Friday, 18 October 2013

యుద్ధం కబుర్లు


మహాభారత యుద్ధంలో ఎవరిమాట చెల్లుబాటయ్యింది?

ఒకవైపు ధుర్యోధనుడి మాట శిలాశాసనం.. ఇంకోవైపు ధర్మారాజు మాట వేదవాక్కు.

ఇద్దరూ యుద్ధం కావాలనుకున్నారు.. చేసుకున్నారు.

జీతాల కోసం పనిచేస్తున్న సైనికులు ఇద్దరి తరఫున కొట్టుకుని.. కుప్పలుతెప్పలుగా చచ్చారు.

దుర్యోధన ధర్మరాజులిద్దరూ యుద్ధం వద్దనుకుంటే.. ఎప్పుడు కావాలంటే అప్పుడే ఆపేసుకోవచ్చు.

అందుకు వారు కారణం కూడా చెప్పనక్కర్లేదు.

వారిద్దర్లో ఒకరికి వీపు దురద పుట్టినా.. గోక్కోడానికి కూడా తాత్కాలిక యుద్ధవిరామం ప్రకటించవచ్చు.

వీరికి సలహాలు అనేకులు అనేక రకాలుగా ఇవ్వవచ్చును.. కానీ నిర్ణయాత్మక శక్తి మాత్రం వీరిద్దరిదే.

ఈ యుద్ధం అనేక యుగాల క్రితం జరిగింది.

ఈనాటిక్కూడా మనకి కొద్దిపాటి జ్ఞానమైనా వచ్చిన దాఖలా లేదు.

మన పైవాళ్ళకి యుద్ధం ఆపే ఉద్దేశ్యం ఉండదు.

కానీ - లీకులతో, తియ్యనైన కబుర్లతో మభ్యపెట్టెదరు.

కౌరవుల్లో వందోవాడికి విరోచనాల్ట.. యుద్ధం ఆగిపొయ్యేట్లుంది.

సహదేవుడి గుర్రానికి గుగ్గిళ్ళు అయిపొయ్యాయి.. యుద్ధం కేన్సిల్.

భీష్ముడికి గెడ్డం మరీ పెరిపోయిందట.. యుద్ధం వాయిదా వేస్తారా?

యుద్ధానికయ్యే జమాఖర్చులు రాసే వేతనశర్మలు సహాయ నిరాకరణ చేస్తున్నార్ట!

'అయితే ఏంటంట?'

నిర్ణయం తీసుకున్న ధుర్యోధనుడు, ధర్మరాజు.. వాళ్ళ మానాన వాళ్ళు యుద్ధం చేసేసుకుంటూ పోతున్నారు.

వాళ్ళతో మాట్లాడే ధైర్యం ఇంకా ఎవరికీ వచ్చినట్లు లేదు.

ఒకప్పుడు నర్తనశాల సినిమాలో ఉత్తరకుమారుణ్ని చూసి పగలపడి నవ్వుకున్నాం.

ఇప్పుడు సర్వం ఉత్తరకుమారుల మయం.

'చేతనైతే యుద్ధం ఆపేస్తున్నామని చెప్పాల్సినవాళ్ళతో చెప్పించు.. అంతేగానీ ఈ చీకట్లో రాళ్ళు విసరడం మానెయ్యి.' అని అనకు.

నిన్నొక శతృగూఢచారిగా జమ కట్టెదరు.

మనందరం గాంధీగారి కోతుల్లాంటివాళ్ళం.

అందుకే మనకి నచ్చింది మాత్రమే చూస్తాం, వింటాం, మాట్లాడతాం.

ఇదొక అంతులేని అజ్ఞానం, అది మనకెంతో ఆనందదాయకం.

'ఉరే అబ్బాయ్! ఏనాదైతే కిష్టుడి రాయబారం ఫెయిలయిందో, ఆరోజే మహాభారత యుద్ధం జరగాలని నిర్ణయమైపోయింది. కత్తి పదును పెట్టుకోడానికి ఆకురాయి కనబళ్ళేదని మర్డర్ చెయ్యడం మానుకుంటామా ఏమిటీ? అందుకే - ఈ వెర్రిమొర్రి ఆలోచనాలు కట్టిపెట్టి జరగాల్సిందేవిటో ఆలోచించు.'

'ఎవడ్రా వీడు? వీణ్ని తన్ని తగలెయ్యండి.'

