ఒక రచయిత తనకి తోచిన రీతిలో రచనలు చేస్తాడు. ఈ రచనా ప్రక్రియని కొందరు ప్రతిభావంతంగా, ఎక్కువమంది దరిద్రంగా, మరింత ఎక్కువమంది పరమ దరిద్రంగా చేస్తుంటారు. రాసేవాళ్ళు రాస్తుంటే చదివేవాళ్ళు చదువుతుంటారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కో కారణాన ఒక్కో రాతగాడంటే ఇష్టం, అయిష్టం.
రచయితకి దేని గూర్చైనా రాసే హక్కున్నట్లే (వాస్తవానికి రచయితకి పెద్దగా హక్కుల్లేవని ఈమధ్య పెరుమాళ్ మురుగన్ తెలియజెప్పాడు), చదవాలా వద్దా అన్న విచక్షణ పాఠకుడికి వుంటుంది. కొందరు కొన్నాళ్ళు ఒక రచయితకి అభిమానిగా వుండి, కొన్ని కారణాల వల్ల ఆ రచయితని పట్టించుకోవడం మానేస్తారు. అందులో నేనూ వొకణ్నని చెప్పడానికి సంతోషిస్తున్నాను.
'పచ్చ నాకు సాక్షిగా' చదివి నామిని అభిమాని అయ్యాను. ఆ తరవాత నామిని రచనల్ని చాలావరకు చదివాను. ఒక సందర్భంలో (నంబర్ వన్ పుడింగి అనుకుంటాను) రావిశాస్త్రి గూర్చి నోరు పారేసుకున్నాడు నామిని. రావిశాస్త్రి సాహిత్యంలోని మంచి చెడ్డలు చర్చిస్తూ అనేకమంది వ్యాసాలు రాశారు. బాలగోపాల్ అయితే చాలా నిర్మొహమాటంగా రావిశాస్త్రి పరిమితుల్ని ఎత్తి చూపుతూ చక్కటి వ్యాసం రాశాడు. ఈ వ్యాసాల్లో నాకు చాలా విషయం కనపడింది.
కానీ - నామిని రావిశాస్త్రి రచనా విధానాన్ని (దీన్నే శిల్పం అంటారు) ఎగతాళి చేశాడు. అందుకు సరైన కారణం కూడా రాయలేదు. ఇది నాకు చాలా బాధ్యతా రాహిత్యంగా, దుర్మార్గంగా తోచింది. కాఫీ తాగుతూ - నామిని ప్రేలాపనల గూర్చి ఒక ఐదు నిమిషాలు తీవ్రంగా ఆలోచించాను. నామిని రచయిత. ఒక రచయిత ప్రోడక్ట్ అతని సాహిత్యం. అట్టి ప్రోడక్టుని బహిష్కరించి నిరసన తెలియజెయ్యగలగడం వినియోగదారుడిగా నాకున్న హక్కు.
వెంటనే నా లైబ్రరీలో వున్న నామిని పుస్తకాలు తీసేశాను. హాస్పిటల్ ఆయాని పిల్చాను. "ఈ పుస్తకాల్ని కట్టగట్టి ఆ మెట్ల కింద తుక్కు సామాన్లో పడెయ్. తుక్కు సామాను కొనేవాడు వచ్చినప్పుడు తూకానికి అమ్మెయ్ - ఎంత తక్కువైనా పర్లేదు. ఆ డబ్బు నువ్వు తీసుకో. నీకిది చాలా ముఖ్యమైన పని, సాధ్యమైనంత తొందరగా పూర్తి చెయ్యి." అని చెప్పాను. మర్నాడు ఆ పుస్తకాల్ని ఒక తోపుడు బండివాడు కొనుక్కున్నాడు.
