప్పుకోవడం వంటిదని నాకు తెలుసు.

చదువైపొయ్యాక ఆతను రైల్వే ఉద్యోగంలో చేరాడు (రైల్వే భాషలో చెప్పాలంటే - లూప్ లైన్లోకి వెళ్ళాడు). కనుక నాకు అతన్ని కలిసే సందర్భాలు పెద్దగా రాలేదు. ఎప్పుడన్నా కలిసినా మా సంభాషణ 'బాగున్నావా?' మించి పెద్దగా ముందుకు సాగలేదు.

మొన్నామధ్య 'నీ బ్లాగులు చదువుతున్నాను. బాగున్నాయి.' అన్నాడు. నేనైతే నమ్మలేదు. అతనికి నా బ్లాగు చదివేంత తీరిక ఉండదు, పొరబాటున చదివినా నచ్చే అవకాశం లేదని నా నమ్మకం. ఈ పోస్టు చంద్రశేఖరరావు గూర్చి కాదు కనుక అతని ప్రస్తావన ఇంతటితో ఆపేస్తాను.

'అరసం' (అభ్యుదయ రచయితల సంఘం) వారు ఈ నెల 28 న జరిగే పురస్కార సభలో డాక్టర్ వి.చంద్రశేఖరరావుని 10,116 నగదుతో సత్కరిస్తార్ట, శాలువా కూడా కప్పుతార్ట. నాకు ఆశ్చర్యం వేసింది. ఇందుకు కారణాలు రెండు. ఒకటి - 116 అంకె పవిత్రతపై కమ్యూనిస్టులక్కూడా మోజు ఉండటం. రెండు - శాలువాల సంస్కృతి ఇంకా కొనసాగుతుండటం. ఏవిటో.. 'అరసం' పేరులో అభ్యుదయం.. ఆచరణలో మాత్రం సనాతనం.

ఇప్పుడు కొద్దిసేపు శాలువా కబుర్లు చెప్పుకుందాం. పెళ్ళిలో మంగళ సూత్రం ఎంత ముఖ్యమో సన్మానానికి శాలువా కూడా అంతే ముఖ్యం. అసలీ సన్మానాలల్లో శాలువాలెందుకనేది నాకు అర్ధం కాదు. బహుశా శాలువాల వ్యాపారం చేసేవాళ్ళని బాగుచెయ్యడానికేమో!

(ఏదో రాసేసుకుంటూ పోతున్నాను. ఈ శాలువాకి ఏదైనా ఘనచరిత్ర, పరమ పవిత్రత ఉందేమో నాకు తెలీదు. ఉన్నట్లైతే శాలువా ప్రేమికులు నాపై కోపం చేసుకోరాదని విజ్ఞప్తి.)

అసలీ శాలువాల వల్ల ఉపయోగమేమీ?

మా ఊళ్ళో సంవత్సరానికి ఒక్కరోజు కూడా చలి ఉండదు. కావున శాలువా కప్పుకునే అవసరం రానేరాదు. పోనీ రాత్రిళ్ళు నిద్ర పోయేప్పుడు దుప్పటిలాగా కప్పుకుందామా అంటే.. శాలువా గరుగ్గా ఉంటూ.. గుచ్చుకుంటుంది.

స్టైల్ కోసం చోక్కాపై కప్పుకుందామా అంటే.. జనాలు మనని రోగిష్టివాడనుకునే ప్రమాదం తీవ్రంగా ఉంది (థాంక్స్ టు అక్కినేని నాగేశ్వర్రావ్). సినిమా వాళ్ళు జమీందార్ పాత్రలకి శాలువా కప్పుతుంటారు (జమీందార్లకి చలి ఎక్కువని సినిమావాళ్ళ అభిప్రాయం కావచ్చు).  

పరుచూరి గోపాలకృష్ణ అనే పేరుగల సినిమా రచయిత ఒకాయన కరుడుగట్టిన కమ్యూనిస్టుట. కాబట్టే ఎప్పుడూ ఎర్ర శాలువా భుజంపై వేసుకుని కనబడుతుంటాట్ట. మరి కమ్యూనిస్టు కానివాడి పరిస్థితితేంటో తెలీదు.

