Tuesday, 27 September 2011

కనీ.. వినీ.. ఒక సినిమా రివ్యూ!


"బ్లాగుల్లో చాలామంది సినిమా రివ్యూలు రాసుకుంటున్నారు. నేనెందుకు రాయకూడదు?"
                   
"ఎవడొద్దన్నాడు? భేషుగ్గా రాసుకో. చదివి పెడతా. ఏ సినిమా రివ్యూ రాస్తున్నావ్? అందరూ 'దూకుడు' రివ్యూలు రాస్తున్నారు."

"నాకా దూకుడూ, పీకుడూ గూర్చి తెలీదు. మొన్నామధ్య చూసిన సినిమా గూర్చి రాస్తా."
                   
"సరే! రాసుకో. బుద్ధిలేక నీ బ్లాగులోకొచ్చా. చదవక ఛస్తానా!"
                    
"థాంక్యూ!" 


సినిమా పేరు.. నువ్వే కావాలి
తారాగణం.. రోజారమణి కొడుకు, ఇంకా ఎవరెవరో..
ఎలా ఉంది?.. పరమ చెత్త. 
రేటింగ్.. 0/5 
                    
"హోల్డాన్. నువ్వు ఫ్రెష్ గా ఈమధ్యన చూసిన సినిమా రాస్తావనుకుంటే.. " 
                    
"నేనూ ఫ్రెష్ గా పదేళ్ళ క్రితం సినిమా గూర్చే రాస్తుంట! మాఊళ్ళో హోటళ్ళల్లో గారెలూ, బజ్జీలూ పూర్తిగా అయిపొయ్యి.. తరవాత వాయ వచ్చేదాకా అన్నీ ఫ్రెష్షే! అందుకే ఫ్రెష్షుగా నిన్నటి గారే, మొన్నటి బజ్జీ అమ్ముతుంటారు. మేం తింటుంటాం. నేను నువ్వే కావాలి సినిమా తరవాత ఇంకేసినిమా చూళ్ళేదు. కాబట్టి.. నా రివ్యూ ఫ్రెష్షే!"     
                    
"నిన్నూ, ఈ దేశాన్నీ బాగుచెయ్యటం నావల్ల కాదు. సర్లే! నాదో చిన్న సలహా. నీ బ్లాగు టైటిల్ 'పని లేక'ని..  'మతి లేక' అని మార్చకూడదూ!"  
                    
"కూడదు. పదేళ్ళక్రితం ఆ సినిమాకెళ్ళిన రోజు ఏం జరిగిందో నీకు తెలిస్తే ఇంత వెటకారంగా మాట్లాడవ్." 
                    
"మరెందుకాలస్యం? తొందరగా చెప్పెహె!"  


నేను సినిమాలు చూట్టం మానేసి చాలా ఏళ్ళయ్యింది. రెండు గంటలు ఒక సీట్లో కూర్చొని తెరమీద బొమ్మల్ని చూసే ఓపిక లేదు. పాతరోజుల్లో సినిమా బాగోకపోతే ప్రశాంతంగా నిద్రబోయే సౌలభ్యం ఉండేది. నేటి రెహమాన్లూ, మణిశర్మలూ సంగీతం పేరున వాయించే చెంబులూ, తప్పేళాల మోతవల్ల మనకాపాటి ఫెసిలిటీ కూడా దూరమైంది. అవ్విధముగా సినిమా చూడకుండా ప్రశాంత జీవనము గడుపుచున్న నాకు.. ఖర్మకాలి.. నువ్వే కావాలి, నన్నే చూడాలి అంటూ ఒక చిత్రరాజం వెంటాడింది. 

'నువ్వే కావాలి' సినిమా ఘోరమైన హిట్టనీ.. చూడని జన్మ వ్యర్ధమనీ నాభార్య టికెట్లు తెప్పించింది. సినిమా తప్పించుకోటానికి నాదగ్గరున్న అన్నిఅస్త్రాలు గురి తప్పిన కారణాన.. చచ్చినట్లు సినిమాకి వెళ్ళాల్సొచ్చింది. ఆరేళ్ళ మా అమ్మాయి నోరు తెరుచుకు సినిమా చూస్తుంది. కానీ.. మూడేళ్ళ పుత్రరత్నం మాత్రం సినిమా శబ్దాలకి ఏడుపు లంకించుకుంటున్నాడు. బయటకి తీసికెళ్ళి ఆడిస్తే హాయిగా నవ్వుతున్నాడు. ఈవిధంగా లోపలకీ, బయటకీ తిరిగి తిరిగి.. కాళ్ళు నొప్పి పుట్టుట చేత.. సెకండాఫ్ అంతా హాలు బయట కేంటీన్ దగ్గర కాలక్షేపం చేస్తూ గడపసాగాను. 
                     
సినిమా వినబడుతూనే ఉంది. అనగనగా ఆకాశం ఉందంటూ ఒక బండగొంతు హాలు దుమ్ము దులిపేసింది. హీరో కుఱ్ఱాడు హీరోయిన్ కి తన ప్రేమ సంగతి మాత్రం చెప్పట్లేదు. విసుగ్గా ఉంది. సినిమాకి రానని మొండికెయ్యాల్సింది. అనవసరంగా అలవాటు లేని త్యాగరాజు పాత్ర పోషించి ఇరుక్కుపోయాను. 

ఈలోపు మావాడు వరండాని పావనం చేశాడు. హాల్ ఊడిచే అమ్మాయిని పిలిచి కొంత డబ్బు ముట్టచెప్పి శుభ్రం చేయించాను. ఇంకా హీరో తన ప్రేమ చెప్పి చావలేదు. చెప్తే సినిమా అయిపోతుంది. కానీ.. చెప్పటానికి హీరోకి ధైర్యం చాలట్లేదు. భగవాన్! ఏమిటీ నాకీ శిక్ష?    
                    
కొంచెంసేపటికి మావాడు వరండాలో అడ్డదిడ్డంగా పరిగెత్తటం మొదలెట్టాడు. నాపని ఇంకా ఎక్కువైపోయింది. లోపల సీన్లు నడుస్తూనే ఉన్నయ్. హీరో దరిద్రుడుకి ఇంకా ధైర్యం రావట్లేదు. ఈ హీరోగాణ్ణి ఎవడైనా తంతే బాగుణ్ణు. కళ్ళల్లోకి కళ్ళుపెట్టి చూడవెందుకంటూ ఒక ఏడుపు పాట. కొద్దిసేపటికి సినిమా అయిపోయింది. నాకు మోక్షం లభించింది. దేవుడున్నాడు!        
                    
"మీరేంటి బుడుగుని బయటకి తీసికెళ్ళి.. మళ్ళీ కనబళ్ళేదు? మీరెళ్ళింతర్వాత సినిమా ఇంకా బావుంది తెలుసా." నాభార్య చెబుతున్న విషయం సరీగ్గా అర్ధం కాలేదు. నేను పక్కన లేకపోవటం బాగుందా? సినిమా బాగుందా? 

హాలు బాల్కనీలోని నా పాట్లకి గుర్తింపు లేకపోగా.. సినిమా గూర్చి వ్యాఖ్యానాలు. మొదట కోపంతోనూ.. పిదప విరక్తితోనూ.. నేనేం మాట్లాళ్ళేదు. మనసులోనే నాకు నచ్చిన పాట "ఇదిగో దేవుడు చేసిన బొమ్మా.. " అంటూ పాడుకున్నాను. నాకీపాట పెళ్ళి కాకముందు అడుక్కునేవాళ్ళ పాటగా అనిపించేది. పెళ్ళయ్యాగ్గానీ ఇదెంత గొప్ప పాటో అర్ధం కాలేదు. 


ఈ దుస్సంఘటన జరిగిన నాల్రోజులకి ఆ సినిమా హాలు ఓనరూ మరియూ ప్రముఖ దంతవైద్య నిపుణుడూ అయిన నా స్నేహితుడు ఒక పార్టీలో కలిశాడు.   
                    
"సినిమా తలనొప్పి. చెత్త. ఆ హీరో కుర్రాడు తన ప్రేమ గూర్చి హీరోయిన్ పిల్లకి చెప్పటానికి పజ్జెనిమిది రీళ్ళు తీసుకున్నాడు. అదదో మొదటి రీల్లోనే చెప్పేడవొచ్చుగా. తొందరగా ఇంటికి పొయ్యేవాణ్ణి." అన్నా.    
                    