నామిని 'మూలింటామె' చదివావా? అని నన్ను కనీసం పదిమంది అడిగారు. ఇంకా చదవలేదు, బిజీగా వున్నానని చెప్పాను గానీ - వాస్తవానికి ఆ రచనకి నోబెల్ బహుమతి వచ్చినా కూడా, అందులో ఒక్క వాక్యమైనా చదివే ఉద్దేశం నాకు లేదు. నాకు సంబంధించి - నామిని అనే తెలుగు రచయిత లేడు! మొన్నామధ్య ఒక మిత్రుడు పంపగా - 'మూలింటామె' కొరియర్ వచ్చింది. జాగ్రత్తగా ఆ పుస్తకాన్ని రిసెప్షన్ బల్ల మీద పడేయించాను. రెండ్రోజుల తరవాత ఆ 'మూలింటామె' కనబడ్డం మానేసింది! ఆ విధంగా పాఠకుడిగా నాకున్న హక్కుని వినియోగపర్చుకుని నాకు నచ్చని రచయితని ఇగ్నోర్ చేసి తృప్తి నొందాను.
చివరి మాట -
నా బ్లాగ్ చదివేవాళ్ళక్కూడా నేనిచ్చే సలహా ఇదే. నా రాతలు నచ్చకపోతే ఇటు రాకండి. నా ఆలోచన రాసుకునే హక్కు నాకున్నట్లే, దాన్ని చదవకుండా ఇగ్నోర్ చేసే హక్కు మీకుంది. కానీ - ఈ బ్లాగ్లోకంలో మీ హక్కుని మీరు సరీగ్గా వినియోగించుకోవట్లేదని చెప్పడానికి విచారిస్తున్నాను.
కొందరు వ్యక్తులు అదేపనిగా నన్ను విమర్శిస్తూ కామెంట్లు రాయడమే పనిగా పెట్టుకున్నారు. 'నా కామెంట్ ఎందుకు పబ్లిష్ చెయ్యలేదు?' అంటూ మళ్ళీ ఆరాలు! ఇంకొందరు - "ఫలానా బ్లాగులో మిమ్మల్ని తిడుతున్నారు, పట్టించుకోకండి." అంటూ ఆయా సైట్లకి లింక్‌లిస్తూ 'ధైర్యం' చెబుతున్నారు (వీళ్ళది ఆ తిట్లు నేనెక్కడ మిస్సైపోతున్నానో అనే బెంగ కావచ్చు). మొత్తానికి ఈ తెలుగు బ్లాగ్లోకం నన్ను చాలా విసిగిస్తుంది.
ఇక్కడితో ఈ పోస్టు సమాప్తం.
ఇప్పుడు కొంతసేపు నా బ్లాగ్ కష్టాలు (ఇంతకు ముందోసారి రాశాను) -
కొందరు బ్లాగర్లు యెల్లో పేజెస్ ద్వారా నా హాస్పిటల్ నంబరు తెలుసుకుని, ఫోన్ చేసి సైకియాట్రీ సబ్జక్టు సంబంధించిన సలహాలు అడుగుతున్నారు. ఇంకొందరు నన్ను ఫలానా సైకియాట్రిస్టుకి ఫోన్ చేసి చెప్పమని (ముఖ్యంగా ఎన్నారైలు) అడుగుతున్నారు. ఇది నాకు చాలా ఇబ్బందిగా, మొహమాటంగా వుంది. దయచేసి నన్ను బ్లాగరుగా మాత్రమే చూడ ప్రార్ధన.
ఇంకో విషయం. నా పర్సనల్ నంబర్ కావాలనీ, గుంటూరు వచ్చినప్పుడు కలుస్తామనీ అడుగుతున్నారు. నాకు తోటి బ్లాగర్లతో వ్యక్తిగత పరిచయాల పట్ల ఆసక్తి లేదు (ఇది చాలా ముఖ్యమైన పాయింట్). నా పరిచయం బ్లాగుకే పరిమితం. అంతకు మించి - నన్ను కలిసే అవకాశం మీకు లేదని సవినయంగా మనవి చేస్తున్నాను.