ప్రముఖ సాహిత్యకారుల్ని ఎన్నో సంస్థలు పోటీపడి మరీ శాలువాల్తో సత్కరిస్తుంటాయి. వారికి కప్పిన శాలువాల్ని దాచిపెట్టాలంటే బట్టల బీరువాలు సరిపోవు. పోనీ - ఎవరికన్నా ఫ్రీగా ఇద్దామన్నా తీసుకునే వాడుండడు. రోలింగ్ షీల్డులా రోలింగ్ శాలువాని ప్రవేశపెడితే ఎలా ఉంటుంది?

ఇట్లాంటి అనేక కారణాల వల్ల ఒక ప్రతిభావంతుణ్ని సత్కరించాలంటే శాలువా కప్పాలనే ఆలోచన మంచిది కాదని తోస్తుంది. సన్మానంలో కప్పే శాలువా ఎందుకూ పనికిరాదు కాబట్టి ఇదో నేషనల్ వేస్ట్ అనుకోవచ్చు. కావున మనం శాలువాల సంస్కృతిని విడనాడాలని బల్లగుద్ది వాదిస్తున్నాను.

ఊరికే విమర్శించడం కాదు, నీ ప్రతిపాదన ఏమిటి?

వేరే భాషల వాళ్ళ సంగతి తెలీదు గానీ.. తెలుగులో ఎక్కువమంది రచయితలు, కవులు మధ్యతరగతికి చెందినవారు. ఈ మధ్యతరగతి రచయితలు రాతల్లో మునిగి ఉండటం మూలానా తమ ఆర్ధికస్థాయిని పెంచుకోలేకపోయ్యారా? లేక మధ్యతరగతి వారవడం మూలానే చక్కగా రాస్తున్నారా? (ఇది వేరే చర్చ).

ఓ శాలువా కప్పే బదులుగా.. కొన్ని కిలోల (ఎన్నికిలోలో సన్మానించేవారి ఆర్ధిక స్థితి నిర్ణయిస్తుంది) కందిపప్పు, చింతపండు వంటి పనికొచ్చే రోజువారీ కిరాణా వస్తువులు బహుమతిగా ఇవ్వడం ఉత్తమం అని నా అభిప్రాయం. శాలువా కప్పేకన్నా ఇలా వస్తువులివ్వడమే సముచిత పురస్కారం కూడా. ఇది ఆ రచయితకి నూతనోత్తేజాన్ని ఇస్తుందని నమ్ముతున్నాను.

ఎందుకు? ఎలా?

ఒక రచయిత తన వ్యాసంగానికి ఎంతో విలువైన తన వ్యక్తిగత సమయం వెచ్చిస్తాడు. ఇందువల్ల కుటుంబ సభ్యులు (ముఖ్యంగా భార్య) నష్టపోతారు. వారు ఆ మేరకు కొంత అసంతృప్తిగా (బయటకి చెప్పుకోరు గానీ) ఉంటారు. భర్త ప్రపంచాన్ని పట్టించుకోకుండా రచనలో మునిగి తేలుతుంటే.. ఆ వ్యాపకానికి ఏ మాత్రం సంబంధం లేని భార్య 'ఇది నా ఖర్మ' అని బాధ పడుతూ పిల్లల్ని, ఇంటినీ చూసుకుంటుంది.

అందువల్ల - నాకు తెలిసి తెలుగు సాహిత్యంలో అరుదుగా మాత్రమే రచయితలకి భార్య సహకారం ఉంటుంది. ఎందుకంటే - భర్త రాయడం వల్ల వారు జీవితంలో చాలా కోల్పోతారు. విషయం ఇంతుంది కాబట్టే పాశ్చాత్య దేశాల్లో పుస్తకం ముందుమాటలో భార్యలకి ప్రత్యేక కృతజ్ఞతలు ప్రముఖంగా తెలిపే సంప్రదాయం ఉంది.

అసలే భర్త రాతల వల్ల శిరోభారంతో ఉన్న రచయితగారి భార్యకి, సన్మానం తాలూకా 'శాలువా' అనే ఇంకో బరువుని ఇవ్వడం ఉచితం కాదు. అంచేత రచయిత కుటుంబానికి పనికొచ్చే బహుమతి ఇవ్వడం సముచితం. నాకు తెలిసి ఈ ప్రపంచంలో కందిపప్పు, చింతపండుల లాంటి వస్తువుల కన్నా విలువైందేదీ లేదు.

