Monday 30 December 2013

అన్యోన్య దాంపత్యం


గజలక్ష్మి, గజరాజులు భార్యాభర్తలు. వారిది విశాలమైన ఇల్లు. ఆ ఇంట్లో ఓ విశాలమైన హాలు. ఆ హాల్లో ఓ విశాలమైన సోఫా. ఆ సోఫాలో తమ విశాలమైన శరీరాల్ని ఇరుకిరుగ్గా సర్దుక్కూర్చునున్నారు.

గజరాజు ఓ రాజకీయ నేత. ప్రజాప్రతినిధి. కొన్నేళ్లుగా తన జీవితాన్ని పూర్తిగా ప్రజాసేవకే అంకితం చేశాడు.

ఫలితంగా ఓ పది ఫేక్టరీలు, వెయ్యెకరాల భూమిని సమకూర్చుకోగలిగాడు.

ప్రస్తుతం భార్యాభార్తలిరువురూ ఒక టీవీ వారికి ఇంటర్వ్యూ ఇస్తున్నారు.

గత కొన్నేళ్లుగా తెలుగు టీవీ చానెళ్ళకి క్రియేటివిటీ కరువైపోయ్యి.. ఏవేవో దిక్కుమాలిన కాన్సెప్టుల్తో ప్రోగ్రాములు చుట్టేస్తున్నారు.

'చిలకా గోరింకల అన్యోన్య దాంపత్యం' అనే ప్రోగ్రాం గత కొన్నాళ్ళుగా టీవీ 420 లో విశేష ప్రజాదరణ పొందింది.

ప్రోగ్రాంలో ప్రతివారం ఒక 'ప్రముఖ జంట'ని పనీపాటా లేని వీక్షకులకు పరిచయం చేస్తుంటారు.

గజలక్ష్మి అత్యంత బరువైన పట్టుచీర, మరింత బరువైన నగలతో కళకళలాడుతుంది.

గజరాజు తెల్లబట్టల్లో అచ్చు గోరింకలా మెరిసిపోతున్నాడు.

ఇంటర్వ్యూ చేస్తున్న అమ్మాయి వచ్చీరాని తెలుగులో ఏవో ప్రశ్నలడుగుతూ.. వారిచ్చే సమాధానాల్ని బోల్డంత ఆసక్తిగా వింటుంది.

"మా ఆయన బంగారం. అహోరాత్రులు కుటుంబం గూర్చే ఆలోచిస్తుంటారు. అప్పటికీ చెబుతూనే ఉంటాను.. మరీ తీవ్రంగా ఆలోచిస్తే ఆరోగ్యం పాడవుతుందని. ఏదీ వింటేనా?" గజలక్ష్మి మురిపెంగా చెప్పింది.

"నా భార్య ఉత్తమురాలు. అనుక్షణం నా అవసరాలు కనిపెడుతూ కంటికి రెప్పలా చూసుకుంటుంది. అది నా అదృష్టం." అపురూపంగా భార్యని చూసుకుంటూ అన్నాడు గజరాజు.

"రాబోయే వంద జన్మలక్కూడా ఈయనే నాకు భర్తగా లభించాలని రోజుకి వందసార్లు దణ్ణం పెట్టుకుంటాను." భక్తిగా అంది గజలక్ష్మి.

ఇలా అనేక ముచ్చట్లతో ఇంటర్వ్యూ ముగిసింది.

బుల్లితెరపై వచ్చేవారం మీ ఇంటర్వ్యూ చూసుకోండని చెప్పి టీవీ వాళ్ళు సర్దుకున్నారు.

ఓ రెండు నిముషాలు నిశ్శబ్దం.

సిగరెట్ వెలిగించాడు గజరాజు.

"ఈ జన్మకి పెట్టే హింస చాలదా? రాబోయే వంద జన్మలకి నీ దరిద్రపు మొహమేనా?" వెటకారంగా అన్నాడు గజరాజు.

గజలక్ష్మి గయ్యిమంది.

"మాటలు జాగ్రత్తగా రానీ. నీగూర్చి నాలుగు మంచి ముక్కలు చెప్పినందుకు సంతోషించు. నీ తిరుగుళ్ళ గూర్చి చెప్పానా? దందాల గూర్చి చెప్పానా?"

"ఛీపో! నీలాంటి దరిద్రప్ముండతో నాకు మాటలేంటి!" ఈసడించుకున్నాడు గజరాజు.