(picture courtesy : Google)

19 comments:

  1. పనిలేని డాక్టరుగారూ,

    మహాభారత యుధ్ధం ఎందుకు జరిగింది? అన్న విషయం మీద ఒక విపులమైన టపా వ్రాస్తే బాగుండేలా ఉంది.
    (మనలో మనమాట. జనాలు కూడా నా కవిత్వం‌ కన్నా నా వ్యాసాలే ఆసక్తిగా చదువుతున్నారు!)
    ఏమంటారు?

    యుధ్ధం అంత సీరియస్ విషయాన్ని మీరు తమాషాకోణం లోంచి చూడటం కూడా తమాషాగా అనిపించింది!

    ఏ విషయాన్ని ఐనా కొంచం హాస్యం, కొంచెం‌ వ్యంగ్యం మిళాయించి వ్రాయగల మీ సామర్థ్యాన్ని చూసి కొంచెం అసూయ పుడుతోందండోయ్!

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం గారు,

      నాకు ఎన్టీఆర్ సినిమాల్లో చూసిన మహాభారతం వరకు మాత్రమే తెలుసు. అంతకుమించి ఒక్కపైసా కూడా తెలీదు. కాబట్టి 'విపులం'గా రాసే అవకాశం లేదు.

      (అజ్ఞానమే నా ఆయుధం!)

      Delete
    2. ఒక్క అక్షరం కూడా తెలీదు అని అనాలేమో. మీ పోస్ట్ మాత్రం బాగుంది.

      Delete
    3. డాక్టరుగారూ,
      మహాభారతయుధ్ధం గురించి తిక్కనగారి వెర్షన్ అంతా చక్కటి వచనంలో సవివరంగా ఈమాటలో ఒక వ్యాసమాలగా వచ్చింది. చూడండి:: తిక్కన సోమయాజి భారత యుద్ధకథ

      Delete
  2. "కత్తి పదును పెట్టుకోడానికి ఆకురాయి కనబళ్ళేదని మర్డర్ చెయ్యడం మానుకుంటామా ఏమిటీ?"

    సూపర్ అండీ డాట్రారూ..................

    మీరు నిజంగా మానసిక వైద్యులేనా? నాకు ఎందుకో డౌటుగా వుంది.

    ReplyDelete
    Replies
    1. ఒట్టు. నన్ను నమ్మండి. నేను మానసిక వైద్యుణ్ణే.

      మీరు కోట్ చేసిన వాక్యం రాయడం మానసిక వైద్యుడికి చేతకాదని నాకు తెలీదు. తెలిస్తే రాసేవాణ్ని కాదు. :)

      మీరిలా మానసిక వైద్యుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్య రాయడాన్ని నేను ఖండిస్తున్నాను. :)

      Delete
    2. నా ఉద్దేశం మీరు నిజంగా రైటర్ అయ్యుండి డాక్టర్ అని అంటున్నారెమో అని. అపార్థం చేసుకోకండి ప్లీజ్. మీ మనోభావాలు దెబ్బ తీసినందుకు sorry. :(

      Delete
  3. hahaha. అసలే రాష్ట్రమేమైపోతుందో అర్థం కాక, ఒకవైపు ప్రజలు బుర్రలు బద్ధలు కొట్టుకుంటుంటే, మీరిప్పుడు మరో కొత్త డౌటు రెయిజ్ చేసి జనం గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు :-)

    ReplyDelete
    Replies
    1. ప్రజలకి ఇవన్నీ ఎప్పుడో తెలుసండి. చాలా విషయాల్లో మనమే అమాయకులం. :)

      Delete
    2. సూక్ష్మం గ్రహించారండి :)

      Delete
    3. రమణ గారు, పైన నేను రాసిన కామెంటు నీలిమ గారు లేవనెత్తిన డేంజరస్ డౌటు ’’మీరు నిజంగా మానసిక వైద్యులేనా?‘‘ అన్న వ్యాఖ్యకు రిప్లైగా సరదాకి రాసింది. అదేమో అక్కడ కాకుండా ఎక్కడో పబ్లిష్ అయిపోయి తర్వాత ఏమేమో జరిగిపోయినట్టుంది. హతోస్మి :-)

      Delete
  4. >> మీరు కోట్ చేసిన వాక్యం రాయడం మానసిక వైద్యుడికి చేతకాదని నాకు తెలీదు. తెలిస్తే రాసేవాణ్ని కాదు.