ఇట్లాంటి వస్తువుల పురస్కారం వల్ల భార్యకి ఆనందం కలుగుతుంది. ఉత్సాహం వస్తుంది. తన భర్త మరిన్ని మంచి రచనలు చెయ్యాలనీ, మరిన్ని కిరాణా వస్తువుల్ని పురస్కారంగా పొందాలనీ రచయితల భార్యలు కోరుకుంటారు. భర్తల్ని మరింత ప్రోత్సాహిస్తారు (రాసేప్పుడు సణగటం మాని ప్రేమతో కాఫీ, టీలు సప్లై చేస్తారు)

రచయితల్ని నేనేదో తక్కువ చేసి రాస్తున్నానని మీకు అనిపించవచ్చు. కానీ ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న కొందరు రచయితలు నాకు తెలుసు. ఈ కరువు రోజుల్లో శాలువాలు చేసుకున్న పుణ్యమేంటి? కందిపప్పు చేసుకున్న పాపమేంటి?

నువ్వు చెప్పింది బానే ఉంది కానీ.. అలా ఇవ్వడం నిషేధం. పైగా నేత కార్మికుల్ని నిరుత్సాహ పరిచినట్లవుతుంది.

మీ ఆచారం తగలెయ్యా! పోనీ బెడ్ షీట్లు, దిండు గలీబులైనా ఇవ్వండి స్వామీ!

(picture courtesy : Google)

45 comments:

  1. బాగా వ్రాసారు.

    మా కాలేజీ లో మా క్లాస్స్ మేట్స్ మీట్ ఎన్నో ఏళ్ల తర్వాత అయింది. ఆ సందర్భంగా మా లెక్త్చరర్స్ (రిటైరు అయినవాళ్ళు) అందరినీ పిలిచి సన్మానాలు చేశాం. ప్రతి సంవత్సరం ఈ తంతు నడుస్తూనే వుంటుంది....మా సీనియర్ బాచ్ , జూనియర్ బాచ్ అలా..
    ఆ సన్మానం లో ఒక మాస్టారు ఉపన్యసిస్తూ యిలా చెప్పారు : “ఎందుకయ్యా ఈ శాలువలు యిలా కప్పుతారు?యివి ఎందుకూ పనికి రావు , వీటి బదులు ఏదైనా పనికి వచ్చే గిఫ్ట్ లు యివ్వండి లేకపోతె ఒక దణ్ణం పెట్టి వూరుకోండి. తరువాయి బాచ్ ల వాళ్ళకి చెప్పండి , శాలువాలు కొనద్దని, కావలసినన్ని మా దగ్గర వున్నాయ్, కావాలంటే అద్దెకి యిస్తాము.” అని.
    సాంప్రదాయం అని చెప్పి మనం ఎన్నో పనికి మాలిని పనులు చేస్తాము. నిన్న చెన్నయిలో, ఏళ్ల క్రితం వచ్చిన సునామీ ని గుర్తు చేసుకుంటూ సముద్రంలో పాలు పోసారు. అవే పాలని ఆకలి గా వున్న బిచ్చగాళ్ళకి వెయ్యొచ్చు లేదా కనీసం కుక్కకి పోయచ్చు.
    ( see పిక్చర్ http://abcnews.go.com/blogs/headlines/2011/12/today-in-pictures-dec-26-2011/)
    అలానే మనాళ్ళు రాజకీయ నాయకుల విగ్రాహాలకి క్షీరాభిషేకం చేస్తారు, ఆఖరికి సినిమా హీరో కట్ ఔట్లకి కూడా . యిదేమి ఆచారం?
    ఎవర్ని ఆడిపోసుకోవాలో తెలియక నేను రాసుకున్న పదాలు :

    పాల తోడ అభిషేకమటంచు పాలన్ నేల
    పాలు చేయ మది యెటుల ఒప్పునో! ఏమి
    ఫలము దక్కు? యెవరి కడుపు నిండు? మరి
    పులకరించునా గోమాత?తన త్యాగము నేల పార

    క్షీరాభిషేకమటంచు క్షీరము నేల పారబోయ తగునా?
    క్షామమున బాలలెందరో క్షీరప్రాప్తినొందక అలమటించ !
    క్షేమము జనులకు పొసగు దారి యిదియా? ఓ జనులా
    క్షణము నిలిచి నిమిషమయినను యోచించరేమీ ?

    తల్లిగోవు కడ లేగదూడ పొదివి పాలు త్రావుచుండ
    పిల్ల గోవును వేరు చేసి గోమాత పాలెల్ల పిండినకూడ,
    కల్ల కపటమెరుగని గోమాత వేరు బిడ్డకు కదా యని
    ఉల్లము పొంగి పాలివ్వ, అభిషేకమటంచు నేలపోసెదరే !

