Monday, 18 May 2015

వార్తకి అటూఇటూ


ఉదయం పదిగంటలు. అప్పుడే కాఫీ తాగి పేపర్ చదవడం మొదలెట్టాను. శేషాచలం అడవుల్లో కూలీల ఎన్‌కౌంటర్ గూర్చి వార్తా విశ్లేషణ చదువుతున్నాను. ఇంతలో నా చిన్ననాటి స్నేహితుడు సుబ్బు హడావుడిగా వచ్చాడు.

"హలో మిత్రమా! ఒక కప్పు కాఫీ! అర్జంట్!" వస్తూనే అన్నాడు సుబ్బు.

"కూర్చో సుబ్బూ! బహుకాల దర్శనం, బాగున్నావా?" పలకరించాను.

"నేను బాగానే వున్నాన్లే! అంత సీరియస్‌గా పేపర్ చదువుతున్నావ్! ఏంటి కబుర్లు?"

"పాపం! శేషాచలం అడవుల్లో ఇరవైమంది చనిపోయ్యారు సుబ్బూ! ఘోరం కదూ?" దిగాలుగా అన్నాను.

"ప్రస్తుతం మన్దేశం వేగంగా అభివృద్ధి చెందుతుంది. కావున - మనుషులిలా చావడం సహజం. నువ్విలాంటి సాధారణ వార్తలకి దిగులు చెందరాదు!" నవ్వుతూ అన్నాడు సుబ్బు.

ఆ నవ్వుకి వొళ్ళు మండిపొయ్యింది నాకు.

"మనుషుల ప్రాణాలంటే నీకంత చులకనగా వుందా సుబ్బూ?" మొహం చిట్లించి అన్నాను.

నా ప్రశ్నకి ఒక క్షణం ఆలోచించాడు సుబ్బు.

"నువ్వు అర్ధం చేసుకోవాల్సింది - మన దేశ ఆర్ధిక ముఖచిత్రం మారుతుంది. ఇప్పుడిక్కడ కావల్సింది 'అభివృద్ధి' తప్పించి మనుషుల ప్రాణాలకి రక్షణ కాదు. ఈ నేపధ్యం అర్ధం చేసుకున్నాను కాబట్టే మనుషులు చావడం, చంపబడటం ఒక సహజ పరిణామంగా నేను ఫీలవుతున్నాను. సింపుల్‌గా చెప్పాలంటే - 'అభివృద్ధి' అనే ఫేక్టరీకి ఈ చావులు కాలుష్యం వంటివి. కాలుష్యం లేకుండా ఫేక్టరీ నడవదు, లాభాలు రావు. లాటిన్ అమెరికా దేశాల్లో కూడా జరుగుతుందిదే." అన్నాడు సుబ్బు.

ఇంతలో ఫిల్టర్ కాఫీ పొగలు గక్కుతూ వచ్చింది.

"సుబ్బూ! కొంచెం అర్ధం అయ్యేట్లు తెలుగులో చెప్పవా?" విసుగ్గా అన్నాను.

"సమాజం ఏకోన్ముఖంగా వుండదు. అడవిలో జంతువుల్లాగే అనేక రకాల వ్యక్తుల సమాహారమే సమాజం. కాకపోతే మనుషులు ఒకే రకమైన శరీర నిర్మాణం కలిగుంటారు. అందుకే ఈ శేషాచలం చావుల్ని కూడా ఎవరి తోచినట్లు వారు అర్ధం చేసుకుంటారు." అన్నాడు సుబ్బు.

"అదెలా?" ఆసక్తిగా అడిగాను.

"నీకు పెద్దమనుషుల భాషలో చెబుతాను. ఈ భాషని 'కన్యాశుల్కం'లో సౌజన్యారావు పంతులుతో మాట్లాడిస్తాడు గురజాడ. ఈ భాష గంభీరంగా వుంటుంది, అర్ధం చేసుకోవడం కొంచెం కష్టం!" అన్నాడు సుబ్బు.

"ఏవిఁటో ఆ భాష?" అన్నాను.

"శాంతిభద్రతల్ని కాపాడ్డం, నేరాల్ని అరికట్టడం అనేది రాజ్యం యొక్క పవిత్రమైన బాధ్యత. ఎవరైతే నేరం చేసినట్లు రాజ్యం భావిస్తుందో, వారిపై నేరారోపణ చేస్తూ, సాక్ష్యాధారాల్తో కోర్టుకి అప్పగించడం రాజ్యం యొక్క విధి. ఇందుకు రాజ్యానికి పోలీసు వ్యవస్థ సహకరిస్తుంది. అట్లా కోర్టుకి అప్పగించిన వారిని 'నిందితులు' అంటారు. ఇక్కడి నుండి న్యాయవ్యవస్థ పని మొదలవుతుంది. నిందితుడికి వ్యతిరేకమైన సాక్ష్యాధారాల్ని కూలంకుషంగా విచారించి ఆ నిందితుడు నేరం చేసిందీ లేనిదీ కోర్టులు తేలుస్తాయి. నేరం చేసినట్లు ఋజువైతేనే నిందితుడు, ఆ క్షణం నుండి 'నేరస్తుడు' అవుతాడు." అన్నాడు సుబ్బు.