వైద్యవృత్తిలో బిజీగా వుంటూ తెలుగు బ్లాగుల్ని రెగ్యులర్‌గా రాస్తున్న ఏకైక అధముణ్ని నేనే! అందుగ్గానూ (విసిగించి) శిక్షించబూనడం మర్యాద కాదని కూడా తెలియ జేసుకుంటున్నాను. కాదూ కూడదూ అంటే బ్లాగు మూసేసుకుని స్నేహితుల కోసం ప్రైవేటుగా రాసుకుంటాను. థాంక్యూ!
(picture courtesy : Google)
అయ్యబాబోయ్ డాక్టర్ గారూ, ఎప్పుడైనా గుంటూరు వస్తే మిమ్మల్ని కలుసుకోవచ్చు (మర్యాదపూర్వకంగా మాత్రమే; ఏదో ఫేవర్స్ కోసం కాదు) అనుకునేవాడిని నేను కూడా ఇన్నిరోజులూ. ఇంకా నయం, బ్లాగు పాఠకులు గాని, సహబ్లాగర్లు గాని మీతో ముఖపరిచయం పెంచుకోవటానికి ప్రయత్నం చెయ్యటం మీకు సుతరామూ ఇష్టం లేదని మీ కారణాలతో కుండ బద్దలు కొట్టిన ఈ బ్లాగుపోస్ట్ చూడటం మంచిదయింది. అలాగే మీలాంటి అభిప్రాయమే కలిగున్న బ్లాగర్లు ఇంకా వేరే కూడా ఉండొచ్చు (తప్పక ఉండే ఉంటారు), అటువంటి బ్లాగర్ల విషయంలో కూడా ఇటువంటి భ్రమలున్నవారిని (పరిచయాలు చేసుకుని స్నేహితుల్ని సంపాదించుకోవటానికి బ్లాగులు కూడా ఓ మంచి మార్గం అని భ్రమపడేవారిని) అటువంటి ప్రయత్నం చెయ్యకుండా ఆ భ్రమల నుంచి బయట పడెయ్యటానికి ఉపయోగపడుతుంది మీ ఈ పోస్ట్.
ReplyDelete
ReplyDeleteతెలుగు బలాగులు రాయటం ఢిల్లీ లాంటి చోట్ల బండ్లు/కార్లు నడపడం లాంటి ప్రక్రియ అన్నమాట..
మీ తప్పులేకఫొయినా అవతలి వాళ్ళ తిట్లదండకం వినాల్సి రావొచ్చు.. మరీ నీల్గితే ముష్టి యుద్దాలు కూడా జరగొచ్చు.. నిన్ననే ఒక బైకర్ ఒక బస్సు డ్రైవర్ని హెల్మెట్ తో బాది చంపాడంట..
పైగా, ఈ గొడవ మధ్యకెల్లి వదిలెయ్యండ్ర బాబు అని చెబితే (ఇక్కడ ఒక కామెంటెడితే), మనకీ ఓ నాల్గు తగుల్తాయ్!
ఒక కళాకారుడి యొక్క సృజన కాని అతడి దృక్పథం కాని నచ్చకపోతే ఆ కళాకారుడిని వ్యక్తిగతంగా ఒకరు దూరంగా పెట్టటంలో అభ్యంతరం ఎవరికీ ఉండకూడదు. ఈ విషయంలో మీరు మీ ధోరణిని సోదాహరణంగా బాగానే వివరించారు. ప్రజల్లో కళలూ భక్తీ వగైరా భావోద్వేగాలను గురించి ఉన్న గౌరవభావాలను సొమ్ము చేసుకుందుకు తీసే సినీమాల పట్ల సదభిప్రాయం లేక నేనూ అటువంటి పనే చేసాను.