    గడ్డి గ్రాసము సేవించి గోమాత విలువగల పాలనివ్వగ
    గడ్డి మనుజులు అభిషేకమటంచు పాల నేలపాల్చేసేరు
    గడ్డు కార్యమది పుణ్యము యివ్విధముగ సమకూర
    గాడి తప్పి నడుచుచున్నది బూజు పట్టిన మనుజ బుద్ధి

    రక్త మాంసములు పాలగ చేసి గోమాత తన
    శక్తినంతను ధారబోయ, అభిషేకమటంచు
    ముక్తిదాయకమటంచు పాల నేలపాలు చేయగ
    రిక్తము కదా మన మతులు గతులు నిక్కముగ

    థాంక్స్ రమణ గారూ .
    రవీంద్ర

    ReplyDelete
    Replies
    1. రవీంద్ర గారు,

      మీ ఆవేదన చక్కగా వ్యక్తీకరించారు. అభినందనలు.

      అవును, ఈ పెడధోరణి ఈ మధ్య ఎక్కువైంది.

      Delete
  2. Good Thinking Doctor Garu. You got a prescription there.

    ReplyDelete
  3. ఇంత మంచి టపా రాసినందుకు మీకు బ్లాగోత్తమ బిరుదు ఇస్తూ శాలువా కప్పి సన్మానం చెయదలిచాము. ఖర్చుల నిమిత్తం వెంటనే 5 లక్షలు చెల్లించండి.

    PS: పప్పు మిరపకాయ చింతపండు వగైరాలు కావాలంటే అవి మీ ఇంటి నుంచే తీసుకొస్తే అభ్యంతరం లేదు.

    ReplyDelete
    Replies
    1. ఏవిటీ! శాలువా కప్పినందుకు 5 లక్షలా!

      అబ్బో! మీ రేటు మరీ ఎక్కువగా ఉంది. ఇంకో బేరం చెప్పండి.

      PS: నేను ఉప్పూ, పప్పే కాదు.. సింగిల్ మాల్టులు కూడా స్వీకరిస్తాను.

      Delete
    2. సరే 10 లక్షలు ఇవ్వండి. (మనం లెక్కల్లో కొంత వీకా లేక అలా నటిస్తున్నామా)

      సింగల్ మాల్టేమి ఖర్మ, డబుల్ మాల్టు తెచ్చుకోండి. ఏదయినా సరే మీ ఇంటి నుండే సుమా!

      Delete
  4. సార్, శాలువాను మీరు కించపరిచారు గాక కించపరిచారు. శాలువ ఏ నాటిది? రాజుల మరియు రారాజుల కాలం నాటి నన్నయ, తిక్కన, పెద్దన, పోతన లాంటి మహా మహులులు, పండితులు, కవులు, మరియు మరియు వారు దగద్ధాయ మానంగా ఉపయొగించిన శాలువను మీరు కించపరచుటయా? తగదు తగదు. మేము ఎంతమాత్రం ఒప్పుకొన జాలము. ఆ మహా శాలువను కించపరచటం వలన మీరు మహా పండితోత్తమను కించపరచియున్నారు. అందు వలన మీకు శాలువకప్పి సన్మానం చేయక తప్పదు.

    ReplyDelete
    Replies
    1. మీవంటి శాలువా ప్రేమికులు నాకు శాలువా కప్పాలని అంతగా ముచ్చట పడుతుంటే నేనెలా కాదనగలను చెప్పండి?

      మహాప్రసాదం. అటులనే కానిండు.

      ధన్యవాదములు, థాంక్స్, షుక్రియా. :)

      (నేనెప్పుడూ అంతే! ఎదుటివాడికి నీతులు చెబుతాను.. పాటించను.)

      Delete
  5. మీకీ విషయం తెలియదా?
    సన్మానానికి ముందు రొజే నిర్వాహకులు సన్మానగ్రహీత ఇంటికి వెళ్ళి, ఆయన భార్యకు కందిపప్పు, చింతపండు లాంటి స్వయంపాకం సరుకులు ఇచ్చి, పాత శాలువాలు తెచ్చుకుంటారట.

    ReplyDelete
    Replies
    1. అందుకేనన్నమాట.. కొందరు ప్రముఖులు చాలా సన్మానాలు ఒకే రంగు శాలువాతో చేయించుకుంటుంటారు!