"ఇదంతా నాకు తెలుసు." అసహనంగా అన్నాను.

"ఈ పెద్దమనుషుల భాష ప్రకారం - మొన్నట్నుండీ సత్యం రామలింగరాజు 'నేరస్తుడు'గా అయిపోయ్యాడు. గాలి జనార్ధనరెడ్డి ఇవ్వాళ్టిక్కూడా 'నిందితుడు' మాత్రమే." అన్నాడు సుబ్బు.

"నాకు ఇదీ తెలుసు." చికాగ్గా అన్నాను.

"మిత్రమా! 'జీవించడం' అనేది ఒక ప్రాధమిక హక్కు. ఈ హక్కుని పరిరక్షించడం రాజ్యం యొక్క ముఖ్యమైన బాధ్యత. చట్టం ముందు అందరూ సమానులే. నీకు లేని హక్కు ఇంకెవరికీ లేదు. ఇంకెవరికీ లేని హక్కు నీకు లేదు." అన్నాడు సుబ్బు.

"ఏవిఁటి సుబ్బూ! మరీ చిన్నపిల్లాడికి చెప్పినట్లు.. "

సుబ్బు నామాట వినిపించుకోలేదు.

"న్యాయ సూత్రాలని పాటిస్తూ పాలించడాన్ని 'చట్టబద్ద పాలన' అంటారు. దీని గూర్చి బాలగోపాల్ వందల పేజీలు రాశాడు, వందల గంటలు ఉపన్యాసాలు ఇచ్చాడు. ఈ చట్టబద్ద పాలన దేవతా వస్త్రాల్లాంటిది. ఇది అందరికీ కనపడదు. నిందితుడు, నేరస్తుడు అనే పదాల లక్జరీ కొన్ని వర్గాలకి మాత్రమే పరిమితం." అన్నాడు సుబ్బు.

"ఎందుకని?" అడిగాను.

"సమాజం రైల్వే బోగీల్లాగా కంపార్టమెంటలైజ్ అయిపొయుంది. ఏసీ బోగీవాడికున్న ప్రివిలేజెస్ జెనరల్ బోగీవాడికి వుండవు. ఇది ఎవరూ ఒప్పుకోని ఒక అప్రకటిత సూత్రం. శేషాచలం అడవుల్లో చెట్లు నరికినవాళ్ళు జెనరల్ బోగీవాళ్ళు. వాళ్ళు సమాజ సంపదకి కలిగించిన నష్టం గాలి జనార్ధనరెడ్డి కలిగించిన నష్టం కన్నా తక్కువ. కానీ - మనకి 'నేరస్తులైన' కూలీల మీదే క్రోధం, అసహ్యం." అన్నాడు సుబ్బు.

"ఎందుకు?" అడిగాను.

"ఇది స్పష్టమైన క్లాస్ బయాస్. పేపర్లు చదివేది, అభిప్రాయాలు వ్యక్తీకరించేదీ మధ్యతరగతి మేధావులు. వీళ్ళు జేబులు కొట్టేసే వాణ్ని కరెంటు స్తంభానికి కట్టేసి చావగొడితేనే గానీ దొంగలకి బుద్ధి రాదనీ వాదిస్తారు. వంద కోట్లు అవినీతి చేసిన వైట్ కాలర్ నిందితుణ్ని మాత్రం 'చట్టబద్దంగా విచారించాలి' అంటారు." అన్నాడు సుబ్బు.

"నిజమే సుబ్బూ!" అన్నాను.

"ఇక్కడంతా ఆటవిక నీతి. అడవిలో పులులు జింకల్ని వేటాడేప్పుడు జింకలకి నొప్పి కలుగుతుందేమోనని ఆలోచించవు. ఆ పక్కనే వున్న పులి స్నేహితుడైన నక్క - వేటాడే పులిలో రౌద్రాన్ని కీర్తిస్తూ కవిత్వం రాస్తుంది. ఇది ప్రకృతి ధర్మం. అలాగే - మధ్యతరగతి మేధావులు తక్కువ స్థాయి మనుషులు చంపబడితే - 'ధర్మసంస్థాపనార్ధం అది చాలా అవసరం' అని నమ్ముతారు. అంటే - మనం మనుషుల్ని మనుషులుగా చూడ్డం మనేశాం. వర్గాలుగానే చూస్తున్నాం. పాలక వర్గాలక్కూడా కావల్సిందిదే!" అన్నాడు సుబ్బు.

"నువ్వు చెబుతున్నది నిజమేననిపిస్తుంది సుబ్బూ!" అన్నాను.

