Monday, 4 May 2015

మారిపోవురా కాలము..


"ఏవిఁటో! ఆ రోజులే వేరు. పెళ్ళంటే నెల్రోజుల పాటు చుట్టపక్కాల్తో ఇల్లు కళకళ్ళాడిపొయ్యేది. ఇవ్వాళ పెళ్ళంటే తూతూ మంత్రంగా ఒక్కరోజు తతంగం అయిపోయింది." కాఫీ చప్పరిస్తూ గొప్ప జీవిత సత్యాన్ని కనుక్కున్నట్లు గంభీరంగా అంది అమ్మ.

నాకు నవ్వొచ్చింది. 'పాతరోజులు అంత మంచివా? పెళ్ళి నెల్రోజులు జరిగితే గొప్పేంటి? ఒక రోజులో లాగించేస్తే తప్పేంటి? ' అని మనసులో అనుకున్నాను గానీ, అమ్మనేమీ అడగలేదు - అలా అడిగి ఆమె ఆనందాన్ని చెడగొట్టడం నాకిష్టం లేదు కాబట్టి!

పెద్ద వయసు వాళ్ళు 'మా రోజుల్లో అయితేనా.. ' అని ఉత్సాహంగా చెబుతుంటారు. ఈ అనుభూతుల్ని నోస్టాల్జియా అంటారు. కొందరు నోస్టాల్జియాని ప్రేమిస్తారు. మన సంస్కృతి, సాంప్రదాయం, అలవాట్లు, వస్తువులు, భాష అంతరించిపోతున్నాయని బాధ పడుతుంటారు. వీరిని 'గతం' ప్రేమికులు అనవచ్చునేమో! కాలంతో పాటు సమాజం కూడా నిత్యం మారుతూనే వుంటుంది. కొత్తని గ్రహిస్తూ పాతని వదిలించుకోవడం దాని లక్షణం. ఈ సంగతి 'గతం' ప్రేమికులకి తెలిసినా అందులోంచి బయటకి రాలేకపోతుంటారు.

ఇందుకు ఉదాహరణ - నా చిన్నప్పటి పౌరాణిక నాటకాలు. అక్కడ తెల్లవార్లు పద్యాలే పద్యాలు! ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు.. వరస పెట్టి గంటల కొద్దీ రాగాలు తీస్తూ పద్యాలు పాడుతూనే వుండేవాళ్ళు, 'వన్స్ మోర్' అనిపించుకునేవాళ్ళు. క్రమేపి ఈ వన్స్ మోర్ నాటకాలు మూలబడ్డాయి. వీటిని మళ్ళీ బ్రతికించడం కోసం కొందరు నాటక ప్రేమికులు నడుం బిగించారు గానీ - ఏదో అరకొరగా ప్రభుత్వ నిధులు పొందడం, అమెరికా తెలుగు సంఘాల ఆర్ధిక సహాయం సంపాదించడం మించి వారేమీ పెద్దగా సాధించినట్లు లేదు.

అందరికీ అన్నీ ఇష్టం వుండవు, కొందరికి కొన్నే ఇష్టం. తరాల అంతరం పూడ్చలేం. ఒకప్పటి మన ఇష్టాల్ని మళ్ళీ ప్రాచుర్యంలోకి తెద్దామనుకోవడం అత్యాశ. నా పిల్లలకి సావిత్రి సినిమా చూపిద్దామనీ, ఘంటసాల పాట వినిపిద్దామనీ విఫల యత్నాలు చేసిన పిమ్మట - 'ఇష్టాయిష్టాలు పూర్తిగా వ్యక్తిగతమైనవి, ఒకరి ఆలోచనలు ఇంకోళ్ళ మీద రుద్దరాదు' అనే జ్ఞానోదయం కలిగింది. ఆపై నా ఆలోచనని మార్చేసుకుని - నేనూ నా ఇష్టాల చుట్టూ గిరి గీసుకున్నాను.