"అసలు ఆ సినిమాతో మీకేం పని? మిమ్మల్నెవరు చూడమన్నారు?" సూటిగా చూస్తూ అడిగాడా హాలు ఓనరు. 
                    
బిత్తరబోయా. నేను సినిమాలు చూడకూడదన్న సంగతి నాకిప్పటిదాకా తెలీదు. 

"అదేంటి! ఏదో ఇంట్లోవాళ్ళు ఫోర్స్ చేస్తే.. టికెట్ కొనుక్కుని.. " సంజాయిషీ ఇస్తున్నట్లు నసిగాను.  
                    
అతను పెద్దగా నవ్వాడు. 

"మీరేమో ఎప్పుడో ఎన్టీఆర్ యుగం వాళ్ళు. ఇప్పుడంతా యూత్ హవా. వాళ్ళ కోసమే సినిమాలు తీస్తున్నారు. మా హాల్లో నువ్వే కావాలి బొమ్మకి (అతనికి సినిమాని 'బొమ్మ' అనే అలవాటు) యూత్ పిచ్చెక్కి డ్యాన్సులు చేస్తున్నారు. వాళ్ళకోసం తీసిన సినిమా మీరు చూడటమే తప్పు. ఇంకా బాలేదని కామెంటు కూడానా! హన్నా!" అంటూ మళ్ళీ నవ్వాడు.   
                    
"తాగుబోతు బారుకెళతాడు. భక్తుడు గుడికెళ్తాడు. ఒకడి వాతావరణం ఇంకోడికి చికాగ్గా, రోతగా ఉంటుంది. అట్లాగే ఇప్పటి సినిమాలు మీలాంటివారికి నచ్చవు. ఇంకెప్పుడూ సినిమాలకి పోకండి." అని సలహా కూడా ఇచ్చాడు. 
                     
అతని సలహా నాకు బాగా నచ్చింది. అందుకే ఇప్పటిదాకా ఇంకే సినిమాకీ వెళ్ళే సాహసం చెయ్యలేదు.


"అమ్మయ్యా! నేను కూడా ఒక సినిమా రివ్యూ రాసానోచ్!"

 "మీ ఊళ్ళో దీన్ని రివ్యూ అంటారా? కథ రాయలేదు. నటన గూర్చి రాయలేదు.. ఏవో నీ పీత కష్టాలు నాలుగు ముక్కలు రాసి పడేసి దాన్నే రివ్యూ అంటే ఎలా?"                
                   
"అవన్నీ రాయటానికి నే సినిమా పూర్తిగా చూస్తేగా! ఏదో రివ్యూ రాద్దామనే ఆవేశంతో రాసేశాను. దీన్నే రివ్యూగా ఎడ్జస్ట్ చేసుకోరాదూ!"
                     
"రాదూ అంటే రాదు. సర్లే! ఏదోటి. అంత మంచి సినిమాని పరమ చెత్తని రాస్తే బాగోదు. కనీసం రేటింగైనా మార్చు."                          
"అన్నయ్యా! ఒఖ్ఖసారి కమిట్ అయితే నా రాత నేనే మార్చను. పదేళ్ళ నా మేనల్లుడు ఫైటింగుల్లేవని శంకరాభరణం సినిమాని చెత్తన్నాడు. నేకాదన్నానా? ఎవడి అభిప్రాయం వాడిది. సినిమా మొదటి భాగం 'కని'.. రెండోభాగం 'విని'.. 'కనీవినీ' ఎరగని రివ్యూ రాశాననీ.. నాకు పేరొస్తుందనీ నీకు కుళ్ళు. నీ మాట నేను వినను." 
                    
"నీ ఖర్మ!"   

(photo courtesy : Google)                                

Thursday, 22 September 2011

'అసూబా'ల ఆహార్యం


"మేం అమెరికా తెలుగువాళ్ళం, అక్కడ తెలుగువాళ్ళకి సేవ చేస్తున్నాం." ఈ మాట మనకి తరచూ వినిపిస్తుంటుంది. ఈ మాటల రాయుళ్ళు సూటూబూటూ వేసుకుని హడావుడిగా ఆంధ్రదేశంలో తిరుగుతుంటారు. వీరికి అమెరికాలో ఏవో తెలుగు సంఘాలున్నాయిట. వాస్తవానికి వీళ్ళు తెలుగు రాజకీయ పార్టీలకి సేవకులనీ, తమ సొంత ప్రయోజనాల కోసం తిరుగుతుంటారనీ కిట్టనివారు అంటారు. మనకైతే వాస్తవం తెలీదు. ఈ అమెరికా సూటుబాబుల (ఇకనుండి అసూబా) సేవాతత్పరతకు అభినందిస్తున్నాను. కొన్ని వేలమైళ్ళ దూరానున్నా,  తమ తెలుగుజాతికి వీరు చేస్తున్న సేవకి ముగ్ధుడనవుతున్నాను.     
                     
మన ఎండల్లో, ఉక్కపోతలో వారు సూట్లేసుకుని చెమటలు కక్కుకుంటూ, కంఠ లంగోటీ (tie) సరిచేసుకుంటూ, మన తెలుగుజాతి ఔన్నత్యాన్ని గూర్చి ఉపన్యసిస్తుంటే నాకు ఒళ్ళు పులకిస్తుంది. ఆనందభాష్పాలు రాల్తాయి. సూటుపోతకి కారుతున్న వారి చెమట ధారల్ని చూస్తే నాకు దుఃఖం వస్తుంది. ఇంత గొప్ప సమాజసేవకులకి కూడా చెమటలు కార్పిస్తున్న మన దుష్టవాతావరణానికి సిగ్గుతో తల దించుకుంటుంటాను.  
                     
ఎదుటివాడు జడుసుకుంటాడని బట్టలేసుకుంటాం గానీ, అసలు మన వాతావరణానికి యోగివేమన డ్రెస్సే కరక్ట్. అందరికీ ఈ సౌలభ్యం ఉండదు. అసూబాలు వారి అమెరికా సంస్థల ప్రతినిధులుగా కొంత 'డ్రెస్ కోడ్' పాటించాలేమో, అందుకే ఉన్నిసూట్లు వేసుకుంటారు. అంచేత ఎండకీ, ఉక్కకీ మలమలా మాడిపోతుంటారు. ఈ వేషభాషలనే 'ఆహార్యం' (ఆహారం కాదు) అంటారని ఎవరో అనంగా విన్నాను. 
                      
కొందరు నా క్లాస్మేట్లు అమెరికాలో స్థిరపడ్డారు. ఎవరైనా మన్దేశం వచ్చినప్పుడు గెట్ టుగెదర్లు యేర్పాటవుతుంటాయి. ఒకసారి ఒక అమెరికావాసి ఒక పార్టీలో కోటేసుకొచ్చి అసూబాగా తన ఆహార్యం ప్రదర్శించాడు. మన భారతీయులకి సున్నితత్వం ఉండదు. బొత్తిగా అసూయపరులు. ఆరోజు పార్టీలో మా అసూబా అనేక విధములుగా హింసింపబడ్డాడు. అమెరికాకి వెళ్ళి ఒక మంచి సూటుగుడ్డ కొనుక్కున్నందుకు అభినందించాం. సూట్లో అచ్చు దొరబాబులా ఉన్నావని పొగిడాం. కోటేసుకున్నావు కాబటి నువ్వు కోటేస్సర్రావ్వి అంటూ ముద్దుగా పిలుచుకున్నాం. కొద్దిసేపటికి రెండుచేతులూ జోడించి, నమస్కరించి కోటు విప్పి అవతల పడేశాడు.                
                     