      Delete
  6. భలే రాశారండీ! కరడు గట్టిన కమ్యూనిస్టుల్ని కూడా ఇంజెక్షన్ పెట్టి ఓ పోటు పొడిచినట్టున్నారు. మీ సుబ్బూ చెబుతున్నదేమనగా... బీడీ నుండి మోడీదాకా; రాహుల్ గాంధీ మొదలు రాష్ట్ర విభజన దాకా; సూర్యకాంతం మీదుగా సోనియాగాంధీ దాకా... ఏ టాపిక్కుమీదనైనా టన్నుల కొద్దీ టపాలు రాయగల్గిన రమణ గారిని ‘బ్లాగు రత్న’ అనే బిరుదుతో సత్కరించాలట. సభకు విచ్చేసే ఆహుతులంతా కిలో లెక్కన కందిపప్పు, చింతపండు; ప్యాకెట్ చొప్పున కాఫీ పౌడర్, సిగార్స్ పట్టుకురావాలట. మొదటి రెండు నిత్యావరసరాలు మీ ఇంటికి... తర్వాతి రెండు అత్యావసరాలు కూడా మీ ఇంటికేనట (సుబ్బూ కోసం). మీరు పచ్చజెండా ఊపితే ఈ ప్రపోజల్ ను వర్క్ అవుట్ చేయొచ్చేమో అనిపిస్తోందండి. పోస్టు సూపర్బ్!

    ReplyDelete
    Replies
    1. నాగరాజు గారు,

      మీ వ్యాఖ్య చదువుతుంటూనే మనసంతా ఆనందంగా అయిపోయింది. ఇల్లంతా కందిపప్పు, చింతపండుతో నిండిపోయిన ఊహే చాలా సంతోషాన్నిస్తుంది.

      పైన తధాస్తు దేవతలుంటార్ట. వాళ్ళీ వ్యాఖ్య చదివితే బాగుణ్ను.

      సుబ్బుని గుర్తుంచుకుని కాఫీ, సిగార్స్ ప్రస్తావించడం మరీమరీ ఆనందంగా ఉంది.

      చాలా మంచి కామెంటు రాశారు. ధన్యవాదాలు.

      Delete
    2. Hahaha!
      ఇందరికి ఇంత ఆనందం పంచుతున్న మీకు ఆనందం కలుగడం కంటే కావాలసిందేముంటుంది చెప్పండి!
      యాసిన్ గారు ఓ మారు ఇక్కడ దృష్టి సారిస్తే, ఒక్క తథాస్తు దేవతలతోనేం ఖర్మ, దేశవిదేశాల్లోని కొరివి దెయ్యాలతో కూడా ఈ వ్యాఖ్యల్ని చదివించి మీ ఇంటిని బంగారం చేసేయగలరు :-)

      Delete
    3. This comment has been removed by the author.

      Delete
    4. @PAPPU,

      of course, that is always there!

      Delete
  7. Haha. Awesome write up. I like the way you touch the simple and decently ignored (?) problems in the society. Your answers to the comments are very spontaneous and witty too. Been a silent reader of your blogs for years but I guess this is my first comment. You made my day !

    $iddharth

    ReplyDelete
    Replies
    1. @Siddharth,

      Thanks for the nice words.
      I write my random thoughts (uncensored).
      Happy that you like them.
      please keep commenting.

      Delete
    2. మాష్టారు,

      ఏమైనా మీరు రాసే విధానం మమ్మల్ని మళ్ళి మళ్ళీ ప్రతీరోజు మీ కొత్త టపాల కోసం మీ బ్లాగ్ కి రప్పిస్తుంది. కనుక మీకు శలువా కప్పాల్సిందే.

      అందరికీ తెలుగులో కామెంటమని చెప్పే మీరే ఇలా టప్ మని ఆంగ్లంలొ రాసేశారెం?

      Delete
    3. @Mahesh,

      తీరిక ఉన్నప్పుడు తెలుగులోనూ, లేనప్పుడు ఆంగ్లంలోనూ స్పందిస్తూ ఉంటాన్లేండి.