నాకు పెసరట్టు ఇష్టం, ఫిల్టర్ కాఫీ ఇష్టం, సింగిల్ మాల్ట్ ఇష్టం, రావిశాస్త్రి ఇష్టం. నాకిట్లాంటి ఇష్టాలు చాలానే వున్నాయి. ఈ ఇష్టాలన్నీ పూర్తిగా నాకు మాత్రమే సంబంధించిన ప్రైవేటు వ్యవహారం. ఇవన్నీ ఇంకా ఎంతమందికి ఇష్టమో నాకు తెలీదు. ఇవి నాకు తప్ప ఇంకెవరికీ ఇష్టం లేకపోయినా నేను పట్టించుకోను. నా ఇష్టాలన్నీ చట్టవిరుద్ధమైపోయి, సౌదీ అరేబియాలోలా కౄరంగా కొరడా దెబ్బల్తో శిక్షించే ప్రమాదం వస్తే తప్ప - వాటిని రివ్యూ చేసుకునే ఉద్దేశం కూడా లేదు!

ఇలా నా ఇష్టాల్ని నేను మాత్రమే అనుభవించేస్తూ, వాటి "గొప్పదనాన్నీ", "మంచితనాన్నీ" నలుగురికీ పంచని యెడల కొన్నాళ్ళకి అవి అంతరించపోవచ్చును గదా? పోవచ్చు! నేను పొయ్యాక నా ఇష్టాలు ఏమైపోతే మాత్రం నాకెందుకు? నేను చచ్చి పిశాచాన్నయ్యాక ఏం చేస్తానో నాకు తెలీదు. పిశాచం మనిషిగా వున్నప్పటి అలవాట్లనే కంటిన్యూ చేస్తుందా? సమాధానం తెలిసినవారు చెప్పగలరు!

(picture courtesy : Google)

5 comments:

  1. పతంజలి గారు వుంటే... ఇది చదివితే ఒక పిశాచం ఆత్మ కథ రాసేవారేమో.... ఇంతకీ మీ “ గోంగూర.. వంకాయ తినోద్దు.... బ్లాగ్... కి.... తప్పు చేశావ్ మైకీ... చాలా గ్యాప్ వచ్చింది.... కొంప దీసి... మీరు పిశాచాల లో కలిసిపోయి....చాలా రోజుల తరువాత.... మీ పాత అలవాటు గుర్తుకు వచ్చి.... బ్లాగ్ రాయడానికి అంతా టైమ్ తీసుకున్నారా... ( సారీ... మీరు ఎలాగూ పిశాచాలను నమ్మరాని రాశాను... అంతే... ) అలా అయితే పిశాచాలు మనిషి గా వున్నప్పటి అలవాట్లు మానుకోవని చెప్పొచ్చు... ఇంతకీ... బెజవాడ లో దయ్యాలకి బాగా గిరాకీ వుందని ఒక దయ్యం ఆత్మ కథ లో చదివా.... ఇప్పుడు పిశాచాలకి కూడా ఏమైనా డిమాండ్ వచ్చిందా....

    ReplyDelete
    Replies
    1. హ.. హా.. హా!

      పతంజలి దెయ్యాలు, పిశాచుల భాష అంటూ రెంటినీ కలిపేశాడు గానీ - నా అభిప్రాయం దెయ్యాలు, పిశాచులు కజిన్లని. :)

      పతంజలి దెయ్యాల్ని వర్గీకరించాడు. ఆ లెక్కన - నేను బుర్ర లేని గుండు దెయ్యాన్ని. :)

      (Thank you for bringing Pathanjali into my blog.)

      Delete
  2. నేను బుర్ర లేని జుట్టున్న దయ్యం కోవలోకి వస్తాను.... అయినా అందుకే చెప్తుంటా..... బ్లాగుల్లో దయ్యాల గురించి.... పిశాచుల గురించి.... రాయొద్దని....చూసారా.... మన ఇప్పటి వరకు మన ఇద్దరి కామెంట్స్ మాత్రమే వచ్చాయి....

    ReplyDelete
    Replies
    1. మనం దెయ్యాలం! కామెంట్లతో పనేంటి? :)

      Delete
    2. నేనింకో 'బులేజుద'ని, అటెండెన్సు వేసుకోండి సార్!

      Delete

comments will be moderated, will take sometime to appear.