పురాణపురుషులక్కూడా ఈ ఆహార్యమే ప్రధానం. తంబురా లేని నారదుణ్ణి ఆ నారాయణుడే గుర్తు పట్టలేడు. విష్ణుమూర్తి పొద్దస్తమానం పాముమీద పడుకుని లక్ష్మీదేవితో కాళ్ళొత్తించుకుంటుంటాడు, కాళ్ళు నొప్పెట్టి కాదు. కాళ్ళ దగ్గర లక్ష్మీదేవి లేకపోతే ఆయన్ని శివుడు కూడా గుర్తు పట్టలేడు - అందుకని. పింఛంలేని కృష్ణుణ్ణీ, నాగలి చేతలేని బలదేవుణ్ణీ - ఇలా ఎంతైనా రాసుకుంటూ పోవచ్చు. ఎంత బరువుగా ఉన్నా, మరెంతో దురదగా ఉన్నా ఈ ఆభరణాలూ, వారి ట్రేడ్మార్క్ ఆయుధాలూ మోయక తప్పదు. ఆహార్యం అంటే అదే మరి!
                      
ఈ వేషభాషల గోల పురాణ పురుషులకేం ఖర్మ, వృత్తుల్లో కూడా చాలా ముఖ్యం. వాస్తురత్న, వాస్తుబ్రహ్మలకి ఋషీశ్వరుల వలే పొడుగు జుట్టు, పెద్ద బొట్టు, మెళ్ళో రుద్రాక్షలే ఆహార్యం. ఈ అవతారం లేకుండా ఈశాన్యమ్మూల బరువుందనీ, ఆగ్నేయం లోతుందనీ వారు చెప్పలేరు. చెప్పినా ఎవడూ పట్టించుకోడు. మెళ్ళో స్టెతస్కోపు, మందపాటి కళ్ళద్దాలు లేకపోతే డాక్టరుగారి డిగ్రీ మీద అనుమానం రావచ్చు. 

ఎంగెల్స్‌కి ఒకసారి గడ్డం దురదెట్టి గీసేద్దామనుకున్నాట్ట! గడ్డం తీసెయ్యటానికి గతితార్కిక భౌతికవాదం ఒప్పుకోదని మార్క్స్ వాదించాడు. వెధవ గడ్డానికి సిద్ధాంతాల రాద్ధాంతం ఎందుకులెమ్మని ఎంగెల్స్ కేరళీయ వైద్యం లాంటిదేదో చేసుకుని  మూతి దురదని తగ్గించుకున్నాట్ట! ఇది నిజం, ఒట్టు. నన్ను నమ్మండి. నమ్మకపోతే కమ్యూనిస్టు మేనిఫెస్టో రెండో అధ్యాయం, పధ్నాలుగో పేజీ చూడండి!               
                      
రాయలసీమ ఫ్యాక్షనిస్టులకి తెల్ల టాటా సుమోలే ఆహార్యం. ఆమధ్యన టాటా కంపెనీవాళ్ళు సుమోల ప్రొడక్షన్ ఆపేద్దామనుకున్నారు. కానీ - "ఒరే టాటా, దొంగ నా బేటా! నువ్వు సుమోలని ఆపావో.. అమ్మతోడు. అడ్డంగా నరికేస్తా" అంటూ ఒక ఫ్యాక్షనిస్టు తొడగొట్టి మరీ తన్ టాటాని బెదిరించాట్ట. తన సుమోలకి ఇంత చరిత్ర ఉందని తెలుసుకున్న రతన్ టాటా, ఫ్యాక్షనిస్టు పరిశ్రమ దెబ్బతినకుండా ఉండేందుకు, ఒక సాటి పారిశ్రామికవేత్తగా తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నాట్ట.

నాకు తెలిసిన పోలీసాఫీసర్ ఒకాయన రాయల్ ఎన్ఫీల్డ్ మోటర్ సైకిల్ని ఎంతో శ్రమకోర్చి నడుపుతుండేవాడు. చూసిచూసి ఒకరోజు ఉండబట్టలేక ఎందుకా దున్నపోతుని వెంటేసుకు తిరడగమంటూ అడిగేశా. అతను పెద్దగా నవ్వి "భలేవాడివే! బుల్లెట్ నడపకపోతే నేరస్తుల గుండెల్లో నిద్ర పోయేదెట్లా? చట్టం, న్యాయం, ధర్మం అనే మూడుసింహాలని కాపాడేదెట్లా?" అన్నాడు. అదీ నిజమే!  
                     
తరచి చూడగా - ఇంతమంది ఇన్నితిప్పలు పడుతూ తమ వేషాలు మోస్తూ ఉండటం మనకీ, వాళ్ళకీ కూడా అవసరమేననిపిస్తుంది. వేషాలు మనకి సౌకర్యంగా ఉండటం కోసం కాదు, కానేకాదు. ఎదుటివాడికి మన స్థాయీ, అంతస్తు తెలియజెయ్యటానికి మాత్రమే! ఇది దేవుళ్ళకే తప్పలేదు. పాపం, మన అసూబాలెంత!

(photos courtesy : Google)              

Saturday, 17 September 2011

సబ్బుబిళ్ళ


"కాదేది కవితకనర్హం, కుక్కపిల్లా సబ్బుబిళ్ళా అగ్గిపుల్లా" అన్న మహాకవి శ్రీశ్రీ స్పూర్తితో 'ఋక్కులు' రాశాడు రావిశాస్త్రి. ఆవిధంగా  తెలుగు సాహిత్యంలోకి శ్రీశ్రీ పరిచయం చేసిన సబ్బు స్థానాన్ని పదిలం చేశాడు రావిశాస్త్రి.  వీళ్ళు గొప్పరచయితలు, మేధావులు. నేనేదీ కాదు. అంచేత డైరక్టుగా సబ్బు గూర్చే రాసేస్తున్నాను! 

"నాన్నా! నా సబ్బెందుకు రుద్దుకున్నావు? అది లేడీస్ సోప్." ఇవ్వాళ ఉదయం నే స్నానం చెయ్యంగాన్లే మా అమ్మాయి గద్దింపు. మొదట తెల్లబోయ్యి పిమ్మట ఆశ్చర్యపోయ్యా. సబ్బుల్లో ఆడామగలు ఉంటాయన్న సంగతి నాకీ క్షణం దాకా తెలీదు.   

స్నానాన్ని కనిపెట్టిన వాణ్ని పట్టుకుని తన్నాలనే కోరిక నాకు చిన్నప్పట్నుండీ వుంది. నేను ప్రతిరోజూ ఏడుస్తూ చేసే పని స్నానం చెయ్యటం. కొన్ని జీవితాలంతే! ఇష్టముండదు, కానీ చెయ్యక తప్పదు. పరీక్షలప్పుడూ ఏడుస్తూ చదివేవాణ్ని. ఏ పనయినా ఇష్టపడి చేస్తే కష్టముండదంటారు. నాకీ సుభాషితం అర్ధం కాదు. తిండంటే ఇష్టపడతాంగానీ - స్నానాన్నీ, చదవడాన్నీ ఎలా ఇష్టపడతాం! 

సరే! మళ్ళీ సబ్బులోకొద్దాం. స్నానాన్నే ఏడుస్తూ చేసేవాణ్ణి కాబట్టి నేనేనాడూ సబ్బు గూర్చి ఆలోచించలేదు. ఫలానా సబ్బు వాడితే భలే ఫ్రెష్షుగా ఉంటుందనీ, ఇంకేదో సబ్బు వాడితే ఇంకేదో అయ్యిందనీ చెప్పుకుంటుండగా విన్నాను. సబ్బంటే స్నానమే కాదు, ఆనందాన్నీ కలుగజేస్తుందని నాకప్పుడు అర్ధమైంది. నా కోపం స్నానం మీదే గానీ, సబ్బు మీద కాదు కాబట్టి సబ్బు గూర్చి క్రికెట్ ఎంపైర్లా నిస్పక్షపాతంగా రాస్తానని మనవి చేసుకుంటున్నాను. ఆలోచించగా - రోజూ మన వంటిమీద తను కరిగిపోతూ కూడా గబ్బుని వదిలించే సబ్బు నిస్వార్ధమైనది మరియూ పవిత్రమైనదిగా తోస్తుంది.