"నీకు తెలుసుగా? సిగ్మండ్ ఫ్రాయిడ్ 'ఐడెంటిఫికేషన్' అని ఒక డిఫెన్స్ మెకానిజం గూర్చి చెప్పాడు. ఒక వ్యక్తి తన వర్గానికి తెలీకుండానే మానసికంగా కనెక్ట్ అయిపోతాడు. అందుకే - ఒక ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తి మంచినీళ్ళ కోసం పంపు దగ్గర బిందెలతో తోసుకునే ఆడవారిలో అలగాతనం చూస్తాడే గానీ - నీటికొరత ఎంత దుర్భరంగా వుందో ఆలోచించడు."

"అంటే - తెలుగు వార్తా పత్రికలది కూడా 'ఫ్రాయిడియన్ ఐడెంటిఫికేషన్' అంటావా?"

"కొంత వరకు. పత్రికలకి వ్యాపార అవసరాలే ప్రధానం. వాళ్ళ పత్రికకి చందాదారులుగా కూలీల కన్నా మధ్యతరగతి వారే ఎక్కువమంది వుంటారు. పత్రికలు ఎవరికి వార్తలు అమ్ముతారో వారి ఆలోచనలకి తగ్గట్టుగానే రాస్తాయి. ఇవే తెలుగు పత్రికలు చెన్నై ఎడిషన్లో కూలీలకి అనుకూల విధానం తీసుకుని రాసుండొచ్చు, నాకు తెలీదు." అంటూ ఖాళీ కప్పు టేబుల్ మీద పెట్టాడు సుబ్బు.

"నిజమే! చెన్నై ఎడిషన్ వార్తలు వేరుగానే వున్నాయి."

"ఏ వార్తైనా అనేక ముఖాలు కలిగుంటుంది. ఉదాహరణగా ఒక వార్తని పరిశీలిద్దాం. పులి ఆహారం కోసం మనిషిని వేటాడి ఆడవిలోకి లాక్కెళ్ళిపోయింది. అడవిలో పులులన్నీ కలిసి ఆ వేటని సుష్టుగా భోంచేశాయి. మనుషుల పత్రిక 'ఒక క్రూర దుర్మార్గ దుష్ట పులి హత్యాకాండ' అంటూ హెడ్‌లైన్స్‌తో విమర్శిస్తుంది. అదే వార్తని పులుల పత్రిక 'దుర్భర క్షుద్బాధతో అలమటిస్తున్న సాటి జీవుల ఆకలి తీర్చిన సాహస పులికి జేజేలు' అని హంతక పులి వీరత్వాన్ని కీర్తిస్తుంది." అన్నాడు సుబ్బు.

"వాటేన్ ఐరనీ సుబ్బూ! ఒక పక్క గుండెల్ని మార్చడం కోసం సిటీ ట్రాఫిక్కుల్ని ఆపేస్తున్నాం. ప్రత్యేక విమానాల్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. మనిషి ప్రాణం ఎంతో విలువైనదని ప్రవచిస్తున్నాం. ఇంకోపక్క - ప్రాణాలు పోయినందుకు ఆనందిస్తున్నాం." దిగులుగా అన్నాను.

"మిత్రమా! మరీ అంతగా కలత చెందకు. రాబోయే కాలం కోసం నీ దుఃఖాన్ని కొద్దిగా దాచుకో" అంటూ హడావుడిగా నిష్క్రమించాడు సుబ్బు. 

published in Saaranga web mag on 12 / 4 / 2015

గజేంద్ర సింగ్! మమ్మల్ని క్షమించు


ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర గజేంద్ర సింగ్ అనే రాజస్థాన్‌కి చెందిన రైతు చెట్టుకి ఉరేసుకుని చనిపొయ్యాడు. గజేంద్ర సింగ్ చెట్టుమీద కూర్చునున్న వీడియో క్లిప్పింగ్ చూశాను. ఆ తరవాత అతను శవమై చెట్టుకు వెళ్ళాడుతున్న ఫోటో చూశాను. మనసంతా దిగాలుగా అయిపోయింది.

ఢిల్లీ దేశరాజధాని కాబట్టి, ఈ రైతు మరణానికి మీడియా కవరేజ్ లభించింది గానీ - రాజస్థాన్, మహారాష్ట్ర, తెలంగాణా.. రాష్ట్రం ఏదైతేనేం రైతులు ఆత్మహత్య చేసుకోని రోజంటూ లేదు. కొన్నేళ్ళుగా మధ్యతరగతి బుద్ధిజీవులు రైతుల మరణాన్ని ఒక విశేషంగా భావించట్లేదు. ఆసక్తి కలిగించిన ఈ 'అప్రధాన' వార్తల్ని మీడియా కూడా పట్టించుకోవడం మానేసింది.

ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది, వడదెబ్బ తగిలి కొందరు చస్తారు. రేపు వర్షాకాలంలో రోగాలొచ్చి ఇంకొందరు చస్తారు. ఎల్లుండి చలికాలంలో చలికి నీలుక్కుపొయ్యి మరికొందరు చస్తారు. 'మరణిస్తారు' అని గౌరవంగా రాయకుండా 'చస్తారు' అని రాస్తున్నదుకు నన్ను మన్నించండి. వారి చావులు ఈ సభ్య సమాజాన్ని కనీసంగా కూడా కదిలించలేనప్పుడు భాష ఏదైతేనేం?

నరాలు మొద్దుబారి చర్మం స్పర్శ కోల్పోతే 'న్యూరోపతీ' అంటారు, ఇదో రోగం. నిస్సహాయులైనవారు - తమని ఇముడ్చుకోలేని ఈ సమాజం పట్ల విరక్తి చెంది.. కోపంతో, అసహ్యంతో ఆత్మహత్య చేసుకుంటారు. ఇంతకన్నా బలంగా తెలిపే నిరసన ప్రకటన ఇంకేదీ లేదు. అట్లాంటి 'చావు ప్రకటన'ని కూడా కాజువల్‌గా తీసుకునే ఈ సమాజపు 'ఎపతీ'ని ఏ రోగం పేరుతో పిలవాలి?

మన దేశం జీడీపి పెరుగుతుంది అంటారు, ఇన్‌ఫ్లేషన్ తగ్గుతుంది అంటారు, స్టాక్ మార్కెట్లు పైపైకి దూసుకుపొతున్నయ్ అంటారు. ఇవన్నీ గొప్పగా వున్నాయి కాబట్టి విదేశీ పెట్టుబడులు దేశంలోకి లావాలాగా పొంగి ప్రవహిస్తున్నాయి అంటారు. మంచిది, దేశం అభివృద్ధి చెందుతున్నందుకు సంతోషం. మరి రైతులు ఎందుకు చనిపోతున్నారు? పెరుగుతున్న సంపదలో రైతులకి వాటా లేదా? రైతులకి వాటా లేని అభివృద్ధి అభివృద్ధేనా?

మన రాజకీయ పార్టీలు సామాన్యుణ్ని పట్టించుకోవడం ఎప్పుడో మానేశాయి. ఈ విషయం చెప్పుకోడానికి అవి సిగ్గు పడుతున్నాయి గానీ, కొద్దిపాటిగా ఆలోచించేవాడికైనా విషయం అర్ధమైపోతుంది. అందుకే ప్రభుత్వాలిప్పుడు వాగాడంబరం, మాటల పటోటాపం, పదాల జిమ్మిక్కుల్ని ఆశ్రయిస్తున్నాయి. ఎన్నికల్లో డబ్బున్నవాడికే టిక్కెట్లివ్వడం, కొంతమంది పెద్దలకి లాభించే పనులు చేసుకోవడం, ప్రభుత్వ వైఫల్యాల్ని కప్పి పెట్టుకోడానికి మీడియాని మేనేజ్ చేసుకోవడం.. ఇదంతా చాలా ఆర్గనైజ్‌డ్‌గా, ప్రొఫెషనల్‌గా, వెల్ ఆయిల్డ్ మెషీన్లా స్మూత్‌గా సాగిపోతుంది.

రాజకీయ పార్టీల పెద్దలకో విజ్ఞప్తి! అయ్యా! మీరు మాకేం చెయ్యరని తెలుసు, చెయ్యకపోయినా పర్లేదు. కానీ - నిస్సహాయుల మరణం పట్ల మినిమం డీసెన్సీతో స్పందించడం నేర్చుకోండి. ఈ మరణాలకి సిగ్గుతో తల దించుకుని మీకింకా ఎంతోకొంత సభ్యత, మానవత్వం మిగిలుందని మాబోటి అజ్ఞానులకి తెలియజెయ్యండి.

ఇది రాస్తుంటే - నాకు నేనే ఒక ఈడియాటిక్ అశావాదిలా అనిపిస్తున్నాను. వేలమంది ఊచకోతకి గురైనా - ఆ చంపిందెవరో ఇప్పటిదాకా మనకి తెలీదు! ఇకముందైనా తెలుస్తుందనే ఆశ లేదు. మరప్పుడు ఆఫ్టరాల్ ఒక అల్పజీవి మరణం వార్తా పత్రికల్లో ఒకరోజు హెడ్లైన్‌కి తప్ప ఇంకెందుకు పనికొస్తుంది?

ఈ చావుని రాజకీయ పార్టీలు ఖచ్చితంగా రాజకీయ ప్రయోజనాలకి వాడుకుంటాయి. ఇలా 'లబ్ది' పొందడం రాజకీయ పార్టీలకి 'వృత్తిధర్మం' అయిపోయింది. గజేంద్ర సింగ్ ముగ్గురు బిడ్డలు దిక్కులేని వాళ్లైపొయ్యారే అని దిగులు చెందుతుంటే, ఈ పొలిటికల్ బ్లేమ్ గేమ్ చికాకు పెడుతుంది. స్వతంత్ర భారతంలో ఇదో విషాదం.