    Too good. ROFL

    The post is very straight and a clean job. I agree with you :)

    ReplyDelete
  5. మీరు చెప్తోంది ఎటువంటి సందేహం లేకుండా అర్థం అవుతున్నది. కానీ,

    ఆ యుద్దం లో ఏ పాపం తెలియని లక్షలాది మంది చనిపోయినట్లు, ఇప్పుడు కూడా కొన్ని కోట్లమంది భవిష్యత్తు 2-3 తరాల వరకు అగమ్యగోచరం, పైగా ఇది భవిష్యత్తు లొ సరిదిద్దుకోలేని తప్పు, తమకు ముఖ్యమంత్రి పదవి రాలేదన్న దుగ్డ తో తెలంగాణా నాయకులు, స్వలాభం కోసం కాంగ్రెస్, పదవులపై, విభజనతో వచ్హే ప్రాజెక్టుల పై ఆశతొ ప్రజలను నట్టేట ముంచుతున్న సీమాంధ్ర నయవంచకులు.....జరుగుతోంది తప్పు అని తెలిసికూడా ఏమీ చేయలేని నిస్సహాయత,

    మనసులో ఒక బలైపోతున్న ఫీలింగ్ డాక్టరు గారూ....

    ReplyDelete
    Replies
    1. Dr.Rajasekhar గారు,

      >>> ఆ యుద్దం లో ఏ పాపం తెలియని లక్షలాది మంది చనిపోయినట్లు, ఇప్పుడు కూడా కొన్ని కోట్లమంది భవిష్యత్తు 2-3 తరాల వరకు అగమ్యగోచరం...

      మీ ఊహలు పూర్తిగా అర్థం లేని భయాలు. గత ఆరు దశాబ్దాలుగా తెలంగాణా వనరులపై ఆధారపడ్డం అలవాటు చేసుకోవడంవల్ల కలుగుతున్న అభద్రతా భావం అది. తెలంగాణాతో పనిలేకుండా 27 రాష్ట్రాలు ఈ దేశంలో మనుగడ సాగిస్తున్నాయి. అంత భయపడవలసిన అవసరం లేదు.

      Delete
  6. //'ఉరే అబ్బాయ్! ఏనాదైతే కిష్టుడి రాయబారం ఫెయిలయిందో, ఆరోజే మహాభారత యుద్ధం జరగాలని నిర్ణయమైపోయింది. కత్తి పదును పెట్టుకోడానికి ఆకురాయి కనబళ్ళేదని మర్డర్ చెయ్యడం మానుకుంటామా ఏమిటీ? అందుకే - ఈ వెర్రిమొర్రి ఆలోచనాలు కట్టిపెట్టి జరగాల్సిందేవిటో ఆలోచించు.'

    'ఎవడ్రా వీడు? వీణ్ని తన్ని తగలెయ్యండి.'//
    కాఫీనంతా కాచి వడబోశారు. సారీ.. యుద్ధం ముందు చెప్పిన డ్రైవర్ చెప్పిన మాటల్ని కాచి వడబోశారు. ఇక ఇంచక్కా గీతా వ్యాఖ్యానాల్ని పక్కన పెట్టేయ్యచ్చు.

    ReplyDelete
  7. వీళ్ళు చేసేదాన్ని యుద్ధమంటారా మీరు? యుద్ధం స్థాయి ఉందా దీనికి? యుద్ధం ప్రభావం ఎలా ఉంటుందోనని హడలి చచ్చే దేశ ప్రజలకు తాత్కాలిక ఆనందాన్ని కల్గించేందుకు ఆడుతున్న తోలు బొమ్మలాట కదా ఇది!

    నిర్ణయం తీసుకున్న ధుర్యోధనుడు, ధర్మరాజు.. వాళ్ళ మానాన వాళ్ళు యుద్ధం చేసేసుకుంటూ పోతున్నారు.

    వాళ్ళతో మాట్లాడే ధైర్యం ఇంకా ఎవరికీ వచ్చినట్లు లేదు._______________ వీళ్ళకు ధైర్యమూ లేదు. ధైర్యం చేసి మాట్లాడినా వాళ్ళు పట్టించుకోనూ పట్టించుకోరు.

    ReplyDelete
    Replies
    1. సుజాత గారు,

      అవును. ఇదసలు యుద్ధం కాదు.. తోలుబొమ్మలాటే. నాకు ఎటువంటి భ్రమలూ లేవు. మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.

      'యుద్ధం' పోలిక కోసం తీసుకున్నాను (కొద్దిగా సందేహిస్తూ.. ).

      Delete
  8. Midi tappu sir praja udyamalu entho kontha raajyam midha prabhavam chupisthai sir, like nirbhaya act

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.