కొందరు సబ్బులోళ్ళు తమ సబ్బు వాడితే వొంటిరంగు పాలకన్నా తెల్లగా అయిపోతుందంటున్నారు. అసలీ తెల్లతోలూ, నల్లతోలు ప్రకటనలు వర్ణవివక్ష కిందకొస్తాయి. ఒకప్పటి దక్షణాఫ్రికాలో కన్నా ఇవ్వాళ మన్దేశంలోనే వర్ణవివక్షత ఎక్కువుందని నా నమ్మకం, అందుకే ఈ రంగులు మార్చే సబ్బులు బాగా అమ్ముడుపోతున్నయ్. 

ఆమధ్య సబ్బుల వ్యాపారం చేసే ఓ పెద్దాయన సబ్బురహస్యమొకటి విప్పాడు. 'నాల్రోజులు వాడిన్తర్వాత ఏ సబ్బైనా ఒకటే. వాసనుండదు, నురగ రాదు.' అంటే మామిడిపండుకి గుజ్జుపోయి టెంక మిగిలినట్లన్నమాట! ఇక్కడ మన కార్పొరేట్ కాలేజీల రుద్దుళ్ళకి కుర్రాళ్ళు గుజ్జులేని టెంకలయిపోతున్నారు. 

సబ్బు లేని సమాజాన్ని ఊహించుకోవడం కష్టం. రెండ్రోజులు స్నానం చెయ్యకపోతే ప్రపంచ సుందర్నైనా భరించలేం. ముక్కు మూసుకుని దౌడ్ తియ్యాల్సిందే! మా మేనమామ స్నానాలగదిలోకి ఇలావెళ్ళి అలా వచ్చేసేవాడు. ఒక చెంబు ఒంటిమీదా, రెండు చెంబుల గోడమీదా పోసి స్నానమైందనిపించేవాడు. 

ఒకప్పుడు ఇన్ని సబ్బుల్లేవ్. అనాదిగా సినీతారల అందాలకి కారణం ఒక్క లక్స్ సబ్బు మాత్రమే. తళుకుతళుకు తారలు మా సౌందర్య రహస్యమిదేనని నొక్కి వక్కాణించేవాళ్ళు. 

ఆరొగ్యానికి రక్షా ఇస్తుంది లైఫ్‌బాయ్ (దీనికి కుక్కసబ్బని కూడా అంటారు). లైఫ్‌బాయ్ మన ఆరోగ్యానికి ఎంత రక్షనిచ్చిందో తెలీదుగానీ యెన్నో యేళ్ళుగా హిందుస్తాన్ లీవర్ వారి లాభాలకి మాత్రం రక్షనిస్తుంది. 

గుండ్రటి 'మోతి' సబ్బు పెళ్ళివాళ్ళకి విడిదిలో ప్రత్యేకం. మోతీ రాయికన్నా, పో్లీసువాడి హృదయం కన్నా కఠినమైనది. కొంచెమైనా వాసనుండదు, చచ్చినా నురగ రాదు. వందలమంది స్నానం చేసినా చెక్కు చెదరదు. అరగకుండా కరగకుండా మన్నికకి పేరు గాంచినది మోతీ సబ్బు. 

ఘుమఘుమలాడే సువాసన మైసూర్ శాండల్ సొంతం. లక్స్ కన్నా ఒక పావలా రేటెక్కువని మైసూరు శాండల్ మాఇంట్లో విలాసవస్తువైపోయింది. అక్క పెళ్ళయిన కొత్తలో బాత్రూము్లో మైసూరు శాండల్ సబ్బు చూశాను. హడావుడిగా బట్టలిడిచేసి ఆ సబ్బుని వొంటికేసి రుద్దీరుద్దీ అరగదీసేశాను. 

మా ఇంట్లో ఎక్కువగా లక్స్ సబ్బు వాడేవాళ్ళం. వాసన బాగానే ఉంటుంది, కాకపోతే తొందరగా నానిపోతుంది, మెత్తగా పేస్టులాగా అయిపొతుంది. అది గుర్తున్న నాకు వెనిల్లా ఐస్ క్రీం తినడం ఇష్టం వుండదు, ఎవరన్నా తింటున్నా చూడలేను. రుద్దుకునేప్పుడు చేతిలోంచి జారిపొయ్యే పియర్స్ సబ్బంటే నాకు చిరాకు. 

మాపక్కింటాయన యేదైనా లెక్కగా వుంటాడు. ఆయన హమాం సబ్బుని కత్తితో రెండుగా కోసి, ఆ ముక్కల్ని వన్ బై వన్‌గా వాడేవాడు. ఒకసారి అరిగిపోయిన సగం ముక్కని కాకెత్తుకెళ్ళింది. కాకికి సబ్బెందుకు! తను కూడా తెల్లబడాలనా! కాకిని వెంబడిస్తూ ఆయన వీధులకి వీధులు పరుగులెత్తాడు.

కాబట్టి - మన స్నానం కోసం అరిగిపోతున్న సబ్బుని గౌరవిద్దాం. సబ్బు యొక్క గొప్పదనాన్ని గొంతెత్తి చాటుదాం. సబ్బు గూర్చి రాత ఇంతటితో సమాప్తం.  

(picture courtesy : Google)

Wednesday, 14 September 2011

వానకథే.. ఆగిపోయింది


ఉదయం నుండీ విడవకుండా ఒకటే వర్షం. చల్లగాలి రివ్వున వీస్తూ ఒళ్ళంతా జివ్వుమనిపిస్తుంది. ఆకాశం ముసుగేసుకున్నట్లు ముసురుపట్టి నల్లనల్లగా వుంది. దూరంగా చెట్టుకింద బక్కచిక్కిన వీధికుక్క తన దిక్కులేనితనాన్ని గుర్తు చేసుకుంటూ దీనంగా ఏడుస్తుంది. ఆ పక్కగా ఇద్దరు పిల్లలు - అన్నాచెల్లెళ్ళలా వున్నారు.. వర్షమెప్పుడు తగ్గుతుందాని ఎదురు చూస్తున్నారు.

వర్షం ఎంతందంగా వుంది! బహుశా చెట్లకి, చేమలక్కూడా వర్షం అంటే ఇష్టం కాబోలు - 'ఇంకా కురువు, ఇంకా కురువు' అంటున్నట్లు తలలూపుతూ నాట్యం చేస్తున్నాయి. నా చిన్నతనంలో వర్షంలో తడుస్తూ స్కూల్నుండి ఇంటికి రావడం నాకింకా గుర్తుంది. నేనూ, అక్కా కాగితం పడవల్ని నిండుగా ప్రవహిస్తున్న కాలవల్లోకి వదిలి, ఆ పడవల్తో పాటే పరుగులు తీసేవాళ్ళం. అదో చిన్నపాటి పడవల పందెం! ఇంటికి రాంగాన్లే అమ్మ హడావుడిగా తల తుడిచేది.  
                
ఇప్పుడు వర్షంలో తడిచే రోజులు పొయ్యాయి, చూసి మాత్రమే ఆనందించే రోజులొచ్చేశాయి. ఫిల్టర్ కాఫీ చప్పరిస్తూ యేదైనా రాస్తే యెలా వుంటుంది? భేషుగ్గా వుంటుంది. ఏం రాయాలబ్బా!  

'చిటపట చినుకులు పడుతూ ఉంటే.. ' అని రాస్తే? అరె - ఆత్రేయ ఎప్పుడో రాసేశాడే! 'వానకాదు వానకాదు వరదారాజా' అని రాస్తే? అరెరే - కె.వి.రెడ్డి సినిమానే తీసేశాడే! అసలివన్నీ కాదు గానీ - వాన నేపధ్యంతో బరువైన కథ రాసి పడేస్తాను. హోల్డాన్! పద్మరాజు 'గాలివాన' ఎవరికిద్దాం? 

'నువ్వు ఎక్కవలసిన రైలు ఒక జీవితకాలం లేటు' అన్నారు పెద్దలు. నేను రాయదల్చుకున్న కథలు, కవితలు రెండుమూడు జీవితకాలాలు లేటు. ఏమిటీ అన్యాయం? నేనేం చేశానని నాకీ శిక్ష? లేటుగా పుట్టడమే నా పాపమా? నాకెందుకో - నాకు మంచిపేరు రాకుండా చెయ్యాలనే కుట్రతో కవులు, రచయితలు హడావుడిగా వానపై రాసేసి, రాయడానికి నాకేమి మిగలకుండా చేసేశారనే అనుమానంగా వుంది. 