గజేంద్ర సింగ్! మమ్మల్ని క్షమించు. నువ్వు బ్రతికున్నప్పుడు ఏం చెయ్యాలో మాకు తెలీలేదు. చనిపొయినప్పుడూ ఏం చెయ్యాలో అర్ధం కావట్లేదు! 

published in Saaranga web mag on 22 / 4 / 2015

Sunday, 10 May 2015

పాఠకుల (బ్లాగర్ల) విచక్షణ


ఒక రచయిత తనకి తోచిన రీతిలో రచనలు చేస్తాడు. ఈ రచనా ప్రక్రియని కొందరు ప్రతిభావంతంగా, ఎక్కువమంది దరిద్రంగా, మరింత ఎక్కువమంది పరమ దరిద్రంగా చేస్తుంటారు. రాసేవాళ్ళు రాస్తుంటే చదివేవాళ్ళు చదువుతుంటారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కో కారణాన ఒక్కో రాతగాడంటే ఇష్టం, అయిష్టం.  

రచయితకి దేని గూర్చైనా రాసే హక్కున్నట్లే (వాస్తవానికి రచయితకి పెద్దగా హక్కుల్లేవని ఈమధ్య పెరుమాళ్ మురుగన్ తెలియజెప్పాడు), చదవాలా వద్దా అన్న విచక్షణ పాఠకుడికి వుంటుంది. కొందరు కొన్నాళ్ళు ఒక రచయితకి అభిమానిగా వుండి, కొన్ని కారణాల వల్ల ఆ రచయితని పట్టించుకోవడం మానేస్తారు. అందులో నేనూ వొకణ్నని చెప్పడానికి సంతోషిస్తున్నాను. 

'పచ్చ నాకు సాక్షిగా' చదివి నామిని అభిమాని అయ్యాను. ఆ తరవాత నామిని రచనల్ని చాలావరకు చదివాను. ఒక సందర్భంలో (నంబర్ వన్ పుడింగి అనుకుంటాను) రావిశాస్త్రి గూర్చి నోరు పారేసుకున్నాడు నామిని. రావిశాస్త్రి సాహిత్యంలోని మంచి చెడ్డలు చర్చిస్తూ అనేకమంది వ్యాసాలు రాశారు. బాలగోపాల్ అయితే చాలా నిర్మొహమాటంగా రావిశాస్త్రి పరిమితుల్ని ఎత్తి చూపుతూ చక్కటి వ్యాసం రాశాడు. ఈ వ్యాసాల్లో నాకు చాలా విషయం కనపడింది. 

కానీ - నామిని రావిశాస్త్రి రచనా విధానాన్ని (దీన్నే శిల్పం అంటారు) ఎగతాళి చేశాడు. అందుకు సరైన కారణం కూడా రాయలేదు. ఇది నాకు చాలా బాధ్యతా రాహిత్యంగా, దుర్మార్గంగా తోచింది. కాఫీ తాగుతూ - నామిని ప్రేలాపనల గూర్చి ఒక ఐదు నిమిషాలు తీవ్రంగా ఆలోచించాను. నామిని రచయిత. ఒక రచయిత ప్రోడక్ట్ అతని సాహిత్యం. అట్టి ప్రోడక్టుని బహిష్కరించి నిరసన తెలియజెయ్యగలగడం వినియోగదారుడిగా నాకున్న హక్కు. 

వెంటనే నా లైబ్రరీలో వున్న నామిని పుస్తకాలు తీసేశాను. హాస్పిటల్ ఆయాని పిల్చాను. "ఈ పుస్తకాల్ని కట్టగట్టి ఆ మెట్ల కింద తుక్కు సామాన్లో పడెయ్. తుక్కు సామాను కొనేవాడు వచ్చినప్పుడు తూకానికి అమ్మెయ్ - ఎంత తక్కువైనా పర్లేదు. ఆ డబ్బు నువ్వు తీసుకో. నీకిది చాలా ముఖ్యమైన పని, సాధ్యమైనంత తొందరగా పూర్తి చెయ్యి." అని చెప్పాను. మర్నాడు ఆ పుస్తకాల్ని ఒక తోపుడు బండివాడు కొనుక్కున్నాడు.  