"ఛీఛీ పొప్పో! నీలాంటి పోరంబోకుల్తో మాట్లాడేదేంటి?" అసహ్యించుకుంది గజలక్ష్మి.

అయ్యా! అదీ సంగతి!

మీరందరూ వచ్చేవారం ఈ అన్యోన్య దంపతుల ప్రోగ్రాం చూసి తమ విలువైన అభిప్రాయం చెప్పవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.

(picture courtesy : Google)

15 comments:


  1. ఇంతకీ ఎవరబ్బీ ఈ అన్యోన్య జంట ?

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. జిలేబి జి,

      ఎవరంటారేంటి! ప్రతిరోజూ టీవీలో ఏదోక జంట కనిపిస్తుంటేనూ!

      Delete
    2. వచ్చే వారం ఎపిసోడులో జిలేబీ అయ్యరు దంపతులు, ఆపైవారం ప్రముఖ మానసిక వైద్యనిపుణులు మన సుపరిచత బ్లాగోత్తములు & వారి సతీమణి గారు రావాలని ఇప్పుడే టీవీ 420 వారికి అర్జీ పంపించాము. తెలుగు ప్రజల ఎకగ్రీవ కోరికను సదరు టీవీ వారు సహృదయంతో (ముఖ్యంగా ఇంకా ఇతర బకరాలు దొరకనందున) మన్నించారు.

      మిత్రులందరూ ఈ ఎపిసోడులు (ఎపీ-గోడులు) చూసి తరించవలిసిందిగా మనవి.

      Delete
  2. గజరాజు అని చూడగానే నాకెందుకో బుర్రలో బొత్స బొమ్మ ఫ్లాష్ వెలిగిందండీ! ఎందుకిలా ఘోరం జరిగిందంటారు? న్యూరల్ నెట్ వర్క్స్ ఎర్రర్ వల్ల తప్పు చిత్రం వచ్చింటుందిలే అని సరిపెట్టుకున్నా, ప్చ్!! మీ టపా, ఎప్పట్లాగే పేలింది.
    బ్రే(షా)కింగ్ న్యూస్: TV 420ని వెన్ను విరిచేలా... ABN గంద్రగోళం ఛానెలోళ్లు... ‘‘కాకీ - కీచురాయి కల్లోల కాపురం’’ అని సతీపతుల మధ్య చిచ్చు పెట్టి స్పాట్లో జట్టు పట్టుకు కొట్టుకునేలా చేసే వెరైటీ, క్రియేటివ్ లైవ్ ప్రోగ్రామొకటి ప్లాన్ చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం :-)

    ReplyDelete
    Replies
    1. భార్యాభర్తలు ఒకళ్ళనొకళ్ళని లైవ్ లో తిట్టుకునే (తిట్టింపజేసే) ప్రోగ్రాములు ఆల్రెడీ ఇంతకుముందే వచ్చేసినట్లున్నాయి కదా?

      Delete
    2. ఎందుకో నాకు కూడా ఆ బొత్స దంపతులే గుర్థుకు వచ్చారు.

      Delete
  3. ఈ అన్యోన్య ఎవరండి?

    (ఏమిటో ఈ మధ్య ఏ పేరు పడితే ఆ పేరు పెట్టేసుకుంటున్నారు జనాలు)

    ReplyDelete
    Replies
    1. అన్యోన్య అంటే తెలీదా!?

      భర్త హార్మణీ పెట్టె ముందేసుకుని 'పయనించే మన వలపుల నావ.. ' అని పాడుతుంటే.. భార్య తన్మయత్వంగా అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుంటుంది. :)

      Delete
  4. Ramana Gaaru,
    అన్యోన్యంగా ఉండే జంటను చూడాలి అనుకొంట్టున్నారా? అయితే ఈ పాటను చూడండి. :)
    http://www.youtube.com/watch?v=8CiO6FbqATA

    ReplyDelete
    Replies
    1. వాళ్ళిద్దరు భార్యాభర్తలు కారు. అందుకే అంత 'అన్యోన్యంగా' ఉన్నారనుకుంటాను. :)

      Delete
    2. అలా జీవించడానిని ఈ రోజుల్లో లివింగ్ టు గెదెర్ అంటారు. ఆ రోజుల్లోనే వారు అలా జలసి జీవించారు అంటె హిందూ మతం అభ్యుదయ వాదులు విమర్శించినంత చాందస మతం కాదు అని తెలుస్తున్నాది.

      Delete
  5. This comment has been removed by the author.

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.