ఇంతలో - ఫెడేల్మంటు పిడుగుపడ్డ శబ్దం, కళ్ళు చెదిరే మెరుపు. లిప్తపాటు కళ్ళు మూసుకుని తెరిచాను. ఎదురుగా ఎవరో వ్యక్తి! మనిషి అస్పష్టంగా కనపడుతున్నాడు. కొంపదీసి మెరుపు దెబ్బకి కళ్ళు పోయ్యాయా!   

ఆ అస్పష్ట ఆకారం కొద్దిసేపు నన్ను పరికించి, పలకరించింది - "ఏమిటలా చూస్తున్నావ్? నన్నే గుర్తు పట్టలేదా? సర్లే - నేనే చెప్పేస్తాన్లే, నేన్నీ ఆత్మని."

కొంపదీసి వీడు దెయ్యం కాదుగదా? నాకు భయమేసింది. అయినా బింకంగా అడిగాను - "ఈ ఆత్మలొచ్చి మాట్లాట్టం నాకేం కొత్తకాదులే. నాకు తెలుగు సినిమాలు కొట్టిన పిండి, ఎన్ని సినిమాల్లో ఈ ఆత్మల్ని చూళ్ళేదు! కానీ నేనిప్పుడు అర్జంటుగా ఒక రచన చెయ్యాలి. నువ్వొచ్చిన పనేంటో తొందరగా చెప్తే నా పని నే చేసుకుంటాను." 
               
"నేనొచ్చిందీ ఆ పనిమీదే! చూడు నాయనా! నీగూర్చి నువ్వు శ్రీశ్రీ, రావిశాస్త్రిలా ఫీలవుతున్నావేంటి! వర్షం రావడం, వర్షంలో కాఫీ తాగడం, ఆ మాత్రానికే గొప్ప మూడ్ వచ్చెయ్యడం - తప్పు నాయనా! ఫీలవ్వడానిక్కూడా ఓ హద్దుండాలి." 

నాకు సర్రున కోపం వచ్చింది. "నిజం చెప్పు, నువ్వసలు నాఆత్మవేనా? తెలుగు సాహిత్యంలో శాస్వతంగా నిలిచిపోయ్యే గొప్పరచన చెయ్యబోతుంటే, ఇలా నిరుత్సాహ పరుస్తావా?"   
      
"నీకు విషయం తక్కువ, బిల్డప్పు ఎక్కువ. ఒప్పుకుంటున్నాను. నువ్వు మసాలా దోసె, సాంబార్ల గూర్చి బాగానే రాశావు. కానీ - అంతమాత్రానికే ఇంత పోజు పెట్టెయ్యకురా అబ్బీ!"
                
"నా గూర్చి నువ్వేమనుకున్నా నాకనవసరం."

"తెలుగు సాహిత్యానికి నీలాంటి అరకొరగాళ్ళతో పెద్ద చిక్కొచ్చి పడింది. నాలుగు కథలు చదవడం, రెండు కథలు రాసి పడెయ్యడం - పెద్ద సాహిత్యకారుల్లా ఫీలవ్వడం."

"నువ్వైంతయినా మాట్లాడుకో, నేను మాత్రం నోరిప్పను." అన్నాను. 
               
"ఏంటి కాఫీ తాగి దీర్ఘంగా ఆలోచిస్తున్నారు?" అంటూ నాభార్య వచ్చింది. 
               
అప్పటిదాకా ప్లీడర్లా పాయింట్ల మీద పాయింట్లు వేస్తూ వాదిస్తున్న ఆత్మగాడు 'కెవ్వు'మంటూ మాయమైపోయాడు.
               
'వార్నీ! భార్యంటే భర్తలకే కాదు, ఆత్మలక్కూడా భయమమన్నమాట!' ఆశ్చర్యపోయా.
              
ఇంతలో వర్షం ఆగిపోయింది. కథ రాసే మన మూడూ ఆవిరైపోయింది.
              
మిత్రులారా! ఈ వెధవ ఆత్మగాడి మూలానా తెలుగులో ఒక గొప్పవర్షం కథ వెనక్కిపోయింది. అందుగ్గానూ మిక్కిలి చింతిస్తున్నాను. ఈసారి వర్షం రావాలేగానీ - కథ రాయకుండా నన్నేఆత్మా ఆపలేదని ప్రకటిస్తున్నాను.   

(photo courtesy : Google)       

Friday, 9 September 2011

సాంబారు.. ఒక చెరగని ముద్ర


"నాన్నోయ్! ఇక్కడ సాంబారిడ్లి సూపరుంది."

ఆదివారం ఉదయం గీతా కేఫ్‌లో ఇడ్లీ సాంబారు తింటూ నా పుత్రరత్నం కామెంట్. 

"నీకంతగా నచ్చితే రెండ్రోజుల్లో మళ్ళీ వద్దాం. అప్పుడు మళ్ళీ తిందువుగాన్లే." అంటూ - జ్ఞాపకాల్లోకి జారిపోయాను. 
                      
కొన్నాళ్ళక్రితం ఒంగోలు వెళ్ళాల్సిన పని పడింది. ఉదయం కార్లో బయల్దేరాను. దార్లో టిఫిన్ (మనం బ్రేక్‌ఫాస్ట్‌ని 'టిఫిన్' అంటాం, తెలుగేతరులకి టిఫిన్ అంటే అర్ధంకాదు) కోసం డ్రైవర్ చిలకలూరిపేటలో కారాపాడు. హోటల్ పేరు పధ్మనాభ హోటల్. విశాలమైన హాల్. పదిపదిహేను దాకా టేబుళ్ళు, డజన్లకొద్దీ కుర్చీలు. కూర్చునే ప్లేస్ కోసం వెయిట్ చెయ్యాల్సొచ్చింది. ఓ పక్కన్నిలబడి అక్కడి వాతావరణాన్ని గమనించసాగాను. 

దాదాపు అందరూ ఇడ్లీ, వడ సాంబారు తింటున్నారు. ఓ పక్కన పెద్ద ఇత్తడి గంగాళాలు నాలుగైదు నిలబెట్టి ఉన్నయ్. వాటినిండా పొగలు గక్కుతూ చిక్కటి సాంబారుంది. వంటగదిలోంచి పెద్దపాత్రల్లో వేడివేడి ఇడ్లీలు, గారెలు మోసుకొచ్చి ఓ గంగాళంలో పడేస్తున్నారు. అవన్నీ సాంబారులో పూర్తిగా మునిగేట్లుగా ఒకతను పెద్ద చిల్లుల గరిటెతో వాటిని నొక్కుతున్నాడు. 

ఇంకో గంగాళంలో - సాంబారు పీల్చుకుని ఉబ్బిపోయున్న ఇడ్లీల్నీ, గారెల్నీ - స్టీలు హస్తంతో పక్కనే వున్న టేబుల్ మీద వరుసగా పేర్చబడున్న ప్లేట్లల్లోకి.. ఇడ్లీ, గారెలు ఏమాత్రం విరక్కుండా, చెదిరిపోకుండా అత్యంత లాఘవంగా మారుస్తున్నాడు.      

కొంతరు - విమానం నడపటం, గుండె ఆపరేషన్ చేయటం వంటి సంక్లిష్టమైన పన్లని అలవాటైపోయి - చాలా సింపుల్‌గా, మెకానికల్‌గా చేసేస్తారు. చూసేవారికి అదేమంత గొప్పపనిగా అనిపించదు. కానీ - దానివెనక ఎంతో సాధన ఉంటుంది. సాంబారిడ్లీల్ని పేర్చే వ్యక్తి కూడా ఆ కోవలోకే వస్తాడని అనిపించింది. కొద్దిసేపు అతణ్నలా ఎడ్మైరింగ్‌గా చూస్తుండిపోయాను.    

అమ్మయ్య! ఇప్పుడు నాకో కుర్చీ దొరికింది. ఆర్డర్ తీసుకోకుండానే (అక్కడందరూ ఫస్ట్ గేర్ సాంబారుతోనే వేస్తారేమో) నాముందుకు పొగలు గక్కుతున్న ఇడ్లీవడ సాంబారు వచ్చి చేరింది. అంతదారుణమైన వేడితో సాంబారిడ్లీ తినే ధైర్యం లేనందున, కొంచెం వేడి తగ్గాక తిందామని నిర్ణయించుకుని - ఆ విశాలమైన హాలుని మరొకసారి పరికించాను. 

