పుట్టినవాడు గిట్టక మానడు, చావు పుట్టుకలు ప్రకృతి సహజం అంటారు. అయితే - కొన్ని మరణాలు చరిత్ర సృస్టిస్తాయి, మనలోని మనిషిని కొరడాతో చెళ్ళుమని కొట్టి ఉలిక్కిపడేలా చేస్తాయి. రోహిత్ మరణం అనేక ప్రశ్నల్ని మనముందుంచింది. ఒక విద్యార్ధి మరణం దేశవ్యాప్తంగా ఇంత సంచనలం సృష్టించడం ఈ మధ్య కాలంలో జరగలేదు (ఎమర్జెన్సీ సమయంలో రాజన్ అనే కేరళ విద్యార్ధి encounter కూడా ఇలాంటి తుఫానునే సృష్టించింది).
రోహిత్ మరణం గూర్చి జరుగుతున్న ఆందోళనలు కొన్నాళ్ళకి సద్దుమణగొచ్చు. అయితే - రోహిత్ మరణం భవిష్యత్తులో ఒక మంచి కేస్ స్టడీగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. రోహిత్ కేవలం ఒక SC కులానికి చెందినవాడైతే ఇంత చర్చ జరిగేది కాదు. అప్పుడది కారంచేడు, చుండూరు మాదిరిగా దళిత vs అగ్రకుల పోరాటంగా మిగిలిపోయ్యేదేమో.
ఒక SC పసిపిల్లని BC కుటుంబం పెంచి పెద్ద చెయ్యడం, తదుపరి తమ BC కులంలో వ్యక్తికి పెళ్లి చెయ్యడం అరుదుగా జరుగుతుంది. ముగ్గురు పిల్లల్ని కన్నాక భార్య SC అన్న 'నిజం' తెలుసుకుని భర్త గృహహింసకి పాల్పడటం, ఆపై విడాకులు తీసుకోవడం కూడా ఆసక్తికరమే. వీళ్ళకి పుట్టిన పిల్లాడు అనేక కష్టాలు ఎదుర్కుని యూనివర్సిటీ స్థాయికి ఎదగడమూ అసాధారణమే. ఈ కుర్రాడు అంబేద్కర్ ఆలోచనలకి ప్రభావితుడై యూనివర్సిటీ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించడం.. ఇదంతా ఓ సినిమా కథలా వుంది కదూ! అవును - రోహిత్ కేసు అనేక విధాలుగా చాలా అరుదైనది. సామాజిక శాస్త్రం చదువుకున్నవారికి ఇవన్నీ చాలా ఆసక్తికరమైన అంశాలు.
రోహిత్ తల్లి చట్టపరంగా భర్త నుండి విడాకులు తీసుకుని విడిపొయ్యింది. అందువల్ల ఆయా కుటుంబాల్లో సహజంగానే కొన్ని రాగద్వేషాలు వుండొచ్చు. అయితే రోహిత్ తండ్రి వైపు వారి కోపాన్ని పదేపదే చూపించి హైలైట్ చెయ్యడంలో మీడియా కుట్ర వుందని భావిస్తున్నాను. భర్త నుండి విడిపోయిన భార్య character assassination చెయ్యడం - మీడియాకున్న 'అధికారానికి కొమ్ము కాయడం' అనే పవిత్రమైన ఎజెండాలో భాగం. Women empowerment గూర్చి ఆలోచించాల్సిన ఈ రోజుల్లో - బూజు పట్టిన భావాలకి ఎంత ప్రచారం!
పిల్లల్ని పెంచడం అన్నది చాలా సీరియస్ వ్యవహారం. Disturbed family environment లో పెరిగే పిల్లల మనస్తత్వం చాలా delicate గా వుంటుంది. తాగుబోతు తండ్రి తమ తల్లిని అవమానించడం, హింసించడం పసివాళ్ళ మససు మీద తీవ్రమైన ప్రభావం చూపుతుంది. పేదరికానికి అవమానం, అభద్రత తోడైతే అది చాలా deadly combination. ఈ అమానవీయ నేపధ్యంలో రోహిత్ JRF సాధించగలిగాడంటే అది ఎంతైనా అభినందనీయం.
మధ్యతరగతి భావజాలంలో దేశభక్తి అత్యంత పవిత్రమైనది. మరణశిక్షని రద్దు చెయ్యాలని బలమైన వాదన నడుస్తూనే వుంది. ఈ నేపధ్యంలో మెమెన్ ఉరిశిక్షని వ్యతిరేకించడం అన్నది నేరం ఎలా అవుతుంది!? కానీ - సంఘపరివార్ దృష్టిలో ఇదో జాతి వ్యతిరేక, దేశ వ్యతిరేకమైన తీవ్రమైన నేరం. అందుకే ఈ విషయాన్ని పదేపదే ప్రస్తావిస్తూ రోహిత్ మరణం justified అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంలో వీరు ఎంతమేరకు విజయం సాధించారో కొన్నాళ్ళు ఆగితే గానీ తెలీదు.
మన్దేశంలో యూనివర్సిటీ ప్రొఫెసర్లైనా కులాలకీ, మతాలకీ అతీతంగా ఆలోచించలేరని అర్ధమైపోయింది. ఇందుకు ప్రధాన కారణం - వీరిలో ఎక్కువమంది (అందరూ కాదు) ప్రభుత్వాలకి సాగిలపడి కులాన్ని అడ్డుపెట్టుకుని, పైరవీలు చేసి ప్రమోషన్లు సంపాదించుకున్న బాపతు. ఇంక వీరు నిస్పాక్షికంగా వ్యవహరిస్తారని ఎలా ఆశించగలం! ఈ రేటున ఈ దేశానికి కులం నుండి ఇప్పడప్పుడే విముక్తి లేనట్లుగా అర్ధమౌతుంది.