నామిని 'మూలింటామె' చదివావా? అని నన్ను కనీసం పదిమంది అడిగారు. ఇంకా చదవలేదు, బిజీగా వున్నానని చెప్పాను గానీ - వాస్తవానికి ఆ రచనకి నోబెల్ బహుమతి వచ్చినా కూడా, అందులో ఒక్క వాక్యమైనా చదివే ఉద్దేశం నాకు లేదు. నాకు సంబంధించి - నామిని అనే తెలుగు రచయిత లేడు! మొన్నామధ్య ఒక మిత్రుడు పంపగా - 'మూలింటామె' కొరియర్ వచ్చింది. జాగ్రత్తగా ఆ పుస్తకాన్ని రిసెప్షన్ బల్ల మీద పడేయించాను. రెండ్రోజుల తరవాత ఆ 'మూలింటామె' కనబడ్డం మానేసింది! ఆ విధంగా పాఠకుడిగా నాకున్న హక్కుని వినియోగపర్చుకుని నాకు నచ్చని రచయితని ఇగ్నోర్ చేసి తృప్తి నొందాను. 

చివరి మాట -

నా బ్లాగ్ చదివేవాళ్ళక్కూడా నేనిచ్చే సలహా ఇదే. నా రాతలు నచ్చకపోతే ఇటు రాకండి. నా ఆలోచన రాసుకునే హక్కు నాకున్నట్లే, దాన్ని చదవకుండా ఇగ్నోర్ చేసే హక్కు మీకుంది. కానీ - ఈ బ్లాగ్లోకంలో మీ హక్కుని మీరు సరీగ్గా వినియోగించుకోవట్లేదని చెప్పడానికి విచారిస్తున్నాను. 

కొందరు వ్యక్తులు అదేపనిగా నన్ను విమర్శిస్తూ కామెంట్లు రాయడమే పనిగా పెట్టుకున్నారు. 'నా కామెంట్ ఎందుకు పబ్లిష్ చెయ్యలేదు?' అంటూ మళ్ళీ ఆరాలు! ఇంకొందరు - "ఫలానా బ్లాగులో మిమ్మల్ని తిడుతున్నారు, పట్టించుకోకండి." అంటూ ఆయా సైట్లకి లింక్‌లిస్తూ 'ధైర్యం' చెబుతున్నారు (వీళ్ళది ఆ తిట్లు నేనెక్కడ మిస్సైపోతున్నానో అనే బెంగ కావచ్చు). మొత్తానికి ఈ తెలుగు బ్లాగ్లోకం నన్ను చాలా విసిగిస్తుంది

ఇక్కడితో ఈ పోస్టు సమాప్తం. 

ఇప్పుడు కొంతసేపు నా బ్లాగ్ కష్టాలు (ఇంతకు ముందోసారి రాశాను) - 

కొందరు బ్లాగర్లు యెల్లో పేజెస్ ద్వారా నా హాస్పిటల్ నంబరు తెలుసుకుని, ఫోన్ చేసి సైకియాట్రీ సబ్జక్టు సంబంధించిన సలహాలు అడుగుతున్నారు. ఇంకొందరు నన్ను ఫలానా సైకియాట్రిస్టుకి ఫోన్ చేసి చెప్పమని (ముఖ్యంగా ఎన్నారైలు) అడుగుతున్నారు. ఇది నాకు చాలా ఇబ్బందిగా, మొహమాటంగా వుంది. దయచేసి నన్ను బ్లాగరుగా మాత్రమే చూడ ప్రార్ధన. 

ఇంకో విషయం. నా పర్సనల్ నంబర్ కావాలనీ, గుంటూరు వచ్చినప్పుడు కలుస్తామనీ అడుగుతున్నారు. నాకు తోటి బ్లాగర్లతో వ్యక్తిగత పరిచయాల పట్ల ఆసక్తి లేదు (ఇది చాలా ముఖ్యమైన పాయింట్). నా పరిచయం బ్లాగుకే పరిమితం. అంతకు మించి - నన్ను కలిసే అవకాశం మీకు లేదని సవినయంగా మనవి చేస్తున్నాను. 

వైద్యవృత్తిలో బిజీగా వుంటూ తెలుగు బ్లాగుల్ని రెగ్యులర్‌గా రాస్తున్న ఏకైక అధముణ్ని నేనే! అందుగ్గానూ (విసిగించి) శిక్షించబూనడం మర్యాద కాదని కూడా తెలియ జేసుకుంటున్నాను. కాదూ కూడదూ అంటే బ్లాగు మూసేసుకుని స్నేహితుల కోసం ప్రైవేటుగా రాసుకుంటాను. థాంక్యూ!

(picture courtesy : Google) 

Monday, 4 May 2015

మారిపోవురా కాలము..


"ఏవిఁటో! ఆ రోజులే వేరు. పెళ్ళంటే నెల్రోజుల పాటు చుట్టపక్కాల్తో ఇల్లు కళకళ్ళాడిపొయ్యేది. ఇవ్వాళ పెళ్ళంటే తూతూ మంత్రంగా ఒక్కరోజు తతంగం అయిపోయింది." కాఫీ చప్పరిస్తూ గొప్ప జీవిత సత్యాన్ని కనుక్కున్నట్లు గంభీరంగా అంది అమ్మ.