సర్దా కబుర్లు చెప్పుకుంటూ తినే హోటలు వాతావరణం నాకలవాటు. కానీ అక్కడెవరూ కబుర్లు చెప్పుకోటల్లేదు! సీరియస్‌గా స్పూన్లతో గారెల్నీ,ఇడ్లీల్నీ గుచ్చుతూ, పొడుస్తూ, ముక్కలుగా (నరుకుతూ) చేసుకుని తింటున్నారు.  

అంతమంది ఏకాగ్రతగా ఒకేసారి ఒకేపని చేస్తూండటం ఆశ్చర్యంగా వుంది. ఇది ఇడ్లీవడ సాంబారు తినే కార్ఖానానా! నాకీ వాతావరణం - ఒక కార్ల కంపెనీ తయారీ యూనిట్‌ని చూస్తున్నట్లుగా, స్పీల్‌బర్గ్ సినిమాలో నలుగురిని వందమందిగా చూపే గ్రాఫిక్ వర్క్‌లాగా అనిపించింది. ఈ సాంబారు - నిరంతరం ప్రవహించే గంగానదివలే, సాంబారు తాగేవారందరూ ఋషులవలే కనిపించసాగారు.         

సాంబారు వేడి తగ్గినందున - తిండం మొదలెట్టాను. అద్భుతం, అమోఘం అంటూ యేవో పడికట్టు పదాల రొటీన్ వర్ణనలు తప్ప, రుచుల్ని వివరిస్తూ రాయడం నాకు చేతకాదు. అయినా - ఇక్కడ ఇంతమంది ఋషులు సాంబారోపాసన చేస్తుంటే రుచి గూర్చి సర్టిఫికేట్ అవసరం వుందా! 

ప్రతిమనిషికీ తన ఇంటలెక్చువల్ స్థాయి, అభిరుచిలననుసరించి కొన్ని మధుర స్పృతులు, అనుభవాలు మదిలో నిక్షిప్తమైపోతాయి. అది కొందరికి తమ ఇష్టదైవం పాదపద్మముల దర్శనభాగ్యమైతే, మరికొందరికి ఇష్టసఖి ప్రేమగా తొలిసారి లాలనగా పిలిచినప్పుడు కలిగే పులకరింతా, పలవరింతా, థ్రిల్లింతా కావొచ్చు. 

నాకన్ని గొప్ప అనుభవాల్లేవు, పెద్ద ఇమేజినేషనూ లేదు. అభిరుచి అంటే అర్ధం తెలీదుగానీ - రుచి అంటే అర్ధం తెలియాల్సినదాని కన్నా కుంచెం ఎక్కువే తెలుసని తెలుసు. అందుకే చిలకలూరిపేట పద్మనాభ హోటల్ సాంబారిడ్లీ వడ నా మదిలో చెరగని ముద్రేసింది. కాబట్టే - నిన్నమొన్న జరిగినట్లు అనిపిస్తుంది.   

(photos courtesy : Google)         

Tuesday, 6 September 2011

సినిమా డాక్టర్లు


రాముడు మంచిబాలుడు, మన సినిమా డాక్టర్లంతా రాముళ్ళే! నున్నగా గీసిన గడ్డం, నూనెరాసి ఒద్దికగా దువ్వుకున్న తల, వెడల్పు ఫ్రేములో సోడాబుడ్డి కళ్ళద్దాలు, డాక్టరు కోటు (సాధారణంగా డాక్టర్ పాత్ర వేసేది చిన్నాచితకా నటుడైన కారణాన - అద్దె యాప్రాన్ పొడుగ్గానో పొట్టిగానో, వదులుగానో బిగుతుగానో ఉంటుంది), చేతిలో తోలుసంచి, శివుడి మెళ్ళో పాములా స్టెత్‌స్కోప్ - ఇదీ డాక్టరుగారి వేషం! రౌడీ పాత్రలకి బుగ్గన పులిపిరి, అడ్డచారల టీషర్టు, మెళ్ళో కర్చీఫ్ ఉంటేగానీ అతగాడు 'రౌడీ' అని ప్రేక్షకులకి తెలీదు. తెలుగు సినిమా డాక్టర్లదీ ఇదే దుస్థితి!

ఐతే - ఈ సినిమా డాక్టర్ గొప్ప ప్రతిభావంతుడు. నిజజీవితంలో డాక్టరు సాధించలేని అద్భుతాలు ఎన్నో చెయ్యగలడు. గుమ్మడి ఉత్కంఠతో ఎదురు చూస్తుంటుండగా - హీరో చెల్లెలి నాడిని అరక్షణం మాత్రమే పరీక్షించి, ఇంకో పావుక్షణం ఆలోచించి, ఆమె గర్భవతని తేల్చేస్తాడు! 

గుమ్మడి "పాపిష్టిదానా! మన వంశగౌరవం.. కుటుంబప్రతిష్ట.. " అంటూ కుంచెంసేపు ఆవేశపడి గుండె పట్టుకుని కూలబడిపోతాడు. అవమానం తట్టుకోలేక ఆ అమ్మాయి బావిలో దూకేస్తుంది (ఆడపిల్ల 'శీలం' పోయినా బ్రతకొచ్చనే సంగతి నాకు పెద్దయ్యేదాకా తెలీదు). పిమ్మట గుండెల్ని పిండేసే సన్నాయి వాయిద్యం, ఘంటసాల బూమింగ్ వాయిస్‌తో ఒక హెవీ సాంగ్.

కథకడ్డం రాకుండా, దర్శకుడు తనకిచ్చిన అరనిమిషంలో సమయపాలన చేస్తూ, కథని మలుపు తిప్పే గొప్పసన్నివేశంలో యాంత్రికంగా, వినయంగా తనపని తను చేసుకుపోయి క్రమశిక్షణ పాటించేవాడు మన సినిమా డాక్టర్! 

సినిమా డాక్టర్లది వాస్తవిక దృక్పథం. అందుకే వారికి - తెలుగు ప్రేక్షకలోకం హీరో చెల్లెలు గర్భవతైన తర్వాత వచ్చే సీన్లో ఘంటసాల పాట కోసం, గుమ్మడి గుండెపోటు కోసం ఎదురు చూస్తున్నారని తెలుసు! అందుకే ఎక్స్‌రేలనీ, రక్తపరీక్షలనీ సమయం వృధా చెయ్యరు. వీళ్ళు నిజాయితీపరులు కూడా. అందుకే వాళ్ళు వున్న రోగానికే వైద్యం చేస్తారు గానీ, నిజజీవిత డాక్టర్లకి మల్లె లేని జబ్బులకి డబ్బులు గుంజరు!  

మన సినిమా డాక్టరు సాధించిన మరొక అద్భుత విన్యాసం రక్తమార్పిడి ప్రక్రియ! అందుకే రక్తం ఇస్తున్నవారి (డోనార్) రక్తం భూమ్యాకర్షణ సిద్ధంతానికి విరుద్ధంగా (తెలుగు సినిమాల్లో న్యూటన్ సూత్రాలెందుకు చెప్పండి) సెలైన్ స్టాండ్ మీదనున్న సీసాలోకి ఎక్కుతుంది! ఎన్నో సినిమాల్లో ప్రేక్షకుల్తో కడవలు కొద్దీ కన్నీళ్లు కార్పించిన ఈ మహత్తర విన్యాసం హాలీవుడ్‌వారిక్కూడా అర్ధం కాలేదు. దటీజ్ అవర్ సినిమా డాక్టర్!

ఈ బాక్సాఫీస్ ఫార్ములానే మన్మోహన్ దేశాయ్ అనే హిందీ దర్శకుడు ఇంకొకడుగు ముందుకేయించాడు. ఆయన 'అమర్ అక్బర్ ఆంథోనీ' అనే సినిమాలో ఏకంగా ముగ్గురు కొడుకుల రక్తాన్ని సెలైన్ స్టాండ్ పైనున్న సీసాల్లోకి పంపి, అక్కణ్ణించి తల్లి ఒంట్లోకి డైరక్టుగా ఎక్కే యేర్పాటు చేశాడు (హిందీసిన్మాలకి బడ్జటెక్కువ)! ఇలా తమ తల్లిప్రాణాన్ని దక్కించుకున్న ముగ్గురు హీరోల్ని చూసి యావద్దేశం పులకించిపోయింది, తద్వారా మన్మోహన్ దేశాయ్ బేంక్ బ్యాలెన్స్ కూడా పెరిగింది. 