రోహిత్ మరణం పట్ల స్పందనల్ని స్థూలంగా మూడు విభాగాలుగా విభజించవచ్చు. మొదటి రకం - బిజెపి అనుకూల హిందూమత రాజకీయుల వాదన. వీళ్ళు రిజర్వేషన్ వ్యతిరేకులు, అంబేద్కర్ వాదనకి వ్యతిరేకులు. కాబట్టి వీరికి (సహజంగానే) రోహిత్ దేశద్రోహిలా కనబడతాడు. చదువుకోవాల్సిన చోట రాజకీయాలు (తమకి నచ్చనివి) చెయ్యడం వల్ల చనిపొయ్యాడు. అయితే ముసుగు తొలగిపొయ్యి తమ దళిత వ్యతిరేకత నగ్నంగా ప్రదర్శించబడటం సంఘపరివార్‌కి రాజకీయంగా నష్టం. అంచేత తమ escape plan లో భాగంగా 'రోహిత్ దళితుడు కాదు' అనే ప్రచారం మొదలెట్టింది. ABVP రాజకీయాలు సూటిగా, స్పష్టంగా వుంటాయి.
రెండోరకం స్పందన - దళితవాదుల ప్రకటనలు. మనవాడు, మన ఇంట్లోవాడు అన్యాయంగా చనిపోతే దుఃఖం, కోపం కలుగుతాయి. వీరి ప్రకటనలు ఇదే స్థితిని తెలుపుతున్నాయి. తమవాడి మరణం వీరిని రోడ్ల మీదకి వచ్చేలా చేసింది. వీరి వాదనా స్పష్టంగా అర్ధమవుతుంది.
ఇంక మూడోరకం - మధ్యతరగతి మేధావుల స్పందన. వీరు 'మంచివారు'. పాతకాలం ప్రజానాట్య మండలి నాటకాల్లా - పేదరికాన్ని, బలహీనుణ్నీ romanticize చేస్తారు. వీరిది - ధనికుడు vs పేదవాడిలో పేదవాడే కరెక్ట్, ఆడ vs మగ సమస్యల్లో ఆడవారే కరెక్ట్, కుల సంఘర్షణలో తక్కువ కులమే కరెక్ట్ అనే stereotype అవగాహన. సామాజిక విషయాల్ని over simplify చేసుకుని అర్ధం చేసుకోడానికి అలవాటు పడిపోయినందున - రోహిత్ కేసులో కన్ఫ్యూజ్ అవుతున్నారు. కారణం - కేసులో నిందితుడైన ABVP కుర్రాడు BC అయిపొయ్యాడు! ఇటువంటి సమయాల్లో ఈ తాత్విక గందరగోళాన్ని తగ్గిస్తూ (ఎడ్యుకేట్ చేస్తూ) బాలగోపాల్ అనేక వ్యాసాలు రాశాడు. నాకివ్వాళ బాలగోపాల్ లేని లోటు స్పష్టంగా కనబడుతుంది.
సరే! వాదన కోసం రోహిత్ SC కాదు, OC అనుకుందాం. అసలు గొడవ ఎక్కడ ఎందుకు మొదలైంది? అంబేద్కర్ విద్యార్ధి సంఘానికి, ABVP మధ్య జరిగిన, జరుగుతున్న ఘర్షణ నేపధ్యాన్ని అర్ధం చేసుకోవాలి. ప్రపంచంలో ఏ రాజకీయాలకైనా భావజాలమే ప్రధానం. దళితుడైనా ABVP సభ్యుడైతే అతను బ్రాహ్మణీయ భావజాల ప్రతినిధిగానే చూడాలి. అలాగే అగ్రకులస్తుడైనా అంబేద్కర్ విద్యార్ధి సంఘ సభ్యుడైతే అంబేద్కరిస్టుగానే చూడాలి. కాబట్టి - ఇది రెండు రకాల పరస్పర వ్యతిరేక ఆలోచనలని ప్రాతినిధ్యం వహిస్తున్న విద్యార్ధి సంఘాల ఘర్షణ. అందుకే ABVP తరఫున కేంద్రమంత్రులు దిగారు. విషయం ఇంత స్పష్టంగా వుంటే - మధ్యతరగతి మేధావులకి రోహిత్ SC నా లేక BC నా అనేది ప్రధానమైపోయింది. రోహిత్ పట్ల గానీ, అతని తల్లి పట్ల గానీ కనీస మానవత్వంతో స్పందించాలన్న స్పృహ లేకుండా మాట్లాడుతున్నారు.
నిర్భయ చట్టం రాకముందు అనేక దుర్మార్గమైన రేపులు జరిగాయి. కానీ నిర్భయ కేసు సంచలనం సృష్టించడం వల్ల నిర్భయ చట్టం వచ్చింది. రోహిత్ కన్నా ముందు యూనివర్సిటీల్లో దళిత విద్యార్ధులు అనేకులు ఆత్మహత్య చేసుకున్నా.. దేశవ్యాప్తంగా ఈ విషయాన్ని చర్చిస్తున్నది ఇప్పుడే. నిర్భయ చట్టం లాగా, దళిత విద్యార్ధులకి రక్షణగా ఒక రోహిత్ చట్టం వస్తే ఈ మొత్తం ఆందోళనకి ఒక మంచి ముగింపు కాగలదు. అప్పుడైనా ఉన్నత విద్యాలయాల్లో కొంతలో కొంత వివక్ష తగ్గే అవకాశం వుంది. అయితే అటువంటి చట్టాలు ఇప్పుడు అధికారంలో వున్నవారి నుండి ఆశించడం అత్యాశేమో!
(picture courtesy : Google)