నాకు నవ్వొచ్చింది. 'పాతరోజులు అంత మంచివా? పెళ్ళి నెల్రోజులు జరిగితే గొప్పేంటి? ఒక రోజులో లాగించేస్తే తప్పేంటి? ' అని మనసులో అనుకున్నాను గానీ, అమ్మనేమీ అడగలేదు - అలా అడిగి ఆమె ఆనందాన్ని చెడగొట్టడం నాకిష్టం లేదు కాబట్టి!

పెద్ద వయసు వాళ్ళు 'మా రోజుల్లో అయితేనా.. ' అని ఉత్సాహంగా చెబుతుంటారు. ఈ అనుభూతుల్ని నోస్టాల్జియా అంటారు. కొందరు నోస్టాల్జియాని ప్రేమిస్తారు. మన సంస్కృతి, సాంప్రదాయం, అలవాట్లు, వస్తువులు, భాష అంతరించిపోతున్నాయని బాధ పడుతుంటారు. వీరిని 'గతం' ప్రేమికులు అనవచ్చునేమో! కాలంతో పాటు సమాజం కూడా నిత్యం మారుతూనే వుంటుంది. కొత్తని గ్రహిస్తూ పాతని వదిలించుకోవడం దాని లక్షణం. ఈ సంగతి 'గతం' ప్రేమికులకి తెలిసినా అందులోంచి బయటకి రాలేకపోతుంటారు.

ఇందుకు ఉదాహరణ - నా చిన్నప్పటి పౌరాణిక నాటకాలు. అక్కడ తెల్లవార్లు పద్యాలే పద్యాలు! ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు.. వరస పెట్టి గంటల కొద్దీ రాగాలు తీస్తూ పద్యాలు పాడుతూనే వుండేవాళ్ళు, 'వన్స్ మోర్' అనిపించుకునేవాళ్ళు. క్రమేపి ఈ వన్స్ మోర్ నాటకాలు మూలబడ్డాయి. వీటిని మళ్ళీ బ్రతికించడం కోసం కొందరు నాటక ప్రేమికులు నడుం బిగించారు గానీ - ఏదో అరకొరగా ప్రభుత్వ నిధులు పొందడం, అమెరికా తెలుగు సంఘాల ఆర్ధిక సహాయం సంపాదించడం మించి వారేమీ పెద్దగా సాధించినట్లు లేదు.

అందరికీ అన్నీ ఇష్టం వుండవు, కొందరికి కొన్నే ఇష్టం. తరాల అంతరం పూడ్చలేం. ఒకప్పటి మన ఇష్టాల్ని మళ్ళీ ప్రాచుర్యంలోకి తెద్దామనుకోవడం అత్యాశ. నా పిల్లలకి సావిత్రి సినిమా చూపిద్దామనీ, ఘంటసాల పాట వినిపిద్దామనీ విఫల యత్నాలు చేసిన పిమ్మట - 'ఇష్టాయిష్టాలు పూర్తిగా వ్యక్తిగతమైనవి, ఒకరి ఆలోచనలు ఇంకోళ్ళ మీద రుద్దరాదు' అనే జ్ఞానోదయం కలిగింది. ఆపై నా ఆలోచనని మార్చేసుకుని - నేనూ నా ఇష్టాల చుట్టూ గిరి గీసుకున్నాను.

నాకు పెసరట్టు ఇష్టం, ఫిల్టర్ కాఫీ ఇష్టం, సింగిల్ మాల్ట్ ఇష్టం, రావిశాస్త్రి ఇష్టం. నాకిట్లాంటి ఇష్టాలు చాలానే వున్నాయి. ఈ ఇష్టాలన్నీ పూర్తిగా నాకు మాత్రమే సంబంధించిన ప్రైవేటు వ్యవహారం. ఇవన్నీ ఇంకా ఎంతమందికి ఇష్టమో నాకు తెలీదు. ఇవి నాకు తప్ప ఇంకెవరికీ ఇష్టం లేకపోయినా నేను పట్టించుకోను. నా ఇష్టాలన్నీ చట్టవిరుద్ధమైపోయి, సౌదీ అరేబియాలోలా కౄరంగా కొరడా దెబ్బల్తో శిక్షించే ప్రమాదం వస్తే తప్ప - వాటిని రివ్యూ చేసుకునే ఉద్దేశం కూడా లేదు!

ఇలా నా ఇష్టాల్ని నేను మాత్రమే అనుభవించేస్తూ, వాటి "గొప్పదనాన్నీ", "మంచితనాన్నీ" నలుగురికీ పంచని యెడల కొన్నాళ్ళకి అవి అంతరించపోవచ్చును గదా? పోవచ్చు! నేను పొయ్యాక నా ఇష్టాలు ఏమైపోతే మాత్రం నాకెందుకు? నేను చచ్చి పిశాచాన్నయ్యాక ఏం చేస్తానో నాకు తెలీదు. పిశాచం మనిషిగా వున్నప్పటి అలవాట్లనే కంటిన్యూ చేస్తుందా? సమాధానం తెలిసినవారు చెప్పగలరు!