సినిమా డాక్టర్లకి ఇలా అనేక గొప్ప ప్రతిభాపాటవాలు తప్ప లోపాలు లేవా? ఎందుకు లేవు! ఉన్నాయి. వీళ్ళకి దెబ్బలకి కట్టు కట్టటం సరీగ్గా రాదు. తెల్లటి గాజుగుడ్డకి మధ్యలో ఒకప్పుడు నల్లటి పెద్దమరక (బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో), ఇప్పుడు ఎర్రటి పెద్దమరక (కలర్ సినిమాల్లో) లేకుండా కట్టు కట్టలేడు. 'ఆ కట్లు మేం కట్టలేదు, మా కాంపౌండర్ కట్టాడు.' అని తప్పించుకుంటే చేసేదేం లేదు. 

సినిమాల బజెట్ పెరిగింది. తదనుగుణంగా సినిమా డాక్టర్ కూడా తోలుసంచితో పేషంట్ల ఇళ్ళకి రావటం మానేసి, కార్పొరేట్ ఆస్పత్రిలోకి మారాడు. ఈ కార్పొరేట్ ఆస్పత్రికి మొదటి పేషంట్ 'ప్రేమనగర్' నాగేశ్వర్రావు !

పాపం! వాణిశ్రీ ప్రేమ కోసం నాగేశ్వర్రావు విషం (అది నిఝంగా విషమే! సీసామీద తాటికాయంత అక్షరాల్తో 'poison' అన్రాసుంది) తాగేస్తాడు. హీరోగారు ఎంత పనీపాట లేని ప్రేమికుడైనా జమిందారు, పైగా ప్రేమనగర్ అనే పెద్ద బిల్దింగుకి ఓనర్. కాబట్టి సింపుల్‌గా విషం కక్కించేస్తే సన్నివేశం పండదు, తేలిపోతుంది! పైగా ప్రేక్షకులు నాగేశ్వర్రావు బ్రతుకుతాడా లేదా అని ఆత్రంగా ఎదురు చూస్తున్నారు కూడాను. ఈ విధంగా సన్నివేశం, హీరో, బజెట్ డిమాండ్ చేసిన కారణంగా విషాన్ని కక్కించడానికి బదులుగా ఆపరేషన్ చేసేశాడు మన సినిమా డాక్టర్!   

సినిమాల్లో వాస్తవికతని వెదుక్కునే చాదస్తులు ఎప్పుడూ వుంటూనే వుంటారు. రేసుగుర్రంలా పరిగెట్టే సినిమాకథని ఫాలో అవ్వలేని అజ్ణానులు వీరు. అందుకే 'అప్రధాన' విషయాలపై దృష్టి పెడుతుంటారు. కథకి హీరో చెల్లెలి గర్భం ముఖ్యంగానీ అదెట్లా నిర్ధారింపబడిందన్నది అనవసరం. తల్లీకొడుకుల మమకారాన్నాపే శక్తి భూమ్యాకర్షణ సిద్ధాంతానికి వుంటుందా! 

ప్రియురాలు వాణిశ్రీ కోసం విషం త్రాగి, లక్షలు ఖరీదు చేసే సెట్టులో, ఘంటసాల గొంతుతో దిక్కులు పిక్కటిల్లేలా 'ఎవరికోసం' అంటూ ఒరిగిపోతూ, ఒంగిపోతూ, పడుతూ, లేస్తూ పాడుతుంటే.. కెమెరా ఊగిపోతూ తిరిగిపోతూ.. ఆబ్బ! ఎంత గొప్ప సీను! ఇంత భీభత్స చిత్రీకరణ తరవాత కూడా సాదాసీదాగా విషం కక్కించేసి హీరోని రక్షిస్తే - సత్యజిత్ రే వంటి మేధావులు మెచ్చుకునేవారేమో గానీ.. తెలుగు ప్రేక్షకుడు ఒక్కరూపాయి విదిల్చేవాడా?

మన తెలుగు దర్శకులు జ్ఞానులు. తెలుగు సినిమా కధలెప్పుడూ రేసుగుర్రాలే! అందుకే అవి ఆగకుండా పరుగులు తీస్తుంటాయి. బెంగాలీ, మళయాళీ సినిమాలు మన పీరుసాయిబు కుంటి జట్కాగుర్రంలా ముక్కుతూ మూలుగుతూ, పడుతూ లేస్తూ నడుస్తుండేవి. 

కావున చివరాకరికి చెప్పొచ్చేదేమంటే - మన దర్శకుల అభిరుచినీ, ప్రజల అభీష్టాన్నీ మన్నించి - సినిమా డాక్టర్లు కూడా తమవంతు పాత్ర(ల)ని పోషించారు. మనఇంట్లో, మనరోట్లో నూరిన గోంగూర పచ్చడి మనగ్గానీ ఎవడో పక్కింటోడి కోసం కాదుగాదా!

(picture courtesy : Google)                                               

Sunday, 4 September 2011

ఉపన్యాస దురంధరులు


మేళం లేని పెళ్ళి, కామెంటరీ లేని క్రికెట్ ఆట ఊహించుకోలేం. వాద్యకారుడికి వాయించడం అంటూ రావాలేగాని - పెళ్ళికి పెళ్ళిమేళం, చావుకి చావుమేళం వాయించడం పెద్ద కష్టం కాదు. సందర్భాన్ని బట్టి రాగాలు మార్చుకోవడం వారి వృత్తిధర్మం. ఈ వాయిద్యగాళ్ళ గోత్రీకులే మాటల వాయింపుడుగాళ్ళు!

ప్రతిఊరికీ ఒక స్మశానం వున్నట్లే - ఓ ఉపన్యాస కళాకారుడు కూడా ఉంటాడు. సందర్భోచితమైన ఉపన్యాసం దంచేసి ఆహూతులని అదర(బెదర)గొడతాడు. ఈ పెద్దమనుషులకి సొంత అభిప్రాయాలుండవు, సొంతభాషా వుండదు. 

"ఈ అశేష ప్రజానీకాన్ని చూస్తే నాకనిపిస్తుంది - 'ఆకాశం చిల్లు పడిందా?  నేల ఈనిందా?' అని. ఇంతమంది ఇక్కడికి రావడం ముదావహం. ఇది మన సంస్కృతికి జీవగర్ర. మీరంతా మన సాంప్రదాయానికి పట్టుగొమ్మలు." ఈరకంగా 'సాగు'తుంది వారి ఉపన్యాసం.

అలాగే ప్రతి ఊరికీ సన్మానపత్ర రచయితలు కూడా వుంటారు. ఇంగ్లీషు కన్నా కష్టమైన భీభత్సమైన తెలుగులో, పాషాణపాక వ్యాకరణంతో పొగడ్తల పత్రం రాయడంలో వీరు సమర్ధులు. డాక్టర్లు రాసే దొంగ మెడికల్ సర్టిఫికెట్లలాగా వీరుకూడా ఒక స్టాండర్డ్ ఫార్మేట్‌లో సన్మాన పత్రాలు రాసుకుని రెడీగా వుంచుకుంటారని నా అనుమానం!             

సరే! మళ్ళీ మన ఉపన్యాస దురంధరుల విషయానికొద్దాం. వీరు ఆవకాయ జాడీ దగ్గర్నుండీ అమెరికా అందాల దాకా వీరావేశంతో ప్రసంగించెదరు. మరుగు దొడ్డి, గోడమీద బల్లి - కాదేది ఉపన్యాసానికనర్హము! ఈమధ్య ఈ కళలో ఎంతో ప్రావీణ్యం పొందిన ఒకాయన పద్మశ్రీ కూడా పొందాడు. హైదరాబాదులో మాజీనటులు, మాజీకవులు ఈరంగలో లబ్దప్రసిద్ధులు. ముసలివయసులో ఇంట్లోవాళ్ళకి అడ్డంలేకుండా ఇట్ల్లాంటి వ్యాపకాలు ఉంటే మంచిదేగదా!