ReplyDeleteతెలుగు బ్లాగులోకం అటు అమాయకులతోటీ ఇటు ధూర్తులతోటీ కూడా నిండి ఉండి అచ్చమైన మన నిజప్రపంచం లాగానే ఉంది. అది మిమ్మల్ని విసిగిస్తోందని వాపోవనవసరం లేదు. మీరు నిజప్రపంచాన్ని దూరం పెట్టలేరు , ఒక విరాగి కాకపోతే. కాని, ఈ బ్లాగుప్రపంచాన్ని దూరం పెట్టవచ్చును, అది నచ్చకపోతే. అదేమీ నేరం కాదు. విడ్డూరమూ కాదు.
ఒక బ్లాగరుగా మాత్రమే, అంటే కేవలం సైబర్ సిటిజన్ 'పనిలేని బ్లాగు రమణగారి' లాగానే మిమ్మల్ని సాటి నెటిజనులు భావించాలని కోరుకోవటమూ సమర్థనీయమే. మీ నిర్ణయం మీస్వంతం - దానిని ఎవరూ పశ్నించరాదు.
మిమ్మల్ని కొందరు రకరకాలుగా విసిగిస్తున్నారని భావిస్తున్నారని అర్థమౌతోంది. ఇది మీవంటి తీరికలేని వృత్తిలో ఉన్న వారికి ఎంత అసౌకర్యమో అర్థం చేసుకోగలం. తీరికచేసుకుని అప్పుడప్పుడూ వ్రాస్తున్నారు - బాగా వ్రాస్తున్నారు. సంతోషం. అది కొనసాగించమని విన్నపం. మీ అభిప్రాయాలతో అన్ని సార్లూ ఏకభవించలేని వాళ్ళు కూడా మీరు వ్రాయాలని కోరుతున్నారనే నా అభిప్రాయం. విసిగించే వారిని దూరం పెట్టాలనుకుంటే వ్యాఖ్యలను స్వీకరించటం మానివేస్తే సరి. ఆ పని ఇప్పటికే కొందరు చేస్తున్నారు కదా. అంతే కాని మీబ్లాగును మూసివేయ వలసిన అగత్యం కనిపించటం లేదు.
నామిని పట్ల మీ చర్యను ఉదహరించి మరీ నచ్చకపోతే ఎలా ఇగ్నోర్ చేయాల్నో చెప్పారు. బాగుంది. మీ పోష్టులు చెత్తగా ఉన్నాయనుకుంటే ఇగ్నోర్ చేయాలి. నచ్చకపోతే సభ్యతగా వాదించాలి. తప్పులు వ్రాస్తే ఒప్పేదో చెప్పి ఒప్పించాలి. అలా కాక దొంగ బ్లాగులు పెట్టి సొల్లు కక్కడం , విపరీత శునకానందం పొందడం భావ ప్రకటనకు అంతరాయం కలిగించడమే. అయితే మొదట్లో నేను వీరిని పట్టించుకుని బాధపడేవాడిని. నా బ్లాగులు మూసేద్దామనుకున్నాను. ఇలాంటి వెధవలను ఇగ్నోర్ చేయడమూ నే(మా)ర్చుకుని మన పని మనం చేసుకుంటూ పోవడమూ చేయాలి. ఆ విధంగా రాటుదేలకపోతే తెలుగు బ్లాగుల నుండి చాలామం(చి)ది రచయితలు దూరం అయ్యే ప్రమాదం ఉంది. ఆ ప్రమాదానికి ఊతం ఇచ్చేలా మీ చర్య ఉండకూడదు. ఉండదని ఆశిస్తున్నాను.
ReplyDelete
ReplyDelete>>> వైద్య వృత్తి లో 'బిజీ' గా ఉంటూ (నిజమే నంటారా !? :)) తెలుగు బ్లా 'గుళ్ళో' రెగ్యులర్ గా రాస్తున్న 'ఏకైక' అధముణ్ని
'నేనే" !
అబ్బే ! అట్లా మొత్తం క్రెడిట్ నేనే నేనే అంటూ మీరే కొట్టేస్తే మేమంతా ఏమి జేసేదండి 'డాటేరు' బాబు గారు !