(picture courtesy : Google)

Friday, 1 May 2015

బాబాగారికో విన్నపం


వారు యోగాసనాల గురువు. ఆయన ఉన్నత వర్గాల వారికి గుండెల నిండుగా గాలి ఎలా పీల్చుకోవాలో నేర్పిస్తారు. ఆపై కాళ్ళూ చేతులతో అనేక విన్యాసాలు చేయిస్తారు. మంచిది, సుఖమయ జీవనానికి అలవాటైనవారికి కూసింత కొవ్వు కరిగించుకోడానికి గురువుగారు సాయం చేస్తుంటే ఎవరికి మాత్రం అభ్యంతరం?

వారికి రాజకీయ రంగం పట్ల ఆసక్తి వుంది. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని స్వదేశానికి తీసుకురావాలని తెగ తాపత్రయ పడ్డారు. అందుకోసం గొప్ప ఉద్యమం కూడా చేశారు. మంచిది, ప్రజలకి సేవ చెయ్యాలంటే రాజకీయ రంగాన్ని మించింది మరేదీ లేదు. ఇప్పుడెందుకో ఆయన తను డిమాండ్ చేసిన నల్లదనం ఇంకా మన్దేశానికి రాలేదన్న విషయం మర్చిపొయ్యారు. బహుశా పని వొత్తిడి కారణం కావచ్చు!

వారికి ఆయుర్వేద మందుల వ్యాపారం వుంది. మంచిది, వ్యాపారం టాటా బిర్లాల సొత్తు మాత్రమే కాదు. 'కృషి వుంటే మనుషులు ఋషులౌతారు' అని ఏదో సినిమా ఒక పాట కూడా వుంది కదా! అంచేత - ఋషులు కూడా వ్యాపార రంగంలో రాణిస్తున్నందుకు సంతోషిద్దాం. 

వందల కోట్ల విలువ చేసే వారి ఫార్మసీలో మగపిల్లల్ని పుట్టించడానికి ఆయుర్వేద మందులు అమ్ముతున్నారు. ఇది నేరం అని కొందరు గిట్టనివాళ్ళు ప్రచారం చెయ్యొచ్చు. కానీ, సమాజంలో మగబిడ్డల కోసం ఆరాటం ఇప్పటిది కాదు. దశరథుడి కాలం నుండే వుంది. దశరథ మహారాజు పుత్రుల కోసం యజ్ఞం చేశాడే గానీ పుత్రికల కోసం చెయ్యలేదు. 

మెడికల్ సైన్సు క్షుద్రమైనది. అది - మన పవిత్ర తాళపత్ర గ్రంధాల్ని, అందుగల అమోఘమైన శాస్త్రీయ విషయాల్ని తొక్కిపట్టడానికి పాశ్చాత్యులు పన్నిన కుట్రలో భాగం. అందుకే పిల్లలు కావాలన్నప్పుడు పొటెన్సీ, మోటిలిటీ, ఫెర్టిలిటీ అంటూ ఏదో చెత్త చెబుతుంటారు. అబ్బాయే కావాలంటే క్రోమోజోముల లెక్క చెబుతారు. అవన్నీ మనం పట్టించుకోరాదు. 

మగపిల్లాణ్ని పుట్టించుకోడం కోసం యజ్ఞం చెయ్యడం అనేది ఖరీదైన వ్యవహారం, అందుకే అది ప్రజల సొమ్ముతో సొంత వ్యవహారాలు చక్కబెట్టుకునే రాజులకి మాత్రమే పరిమితమైంది. ఇవ్వాళ మనకి అంత ఆర్భాటం, ఆయాసం లేకుండా ఇన్స్టంట్ ఫుడ్ మాదిరిగా మగపిల్లల్ని పుట్టించే మందుని యోగాసనాల స్వామిగారు సరసమైన ధరకి మార్కెట్లో అమ్మిస్తున్నారు. అందుకు మనం బాబాగార్ని అభినందించాలి. 

బాబాగారికో విన్నపం. అయ్యా! తమరు మీ రీసెర్చిని ఇంకా ముందుకు తీసుకెళ్ళి సామాన్య మానవులకి మరింత మేలు చెయ్యాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు పిల్లల భవిష్యత్తు అంత ఆశాజనకంగా లేదు. అందువల్ల మీ మందుల్తో పుట్టబొయ్యే మగబిడ్డ భవిష్యత్తు గూర్చి తలిదండ్రులు ఆందోళన చెందకుండా - ఆ పుట్టినవాడు అయ్యేఎస్ అయ్యేందుకు అయ్యేఎస్ లేహ్యం, అమెరికాలో స్థిరపడేందుకు అమెరికా తైలం లాంటి మందుల్ని కూడా జనబాహుళ్యంలోకి తేవాలని కోరుకుంటున్నాను! 

(picture courtesy : Google)