      ఇట్లు

      శాలువా కోసం ఎదురు చూస్తున్న ఓ బడుగు జీవి. :)

      Delete
  8. *కాబట్టే పాశ్చాత్య దేశాల్లో పుస్తకం ముందుమాటలో భార్యలకి ప్రత్యేక కృతజ్ఞతలు ప్రముఖంగా తెలిపే సంప్రదాయం ఉంది.*

    మీరు భలేవారండి. మీకు పాశ్చత్య దేశాల్లో సంస్కృతి,సంప్రదాయలు, చాలా చక్కగా విశ్వనాథ్ సినేమాలో పవిత్రత లాగా కనిపిస్తాయన్నమాట. రమణగారు వాళ్లు పుస్తకం ముందుమాటలో భార్యలకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపేదానికి కారణం మీరనుకొన్నది కాదు. ఆ పుస్తకం రాసే సమయం లో ఎవరు భార్యగా ఉన్నారో,పాఠకులకు తెలియజేసి వారికి మాత్రమే ఆ క్రేడిట్ ఇవ్వాలను కొంటారు. మీకు ఈ మాత్రం తెలియదా?

    ReplyDelete
    Replies
    1. విశ్వనాథ్ సినిమాల్లో పవిత్రత నాకు అస్సలు అర్ధం కాదు.. ఇప్పుడు మీ కామెంటు కూడా అర్ధం కాలేదు.

      Delete
  9. పాతికేళ్ల సర్వీసులో ఇప్పుడే ఒకళ్లు సన్మానం చేస్తామన్నారు. నాకున్న స్వెట్టరు పాతదైపోతోంది. హైదరాబాదులో ఈ మధ్య చలి కాస్త పెరిగిపోతోంది. ఇలాంటివేళే శాలువాలపై, సన్మానాలపై ఇలాంటి టపా రావాలా.... ఏం చేస్తే విధి గభీరమైనది. కాలం అనంతమైనది. శాంతము సముద్రము కన్నా లోతైనది.... ఇలాంటివే చాలా లైన్లున్నాయి. మర్చిపోయాను.

    పప్పు, ఉప్పుల కంటే సెల్ఫోన్ రీఛార్జ్, గ్యాస్ సిలండర్ రీఫిల్ లాంటి ఉత్తమోత్తమమైన ఆలోచనలు సన్మానం చేసే వారికి కలగాలని రేపటి సన్మానితుల సంఘం స్ఠాపక, జీవితకాల ఏకైక అధ్యక్షునిగా డిమాండు చేస్తున్నా.

    ReplyDelete
    Replies
    1. సన్మానం చేయించుకోబోతున్న మీకు నా ప్రగాఢ సానుభూతి.

      మీరు స్థాపించబోయే సంఘం ఆశయాం చాలా గొప్పది. మీకు విజయం కలుగు గాక. :)

      Delete
  10. This comment has been removed by the author.

    ReplyDelete
  11. సార్... మీరు ఈ పీస్ రాశాక మీకు జరుగుతున్నా కామెంట్ సన్మానాలను చూస్తున్నాను. ఇది మీకు మాత్రమే జరుగుతున్న సన్మానం కాదనీ... యావద్ బ్లాగ్మిత్రులకూ జరుగుతున్న సన్మానంగా భావిస్తున్నాను. మీ బ్లాగ్ మహావ్రుక్షం మీద ఓ కాకిలా అద్భుతంగా రాస్తున్నారంటూ మీ రాతను ప్రశంసిస్తూ కింద నక్కలా మీకు కప్పుతున్న శాలువాలో నా వాటా ముక్క కోసం వేచిచూస్తున్నాను. అంతేకాదు... శాలువాపై మీ అభిప్రాయమే నాదని నొక్కి వక్కాణిస్తున్నాను. ఇది నా అభిప్రాయమే కాదు... యావన్మంది సన్మాన గ్రహీతల అభిప్రాయంగా పేర్కొనడానికి నేనేమీ వెనుకాడటం లేదు. అందుకే సన్మానం చేసేప్పుడు ప్రతి ఒక్కరూ దాన్ని దుశ్శాలువా అని దాన్ని వర్ణిస్తుంటారనుకుంటున్నాను. (దుశ్శాలువా అంటే దుష్టముదైన శాలువా అనే కదా అర్ధం డాక్టర్ గారూ!). ఇక్కడ మీరు తాన అంటే నేనే తందాన అంటే అదేదో మీ మెరమెచ్చు మాటలకోసం అన్న మాట కాదనీ... పై దుశ్వాలువా తార్కాణం ద్వారా... యావన్మంది అనే మాటనే అందరి తరఫునా నేనన్నాననీ ఇందుమూలంగా బ్లాగ్ ముఖంగా తెలియజేస్తున్నాననీ సగర్వంగా ప్రకటిస్తున్నాను. మీరు శాలువాకు ప్రత్యామ్నాయంగా చెబుతున్న వస్తువుల్లో భవిష్యత్తులో ఏది సభామోదం పొందుతుందో తెలియదు కాబట్టి... అప్పటి వరకూ కందిపప్పు చమే, చింతపండు చమే, గ్లెన్ఫిడిచ్చు చమే అంటూ... కరటకశాస్త్రి శిష్యుడి టైపు పారాయణం చేస్తుంటాను.
    ఐటమ్ అద్దిరిపోయింది సార్...
    - యాసీన్