సందర్భాన్నిబట్టి అతిథుల్ని ఉబ్బేస్తూ, శ్రోతల్ని కట్టిపడేస్తూ ఊకదంపుడు దంచేవాళ్ళని 'అద్దె మైకుగాళ్ళు' అనంటారని మొన్నొకాయన శెలవిచ్చాడు. వీరినే 'మైకాసురులు' అని కూడా అంటారని ఇంకొకాయన వాక్రుచ్చాడు. ఇది అనుకున్నంత సులువైన కళ కాదేమో! లక్ష రూపాయలిచ్చినా మనకిష్టం లేనివాడిని పొగడలేంగదా!

ఆమధ్య ఒక సభలో ఓ ప్రముఖ మైకాసురుడు ఓ మంత్రిగారి గొప్పదనం గూర్చి సందులు, సమాసాల భాషలో పొగుడ్తూ తెగ విసిగిస్తున్నాడు. నన్ను పిలిచిన ఆర్గనైజర్‌తో "ఏంటండీ ఈ సుత్తి?" అన్నా. ఆయన ఆశ్చర్యపోయాడు. "మీరు వింటున్నారా! ఎందుకు వినడం? ఇక్కడ మేమెవ్వరం విండం లేదు. మంత్రిగారొచ్చేదాకా ఆయనలా మాట్లాడుతూనే వుంటాడు. మీరాయన్ని పట్టించుకోకండి." అన్నాడు. లాగి లెంపకాయ కొట్టినట్లయింది. అంటే ఆయనగారి ఉపన్యాసం విని విసుక్కున్న అజ్ఞానిని నేనొక్కడినేనన్నమాట! నాకు తప్ప అక్కడెవరికీ ఏవిధమైన కన్ఫ్యూజన్ లేదు. 

ఉపన్యాస కేసరి అప్రతిహతంగా తన ఉపన్యాసం కొనసాగించాడు. మంత్రిగారు రాంగాన్లే ఆ ఉపన్యాస వీరుడి దగ్గర్నుండి బలవంతంగా మైక్ లాక్కుని మళ్ళీ ఆ చుట్టుపక్కలకి రానివ్వలేదు. ఆ తరవాత నేనెప్పుడూ ఈ కళాకారుల్ని పట్టించుకోలేదు.

(pictures courtesy : Google)  

Thursday, 1 September 2011

పేరులోనే అంతా ఉంది


"కాలేజీకెళ్లాలంటే భయంగా వుంది. సీనియర్లు నాపేరు మీద జోకులేస్తూ టీజ్ చేస్తున్నారు." ఆ అమ్మాయి ఇంజినీరింగ్ విద్యార్ధిని, పేరు చారుమతి. కాలేజిలో సీనియర్లు పప్పుచారు, ఉలవచారు అంటూ టీజ్ చేస్తున్నార్ట.  
                   
పిల్లలకి పేరు పెట్టేముందు నచ్చిన పేరు అనేకాకుండా - ఆ పేరువల్ల భవిష్యత్తులో వారికే ఇబ్బందీ రానివిధంగా ఆలోచించాలి. అర్ధవంతమైన పేర్లు బాగానే ఉంటాయిగానీ అర్ధాలు మారిపొయ్యే ప్రమాదం ఉంది. మౌనిక ఎక్కువ మాట్లాడినా, సౌజన్య నిర్లక్ష్యంగా వున్నా, శాంతకుమారి అశాంతిగా వున్నా వారి పేర్లకి న్యాయం జరగదు. 
                    
తెలుగు సినిమాల కారణంగా ప్రజలకి సూర్యకాంతం పేరు పెట్టుకునే ధైర్యం లేకుండా పోయింది. వంగదేశం నుండి దిగుమతైన సాహిత్యం తెలుగులో బాగా పాపులరై - బెంగాలీ పేర్లు తెలుగు పేర్లుగా మారిపొయ్యాయి. కన్యాశుల్కంలో పాత్రల పేర్లన్నీ పాత్రోచితంగా వుండటం ఆ నాటకానికున్న లోపం అని కొందరు పెద్దల ఉవాచ.  

తెలుగువారి గ్రామాల్లో ఈ సమస్య లేదు. తాతల, ముత్తాతల పేర్లు ఈరోజుకీ పెడుతూనే ఉన్నారు. ఒక గ్రామదేవత పేరే ఆ ఊరందరికీ ఉంటుంది. పెద్దంకమ్మ, చిన్నంకమ్మ, పెద్దంకయ్య, చిన్నంకయ్య, బుల్లంకయ్య.. ఇట్లా అందరిళ్ళల్లో ఒకేపేరు. పుట్టేవాడు కడుపులో ఉండంగాన్లే ఫలానా దేవతకి మొక్కుబడి ఉంటుంది కాబట్టి వారికి పేచీ లేదు.  
                     
'పద్ధతు'ల్లో ఒకప్పటి కన్నా బాగా అభివృద్ధి చెందాం. అందుకే ఈమధ్య తిధీ, నక్షత్రం చూసుకుని మరీ పేర్లు పెడుతున్నారు. పేరు మొదటి అక్షరం 'ఛ'తోనో, 'ఛీ'తోనో లేదా 'క్షి'తోనో మొదలవ్వాలని తిప్పలు పడుతున్నారు. అందుకే చాలాసార్లు ఈ బాపతు 'శాస్త్రబద్దమైన' పేర్లు మనకి అర్ధం కావు. 

నామటుకు నాకు పేరు పట్టింపు లేదు. నా పిల్లలిద్దరి పేర్లు నేను పెట్టినవి కావు. ఎవరన్నా అడిగితే అద్దిరిపోయే పేరొకటి సూచిద్దామనే తీవ్రమైన ఉత్సాహం అయితే వుంది గానీ - ఇంతవరకూ ఎవరూ నన్నేదైనా పేరు సూచించమని అడిగిన పాపాన పోలేదు. అది వారి విజ్ఞత, అదృష్టం! 
                          
పుట్టబోయే తమ పిల్లలకి ఏపేరు పెట్టాలి అనేది కొందరికి జీవన్మరణ సమస్య! మీ పిల్లలకి బోల్డన్ని పేర్లంటూ పుస్తకాలు అచ్చొత్తుకుని బాగుపడ్డ రచయితలూ ఉన్నారు. ఇప్పుడు డాక్టర్ల పుణ్యామాని ప్రసవ వేదనలు బాగా తగ్గిపోయాయి. దానికి బదులుగా ఈ నామకరణ వేదనలు పెరిగిపొయాయి.
                          
ఈమధ్య టీవీలో ఒక సూటూబూటాయన తమ పేరులోని ఒక్క అక్షరం మార్చుకుంటే దరిద్రుడు కూడా ముఖ్యమంత్రి కాగలడని బల్లగుద్ది చెబుతున్నాడు. జయలలిత పేరులో పెట్టుకున్న అదనపు 'a' పవర్ వల్లనే ఆవిడకి మహర్దశ పట్టిందనీ, తనుకూడా ఇలాగే చాలామందికి అక్షరతోకలు తగిలించి లేదా కత్తిరించి, వారిని బూర్లెగంపలోకి తన్నానని లైవ్ షోలు నిర్వహిస్తున్నాడు. ఈ అక్షర మార్పుచేర్పుల కార్యక్రమం మనకేమోగానీ, ఆయనకి మాత్రం బాగానే గిట్టుబాటవుతున్నట్లుంది.   

'నేములో నేముంది?' అన్నారు పెద్దలు. నిజంగానే ఏమీ లేదు. కాకపోతే ప్రస్తుతం తలిదండ్రులు తమ పిల్లలకి గొప్పపేరు పెడదామని ఉబలాటపడుతున్నారు. బహుశా ఎట్లాగూ వారు పెద్దయ్యాక 'గొప్పపేరు' తెచ్చుకోలేరు, అదేదో మనమే కానిద్దామనే దూరదృష్టి వల్ల కావొచ్చు! 

(picture courtesy : Google)