వ్రాస్తూ ఉండండి ! తీరిక ఉన్నప్పుడు ! తేరిక లేకుంటే తీరిక జేసుకుని వ్రాయండి !
నలుగురు నవ్వి పోదురు గాని నాకేటి సిగ్గు కూనలమ్మ అని ఊరికే అన్నారా కవివరులు ?
ఆల్ ది బెష్ట్ !
చీర్స్
జిలేబి
ఏమిటండి పాపం! నామిని గారిని అందరు అలా విసుక్కుంటారు? ఆయన నెంబర్ ఒన్ పుడింగి అయినందుకా? మీరు నడిమింటి ఆమెను చదవక పోయినందు వల్ల చాలా మిస్సయ్యారు. - పంది వసంత మానసిక విశ్లేషణ చే య్యడమ్ చేతులార కోల్పోయారు. అహా( ! మేము కోల్పోయాం. ఆమె గారి మానసిక విశ్లేషణ మీరు చేస్తె మేము చదవడం. ఆ విధమగా మన భ్లాగ్ పాఠకులు కోల్పోయారు. చూశారా మీ హాక్కు ఎందరి హాక్కులను కాజేసిమ్దో? (:
ReplyDeleteTill now, I have not commented in your blog except once when you wrote on bapu ramana.
ReplyDeleteAs per you, you have a freedom of writing anything that you want. your likes, dislikes etc.,
And others cant write in their posts about something which they don't like in your posts?
As you wrote on some writer in this post, the other person is writing about you in other post and what is wrong in that? freedom is same for everyone right.
Pardon me for my English.
డాక్టరు గారూ!
ReplyDeleteమూడు కథల బంగారం బుక్ దొరకడం లేదు. మీ దగ్గర ఉన్న కాపీ బ్లాగ్లో పెట్టడానికి వీలవుతుందా!
రాజధాని నిర్మాణం వల్ల గుంటూరు జనాభా పెరిగితే, ఆ జనాభాకి తగినట్టుగా psychiatristలూ, neurologistలూ అవసరం కనుక, మీరు బ్లాగుల కోసం మీ వృత్తికి దూరం కానక్కరలేదు. నేనైతే, నా దగ్గర రెండు మొబైల్స్ ఉన్నాయి కనుక, నేను 24 గంటలూ ఆన్లైన్‌లో ఉంటాను. మీరు మాత్రం ఒక చేతితో laptop పట్టుకుని ఇంకో చేతితో రోగి చెయ్యి పట్టుకోలేరు.
ReplyDeleteబ్లాగ్స్ గుర్తు వస్తే కూడలి ఒకసారి చూసే అలవాటు కాస్తా మారి మీ బ్లాగ్ అడ్రెస్స్ టైపు చెయ్యడం గా మారింది. అలాంటిది ఒక్కసారి అనుమతి తీసేస్తే హ్మం .
ReplyDeleteమీ టపాలు మమ్మల్ని నాలుగు గోడల మధ్యనుండి సమాజం లోకి తీసికొని వస్తు ఉంటాయి. కాబట్టే మీరు మళ్ళీ వెనక్కి వస్తారన్న నమ్మకం తో ఇంకోసారి చెక్ చె య్యగలిగాము మీ లాంటి కొద్దిమంది బ్లాగర్లు గొప్ప ఉదాహరణ వ్యతిరేక దాడుల్ని ఎలా తట్టుకొని నిలబడాలో చెప్పదానికి. ఇప్పుడు తెలుస్తున్నది ఏమంటే మీరు ఉన్నంతవరకు వాళ్ళు ఉంటారు. కాబట్టి మీ రచనలు మరింత ఆసక్తికరమవుతాయే కాని , మీ నిశ్శబ్దం మాత్రం అస్సలు న్యాయం కాదు.
NO COMMENTS PLEASE :
ReplyDeleteThis blog is closed. So, no comments would be published. Since i don't know how to disable comments option for the whole blog posts, i left comment box open. I request my blog readers not to post any comments. My apologies to the readers who have been posting comments. Thank you.