    ReplyDelete
    Replies
    1. హహ్హా, భలేగుంది. దుశ్శాలువ = దుష్టమైన శాలువ, విశేషణా పూర్వ పద ‘ఖర్మ’ధారయ సమాసమే కదండీ. సెభాస్, ఎంత బాగా గుర్తుంది. మా తెలుగు పంతులు చండశాసనుడు. సమాసాల్ని రోట్లో రుబ్బి డైరెక్టుగా మా చెవుల్లో పోశాడు, నేరుగా బుర్రలోకి వెళుతుందని. అందుకే మేం దేన్నైనా సమాసాలుగా మారుస్తుండేవాళ్లం. సమాసం = సమోస వల్ల తయారైంది. సన్మానం = సతి చేత అనుమానింపబడినది. సత్కారం = సతి కొరకు కారం. భేషో! ఇలాంటి షష్టి (ముష్టి) తత్పురుష సమాసాలు లెక్కకు మిక్కిలి మాకు కొట్టిన పిండి అప్పట్లో. యాసిన్ గారు, మీరు అనవసరంగా నాలో నిద్రపోతున్న తెలుగు వ్యాకరణ రాక్షసుణ్ని నిద్రలేపారు. ప్చ్.. :-)
      [Aplologies to telugu grammer lovers. No ill feelings, plz !!]

      Delete
    2. Yaseen & నాగరాజ్ గార్లకి,

      I enjoy reading your comments very much.
      your style of commenting is very fluent and unique.
      i can't compete with you.
      thanks a lot for making my posts much more lively with your comments.

      Delete
    3. Sir...
      >> i can't compete with you.<<

      I am sorry if i hurt you by making myself a bit extravagant after reading your item.
      Really sorry.

      Yaseen

      Delete
    4. Yaseen ji,

      NO NO NO.. NO WAY. I am not hurt.

      I sincerely feel commenting a post is an art and you are very good at it, believe me.

      Delete
    5. రమణ గారు,
      గురుతుల్యులతో శిష్యగణానికి పోటీ ఏంటండీ? వింటానికే, సారీ, చదవటానికే ఇబ్బందిగా ఉంది నాకైతే!
      మీరు వెన్నలాంటి మనసుతో ఓ పెద్ద శిష్యరత్నానికి(యాసిన్ గార్కి), మరో బుల్లి శిష్య పరమాణువుకు శుభాసీస్సులు అందించారు చూడండీ, అబ్బ, గుండెలు పిండేశారండీ. ధన్యులమైతిమి! బ్లాగ్రాతల్లో మీకెవ్వరూ సరిలేరు, సరిరారు, సరితూగరు. అంతే. మరో మాట లేదు. మీరు ఆ రకంగానే ఇష్టారాజ్యంగా రాసుకుంటూ ముందుకెళ్లాలని కోరుకుంటున్నాము... జైహింద్, జైజన్మభూమి. థాంక్యూ :-)

      Delete
  12. mi post chadivakaa aa shaluva kapputaro telsukovalanipistundi.. mikemo teliyadu annaru.. naa patlu nenu padata :)

    ReplyDelete
  13. Bravo!!!

    డాక్టరు గారూ, మీరు ఈ టపా లింకుని అభ్యుదయ సంఘం (అరసం) వారికి పంపించారా? మనలో మాట - అభ్యుదయ సంఘం వారు ఇంటెర్నెట్ వాడతారో లేదో, వారికి ఈ టపా తాళపత్రాల మీద రాసి పంపించాలేమో చూడండి! :-))

    ReplyDelete
    Replies
    1. అరసం రాష్ట్ర అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారయణ నాకు చిరకాల మిత్రుడు. ఆయన చాలా సరదా మనిషి. ఈసారి కలిసినప్పుడు చెబుతాలేండి. :)

      Delete
  14. 116 అ౦కె మీద మీ లైన్లు :) భలే గా రాశారు సన్మానాల్లో శాలువాలు, ఇ౦టికొచ్చిన ఆడ వారికి/ఫ౦క్షన్లలో జాకెట్ గుడ్డలు ప్లాస్టిక్ తమలపాకుల మీద అ౦టి౦చిన ప్లాస్టిక్ భరిణెల్లో కల్తీ పసుపు కు౦కుమలు ( పొరపాటున పెట్టుకు౦టే ఎలర్ఙీ వచ్చేస్తు౦ది కూడా) ఇవన్నీ కొద్దిగా సమయ౦ పడుతు౦ది పోవటానికి

    మరీ క౦దిపప్పు, చి౦తప౦డు కాక పోయినా, నిజ౦గానే ఉపయోగపడే వస్తువులు ఇచ్చే స౦ప్రదాయ౦ వస్తే బానే ఉ౦టు౦ది

    ReplyDelete
    Replies
    1. Art Buchwald అనుకుంటాను.. 'హిందూ'లొ చదివిన గుర్తు.

      తనింట్లో ఫంక్షన్ కొచ్చేవాళ్ళకి ఫోన్ చేసి.. వారి బజెట్ కనుక్కుని.. ఫలానా వస్తువు కొనుక్కురమ్మని కొరతాడు. ఇంట్లోకి అవసరమైన వస్తువుల్ని లిస్టు రాసుకుని మరీ కొనుక్కుతెమ్మని చెబుతాడు.

      పనికిమాలిన బొమ్మల్ని / బొకేల్ని ప్రెజెంటేషన్లుగా ఇచ్చేవాళ్ళ మీద సెటైర్ చాలా సరదాగా రాశాడు Art Buchwald.

      Delete
  15. పోస్ట్ అదిరిపొయింది డాటరు గారు . .
    శాలువా ని కొంచెం సాగతీసి దుప్పటి చేసి ఇచ్చిన బాగానే ఉంటుంది .

    ReplyDelete
    Replies
    1. ఈ పోస్టు చదివి సన్మానితులకి ఇకపై శాలువా కప్పరాదని ఏ ఒక్కరు అనుకున్నా నా పోస్టు ధన్యమైనట్లుగా భావిస్తాను.

      (పాత సినిమాల్లో శారద ఏడుపు డైలాగులా చదువుకొనవలెను.)

      Delete
    2. (పాత సినిమాల్లో శారద ఏడుపు డైలాగులా చదువుకొనవలెను.)

      అదిరింది

      మిమ్మల్ని పుట్టించేటప్పుదు, బ్రహ్మకి ఎవరొ బాగా కితకితలు పెట్టేసి ఉంటారు.

      Delete
    3. @Mahesh,

      అలాగా! నేను చాలా లోతైన, సీరియస్ మనిషినని అనుకుంటున్నానే. :)

      Delete
  16. నాకు అర్థం కాని అనేకానేక విషయాల్లో ఇది ఒకటి.
    ఎవరినైనా సన్మానించాలి అంటే శాలువా కప్పాల్సిందే అని గట్టి గా(గుడ్డి గా) నమ్మే జనాలు...
    అలా వచ్చిన శాలువాలతో ఇల్లు నిండి పొయే సన్మానగ్రహీతలు(రచయితలే కాదండీ, రిటైర్ అయ్యే వాళ్ళు కూడా) !
    ఇంకా విచిత్రం ఏంటంటే నాకు ఇన్ని శాలువాలు వచ్చాయి, నీకు ఎన్ని వచ్చాయి, వాళ్ళకు ఎన్ని వచ్చాయి అని పోల్చుకునే వాళ్ళను కూడా నేను చూశాను.

    -మమత

    ReplyDelete
  17. @ఇంకా విచిత్రం ఏంటంటే నాకు ఇన్ని శాలువాలు వచ్చాయి, నీకు ఎన్ని వచ్చాయి, వాళ్ళకు ఎన్ని వచ్చాయి అని పోల్చుకునే వాళ్ళను కూడా నేను చూశాను.



    అలా పోల్చుకుంటే తప్పేమిటీ?నా దగ్గర ఏడెనిమిది దుశ్శాలువలు ఉన్నయ్!!మీ దగ్గర ఎన్ని ఉన్నయ్యో?మరీ!!

    ReplyDelete
    Replies
    1. శాలువాలు కప్పుకునేంత గొప్పతనమూ పెద్దరికమూ అదృష్టమూ ఇంకా నాకు రాలేదండీ !
      అదే నా ఏడుపు :)
      :)

      Delete

comments will be moderated, will take sometime to appear.